అతను – నేను – ప్రేమ

మైక్రో కథలు – 10

తణ్ని నేను ప్రేమించాను. మొదటి చూపులోనే చాలా ఇష్టంగా, పిచ్చిగా ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు. అతణ్ని చూసేవరకూ నాకూ లేదు. చూశాక ఉన్నట్టుండి ప్రేమ పుట్టింది. ఇదంతా ఆకర్షణ అని కొట్టి పారేయకండి. అతనికంటే అందమైన, చురుకైన వాళ్లని చాలా మందిని చూశాను. ఎప్పుడూ కలగని ఫీలింగ్ అతడి దగ్గరే మొదలైంది.

అతనికి ఉద్యోగం కొత్త కాదు. మా ఆఫీసు కొత్త. అక్కడ పని కొత్త. పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. కళ్లలో ఒకలాంటి నిర్లక్ష్యం. వాటిలో బలంగా కనిపించే ఆత్మవిశ్వాసం. అందగాడేలే అనిపించే రూపం. అమ్మాయిల కలల రాకుమారుడయ్యేంత అవకాశం లేని సాదాసీదాతనం.

ఆఫీసులో తను చేరిన రెండో రోజు ‘హాయ్’ అని పలకరిస్తే కొంత ఆశ్చర్యం, కాస్త బెరుకు నిండిన గొంతుతో ‘హాయ్ సర్!’ అన్నాడు. అక్కడ అతనికన్నా పైస్థాయి నాది. ‘యూ కెన్ కాల్ మీ విత్ మై నేమ్’ అంటూ పేరు చెప్పాను. నమ్మకంగా నవ్వి సరేనన్నాడు. పల్లెటూరి అబ్బాయి. వ్యవసాయం చేసే కుటుంబం. ఒక్కడే కొడుకు. ఇద్దరు అక్కలు. అక్కడక్కడా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాక, ట్రైనింగ్ తీసుకుని ఇక్కడ జాయిన్ అయ్యాడు. తన గురించి ఏం విన్నా నచ్చేస్తుంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. తనను చూడాలని ప్రతి అరగంటకోసారి నా సీట్లోంచి లేచి తనున్న చోట అటూఇటూ తిరిగేవాన్ని. చూస్తే పలకరింపుగా నవ్వేవాడు. తను చూడనప్పుడు నాలో నేను నవ్వుకుంటూ వచ్చి నా సీట్లో కూర్చునేవాణ్ని.

నాలుగు వారాలు.. ఆ తర్వాత నాలుగు నెలలూ గడిచాయి. ఆ మధ్యలోని కాలమంతా అతనికి దగ్గరయ్యాను. ఆఫీసు అయిపోగానే అతణ్ని నా బైక్ మీదే హాస్టల్ దగ్గర దింపుతున్నాను. రాత్రుళ్లు ఏమీ తోచనప్పుడు ఛాటింగ్ చేస్తున్నాను. అతను రెండు మూడు రోజులు లీవ్ పెడితే ఆఫీసులో ఉండాలనిపించేది కాదు. అతని దగ్గరికి వెళ్లిపోవాలనిపించేది. అతనికి దగ్గరవుతూ ఉన్నాను. అతనూ ఆ దగ్గరితనం ఫీలవుతున్నట్టే అనిపించేది‌. మళ్లీ ఎక్కడో దూరంగా​ జరిగిపోతున్నట్లూ ఉండేది.

రెండు రోజుల క్రితం సడన్‌గా అడిగాడు.

‘మీరెవరినైనా ప్రేమించారా?’

ఇదే సరైన టైం‌.. చెప్పేద్దామా అనిపించింది. అయినా నాలుక చివరి దాకా వచ్చిన మాటల్ని బలవంతంగా ఆపేశాను. అప్పుడేమీ చెప్పకుండా మాట దాటేశాను. రూంకొచ్చి ఆలోచిస్తే చాలా ప్రశ్నలు కనిపించాయి. ఇదంతా కుదురుతుందా? అతను ఒప్పుకుంటాడా? ఇద్దరు మగాళ్ల మధ్య లవ్ ఏంటని అసహ్యంతో ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడా? ఏం చేస్తాడు?

రెండు రోజులూ ఈ ఆలోచనలతో నరకం చూశా. ఆఫీసుకి వెళ్లలేదు. అతను కాల్ చేసినా కట్ చేశా. అతని గొంతు వింటే ఏడ్చేస్తానని అనిపించింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా. నేను పిరికివాన్ని కాదు. నా ప్రేమెందుకు పిరికిదై లోలోపలే ఆగిపోవాలి? చెప్పేయాలి. నాలో ఉన్నదంతా, నాకు తన మీద ఉన్నదంతా చెప్పేయాలి. దానికి అతనే పేరన్నా పెట్టనీ, ఎంతగానైనా అసహ్యించుకోనీ, నా ప్రేమ నా లోపలే చచ్చిపోయి లాభం లేదు. అతనికి చేరాలి. గెలుపో, ఓటమో.. ఏదో ఒకటి సాధించాలి.

ఇప్పుడు అతని దగ్గరికే వెళ్తున్నా! ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరూ ఇలా ఎవర్నైనా ప్రేమిస్తే ఆ దాన్ని లోపలే చంపేయకండి. చెప్పేయండి. ప్రేమ పేరుతో హత్యలు చేసే దారుణాలు చూస్తున్నాం. అలాంటిది మన ప్రేమను బతికించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేయలేమా??

*

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Chala bagundi bro…iddaru abbaila Prema ani chivari varaku teliyakunda chivarilo surprise laga rasi untey inka bagundu anipinchindi..

  • ప్రేమే.. కొత్తగా..
    మరి తనకి తెలీదా..
    అది ఒప్పో నొప్పో..
    తెలియదు కాబోలు..
    ప్రేమలో ప్రేమే కనిపిస్తుంది కానీ..
    తప్పొప్పులు.. సాధ్యాసాధ్యాలు..
    ఇవేమీ కానరావేమో..
    ఏమో.. ఏదైతేనేం..
    మీ కథ కొత్తగా ఉంది..
    సెన్సిటివ్ ఇష్యూ అనిపించినా..
    ఎక్కడా ఇబ్బంది లేకుండా రాశారు..
    👌👌👌👏👏

  • ఇదే కథ 2016 లో ‘ అదే ప్రేమ’ అని సారంగ లోనే రాశాను. అప్పుడే మొహమాటాలు లేవు. ఇప్పుడెందుకు? నేరుగానే ఇంకా లోతుగా రాయాల్సింది. ఈ కథను నాకు పంపించి అభిప్రాయం అడగడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు.

    http://manasayendluri.blogspot.com/2016/03/blog-post_2.html?m=1

  • మీ కథలు,అన్నింటి లోను ఈ కథ నచ్చింది. బాగా!అతడు gai కావచ్చు ఐతేనేమి తన వేదన చెప్పుకుంటున్నాడు, ధైర్యం గా!👍

  • ఫీలింగ్స్ కి లింగ భేదాలుండవు..
    నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతుంది.👌👍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు