అవిశ్రాంత ‘అక్షర’ తపస్వి – రెంటాల గోపాలకృష్ణ

ధునిక ఆంధ్ర సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో అనవరత కృషీవలుడిగా ‘అక్షర షష్టిపూర్తి’ జరుపుకొన్న అరుదైన రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ (జననం: 5 సెప్టెంబర్ 1920 – మరణం: 18 జూలై 1995). పదహారేళ్ళ ప్రాయం నుంచి డ్బ్భై అయిదేళ్ళ వయసులో ఆఖరి శ్వాస విడిచే ముందు వరకు – అరవై సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ఆయన సాహితీ సేద్యం సాగించి, బంగారు పంటలు పండించారు. కవిత్వం, కథానిక, నాటకం, గీతరచన, అనువాదం, అనుసరణ, విమర్శ, అనుసృజన – ఇలా ఎన్నో ప్రక్రియలను స్పృశించిన రెంటాల రచనలు అసంఖ్యాకం. అందుకే, తెలుగునాట రెంటాల గోపాలకృష్ణ పేరు సుపరిచితం. కవిగా, నాటకకర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన సుప్రసిద్ధులు.
 గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో- పాండిత్యం, ప్రతిభగల కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి శ్రీ రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు. స్కూలు ఫైనల్‌లో ఉండగానే 1936లో పదహారేళ్ళ ప్రాయంలో ‘రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలను రాసి, మిత్రుల సహాయంతో 1939లో ప్రచురించి, సంచలనం రేపారు. ఈ నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీ మారేమండ రామారావు ముందుమాట వ్రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే, రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకొని, వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937 (స్కూల్ ఫైనల్) వరకు నరసరావుపేటలోని మునిసిపల్ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు వంటి సాహితీ మిత్రుల సాహచర్యం, ప్రముఖ కవి – ప్రధానోపాధ్యాయుడు శ్రీనాయని సుబ్బారావు శిష్యరికం అబ్బాయి. తర్వాత గుంటూరులో కళాశాలలో బి.ఏ. (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు.
 కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలసి నరసరావుపేటలో ‘నవ్యకళా పరిషత్’ అనే కవిత్వ, సాహితీ చర్చావేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ, నవ్యకవితా ధోరణికి నాంది పలికారు. 1943లో శ్రీ రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్కి ్సజం అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం – వీటితో ఆయన రచనల్లో నూతన దృష్టి మొదలైంది.
తొలి తరం అభ్యుదయ కవితా వైతాళికులలో ఒకరు శ్రీ రెంటాల. ఆయన రాసిన కవితలను శ్రీశ్రీ, బైరాగి వంటి ప్రముఖ కవులు ప్రశంసించి, ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి స్వయంగా అనువదించారు. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం ‘నయాగరా’. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన ‘నయాగరా’ కవితా సంపుటి ప్రచురణలో శ్రీ రెంటాల సహాయకుడిగా పాలుపంచుకొని, ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడువాదోడుగా ఉన్నారు. ‘నయాగరా’ కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. రెంటాల తన మిత్రులతో కలసి, తొలినాళ్ళలోనే ‘అభ్యుదయ రచయితల సంఘం’లో చేరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగారు.
‘సంఘర్షణ’, ‘సర్పయాగం’ తదితర స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు. అభ్యుదయ కవిత్వానికీ, శ్రామికజన ప్రబోధ సాహిత్యానికీ, ఆనాటి నిజాం వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాటానికీ ప్రతీకగా కవితా సృజన సాగించారు. ‘‘పగలేయి నిజాం కోట / ఎగరేయి ఎర్రబావుటా…’’ అన్నా, ‘‘అమ్మా! ఉమా! రుమా! హిరోషిమా! / విలపించకు పలవించకు…’’ అంటూ రెండో ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని వర్ణించినా రెంటాల తనదైన గొంతుకను వినిపించారు. శ్రీశ్రీ సైతం ఆయన కవిత్వానికి ముగ్ధుడై, అభినందించి, భారత పర్యటనకు వచ్చిన జపనీస్ శాంతి సంఘానికి అప్పటికప్పుడు రెంటాల కవిత ‘హిరోషిమా’కు ఆంగ్లానువాదం చేసి వినిపించారు. జపనీయులు సైతం శ్రీ రెంటాలను అభినందనలతో ముంచెత్తారు. భావకవిత్వం, నవ్యకవిత్వాలకు ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ లాగా అభ్యుదయ ప్రగతిశీలవాద కవిత్వానికి ‘కల్పన’ కవితా సంపుటి జయపతాకగా నిలిచింది. ‘కల్పన’కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించి, ఆ సంపుటి వెలుగు చూడడంలో అత్యంత కీలకపాత్ర వహించారు శ్రీ రెంటాల. ప్రముఖ అభ్యుదయ కవులందరి కవితల సంకలనమైన ‘కల్పన’ను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.
ఉదరపోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరైనా, సాహిత్యాభిలాష కారణంగా రైల్వే, తదితర ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నారు శ్రీ రెంటాల. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథం గారి ‘దేశాభిమాని’ పత్రికలో గుంటూరులో పనిచేశారు. తరువాత చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వంలోని ‘నవభారతి’ మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్య నిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు వంటి మిత్ర రచయితలతో కలసి, నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయుల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు.
పాత్రికేయ వృత్తిలో ఉంటూనే, ఆయన ‘పంచకల్యాణి  దొంగలరాణి’, ‘కథానాయకురాలు’ లాంటి కొన్ని చలనచిత్రాలకు కథ, మాటలు, పాటలు సమకూర్చారు. ‘ఆంధ్రప్రభ’లో సినిమా విశేషాల అనుబంధం ‘చిత్రప్రభ’కు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన వ్రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యాయి. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చాయి. అప్పట్లో బెజవాడలో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే!
జ్యోతిషం, ఆయుర్వేదం, హోమియోపతి, కళారంగాలలో రెంటాలకు అభిరుచితో పాటు అభినివేశం ఉండేది. పాత్రికేయుడిగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష, కళా రంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు వ్రాశారు. ఆయన వ్రాసిన సంపాదకీయాలూ కోకొల్లలు. యాంత్రికంగా, గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామందికి భిన్నమైన వారు రెంటాల. నిబద్ధతతో, నిర్దేశిత పనిగంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమిస్తూ, తనదైన శైలిలో దగ్గరుండి దినపత్రిక వర్కును పూర్తి చేయించే ఆయన నైజం ఆ తరం పాత్రికేయులకు సుపరిచితం.
పాత్రికేయ వృత్తిని చేపట్టినా, రెంటాల తన సాహితీసేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. ‘అభ్యుదయ’, ‘మాతృభూమి’, ‘సోవియట్ భూమి’, ‘ఆనందవాణి’, ‘విజయవాణి’, ‘విజయప్రభ’, ‘నగారా’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలలోనూ, ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రిక, ‘ఆంధ్రజ్యోతి’ దిన, వార పత్రికల్లోనూ, ‘స్వాతి’ వార, మాస పత్రికల్లోనూ, ‘బాలజ్యోతి’ పిల్లల మాసపత్రికలోనూ రెంటాల రచనలు, ధారావాహికలు అనేకం ప్రచురితమయ్యాయి.
రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా శ్రీ రెంటాల స్పృశించని అంశం లేదు. రష్యన్ నాటకకర్త గొగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ను అనుసరిస్తూ రెంటాల అదే పేరుతో రాసిన నాటకం, ఇంకా ‘అంతా పెద్దలే’ లాంటి ఆయన నాటకాలు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో – రెంటాలకు ‘ప్రజానాట్యమండలి’, ‘ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్’లతో పాటు అనేక ఇతర ఔత్సాహిక నాటక సమాజాలతోనూ, ఆధునిక సాహిత్యోద్యమాలతోనూ సంబంధం ఏర్పడింది. నాటి నుంచి అనేక గీతాలు, నాటికలు, కథలు, అనువాదాలు రాసి ప్రచురించారు. కవిగా, రచయితగా, నటుడిగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా ఆయన సాహితీ రంగస్థలంపై బహుపాత్రపోషణ చేస్తూ వచ్చారు. ‘శిక్ష’, ‘అంతా పెద్దలే’, ‘రజని’, ‘కర్ణభారం’, ‘మగువ మాంచాల’, ‘రాణీ రుద్రమదేవి’, ‘మాయమబ్బులు’… ఇలా ఎన్నో రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.
రష్యన్, ఆంగ్ల సాహిత్యాలను తేటతెలుగులో అందించడానికి శ్రీ రెంటాల చేసిన కృషి ఎన్నదగినది. లియో టాల్‌స్టాయ్ వ్రాసిన బృహన్నవల ‘వార్ అండ్ పీస్’ రష్యన్ సాహిత్యంలో ప్రపంచ ప్రసిద్ధం, సుదీర్ఘం. జార్ చక్రవర్తులను గురించి తెలిపే ఈ నవలా రాజంలో దాదాపు 500 పైచిలుకు పాత్రలున్నాయి. ఈ బృహత్తర రచనను శ్రీ రెంటాల, తన స్నేహితుడైన రచయిత బెల్లంకొండ రామదాసుతో కలిసి సులభశైలిలో తెలుగువారికి ‘యుద్ధము – శాంతి’ పేరిట అందించారు. ఇక రెంటాల స్వతంత్రంగా విశ్వవిఖ్యాత టాల్‌స్టాయ్ నవల ‘అన్నాకెరినినా’ను సరళంగా తెలుగులోకి అనువదించారు. మేలెన్నికగన్న అనువాదంగా ఆ రచన సాహితీవేత్తల ప్రశంసలను అందుకుంది.
అలాగే, అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన ‘యమా ది పిట్’ను ‘యమకూపం’గా, మాక్సిమ్ గోర్కీ నవల ‘ది మ్యాన్ హు వజ్ ఎఫ్రైడ్’ను ‘భయస్థుడు’గా, నోబెల్ బహుమతి గ్రహీత నట్ హామ్సన్ రచన ‘హంగర్’ను ‘ఆకలి’గా రెంటాల తెనుగు చేశారు. తెలుగు సాహిత్య లోకానికి రష్యన్ సాహిత్యామృతాన్ని పంచారు. రవీంద్రనాథ్ టాగోర్, లూయీ చార్లెస్ రాయర్, రష్యన్ రచయితలు అలెగ్జాండర్ పుష్కిన్, చకోవ్‌స్కీ, ఫ్రెంచ్ రచయితలు ఆనటోల్ ఫ్రాన్స్, విక్టర్ హ్యూగో, మపాసా తదితరుల రచనలను రెంటాల తెనిగించి, అనువాద సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
బాలసాహిత్యానికి రెంటాల చేసిన కృషి అపారం. బాలల అకాడమీ అవార్డుల నిర్ణేతల దృష్టికి రాలేదేమో కానీ, ఏ తెలుగు ప్రచురణాలయానికి వెళ్ళినా, ఆనాటి ‘బాలజ్యోతి’ వంటి బాల సాహిత్య పత్రికలను తిరగేసినా శ్రీ రెంటాల బాల సాహిత్యంలో చేసిన అవిరళ కృషి స్పష్టంగా కనిపిస్తుంది.  లియో టాల్‌స్టాయ్ బాల సాహిత్యాన్ని అంతటినీ రెంటాల తెనిగించారు. భారత, రామాయణ, భాగవతాదుల నుంచి ‘భట్టి విక్రమార్క కథల’ దాకా, ‘అరేబియన్ నైట్స్’ దగ్గర నుంచి ‘ఈసఫ్ కథలు’, ‘గ్రీకు గాథలు’ దాకా విస్తారమైన సాహిత్యాన్ని అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినంత సులభశైలిలో పిల్లలకు అందించారు. పెద్దలను సైతం అలరించారు.
ఇక వాల్మీకి, వ్యాస ప్రణీతాలైన రామాయణ, భారత, భాగవతాలను సంపూర్ణంగా మూలాన్ని అనుసరిస్తూ తెనిగించారు. తెలుగు ప్రబంధ సాహిత్యాన్నీ, సుప్రసిద్ధ కావ్యాలనూ సరళమైన వచనంలో, ఈ తరం పాఠకులు హాయిగా చదువుకొని, ఆస్వాదించేలా అందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంస వింశతి’, జయదేవుని ‘గీత గోవిందమ్’, లీలాశుక యోగీంద్రుని ‘శ్రీకృష్ణ కర్ణామృతమ్’, భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ మొదలైనవన్నీ రెంటాల కలం నుంచి ‘స్వాతి’ సాహిత్య మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.
  నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో కామానికి సంబంధించినంత వరకు ప్రాచీన మహర్షి వాత్స్యాయనుడిదే మొదటి మాటా, చివరి మాటా! అలాంటి వాత్స్యాయనుడు రాసిన ప్రసిద్ధ, ప్రాచీన శాస్త్రీయ గ్రంథం ‘వాత్స్యాయన కామసూత్రాల’ను యశోధరుని ‘జయమంగళ’ వ్యాఖ్యానుసారం మూలశ్లోకాలతో సహా పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో రెంటాల తెనిగించారు. ఈ గ్రంథరాజం ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమవడమే కాక, పుస్తకరూపంలో అతి స్వల్పకాలంలో దాదాపు 20 ముద్రణలకు నోచుకొని, పండితుల, పామరుల ప్రశంసలకు పాత్రమైంది. అలాగే, కల్యాణమల్లుని కామశాస్త్ర గ్రంథం ‘అనంగరంగం’ మూలశ్లోకాలతో సహా, సరళంగా తెలుగు చేశారు.
 అరవై ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో నిర్విరామంగా కృషి చేసి, బంగారు పంటలు పండించిన రెంటాల రచనలు అసంఖ్యాకం. సహధర్మచారిణి రెంటాల పర్వతవర్ధని ఆయన అక్షరయజ్ఞానికి అండగా నిలిచి, తన జీవితాన్ని చివరివరకు ఆయన సేవలోనే వెలిగించారు. రెంటాల గ్రంథాలు అశేషమైన తెలుగువారి ఆదరాభిమానాలు సంపాదించాయి. ఆయన రచనలను వివిధ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాయి. బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు రెంటాల ప్రసిద్ధ రచన ‘పల్నాటి వీరచరిత్ర’ను కన్నడంలోకి ‘పలనాడ వీర చరిత్రె’గా అనువదించి, విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టడం మరో విశేషం.
శ్రీ రెంటాల గోపాలకృష్ణ 1943 నుంచి విజయవాడలోనే ఉంటూ, ఆ నగరాన్నే తన సాహితీ క్షేత్రంగా మలుచుకున్నారు. విజయవాడతో ఆయనది 52 ఏళ్ళ అనుబంధం. విమర్శకుడిగా, వ్యాసకర్తగా, సునిశిత వార్తా వ్యాఖ్యాతగా, పత్రికా రచనా వృత్తిలో బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన రెంటాల నిత్యజీవిత సమరంలో పడడంతో కవిత్వ సృజన కొంత వెనుక పట్టు పట్టినా ఆయన కవితాతృష్ణ తీరనిది. ‘శివధనువు’, ‘నగరంలో రాత్రి’ పేరిట స్వీయ కవితాసంపుటాలను వెలువరించాలని ఆయన చిరకాలం తపించారు.
దాదాపు 200 గ్రంథాలను రాసిన ఈ పండిత పాత్రికేయుడు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. 1979లో ప్రసిద్ధ ‘ఆంధ్ర నాటక పరిషత్’ అవార్డు, 1981లో నెల్లూరు ‘నెఫ్జా’ నాటక కళా పరిషత్ అవార్డు శ్రీ రెంటాలను వరించాయి. ఉత్తమ సినీ విమర్శకుడిగా హైదరాబాద్ ‘వంశీ ఆర్ట్ థియేటర్స్’ వారి చేత 1987లో ‘దాసరి నారాయణరావు స్వర్ణపతకా’న్ని అందుకున్నారు. 1990-91లో ఘంటసాల అకాడెమీ, విజయవాడ వారు ఉత్తమ జర్నలిస్టు అవార్డుతో సత్కరించారు. కన్నుమూయడానికి సుమారు రెండు నెలల ముందు 1995లో ‘క్రాంతి’ ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఆయనకు లభించింది.
ఆశయాలు, ఆకాంక్షలు, బాధలు, వేదనలు! బాధామయ జగత్తును దర్శించి, దరిద్రంలోనే శాంతినీ, అంధకారంలోనే వెలుగునూ కవిత్వం ద్వారా, సాహితీ వ్యాసంగం ద్వారా రెంటాల అన్వేషించారు. ఒకవైపు సాహిత్యంలో అన్వేషణ, మరోవైపు జీవన సమరం. ఇలా    శ్రీ రెంటాల అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే, అవినీతి రాజకీయాలపై అస్త్రసంధానం చేస్తూ, ‘‘దించండి తెర! దించండి తెర! / చాలు చాలు ఈ విషాద సారంగధర…’’ అంటూ 1995 జూలై 18వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకు విజయవాడలో కన్నుమూశారు.
నిరాడంబరుడు, నిగర్వి, సహృదయ సన్మిత్రుడు, సాహితీమూర్తి శ్రీ రెంటాల గోపాలకృష్ణ భౌతికంగా మన ముందు లేరు. కానీ, సాహితీ జగాన ఆయన చిరంజీవి.
భర్తృహరి చెప్పినట్లు….
జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం

ఎడిటర్

3 comments

Leave a Reply to AtreyaSarma U Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మహామనీషి, ఋషితుల్యులు రెంటాల గోపాలకృష్ణగారి బృహత్ సాహితీయజ్ఞాన్ని గురించి తెలుసుకొన్న తరువాత, వారికి ఎన్ని అక్షర నమోవాకాలు సమర్పించుకొన్నా, అతి తక్కువే అనిపించింది. తెలుగుజాతి చేసుకొన్న పుణ్యం వల్ల ఇటువంటి మేరు నగధీరులు మనకు లభిస్తారు. దాదాపు 200 గ్రంథాలు వారు రచించారని, అందులో రామాయణ, మహాభారత, భాగవతాల వంటి మూల ఉద్గ్రంథాలకు రెంటాలవారి సంపూర్ణ తెలుగు అనుసృజనలు కూడా ఉన్నాయని తెలుసుకోవడానికి నా లాంటి వాడి ఊహకు కూడా అందని అమూల్య విషయరత్నాలు. అయితే, రెంటాల గోపాలకృష్ణ గారు రచించిన గ్రంథాలలో ఎన్ని, ఎక్కడ ఈనాడు లభ్యమో సవివరమైన సమాచారం కూడా ఉంటే ఎంతో ప్రయొజనకరంగా ఉంటుంది. మనందరం గర్వపడే వీరిపై ఈ వ్యాసం అందించిన సంపాదకులకు కృతజ్ఞతాగుచ్ఛాలు.

  • నరసరావుపేట శాఖా గ్రంథాలయంలోనే గోపాల కృష్ణ గారి అనువాద రచనలు చదివే అవకాశం దొరికింది

    వారు చదువుకున్న స్కూల్ లోనే దశాబ్దాల తర్వాత మేము చదువుకున్నాం

    ఆ వూరి గాలి లోనే ఒక ఉత్తేజం , ఒక ఎరుపు ఉన్నాయనడానికి ఆయన, వారి సమకాలికులు ఏల్చూరి, బెల్లకొండ , అనిసెట్టి .. వీరంతా సాక్ష్యాలు

    యమకూపం రెంటాల గారి అనువాదాలలో నాకు అత్యంత ఇష్టమైన నవల

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు