ఒక వెన్నెల, మళ్లీ తపస్సు

వెన్నెల
చైత్రం విచ్చుకొన్నట్టుంది
నిప్పుపూల చైత్రం
వేపగాలి చైత్రం
పుప్పొడి పరిమళం
పరమాన్నం వండిన
ఇత్తడి గిన్నెలా
ఆకాశం
ఆరుబయట
నులకమంచం మీద
కదులుతోన్న మబ్బుల వల
****
కలల్లాగే
కవితలు కూడా
దృశ్యశ్రవణ రూపాల్లో
కళ్ల ముందు కనబడతాయి
పట్టుకునే క్షణంలో
పక్షులై ఎగిరిపోతాయి
కొంగలసాయం తీసుకొన్న
ఎండ్రకాయలా
ఎండిన పుల్ల పట్టుకొని
ఎదురుచూస్తూ
తడిలేని చెరువులో
మళ్లీ తపస్సు
*

గాలి కూడా గుల్మహారే

నిన్న నిశ్శబ్దాన్ని
కలల్లో రంగరించి
ఇవాళ కలకూజితాలతో
ఉదయాన్ని ఆవాహన చేసినట్లుంది

పొద్దున్నే గంపనెత్తుకుని
ఏరి పారేసే కరివేపాకు
శబ్దాన్ని వీధి వీధంతా విసిరే
ఆకుపచ్చ పరిమళం

గొంతు సవరించుకున్న
జాజిపూల పదస్వనం

బాల్య కౌమారాల
మెట్లమీద కూర్చుని
కొత్తగా చూసే సంధ్య వేళ
శబ్దమూ, కదలికా కూడా
సమ్మోహ మోహినీ రూపమే
గాలి కూడా గుల్మహారే.

*

Indraganti Prasad

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు