అమ్మా! కోటేశ్వరమ్మా!! శతమానం భవతిని కూడా నేడు (05-08-2018) అధిగమించబోతున్న మా అమ్మకు శతసహస్ర వందనాలు!
ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాలలో నీవు పాలుపంచుకోని శాఖలు లేవు. నాటి నుంచి నేటిదాకా నీవు ఉత్సాహపరచని యువతీ యువకులు లేరు. ‘అవని తనయ లేని ఆవాసం (ఇల్లు) పాడువడిన కొంపతో సమానం’ అంటారు. రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, కళాదిరంగాలలో నీవు మెట్టని చోటులేదు. ముట్టని శాఖలేదు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పిలుపునందుకుని ఒంటిమీది నగలు వలిచేసి దేశ స్వాతంత్ర్యకాంక్షకు ఉడతాభక్తిగా సమర్పించిన అనేకమంది మహిళలలో నీవు ఒక ప్రసిద్ధురాలివి. ఖద్దరు ప్రచారంలో పాల్గొన్న మహిళామణివి! ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊతగా, నీవు బుర్రకథ దళాల్లో పార్టీ సోదర మహిళలతో కలిసి రసవత్తర కళాఖండాలను సృష్టించావు తల్లీ! కథన సాహిత్య సృష్టిలోనూ ప్రజల కష్టసుఖాలకు, సంతోష సమయాలకు నిన్నటిదాకా కూడా తోడునీడై నిలిచిన నాయకురాలివి నీవు. అజ్ఞాతవాసంలోనూ, బయటా నీవు అనుభవించిన కష్టకాలాన్ని, బయటకు వచ్చిన పిమ్మట నీవు చేపట్టిన ఏ వ్యాపకంలోనూ అంతే మొక్కవోని శేముషీతో ఈ క్షణం దాకా కూడా విప్లవభావాలను, సంస్కరణాభిలాషను ఎవరి మెరమెచ్చుల కోసమో వదులుకోలేని విశిష్టవ్యక్తిత్వం నీది ‘తల్లీ కోటేశ్వరమ్మా’!
నేడు దేశంలో పాలకుల ప్రజావ్యతిరేక పాలనను ప్రతిఘటించకుండా, నిర్బంధ దోరణులను, దళిత మైనారిటీల వామపక్ష శక్తుల అణచివేతలపై పట్టీపట్టని ధోరణి ప్రబలడాన్ని శఠిస్తూ, బలమైన పౌరహక్కుల ఉద్యమ నిర్మాణం జరగాలని, పౌరసమాజాన్ని వంద సంవత్సరాల వయస్సు దాటుతున్న సమయంలో కూడా మేలుకొలుపుతున్న నీకు వందనాలు.
‘తల్లీ’, చివరకు నీ మనసు మాదిరే నీ వర్ఛస్సు కూడా తోడై పోతనామాత్యుడు అన్నట్లుగా ‘సర్వశుక్లా సరస్వతి’- నిలువెల్లా స్వచ్ఛత తొణికిసలాడుతోంది నేటికి!
ఇక్కడ చండ్ర రాజేశ్వరరావు ఆశ్రమవాసిగా కూడా మా అందరి మధ్యా కొలది సంవత్సరాలు గడిపి, వీలు చిక్కినప్పుడల్లా ఆశ్రమంలో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ నీవు అందించిన విజ్ఞానదాయకమైన సందేశాలను మేము మరువలేం! ‘ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్’ అన్న చిలకమర్తి సూక్తికి నీవు ప్రత్యక్షరూపంగానే భావిస్తున్నాను. నీవు స్వయం విద్యా స్వరూపిణివి, జ్ఞాన రూపిణివి, వస్తుతః సాత్వికతతో పాటు వక్రించే సమాజ పరిస్థితుల పట్ల నీవు ఉగ్రరూపిణివి, తిరుగుబాటుదారువి, విప్లవకారిణివి. సి.ఆర్.ఫౌండేషన్ ఆశ్రమవాసులతో ఆమె ఎంతో కలివిడిగా ఉండేవారు. నన్ను ‘అబ్బాయి’, ‘బాబు’ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఆ తల్లీకొడుకుల బంధాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నీకివే నా వందనాలు, అభివందనాలు.
అంతేనా, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలుబాటలు పట్టిన తరువాత ఒకే ఉద్యమంలో పాల్గొని ప్రజలకు స్ఫూర్తినందించిన రోజులు మర్చిపోయి, నేడు ముఖముఖాలు కూడా చూసుకోకుండా స్పర్థలతో ఉమ్మడి లక్ష్యానికి దూరమవుతున్నందుకు పలుమార్లు ఆవేదనను వ్యక్తంచేసిన ఘడియలను మరువలేం, మరువలేం ‘తల్లీ కోటేశ్వరమ్మా’!
– ఏబీకే
ఫోటో: అల్లూరి సమాధి దగ్గిర నివాళి
Add comment