తమిళం : ప్రసన్న
అనువాదం: గౌరీ కృపానందన్
సెల్వరాజు సరస్వతి ఇంటి గుమ్మం ముందు వచ్చి నిలబడ్డాడు. ఒక్క నిమిషం తటపటాయించి, తరువాత తలుపు కొట్టాడు.
“ఎవరదీ?” అడుగుతూ తలుపు తీసిన సరస్వతి ఒక్క క్షణం విస్తుపోయింది. “మీరా?”
“మా అయ్యని పిలువు.”
“ఆయన ఇక్కడ…”
“నీ దగ్గర నేను కధలు వినడానికి రాలేదు. లోపలికి వెళ్లి పంపించు.”
ఆమె లోపలికి వెళ్ళిన కొద్ది సేపటికి కాత్తముత్తు బెదిరిపోయినట్లుగా, కుంచించుకుపోతూ వచ్చి నిలబడ్డారు.
అతను అడిగాడు. “కులాసాగా ఉన్నావా నాన్నా?”
“ఎందుకురా అలా అడుగుతున్నావు?” అన్నారు తగ్గు స్వరంలో.
సెల్వరాజు తండ్రిని గట్టిగా పట్టుకుని లాక్కుంటూ తోట వైపు నడిచాడు. “రా చెబుతాను. నువ్వు ఇంటివైపు వచ్చి ఒక వారం పైనే అవుతోంది. అందుకే కులాసాగా ఉన్నావా అని అడిగాను. ముందంతా భార్యా, పిల్లల జ్ఞాపకం కొంచమైనా ఉన్నందు వల్ల రాత్రుళ్ళలో అయినా ఇంటి వైపు వచ్చే వాడివి. ఇప్పుడేమో కొత్త మోస్తరుగా అలా కూడా రావడం లేదు. నువ్వు చేసేది ఏమైనా బాగా ఉందా?”
కాత్తముత్తు తలవంచుకుని అలాగే నిలబడి పోయారు.
“ఊరు ఊరంతా అసహ్యంగా మాట్లాడుకుంటోంది, నీ గురించీ, నువ్వు ఉంచుకున్నావే… ఆ సరస్వతి… ఆమె గురించీను. ఒక్కొక్కడి పీక పట్టుకుని కొరికేద్దాం అని అనిపిస్తోంది. కానీ వాళ్ళు మాట్లాడుతున్నదంతా నిజమే కదా.”
“అది… అలాంటిది ఏమీ లేదు సెల్వరాజూ…”
“ఏం లేదు? నేనేమైనా చెవిలో పువ్వులు పెట్టుకుని ఉన్నానా? పెళ్లై తాళి తెగిన ఒకామెతో రాత్రీ పగలూ లేకుండా, ఒక వారంగా ఇంటి వైపు కూడా రాకుండా ఉండి పొయావంటే ఏంటి అర్ధం? నాకు వయస్సు పాతిక. నీకు నలబై ఐదేళ్లకు పైగా. ఈ వయస్సులో నేను తప్పు చేసి, తాగి తందనాలాడి. ఏ ఆడదానితోనైనా బరి తెగించి తిరిగితే…. నువ్వు… నువ్వు నన్ను నిలదీసి అడగాలి. ఇక్కడ ఏమయ్యిందంటే నేను నిన్ను మందలించాల్సి వస్తోంది. అంతా నా తలరాత.”
“నా తలరాత కూడా! లేకపోతే ఇలా మాటలతోనే తూట్లు పొడుస్తూ ప్రాణాలు తీసే భార్య నాకు వస్తుందా?”
“వచ్చేసింది కదా. ఎలాగో అలాగ బ్రతకాలి మరి. నేను నీ కోసం వకాలతు పుచ్చుకుని అక్కడ అమ్మ దగ్గర మాట్లాడి వస్తున్నాను. ఏది ఏమైనా భార్య అంటూ మా అమ్మ ఉన్నంత వరకూ, నువ్వు ఇలా దారితప్పి నడచుకోవడం కొంచం కూడా బాగా లేదు. ఇదిగో… ముందే చెబుతున్నాను.”
“సెల్వరాజూ! నా బాధ నీకు అర్ధం కావడం లేదు. ఇంటికి వస్తే నాకు మనశ్శాంతి లేదు. నేను వెళ్తున్న దారి తప్పే అయినా కూడా అందులో కాస్త మనశ్శాంతి, సంతోషం ఉండడం వల్ల సాహసించాను. ఈ రోజు వరకూ మీ అమ్మ నాకు భార్యగా ఉండింది లేదు. ఈ ముప్పై ఏళ్లుగా నాకు ఆమె భర్తగానే ఉంటూ వచ్చింది. అదంతా నీకు అర్ధం కావడం లేదు.” కాత్తముత్తు నిట్టూర్పు విడిచారు.
“అదంతా నువ్వు ఎన్ని చెప్పినా, ఇప్పుడు నీవు వెళ్తున్న దారి సరికాదు. ఇదంతా వదిలెయ్యి. రాత్రికి మర్యాదగా, పద్దతిగా ఇంటికి వచ్చి చేరు. రాత్రి మటుకు నువ్వు రాకపోతే, నేను కొడవలితో సరస్వతి ఇంటికి రావలసి వస్తుంది. నన్ను అనవసరంగా ఒక హంతకుడిని చెయ్యకు. ముందుగానే చెబుతున్నాను.”
కాత్తముత్తు చేష్టలు ఉడిగినట్లు అలాగే నిలబడి పోగా, సెల్వరాజు గబ గబా అక్కడి నుంచి నిష్క్రమించాడు.
సెల్వరాజుకు ఊహ తెలిసినప్పటి నుండే అతని తల్లి తాయమ్మ మృదువుగా మాట్లాడడం గానీ, భర్తతో సంతోషంగా నవ్వడంగానీ ఎవరూ చూసింది లేదు. ఇంట్లో ఎప్పుడూ కాత్తముత్తుతో గొడవలే, కొరడాతో కొట్టినట్లుగా కటువైన మాటలే.
ఆర్ధిక పరంగా నాన్న కంటే అమ్మకి వసతి ఎక్కువ. అయినా కూడా దూరపు చుట్టరికం తెగి పోకూడదని తాతయ్య… అమ్మ తండ్రి వరకట్నం అన్న పేరుతో డబ్బు ఆశను చూపించి నాన్నకు కట్టబెట్టాడు. తనకు ఇష్టం లేకుండా జరిగిన ఈ పెళ్ళిపట్ల అమ్మకు అంతులేని ద్వేషం.
డబ్బు సమస్య తలెత్తినప్పుడల్లా అమ్మ చేతిని ఎదురు చూడాల్సిన నిర్భందం నాన్నకు. అమ్మకు మహదానందాన్ని, నాన్నకు తీరని బాధను కలిగించిన రోజులు అవి. డబ్బు ఇచ్చే ముందు, వసతి లేని చోట వచ్చి చేరినందువల్ల ఇలా తన బ్రతుకు తెల్లవారి పోవడం గురించి ఆ రోజంతా రాగాలు తీసి శోకాలు పెట్టేది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నాన్నను వేరే ఏదీ ఆలోచించ నివ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేది. మాటల తూట్లకు మనసు గాయపడి మూగవాడిలా కుటుంబం అన్న బంధంలో నాన్న చిక్కడి పోయి గిలగిలలాడుతూ ముప్పై ఏళ్ళు ఎలాగో గడిపారు.
అమ్మ దగ్గర డబ్బు అడక్కూడదు అన్న వైరాగ్యంతో నాలుగు మైళ్ళ దూరంలో ఒక పత్తి కర్మాగారానికి ఉద్యోగం కోసం వెళ్ళారు. ఆరు నెలలకు ముందు కర్మాగారంలో బోనస్ సమస్యలు తలెత్తి గొడవలు చెలరేగాయి. కత్తిపోట్లు జరిగి ఇద్దరు కార్మికులు మరణించారు. కర్మాగారం మూతపడింది.
కుటుంబం పేదరికంలో మగ్గ సాగింది. అమ్మ గొంతు మాత్రం కొంచం కూడా తగ్గనే లేదు. ‘జీవితంలో ఇకపైన నాకు నా గొంతు మాత్రమే తోడు’ అన్నట్లుగా అమ్మ మాట్లాడింది… మాట్లాడింది. మాట్లాడుతూనే ఉంది.
ఈ మధ్యలో నాన్న దారి తప్పాడు. కర్మాగారంలో కత్తిపోటుకు గురై చనిపోయిన ఆరుముగం ఇంటికి పరామర్శించడం కోసం వెళ్ళినప్పుడే నాన్న సరస్వతిని చూసారు. సెల్వరాజు కూడా అప్పుడు తోడుగా వెళ్ళాడు.
సరస్వతి ఆరుముగం భార్య. పెళ్లై ఆరునెలలు కూడా అవలేదు. ఇప్పుడు తెల్లచీర కట్టుకుని విధవగా ఆమె నిలబడి ఉండటం చూస్తే సెల్వరాజుకు కూడా కష్టంగా అనిపించింది.
నాన్నకు కూడా అంతకన్నా ఎక్కువగా కష్టంగా అనిపించింది అని పోను పోనూ తెలియ వచ్చింది. తరచుగా ఆరుముగం ఇంటికి రాకపోకలు ప్రారంభించారు.
ఊరి జనం నోటికి తాళం వెయ్యడం కుదురుతుందా? పదిమందీ కలిస్తే ముఖ్యంగా దీని గురించే మాట్లాడుకునే వాళ్ళు. సెల్వరాజు ఊళ్ళో నడచి వెళ్ళడానికి సిగ్గు పడ్డాడు. ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకోవడం అతని మనసును గాయపరిచింది. మధ్యాహ్నం బోజనానికి వెళ్లినప్పుడు తాయమ్మ ఆ పుండును కెలికి మరింత ధూపం వేసింది.
“ఆషాడ మాసంలో నాటిన విత్తనం, పాతికేళ్ళ వయసులో కలిగిన కొడుకు ఆపత్కాలంలో పనికి వస్తాయని అంటారు. నువ్వూ ఉన్నావు! తండ్రి లాగే కొడుకు కూడా తిరుగుబోతు.” తాయమ్మ సన్నాయి నొక్కులు నొక్కింది.
“కాస్త ప్రశాంతంగా అన్నం తిననివ్వమ్మా” అంటూ సెల్వరాజు విసుక్కున్నాడు.
చేపలను కడిగిన నీటిని పెరటి తోటలో పారబోసి, పొగాకు రసాన్ని ఉమ్మేసి వచ్చింది తాయమ్మ.
“ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లను పెట్టుకుని నేను అల్లాడుతున్నాను. ఈ మనిషి నడుచుకునే తీరును నిలదీసి అడగడానికి ఊళ్ళో దిక్కు లేదు. వేసవి కాలంలో వాన కురవదా? మేకపిల్లలు చావవా? రూపాయకు ఎనిమిది మేకలను అమ్మక పోతాడా అన్నట్లు ఊళ్ళో ప్రతీ ఆడదీ పక్కింటి మగాడి కోసం కాచుకుని కూర్చుని ఉంది. ఒక వారంగా ఆ మనిషి ఇంటి వైపుకు రాలేదు. ఇదంతా చూస్తూ నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలి?”
“ముప్పై ఏళ్లుగా మాట్లాడి మాట్లాడి మా నాన్నకు మనశ్శాంతి లేకుండా చేస్తూ వచ్చావు. నిన్ను చూస్తే మరి ఎందుకు పారిపోకుండా ఉంటాడు? నీ దగ్గర ఎలాగూ సంతోషంగా ఉండలేక పోతున్నాడు వేరే ఎవరి దగ్గరైనా ఉంటే ఉండిపోనీ రాదు?”
“ఒరేయ్! ఒరేయ్! గాడిద పాలు ఎంత ఇచ్చినా, అదీ ఆవు ఒకటిగా అయిపోతాయా? వెయ్యి మాటలన్నా తాళి కట్టించుకున్నదాన్ని నేను. ముప్పై ఏళ్లుగా సంసారం చేస్తున్నాను. తాళి కట్టిన దానితో సంతోషంగా లేని మగాడు పరాయి ఆడదానితో సంతోషంగా ఉండగలడా? ఇల్లూ, వాకిలీ, కుటుంబం, పిల్లలూ అంటూ అన్నీ ఉన్న తరువాత కూడా, ఒక ఆడదానితో సంసారం చేసిన తరువాత కూడా, పరాయి ఆడదాని పొందు కావాల్సి వచ్చిదంటే ఆ మనిషికి ఎంత హీనమైన బుద్ది? ఉన్న కుటుంబానికి సంపాదించి పెట్టి పిల్లాపాపలను గట్టెక్కించి కుదురుగా ఉండడానికి తెలియక పాయె. నేను అడుగుతాను, కొయ్యడం చేతగాని వాడి నడుంకు ఎందుకురా వెయ్యి కొడవళ్ళు?”
“మొగుడు అని కూడా చూడకమ్మా నువ్వు. తాళి కట్టిన వాడు కదా, ఇన్నేళ్ళు కలిసి కాపురం చేసిన వాడు కదా అని కూడా అనుకోవు. ఒక్క దెబ్బకు రెండు ముక్కలు అన్నట్లుగా మాట్లాడు. మాటలతోనే మనిషిని ,ముక్కలు చేసి పోగులు పెట్టు. అప్పుడే నీకు సంతోషం. ఎవరూ నీతో మాట్లాడి గెలవకూడదు అన్నది నీ పంతం. కొరడాతో కొట్టినట్లు మాటలతోనే చంపుతున్నావు. అణకువగా ఉండడం, పట్టూ విడుపులతో సంసారం చెయ్యడం నువ్వు మర్చి పోయావా? ఇప్పుడు కూడా ఏమీ కొంపలు మునిగి పోలేదు. గొడవ పెట్టుకోను. ఆ మనిషిని అనవసరంగా ఆడి పోసుకొను అని నువ్వు ఒక్క మాట చెప్పు. నేను నేరుగా వెళ్లి ఆ మనిషిని లాక్కుని వస్తాను. నీవల్ల అది అవుతుందా? నస పెట్టకుండా మా నాన్నను మనశ్శాంతిగా బ్రతక నిస్తావా?”
“నా వల్ల అయ్యేదీ కానిదీ అలా ఉంచు. నువ్వు పిలిస్తే ఆ మనిషి వచ్చేస్తాడని అనుకుంటున్నావా? అది నీ వల్ల అవుతుందా అని చూడు. నా ముందు కోపంతో ఎగిరెగిరి పడుతున్నావే? తడి ఉల్లిపాయకి లెక్కలేనన్ని పొరలు అన్నది సరిగ్గానే ఉంటుంది కాబోలు.”
*****
వీధి మలుపులోనే చెల్లెలిని చూశాడు సెల్వరాజు.
“చెవ్వందీ! ఎక్కడికి వెళ్తున్నావు?”
“అన్నయ్యా! నాన్న వచ్చేసాడు. అందుకే పులుసు పెట్టడానికి కూరగాయలు తేవడానికి వెళ్తున్నాను.”
“రాత్రి పూట ఊళ్ళో ఎక్కువ సేపు తిరగకు. త్వరగా వచ్చెయ్యి.“
ఇంటి వైపు నడుస్తున్నప్పుడు సెల్వరాజుకు సంతోషంగా అనిపించింది. తన మాటకు విలువ ఇచ్చి నాన్న ఇంటికి వచ్చేసాడు.
గుమ్మంలో చెప్పులు వదులుతుండగా ఢమాల్ అంటూ కుండ పగిలిన శబ్దం వినిపించింది. దాని వెంట తాయమ్మ గొంతు…
“నీ కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెట్ట! ఎవరిని అడిగి నువ్వు ఇంట్లోకి వచ్చావు? నీకోసం ఏ లంజ అయినా ఇక్కడ బెంగ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉందేమో అని చూసి పోదామని వచ్చావా?”
“ఉష్! అరవమాకే… రాత్రి పూట అరిచి గొడవ పెట్టుకోమాకే. ఇప్పుడు అన్నం పెట్టు. ప్రొద్దున్న గొడవ పెట్టుకో.” కాత్తముత్తు గొంతు భయం భయంగా వినిపించింది.
“ఎందుకూ? ఇక్కడ కొత్తగా అన్నం ఎందుకు? ఓదార్పు చెబుతానని ఆరుముగం ఇంటికి వెళ్లి ఆ పిల్లను లొంగ దీసుకున్నావుగా? అక్కడ కూడు పెట్టనని చెప్పేసిందా?”
“పాత విషయాలను ఇప్పుడు ఎందుకు కెలుకుతున్నావు?”
“నీ వల్ల నేనేం సుఖం అనుభవించాను? చుట్టరికం అంటూ వసతి లేని చోట నన్ను కట్టబెట్టినందుకు మా అయ్యని చెప్పుతో కొట్టాలి. నీ వల్ల నా బ్రతుకే పాడై పోయింది. ఖర్మగాలి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాను. నీకు బదులుగా వేరే ఎవడికైనా కొంగు పరిచి ఉంటే నేను సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉండేదాన్ని. ఇదిగో చూడూ… ఇప్పుడు చెబుతున్నాను. మట్టిని దున్ని చెడిన వాడూ లేడు. ఇసుకను దున్ని బ్రతికిన వాడూ లేదు. నాకు నువ్వు ద్రోహం చెయ్యాలని అనుకున్నా వంటే…”
“అమ్మా!!”
ఆ పైన సహించుకోలేనట్లు తూఫాను లాగా లోపలికి దూసుకు వచ్చాడు సెల్వరాజు.
అతను అరిచిన అరుపులో తాయమ్మ నోట మాట రానట్లు నిలబడి పోయింది. కాత్తముత్తు అదిరిపడినట్లుగా నిలబడి పోగా, వేరే ఏమీ మాట్లాడకుండా సెల్వరాజు ఆయన్ని బరబరా లాక్కుంటూ గుమ్మం వైపు తీసుకు వచ్చి అరుగు మీద కూర్చోబెట్టి తలుపును దగ్గరగా వేశాడు.
“ఛీ… ఛీ … ఈ ఇంట్లో కొంచం కూడా మనశ్శాంతి లేకుండా పోయింది . అమ్మనా అది రాక్షసా? గొంతా అది? ముప్పై ఏళ్లుగా ఎలా నాన్నా దీన్ని భరించావు? ఎలా తట్టుకున్నావు?”
కాత్తముత్తు మౌనంగా వీధి వైపు చూస్తూ అలసి పోయినట్లుగా కూర్చుని ఉండి పోయారు.
అరుగు మీద కూర్చుని నాన్నను చూస్తున్న వాడల్లా ఉలిక్కి పడ్డాడు. కన్నీళ్లు ధారగా ఆయన కళ్ళ నుంచి జారుతూ ఉన్నాయి.
చటుక్కున ఆయన దగ్గరికి వెళ్లి భుజాలు పట్టి కుదిపాడు. ”ఏంటి నాన్నా ఇది చిన్న పిల్లవాడిలా?”
కాత్తముత్తు కళ్ళు తుడుచు కుంటూ అటువైపు తిరిగారు.
“నాన్నా! నేను ఒక విషయం అడుగుతాను. ఆ సరస్వతి ఎలాంటి మనిషి?”
కాత్తముత్తు ఉలిక్కి పడ్డారు.
“అంటే… ఆమైనా నిన్ను సంతోషంగా ఉంచుతోందా? అక్కడ ఉంటే నీకు కొంచమైనా మనశ్శాంతిగా ఉంటుందా?” కుతూహలం కొద్దీ అడిగాడు సెల్వరాజు.
కాత్తముత్తు ఏమీ జవాబు చెప్పకుండా వీధినే చూస్తూ ఉండి పోయారు.
“నేను చెప్పవచ్చేది ఏమిటంటే, నువ్వు వెళ్ళు. ధారాళంగా వెళ్ళు. నీకు ఇష్టంగా ఉంటే, ఆ సరస్వతి నీకు నిజంగానే సంతోషం ఇస్తుంది అంటే వెళ్ళు. కానీ ఊళ్ళో వాళ్ళ నోటికి ఎందుకు పని కల్పిస్తున్నావనే అడుగుతున్నాను. ఒక పసుపుతాడు కట్టెయ్యరాదూ. నీ కొడుకుని నేను. నేను ముందు నిలబడి పెళ్లి జరిపిస్తాను. నిజంగానే నీకు అది సంతోషంగా అనిపిస్తే, ఇన్నేళ్ళుగా నువ్వు మా అమ్మ దగ్గర అనుభవించిన చిత్రవధకు ప్రాయశ్చిత్తంగా నేను ఈ పనిని చేస్తాను. ఎందుకంటే, ‘మీ నాన్న ఉంచుకున్నది ఈమెనే’ అని ఇంకొకడు చెప్పడం కన్నా, ‘మీ పిన్ని వెళుతోందిరా’ అని నలుగురూ చెబితే మర్యాదగా ఉంటుంది చూడూ.”
కాత్తముత్తు చాలాసేపు శిలలాగా కూర్చుండి పోయారు. తరువాత మెల్లిగా లేచి ఏమీ మాట్లాడకుండా సరస్వతి ఇంటి వైపు నడిచి వెళ్ళసాగారు.
తలుపు చాటు నుంచి తాయమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది.”ఓరీ పాపిష్టుడా! ఆ మనిషిని వెళ్లి పొమ్మని చెప్పేశావు కదరా! అయ్యో అయ్యో! ఆ మనిషి వెళ్లిపోతూ ఉన్నాడే? నువ్వు బాగా ఉంటావా? నువ్వు నా కొడుకువేనా?”
అరవటం మొదలు పెట్టిన తాయమ్మని సెల్వరాజు ఇంట్లోకి తోశాడు.
“మధ్యాహ్నం నేనే మా నాన్న దగ్గిరికి వెళ్లాను. ఆ మనిషి కోసం నువ్వు బెంగపెట్టుకున్నావేమో అని అప్పుడు అనిపించింది. ఇప్పుడే అర్ధం అయ్యింది. నోరు లేని ఆ అమాయపు ప్రాణిని అణిచి పెట్టి నీ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఆశ పడుతున్నావని. ఇద్దరు పిల్లలని కన్న తరువాత కూడా, ముప్పై ఏళ్ళు సంసారం చేసి అన్నీ అనుభవించిన తరువాత కూడా, ఇంకొకడికి కొంగు పరిచి ఉంటే సుఖంగా ఉండేదాన్ని అని అన్నావు చూడూ. నాకే కంపరంగా అనిపించింది. మా నాన్నకు ఎలా ఉండి ఉంటుంది? మానసికంగా వ్యభిచారం చేస్తున్న నీ కన్నా శారీరకంగా వెయ్యిసార్లు వ్యభిచారం చేసినా మా నాన్న ఒక మెట్టు పైనే. తాళి కట్టిన పాపానికి మా నాన్న నీతో ముపై ఏళ్ళు ఉన్నాడు. కన్న పాపానికి నీకు తలకి కొరివి పెట్టే దాకా నేను మాత్రమే నీతో ఉంటాను. మాట్లాడకుండా పోయి పడుకో.”
సెల్వరాజు బైటికి వచ్చి వాకిటి తలుపును గట్టిగా మూసి గొళ్ళెం పెట్టాడు.
*****
గౌరీగారు, ‘అమ్మ అనబడే ఒక మొగుడు’ కథ చదివాను. చాలా బాగుంది. ఎక్కడా అనువాదమనే అనిపించదు పేర్లు తప్పించి. మంచి కథను అందించారు.