నేను నీతో ఉన్నన్ని రోజులూ ఇలాంటి ఒక్క ప్రేమ లేఖా రాయలేదుగా! నేను రాయలేదా, నువ్వు రాయనివ్వలేదా లేక రెండూనా? నేను ఎందుకు రాయలేదా, నువ్వు ఎందుకు రాయనివ్వలేదా అని ఆలోచిస్తుంటాను ఒకోసారి. నేను నా మనసుని నీ ముందు పరిచిన ప్రతి సారీ పేలవంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంటావుగా! నేను ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు తపన పడి తాళలేక నాలుగు మాటలు నీకు చెప్తానా, నీ నిర్వికారమైన స్పందన నా గుండెని పిండేస్తుంది. అయితే మాత్రం అందులో నేను రాయనివ్వకపోయేదేముంది అని అంటావ్ నాకు తెలుసు. నీకు రాయాలనిపిస్తే రాయాలి కాని నేను ఎట్లా స్పందిస్తే ఏంటి అని అంటావు. ఇట్లాంటి ప్రశ్నలతో నన్ను ఎంత నలిపేస్తావో నీకు మాత్రం తెలియదూ? అయినా నీకోసం ఎంత సాగుతానో చూస్తావు. ఆరోజు పొద్దున్నే అద్దానికి అటు వైపు నిలబడి అందకుండా నన్ను ఆటపట్టిస్తుంటే నీ నవ్వే మొహం చూసి నీకు ఎన్ని ముద్దులు విసిరాను? ఒక్క ముద్దూ నువ్వు తిరిగి పంపలేదు. నన్ను ఎన్ని సార్లు అట్లా చిన్నబుచ్చావో నీకూ తెలుసులే! చిన్నబుచ్చుకుంటే ముద్దు ఒచ్చినప్పుడు తీస్కోవాలి కాని అడిగినప్పుడే కావాలంటే ఎట్లా అంటావు. నీ మీద ప్రేమ ఎక్కువయి గుండెలో ఉద్వేగం అలలుగా ఉప్పొంగినపుడు, గుండె పేలిపోతుందేమో అని అనిపించేంతవరకూ ఆపుకొని, చివరికి ఉండలేక నీ మీద ప్రేమతో చచ్చిపోతున్నానని చెప్తానా, మళ్లీ అదే నవ్వు విసురుతావు. నువ్వు తిరిగి చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా అని అంటాను నేను. తెలిసినప్పుడు చెప్పడం ఎందుకూ అంటావ్! అయినా ఆరోజు రాత్రి నక్షత్రాల సాక్షిగా నువ్వు నా కళ్లల్లోకి చూసి గుసగుసగా చెప్పింది గుర్తున్నదా! విని నేను చెప్పలేని ఉద్వేగంలో ఏమీ మాట్లాడలేదు. నువ్వు నన్ను చూస్తూ ఉండి పోయావుగా! అప్పుడు ఏమయిందో నీ గాంభీర్యం! గుర్తున్నయిగా నాతో గడిపిన ఆ నిద్ర లేని రాత్రులు. అన్ని రోజులు నిద్ర లేకుండా ఉండడం సాధ్యమేనా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఒక మగతలో ఉన్నామా అప్పుడు మనం? దాన్ని ఏమంటారు? ప్రేమా? మోహమా? పిచ్చా? పరవశమా? జ్వరమా? అసలు మన చుట్టూ ఎవరూ కనిపించలేదుగా! అంత ఆనందం సాధ్యమా అనిపించేలా! అంత నొప్పి సాధ్యమా అనిపించేలా! నువ్వెవరో నేనెవరో తెలియనంత దెగ్గరగా! అంత దెగ్గరలోనూ ఎంత తీరని దాహం. నన్ను అమాంతంగా నీ చేతుల్లో ఎత్తుకొని ముద్దులు పెట్టిన రోజు ఎంత ఉద్వేగం నీలో! గాలిలో తేలిపోతున్నట్టుగా ఉండింది. ప్రపంచంలో అన్నింటికన్నా తీయని ముద్దులలో మొదటిది అదే కదూ! ఆ రోజు నీ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో గుర్తుకుందా? నీ గుండెపై చేయి పెట్టినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో నా మీద, మన మీద. ప్రపంచంలో ఇంకెవరికన్నా ఆ అనుభవం కలిగిందంటావా? మాట్లాడుతూ మాట్లాడుతూ నీ ఒడిలో నేను నిద్రలోకి జారుకుంటే నువ్వు నన్ను ఎంత దయగా చూస్తూ కూర్చునేవాడివి? నేను మాత్రం నువ్వు కునుకు తీసిన మరుక్షణం విరహం భరించలేక తట్టి లేపేదాన్ని. ఎంత పనిలో ఉన్నా నీ ఆలోచన వస్తేనే ఒల్లంతా రోమాలు నిక్కబొడిచేవి. కళ్లు మూసుకొని శ్వాస పీలిస్తే కళ్లల్లో నీ రూపం, కళ్లు తెరిచి శ్వాస బయిటికి ఒదిలేలోపు కళ్లల్లో నీళ్లు నిండేవి. అప్పుడు ఇట్లా దూరం అయిపోతామని ఎవరైనా అని ఉంటే చాలా వెక్కిరింతగా నవ్వి ఉండేదాన్ని నేను. కాని నీకు అప్పటికే తెలుసు కదూ మనం ఎంతో కాలం కలిసి ఉండమని. అందుకే అట్లా నన్ను చూసి ఆ రోజు చిన్న పిల్లవాడిలా కన్నీళ్లు పెట్టుకున్నావ్! చెప్పలేకపోయావా వదిలి వెళ్తానని? ఏమీ మొదటి సారి కాదుగా వదిలి వెళ్లింది? నువ్వు నన్ను వదిలి వెళ్లిన ప్రతి సారీ నేను కొంచెంగా మరణించానే గాని నిన్ను ఏమన్నా నిందించానా? అన్నీ తెలిసినట్టే గాని ఒకోసారి ఏమీ అర్థం కానట్టు చేస్తావు. నాకు బాగా కోపం వచ్చినప్పుడు నిన్ను తిడతానా, ఎంత సంతోషంగా చూస్తావు నన్ను, నీకు ఏది అనాలనిపిస్తే అను అని ఋషిలా కూర్చుంటావు. నీ నిష్ఠూరంలో న్యాయమైన ఆగ్రహం ఉందిలే అంటావు. ఈ మాట అన్నావా, ఓ అది కూడానా అని నవ్వుతుంటావ్! ‘పెద్ద ప్రేమ ఉంది అంటావుగా, ప్రేమ ఉంటే ఇట్లా నిందిస్తావా’, అని అనిపించేట్టు ఓరగా చూస్తుంటావ్. ఒక్క మాట మాట్లాడకుండానే నా మాటలని నేనే ఆచితూచి మాట్లాడేలా చేస్తావుగా! పెద్ద గొప్పలే! నువ్వు నాలాగ ఉండుంటే, నేను నీ లాగా ఉండే ఆవకాశం దొరికేది! అవును గానీ! ముట్టుకుంటే నేను కందిపోతానన్నట్లు నన్ను అంత సున్నితంగా ఎట్లా తాకుతావు? ప్రపంచంలో ఉన్న అందం అంతా నీకే దొరికినట్టు, అంత అపురూపమైన క్షణాలు నీ ఒక్కడికే సొంతమైనట్టు, అంత ప్రేమ, అంత శ్రద్ధ, అంత ఉద్వేగం ఎట్లా సాధ్యమయింది నీకు. నేను ఏ పని చేసినా విశ్వంలో మొదటిసారి ఒక గొప్ప మిరకిల్ జరుగుతున్నట్టు ఎంత సంభ్రమాశ్చర్యాలు నీకు. ఏంటో అంత మోహం, పరవశం. నాకు నేనే ఎంత అందంగా, ఎంత విలువైనదానిగా కనిపించేలా, నాతో నేనే పిచ్చి ప్రేమలో పడేలా చేసావుగా! అబ్బా ఇంత తీయదనం ఉందా నాలో అనిపించేలా! ఏమన్నా అంటే నేనేగా నిన్ను మొదలు గుర్తించింది అంటావ్? ఎంత గర్వమో నీకు? నా గురించా, నాపై నీకున్న ప్రేమ గురించా? అంత గర్వించేవాడివి మాట మాత్రం చెప్పకుండా మాయమయ్యావుగా! నువ్వు లేకున్నా నేను నిశ్చింతగా బతికేస్తానని నమ్మకం నీకు. అందుకే నీవు కనబడకుండా వెళ్లిన మరుసటి రోజు నిన్ను మర్చిపోయాను. నీ గురించి ఒక్కసారీ ఆలోచించలేదంటే నమ్ముతావు కదూ! ఎంత గట్టిదాన్నో తెలుసుగా నీకు. నా మాటలో ప్రశాంతతని చూస్తే ఒకోసారి నీకు భయమేస్తది అన్నావు గుర్తుందా నీకు? అట్లానే ఉన్నాను అంతే ప్రశాంతంగా అప్పుడూ ఇప్పుడూ! కానీ ఒక మాట చెప్పాలి. ద్వేషించాను నిన్ను మనసారా అప్పుడు. జీవితంలో మొదటి సారి నిన్నే ద్వేషించాను. ప్రేమ అంటే ఏమిటో చూపించి ఏమీ పట్టనట్టు వెళ్లావుగా! నీదే గొప్ప ప్రేమ అనుకున్నావు. నీకే నొప్పి తెలుసు అనుకున్నావు కదూ! స్వార్థపరుడివే సుమా! ఇట్లా అంటే మళ్లీ ఆ చూపు, నవ్వు విసురుతావు నాకు తెలుసు! మనం మొదటి సారి కలిసింది గుర్తుందా నీకు? అంతక ముందు కలిసినం కాని అదే మొదటి సారి కలిసినట్టు ఉంటుంది. ఆరోజు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను వాటేస్కున్నానా, పట్టలేని సంతోషం, ఉద్వేగంతో నీ నోటి నుండి వచ్చిన మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగుమంటుంది. ఉన్నంతసేపూ నా చేయి వదల్లేదుగా నువ్వు. నా నోటి నుండి వచ్చే ప్రతి మాటా నీ కళ్లని ఎట్లా వెలిగించినయ్? ఆ వెలుగులో నన్ను నేను చూస్కున్నానులే! ఒక రవ్వంత ప్రేమ కోసం నువ్వు తపిస్తున్న కాలం అది. నేనేమో ప్రపంచం అంతా నాదే అని నిశ్చింతగా జీవిస్తున్న కాలం. లేక అట్లా అనుకున్నానేమో నీవొచ్చేవరకూ! ఎన్ని మాటలు చెప్పావు నాతో. ఎన్ని పాటలు వినిపించావు నాకు. ఎన్ని ప్రేమలేఖలు? అన్నింటిలో నన్ను చూస్కున్నావు. ప్రేమ దేవతని అన్నావు. ఇంత తెలివి, ఇంత పరిణితి నీకు ఎట్లా ఉంది అని నన్ను చూసి అబ్బురపడ్డావు. నేనుంటే చాలు అన్నావు. నేను నిన్ను వదిలి వెళ్తానన్న ఆలోచనకి తల్లడిల్లిపోయేవాడివిగా! ఆరోజు ఎముకలు కొరికే చలిలో ముసురు పడుతుండగా నేను వెళ్లిపోతుంటే నన్ను చూస్తూ ఎంత సేపు నిలబడిపోయావు? దూరమనే ఆలోచన భరించలేక అసలు ఎప్పుడూ కలవకుండా ఉండుంటే బాగుండు అనేవాడివి. నేను నిన్ను విడిచి ఎక్కడికీ పోనని వాగ్దానాలు చేసేదాన్ని. దూరమై అనుకోకుండా మళ్లీ కలిసినప్పుడు నువ్వు నన్ను ఒదిలావా, నేను నిన్నా అని రోజుల తరబడి తెగని వాదనలు చేసాముగా! వదలడం నువ్వు మొదలుపెట్టావు, నేను ముంగించాను అని అంటాను నేను. నీకు తెలుసుగా అయితే దెగ్గర, లేకపోతే దూరం, మధ్యలో ఉండడం నాకు చేతకాదు. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. నువ్వూ గట్టివాడివే! గుండెని ఇట్టే రాయిని చేస్కోగలవు. అంత సహజంగా నీ ప్రేమకి స్పందించి నిన్ను నా ఒడిలో చేర్చుకున్న నా కన్నీళ్లు నిన్ను కదిలించలేకపోయినయ్ కదా. నేను ఎంత దెగ్గరగా వస్తే అంత దూరంగా వెళ్లావుగా! దూరంలో దెగ్గర వెతుక్కుంటావు. నీకు దూరమే కావాలంటే వీడ్కోలు పలకమన్నాను. గుర్తుందిగా ఆ రాత్రి ఇద్దరం ఒకరినుండి ఒకరం ఏదీ ఆశించకుండా మనసు విప్పి మాట్లాడుకున్న రోజు. మన నిద్రలేని రాత్రులని మించే రాత్రులు కూడా ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నావా. ఎప్పటికీ దూరం అవుతామనే ఎరుక కలిగినప్పుడే అంత దెగ్గర వీలవుతుందేమో కదా! ఎన్ని నవ్వులు, ఎన్ని కన్నీళ్లు. అదే చివరి రాత్రి అని తెలిసినా ఎంత హాయిగా ఉండింది ఆ రాత్రి. విడిపోవడం ఇంత తీయగా ఉంటుందంటే ఇట్లా మళ్లీ మళ్లీ విడిపోదాం అని అన్నావు. ఒకోసారి అనిపిస్తుంది ప్రపంచంలో అందరికీ ఒక్కసారన్నా మనకు కలిగిన అనుభవం కలగాలని. నిన్ను ప్రేమిస్తే ప్రపంచాన్ని ప్రేమించినట్టేగా! అందుకే అట్లా అనిపిస్తుందేమో. జీవితంలో ఇట్లాంటి ప్రేమ ఎంత మందికి తెలిసి ఉంటుందో కదా! అబ్బా ఎంత కాలిపోయాను? ఎంత కరిగిపోయాను? నా ఉద్వేగాల పరిమితులని పరీక్షించిందిగా నీమీది ప్రేమ! ఎంత నొప్పి కలిగితే అంతగా నొప్పిలోకి ఒదిగానే కాని పారిపోలేదుగా! ఎందుకు నన్ను నేను అంతగా పరీక్షించుకున్నానో తెలియదు. ఎందుకో పిచ్చిగా నీకు ప్రేమ అంటే ఏంటో చూపించాలిపించింది. ‘నిజమైన ప్రేమ ఉంటే ఇట్లా చేస్తావా,’ అనే అవకాశం నీకు ఇవ్వొద్దు అనిపించింది. ఇవ్వలేదు కదూ! అది నా గొప్పంటావా, నీ గొప్పంటావా? నాదే అనిపిస్తుందిలే కాని మరింకెవరూ నాకు అట్లా అనిపించేట్టు చేయలేదుగా. అట్లా అని నేనంటే ప్రేమ అనేది సొంత అనుభవానికి సంబంధించింది, అవతలి మనిషి మీద అంతగా ఆధారపడదు అని అంటావు. అట్లయితే అందరి మీద అదే భావం, ఉద్వేగం కలగదు కదా అని నేను అంటాను. మన మాటలకేమిలే అంతం లేనివి. కాని నీకో విషయం చెప్పాలి. నీవు ఒదిలిపెట్టినా నీకోసం నాలో వెలిగిందేదో నన్ను ఒదిలిపెట్టడం లేదు! నాకు నేనే ఎంతో అందంగా, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, ప్రపంచం మీద ఎనలేని ప్రేమతో కనిపిస్తున్నాను. జీవితం మీద అపారమైన ఆశతో, ఆర్ద్రతతో, మునుపటి కన్నా విశాలమైన చూపుతో నన్ను, నా చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తున్నాను. నాకు తెలుసులే నువ్వేమంటావో! నువ్వే నన్ను మొదలు గుర్తించాననేగా! అబ్బో గొప్పలే! *
|
అలాంటి ఒక్క ప్రేమ లేఖ!
ఎంత నొప్పి కలిగితే అంతగా నొప్పిలోకి ఒదిగానే కాని పారిపోలేదుగా! ఎందుకు నన్ను నేను అంతగా పరీక్షించుకున్నానో తెలియదు.
Very written Chaitanya! Very fluid and poetic… keep writing!
Thank you anna!
లోతైన భావం. గొప్ప అంతర్దృష్టి. తనని తాను కాపాడుకుంటూ చేసిన ప్రేమ యుద్ధం. గాఢమైన వ్యక్తీకరణ. అభినందన.
Thank you Krishna!
Excellent Chaitanya. You got the finest talent of expressing different aspects of love in a sensitive, convincing , logical and poetic way. I thought of quoting my fav lines from your write up, but stopped doing so as I should have to type in the whole story. mottam rAsindantaa oka adbhuta maNihAram aitE, aa muktaayimpu monna valentines day ki mee aayana konicchina diamond pendant. Please keep writing more and inspire me to write something meaningful like you.
Thank you Raghu!
👌ఇంత ఉద్వేగాన్ని ఎంత చక్కగా మాకు చేర్చారు.మాటల్లేవు అంతే.నిజమైన ప్రేమ అనే శక్తి చేరే ఎండింగ్ మీరు చెప్పినదే.బహుశా ఇది ఎవరికీ తెలియక పోవచ్చు.తెలిసినా అనుభూతి చెందక పోయి ఉండొచ్చు.బుద్ధుడు తన సాధన తోనే జ్ఞానోదయం పొందాడు.బోధి వృక్షం పాత్ర ఏముంది.అది మీలోది,మీరే తెచ్చుకున్నారు. చక్కగా వ్రాసారు 👌👌
Thank you sasi kala garu. Nijamaina prema eppudu manishiki tanani tanu unnatam cheskunela spurtinistundani nenu nammutanu.
Profound expression of love.
చైతన్యా
ఇది నేను రాసుకున్నట్టుంది
Thank you, andi!
చైతన్యా ! ఏమి చెప్పాలి మీకు. ఓ గాఢమైన ఆలింగనం అంతే. ప్రేమ భావం ఎవరినుంచి విన్నా మనదే అనిపిస్తుంది.ప్రేమించే మనసులన్నీ సమాంతరంగా వుంటాయేమో? ప్రేమ ఓ జ్ఞాన స్థితి, ఓ ధ్యాన స్థితి అంతే.థాంక్యూ ఈ ప్రేమ తరాంగాలకు.అభినందనలు పంచినందుకు.
Thank you so much!
Wow, it’s beautiful Chaitanya. It’s amazing that you’re describing the most intense form of love, yet, you managed to preserve the individuality of the person.
Soul is not lost in the search of soul mate.