ఆమె రచనల గురించి మాట్లాడదాం!

రచనలను మార్కెటింగ్ చేసుకొని, కీర్తి కిరీటపు నిచ్చెనలు ఎక్కటానికి అందరినీ తోసేసి ముందుకు పోవాలనుకునే రచయితల కోవలో ఆమె ఎప్పుడూ లేదు.

“అన్నీ మరణించాల్సిందే“—టెన్నిసన్ కవిత ను మనసు తో రంగరించి అనువాదం చేసిన జగద్ధాత్రి మరణించింది. ఆమె పేరుకు ముందు –ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, అన్నింటికి మించి మంచి మనసున్న ప్రేమ మూర్తి, స్నేహ మూర్తి. జగద్ధాత్రి తో నాకు సాహిత్య పరిచయమే తప్ప, వ్యక్తిగత పరిచయం లేదు. అంత మాత్రాన ఆమె నాకు అపరిచితురాలు కాదు. ఆమె రచనల ద్వారా నాకే కాదు ఎందరికో స్నేహామృతాన్ని పంచి ఇచ్చిన సహృదయ. ఎంతో మంది ఆమె ను అమ్మా, అక్కా అని పిలుస్తారని తెలుసు. నాకు సారంగ ద్వారా ఆమె మంచి రచయిత్రి గానే పరిచయం. ఒక మంచి పుస్తక సమీక్ష నో, ఇంటర్వ్యూ నో, కథో, కవితో, అనువాదమో ఏదో ఒకటి అడగకుండానే చొరవ తీసుకొని రాసి ఇచ్చే మంచి రచయిత్రుల్లో ఆమె ఒకరు. తమ రచనలను మార్కెటింగ్ చేసుకొని, కీర్తి కిరీటపు నిచ్చెనలు ఎక్కటానికి అందరినీ తోసేసి ముందుకు పోవాలనుకునే రచయితల కోవలో ఆమె ఎప్పుడూ లేదన్న సంగతి ఆమె తో పరిచయమున్న సాహిత్య లోకం మొత్తానికి తెలుసు.

సారంగ పబ్లికేషన్స్ మొదటి పుస్తక ప్రచురణ “ అనేక” నుంచి జగద్ధాత్రి, రామతీర్థ లతో పరిచయం. గత ఆరేళ్లుగా వాళ్ళిద్దరివి ఎన్నో రచనలు సారంగ లో ప్రచురితమయ్యాయి. వాళ్ళిద్దరూ రచయితలుగానే తెలుసు. ఎవరికైనా తెలియాల్సింది అంతవరకే. కానీ రామతీర్థ మరణించినప్పుడు అయన సాహిత్యకృషి గురించి ఎక్కడెక్కడ ఏమేమి వ్యాసాలూ వచ్చాయో నాకు తెలియదు కానీ నా దృష్టికి వచ్చి నన్ను చికాకు పరిచింది మాత్రం ఒక ప్రముఖుడు రాసిన వ్యాసం. ఆ వ్యాసం జగద్ధాత్రి, రామతీర్థ ల వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను బట్ట బయలు చేసింది. జగద్ధాత్రి మీద సానుభూతి తో రాసినట్లు కనిపించే ఆ వ్యాసం నిజానికి ఆ పని చేయలేదు. బయట ప్రపంచానికి ఏ మాత్రం సంబంధం లేని అనేక విషయాలను అనవసరంగా  పబ్లిక్ చేసాడు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరికీ పట్టింది ఎవరి అభిప్రాయమైనా? ఫేస్ బుక్ ఉన్నది, ఫేస్ బుక్ లో ఉండేది ఇలాంటి విషయాలు మాట్లాడానికే, చర్చించటానికే చాలా మందికి. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా, ఏం రాసినా ఎవరమైనా చేయగలిగింది ఏమీ లేదు ఇవాళ, రేపు. కాబట్టి మౌనంగా ఉందాము. ఏ అభిప్రాయం వ్యక్తం చేయకుండా, ఏ అక్షరం రాయకుండా, ఎవరి రచనలు చదవకుండా. ఒక లైక్ కొట్టడం, ఒక తమ్స్ అప్ , థంమ్స్ డౌన్ చేయటం వస్తే చాలు. అందరమూ సాహిత్య కారులమే. అందరం సమీక్షకులమే. అందరమూ సమాజ సానుభూతి పరులమే.

జగద్ధాత్రి బలవన్మరణం విషాదమే. దాన్ని ఎవరూ ఆపలేకపోయాము. ఇప్పుడు ఎవరైనా చేయాల్సింది ఆమె మరణాన్ని పోస్ట్ మార్టం చేయటం కాదు. ఆమె రచనల గురించి మాట్లాడాలి. ఆమె సాహిత్య కృషి ని గురించి చర్చించాలి. సాహిత్యం లోనూ, వ్యక్తిగతం లోనూ ఆమె నిస్సందేహంగా ధీర. ఆమె జీవితపు ముగింపు అలా కనిపించక పోయినా. ఆమె కవిత్వము, అనువాదం గురించి మాట్లాడాలి. ఆమె నిర్వహిస్తున్న కాలమ్స్ లో సాహిత్యం గురించి, ముఖ్యంగా రచయిత్రుల సాహిత్యాన్ని గురించి ఆమె చేస్తున్న ప్రతిపాదనల గురించి మాట్లాడాలి. మరి పిల్లి మెడ లో గంట కట్టేదెవరు?

సారంగ కి జగద్ధాత్రి ఎన్నో రాసారు. నాకు నచ్చింది కుట్టి రేవతి గురించి ఆమె రాసిన వ్యాసం. అనువాద కవిత. ఆమె వచనం మృదువుగా సాగిపోతుంది. ఆమె కవిత్వం లో భావుకత ప్రతి అక్షరం లో కనిపిస్తుంది. సమకాలీన రచయిత్రి సాయి పద్మ గురించి రాసిన “ బంగారు పాప” కానీ, రామతీర్థ తో ఒక అందమైన నెమలీక లాంటి జ్ఞాపకం “ ఆ కిటికీ” కానీ ఆ విషయాన్ని మరింత రుజువు చేస్తాయి. నాకు నచ్చిన కవిత “ ఆ కలయిక”.

“ దేహాన్ని అర్పించడమంటే మనసిచ్చినంత సులువు కాదు” –అక్షర సత్యం కాదూ!? ఎప్పటికీ గుర్తుండిపోయే కవిత. జగద్ధాత్రి మార్క్ కవిత. ఆమె కవితలు చాలా ఆమె బ్లాగులోనే చదివాను. ప్రపంచ సాహిత్యం లోని ఎంతో మంది ప్రముఖ రచయిత్రులని చక్కగా పరిచయం చేసారు. ఇంగ్లీష్, హిందీ లోంచి తెలుగు లోకి ఆమె చేసిన కవిత్వ అనువాదాలు ఆమె కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కథానికలు , సమీక్షలు కూడా ఎన్నో రాసారు. వివిధ పత్రికల్లో ఆమె రాసిన కాలమ్స్ కు ఆదరణ లభించింది. అయితే ఆమె కవిత్వ పుస్తకం కానీ, కథల పుస్తకం కానీ ఏమైనా వచ్చిందో, లేదో నాకు తెలియదు. ఆమె రచనలను విశ్లేషిస్తూ తెలుగు సాహిత్యం లో ఆమె చేసిన కృషి ని గురించి ఎన్నో వ్యాసాలు రావాల్సిన అవసరముంది. అది ముఖ్యం. జరగాల్సిన పని అది. అంతే కానీ ఆమె మరణానికి కారణాలు, కారకులు కాదు. ఆమె సహజీవనం గురించి, ఆమె వ్యక్తిగత సమస్యల గురించి ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఆమె నిర్ణయాలు అది సహజీవనమైనా, లేదా బలవన్మరణమైనా ఆమె హక్కు. బలవన్మరణం విషాదం, విచారం. అది మనం ఆపగలిగితే బాగుండేది. అది చేయలేకపోయాము కాబట్టి ఇక చర్చలు, తీర్పులు అనవసరం.

ఈ మొత్తం లో విషాదకరమైన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – జెండర్ పాలిటిక్స్. విపరీతం గా తాగి తాగి చచ్చిపోయిన రచయితలని కీర్తించి ఆకాశం లో నిలబెట్టిన సమాజం, రచయిత్రులు చనిపోతే వారి వ్యక్తిగత జీవితం గురించి మరింత బురద చల్లే ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరో సారి అదే రుజువైంది. జగద్ధాత్రి ముందు రచయిత్రి. తర్వాతే ఆమె సహజీవనమో, మరణమో.

“ ఆత్మల్ని హత్య చేయనిదే రస సిద్ధి పొందలేము” అని ఆమే ఒక కథ లో రాసుకుంది. మృత్యువు ని ప్రేమించటం జగద్ధాత్రి తోనే మొదలు కాలేదు. ఆమె తోనే ఆగిపోదు. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకూ జగద్ధాత్రి అనే మంచి కవయిత్రి మరణించింది. అది సత్యం. That matters. Nothing else.

*

చిత్రం: కార్టూనిస్టు గంగాధర్

కల్పనా రెంటాల

18 comments

Leave a Reply to Arunank Latha Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మరణం అనేది పూర్తిగా… ఆ వ్యక్తి స్వేఛ్చగా తనకు తాను తీసుకునే నిర్ణయం. మీరు రాసింది చదివాక ఆ రచయిత్రి గురించి ఎవరేం రాసినా పట్టించుకోవడానికి వారు లేరని తెలియని అమాయకత్వంతో రాస్తున్నారని అనుకోవాలో లేక ఆ వ్యక్తిని అభిమానించే వాళ్ళు ఆ రాతల్ని చదివి బాధపడుతూంటే పైశాచికానందం పొందుతూ మనిషిగా మరణిస్తూన్న విషయాన్ని గ్రహించలేని ఆజ్ఞానులు అనుకోవాలో తెలియడం లేదు.
    మీరు అన్నట్టే చేతనైతే ఆవిడ రాసిన సాహిత్యం గురించి రాస్తూ గౌరవం ప్రకటించాలి. వీలైనంత ఎక్కువగా … ఒక వారమో నెలో… కేవలం ఆవిడ సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ…వాటి గురించి చర్చ జరిపితే హుందాగా ఉంటుంది. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ఎంత లోతుగా తెలిసినా అది ఇప్పుడు ఆవిడ పోయాక ఇతరులకు చెప్పాలనుకోవడం ఎంత బుద్ధిహీనం…సంస్కారరహితం. అటువంటి వారికి దూరంగా ఉండడమే ఆవిడపట్ల అభిమానం ఉన్నవారు చేయాల్సింది.
    ఆవిడ నాకు పరిచయమే లేకపోయినా ఏవీ చదవకపోయినా మీరు రాసింది చదవగానే అటువంటి మనుషులకు దూరంగా ఉండాలని తెలిసింది. అన్నిటినుండీ స్వేఛ్చ కోసమే మరణిస్తారు. మరణించాకా స్వేఛ్చ లేకుండా ఆ మనిషి జ్ణాపకాలను ఇలా బంధించాలి అనుకోవడం దారుణం. ఆవిడ స్త్రీ అయినందువల్ల…. మరణాన్ని ధైర్యంగా చేర్చుకున్నా స్వేఛ్చ లేకుండా పోయిందేమో అనిపిస్తోంది.

  • మీరు రాసింది ముమ్మాటికీ నిజం. ఆమె రచనలను తప్పక పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • అమ్మా
    ఆవిడ గురించి ఒక మంచి వ్యాసం చదివాన న్న తృప్తి ని
    అందించిన ఘనత మీది. ధన్యవాదాలు.
    ఆవిడ చనిపోయే ముందు విశాలాక్షి..పత్రిక కి,మా అన్నయ్య
    కె.కె.మీనన్ నవల క్రతువు..గురించి రాసిన వ్యాసం, దుఖం కలిగిస్తున్నది.
    ఆవిడ సాహితీ జీవితం చాలా గొప్ప ది.

  • “ఈ మొత్తం లో విషాదకరమైన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – జెండర్ పాలిటిక్స్. విపరీతం గా తాగి తాగి చచ్చిపోయిన రచయితలని కీర్తించి ఆకాశం లో నిలబెట్టిన సమాజం, రచయిత్రులు చనిపోతే వారి వ్యక్తిగత జీవితం గురించి మరింత బురద చల్లే ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరో సారి అదే రుజువైంది. జగద్ధాత్రి ముందు రచయిత్రి. తర్వాతే ఆమె సహజీవనమో, మరణమో.”

    చాలా బాగా చెప్పారు. ఏదేమయిన మనమందరము ఒక ప్రఖ్యాత రచయిత్రి ని పోగొట్టుకున్నాం

  • మంచికవయిత్రి, మరణించిది… మీ అభిప్రాయాలే,నావి కూడా!madam.. వారికి, అక్షర నివాళి.. .సారంగ ను, పరిచయం, చేసిందిమాకు, ఆవిడే!

  • కల్పనా ఎంత హాయిగా వుందో మీమాటలు చదువుతుంటే ,జగతిమనసున్న మనిషి,చక్కటి రచయిత్రి, హైదరాబాద్ లో ఏపుస్తకం అచ్చు అయీనా ఆప్యాయంగా పిలిచేవారు అక్కడ . మళ్లీ మరో ఆవిష్కరణ,కవిత ఏదైనా నచ్చితే వెంటనే అనువాదం చేసేవారు.. రచయిత్రి కి మరణం వుండదు..

  • కల్పన గారూ!

    జగద్ధాత్రి గారి విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అవి చాలామటుకు facebook timeline లలో జరుగుతున్నాయి. ‘ సారంగ ‘ సాహిత్యానికి సంబంధించిన పత్రికగా మాత్రమే కాకుండా రకరకాల విషయాలను వివిధ కోణాలనుంచి చూడటానికి అవకాశం ఇచ్చింది. అందుకు సారంగ నిర్వాహక వర్గానికి Thanks.

    జగద్ధాత్రిగారు రచయిత్రి. సాహిత్య ప్రపంచానికి సంబంధించిన మనిషి. మీ వ్యాసంలో మీరు gender discrimination గురించి కూడా మాట్లాడారు. అందుకని కొన్ని విషయాలను ఇక్కడ share చేయటానికి ధైర్యం చేస్తున్నాను.

    కొన్ని విషయాలు వ్యక్తిగతం కాదు సామాజికం, ఆధిపత్యం అని తెలుస్తూనే ఉంటాయి. కానీ, అవి institutions లో లోపాల మాటున, institutions ని వ్యతిరేకిస్తున్నాం అనే చర్చల మాటున, తాత్వికతల మాటున మరుగున పడిపోతాయి. వాటిని ఋజువు చెయ్యటానికి చాలాసార్లు శక్తి చాలదు.

    కొన్ని సంఘటనలు మొహం మీద గుద్దినట్లుగా చెప్పినా, ఇంకా అది / అవి వ్యక్తిగతమో కుటుంబ వ్యవహారమో అనటం గాంధారిలా కళ్ళకు గంతలు కట్టుకోవటమే కదా! ఇప్పటికైనా ఆ గంతలు విప్పుకుని చూడకపోతే, ఎవరికైనా మాట దేవుడెరుగు, మనకి మనం ఏం మేలు చేసుకుంటాం.

    రామతీర్థ కూతురు జగద్ధాత్రిని public గా సభలో చెంప పగలగొట్టింది.

    ఒక రచయిత్రిని, 50 ఏళ్ళు పైబడ్డ మనిషిని (ఇదేమి చిన్న పిల్లల తగువు కాదు.) అందరూ చూస్తుండగా సభలో కొట్టగల ధైర్యం ఆ కూతురుకి ఎలా వచ్చింది? వాళ్ళ సహజీవనం etc. వల్ల అపఖ్యాతో అగౌరవమో అనుకుంటే ఆ కుటుంబానికి ముఖ్యుడయిన ఆ మనిషిని ఇన్ని సంవత్సరాలు నిలదీయకుండా, నిరసన తెలపకుండా ఏ ప్రయోజనాల కోసం ఆ కుటుంబం ఊరుకుంది? ఇపుడు sudden గా జగద్ధాత్రిని కొట్టటం ఏమిటి? ఏ ప్రయోజనాల కోసం?

    వ్యక్తిగతం అయితే వాళ్ళిద్దరూ (రామతీర్థ కూతురు, జగద్ధాత్రి) private గా తేల్చుకోవాలి.

    కుటుంబ వ్యవహారం అయితే ఒకరింటికి ఒకరు పోయి తేల్చుకోవాలి.

    మరి సభలో కొట్టినప్పుడు అది సామాజికమా! ఆర్థికమా! వగైరాలు సాహిత్య ప్రపంచం తేల్చుకోవక్కరలేదా? కనీసం చర్చించుకోవక్కరలేదా?

    అలా కొడితే చుట్టూ ఉన్నవాళ్ళు ఆ మనిషి చెయ్యి పట్టుకుని నిలదియ్యద్దూ! మామూలు సందర్భాల్లో గట్టిగా మాట్లాడితేనే ‘ పెద్దా చిన్నా తేడా లేకుండా ఏంటా మాట్లాడటం. గొంతు తగ్గించు. ‘ అంటామే. మరి కొట్టినప్పుడు మా పల్లెటూరి భాషలో చెప్పాలంటే ఆ పిల్ల జుట్టు పట్టుకుని నిలేసి మాట్లాడాలి / మాట్లాడించాలి కదా! ఇవేవీ ఎందుకు జరగలేదు.

    ఇదే scene reverse లో జరిగి రామతీర్థని కొట్టటానికి జగద్ధాత్రి కొడుకు వచ్చివుంటే రామతీర్థ ఊరుకునేవారా! పోనీ, shock లో ఊరుకున్నా చుట్టూరా ఉన్న ఎన్ని చేతులు ఆ పిల్లాడిమీద పైకి లేచేవో ఊహించలేమా!

    వాళ్ళ సాహిత్యం గురించి future research scholars చూసుకుంటారు. ఇపుడు వీటి గురించి మాట్లాడటం అవసరమేమో! లేకపోతే తరవాత generations కి ఏమి guidance ఇవ్వగలం?

    B. KRISHNA KUMARI

    • థాంక్స్ కృష్ణ కుమారి గారు మీకు బహిరంగంగా రామతీర్థ కూతురు చెంప దెబ్బ కొట్టడం మాత్రమే తెలుసు అటువంటి దెబ్బలు జగతి చానా తిన్నది. జగతమ్మని కట్టడి చేసి ఆర్థికంగా కుదేలు అయ్యేలా చేసి నిలువ నీడ లేకుండా వీధిన పడేసిన క్రౌర్యం గురించి ఎవరూ అడగడం లేదు. ఆమె పోయాక ఆమె రచనలు చర్చించి సిద్ధాంత గ్రంధాలు రాస్తే ఒరిగేది ఏమీ లేదు. కల్పన గారి వ్యాసం మీద నాకేమీ భిన్నాభి ప్రాయం లేదు బాగుంది కూడా. పాపం జగతి దుర్మరణం వెనక దాగున్న విషాదం కల్పన గారికి తెలిసే అవకాశం లేదు.
      కాకుంటే రామతీర్థ విషయం లో ఆధిపత్య సమాజం సెక్షస్ అయ్యింది. ఆమె వ్యక్తిగత జీవితం ఎవరూ ఏమీ రాయకుండానే ముందస్తు కాషన్ గా వ్యక్తిగతం వద్దు సాహిత్యం విద్వత్ మాట్లాడుదాం అంటూ మాన్యు ఫ్యాక్టర్డ్ కాన్సెన్షస్ తయారీ చేయడం లో ఒక పెద్ద కుట్ర మెకానిజం బలే పని చేసింది. అగ్ర వర్ణ పురుషుడు తిని తాగి తిరిగి చావొచ్చు వాడు పోయాక కార్య కారణాల పేరుతో శీల హననం మాటున శూద్ర మహిళల వ్యక్తిత్వాన్ని సతిలా కీర్తిస్తూ ఆమె రచనల గురించి మాట్లాడు కోవచ్చు. ఇది అన్యాయం

  • “ జగద్ధాత్రి అక్క ముందు రచయిత్రి, కవయిత్రి. ఆమె రచనల గురించి, రచనల ద్వారా ఎందరికో స్నేహామృతాన్ని పంచి ఇచ్చిన సహృదయ సాహిత్య కృషి గురించి చర్చించాలి కాని, జగద్ధాత్రి రామతీర్థల సహజీవనం గురించి, వారి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం లేదు “

    మానవత్వ విలువలు కనుమరుగౌతూ, క్రూరత్వం, వికృతత్వం రాక్షస ప్రవృత్తుల వైపు దిగజారుతున్న సమాజం గురించి చర్చించాలి, ప్రశ్నించాలి కాని, చనిపోయిన జగద్ధాత్రి అక్క జీవితం మీద బురద చల్లే ప్రయత్నాలు కాదు.

    టెన్నిసన్ కవిత “అన్నీ మరణించాల్సిందే“ ను మనసు తో రంగరించి అనువాదం చేసిన జగద్ధాత్రి అక్కది బలవన్మరణం కాదు, వైరాగ్యంతో చేసిన అభినిష్క్రమణ.

  • ఈ మొత్తం లో విషాదకరమైన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – జెండర్ పాలిటిక్స్. విపరీతం గా తాగి తాగి చచ్చిపోయిన రచయితలని కీర్తించి ఆకాశం లో నిలబెట్టిన సమాజం, రచయిత్రులు చనిపోతే వారి వ్యక్తిగత జీవితం గురించి మరింత బురద చల్లే ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరో సారి అదే రుజువైంది. జగద్ధాత్రి ముందు రచయిత్రి. తర్వాతే ఆమె సహజీవనమో, మరణమో.

  • తాగి చచ్చినా, సహా జీవనంలో అవమానాలతో చచ్చినా అభాసు పాలవుతున్నదీ అవర్ణులే. బురదలూ వాళ్ళమీదే. ఇవి క్యాస్ట్ పాలిటిక్స్ తప్ప జెండర్ పాలిటిక్స్ కావు.

  • కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్న వారందరికీ థాంక్స్.

    నిజంగానే నాకు ఈ విషయాలు ఏవీ తెలియదు. రామతీర్థ చనిపోయినప్పుడు ఎవరో షేర్ చేస్తే చదివినది జగద్ధాత్రి కి విముక్తి అని రాసిన వ్యాసం. నాకు అసలు విషయాలు పూర్తిగా తెలియకపోవటం వల్ల, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి అనవసరం గా పబ్లిక్ గా మాట్లాడటం వల్ల జగ్గద్దాత్రి ఎంత బాధ పడుతుందో కదా అనుకున్నాను. ఇప్పటికీ కూడా అదే అనుకుంటున్నాను. మీరు ప్రస్తావించిన విషయాలు నిజంగా విషాదం, విచారం. సభలో ఆ దుర్ఘటన జరగటం ఆమె ను ఎంత కుంగదీసి ఉంటుందో కనీసం ఊహించలేను. కానీ ఆ విషయాలు ఫేస్ బుక్ లో ఆమె బతికున్నప్పుడే ఓపెన్ గా చర్చకు పెట్టిన వైనం మంచి చేసిందో, చెడు చేసిందో మాత్రం నాకు అర్థం కావటం లేదు. ఎవరికైనా సరే,తమ వ్యక్తిగత విషయాలు బయటి వారీ తెలియడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు. ఆమె కు ధైర్యం చెప్పటానికే అలా చేసి ఉంటే, ఆమె అంగీకారం ఉంటే, ఆమె తన జీవితాన్ని ఆ విధంగా ముగింపు పలికి ఉండేవారు కాదనుకుంటున్నాను. సభ లో ఉన్న వారు రామతీర్థ కూతురిని నిలదీసి, జగద్ధాత్రి ని ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే బావుండేది. ఆమె ప్రేమ లో, సహజీవనం లో ఒక అగ్రవర్ణ మగవాడి చేతుల్లో వంచన కు గురి కావటాన్ని నేను ఎంత మాత్రం సపోర్ట్ చేయటం లేదు.
    మీడియా లో రామతీర్థ మరణం తర్వాత వారిద్దరి సహజీవనం బయటకు రావటం, జగద్ధాత్రి మరణం తర్వాత, రామతీర్థ లేని జీవితం బతకలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె ను మరొక సతి గా కీర్తించటం, మరి కొందరు ఆమె పెళ్లి నుంచి బయటకు వచ్చి సహజీవనం లో ఉండటం గురించి ఆమె శీలాన్ని గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్లు మాత్రమే తెలిసింది. అందువల్ల మాత్రమే ఆమె జీవితాన్ని గురించి వ్యాఖ్యానాలు, ఆమె మరణానికి కారణాలు, కారకులు వెతకటం అనవసరం అన్నాను.
    ఈ క్లారిఫికేషన్ ఇస్తూనే నాకున్న మరికొన్ని ప్రశ్నలను ధైర్యం తెచ్చుకొని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
    1. రామతీర్థ దళితుడై, జగద్ధాత్రి అగ్రవర్ణ స్త్రీ అయి ఇదే విధంగా జరిగి ఉంటే, ఎవరి స్పందన ఎలా ఉండేది? ఇప్పుడు దళితులు మాట్లాడుతున్న విషయాలనే హిందుత్వ వాదులు మాట్లాడి ఉండే వారు. దళితులని, ముస్లింలని పెళ్లి చేసుకున్న అగ్ర వర్ణ స్త్రీలు ఎలాంటి అగచాట్లు పడుతున్నారో బోలెడు వ్యాసాలు రాసేవారు. కొన్ని సంఘటనలప్పుడు అలా రాసారు కూడా.
    2. తాగి తాగి చచ్చిపోయిన కవుల కుటుంబం లోని స్త్రీలతో ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ భర్తల వ్యసనాలు వారి జీవితాల్ని, వారి కుటుంబాల్ని ఎలా దేబ్బతీసాయో ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకున్నారా? ప్రేవైట్ సంభాషణల్లో ఏమైనా బయటకు వచ్చాయేమో కానీ పబ్లిక్ గా మాత్రం చనిపోయిన వాళ్ళు గొప్ప కవులు గా కీర్తించ బడుతూనే ఉన్నారు. వారి కుటుంబాలకు , వారితో జీవితాలు పంచుకున్న స్త్రీలకు జరిగిన అన్యాయాలు ఎవరూ మాట్లాడినట్లు నాకైతే తెలియదు. మరి అది కరెక్టేనా? ముందుగా స్త్రీలు, తర్వాత కులం అని నేనంటే చాలా మంది అంగీకరించరని నాకు తెలుసు.
    ౩. కులం, ఇప్పుడు ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్ విషయాలు అయిపోయాయి. ముఖ్యంగా నేను అగ్ర వర్ణం నుంచి వచ్చాను కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఏదో ఒకటి తప్పు అవుతుంది. నా కులం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటో నా రచనల ద్వారా, నా వ్యక్తిగత జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. అయినా సరే, నేను ఒక మాట మాట్లాడాలంటే, ఒక వ్యాక్యం రాయాలంటే ఎన్ని సార్లు నన్ను నేను చెక్ చేసుకోవాలో? ఇవన్ని నాకు స్వానుభవం కాబట్టేనేమో నాకు జగద్ధాత్రి ఒక మోసపోయిన స్త్రీ గానే కనిపిస్తుంది కానీ ఆమె కులం నేను తెలుసుకోవాలనుకోలేదు. ఇప్పటికి కూడా నా దృష్టి లో ఒక సహృదయ రచయిత్రి బలవంతంగా చనిపోవటం విషాదం అనుకుంటాను. ఒక మంచి రచన ఎవరిది కనిపించినా జగద్ధాత్రి ఎవరూ ఏమీ అడగకుండానే దాని మీద తన అభిప్రాయమో, వ్యాసమో రాసి పంపేవారు. అలాంటి రచయిత్రి మరణిస్తే, ఆమె రచనల గురించి ఎవరూ రాయకపోవటం ( నా దృష్టి లోకి రాకపోవటం) నన్ను బాధ పెట్టింది. అందుకే నేను జెండర్ పాలిటిక్స్ గురించి మాట్లాడాను. కాదు ఇవి క్యాస్ట్ పాలిటిక్స్ అంటున్నారు. మొత్తానికి ఇవి పాలిటిక్స్. అయితే స్త్రీ కి సంబంధించినంత వరకూ కులం,మతం, జెండర్ –ముప్పేట దాడి జరుగుతుంది. ముఖ్యంగా రైటిస్ట్ లు కంట్రోల్ చేస్తున్న మీడియా లో ఈ ముప్పేట దాడి స్పష్టం గా కనిపిస్తోంది. దాన్ని ఎదుర్కోవటానికి మన దగ్గర సరైనా ఆయుధాలు సమకూర్చుకునే దాకా జగద్ధాత్రి మరణం లాంటి విషాదాలు జరుగుతూనే ఉంటాయి. సాహిత్యానికి అవతలి వైపున సామాజికంగా అలాంటి మరణాలు రోజూ జరుగుతూనే ఉన్నాయని మనందరికీ తెలుసు.
    4.ఆమె రచనల గురించి ముందు తరాల వాళ్ళు చూసుకుంటారు అన్నారు. ఆమె చనిపోయినప్పుడు ఆమె ను రచయిత్రి గా గుర్తించకపొతే, తర్వాత తరం వాళ్లకు ఆమె రచయిత్రి గా గుర్తుంటుందా, లేదా అనేది కొంత అనుమానమే నాకు.
    5. జగద్ధాత్రి మీద బహిరంగంగా దాడి జరిగినపుడు, సభలోనూ, ఊర్లోనూ ఉన్న సాహిత్యకారులు ఇచ్చిన సపోర్ట్ ఏమిటి? ఎందుకు ఆ పని చేయలేకపోయాం మనలో ఎవరైనా? మనమందరం ఆమె మరణానికి ఎంతో కొంత కారణం కాదా? అది నా గిల్ట్.
    ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నాలో -జగద్ధాత్రి మరణం తో.

    • వాళ్ళ సాహిత్యము గురించి future generations తప్పకుండా పట్టించుకుంటాయి కల్పన గారూ! శతాబ్దాలు, దశాబ్దాల తరవాత publish అయిన సాహిత్యాన్ని చూశాం కదా! latest example ధనికొండ హనుమంతరావు గారి సాహిత్యం. ఆయన శతజయంతి సందర్భంగా జనవరిలో సంపుటాలుగా వచ్చింది. సాహిత్యం recorded కాబట్టి ఎపుడో అపుడు బయటకు వస్తుంది. మాట్లాడతారు.

      కానీ, జీవితాల గురించి అలా కాదే. వాటి గురించి మాట్లాడాలి అంటే చాలా pain ఉంటుంది. painful జీవితాలు గడిపిన వాళ్ళ గురించి, అప్పటి సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడాలి అంటే pain భరించే శక్తి, ధైర్యం, platform కావాలి.

      ఇంత జరిగితే ఏ కొంచెమో బయటికి వస్తుంది. అది ఏ కొంచెం అయినా మనకి మేలు చేయవచ్చు.

      ఈ మధ్యనే (May, 2019) బోయి భీమన్న గారి భార్య బోయి నాగరత్నమ్మ గారి జ్ఞాపకాలను (నాగరత్నమ్మ గారి డైరీలు. అది ఆవిడ జీవితాన్నే కాకుండా contemporary సమాజాన్ని కొంత పరిచయం చేసింది. ) ఆవిడ శతజయంతి సందర్భంలో వాళ్ళ పెద్ద కూతురు బి. విజయభారతి గారు publish చేశారు. పుస్తకం పేరు, మా అమ్మ బోయి నాగరత్నమ్మ జ్ఞాపకాలు.

      ఆ శ్రద్ద జగద్ధాత్రి గారి విషయంలో తీసుకోవటానికి అవకాశం ఏదీ?

      ఈ మధ్య ఒకళ్ళిద్దరు వాళ్ళ నాన్నల గురించి అమ్మల గురించి ‘ అయ్యో! వాళ్ళు ఉండగానే అడగాల్సిందే ‘ అనుకోవటం, ‘వాళ్ళ స్నేహితులనైనా కలవలేకపోయామే ‘ అనుకోవటం చదివాను. విన్నాను.

      అందుకని జగద్ధాత్రి గారి చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి స్పందించాను. వాళ్ళకి తెలిసినవాళ్ళో, స్నేహితులో కాలగర్భంలో కలిసి పోయాక చెయ్యటానికి ఏం ఉండదుగా! మనం నేర్చుకోగలిగినది ఏం ఉండదుగా!

      B. KRISHNA KUMARI

  • అవును, జగతమ్మ సాహిత్యం గురించి మాత్రమే మాటాడాలి. మంచి వ్యాసం కల్పన గారూ. విశాఖ వాళ్ళు జగధాత్రి రచనలు ప్రచురించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆమె చాలా రాసారు, సంపుటీకరించింది మాత్రం ఒక్కటే.

  • విశాఖ వాళ్ళు జగతమ్మ రచనలు ప్రచురించే ప్రయత్నాల్లో ఉన్నారు అని ఎంత చల్లటి మాట చెప్పినావు బావూ! ప్రజల ఆశలను ఆకాంక్షలను అక్షరబద్ధం చేస్తూ మూడు దశాబ్దాలకు పైగా సాహిత్యాన్నే జీవితోద్యమంగా గడుపుతున్న అట్టాడ అప్పల్నాయుడు బావూ!

    పూసలోల్ల బొట్టి అని మా జగతి అక్కను అంతపట్టించుకోరేమో అని దిగాలుగా ఉండేది . పూసలు కాదు మట్టిలోని మాణిక్యం అని యీ జగధ్ధాత్రి అని మన విశాఖ వీరులు నడుము కడుతుంటే మరింకేవి .

    యీ యజ్నానికి విశాఖ కృష్ణక్క ( విరసం కృష్ణాబాయి ), డా. కె. ఎస్. మల్లీశ్వరి గార్లు కూడా తనవంతు సాయం అందిస్తారని నా రుదయం నాకు చెపుతోంది. 94 యేళ్ల వీరుడు కారా మాస్టారు గారు స్వయంగా దిగకున్నా సిక్కోలు కధానిలయం వాళ్లూ చెయ్యందిస్తారు కదూ.

    పాలమూరు విశాఖ వలసపక్షుల రోదనలు వినిపించిన గొరుసన్న ను కూడా వదల కూడదు. ( గొరుసన్న ఉప్పుడు కేవలం బాగ్యనగరం లో ఉంటున్న సీనియర్ రచయిత గొరుసు జగదీస్పర రెడ్డిగా మిగిలిపోయాడు కానీ ఏదో ఒక రోజు తనలోని వీరుడు మళ్లీ అక్షర జగత్తులోకి అడుగిడతాడు, తను చూసిన రావి శాస్త్రి, త్రిపుర, భరాగో మీద ఆన ).

    అన్నిటికన్నా మరీ ముఖ్యంగా “ ఒరే సీతా “ అని జగతక్క పిలుచుకునే డా. గుర్రం సీతారాములు కూడా తనవంతు మాట సాయం చేస్తాడు.

    మరింకేవీ అక్కరనేదు బావూ.

  • రెంటాల కల్పన గారు !

    నాగ్ పూర్ నుండి బెజవాడ కొచ్చి, ఇక్కడే స్తిరపడుతున్న భమిడిపాటి జగన్నాధ రావు గారు ( త్రిపుర గారి ఆప్త మిత్రులు, పెద్దలు, శ్రీ ) వాళ్ల అమ్మాయి నేర్పిస్తే Tablet PC లో సారంగ అంతర్జాల పత్రిక ను చూస్తున్నారు. చదువుతున్నారు ( ఇన్నాళ్లు ప్రింటు మాధ్యమాలలో వచ్చే వాటినన్నీ వదలకుండా చదివే నిరంతర పఠనాసక్తి పాఠకుడు ).

    జగధ్ధాత్రి గారి గురించి మీరు రాసిన చాలా వ్యాసం బాగుంది అని అన్నారు.

    రామతీర్థ-జగధ్ధాత్రి ల గురించి తలపోసుకున్నారు. జగతక్క వాళ్లమ్మాయి దీపు బెంగుళూరు లో పై చదువులు చదువుతున్నారు అని, దీపు వాళ్ల నాన్నగారే జగతక్క కు అంతిమ సంస్కారాలు చేసారని తనకూ తెలుసన్నారు.

    దిగులుతో, ఒంటరిగా ఉండొద్దు జగతక్కా! మా అందరి దగ్గరా తలా ఒక్కోవారం రోజులన్నా ఉండక్కా!! అని విశాఖ డా. కె ఎన్ మల్లీశ్వరి గారు అన్న విషయం …. అలాగేలే చూస్తానులే అన్నా, అలాచెయ్యలేక పోయిన జగధ్ధాత్రి గారు అంటూ నాకు తెలిసీ తెలియ విషయాలు చెపుకుంటే కాలం నాడే స్త్రీ పక్షపాతి, ఫెమినిస్ట్ రైటర్ అనిపించుకున్న భమిడిపాటి జగన్నాధ రావు గారు …. తనలా మనల్ని, ప్రతిభావంతంగా తను చేస్తున్న తెలుగు సాహితీ సేవలను వదిలివెళ్ల కుండా ఉండాల్సింది అని అన్నారు.

  • “ అమ్మ ప్రేమ, నాన్న శిక్షణ రెండు అందించే స్నేహితుడిలాంటి మంచివారు టీచర్లు. మీ అందరూ మంచి ఉపాధ్యాయులుగా దేశానికి మంచి పౌరులను అందించేవారిగా కొనసాగాలని నా ఆశ, ఆశీర్వాదం.. “ ~ జగద్ధాత్రి

    ” రేప‌టి టీచ‌ర్లు ” (క‌థ‌) ~ జగద్ధాత్రి

    http://www.prajasakti.com/Article/katha/2154966

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు