అడుగుల సంతకం

నుపాపల వెనుక నిదురించేది
సాధారణ కలలు కావు—
కాలానికి మనిషి
చూపులతో రాసుకున్న
నిశ్శబ్ద శీర్షికలు
అవి మాటలుకాని మాటలు
వాక్యాలుగా మలచలేని
వేదనల అక్షరాలు
కాని కాలం
వాటిని చదువుతుంది
కాంతి కావ్యంలా
అంధకారాన్ని చీల్చుకుంటూ
మెల్లగా విప్పుకునే
ఉషోదయ రేఖల మాలికలా
ఆ చూపులు
నిశ్శబ్దానికే అర్థం నేర్పుతాయి
పెదవి దాటని మౌనంలోనే
పూర్ణ భావం
ఊహాజనిత శబ్దాలకన్నా
నిబద్ధతతో నడిచే చేతలే
అసలైన సందేశం
ఆర్భాటాల అలికిడి లేని
అచంచల ఆచరణ అది—
కర్తవ్యాన్నే ఊపిరిగా మలచుకున్న
సజీవ సాక్ష్యం
అలసటను లెక్కచేయని
ఆ అడుగులు సాగుతుంటే
నిలిచిన ప్రతి చోట
కొత్త చరిత్రకు
నిశ్శబ్ద అంకురార్పణ
ఆ పయనం ఆగదు—
గమ్యం చేరినందుకే కాదు
గమ్యాలకే దారి చూపించే
అనంత కొనసాగింపు
ఇది ఒక వ్యక్తి ప్రయాణం కాదు—
దిశగా మారుతున్న
సమష్టి గమనం
యుగాల పుటల్లో
కాలం చెరిపివేయాలనుకున్నా
చెరిగిపోని
నిత్య చైతన్యపు
అడుగుల సంతకం ఇది
*

ఎల్ ఎన్ కొల్లి

1 comment

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు