అదే నది

ఠాత్తుగా నువ్వొచ్చావు
సంచిలో  కాస్త వెలుగును మోసుకొచ్చి
కానుక చేసావు
పాత కలలను  మంత్రించి చల్లావు
మోహపరచావు
మైమరపించావు

ఇన్నాళ్ళూ ఏమైపోయావని
నేనడగలేదు
నేనేం చేసానని
నువ్వూ ప్రశ్నించలేదు

చేజారిపోయిన  జీవితాన్ని తడుముకోవడం
మళ్ళీ తుపానులలో తడిసిపోవడం
అనవసరమనుకున్నాం
అక్కర్లేదనుకున్నాం

చెదలు తిన్న పుటలను పక్కకు పెట్టి
అల్లరి అలలై
ఎగసిపడ్డాం
రంగులను చల్లుకుంటూ
సీతాకోకలై ఎగిరిపడ్డాం

నేటికీ
నీలో నాలో సజీవమై
అదే నది
లోలోపల నిశ్శబ్దంలోంచి
పూలు పూస్తూ
అదే హృది

బ్రతుకు చీకటిలో
మసిబారిన వాటిని
తుడిచి శుభ్రపరచి
గుండెలకు
ప్రేమగా హత్తుకుని మురిసిపోయాం

చాలా రోజుల తరువాత
జ్ఞాపకాలలోకి  కాసేపు అంతర్ధానమైపోయి
దుఃఖాలను ఆరబెట్టుకుంటూ
విడిపోయిన ముక్కలను అతుక్కుంటూ
నువ్వూ నేనూ

*

పద్మావతి రాంభక్త

4 comments

Leave a Reply to Dakarapu baburao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు