అడివి కంటి ఎర్ర జీర

లిష్టపడ్డ కంటిపాపలు రెండూ
గాఢంగా కావలించుకునే ఆళ్లకు
అదాల్లునొచ్చిన నీ రూపం
ఆ రెండిటిని కలుసుకొనిత్తలేదు
నాకిప్పుడూ రోజూ ఇదే తంతు దోస్త్…
ఎప్పుడన్నా బలిమీటికి కంటిపాపలను కలిపి
కాసింత కునుకు తీస్తున్నప్పుడు
లీలగా నీ రూపం  కదలాడుతుంది
తలుపులేశున్న ఇంటిముంగట అటీటూ తిరుగుతూ
నన్నాటకెట్టా బైటికి రప్పియాల్నో తెల్శిన సాయితగాని లెక్కనే
అలుముకున్న కంటిపాపల ముందు కదలాడుతున్న నీవు
నన్ను రెక్కబట్టుక గుంజుకపోతున్నట్టుందిరా…
మీరు ఏడేడనో పాడి,ఏడేడ ఆడినరో
ఏడేడనో దారి తప్పి,ఏడేడ కలిసినరో
ఆ ఆ తావులన్నీ కలేదిప్పీ సూపుతున్నపుడూ
కాళ్ళకిందంతా పచ్చిగా పారుతున్న మీ నెత్తురు
ఒంట్లె బలమంతా ఎవలో పీక్కతాగినట్టున్న నన్నుజూసి
నిధురకల్లెంబటే రెండు ధారలు ఒక్కతీరుగ కారుతున్న
కన్నీళ్ళను తుడిశి ఏమైందిబిడ్దని అవ్వడిగితే
రోజు రాతిరి జరుగుతున్నదంతా జెప్పిన
ఎర్రగైన నా కళ్ళలోకి కళ్ళుపెట్టి ఏదో ఎత్కుతున్న అవ్వ
దుఃఖాన్ని కడుపులో దాసిన నిజాన్ని దాయని బొంగురు గొంతుతో
దినాం బొచ్చెడు మంది సత్తండ్రు అట్లనే ఈళ్ళు కూడా
సావన్నది తప్పదు గదరా!  అన్నపుడు
అవ్వ కళ్ళల్లోకి సూటిగా సూత్తూ అడిగిన
అచ్చిపోయే తొవ్వలా… ఓ చెట్టు కూలితేనో,కాలితేనో
కలికలికాని నువ్వు అడవి కాలితే ఎక్కెక్కి ఏడిశినవెందుకే అవ్వా… అనంగనే
టక్కున నను గుంజుకుని గుండెలకత్తుకుంటే నా భుజమంతా తడితడి
అవ్వ శెవుకాడ మెల్లిగా వాళ్ళంటే అడివని నేనన్నా
కాదు కాదు అడవంటేనే వాళ్ళని గట్టిగా అరిచింది అవ్వా
*

దిలీప్.వి

1 comment

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కాళ్ళ కింద పచ్చిగా పారుతున్న మీ నెత్తురు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు