అన్వేషణ

నింగిలో చందమామ ఎటు యెల్లిపోయిందో తెల్వదు‌.

మల్లంపల్లిలో బయిండ్ల సెంద్రెయ్య కూడా కనిపిస్త లేడు.

వూరంతా చీకటి కమ్మిన అమావాస్యలా వుంది.

జిలుకర యెంకటయ్య ఆ నిశిలో  మినుకు మినుకుమని వెలుగుతున్న దీపంలా వున్నాడు.

సెంద్రెయ్య యెక్కడున్నాడో తెల్వదు.

యెందుకు యిల్లు యిడిసి పోయిండో ఎవలకూ తెల్వట్లే.

 

కానీ సెంద్రెయ్య యిల్లొదిల పోవడానికి బలమైన కారణం వుంది.

అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లే అచ్చమ్మ  రొమ్ము క్యాన్సర్‌తో తనువు చాలించింది.

భూమ్మీద అన్నీ చావక తప్పదని చెప్పిన నాయిన నర్సయ్య కన్నుమూసిండు.

కన్నతల్లి శాంతమ్మ కూడా రొమ్ములో గడ్డ పగిలి గోరీలో నిద్రిస్తున్నది.

మనువాడి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన భార్య యెల్లమ్మ కూడా రొమ్ము గడ్డతో చనిపోయింది.

ఇన్ని చావులు ఒకేసారి జరగలేదు నిజమే. ఐదేళ్ల నిడివిలో ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. తనెంతో ప్రేమించే రక్తాలు తనను వొదిలి తనువులు చాలించారు.

చావంటే ఏంది? పుట్టుకంటే ఏంది?

బ్రహ్మ పుట్టించాడు. విష్ణు దేవుడు నడిపించాడు. లయకారుడు శివుడు తనలో లయం చేసుకున్నాడు. శివైక్యం చెందక ఏ జీవి తప్పించుకోలేదని ప్రతి నెలమాసికం రోజు జంగాల పంతులు గ్నానవాక్కులు చెప్పిండు.

అయ్యా, మనిషి చావడమే పరమావధి అయితే పుట్టుడెందుకు? అని అమాయకత్వంతో సెంద్రెయ్య అడిగాడు.

పుట్టినోళ్లంతా బతికే వుంటే ఈ భూమి సరిపోతదా? తిండి దొరుకతదా అందరికీ? పుట్టినోడు సస్తేనే, కొత్తగా పుట్టినోనికి నేలమీన యింత తావు దొరుకుతది. యింత గాసం దొరుకుతది. అన్నీ ఆలోచించి ఉదరం మైల చేసుకోకు. మరిచి పోవడానికే దేవుడు మనసనేదిచ్చిండు అని ఆ జంగాల పంతులు మెత్తగా కోపం చేసేటోడు.

బగవంతుడు ఏదో ఒక కారణం వల్లే మీ కుటుంబానికి ఈ బాధ కలిగించిండు. ఉత్తగనే ఏవీ జరగవు. అన్నీటికి ముందూ యెనుక ఏదో తప్పకుండా వుంటది. శివుడాగ్న లేనిదే చీమైనా కుట్టదంటరు. మరిసిండ్లా? యిదీ ఆ వేదాంతి వరుస.

 

బ్రహ్మ పుట్టించుడేంది? విష్ణువు నడిపించుడేంది?  శివుడు చంపుడేంది?

ఏది సత్యం? ఏది శివం? ఏది సుందరం?

తనను వేధించే ఆలోచనలకు సమాధానం దొరకలేదు. తనకు శాంతి లేదు. ఒక్కసారిగా ఖాళీ కుండలా,నీళ్లింకిన పాతబావిలా అయ్యిండు సెంద్రెయ్య.

వూళ్లో ఎవరితో మాట్లాడాలనిపిస్తలేదు.  కొడుకు వెంకటేశు రెండేళ్ల పిలగాడు. వాణ్ఙి చూస్తే గుబులవుతంది. నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కూడా మరణించాలా? ఏం పాపం చేశాడని ఈ బంగారు తండ్రికి వాళ్లమ్మ దూరమైంది? వీడు కూడా వయసులోనో, ముసలితనంలోనో చనిపోవాలా? అసలు చనిపోయినోళ్లంతా యాడికి పోతండ్లు. చూసినోళ్లు యెవలన్నా వుండ్లా?

