ఇంకొంచం తవ్వండి

ఈ వారం కవిత -1

కవి మాట:

 “ఇంకొంచెం తవ్వండి” … ఎందుకు?

యోధ్య రామమందిర నిర్మాణ స్థలం దగ్గరలో పురాతన రాతి స్తంబాలు బయటపడ్డాయి. వీటిని చూపిస్తూ ఈ నేల తమదేనంటూ మత ఛాందసవాదులు వివిధ మాధ్యమాల ద్వారా మాట్లాడే మాటలు, రాతలు బాధించాయి. ఇవి ఇతర మతాల్లోని ఛాందసవాదానికీ ఊపిరి పోస్తుందని నా నమ్మకం. వెరసి ద్వేషం రాజ్యమేలుతూ మనుషుల్ని, ప్రాంతాల్ని మతాలుగా విభజించుకుంటూ పోతాము. ఇప్పటి రాజకీయ ప్రభావాలకు తగ్గట్టుగా చరిత్రలో మనకి కావాల్సిన చోట ఆగి- ఇది నా సరిహద్దు, ఇది నా సంస్కృతి అని చెప్పుకోవడంలోని మూర్ఖత్వాన్ని చెప్పాలనే “ఇంకొంచం తవ్వండి” వచ్చింది. అక్కడే ఎందుకు ఆగాలి? ఇంకొంచెం వెనక్కి వెళ్ళొచ్చుగా వివక్షని విసిరేసిన బౌద్ధం వుంటుంది. పోనీ ఇంకొంచెం వెనక్కు వెళ్ళొచ్చుగా తెలియని మతాల తొలినాగరికత వుంటుంది.. ఇలా మూలాల్లోకి వెళ్తే అసలు దైవం ఏమిటనే రహస్యం తెలుస్తుంది అని చెప్పటమే లక్ష్యం.

 

యటపడ్డ రాతి స్తంభాలు

మనసుల్లో మరింత మతాన్ని

మనుషుల్లో మరింత విషాన్ని నింపేలోగా..

నేలకు మతాన్ని పూసి

ఒకే రంగు కలలు కనే మెదళ్ళు

హరివిల్లు కలల్ని హత్య చేసేలోగా..

ఇంకొంచెం తవ్వండి

 

గాయపడ్డ ఆకృతులను

తడిమి తడిమి చూడండి

వర్ణాలను విసిరేసే పగిలిన స్థూపమో

సామ్యవాద పల్లకిలా ఇటుకల శిథిలమో

మరో పురాతన వెలుతురుగా

ధిక్కార స్వరమై ఎదురొస్తుంది

అప్పటికీ ఆపొద్దు

ఇంకొంచెం తవ్వండి

 

కంటి తలుపులు

బార్లా తెరిచి చూడండి

తెగిన అస్థిపంజరాల దిబ్బల దేశమూ

తెలియని రాతి ముఖాల దైవమూ

అన్వయించలేని రంగుల రాజ్యమూ

గుబులు పుట్టిస్తూ అడ్డమొస్తుంది

అప్పటికీ ఆపొద్దు

ఇంకొంచెం తవ్వండి

 

మూస తలపులు

విదిలిస్తూ చూడండి

మట్టి వాసన విసురుతున్న

మట్టి పట్టిన ఎముకల గూళ్ళు

ఇంకా పురుడు పోసుకోని

మతాల కథలు వినిపిస్తాయి

రాళ్లు చెక్కిన పదును రాళ్ళ ముక్కలు

ఆకలి చేసిన మొదటి దైవం తానేనని

ప్రశ్నలు పుట్టని

మెదడు పుట్టని పలుగై పొడుస్తూ చెప్తుంది

 

అనిశ్చయం మిగిలే వుంది

చీమలై జవాబులు తవ్వుతారో

మృతమై మతంగా మిగులుతారో

*

కొత్త జవాబుల కోసం… వెతుకులాట: నారాయణ స్వామి వెంకట యోగి

విత్వం సమకాలీనం, విశ్వజనీనం కావడమూ ఒకే సారి జరిగితే ఆ కవిత వేసే ప్రభావం బలంగా ఉంటుంది. విశ్వజనీనమయ్యే క్రమం లో అనేక ప్రశ్నలు లేవనెత్తితే, కవిత పాఠకుణ్ణి కట్టిపడేస్తుంది.

ఆ ప్రశ్నలు చారిత్రికమై, అచారిత్రిక ప్రస్తుతాన్ని (ahistorical present) ప్రశ్నిస్తే వాటికీ, వాటిని సంధించిన కవిత్వానికీ  తాత్వికత సంతరించుకుంటుంటుంది.

నిజమే కదా మనం యెప్పుడూ తవ్వుకుంటూనే ఉంటాం  కదా, కలలోనూ మెలకువలోనూ జ్ఞాపకాలని తవ్వుకుంటాం, స్మృతుల్ని తవ్వుకుంటాం, పురాతన మృణ్మయ పాత్రల శకలాల్ని తవ్వుకుంటాం, గాయాల్ని తవ్వుకుంటాం, చరిత్ర చేసిన గాయాలు, రాజ్యాలు చేసిన గాయాలు. మతాలు చేసిన గాయాలు, మనుషులు చేసిన గాయాలు – తవ్వుకుంటూనే ఉంటాం – తవ్విన కొద్దీ బయటపడేవి కన్నీళ్లు మాత్రమే కావు, మానని గాయాల మరకలు మాత్రమే కావు, విరిగిపోయిన ఆయుధాల నెత్తురంటిన పదును కోల్పోని ముక్కలే కావు, శాసనాల పురాస్మృతులు మాత్రమే కావు, విరిగిపోయిన స్తంభాలే కావు, మతం తాలూకు విషపు నీడలే కావు, రాతిముఖాల దైవాల విరిగిన అభయహస్తాల శిథిలాలే కావు, భావజాలాల పల్లకీల ఇటుకలే కావు, వాటిని నిలపడానికి నెత్తురు పారించిన రాజ్యాలే కావు ఇంకా ఎన్నో ఎన్నో ప్రశ్నలూ, సమాధానాలు లేని, చరిత్రలో సమాధానాలు దొరకని ప్రశ్నలు.

ప్రస్తుతం నడుస్తున్న పరమ హింసాత్మక చరిత్రలో రోడ్డుకిరువైపులా మొలిచిన అసంఖ్యాక బ్రహ్మజెముల్లా లాగానో, తొవ్వనిండా పరుచుకున్న పగిలిన గాజుపెంకుల్లానో, గాజుపెంకుల మీద మండుటెండలో నడిచిన నగ్నపాదాల చిందిన నెత్తుటి చారికల్లానో ప్రశ్నలే ప్రశ్నలు –

అన్నీ ప్రశ్నలే జవాబులు దొరుకుతాయా, జవాబులుంటాయా –
జవాబుల కోసం మనం మన మన మూసల్నుండి బయట పడాలా –
తవ్విన కొద్దీ బయట పడి గలగల లాడే అస్తిపంజరాలు, పకాలున నవ్వే పుర్రెలు – పుర్రెల కళ్ళలో కనిపించని జవాబులు వెతుకుతూ తవ్వుతూ పోతున్న చీమలు –

అంతా అనిశ్చయం పరుచుకున్న వేళ, చీమల్లా తవ్వుకుంటూ జవాబులు వెతుక్కుంటూ పోవడమే చారిత్రికం అని చెప్తున్న ఈ కవిత ఒక కొత్త తాత్విక స్థాయిని అందుకుంటున్నది –

రూపం లో కూడా,   వర్తులాకారం లో తన చుట్టూ తానే తిరుగుతూ, చరిత్రనూ, విశ్వాన్నీ పరిభ్రమిస్తూ,  మళ్ళీ మళ్ళీ తవ్వడం, జవాబులు వెతకడం చుట్టే తిరుగుతున్న ఈ కవిత  నిస్సందేహంగా సమకాలీన కవిత –

ప్రస్తుత అచారిత్రిక సందర్భాన్ని అపహాస్యం చేస్తూ,  చరిత్రను తవ్వుతూ కొత్త జవాబుల కోసం వెతుకుతున్న  కొత్త వెలుతురు పలుగు ఈ కవిత.

~

logo design: Seshu Korlapati

శ్రీ వశిష్ఠ సోమేపల్లి

స్వస్థలం గుంటూరు. ఇప్పుడుండేది హైదరాబాద్లో. ఇప్పుడిప్పుడే కవితలు చదువుతున్నాను, అప్పుడప్పుడూ రాస్తున్నాను.

22 comments

Leave a Reply to Dr. Premchand Jupalli Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక ముస్లీం రాయలవలసిన కవిత ఒక హిందువు రాస్తే ఒక లౌకిక వాద దేశంలో ఈ పరిస్థితి తలెత్త కూడదు. తలెత్తింది. విక్టిమ్స్ తరఫూన ఒక కవి ప్రతిస్పందన నిజానికి చాలా ప్రొగ్రెసివ్ గా ఉంటుంది.. ఈ లక్షణం మొత్తం సమాజానికి ఉన్నపుడు సమస్య పరిష్కారం అవుతుంది. అంతవరకూ రమేష్ లాంటి కవులకి రాసే పని ఉంటుంది..

    • థాంక్యూ Mohamood గారు.

  • సోమేపల్లి వశిష్ట ఇప్పటి మతరాజకీయాన్ని బగచెప్పింది. దానికి మిత్రుడు నారాయణస్వామి ఇచ్చిన వ్యాక్య ఇంకబావుంది . ఆయన చెప్పినట్టు “రూపం లో కూడా, వర్తులాకారం లో తన చుట్టూ తానే తిరుగుతూ, చరిత్రనూ, విశ్వాన్నీ పరిభ్రమిస్తూ, మళ్ళీ మళ్ళీ తవ్వడం, జవాబులు వెతకడం చుట్టే తిరుగుతున్న ఈ కవిత నిస్సందేహంగా సమకాలీన కవిత –

    ప్రస్తుత అచారిత్రిక సందర్భాన్ని అపహాస్యం చేస్తూ, చరిత్రను తవ్వుతూ కొత్త జవాబుల కోసం వెతుకుతున్న కొత్త వెలుతురు పలుగు ఈ కవిత.”

    • Dear Vashista.
      We read your poem. It’s excellent..Both content and poetic expression are superb. It thrilled us. Hearty congratulations
      Shantaram
      Jayadevi

  • కవిత కవిమాట విశ్లేషణ చాలా బాగున్నాయి.
    కంటెంట్ ను కావిత్వీ కరించ్టం లో కవులు
    మరింత శ్రద్ధ వహించాలి అనిపిస్తోంది.is it right or rong .. Abhinandanalu అందరికీ..

  • ఒకే రంగు కలలు కనే మెదళ్ళు.. హరివిల్లు కలల్ని హత్య చేసేలోగా.. ఇంకొంచెం తవ్వండి.. పదునైన పదాలు.. బాగా రాసారు.

    • థాంక్యూ శక్తి గారు

    • థాంక్యూ శ్రీనివాస్ గారూ..

  • పురుడుపోసుకోని మతాల కథలు … ఎంత చక్కగా వర్ణించారో, విధ్వంసాన్ని వెంటబెట్టుకునే పుడతాయేమో..

  • కవిత్వానికీ విశ్లేషణకీ ఒకేచోట చోటు కల్పించడం బాగుంది.

    వశిష్ట కవితా వాక్యాల్లో అతని దగ్ధ హృదయం కనిపిస్తోంది. 👏👏👏👏👏

  • దట్టమైన దిగులు మేఘాలు కమ్ముకుంటున్న వేళ భరోసాతో మిణుగురుల్లా వెలుగులు చిమ్ముతున్న కవిత అందించినందుకు అభినందనలు!

  • కొత్త కవితకు స్వాగతం..

    కవిత,కవితను పట్టి చూపించే సర్ విశ్లేషణ..

  • కొత్త వెలుతురు చూపే కవితే నిజంగా.
    కవితా..విశ్లేషణా కూడా బాగున్నాయి.

  • “ఇంకా పురుడుపోసుకొని
    మతాల కథలు వినబడుతాయి” అద్భుతమైన వాక్యాలు అన్నా.చరిత్రను నిర్మించే సమాజం కోసం ఇలా గతాన్ని తవ్వుతూ కవితలు రావల్సిందే.నారాయణస్వామి అన్న విశ్లేషణ అద్భుతంగ వుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు