అనగనగా అంటూ అన్నిటిలాగే
మొదలయ్యింది ఆ కథ
అక్షరం అక్షరం కూర్చి
శ్రద్ధగా వాక్యాలల్లినా
పాత్రలన్నీ అస్పష్టమే
చినుకూ చినుకూ
కలిపి కురిసిన గాంధారివానకు
దృశ్యాలూ మసకబారాయి
వేణువు కోసం వనాలలో
వెతుకుతూ ఉన్నాడతను
గొంతు నుండి ఏదో తీయని పాట
అంతలోనే గుక్కపట్టి ఏడుపు
అతను పసివాడో పడుచువాడో
తెలియనే లేదు
వెదురుపొదల్లో వెన్నెలని
ఒంపిపోతుంది ప్రకృతి
అతనికిక వేణువు అవసరం లేదని
అలలలోని లాలననంతా
ఒడిలో పరిచి ఓదార్చింది
ఆ ప్రకృతి అతని తల్లో ప్రేయసో
స్పష్టంగా లేదు
ఏదైతేనేం,
పాటల సవ్వడి ఆగగానే
భూమి తిరగడం ఆగిపోయింది
అతను కలలోకి జారగానే
కాలమూ అలాగే నిలిచిపోయింది
అనగనగా ఎప్పుడో మొదలైన కథకి
బహుశా ఇక ముగింపు లేదు
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
కాలమూ అలాగే నిలిచి పోయింది
Thank you
బాగుందండి.. కవిత కథ
Thank you