అమ్మమ్మ అంటే కరుణ ప్లస్ తిరుగుబాటు!

అమ్మమ్మను తలచుకున్నప్పుడు, తన గురించి ఆలోచించినప్పుడు, ఈ మనిషి ఇట్లా ఇంత దృఢంగా, ఇంత ప్రేమమయంగా ఎట్లా ఉండగలుగుతుంది, ఇంత దయార్ద్ర హృదయంతో, ఇంత స్నేహ బంధంతో ఎట్లా కొనసాగుతున్నది అని ఆశ్చర్యం కలుగుతుంది.

మ్మమ్మ గురించి వ్యక్తిగత అనుభవాల నుంచీ రాయాలి. ఒక సామాజిక వ్యక్తిత్వంగా ఆమె విశిష్టతా రాయాలి.

మా సొంత అమ్మమ్మ పెండ్యాల రుక్మిణమ్మనూ, ఆమె అక్క చెల్లెళ్లు, తోడి కోడళ్లు మరో ఐదారుగురు అమ్మమ్మలనూ దగ్గరి నుంచి చూసిన అనుభవం ఉంది. వాళ్లవే అయిన వ్యక్తిత్వాలు, ప్రత్యేకతలు,నైపుణ్యాలు, ప్రేమానురాగాలు అప్పటికే చూసి ఉన్నాను. కాని, ఉద్యమస్నేహాల ద్వారా లభించిన ఈ అమ్మమ్మ వ్యక్తిగత, సామాజిక విశిష్టత మరింత ప్రత్యేకమైనది, నాకప్పటికి తెలిసిన అమ్మమ్మలందరినీ మించినది. నా వరకు నాకు ఈ అమ్మమ్మ అనే మాట మామూలుగా వయసు వల్ల వచ్చినది మాత్రమే కూడ కాదు. మా అమ్మ నెల్లుట్ల (పెండ్యాల) రంగనాయకమ్మ నా ఇరవయో ఏట 1981 మార్చ్ లో చనిపోయాక, అమ్మను కోల్పోయిన దుఃఖం, తల్లిలేని బిడ్డనన్న విచారం అప్పటి నుంచీ నన్ను వెంటాడుతూనే ఉంది. అలా అమ్మలేని విషాద జీవితంలోకి వెలుగులా వచ్చి మరో అమ్మగా మారింది కరుణ. అలా కొండపల్లి కోటేశ్వరమ్మ నాకు అమ్మమ్మ అయింది.

మరింత చదువులోకీ, రాతలోకీ, అనువాదం లోకీ, ఉద్యమాచరణలోకీ, అప్పుడప్పుడే ప్రారంభించిన ఉపన్యాసంలోకీ ప్రవేశపెట్టి నాలో తల్లిని కోల్పోయిన దుఃఖాన్ని తగ్గించడానికి అప్పటి రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు, అమరుడు లింగమూర్తి దగ్గరి నుంచి ఎందరో మిత్రులు ఎన్నోరకాలుగా తోడ్పడ్డారు. ఆ క్రమంలో వచ్చింది గుడివాడలో 1981 అక్టోబర్ లో జరిగిన విరసం సాహిత్య పాఠశాల. కావూరి రమేష్ బాబు ఆకస్మిక మరణం తర్వాత, కొన్నాళ్లు ఢిల్లీలో, కొన్నాళ్లు యెమెన్ లో ఉండి, ఇంకా తొణకుతున్న కన్నీటి కుండలా బెజవాడకు తరలి వచ్చిన కరుణ ఆ సభలకు వచ్చింది. మా అందరికీ అత్యంత ఆప్తుడైన, గౌరవనీయుడైన పెద్దాయన (కొండపల్లి సీతారామయ్య) కూతురిగా ఆమె పట్ల మాలో ఆసక్తి కలగడం, పరిచయం చేసుకోవడానికి ఉత్సాహపడడం సహజమే. గుడివాడలో అలా పరిచయమైన కరుణ ఆ క్షణమే మా కుటుంబ సభ్యురాలయింది. ఒకటి రెండు నెలల్లోనే హనుమకొండ వచ్చింది. కన్నతల్లిని కోల్పోయి బేచైన్ గా ఉన్న నాలో మళ్లీ ఉత్సాహం నింపే తల్లి అయింది. అప్పటికి తనను అందరూ అక్కా అని పిలుస్తున్నా, నేను అమ్మా అనే పిలిచాను.

