అమెరికాలో ఉద్యోగం – మూడు రోజుల మొదటి పర్వం

అమెరికాలో ఉద్యోగం – మూడు రోజుల మొదటి పర్వం

వంగూరి జీవిత కాలమ్-65

1975 ఫిబ్రవరి నెలాఖరులోనో… మార్చ్ మొదటి వారం లోనో చికాగో ట్రిబ్యూన్ పత్రికలో అంతకు ముందు నాలుగైదువారాల అలవాటు ప్రకారం ఆదివారం పేపరు రాగానే ఆత్రంగా “హెల్ప్ వాంటెడ్” పేజీలు అన్నీ చూస్తుండగా ఒక చిన్న ప్రకటన నా దృష్టిలో పడింది. “హైడ్రాలిక్ పంప్ డిజైన్ లో ప్రావీణ్యత ఉన్న డిగ్రీ ఉన్న ఇంజనీర్ కావలెను. ఆసక్తి ఉన్నవారు ఫలానా నెంబర్ కి ఫోన్ చెయ్యండి”.  నేను పంప్ డిజైన్ లో గొప్ప ప్రావీణ్యత ఉన్నవాడిని కాదు కానీ, ఆ సాంకేతిక పరిజ్ఞానం అంతా చదువుకున్న వాడినే కాకుండా పాఠాలు కూడా చెప్పిన వాడిని కాబట్టి ఆ ప్రకటన చూడగానే ఎగిరి గంతేసి, గెంతడం మానేసి ఆ ఫోన్ నెంబర్ కి పిలిచాను.

అంతే…ఆ మర్నాడే పొద్దున్న 8;00 గంటలకి నన్ను ఇంటర్వ్యూకి రమ్మనమని ఆ కంపెనీ ఆయన వాళ్ళ చిరునామా ఇచ్చాడు. ఆ కంపెనీ పేరు టూవెల్ పైప్ అండ్ సిస్టమ్స్, చిరునామా అరోరా నగరం. ఆ సంగతి మా తమ్ముడికి చెప్పగానే వాడు ఎంత సంతోషించాడో అంత బెంగా పడ్డాడు. ఎందుకంటే ఆ అరోరా నగరం మేము ఉండే హార్వుడ్ హైట్స్ రెండూ కూడా చికాగో సరిహద్దు నగరాలే అయినప్పటికీ రెండింటికీ మధ్య కనీసం గంటా, గంటన్నర డ్రివింగ్ అంత దూరం. మనకి కారూ లేదు, డ్రైవింగూ రాదు, సరి అయిన పబ్లిక్ బస్సు, రైలు లాంటివి కూడా లేవు. అంచేత ఆ మర్నాడు తెల్లారగట్ట 5 గంటలకి మా తమ్ముడు నన్ను అరోరాలో ఆ టూవెల్ కంపెనీ దగ్గర దింపడానికి సిధ్దపడ్డాడు. అరోరా వెళ్ళి మళ్ళీ తన ఉద్యోగానికి 8 గంటలకి చేరుకోవాలి అంటే సుమారు 3 గంటల కారు డ్రైవింగ్ అనమాట. మేము ఇద్దరం ఆ టూవెల్ కంపెనీ ఇచ్చిన చిరునామా మేప్ లో జాగ్రత్తగా చూసుకుంటూ ఒకటి, రెండు సార్లు దారి తప్పి మొత్తానికి అరోరా నగర సరిహద్దులో అక్కడికి చేరేటప్పటికి సుమారు ఉదయం 6:30 అయింది. ఇక్కడ అనుకోని విశేషం ఏమిటంటే….ఈ టూవెల్ అనేది పెద్ద కంపెనీ కాదు. అరోరా నగరానికి ఆనుకుని ఉన్న ఒక ఐదారు వందల ఎకరాల మధ్య ఒక చిన్న రేకుల షెడ్డు వాళ్ళ ఆఫీసు. అది చూడగానే మా తమ్ముడూ, నేనూ నిర్ఘాంత పోయాం. చుట్టుపక్కల ఎక్కడా మానవ సంచారం లేదు. అదృష్టవశాత్తూ ఆ రేకుల షెడ్డుకి ముందు ఒక వరండా, అందులో కొన్ని కుర్చీలూ ఉన్నాయి. నన్ను దింపి, వెంటనే వెనక్కి మరో గంటన్నర డ్రైవ్ చేసి తన ఉద్యోగానికి 8 గంటలకల్లా మా తమ్ముడు వెళ్ళాలి కాబట్టి గత్యంతరం లేక నేను ఇంటర్ వ్యూ కోసం వేసుకున్న సూటూ, బూట్ లు, పైన చలి దుస్తులు వేసుకుని ఆ కంపెనీ వాళ్ళ బయట వరండాలో కూచోవలసి వచ్చింది.  ఆ సమయం లో నాకు కాకినాడ దగ్గర మా పొలం మధ్యలో ఉన్న “మకాం” అనే తాటిపాక ముందు వరండాలో కూచుని పచ్చటి మా పొలాలని చూస్తున్న భావన కలిగింది కానీ ఇక్కడ అరోరాలో చుట్టూ అంతా మంచుతో కప్పేసిన పొలమే.

మొత్తానికి ఎనిమిది గంటలకి ఆ టూవెల్ కంపెనీ అధినేతా, మరొక పెద్దాయనా వచ్చారు. వరండాలో కుర్చీలో వణుకుతున్న నన్ను చూసి ఆశ్చర్యపోయి,  గంటన్నర నుంచీ అక్కడ ఉన్న విషయం తెలుసుకుని క్షమాపణలు చెప్పుకుని ఆఫీసు తలుపులు తెరిచి లోపలికి తీసుకెళ్ళారు. పైకి రేకుల షెడ్ లా కనిపించినా, లోపల అంతా ఆధునికంగానే ఉంది. ఏడెనిమిది ఆఫీసు గదులూ, ఒక డిజైన్ ఆఫీస్ లో ఆ నాటి పరికరాలైన డ్రాయింగ్ బోర్డూ, టీ స్క్వేరూ, పెన్సిళ్ళూ ..ఇలా అన్ని హంగుల తోటీ నిజమైన ఇంజనీరింగ్ కంపెనీలాగానే ఉంది. వెనకాల అసెంబ్లీ షాప్ లో రకరకాల పంపులూ, పైపులూ, వెల్డింగ్ సామాగ్రీ వగైరాలు ఉన్నాయి. అప్పటికే ఐదారుగురు టెక్నీషియన్స్ రావడం, ఏవేవో పనులు జరగడం, వాటి ధ్వనులు వినపడడం మొదలయింది. టూవెల్ దొర స్వయంగా నాకు ఇవన్నీ చూపించి తన కంపెనీ చేసే పనులు, వ్యాపారం గురించి వివరాలు చెప్పాడు. స్థూలంగా చెప్పాలంటే ఆ చుట్టుపక్కల అన్ని చోట్లా బోర్ వెల్ తవ్వకాలు, వాటికి సబ్ మెర్సిబుల్ పంపులు అమర్చడం, పంపుల సహాయంతో వేలాది ఎకరాలకి స్ప్రింక్లర్ సిస్టమ్స్ అమర్చడం- ఇదీ ఆ కంపెనీ వ్యాపారం. ఇప్పుడు వ్యాపారం అభివృధ్ది కోసం కొన్ని పెద్ద కాంట్రాక్టుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాటి నియమాల ప్రకారం డిగ్రీ ఉన్న ఇంజనీర్ ఉంటే తప్ప ఆ కాంట్రాక్టులు టూవెల్ కంపెనీకి వచ్చే అవకాశం లేదు. అందుకు నన్ను ఇంటర్ వ్యూ కి పిలిచారు.

ఆ తర్వాత ఆ రెండో పెద్దాయన..అచ్చు మార్లెన్ బ్రాండో లా ఉన్నాడు కానీ గాడ్ ఫాదర్ లా లేడు….ఆయన నాకు ఒక ఉద్యోగం అప్లికేషన్ ఇచ్చి అది పూర్తి చెయ్యమన్నాడు. అమెరికాలో నేను పూర్తి చేసిన మొట్టమొదటి ఉద్యోగం దరఖాస్తు అదే. అందులో పెద్ద విషయాలూ, విశేషాలూ ఏమీ లేవు. అయితే అందులో “ నెంబర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ డిడక్షన్స్” అన్న ప్రశ్న నాకు అర్ధం అవలేదు. ఇలా తెలియని వాటికి  బ్రాండో గారు వివరించి చెప్పాడు. ఇక్కడో తమాషా జరిగింది. నేను ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆయనకి ఇచ్చాక, “నీ సొషల్ సెక్యురిటీ కార్డ్” ఉందా? అని అడిగాడు. “అదే కాదు. నా గ్రీన్ కార్డ్ కూడా ఉంది” అని ఆ రెండూ జేబులోంచి తీసి నేను ఎంతో గర్వంగా ఆయనకి ఇచ్చాను. నా గ్రీన్ కార్డ్ ని సగర్వంగా చూపించుకునే అవకాశం అదే మొదటి సారి. అయితే ఆయన అది చూసి ఎంతో ఆశ్చర్యంగా “ఇదేమిటీ? ఎందుకూ? ఎవరిచ్చారు?” లాంటి ప్రశ్నలు వేశాడు. ఇక్కడ విషయం ఏమిటంటే..ఆ నాటి అమెరికాలో ..అంటే 1975 ప్రాంతాలలో కూడా…..ఏవో పెద్ద, పెద్ద కంపెనీలకి తప్ప, ఇలాంటి చిన్న కంపెనీలకి ఈ ఇమిగ్రేషన్, గ్రీన్ కార్డ్ మొదలైన విషయాల మీద ఏ విధమైన అవగాహన,  తెలుసుకోవలసిన అవసరం ఉండేది కాదు. వాళ్ళకి కావలసినది అల్లా “ఈ ఉద్యోగానికి పనికొస్తాడా లేదా?” అమెరికాకి అందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే కదా…అలాగే వీళ్ళునూ….అంతే ఆయా యజమానులకి తెలిసినదీ, కావలసినదీ…. ఆ రోజుల్లో ఈనాటి హెచ్ వన్ బి లూ..అలాంటివి లేనే లేవు. మామూలు అమెరికన్లకి, కంపెనీ యజమానులకీ అవేమీ అంత ప్రాముఖ్యత ఉన్న విషయాలు కాదు. వాళ్ళకి తెలిసినది అల్లా సోషల్ సెక్యూరిటీ కార్డ్. అది లేక పోతే ఉద్యోగం ఇవ్వలేరు.

ఉన్నమాట చెప్పాలంటే….ఆ రోజు మార్లెన్ బ్రాండో గారి చేత అన్ని ప్రశ్నలు అడిగించుకున్నాక. నేను అనవసరంగా ఈ గ్రీన్ కార్డ్ బయటకి తీసి వచ్చే ఉద్యోగం కాస్తా ఆ గ్రీన్ కార్డ్ వలన రాదేమో అని భయపడి పోయాను. కానీ అలా జరగలేదు. మధ్యాహ్నం 12 గంటల దాకా ఆ ఇద్దరి తోటీ నా ఇంటర్ వ్యూ అయాక టూవెల్ గారు”పదండి లంచ్ కి వెడదాం” అని మమ్మల్ని లేవదీశారు. ఆ  పొలాల నుంచి నగరంలో ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం. నేను వెజిటేరియన్ అని మాటల వరసలో చెప్పగానే “అయితే వైన్ అయినా తాగుతారా, తాగరా?” అని ఆయన అడగగానే నాకు నవ్వొచ్చింది. బ్రాండో గారే స్వయంగా నాకు ఒక స్పెషల్ రెడ్ వైన్ తెప్పించారు. నేను ఏదో చీజ్ శాండ్ విచ్ లాంటిది తెప్పించుకున్నాను. లంచ్ అయాక మళ్ళీ ఆఫీసుకి వెళ్ళగానే టూవెల్ గారు “మీకు మా కంపెనీలో తొలి ఇంజనీర్ గా ఉద్యోగం ఇవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. గంటకి ఆరు డాలర్లు. వారానికి 40 గంటలు. ఆరు నెలల తర్వాత జీతం పెంచుతాం. రేపటి నుంచీ ఉద్యోగంలో చేరవచ్చును. మీకు ఏమైనా సహాయం కావాలంటే బ్రాండో గారు చేస్తారు” అని చెప్పగానే, నాలో రకరకాల భావోద్వేగాలు కలిగాయి. ముందుగా ఈ గంటకి ఆరు డాలర్లంటే మనకి అలవాటు అయిన నెల జీతం ఎంతా, లేదా ఏడాదికి ఎంతా అని తెలియక మెదడులోనే టక, టకా లెక్కలు వేసేసుకుని, సుమారు నెలకి వెయ్యి డాలర్లు అని అర్ధం అవగానే మహానంద పడిపోయాను. నేను బొంబాయి ఐఐటి లో లెక్చరర్ గా నా జీతం నెలకి 450 రూపాయలు అయితే, అప్పటి లెక్కల ప్రకారం ఈ టూవెల్ గారు ఇస్తానన్న జీతం నెలకి ఏకంగా 70 వేల రూపాయలు. మరొక ఆశ్చర్యం…పొద్దుటి నుంచీ ఇప్పటీ దాకా వాళ్ళు నాతో గడిపిన ఐదారు గంటలలోనూ కేవలం నా బయోడేటా అడగడం తప్ప, నా డిగ్రీ సర్టిఫికేట్లు చూపించమనడం, పంప్ డిజైన్ లో కానీ ఇంకేవిధమైన సాంకేతిక విషయాలలో కానీ నన్ను ఒక్క ప్రశ్నా అడగక పోవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేను నా బ్రీఫ్ కేస్ లో దాచిపెట్టుకున్న నా కాకినాడ బి. యి,  బొంబాయి ఐఐటి ఎమ్, టెక్, పి. హెచ్ డి డిగ్రీ సర్టిఫికేట్లు, మార్క్ షీట్లు ఏమీ చూపించే అవసరమూ, అవకాశమూ లేనే లేవు. ఉద్యోగం ఇవ్వడం అంతా నా మాట మీద నమ్మకమే. అస్సలు నమ్మశక్యం కాని విషయం ఇది. ప్రతీ కాగితాన్నీ గెజెటెడ్ ఆఫీసర్ చేత సంతకాలు పెట్టించుకున్న

పదేసి కాపీలు సమర్పించడం, ఇక నామకహా జరిగే ఇంటర్వ్యూలలో కూడా చొప్పదండు ప్రశ్నలు వేసే సంస్కృతి ఇప్పటికీ ప్రబలంగా ఉన్నమన పవిత్ర భారత దేశం నేపధ్యంలో అప్పుడే అమెరికాలో అడుగుపెట్టిన ఒకానొక యువ ఇంజనీర్ కి ఇది అర్ధం కాని అనుభవం. పైగా ఉద్యోగం కోసం అడుక్కుంటూ వచ్చిన వాడిని మర్యాదగా లంచ్ కి తీసుకెళ్ళి వైన్ తాగించడమా….ఇండియాలోనా? నరకానికి మెట్లు?

ఇక టూవెల్ గారు ఎంతో యాదాలాపంగా నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పగానే, మరి కొద్ది నిమిషాలలో బ్రాండో గారు జీతంతో సహా ఆ ఉద్యోగ వివరాలు  అన్నీ టైప్ చేసి ఉన్న ఆఫర్ లెటర్ నాకు ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో చదువుకున్న మా తమ్ముడు పడుతున్న అవస్తలు చూస్తున్న నాకు నెలకి వెయ్యి డాలర్లు అంటే అప్పటికే నాకు చాలా అవగాహన ఉంది. అంచేత ఆనంద భాష్పాలతో అని చెప్పను కానీ “ఇది నిజమా, కలా” అనే భావనతో టూవెల్ గారికీ, బ్రాండో గారికీ నా ధన్యవాదాలు చెప్పి, మర్నాటి నుంచీ ఉద్యోగంలో ప్రవేశిస్తాను అని వారికి నా అంగీకారం తెలియజేశాను.

అప్పటికి మధ్యాహ్నం రెండు అయింది. మా తమ్ముడు తన ఉద్యోగం సాయంత్రం 5 గంటలకి పూర్తి అయాక మళ్ళీ గంటన్నర డ్రైవ్ చేసుకుంటూ నన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి ఇంకా నాలుగైదు గంటల సమయం ఉంది. ఈ లోగా బ్రాండో గారూ, టూవెల్ గారూ వారి, వారి పనుల మీద వారు వెళ్ళిపోయారు. మిగతా ఐదారుగురూ కూడా వెళ్ళిపోతూ ఆఫీస్ కి తాళం వేసేసి నన్ను ఎంతో మర్యాదగా పైన వరండాలో అదే కుర్చీలో మా తమ్ముడి కోసం ఆత్రుతగా వేచి ఉండే ఏర్పాటు చేశారు. నేను మళ్ళీ సూటూ, బూటూ, చలి దుస్తులూ ధరించి చంద్రుడి కోసం చకోర పక్షిలా మా తమ్ముడి కోసం నిరీక్షించాను. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు.  నా బ్రీఫ్ కేస్ లో ఒక్క తెలుగు పుస్తకమైనా లేదు చదువుకోడానికి. కానీ….మర్నాడు మొదలు అవుతున్న ఉద్యోగ పర్వం మీద ఊహాగానాలతో సమయం గడిచిపోయింది. వెయ్యి డాలర్లలో ఎంత మిగిల్చి కాకినాడలో మా బాబయ్య గారికి..అంటే మా నాన్న గారికీ, అమ్మకీ నెల నెలా పంపించగలం..ఇవే ఆలోచనలు. ఈ లోగా మా తమ్ముడు..వంగూరి వెంకట సూర్య హనుమంత రావు రానే వచ్చాడు. నాకు ఉద్యోగం వచ్చిన వివరాలు విని మహానందపడిపోయి, చికాగో నుంచి అరోరా నగరానికి నా రిలొకేషన్ కి ఆలోచనలు మొదలుపెట్టాడు. ..ఎందుకంటే….రోజూ ఇలా పొద్దున్న 3 గంటలు, సాయంత్రం మరో మూడు గంటలూ నన్ను నా ఉద్యోగానికి హార్వుడ్ హైట్స్ నుంచి అరోరాకి డ్రైవ్ చేసే అవకాశం లేనే లేదు కదా.

ఇది మొదటి పర్వం….ఒకటో రోజు

రెండో పర్వం- తర్వాత సంచికలో

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Leave a Reply to వంగూరి చిట్టెన్ రాజు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు