నిద్రలోంచి ఉలికి పడి లేచాను
బరువెక్కిన రెప్పలు విచ్చుకొని
చూపులబాణాల్ని గోడలకి తగిలించాయ్
గోడలన్నీ శూన్యమై తెల్ల కాగితాలయ్యాయి
ఆలోచనల్లోంచి ఇహంలోకి వచ్చాను
కలం నా వేళ్ళమధ్య పొందికగా కూర్చుంది
అల్మారా లోంచి పుస్తకాలన్నీ విచ్చుకుని
అక్షరాలన్నీ కాగితం మీద ఒలికిపోయాయి
శ్వాసలోంచి గుండెని తట్టిన సవ్వడి విన్నాను
ఊపిరి గట్టిగా పీల్చి నెమ్మదిగా వదిలాను
హృదయాన్ని ఊయలలూపుతూ
స్వరపేటిక లయబద్ధంగా రాగాల్ని వదిలింది.
ధ్యానంలోంచి పిలుపు విన్నాను
ఆత్రంగా ఇహంలోకి మనసు తెరుచుకుంది
ఇంటినిండా కొలువు తీరిన శిల్పాలన్ని
ప్రాణం పోసుకుని సంతాపసభ పెట్టుకున్నాయి.
నిద్రలోంచి ఆలోచనల్లోంచి శ్వాసలోంచి
ధ్యానంలోంచి దృఢత్వాన్ని సంతరించుకున్న
దోసిట నిండిన నా పవిత్రప్రాణాన్ని ఆర్తిగా
మరింత ప్రేమగా నాలోకి నింపుకున్నాను
నేనిప్పుడు ఒకరినో ఇద్దరినో కాదు అనేకని.
*
Add comment