1982 మార్చ్ 4న నేను మొదటిసారి బెజవాడ మొగల్రాజపురం కొండ నీడన ఆ చల్లని పందిరిలో ప్రవేశించాను. అప్పటికి అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లుగా ఉండిన మొగల్రాజపురం కొండ కింద నవోదయ కాలనీలో చిన్న ఇనుప గేటు. నాపరాతి బండలు పరిచిన సన్నని దారి. అటూ ఇటూ బోలెడన్ని పూలమొక్కలు. (అక్కడ నేల మీద పరచుకున్న దళసరి ఆకుపచ్చ ఆకుల, ఎర్రపూల పేరు తెలియని తీగ. దానికి మా చుక్క ‘వేణుపూలు’ అని పేరు పెట్టి ఒక కవిత కూడ రాసింది!) వెనుక పెంకుటిల్లు. ముందు చూరు కిందికి దిగిన వసారా. వెనుక ఒక పెద్ద హాలు. దాని వెనుక మళ్లీ చూరు కిందికి దిగిన చిన్న గది. ఒక పక్కన అద్దెకు ఉన్న కుటుంబం. మరొక పక్కన మరో చిన్న గది. చుట్టూ బోలెడు ఖాళీ స్థలం. వెనుక కాస్త ఖాళీ స్థలం, ఆ తర్వాత కొండ అంచు. అది నిండా స్నేహ పరిమళం వీచే మమతల పందిరి. అది ఒక పర్ణశాల. మనుషుల కొత్తాపాతా లేదు. గలగల మాటల, హోరు నవ్వుల, మధురమైన పాటల,  అపారమైన ఆప్యాయతల పాలవెల్లి.

ముందు వసారాలో మంచంలో అప్పటికే అరవైల్లోనో డెబ్బైల్లోనో ఉన్న అంజమ్మమ్మ. కోటేశ్వరమ్మ అప్పటికి కాకినాడలో వార్డెన్ గా ఉద్యోగంలో ఉంది గాని నేను మొదటిసారి ఆ ఇంట్లో అడుగుపెట్టిన మర్నాడు చిన్నమ్మ పుట్టినరోజు గనుక కావచ్చు కాకినాడ నుంచి వచ్చి ఉన్నట్టుంది. ఆ రోజు లేకపోయినా, అప్పటి నుంచి దాదాపు ప్రతి పదిహేను రోజులకు ఒకటి రెండు రోజులు నేను అక్కడికి వెళ్లి ఉండడం అలవాటయింది గనుక అప్పుడో, ఆ తర్వాత కొద్ది రోజులకో తనను చూశాను. తన కూతురు నాకు అమ్మ అయింది గనుక తను సహజంగానే నాకు అమ్మమ్మ అయింది. అలా 1982 నుంచి ఇప్పటిదాకా మధ్యలో కొన్నాళ్లు, కొన్నేళ్లు కలుసుకోవడం కుదరకపోయినా ఆమె నన్ను తన సొంత మనవడి లానే చూసింది, నేనామెను నా సొంత అమ్మమ్మ లాగే చూశాను.

అమ్మమ్మతో నా అనుబంధంలో రెండు మూడు ముఖ్యమైన సందర్భాలు చెప్పుకోవాలి.

1982 జనవరిలో పెద్దాయన అరెస్టయ్యారు. 1984 జనవరి దాకా ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అప్పుడు కనీసం నెలకు ఒకసారైనా అమ్మ పెద్దాయనను కలవడానికి హైదరాబాద్ వచ్చేది. అప్పటికి ఉస్మానియా ఓల్డ్ పిజి హాస్టల్ లో ఉన్న నేను ఆ ఒకటి రెండు రోజులూ అమ్మతోనే తిరిగేవాణ్ని. ఆ తిరుగుళ్లలో తప్పనిసరిగా ప్రతిసారీ ఉండేది సీతాఫల్ మండిలో వెంకట రెడ్డి గారి ఇంటికి వెళ్లడం. వెంకట రెడ్డి గారు అమ్మమ్మకు తమ్ముడు. ప్రేమమయమైన మనిషి. ఆయనకు కోటేశ్వరమ్మ అన్నా, సీతారామయ్య అన్నా సమానమైన, అవ్యాజమైన ప్రేమ ఉండేది. అక్కడ ఆయన మాటల్లో నాకు పెద్దాయన గురించీ, అమ్మమ్మ గురించీ ఎక్కువ సంగతులు తెలిసేవి.

అజ్ఞాతవాసంలో ఇమడలేనని అనుకుని బైటికి వచ్చినప్పుడు, అది కూడ బైట దారుణ నిర్బంధకాండ అమలవుతున్న రోజుల్లో నేరుగా నేను చేరినది అమ్మ దగ్గరికే. తర్వాత రెండు నెలలకు నాకు బెజవాడ ఆంధ్రజ్యోతి లోనూ, హైదరాబాద్ ఆంధ్రప్రభలోనూ ఉద్యోగాలు వచ్చినప్పుడు, ఏది ఎంచుకోవాలని చర్చ వచ్చింది. ఆ ఇంట్లోనే అంజమ్మమ్మ పడుకున్న మంచం ఉండిన ముందు వసారాలోనే బాలగోపాల్ ఆ విషయం చర్చించారు. అప్పటి ఆట-పాట-మాట బంద్ నిర్బంధ వాతావరణంలో బెజవాడలో ఉండడమే కొంచెం సేఫ్ అని సలహా ఇచ్చారు. అలా నా జీవితంలో ఒక పెద్ద మలుపుకు ఆ కొండనీడే కారణమయింది. ఆంధ్రజ్యోతిలో ట్రెయినీ ఉద్యోగం బదులు బెజవాడలోనే ఆంధ్రపత్రికలో రెగ్యులర్ ఉద్యోగం రావడంతో దానికి మారాను. సరాసరిగా ఆ ఇంటికి రావడమైనా, ఉద్యోగం వచ్చాక కూడ మరొక ఇల్లు చూసుకోకుండా అక్కడే ఉండిపోవడమైనా అమ్మనూ చిన్నమ్మనూ చుక్కనూ అడగకుండానే జరిగిపోయాయి. నిజానికి, అది అమ్మమ్మ ఇల్లు. ఆమెను అడగాలనీ, కనీసం చెప్పాలనీ కూడ అనుకోనంత అతిశయంలో ఉండేవాణ్నప్పుడు నేను. తలచుకుంటే ఇప్పటికీ సిగ్గు వేస్తుంది.

ఇంతటి నా బేహద్బీని కూడ పెద్దమనసుతో క్షమించింది అమ్మమ్మ. ఆ ఇల్లు. ఆ కుటుంబం. క్షమించడం మాత్రమే కాదు, ఇంకా నాకు ఏమి సహాయం చేయాలా అని ఆలోచించిన, నన్ను కాపాడిన, నన్ను రూపొందించిన, ఇప్పటికీ నా గుండెల్లో రవరవలాడే ప్రేమబంధం అది.

1988లో ఒక సభకు భీమవరం వెళ్లి వస్తూ ప్రసాదంపాడు వంతెన దాటగానే ప్రమాదానికి గురై నెత్తురుముద్దలా నేను రోడ్డు మీద పడి ఉన్నప్పుడు, ఆ ఇల్లే, ఆ కుటుంబమే, అమ్మమ్మే లేకపోతే, ఆ స్నేహహస్తాలే లేకపోతే, ఎన్నో గంటల తాత్సారం ద్వారా నన్ను మృత్యువు వైపు తోస్తున్న ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యాన్ని ప్రతిఘటించి, నన్ను భుజాన వేసుకుని మెరుగైన చికిత్సలోకి మార్చిన బాలగోపాల్ పట్టుదల లేకపోతే నేనిప్పుడు ఇవన్నీ రాయడానికి బతికి ఉండేవాణ్నే కాను. ఈ ముప్పై ఏళ్ల బోనస్ బతుకు బెజవాడ స్నేహహస్తాల చలువే.

అందులోనూ ప్రత్యేకంగా అమ్మమ్మ గురించి చెప్పాలి. విపరీతంగా రక్తం పోయినందువల్ల, కనీసం మూడు చోట్ల ఎముకలు విరిగినందువల్ల, ఆ ఎముకలు అతుక్కోవాలన్నా, మళ్లీ రక్తం వృద్ధి కావాలన్నా బోన్ సూప్ తాగించాలని డాక్టర్లు చెప్పిన సూచనను అక్షరాలా అమలు చేసినది అమ్మమ్మే. నేను ఆస్పత్రిలో ఉన్న నెలరోజులూ రోజుకు రెండు పూటలు బోన్ సూపు చేయడం, తానే తీసుకురావడం, లేదా ఎవరితోనైనా పంపించడం ఆమెకు ఏమీ కాని నా పట్ల, కేవలం మనిషి పట్ల మనిషి చూపవలసిన సేవాభావపు విలువలు ఆమెలో జీర్ణమైనందువల్లనే.

ఆరోజుల్లో అమ్మమ్మ తాను రాసిన కవితలూ స్కెచ్ లూ కూడ నాకు చూపెడుతుండేది, చదివి వినిపిస్తుండేది, ఎలా ఉన్నాయని అడుగుతుండేది, ఆమె జీవితానుభవంలో వందో వంతు కూడ లేని నా వంటి అల్పప్రాణి ఆ రచనలు బాగున్నాయంటే పసిపిల్లలా సంతోషపడేది.

ఆ తర్వాత కొన్నాళ్లకే అమ్మ ఈ లోకం వదిలి వెళిపోయింది. ఆంధ్రపత్రిక ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ అది మునిగిపోతున్న పడవ అని తెలిశాక నేనూ బైటికి, హైదరాబాదుకు, సమయంలోకి దూకేశాను. తర్వాత కొన్నాళ్లు నిరుద్యోగం చేసి, మరి కొన్నేళ్లు బెంగళూరులో ఉద్యోగానికి వెళ్లాను. అలా కొన్నాళ్లపాటు, కొన్నేళ్లపాటు అమ్మమ్మను కలవడం కానే లేదు. మళ్లీ బెంగళూరు నుంచి తిరిగివచ్చాక హైదరాబాదులో చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ లోనూ, విశాఖపట్నంలోనూ అమ్మమ్మను కొన్ని సార్లు కలిశాను.

ఏడాది కింద గౌరి లంకేష్ హత్య నేపథ్యంలో హిందూ మతోన్మాద ప్రమాదం మీద మాట్లాడడానికి విశాఖపట్నం వెళ్లినప్పుడు అదే పనిగా అమ్మమ్మను కలవడానికి వెళ్లాను. శారీరకంగా బలహీనంగా, పిట్టపిల్లలా మారిపోయింది గాని మనసు మాత్రం పాత రోజుల ఉత్సాహంతో, అన్వేషణతో, ఆసక్తితో, జీవితం పట్ల అనురక్తితో, మనుషుల పట్ల ప్రేమతో  జ్వలిస్తూ ఉంది. తాను చదువుతున్న, చదివిన పుస్తకాల గురించి మాట్లాడింది. గౌరి లంకేష్ గురించి మాట్లాడింది. రాజేశ్వరరావు గారి గురించీ, సుందరయ్య గారి గురించీ మాట్లాడింది. ఎవరో రాసిన రచనలో ఒక సహచర కామ్రేడ్ గురించి రాసిన అన్యాయపు వ్యాఖ్య మీద ఫిర్యాదు చేసింది. కన్నీళ్లలో నెత్తురులో సంతోషంలో విషాదంలో ముంచెత్తిన ఎన్నెన్నో సంగతులు మాట్లాడింది.

అమ్మమ్మను తలచుకున్నప్పుడు, తన గురించి ఆలోచించినప్పుడు, ఈ మనిషి ఇట్లా ఇంత దృఢంగా, ఇంత ప్రేమమయంగా ఎట్లా ఉండగలుగుతుంది, ఇంత దయార్ద్ర హృదయంతో, ఇంత స్నేహ బంధంతో ఎట్లా కొనసాగుతున్నది అని ఆశ్చర్యం కలుగుతుంది. బహుశా ఆమె అనుభవించిన కష్టాలే ఆమెను ఇలా పుటం పెట్టాయేమో. బాల్యంలోనే వైధవ్యం, జాతీయోద్యమ ప్రభావం, కమ్యూనిస్టు ఉద్యమ భాగస్వామ్యం, భాష తెలియని ప్రాంతాల్లో అజ్ఞాత, రహస్య జీవితం, గొప్ప సేవాభావం గల నాయకుల అనుచరత్వం, ఉద్యమానికే సృజనాత్మక నాయకత్వం అందించిన మనిషి సాహచర్యం, ఆ మనిషే తనకు చేసిన అన్యాయం, జీవిక కోసం అన్వేషణ, అజ్ఞాత జీవితానికి వెళ్లి విగతజీవి దుస్తులుగా, జ్ఞాపకంగా మాత్రమే తిరిగి వచ్చిన కొడుకు, పచ్చని చెట్టుగా వికసిస్తున్న జీవితం మీద హఠాత్తుగా పిడుగు పడినట్టు కూతురి జీవితంలో విషాదం, కూతురి అనారోగ్యం, కూతురి అకాల అదృశ్యం, తల్లి మరణం, కళ్ల ముందు చెట్లు కూలిపోతున్న దృశ్యాలు… ఎన్ని ఎన్ని ఎన్నెన్నెన్నెన్ని కష్టాలు, అనుభవాలు. ఒక మనిషి తన జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవించి కూడ ఇంత నిబ్బరంగా ఉండగలరా అని అబ్బురపరిచే జీవితం. కాని ఆ కష్ట సహిష్ణుతకూ, ధైర్యానికీ, జీవితం పట్ల అపారమైన ప్రేమకూ, ఎప్పటికీ చెదరని మైత్రీ భావానికీ కారణం ఆ తొలిరోజుల కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావమేమో, ఆ తరంలో అసాధారణంగా రక్తమజ్జాస్థిగతమైన ఆదర్శాలేనేమో అనిపిస్తుంది.

“అట్టడుగు అగాథాల నుంచి

కష్టజీవులు కమ్యూనిజంలోనికొస్తారు

గనుల గర్భాల నుంచి,

కొడవళ్లలోంచి,

కార్ఖానాల నుంచి.

నేను సమున్నత కవితా శిఖరాల నుంచి

కమ్యూనిజంలోకి దూకుతాను”

అని మయకొవస్కీ కమ్యూనిజంలోకి వచ్చే, రాగల రెండు ప్రవాహాల గురించి చెప్పాడు. బహుశా కష్టాల నుంచి వచ్చే ప్రవాహం ఒకటీ, ఆలోచనల నుంచి వచ్చే ప్రవాహం ఒకటీ అని ఆయన వేరు చేసినట్టున్నాడు. కాని అమ్మమ్మ విశిష్టత ఏమంటే ఆమె ఆ రెండు ప్రవాహాల కలనేత. పడుగూపేకగా కలిసిపోయిన కష్టభరిత జీవితమూ, సుస్థిరమైన ఆదర్శాలూ ఆమెను అలా మేరునగధీరురాలిలా, శిరీషకుసుమకోమల మనస్విగా తీర్చిదిద్దాయి. అందువల్లనే ఆ విశిష్ట వ్యక్తిత్వం, తనను తాను నిర్జన వారధినని అనుకున్నప్పటికీ, నిజానికి మహా జనసందోహపు వారధి అని రుజువవుతున్నది.

*

ఎన్. వేణుగోపాల్

4 comments

Leave a Reply to G. Janardhan Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ జ్ఞాపక శక్తికి,పూస గుచ్చినట్టు చూపిన యుక్తి కి జోహార్ .

  • ” … అందువల్లనే ఆ విశిష్ట వ్యక్తిత్వం, తనను తాను నిర్జన వారధినని అనుకున్నప్పటికీ, నిజానికి మహా జనసందోహపు వారధి అని రుజువవుతున్నది.”
    ఒక మనిషిలో చరిత్రని చూడడం ఎలాగో చూపించారు – చాలా బాగుంది.

  • కమ్మ్యూనిస్టుల గురించి అతి తక్కువ తెలిసిన యువత ఉన్న మన సమాజానికి “రక్త మజ్జా స్థితి గతమైన కమ్యూనిస్టు ఆదర్శాలు” మూర్తీభవించిన కొండపల్లి కోటేశ్వరమ్మ గారిని నిజాయితీగా (రేఖామాత్రంగానైనా) పరిచయం చేయటం వేణుగారికే సాధ్యం.
    ఈ పరిచయం రాసినందుకు అభినందనలు.
    నాలో అనేక ఙాపకాలను లేపినందుకు కృతఙతలు!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు