విశ్రాంతి కావాలి
ఆరడుగుల పృధ్వీ గర్భమో
అడుగు మాతృ గర్భమో
ఇంద్రియాలు మూసుకొని
నెత్తురు చల్లబడి, నిలకడై
కడకు నిలిచిపోవాలి మనసూ, కాయమూ
కన్నీరు లేకా, ప్రశ్నలు లేకా
పరుగులు మరుగై, దారులు దగ్ధమై
నిర్దేహమై స్థిరమవ్వాలి
ఒకింత మెల్లనవ్వాలి
విచలిత సౌందర్యాలూ
ముడుతలై శల్యమౌతున్న కాంతి ఛాయలూ
యవ్వనారంభంలో పరుగులిడే కాళ్ళూ, కటి స్థలాలూ
కోర్కెల వైఫల్యాల్లో దుగ్ధమయ్యే నోళ్ళూ
అహంభావ మనస్సులూ
మర్మగర్భ వాంఛలూ
అవాంచిత కరుణలూ, కామ కర్మ కాండలూ
ద్వేషాలూ, ఈర్శ్యలూ, మోసాలూ, అబద్ధాలూ
ఆత్మ ధర్మం గాయమైన జీవన బీభత్సాలూ
కడతేరి పోవాలి. విశ్రాంతి కావాలి
నల్లని కాంతి లాంటి, స్థిరమైన వేగం లాంటి
నిర్ శబ్దం లోకి
అస్వరాల్లోకి, అవర్ణంలోకి. నిరాకారంలోకి
పాదాలు కడపనవసరంలేని ప్రయాణంలోకి
శాంతిలోకి, శాంతిలోకి-
** ** **
సైదాచారి గురించి అఫ్సర్ వ్యాసం ఇక్కడ చదవండి.
మీ కవిత చాలా బాగుంది.దాని గురించి విశ్లేషణ చేసే స్థాయికి నేను ఎదగ లేదు .చదువుతుంటే హృదయం లో ఏదో తెలియని బాధ …
సైదా చారి నాకు బాగ ఇష్టమైన కవుల్లో ఒకరు.చిన్న పరిచయం.చనువుకూడా లేదు.కాని ఆయన కవిత్వం నాకు చాలా ఇష్టం.
ఈ కవిత “ఆత్మ గర్భం గాయమైన జీవన బీభత్సాన్ని “గురించి చెప్పింది.మనలో మనకు కనబడనిమనుషులు,ఇతరుల్లో మనం చూడలేని వాళ్ళు ఈ కవితలో కనిపిస్తారు.
దుగ్ధమయ్యే నోళ్లు -దగ్ధమయ్యే నోళ్లు
నిర్ శబ్దం -నిశ్శబ్దం
అవాంచిత – అవాంఛిత
ఇలా కొన్ని పొరపాట్లు కనిపించాయి.కొన్ని సార్లు సైదాచారి ప్రయోగాలు చేసేవారు.ముందలాగే అనుకుని సందేహంతో అడుగుతున్నాను.
ఒక మంచి కవితనిచ్చినందుకు సంపాదకులకు ధన్యవాదాలు.సీదా చారిని మళ్ళీ మనసులో నింపినందుకు కూడా.