1
ఎప్పుడైతే
చివరిసారిగా నువ్వు నన్ను కలిశావో..
అధరాల మీదుగా అమృతాన్ని నాలోకి వొంపావు!
దరహాసాల మీదుగా మైమరపును నాలో నింపావు!
ఎప్పుడైతే
చివరిసారిగా మనిద్దరం శయనించామో..
గుండెలపై ఆర్తిగా సేదతీర్చావు!
దేహగంధాన్ని అలది నన్ను పరిమళ భరితుణ్ని చేశావు!
2
ఎప్పుడైతే
చివరిసారిగా నువ్వూ నేనూ భేటీ చేశామో..
ఆలోచనల చైతన్యాన్ని నాలోకి ప్రవహింపజేశావు!
ఎల్లల్లేని జ్ఞానాంబుధిలో నన్ను ఓలలాడించావు!
ఎప్పుడైతే
చివరిసారిగా నీతో నేను బాటను పంచుకున్నానో..
మాటలు రాజేసిన అగ్నితో నాలో చురుకును పుట్టించావు!
ఆటను విడచిన బతుకులో ఆశను కలిగించావు!
3
ఎప్పుడైతే
చివరిసారిగా నీ సముఖంలో నిల్చున్నానో..
నీ విరాడ్రూపంతో నన్ను అంగుష్ఠమాత్రుడిని చేశావు!
నీ దయార్ద్ర దృక్కులతో దాసుడిగా మార్చేశావు!
ఎప్పుడైతే
చివరిసారిగా నీ ఎదుట మోకరిల్లానో..
నా అల్పత్వాన్ని నాకే బహుధా ఎరుక పరిచావు!
నా లుబ్ధత్వాన్ని జాలిగా పరిహసించావు!
4
ఏది ఎప్పుడు ఎక్కడ
ఎందుకు ఎవరుగా తారసపడుతుందో
ఎలా అంతరంగాలను మెలి పెడుతుందో..
ఎలా చైతన్యాలను బలి కోరుతుందో..
ఎలా చెప్పడం?
ఆనాటి ఆ లిప్త
అలా ప్రాప్తమైన తీరు ఒక అద్భుతం!
గతంగా పరిగణించకుండా నిన్ను..
సుప్త అవస్థలో, జాగృత వ్యవస్థలో
స్మృతులలో పదిలంగా భద్రపరచుకుంటాను!
మళ్లీ
మళ్లీ మళ్లీ
కుదిరేనో లేదో..
కుదరకపోతే అలమటించే రంధి లేదు!
విధిగా కుదరాలని విలపించే చింత లేదు!
మళ్లీ
ఆ ఇచ్ఛ లేదు!
ఇచ్ఛ లేదనగల స్వేచ్ఛ లేదు!
నీతో నేను
కొత్తగా ఏ ఒక్కసారైనా
కలిసినా, భేటీ వేసినా, మోకరిల్లినా..
అదే చివరిదని తలచి ఆస్వాదిస్తాను!
ఆ ‘చివరిసారి’లోనే ఎన్నటికీ తరగని
అనల్పమైన తృప్తిని పొదవుకుంటాను..!
బతుకు ఇక్కడ
పూర్ణమై ముగిసిపోయినా నిమ్మళమే!
అసంపూర్ణమై ఆగిపోయినా సమ్మతమే!
*
చిత్రం : మునిసురేష్ పిళ్లె
సార్ బావుంది
Super