అవును. అతను జీవించినది సుమారు 27 వేల రోజులు. పాడినవి 40 వేల పాటలు.
అవును. ఘంటసాల గారి జీవిత కాలం 52 సంవత్సరాలు. మహమ్మద్ రఫీ జీవిత కాలం 56 సంవత్సరాలు. అతను సినిమాలలో పాడిన కాలం ఇంచుమించు ఆ జీవిత కాలాలతో సమానం….. 54 సంవత్సరాలు.
అతని గాన మాధుర్యం యావత్ భూగోళం వ్యాపించింది. అతని గుప్త దానాలు అనేక మందికి జీవితాలకి ఊపిరి పోసింది. అతని హాస్య చతురత అందరినీ ముసి ముసి నవ్వులతోటీ, కడుపుబ్బా నవ్వించి ఆహ్లాదాన్ని పంచిపెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోడానికి అతని శతకోటి అభిమానులు ఒకరి మీద ఒకరు పోటీ పడీనా, ఇంకా కొంత సమాచారం మిగిలిపోతూనే ఉంటుంది. ఇక అతని స్నేహ పరిమళం చాలా మంది అదృష్టవంతుల జీవితాలని ఆనందమయం చేసింది. అలాంటి అదృష్టవంతులలొ నేనూ ఒకడిని. 40 ఏళ్ళ పాటు అతని అపరిమితమైన ఆత్మీయతని ఆస్వాదించి, ఇప్పుడు గుండె తరుక్కుపోయి సతమతమవుతున్న వారిలో నేనూ ఒకడిని. ఆ జ్ఞాపకాలలో కొన్ని నెమరు వేసుకుంటూ ఎస్.పీ . బాలసుబ్రమణ్యానికి నివాళి అర్పిస్తున్నాను.
నాకు అతను పరిచయం అయినప్పుడు “ఘంటసాలకి వారసుడు వచ్చాడు” అని కొందరూ, “ఘంటసాల లేని లోటు తీర్చగల గాయకుడు” అని ఘంటసాల కన్నా భిన్నమైన అతని బాణీ లో కొత్త దనాన్ని గుర్తుపట్టిన విజ్ఞులూ అనుకున్నారు. అతని గాన మాధుర్యానికి మొదటి ప్రబల నిదర్శనం “శంకరాభరణం”. ఆ సినిమా విజయాన్ని పురస్కరించుకుని 1981 లో మా హ్యూస్టన్ లో “శంకరా భరణం నైట్” అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించే అదృష్టం నాకూ, అనిల్ కుమార్ కీ కలిగింది. ఈ బృందం లో సభ్యులు కె. విశ్వనాథ్ గారూ, జె.వి. సోమయాజులూ, సాక్షి రంగారావూ, తులసి, మాధవపెద్ది సురేష్ మొదలైన వారితో సహా ఎస్. పీ బాలూ, భార్య సావిత్రి గారూ, ఏడెనిమిదేళ్ళ కొడుకు చరణ్, పది పన్నెండేళ్ళ కూతురు పల్లవి, ఇంకా వోణీలు వేసుకున్న చెల్లెలు ఎస్. పీ శైలజా వెరసి సుమారు 15 మందినీ విమానాశ్రయంలో స్వాగతం పలికి, ఆహ్వానించి ఇళ్ళలో ఆత్మీయంగా ఆశ్రయం ఇచ్చాం అప్పటి మా అమెరికా ఆచారం ప్రకారం.
అలా మా ఇంట్లో “సద్దుకున్న” వాళ్ళు ఎస్. పీ. బాలూ మొత్తం కుటుంబం, మాధవపెద్ది సురేష్ తో సహా మరొక నలుగురువాద్య సహకారులు. సద్దుకోవడం అంటే…..మా ఇంట్లో మంచాలు చాలక నేనూ, బాలూ నాలుగైదు రోజులు కార్పెట్ మీదనే దుప్పటీ వేసుకుని పక్క పక్కనే పడుకోవడం అన్నమాట. కార్పెట్ ఒకటే అయినా కప్పుకున్న దుప్పట్లు వేరే వేరే అనుకోండి.అది వేరే విషయం. అదీ మా తొలి పరిచయం.
ఆ పరిచయం స్నేహంగా మారడానికి ఎంతో కాలం పట్ట లేదు. దానికి కారణం అతని చొరవే. పైగా ఎప్పటికప్పుడు తనే పలకరిస్తూ, నేను పలకరించినప్పుడు వెనువెంటనే స్పందిస్తూ ఆ స్నేహం 40 ఏళ్ళు నిలబెట్టిన ఘనత కూడా అతనిదే. అతను ఒక అయస్కాంతం. అతను మన దగ్గరకి వచ్చినా, మనం అతని దగ్గరకి వెళ్ళినా అతుక్కుపోతాం. ఇక వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఎందుకో కానీ అతనే తొందరపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని కోట్లాది అభిమానులు అయస్కాంతం లేని ఇనుప రజంలా కకావికలంగా, చెల్లాచెదరై పోయారు.
మా ఇద్దరి స్నేహ ప్రస్థానం ఎలా మొదలయిందీ అంటే……అతనితో 1981 లో తొలి పరిచయం అయిన తర్వాత రెండేళ్ళకి నేను ఇండియా వెళ్ళినప్పుడు, అది తెలిసి, నన్ను వెతికి పట్టుకోడానికి ఆఖరికి మా అక్కకి కూడా ఫోన్ చేశాడు. మరో ఆర్నెల్లకి తనే అమెరికా వచ్చినప్పుడు నన్ను పిలిచి నేను ఇండియాలో కలుసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయినందుకు ఆత్మీయంగా కోప్పడడం నేను ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి అతని ఆత్మీయ సంబోధన “అన్నదాత గారూ”. ఆ తర్వాత అది “అన్న గారూ” అని మరింత ఆప్యాయంగా మారింది. అసలు అప్పుడెప్పుడో ఏదో నాలుగు రోజులు మా ఇంట్లో ఉన్నంత మాత్రాన అప్పటికే ఎంతో గొప్పవాడై పోయిన బాలూ నా బోటి సర్వ సాధారణమైన వాడికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలీ? అదే బాలూ అంటే….
భాషతో ప్రమేయం లేకుండా అన్ని భాషలలోనూ, మరీ ముఖ్యంగా తెలుగులో అక్షర ప్రేమికుడైన బాలూకి రచయితలు అంటే ప్రత్యేకమైన గౌరవం. నా మీద అభిమానానికి బహుశా అది కూడా ఒక కారణమే. ఒక సారి….అంటే ఐదారేళ్ళ క్రితం మా హ్యూస్టన్ లో స్వరాభిషేకం కార్యక్రమం జరిగింది. ఎప్పటిలాగానే ఆ ముందు రోజు బ్రేక్ ఫాస్ట్ కి కలిసినప్పుడు సరిగ్గా అప్పుడే విడుదల అయిన నా కథల పుస్తకం ఒకటి అతనికి ఇచ్చాను. ఎప్పటిలాగానే అని ఎందుకు అన్నానూ అంటే….బాలూ అమెరికాలో తెలుగు సంఘాల జాతర్లకి ఎప్పుడు వచ్చినా “మీరూ వచ్చారా?” అని ఒక మెసేజ్ పంపించేవాడు…తన స్వదస్తూరీతో కంప్యూటర్ టాబ్లెట్ మీద. “వస్తే, సాయంత్రం బాంక్వెట్ లో కలుద్దాం” అనే వాడు. తీరా ఆ బాంక్వెట్ లో కలిశాక, పక్కనే కూచోబెట్టుకుని ఒక చిన్న కాగితం ముక్క నా చేతిలో పెట్టి, చెవిలో రహస్యంగా ” రేప్పొద్దున్న బ్రేక్ ఫాస్ట్” కి రండి. వాళ్ళేదో ఉప్మాయో, పొంగలో పంపిస్తారు. అది పంచుకుంటూ, కబుర్లు చెప్పుకుందాం. రోజు మొదలయితే ఇక అంతే సంగతులు. అస్సలు టైమ్ ఉండదు.” అదీ ఆ రహస్యం సారాంశం.
ఆ కాగితం ముక్క మీద అతని హొటెల్ రూమ్ నెంబర్ ఉంటుంది. ఏదో రకంగా ఇలా చాలా సార్లే జరిగింది. అలాగే మా హ్యూస్టన్ లో పొద్దున్న బ్రేక్ ఫాస్ట్, ఓ రేడియో ఇంటర్వ్యూ, నా పుస్తక బహూకరణ అవీ అవగానే సాయంత్రం ప్రోగ్రాంకి వెళ్ళాను. గాయని సునీత ఎమ్సీ…ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతూ ఉంటే ఒక నిర్వాహకుడు మొదటి వరసలో కూచున్న నా దగ్గరకి గబ గబా వచ్చి “రాజు గారూ, మీరు అర్జంటుగా గ్రీన్ రూమ్ లోకి వెళ్ళి బాలూ గారిని చూడాలి” అన్నాడు. “ఏమయిందో” అని నేను వెనక్కి వెళ్ళి చూస్తే….పాట, పాటకీ మధ్య తెర వెనక్కి వచ్చి బాలూ కూచునే కుర్చీలో నేను పొద్దున్న ఇచ్చిన నా కథల పుస్తకం తెరిచి ఉంది. నేను నిర్ఘాంతపోయి “బాలూ గారూ, అవతల ప్రొగ్రాం అవుతుంటే ఇదేమిటీ?” అని అడిగాను. అతను నవ్వేసి “మధ్యే మధ్యే కాస్త కామెడీ ఆట విడుపు కావాలిగా” అనేసి, నా భుజం తట్టేసి ఇంకో పాట పాడడానికి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. ఆ పుస్తకం పేరు “అమెరికామెడీ కబుర్లు”.
ఇక, ఐదారేళ్ళ క్రితం కొందరు మిత్రులు “మన తెలుగు టీవీలలో అన్నీ భోరుమని ఏడిపించే సీరియల్సే కానీ, హాయిగా నవ్వుకునే సిట్యుయేషన్ కామెడీలు లేవు. ఉన్న జబర్దస్త్ లాంటి అశ్లీలమైనవి కుటుంబపరంగా చూసేవి కాదు. అంచేత అమెరికా నేపధ్యం లో నువ్వు వ్రాసిన కథలని సరదా సీరియల్ గా తీస్తే బావుంటుందీ” అని నన్ను రెచ్చగొట్టారు. నాకు కూడా “కదా” అనిపించింది. అంతకు ముందు నేను జి తెలుగు వారి ఒకానొక టీవీ సీరియల్ లో ఆరు ఎపిసోడ్స్ లో నటించడానికి గొల్లపూడి వారే పరోక్షంగా కారణం అయిన గొల్లపూడి మారుతీ రావు గారిని ముందు పిలిచి, వెంటనే బాలూ ని పిలిచాను.
నా సోది అంతా జాగ్రత్తగా విని “మీరు 13 ఎపిసోడ్స్ కి స్క్రీన్ ప్లే రాయడం మొదలుపెట్టండి. ఈ లోగా నేను నాకు తెలిసిన టీవీ వాళ్ళ తో మాట్లాడతాను” అనగానే నాకు ఎక్కడ లేని బలం, ఉత్సాహం వచ్చేసింది. ఐదారు నెలలలో పూర్తి స్క్రీన్ ప్లే తో సహా పదో, పదిహేనో ఎపిసోడ్స్, మరొక పదో ఎన్నో సంక్షిప్తంగానూ వ్రాశాను. అవన్నీ అన్నీ ప్రింట్ చేసి ఒక పెద్ద 200 పేజీల బైండర్ చేసి బాలూ తో “ఉప్మా తినడానికి” వెళ్ళినప్పుడు అతనికి ఇచ్చాను. అతను ఆత్రంగా గబ గబా పేజీలు తిరగేశాడు. సరిగ్గా అదే సమయం లో చిన్న తమాషా జరిగింది. సినీ హాస్య నటి హేమ రంగ ప్రవేశం చేసింది. బాలూ ఆవిడతో..”భలే టైముకి వచ్చావు. ఈయన అమెరికా కామెడీ రైటర్…టీవీ సీరియల్ రాసి పట్టుకొచ్చారు. ఆయన ఫేవరెట్ పాత్ర క్వీన్ విక్టోరియా కి నువ్వు సూట్ అవుతావు” అని నన్ను పరిచయం చెయ్యగానే నా గుండె గుభేలుమంది. హేమ గలగలా నవ్వేసి “టీవీ సీరియల్ అయితే కుదరదు సార్. సినిమా తీస్తే చెప్పండి. నేను రెడీ” అనేసి బాలూ ని అడిగి ఒక కాగితం ముక్క మీద తన సెల్ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి “మీరు బిజీగా ఉన్నారు. మళ్ళీ వస్తాను” అని ఎంత తొందరగా వచ్చిందో అంత హడావుడిగానూ వెళ్ళిపోయింది.
కట్ చేస్తే…..బాలూ ధర్మమా అని ఈటీవీ, మా టీవీ వగైరాలతో మంతనాలు సాగీ…సాగక ఆ ప్రయత్నానికి గండి పడింది. ఇక్కడ మరో చిన్న సంగతి చెప్పాలి. తన మాట నిలబెట్టుకోవడం కోసం, నాకు చెప్పకుండానే బాలూ ‘మా టీవీ’ క్రెయేటివ్ హెడ్ గా ఉన్న ఒకావిడని పిలిచి “నా అమెరికా మిత్రుడు వంగూరి చిట్టెన్ రాజు గారు మంచి హాస్యంతో ఒక సీరియల్ వ్రాశారు. ఆయనకి అవకాశం కావాలి” అని చెప్పగానే ఆవిడ ఆశ్చర్యపోయి “ఆయన నాకు కూడా బాగా కావలసిన వారే” అని చెప్పింది, “మా ఆరాధ్యదైవం బాలూ గారు స్వయంగా మీ గురించి నన్ను పిలిచి నాతో మాట్లాడడం ఇంకా నమ్మ బుధ్ది కావడం లేదు” అని ఆవిడ ఇప్పటికీ మురిసిపోతూనే ఉంటుంది. ఆవిడ పేరు బలభద్రపాత్రుని రమణి.
మొత్తానికి “సాక్షాత్తూ జంధ్యాల దిగి వచ్చి తీసినా, ఇలాంటి హ్యూమర్ ఎవరూ చూడరు సార్. కావాలంటే అమెరికాలో ఇండియన్ లెస్బియన్లు, గే మేరేజెస్ మీద ఏదైనా ఫన్నీ గా ఒక సీరియల్ రాయండి.” అని ఒకానొక టీవీ వారు, వారి గెస్ట్ హౌస్ లో నాలుగు రోజులు నాకు ఆతిధ్యం ఇచ్చాక నాకు చెప్పగానే, నాకు ఒళ్ళు మండిపోయింది. ఏకంగా ఒక సినిమాయే తీసేద్దాం అని ఆవేశపడి మళ్ళీ బాలూని పిలిచాను. జరిగిన సంగతి విని, నేను సినిమా తీస్తాను అనగానే బాలూ “మీకేమన్నా బుధ్ది ఉందా?” అని ఎంతో ఆప్యాయంగా కోప్పడి, బుధ్ధున్న వాడు ఎవడూ తెలుగు సినిమా ఎందుకు తియ్యకూడదో నాకు వివరంగా చెప్పి నా చేత ఆ ప్రయత్నం విరమించేలా చేశాడు. బాలూ చెప్పినదల్లా ఒకటే” తెలుగు సినిమా తియ్యడం చాలా ఈజీ. కానీ దాన్ని విడుదల చెయ్యలేరు.” అతని స్నేహానికీ, అతను మన మంచి కోరే మిత్రుడూ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి?
మరొక మరపురాని సంఘటన….న్యూయార్క్ లోనో, న్యూ జెర్శీ లోనో ఒకానొక మహా సభలో నాగఫణి శర్మ గారి త్రిగుణిత అష్టావధానం..అంటే 24 మంది పృచ్చకులు. కె. విశ్వనాథ్, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, యండమూరి మొదలైన వారు ప్రధాన పృచ్చకులు గా ఉన్న ఆ అవధానానికి బాలూ, నేనూ, యడవల్లి రమణ మూర్తి (చికాగో), డ్వాదశి శర్మ (ఇండియానాపొలిస్) …మేము నలుగురం అప్రస్తుత్త ప్రసంగం. అయితే బాలూ వేదిక మీదా, మేము ముగ్గురం క్రిందన కుర్చీలలోనూ కూచున్నాం. ఆ రోజు నా అప్రస్తుతం ఎంతా బాగా వచ్చిందీ అంటే..మధ్యలో ఒక సారి బాలూ వేదిక మీద లేచి నుంచుని “రాజు గారి అప్రస్తుతం ముందు నా అప్రస్తుతం దిగదిడుపుగా ఉంది కాబట్టి నేను వేదిక నించి దిగిపోతాను. ఆయనే ఇక్కడ కూచోవాలి” అని చిన్న హడావుడి చేశాడు బాలూ….అదీ అతని వినయ సంపదకి ఒక ఉదాహరణ.
మరొక సారి….బాలూ బృందం, మెజీషియన్ బి.వి. పట్టాభిరామ్ గారి కార్యక్రమం కూడా హ్యూస్టన్ లో జరిగినప్పుడు, నేను కూడా ప్రధాన నిర్వాహకులలో ఒకడినే. అందులో రెండు విశేషాలు ఇంకా గుర్తున్నాయి. ఒకటేమో పట్టాభిరామ్ తన మేజిక్ షో లో ఒక మనిషిని ఒక యంత్రం లో పెట్టి నడుం దగ్గర కత్తితో అడ్డంగా నరికేస్తాడు. ఆ నరకబడిన మానవుడు ఎవరో కాదు. నేనే…ఆ అద్భుతాన్ని ప్రేక్షకులు చూసి నిర్ఘాంత పోతూ ఉంటే అది చాలదు అన్నట్టు ఎస్పీ బాలూ స్టేజ్ మీదకి వచ్చి, “పోవుచున్నాడే, మా రాజు…దివి నుండి భువికీ” అంటూ విచారం అభినయిస్తూ పాడుతూ ఉండగా ప్రేక్షకులు నవ్వ లేక చచ్చిపోయారు. వెంటనే, నన్ను పట్టాభిరామ్ మళ్ళీ బతికించాడు అనుకోండి. అది వేరే సంగతి.
రెండో విషయం…. ప్రోగ్రామ్ మధ్యలో కాస్త సరదాకి “రాజు గారూ. ఓ సారి వేదిక మీదకి రండి” అని నన్ను పిలిచాడూ. “ఎందుకా?” అని నేను ఆశ్చర్యపోతూ స్టేజ్ ఎక్కగానే, బాలూ “పాడు పిల్లాడూ, పైన పడ్తాడూ”…అనే అలనాటి మాడా వెంకటేశ్వర రావు హాస్యం పాట పాడుతూ నన్ను దానికి డాన్స్ చెయ్యమని రెచ్చగొట్టాడు. ఇక ప్రేక్షకులు కూడా ఆ డాన్స్ చెయ్యమని ఒకటే చప్పట్లు నన్ను. తప్పుతుందా….పక్కనే ఉన్న ఒక గుడ్డ ముక్క పైటలా వేసుకుని బాలూ పాడూతూ ఉండగా స్టెప్పులు వేస్తూ ఆ పాటకి “‘అదో రకం” డాన్స్ చేశాను. అంతకు ముందు ఒక సారి మా స్థానిక సాంస్కృతిక కార్యక్రమం లో ఆ డాన్స్ చేశాను. అది బాలూ ఎవరు చెప్పారో నాకు తెలియదు. అనుకోకుండా బాలూతో అప్పటికప్పుడు జరిగిన ఆ రెండు సరదా అనుభవాలూ ఎప్పటికీ మర్చిపోలేనివే. నాకే కాదు. ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పట్టాభిరామ్ ని పలకరిస్తే ఆయనా ఆనాడు నన్ను అడ్దంగా నరికెయ్యడం, బాలూ స్పాంటేనియస్ చమత్కారం గుర్తు తెచ్చుకుంటాడు.
ఇలా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో….ఎంత చిన్న చిన్నవైనా…ప్రగాఢమైనవి అయినా…అన్నీ మధుర క్షణాలే… అన్నీ లోపల దాచుకుని, కొన్ని మాత్రమే ప్రస్తావిస్తూ, ఆ కారణ జన్ముడి కి నీరాజనాలు అర్పిస్తున్నాను.
*
చిట్టెన్ రాజుగారూ,చాలా అదృష్టవంతులు మీరు, బాలుగారి సావాసం లభించింది మీకు.