చిరాకు కోపం తన మీద తనకే అపనమ్మకం అన్ని వికారాలూ కలుగుతున్నాయి.

 

గుండెలోని బరువును దించుకోవడానికి నాడుసారా పూటుగా తాగిండు.

గుండె తేలికైంది. కానీ తల మైకంతో బరువెక్కింది.

ఎటు వైపు వెళ్తున్నాడో తెల్వదు.

నడుస్తూ వున్నాడు.

ఎదురుగా చిక్కటి చీకటి అరణ్యం.

లేళ్లు పులులు ఒకేచోట ఆడుతున్నాయి. నీటి జలపాతాలు, అగ్నికీలలూ ఒకే తావున వున్నాయి.

అవి చూసి నిజమో భ్రమో తెలువట్లే తనకు.

నడుస్తూనే వున్నాడు అడివిలో.

మానులను చుట్టుకొన్న సర్పాలు నోటితో పచ్చని  గడ్డిని తింటున్నాయి.

రెండు పెద్ద పెద్ద బండల నడుమ నాలుగు అడుగులు వేశాడో లేదో పెద్ద గుడ్డేలుగు ఒకటి దూసుకొచ్చింది.

సెంద్రెయ్య అదురుకున్నాడు. భయంతో ఉరుకుడు మొదలు పెట్టిండు. దానికి చిక్కితే తల మీద పంజాతో కొట్టి మెదడు తినుడు ఖాయం. ఒక గుడ్డేలుగు చేతిలో ఏ విలువా లేకుండా చావాలని తనకు లేదు. దానికి దొరక్కుండా పిక్కె బలం చూపిస్తున్నాడు. తల బరువుతో నొప్పి పెడుతుంది. పరిగెత్తుతూంటే ఊపిరి ఆడుతలేదు.

కాళ్లలో సత్తువ యింకి పోతంది.

భీకర రూపంలో వున్న ఆ గుడ్డేలుగు ఉరికొస్తూ గాల్లోకి ఎగిరింది. అది నోరు తెరిచి సెంద్రెయ్య తల మీద పడబోయింది. ఆ సమయంలో సెంద్రెయ్య కుడి రెక్క పట్టుకొని ఎవరో ఒక పెద్దాయన పక్కకు లాగిండు.

ఆ గుడ్డేలుగు దబీమని నేలమీద పడ్డది.

తనకు దక్కాల్సిన జీవాన్ని ఎవరు గుంజుకున్నారో అని అది రోషంతో ఆ వ్యక్తి వైపు చూసింది.  ఆ చీకట్లో ఆ ఆజానుబాహుడు తన చేతిలోని కర్రతో దాన్ని అదిలించాడు.

వొదిలి పొమ్మని గట్టిగా గర్జించిండు. అది కుందేలు పిల్లలా చెవులాడించుకుంటా పొదల్లోకి దూరింది.

 

తనను రక్షించిన ఆ మహానుభావుడికి దణ్ణం పెట్టాడు సెంద్రెయ్య.

కటిక చీకట్లో కూడా అతని కండ్లు చల్లని వెన్నెలలా వున్నాయి.

అంతులేని ఈ నిశిలో, క్రూర జంతువులు వేటాడే వేళ యెక్కడికి బయల్దేరావు బిడ్డా అని ఆ పెద్దాయన అడిగాడు. అంతకు మునుపెన్నడూ వినని దివ్యస్వరం అది.

ఆ స్వరమాధుర్యం తనకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఒళ్లంతా పులకరిస్తుంది.

అయ్యా తమరెవరు? భక్తితో అడిగిండు సెంద్రెయ్య.

నా పేరు తెలుసుకొని ఏం చేస్తావు. నేనొక మర్మాణ్ణి.

అయ్యా, నాకు తెలువని మర్మాలనేకం తెలుసుకోవాలని బయల్దేరాను. ఈ దండకారణ్యంలో వింతగా ప్రవర్తిస్తున్న జంతువులను చూశాను. పచ్చగడ్డి పరకలను తింటున్న సర్పాలను కూడా చూశాను. కానీ ఈ గుడ్డేలుగు మాత్రమే తన నిజమైన గుణంతో నన్ను వెంటాడింది. తమరు రాకపోతే అది నా తల కొట్టి మెదడు తినేది. ఈ గుడ్డేలుగు నిజమేనా? లేకపోతే అబద్ధమా? సెంద్రెయ్య అనుమానం బయట పెట్టిండు.

ఆ ఆజానుబాహుడు చిన్నగా నవ్విండు. నువ్వేది తెలుసుకోవాలని ఆరాటపడ్తాండావో అదే యిది. నువ్వు తప్పకుండా సత్యం తెలుసుకుంటావు. ఒకటి మరిచిపోకు. నువ్వే చేసేది, నువ్వు చేయనిది రెండు నీ కర్మలే. ఒకటి నీ శరీరంతో, మరొకటి నీ మనసుతో చేస్తావు. నువ్వు దేనికి భయపడుతున్నావో అదే గుడ్డేలుగు. దేన్ని నువ్వు తిక్కతిక్కగా అర్థం చేసుకుంటున్నావో అవే వింతగా ప్రవర్తిస్తూన్న జీవులు. అంతే. ఏది భ్రమకాదు. ఏదీ నిజం కాదూ. అంతా నీ మనస్సే అన్నాడాయన.

సెంద్రెయ్యకు ఏమీ అర్థం కాలేదు. బేలమొహంతో ఆయన వైపు చూసిండు.

నువ్వేమీ అధైర్యపడకు. ఇలా తూర్పు దిక్కుకు పయనించు. యింకో జాము తర్వాత నీకు ఒక ఫణిగిరి కొండ ఎదురైతది. అక్కడ విశ్రమించు. నీ మరునాటి ప్రయాణం రాత్రి పూటనే కొనసాగించు. నీకు అంతా శుభమే జరుగుతుంది అని చేయి ఎత్తాడు.

సెంద్రెయ్య ఒంట్లోకి కొత్త సత్తు వొచ్చింది. ఆ దివ్యవాగీశ్వరుడికి నమస్కరించి బయల్దేరాడు.

నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసిండు. ఎవరూ కనిపించ లేదు. కొంత భయం కూడా అయ్యింది. ఏమిటిదంతా? అంతా మాయ అనుకున్నాడు.

ఒక జాము నడక తర్వాత ఫణిగిరి కొండను చేరిండు. తెలతెలవారుతుంది.

కాళ్లలో బలం లేదు. వొంట్లో ఓపిక లేదు. ఆ కొండ కింద ఒక బండ మీద సొమ్మసిల్లి పడిపోయిండు.

ఎంతసేపు నిద్రపోయాడో తెల్వదు. ఆ పొద్దంతా మండిన ఎండ వేడిమి కూడా అతని మేనిని తాకిన స్పృహ కూడా తనకు లేదు. మత్తు మందు తిన్న వాడిలా అలా పడుకొని వుండి పోయాడు.

 

నోరంతా యెండిపోయి గుండె ఆగిపోయేలా వుంది. లేచి కూచొనే శక్తి కూడా ఒంట్లో లేదు. ఎలాగైనా బతకాలని వుంది. తనతో తనే పెనుగులాడుతున్నాడు.

పెదాల మీద నీళ్ల చుక్కలు పడ్డాయి. నోరు తెరిచిండు. నోట్లో అమృతం లాంటి తీయటి నీళ్లు పొశారెవరో.

కళ్లు తెరిచి చూసిండు.

చేతిలో నీటి చెంబుతో,నున్నటి బోడి గుండుతో నిత్యం సంతోషంతో వెలుగొందే దివ్యమూర్తిలా వున్నాడు. రెండు చేతులెత్తి దండం పెట్టాడు. ఆయుష్మాన్ భవా అని దీవించాడు ఆ ఎదుటి ఆకారుడు.

సెంద్రెయ్యకు ఆకలనిపించింది. పేగులు మూల్గుతున్నాయి.

ఆయన తన సంచిలోంచి ఒక నాలుగు అరటి పండ్లు తీసి ఇచ్చిండు. వాటిని అవురావురుమని తినేసిండు.

నీళ్లు కావాలని దోసిలి పట్టిండు. ఆయన కడుపారా నీళ్లు కుదిపిండు. ఆ చెంబులో ఏం మాయుందో తెలియదు. ఎన్ని తాగినా ఆ నీళ్లు ఒడిసిపోట్లేదు.

కాసేపటికి సెంద్రెయ్య స్థిమిత పడ్డాడు. చుట్టూ చూసిండు. అంతా చీకటి. సముద్రంలాంటి అమావాస్య చీకటి.  అడుగేయాలంటే అదురుకునేంత కటిక సీకటి.

నీళ్లు పోసిన ఆ దయామయుడు తనకు బాగా తెలిసిన దారిలో సునాయాసంగా ఫణిగిరి గుట్టమీదికి ఎక్కుతున్నాడు.

ఏదో ఒక ఆకారం నడుస్తున్నట్టు మాత్రమే సెంద్రెయ్యకు తెలుస్తోంది.

కొద్ది సేపటికి గుట్టదిగి వచ్చాడు. ఆయన కాళ్లకు నమస్కరించి “అయ్యా తమరెవరు? నన్నెందుకు బతికించారు?” అని అడిగిండు.

“నీ ప్రయాణం యింకా చాలా వుంది. బయల్దేరు. దారిలో కనిపించే ప్రతీదాన్ని నిజమని అనుకోకు. కనిపించనిదంతా అబద్ధం కాదు. అలా అని మాయా అనుకోకు. నిత్యం ఎరుకతో వుంటేనే నిన్ను భయపెడతున్న మారుణ్ణి గెలువగలవు. బయల్దేరు” అని ఆయన చీకట్లో కలిసి పోయాడు.

 

ఫణిగిరి దాటి నడుస్తూన్నాడు. ఇప్పుడు తనకు ఆకలి లేదు. దాహం లేదు. క్రూర జంతువుల చింత లేదు. వేగంగా నడుస్తూనే వున్నాడు. అవును, తనెటు పోవాలని బయల్దేరిండు? బయలెల్లే ముందు తనకు స్పష్టంగా తెలియదు. కానీ యిప్పుడు తెలుస్తుంది. విజయవాడ పోవాలి. కృష్ణా నదిలో పవిత్ర స్నానం చేయాలి. అక్కడే ఏదోఒక పని చేయాలి. తను ఎవరో ఏమిటో ఎవరికీ తెలియకుండా బతకాలి. తనను వేధించే గ్నాపకాలను కృష్ణా జలాలలో వొదిలేయాలి. వెర్రి సంతోషం కలిగింది తనకు. ఇప్పుడు ప్రాణం గాలిలో తేలిపోతున్నట్టు వుంది.

 

నడిజాము రాత్రి. విషసర్పాలు, వింత జంతువులన్నీ దారికి అడ్డం రాకుండా తొలిగిపోతున్నాయి.

కానీ ఒక్కసారిగా ఎవరో ఎదురుగా నిలబడ్డట్టు అనిపించింది.

ఒకరు కాదు. అయిదుగురు. చేతిలో పదునైన ఆయుధాలు కూడా వున్నాయి.

“ఎవరు నువ్వు? నిలబడ్డ చోటే వుండు” అని ఒక గొంతు గద్దించింది.

“నా పేరు బైండ్ల సెంద్రెయ్య. మాది మల్లంపల్లి. నేను బెజవాడ పోతున్నా” అని ధైర్యంగా బదులిచ్చిండు.

ఎదుటి వ్యక్తి కాసేపు యేమీ మాట్లాడలేదు.

“మీ నాయిన నర్సయ్య కదా? పెద్ద కుటుంబం” అని గొణిగిండు.

సెంద్రెయ్య ఆశ్చర్యపోయిండు. నాగురించీ నా కుటుంబం గురించి యితనికెలా తెలుసని ఆశ్చర్యం కలిగింది. తప్పకుండా అతడు తన పక్కూరి వాడయి వుంటాడని వూహించిండు.

“మీది దర్దెపల్లా?  వావిలాలా?” అని సెంద్రెయ్య అడిగిండు.

అవతలి వాళ్లు యేమీ మాట్లాడ లేదు.

“నత్తియెల్లయ్య సంగతి నాకు తెలుసు. నువ్వెందుకు జైలుకు పోయినవో కూడా నాకు తెలుసు. నువ్వున్న జైలులోనే నేను కూడా వున్నా. నన్ను నువ్వు గుర్తుపట్టలేవు. కానీ నీ గురించి నాకు తెలుసు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. మాతో కలిసి పని చేస్తావా?” ఆశగా అడిగిండు ఎదుటి వ్యక్తి.

స్నేహితుడి భార్యను చెరిచి చంపిన వాణ్ణి అంతం చేసి సెంద్రెయ్య జైలుకు పోయింది అందరికీ తెలుసు. జైలులో దొంగలుంటారు. అమాయకులుంటారు. మంచివాళ్లు కూడా చేయని నేరానికి కటకటాల వెనక వున్నోళ్లు వుంటారు. కిరాయి హంతకులు కూడా వుంటారు. ఇలా అర్ధరాత్రి ముఠాతో తిరుగుతున్నాడంటే తప్పకుండా దొంగతనం చేసే వ్యక్తి అని సెంద్రయ్యకు అర్థమైంది.

“నేను ఎవరితోనూ పని చెయ్యలేను. నేను ఇప్పటికే పుట్టెడు దుఖాన్ని మోస్తున్నాను. నా తండ్రి, భార్య, నాకెంతో యిష్టమైన నా చెల్లే, నన్ను గన్న నా తల్లీ ఇలా ఒకరితర్వాత ఒకరు చనిపోయారు. ఆ బరువు దించుకోవడానికే ఇలా సంచారం చేస్తున్నాను. మళ్లీ మీతో చేతులు కలిపి మరింత బరువును నేను మోయలేను. కాయలేను. నన్ను వొదిలెయ్యి” అని ముందుకు కదిలిండు.

 

“సరే, నీ యిష్టం. దారిలో నీళ్లు కూడా దొరకవు. ఈ తిత్తి తీస్కపో. ద్రాక్ష పండ్లతో చేసిన సారా వుంది ఇందులో. దూపయితే ఒక బుక్క తాగు. నువ్వు సంతోషంగా వుండాలి” అని ఒక తోలు తిత్తిని సెంద్రెయ్య మీదికి విసిరిండు. ఆ తిత్తిని చేతిలో పట్టుకొని వొడివొడిగా అడుగులు వేస్తున్నాడు.

 

రెండో జాము. ఎండాకాలం కదా. చల్లటి గాలి ఒంటిని తాకుతుంది. ‌దాహమేస్తుంది.

తిత్తి ముడి విప్పి మూడు బుక్కల ద్రాక్షా రసం తాగిండు. అది చాలా పాతది కావొచ్చు. రిమ్మ బానే యెక్కుతుంది.

యింకో నాలుగు బుక్కలు తాగిండు. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

ఒంట్లో అలసట ఎక్కువ అయ్యింది. ‌

ద్రాక్షాసారాయి గమ్మత్తుగా వుంది. హుషారు కమ్ముతుంది.

రావె రావె రావె యెల్లమ్మ

నిన్ను రాజులు కొలిచేరెల్లమ్మా పాట అప్రయత్నంగా తన నోటి నుండి వొచ్చింది. తనకు గుర్తొచ్చిన పాటల్లా పాడుకుంటూ నడుస్తున్నాడు.

తెల్లవారకముందే జగ్గయ్యపేట చేరుకోవాలి. యింకో జాము నడిస్తే చేరుకోవచ్చు.

 

కనుచూపు మేరలో ఒక వూరు కనిపిస్తుంది. యెర్రటి దీపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెల్లటి కాంతులు ఆ యిళ్ల నుండి బయటకు వ్యాపిస్తున్నాయి. తనకు తెలియకుండానే అటువేపు నడిచాడు.

యెర్రటి మంట మీద కోడిని ఒక అందమైన ఆడమనిషి  కాలుస్తూ వుంది. ఆ వీధిలోని యవ్వనంతో వొడితిరిగిన యువతి యింటి ముందు వాకిట్లో అందమైన చుక్కల ముగ్గు వేస్తుంది.

గుండ్రటి గుబ్బలు కన్పించేలా పల్చటి వస్త్రాలు ధరించిన యువతులు అటూయిటూ ఏవో పనుల మిషతో తిరుగుతున్నారు.

వాళ్లను  సెంద్రెయ్య ఆశగా చూస్తున్నాడు.

ఎవరు వీళ్లంతా? ఈ వూరి పేరేంటి? ఇదంతా మాయలా వుందే అని సందేహపడ్డాడు.

“ఇది మాయని నువ్వు అనుకొంటే అంతా మాయే. నిజమని అనుకుంటే ఇదంతా నువ్వు అనుభవించే సుఖం” అంది ఆ చుక్కల ముగ్గు వేసే యువతి.

తన మనసులో మాట వినపడిందా యేమి? అని సెంద్రెయ్య సిగ్గుపడ్డాడు.

కానీ సుందరాంగినులతో మాట కలపకుండా ఆగలేకపోతున్నాడు.

నీ పేరేందని అడిగిండు.

ఆమె వెచ్చని జాబిల్లిలా నవ్వుతూ వొగలు పోయింది.

“కళ” అంది ఒక చుక్కను నేల మీద వెలిగిస్తూ.

అక్కణ్ణించి లేచి యింట్లోకి వెళ్లింది. కొంటెగా చూస్తూ లోపలికి రమ్మని పిలిచింది.

సెంద్రెయ్య లోపలికి వెళ్లిండు. అందమైన హంసతూలికా తల్పం మీద అర్ధనగ్నంగా పడుకుని వుంది.

ఆమె రూపలావణ్యం పిచ్చిలేపుతుంది.

ఆ తెల్లని మేని ఛాయ బంగారు దీపం వెలుగులో మరింత పసిమిగా మారిపోయింది.

ఆమె రూపం, ఆమె మోహపు చూపులు  సెంద్రెయ్యను నిలవనీయట్లే.

కళ లేచి వయ్యారిలా అడుగులు వేస్తూ తన దగ్గరికి వొచ్చింది. ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేసింది. “నడిచీ నడిచీ అలిసిపోయినట్టున్నావు. నా ఒడిలో సేదతీరు. ఈ యెద వెచ్చదనం నీకు బాలేదా” అంటూ తల్పం మీదికి వొడుపుగా చేర్చింది.

సుఖానుభూతిలో సెంద్రెయ్య రంజిల్లాడు. రత్యానంతర అలసటతో ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు.

ఎంతసేపు అలా పడుకున్నాడో తనకు తెలియదు.

 

తన చెవులకు పాము బుసలు స్పష్టంగా వినపడుతున్నాయి.‌ కళ్లు నెమ్మదిగా తెరిచి చూసిండు. ఎదురుగా అయిదు తలల నాగు పాము తోక మీద నిలబడి వుంది.‌

ఆ పక్కనే మరొక పాము నిలబడి ఉంది. అది తననే చూస్తుంది.

దాన్ని యెక్కడో చూసినట్టు గుర్తు.

అది తన కంచెలో చూసిన పాము. కంచెకు కావలి కాసే నాగదేవత.

నన్ను అనుసరిస్తూ వచ్చిందా? సంభ్రమాశ్చర్యాలతో దానికి దండం పెట్టాడు. రెండు అడుగులు అది ముందుకొచ్చి ఆగింది. తలయెత్తి సెంద్రెయ్యను తాకి దీవించింది.

మళ్ళీ వెనక్కి వెళ్లి అయిదు తలల పాముతో కలిసి రాళ్లలో మాయమైంది.

తాను యెక్కడున్నానా అని చూసుకున్నాడు.

రెండు గుట్టల నడుమ ఒక వెడల్పాటి బండ మీద  వున్నాడు.

మరి తను చూసిన ఆ దీపాల వూరేది? నన్ను సుఖపెట్టిన కళ యేది? ఒట్టి బండల మీద పడుకున్నానా? అంతా మాయేనా? ద్రాక్షా సారాయి మహిమా యిది అని నవ్వుకున్నాడు.

బాయికాడి కంచెలోవుండే పాము యిక్కడికి రావడం మాయేనా?  తనకేమీ తోయలేదు.

 

తెల్లవారకముందే జగ్గయ్యపేట చేరుకోవాలి. చేతిలోని ద్రాక్షాసారాయి తిత్తిని వొదిలేసి ముందుకు సాగిండు. వేకువ జాముకు జగ్గయ్యపేట చేరుకొన్నాడు.  ఒక శివాలయం గోడ వెనకకు చేరుకున్నాడు.

నడిచీ నడిచీ నొప్పి పెడుతున్న పాదాలను చేతులతో వొత్తుకున్నాడు. అలసిన కన్నులను, సొలసిన శరీరాన్ని సేదతీర్చ నేలకు వీపు ఆనించాడు.

 

మరో రేతిరి నాలుగు గంటలకు బెజవాడ గుట్టమీది జేగంటలు మోగే యాలకు చేరుకున్నాడు సెంద్రెయ్య.

కృష్ణా బ్యారేజి కింద యిసుకలో ఒళ్లు తెలియకుండా నిద్రపోయిండు.

 

సూర్యుడు వేడిగా తాకుతున్నాడు. యిసుక కూడా మంటపుడుతుంది. బెజవాడలో మార్కెట్ లో  లారీలు, జీపులు, కార్లు హడావుడిగా తిరుగుతున్నాయి. వాటి చప్పుడు తనకు చికాకు కలిగిస్తుంది.

కూతలు పెడుతూ పరిగెత్తే రైళ్లతో కృష్ణా నది వంతెన మెత్తగా కదులుతుంది.

కృష్ణా నదిలో ఈదాలి. తనను వేధించే ఆలోచనలను ఆ నీళ్లతో కడిగేయాలి. ఎక్కడో పుట్టి అనేక అడ్డంకులు దాటుకొని వచ్చే ఈ నీళ్లు నాలాంటివే అనుకున్నాడు, వాటిని చేతిలోకి తీసుకొని.

బ్యారేజీ గేట్లు మూసి వున్నాయి. వాటి యెనక నీళ్లతో నిండు కుండలా వుంది కృష్ణ.

ఒంటి మీది గుడ్డలతోటే అందులోకి దూకిండు. చల్లటి నీళ్లలో చేపలా ఈదుతూ చాలా దూరం పోయిండు.

ఒక్కసారి ఒడ్డు వైపు చూసిండు.

ఒకామే బట్టలు పిండుతూంది. యింకా తనలాగే ఉత్సాహంతో నీళ్లలోకి దిగి ఈదుతున్న కోడే ఈడు పిలగాళ్లు కనిపించారు.

ఈ నది మధ్యలో అన్నీ వొదిలేస్తున్నా అని నీళ్లలోకి మునిగిండు.

అలా మూడుసార్లు మునిగిండు.

మళ్లీ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

బట్టలను జాగ్రత్తగా ఉతుకుతున్న ఆమే సెంద్రెయ్యను గమనించింది.

ఒడ్డు మీదకు చేరి, తువ్వాలను నడుముకు చుట్టుకొని బట్టలన్నీ ఉతికి ఆరేసిండు.

ఒడ్డుకు ఇసుకలో కూచోని ఆ నీళ్లకేసి చూస్తున్నాడు.

ఒక్కసారిగా తమ్ముడు యెంకటయ్య గుర్తొచ్చిండు. వూరు యాదికొచ్చింది. పిల్లలు కళ్ల ముందు కనిపించిండ్లు. వాళ్లనొదిలేసి, చెప్పాపెట్టకుండా వొచ్చేసినందుకు వాళ్లంతా యెంత గాబరా పడుతున్నారో అనిపించింది. యెంకటయ్య యెట్లా వున్నావురా అని తమ్ముణ్ణి  తలుచుకుంటూ బోరుమని విలపించాడు.

సెంద్రెయ్యను ఆమె గమనిస్తూనే వున్నది.

అతడు లేచి దోసిళ్లలోకి కృష్ణా నీళ్లు తీసుకొని మొహాన్ని కడుకున్నాడు‌.

ఆమె పిండిన బట్టలారేస్తూ అంది.

“కృష్ణలో స్నానం చేస్తే ఒంటి మీద మైల పోతది గానీ మనసులోని మైల పోదు.

నీదేవూరోగానీ అబ్యా, అన్నీ సర్దుకుంటాయి. యేవీ బెంగపడమాక” అంది.

ఆ మాటలు తనకు సూటిగా తగిలాయి. నిజమే కృష్ణా గోదావరి చివరికి కాశీలోని గంగలో స్నానం చేసినా సరే, చిత్త మలినం పోదు. మరి యెలా పోతుంది? యెలా తనను వేధించే జనన మరణాల నాటకానికి ముగింపు యెక్కడ దొరుకుతుంది? ఇన్ని బాధలుపడి రాత్రులంతా కష్టపడి నడిచి వొచ్చింది ఎందుకు? రాత్రి పూట మాత్రమే ప్రయాణం చేయమని ఆ మహానుభావుడు చెప్పి నన్ను మోసం చేశాడా? అదంతా భ్రమా? నిజమా? ఏదీ అర్థం కాక ఆమెకేసి చూసిండు.

ఆమె నవ్వింది మల్లా. ‘చూడయ్యా, మనం అతిగా ఆలోచించి గాబరా పడొద్దు. మనం చేసే పనితోనే మన మనస్సును కడిగేయాల. నీ మనసులో సమాధానం దొరకని ప్రశ్నలు సవాలక్ష వొస్తాయి. వాటికి సమాధానం యెతకతానని బయల్దేరావా, యిక అంతే. అవి దొరకవు. అంతములేని ఆలోచనలే యాతనకు మూలం. ముందుగాల ఆలోచించడం మానేయి. చావూ, పుట్టుక, మధ్యలో బతుకు అంతా మనం అనుకునేది. యెట్టా కోరితే అట్టా చస్తాము. అట్టాగే పుడుతాం. యెట్టా కొరుకుంటే అట్టా బతుకుతాము. ఏదీ కోరుకోకపోతే ఏదీ వుండదు. అట్టా అని మనకు నచ్చనివి జరక్క మానవు. నచ్చేవి జరిగి తీరుతాయని కూడా ఏమీ లేదు. అర్థమయ్యిందా?” అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. ఎంత బాగా చెప్తుంది? ఈ ఆడమనిషికున్న గ్నానం నాకు లేకుండా పోయిందే? నేనెంత మూర్ఖుణ్ణి. పనికిరాని మెట్టవేదాంతమంతా వెతికానే. ఏది సత్యమో తెలుసుకోవాలని యింత దూరం వొచ్చానే అనుకున్నాడు. తన అగ్నానానికి సిగ్గుపడ్డాడు. ఆమె ముందు తనకుతానే చాలా చిన్నపిల్లాడిగా అనిపించాడు.

సరే, మరి యిప్పుడు తనేం చేయాలి? మళ్ళీ వూరికి యెళ్లిపోవాల్నా? లేదా యిక్కడే వుండి ఏదైనా పని చేసుకోవాల్నా? తనకేమీ తోయటం లేదు.

ఆమె వైపు ఏం చేయమంటావు అన్నట్టు చూసిండు.

సెంద్రెయ్యను తన వెంటరమ్మని సైగ చేసింది.

బుద్ధిమంతునిలా ఆమెను అనుసరించిండు.

నెత్తిమీద బట్టల మూటను మోస్తూ ఆమె చకచకా నడుస్తుంది.

బెజవాడ మార్కెట్ ముందట ఆగింది. ఈడే నువ్వు యెతికే సత్యం దొరుకుద్ది. నువ్వు ఆలోసిత్తా కూసుంటావో, ఒళ్లు వొంచి పని సేత్తావో నీ యిష్టం అని చెప్పి ఆమె వెళ్లిపోయింది.

ఆ మార్కెట్ ముందు నిలబడి బెజవాడ కొండలను తేరిపార చూసిండు.

బెజవాడకు కాపలా కాస్తున్నా మహాకాయుడిలా వున్నాయి.

శ్రమలోనే సత్యం దాగుందా తెలుసుకుందామని అడుగు ముందుకేసిండు సెంద్రెయ్య.

*

జిలుకర శ్రీనివాస్

5 comments

Leave a Reply to Anwar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బైండ్ల సెంద్రయ్య కథల్లో భాగంగా ‘ అన్వేషణ ‘ కథ ఉక్కిరి బిక్కిరి చేసేసింది. కథలో సెంద్రయ్య ఎలా పరుగెత్తుతున్నాడో … మనం కూడా కథ చదువుతు పరుగెత్తేలా చేసిండు కథకుడు.
    మాయా మొహం, మోహ మాయ అంతా జమీలిగా సాగింది. కథలో అవసరమైన మేరకు కాల్పనికతను చేర్చి గొప్పగా రక్తి కట్టించినా ప్రధానపాత్ర అన్వేషణను ఎక్కడా ఆపలేదు.
    కథ త్రిలింగ్ గా , ఎగ్సయిట్ గా ఉంది.
    డా. జిలుకరన్నకు అభినందనలు

  • Excellent narration of the philosophy of the life that suits our oppressed people. Serpents eating grass is ? 🙏🙏🙏🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు