అతడు – నువ్వు – నేను
ఒకటి – రెండు – మూడు
ఒకరి తర్వాత ఒకరు
ఒకరి మీద ఒకరు
పరుగో పరుగు
డెడ్-ఎండ్ చీకటి గుయ్యారానికి
ఎంతెంత దూరం
కూటికి కాటికి ఇంకెంత దూరం
ఇక్కడేమీ లేదు
ఏ రక్షకుడూ కనపడుట లేదు
ఏ మేఘమూ వర్షించుట లేదు
ఇది మనుషుల ఎడారి
ఎడం ఎడం మనుషుల ఎడారి
ఒంట్లో నిప్పుల వేడి
భరించలేని ఆత్మీయ ఆహాస్పిటాలిటీ
అదుగో ఆక్సీక్రిమేటర్ క్రిమి రెమ్ డిసీవర్
ఈ వలలో ఈవల ఎగ ఊపిరి తుది ఆవిరి
హంస ఎగిరిపోతూ పోతూ –
అదే హంసగీతం మించిన ఫిడేలు వాదనం
మోహన జన సమ్మోహన రాగం
ఒహ్హో నీరో ఆహా నీరో
నువ్వే నా సారో హీరో
ఇది పగటి చీకటి రాత్రి
గుండె పగుళ్ళ రోదనా ధరిత్రి
ఇటనిక ఉండదగదనిపిస్తూ
ఈ బ్రతుకు కటికి చేదనిపిస్తూ
ఏదో అగాథం అంచుకు నెట్టేస్తూ –
ఈ బెడ్ కి, ఆ డాక్టర్ కి, అల్లదుగో ఆ నర్సుకి
కిత్ అండ్ కిన్ కి
బై బై చెప్పుకొని
దోసెడు దుమ్ము నెత్తిమీద చల్లుకొని
నన్ను నేనే మూటగట్టుకుంటూ
నా పార్థివ దేహం నేనే మోసుకుంటూ –
అహో! దుర్భర విషాద మోదం
ఒకటి – రెండు – మూడు
వెయ్యి – లక్ష – కోటి
ఎంతెంత దూరం
కోసెడు కోసెడు దూరం
నన్నడగని నా పయనం
తొందర చిందరవందరగా
ఇద్దరి నుంచి అద్దరికి
ఎంతెంత దూరం
ఇంకెంత దూరం
అదుగో అదుగో వైతరణి తీరం
(కోవిడ్-19, అంతకు మించి ప్రభుత్వ నిర్లక్ష్యం-2021 తో వెళ్ళిపోయిన మిత్రుడు గొడవర్తి వెంకట సుబ్రహ్మణ్యం తలపులో)
——-
చిత్రం: రాజశేఖర్ చంద్రం
గొప్ప స్నేహితునికి ఆత్మీయ ఆవేదనా పూరిత నివాళి .
ఒకానొక అరక్షిత ప్రపంచంలో కునారిల్లుతున్న మనిషి హీనస్వరాన్ని తార్కికంగా, తాత్త్వికంగా తూకం వేసిన కవిత. బతుకు మూలాల్లోని డొల్లతనాన్ని హేళన చేసిన కవిత.
‘ఆహాస్పిటాలిటీ’, ‘ఆక్సీక్రిమేటర్’ వంటి వైవిధ్య పదబంధాలతో కవితను కొత్త ఎత్తులకు తీసుకెళ్లటం పాపినేని గారి ప్రత్యేక విద్య.
అలా అలా చాలామంది వెళ్లిపోతున్నారు. విషాదం ప్లస్ దుర్మార్గం.
ఆహాస్పిటాలిటీ. రెం డిసీవర్ లాంటి coinage శివశంకర్ లాంటి కొద్దిమంది గొప్ప కవులకే తెలిసిన విద్య..