ఆ శైలి అమ్మమ్మ వారసత్వమే!

గూగి హైదరాబాద్ వచ్చినప్పుడు డిల్లీలో ఒక మిత్రురాలు గూగికి Untouchable Spring ఇస్తూ ‘ఇది మా దేశ చరిత్ర, మీరు తప్పక చదవాల్సిన పుస్తకం…’ అన్నదట.

కొన్ని రచనలు వెంటాడుతాయి. మరికొన్ని పురాస్మృతుల్లోకి తీసుకుపోతాయి. వెంటాడే జ్ఞాపకాల్ని, గతం కాని జ్ఞాపకాల్ని మోసుకుపోయే రచనలు అరుదుగా ఉంటాయి. ఒక స్పార్టకస్ లాగా, అలెక్స్ హెలీ ‘రూట్స్’ లాగా.  కానీ అంటరాని వసంతం వేరు.  ఇందులో మాతయ్య అనబడు స్పార్టకస్ ఉన్నాడు.  తన మూలాల్ని వెతుకుతూ పోయిన రూబెను ఉన్నాడు. అదనంగా వేల యేండ్ల అణచివేతను వ్యతిరేకిస్తూ, తిరగబడి, అణచివేతను అంతం చేయాలనీ సాయుధులైన ఇమ్మాన్యేలు, జెస్సిలు ఉన్నారు.

కొందరు దీన్ని అలెక్స్ హెలీ రూట్స్ తో పోల్చారు.  కళ్యాణరావును ఒకసారి అడిగాను.  అందరు దీన్ని రూట్స్ తో పోలుస్తున్నారు కదా! మరి నువ్వేమంటావు అని.  అప్పుడు చెప్పాడు. ఢిల్లీ యూనివర్సిటిలో జరిగిన ఒక అంతర్జాతీయ సాహితి సమావేశంలో ఇచ్చిన ప్రసంగ పాఠం Story Behind the Story of Untouchable Springని “కొందరు నా నవలను అలెక్స్ హెలీ రూట్స్ తో పోల్చారు.  నాది కుటుంబ మూలాల్ని వెతుక్కుంటూ పోయిన వెతుకులాట కాదు.  ఒక వెతుకులాట.  ఒక పురాతన వెతుకులాట.  నేను నా పూర్వికులు పోగొట్టుకున్న దానికోసం వెతుకుతున్నాను.  మా తాత చెప్పాడు.  వాళ్ళ తాత దాని గురించే వెతికాడు అని.  మా అమ్మమ్మ చెప్పింది.  వాళ్ళ అమ్మమ్మ కూడా దాని గురించే వెతుకులాడిందని.  అట్లా వెతుకుతూనే వెళ్లిపోయారని.  మా తాత, మా అమ్మమ్మ వెతికారు. మా అమ్మ, నాన్నా వెతికారు. ఇప్పుడు నేను వెతుకుతున్నాను.  నా ప్రజలందరితో కలసి వెతుకుతున్నాను.  మేము  వెతికాం.  వెతికాం. వెతికాం. ఈ మూల నుండి  ఆ మూల వరకు.

ఈ భూమి పైన మేము కోల్పోయిన నేల ఇప్పడు స్పష్టం. కేవలం నేలనే కాదు. ఈ దుర్మార్గమైన కులవ్యవస్థలో మేము  కోల్పోయిన ఆత్మగౌరవం  కూడా ఇప్పుడు స్పష్టం.

ఎందుకు.  ఎందుకు.  ఈ నేలపై అందరికన్నా ముందు, మొట్టమొదట నివసించినవాళ్ళు.  ఈ నేలకు నిజమైన యజమానులు.  ఈ నేల తల్లి పుత్రులు, పుత్రికలు ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డారు.  ఎందుకు క్రూరంగా అణచివేయబడ్డారు?

ఆ వెతుకులాటే ‘అంటరాని వసంతం.’

కొందరు వసంతాన్ని నీ అటో బయోగ్రఫీ అన్నారు కాదా. నువ్వేమంటావు అన్నా అని అడిగా.

“అవును. వసంతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసిన అల్లాడి ఉమ, శ్రీధర్ లు అదే మాట అన్నారు. నేనేమి దాన్ని తిరస్కరించను. అవును. ఇది నా కథే. నా పెద్దల, వారి పెద్దల కథ. ఇది కొన్ని తరాల దళితుల జ్ఞాపకాల వలపోత.”

ఈ వాక్యాలు ఏదో మీటింగ్ లో కళ్యాణరావు మాట్లాడితే వినడానికి, పక్కన కూర్చొని చెబితే వినడానికి పెద్ద తేడా ఏమి ఉండదు. వేదికపైన, వేదిక దిగిన తరువాత జరిగే సంభాషణ ఒకే లాగా ఉంటుంది.

తెలుగు నాటకం మూలాలు రాస్తో ‘అంటరాని హోమర్లు’ ఈ దేశంలో ఉన్నారు అన్నాడు. గ్రీక్ హోమర్ ఒడిస్సీ, ఇలియాడ్ లను అల్లాడు.  ప్రజలను చరిత్రను ఉన్నది ఉన్నట్లు చెప్పాడు.  అందుకే హోమర్ మహాకవి అయ్యాడు.  కళ్యాణరావు అంతే.  మనకాలపు హోమర్.  అల్లికల్లో దాగున్న వసంతాలను, అంటరాని వసంతాలను అక్షరబద్ధం చేశాడు. అంటరాని వసంతం చదవకపోతే ఈ జీవితం ఇట్లా ఉండేది కాదు. కళ్యాణరావు పరిచయమయ్యాక అంటరాని వసంతం లోతులు తెలిసాయి.

ఎల్లన్న పాత్రను ఎక్కడి నుండి తీసుకున్నావ్? అని అడిగాను.  ‘ఎల్లన్న ఒక్కడు కాదు. ఒక సమూహం. మన పూర్వికులు  మాలల వీధి బాగోతులు. మాదిగల చిందు బాగోతులకు ఎల్లన్న ఒక ప్రతీక. మన చరిత్రను, సాహిత్యాన్ని, అల్లికల్లో దాగున్న అంటరాని అటని, మాటని, పాటని రాసిన ప్రయత్నమే, ఎల్లన్న పాత్ర చిత్రీకరణ. చెంచు నాటకాన్ని ఊరూరా తిరుగుతూ ప్రదర్శిస్తూ ఉంటాడు. నాటకం మొదలయ్యే ప్రతిసారి కరణం గారు వచ్చారా? రెడ్డి గారు వచ్చారా? అనడానికి  బదులు పెద్ద మాల వచ్చాడా? మాదిగ పెద్ద వచ్చాడా? అని అనడం ఒక ధిక్కారం. అది ఒక ఆత్మగౌరవ ప్రకటన. అది అగ్రకులకు నచ్చలేదు.”

సుభద్ర పాత్ర కూడా అంతే.  సుభద్ర బాల్యం అంతా నన్ను కన్న తల్లికి నమూనా.  మా తాత అంత గారాబంగా పెంచాడటా. చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవాళ్ళు.  ఆమె అప్పుడే మడమ వరకు పరికిణి వేసుకునేదటా.  కాళ్ళకు చెప్పులు లేకుండా తాత బయటకు వెళ్లనిచ్చేవాడు కాదట.  ఒకసారి ఆమె చెప్పులు వేసుకోకుండా బయటకు వెళితే మా తాత పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ చెప్పులు ఇచ్చి వచ్చాడటా.  మా అమ్మమ్మ ఊర్లో పంట కాలువ ఉంది కదా. ఆ కాలువలో నీళ్ళ కోసమే ఆమె పారెత్తింది అన్నాడు.

మాతయ్య ఎవరు అని అడిగా. ‘పాత్రలు నేను సృష్టించినవి కాదు. సమాజంలో నుండి తీసుకున్నవి. మాతయ్య ఒక్కడు కాదు. నేను చూసిన కొందరు వ్యక్తులు ఆ పాత్రలో ఉంటారు. అందులో ఉన్న పాత్రలన్నీ అంతే.  మాతయ్య పాత్రలో కొంత భాగం మా తాత స్నేహితుడు మాదిగ రాములు అంటూ, వాళ్ళ తాతకి రాములుకి ఉన్న స్నేహాన్ని చెప్పాడు.  మాల, మాదిగల వాడుమ్మడి దోస్తాన గురించి చెప్పాడు.  నాకు పదకొండు నెలలు ఉన్నప్పుడు, నన్ను కన్నతల్లి చనిపోతే రాములు తాత కూతురు నాకు పాలిచ్చింది.  ఇప్పుడు మాలలు, మాదిగలు అని అన్నదమ్ములే కొట్టుకుంటుంటే, ఇద్దరు ఒకటి కాదు. వేరు వేరు అంటుంటే బాధేస్తుంది అన్నాడు.  అప్పుడే నయం కదా. వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నారు. ఎంత బాగా కలిసి ఉన్నారు అని.

జెస్సిలో కొంత మున్నా కనిపిస్తాడు. అదే మాట అడిగా. అవునయ్యా అన్నాడు.  రూబెను, రూతుల మధ్య పడుకొని కథ చెప్పమని జెస్సి అడిగినట్టే, మున్నా అడిగేవాడు అంటా.  కథ చెప్పు పెద్దమ్మ, పెదనాన్న అని.  ఒకరి పొట్టమీద తలవాల్చి, మరొకరి పొట్టపై కాళ్ళు వేసి పడుకొని.  కథ వింటూ, వింటూ అట్లాగే పడుకునేవాడు. అన్నారు. ఇద్దరు కళ్ళనిండా నీళ్ళు తిరుగుతుండగా. అమృతక్క, కళ్యాణరావు అల్లారు ముద్దుగా పెంచుకున్న మున్నా @ జెస్సి ఇప్పుడు లేడు. అదే అవలపాడు(ఆలకూరపాడు)లో విజయ్, దత్తత్రేయాల పక్కన ‘మున్నా’గా పూవై వికసించాడు. సరిగ్గా పెదకోటేస్వరుడి సమాధి పక్కన సంపెగ పూల చెట్టులా. ఆ ముగ్గురు యువకులను. ఈ దేశ విముక్తిని కలగన్న నవ యువకులను స్మరించుకుంటూ ఒక స్థూపం కట్టుకున్నారు ఊరు జనమంతా కలిసి. రాజ్యం భౌతిక పోరాట యోధులకే కాదు. వారి స్మృతివనాలకు భయపడుతుంది. అందుకే ఇప్పుడు ఆ ముగ్గురి స్మృతివనాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తుంది. కూలిస్తే కూలిపోయే స్మృతులా వాళ్ళవి. అవి జ్ఞాపకాలు. గతం జ్ఞాపకం కాని అంటరాని వసంతాలు. కళ్యాణరావు వెతుక్కుంటూ పోయినట్లే, వాళ్ళు కోల్పోయిన వాటిని వెతుక్కుంటూ మరికొందరు పోతారు. అప్పుడు అసంఖ్యాకమైన జెస్సిలు పోరుబాట పడతారు.

అంటరాని వసంతం ఎన్ని భాషల్లోకి అనువాదం అయింది అని అడిగా? అప్పుడు చెప్పాడు. అనువాదాల కథను.

అంటరాని వసంతం ఇప్పటి వరకు ఐదు భాషల్లో అనువాదమయింది. తమిళంలో అయితే నాలుగు పునర్ముద్రణలు జరిగాయి. మొన్న కలకత్తాలో జరిగిన ‘పీపుల్స్ లిటరరీ ఫెస్టివల్’లో ‘తమిళ స్త్రీవాద రచయిత్రి కుట్టి రేవతి’ కళ్యాణరావును కలిసి ‘మీ నవల నన్ను బాగా ఇన్స్పైర్ చేసిందండీ. తమిళనాడులో దళిత సాహిత్యం చదవాలనుకునే వారు మొదట చదివేది మీ పుస్తకమే’ అన్నది.  ఇది అంటరాని వసంతం అనువాదాల గురించి రెండోసారిగా నేను కళ్లారా చూసిన ఘటన. (మొదటిసారి కోయంబత్తూర్ లో నేనొక మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి పోయినప్పుడు అక్కడ కొందరు మిత్రులు ఒక తమిళ నవల గురించి మాట్లాడారు. అది తమిళంలో వచ్చిన గొప్ప దళిత సాహిత్య, చారిత్రిక నవల అన్నారు. వాళ్లతో కాసేపు  సంభాషణ తరువాత అర్థం అయింది.) వాళ్ళు మాట్లాడుతుంది అంటరాని వసంతం తమిళ అనువాదం గురించి అని.  లంకేష్ తన పత్రికలో ‘అస్పృశ్య వసంత’ను కొంతకాలం సీరియల్ లాగా వేసి, తరువాత లంకేష్ ప్రచురణల తరఫున పుస్తకంలా ప్రచురించింది. మలయాళంలో ‘తీంతాద వసంతం’లా వచ్చింది. ఆంగ్లంలో అయితే ‘అన్ టచబుల్ స్ప్రింగ్’ (Untouchable Spring) ఒక చరిత్ర. డిల్లి యూనివర్సిటిలో కళ్యాణరావు ప్రసంగం విని ఒక జర్మన్ ప్రొఫెసర్ దాన్ని జర్మన్ లోకి అనువాదం చేస్తా అన్నది. హిందీలో ‘అచూత్ వసంత్’గా వచ్చింది. ఇప్పుడు బెంగాళీ. పంజాబీ, మరాఠిలోకి అనువాదం అవుతుంది. ఇటివల ప్రఖ్యాత సిని దర్శకుడు గౌతమ్ ఘోష్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు. ‘మళ్ళీ తెలుగులో ఎప్పుడు సినిమా తీస్తారు అని శ్రోతలు అడిగితే, తప్పకుండా తీస్తాను. అవకాశం వస్తే ‘అంటరాని వసంతం’ను సినిమాగా తీయాలని ఉంది అన్నాడు.’

ఒకరోజు కథ రాయడం ఎట్లా అన్నా అని అడిగాను. ‘అమ్మమ్మ చెప్పినట్లు రాయలయ్యా’ అన్నాడు. శిల్పం అంటే ఏమిటి? అని అడిగా. ‘నువ్వు కథకుడివి అయితే నీ ఎదురుగా ఉన్నవాళ్ళు పాఠకులు. వాళ్లకు ఎట్లా చెబుతున్నావనేది శిల్పం. దేనిగురించి చెబుతున్నావో అది వస్తువు’ అన్నాడు. ఇంత సింపులా అన్నా. ‘కథ. కవిత. నవల. జీవితంలోంచి రావాలయ్యా. అప్పుడు అవి చాల సాధారణంగా, సరళంగా ఉంటాయి. మన జీవితాల్లో అవి ఉన్నాయి.  మనం చేయాల్సిందల్లా వాటిని ఏరి కూర్చి రాయడమే.’ జీవితాన్ని జీవితంలా రాస్తాడు కనుకనే కళ్యాణరావు రచనలు సరళంగా ఉంటాయి. వర్డ్స్ వర్త్ అన్నాడో, ఆస్కార్ వైల్డ్ అన్నాడో గుర్తులేదు  ‘నీ హృదయాన్ని వెంటబెట్టుకొని మాట్లాడు’ (Speak along with your heart) అని.  కళ్యాణరావు అంతే. కేవలం అక్షరాల్ని రాయడు.  రాసిన పదాలు, వాక్యాలు రాసినట్లు ఉండవు. మాట్లాడినట్టు ఉంటాయి. మాట్లాడటం కేవలం పెదాలతో మాట్లాడటం కాదు. హృదయంతో మాట్లాడటం. ఒక్కమాటలో చెప్పాలంటే కళ్యాణరావు హృదయం, ఎదురుగా ఉన్న పాఠకుల హృదయంతో జరిపే సంభాషణ. ముచ్చట. అయన రచనలు.

అంటరాని వసంతం శైలి చాల సరళంగా ఉంది. అది ఒక సంభాషణలాగా ఉంది.  ఆ శైలి ఎక్కడ నుండి తీసుకున్నావు అని అడిగా. ‘ఆ శైలి క్రెడిట్ అంతా మా అమ్మమ్మదే. ఆమె చిన్నప్పుడు నాకు కథ చెప్పిన టెక్నిక్ నుండి తీసుకున్న.  ఆమె ఒకే కథను ఒక రోజు చెప్పేది. వారం చెప్పేది.  నెల చెప్పేది. ఆమె చెప్పే టెక్నిక్ ఒక డైలీ సీరియల్ లాగా ఉంటుంది. నిజానికి డైలీ సీరియల్ అనే కాన్సెప్ట్ మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథల్లో ఉన్నది’ అన్నాడు.

కళ్యాణరావు గురించి. వసంతంతో వసంతం గురించి, జరిపిన సంభాషణలను రాస్తే ఒక పుస్తకమే అవుతుంది. అంటరాని వసంతం రూతు చెప్పిన రూబేను జ్ఞాపకాలు, వాళ్ళ అనుభవాలు. వాళ్ళ పూర్వీకుల చరిత్ర. సాహిత్యం. సంస్కృతీ. వాళ్ళ బిడ్డల అనుభవాలు. వాళ్ళ బిడ్డల బిడ్డల  జీవితాలు. వాళ్ళ పోరాటాలు. నిజానికి ఇక్కడితో పూర్తి కాలేదు. మా సంభాషణ పూర్తి కాలేదు. కళ్యాణరావు వెతుకులాట పూర్తి కాలేదు. కళ్యాణరావు అన్నట్లు  మేరి సువార్తని కదిలించించాల్సి ఉంది . అప్పుడు వసంతం మరో భాగం మొదలవుతుంది. వసంతమే అన్నట్లు ఎన్ని పేజీల్లో ఇముడుతుందో చెప్పలేము.

చివరగా ఒకమాట గూగి సాయిబాబా పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు డిల్లీలో ఒక మిత్రురాలు గూగికి Untouchable Spring ఇస్తూ ‘ఇది మా దేశ చరిత్ర, మీరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఒకవేళ గూగి ఇండియాలో పుట్టి ఉంటే ‘అంటరాని వసంతం’ లాంటి నవల రాసి ఉండేవాడు’ అన్నదట. ఒక మిత్రుడు ఆ సంభాషణను పంచుకున్నాడు.

‘ఉరికొయ్య కన్నా ప్రమాదకరమైన మేధావి జంధ్యపు పోగులు’ కొన్ని వసంతాన్ని ఇప్పటికి అంటరానిదాన్ని చేసేందుకు చేసిన కుట్రలు విన్నాను. కొన్ని కళ్ళారా చూశాను. అయిన వసంతం చిగురిస్తూనే ఉంది. సరిగ్గా పాబ్లో నెరుడా అన్నట్లు ‘నువ్వు పువ్వులను చిదిమేయగలవేమో, కానీ, చిగురించే వసంతాన్ని ఆపలేవు’. వసంతం అట్లా చిగురిస్తూ ఉంది. చాలెంజ్ చేస్తూ ఉంది. ఉంటుంది.

ఫిబ్రవరి 2018 నాటికి ‘అంటరాని వసంతం’ ‘అరుణతారలో సీరియల్ గా మొదలై ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నది.

 

అరుణాంక్ లత

7 comments

Leave a Reply to సూఫీ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వసంతం ఎప్పటికైనా చిగురించాల్సిందే.. కొన్నిగాయాలూ, కొన్ని పోరాటాలు తప్పనివే..

  • కళ్యాణరావు గారి అనుభవాలు ఆసక్తికరంగా వున్నాయి. గొప్ప నవల.

  • అంటరాని వసంతం వెంటనే కోనుకొని,చదవాలని పిస్తుంది, మాకు,..చదువు కొనిపదిలంగా, దాచుకోవలసిన,.. book.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు