వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .
⚡️⚡️⚡️⚡️ ఆ రోజు తలదువ్వుకుంటున్నాను దువ్వెనలో కుచ్చులు కుచ్చులుగా జుట్టు వూడి వస్తోంది .
అందుకే హాస్పటల్ లో ట్రేట్మెంట్ తీసుకునే చాలామంది విగ్ లు పెట్టుకుని కనిపించే వారు .
మర్నాడు వాళ్లని అడిగి మద్రాస్ లో సినిమా వాళ్లకి విగ్గులు తయారు చేసే చోటుకి వెళ్లాం . అక్కడ నా తల సైజ్ కొలుచుకుని నాకు వున్న నొక్కుల జుట్టును పరిశీలనగా చూసి నాలుగురోజుల తర్వాత రమ్మన్నాడు . నేను అన్నాను వూరికే మొత్తం జుట్టు గుండయ్యేలోపు తిరుపతి వెళ్లి అక్కడ జుట్టు ఇస్తాను అన్నాను . గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టు జుట్టు దేముడికి ఇద్దామని నిర్ణయించుకున్నాను . తిరుపతిలో జుట్టు ఇచ్చి విగ్ పెట్టుకున్నాను . ఇంచుమించు నా జుట్టు లాగానే వుంది .
కానీ అద్దంలో చూసుకుంటే ఎవరినో చూసినట్టనిపించింది .
సెలవుల్లో పిల్లల్ని తీసుకుని మా అత్తగారు వచ్చారు . సగం ప్రాణం తిరిగివచ్చినట్టనిపించింది . అమ్మా ఎవరూ చూడకుండా రోజూ నువ్వున్న ఫోటో దగ్గర ఏడుస్తానమ్మా అని పెద్దది చెప్తే గుండె మెలిపెట్టినట్టైంది . మనసుకి బాధ కలిగినప్పుడు అందరిముందూ ఏడవకుండా చాటున ఆ ఇంట్లో వున్న చిన్న ఫోటో చూస్తూ వుంటున్నానని చెప్పింది . ఆరేళ్ల పిల్ల అంత గుంభనగా వుండడం ఆశ్చర్యమే . అంత లోతుగా వుంటాయా పిల్లల మనసులు ! దాన్ని దగ్గరకు తీసుకుని త్వరగా వచ్చేస్తాను అన్నాను . వెళ్లేటప్పుడు చిన్నదాన్నీ ఎత్తుకుని ముద్దాడాను .
చిన్నదానికి ఎక్కడున్నా చెలాయించుకునే తెలివి వుంది కానీ పెద్దదే లోపల్లోపల కుమిలిపోతుంది .
ఇంకా రెండునెలలు గడవాలి . రెండో కీమో మొదలుపెట్టారు . మా రెండో పిన్నత్త గారి వచ్చారు . స్పృహ వుండీలేని స్థితిలో వున్నాను . ఇదిగో కనకరాజు మావయ్య వచ్చారు చూడు అని ఆయన పిలిస్తే కళ్లు తెరిచాను . ఎలావున్నావమ్నా ఏంటీ ఘోరం ఇద్దరూ కావాలని పెళ్లి చేసుకున్నారు . చక్కటి పిల్లలు . నీకు రావలసిన కష్టం కాదు అన్నారు . నేనంటే ఆయనకు చాలా ఇష్టం .
పెళ్లికి ముందు ఏ మర్యాదలు , తెచ్చిపెట్టుకున్న ప్రవర్తనా లేకుండా నేను నేనుగా వున్నప్పుడు నన్ను చూసిన మనిషి .
నవ్వుతూ తుళ్లుతూ నోటికి ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేసే నన్ను ముచ్చటగా చూసేవారు . పెళ్లయితే మీ అత్తారింట్లో ఇలాగే వుంటే కష్టం అనేవారు . నిజమే మా అత్తగారింట్లో క్రమశిక్షణే వేరు . గట్టిగా మాట్లాడనుకూడా మాట్లాడరు . నేను మొదట్లో ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేదాన్ని . కనకరాజు గారు ఆ స్థితిలో నన్ను చూసి ఎంతో భారంగా వదిలి వెళ్లారు . ఎందుకో ఆయన్ని చూస్తే ఒక ఆత్మీయభావన ! కీమోతో పాటు రేడియేషన్ కూడా ఇచ్చేవారు . కొన్నాళ్లకి అక్కడ కాలిపోయినట్టు అయిపోయింది . రోజులు గడిచాయి మూడో కీమో కూడా అయిపోయింది .
హాస్పటల్ వాళ్లు గడ్డ వున్న భుజం భాగం చుట్టూ కొలిచి ఆ కొలత రిపోర్ట్ లో రాసి వుంచారు .
మళ్లీ 15 రోజులు ఆగి రమ్మన్నారు . ఈ లోగా గడ్డ కరిగిపోతుందని ఆ తర్వాత సర్జరీ చేద్దామన్నారు . నాకు జైల్లోంచి రిలీజైనట్టుంది . తిరిగి వైజాగ్ వెళ్లడానికి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాం . కీమో వల్ల పూర్తిగా నా రూపు మారిపోయింది . నల్లగా కమిలిపోయిన మొహం ,గోళ్లు , పలచబడిన కనుబొమలు , వుబ్బినట్టున్న మొహం . ఇక బయల్దేరదామనగా సోషల్ వర్కర్ ఒకామె కౌన్సిలింగ్ ఇవ్వడానికి వచ్చింది . ఆమె ఏడ్స్ లో నటిస్తుదంట . కేన్సర్ పేషంట్ల మనోధైర్యం కోసం ఆమె వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తుంది . ఆమెతో మట్లాడుతూ ” నా పెద్దకూతురికి నా అవసరం ఎక్కువ , పిచ్చిది నాకోసం ఎంతో ఎదురుచూస్తూ వుంది . ఈ కేన్సర్ నన్ను తీసుకుపోతే నా పిల్లలు ఏమైపోతారు ” అని ఏడ్చేసాను . తొలిదశలో ట్రేట్మెంట్ తీసుకుంటే కేన్సర్ని జయించవచ్చని ఏమీ బెంగపెట్టుకోవద్దని అనునయించింది . విశాఖపట్నం బయలుదేరాం . రాత్రికి విజయవాడ చేరింది . స్టేషన్లో నన్ను చూడ్డానికి చాలామంది వచ్చారు .
అందరితో పాటు మా మన్నాన ,పెద్దమ్మ కూడా వున్నారు.
మన్నాన్న నన్ను పదేళ్లు వచ్చేవరకూ పెంచాడు . నేను నడిస్తే అరిగిపోతానేమో అని అయిదారేళ్లు వచ్చే వరకు ఎత్తుకునే తిప్పేవాడు . రోజూ తాతగారి ఇంటికి వచ్చి బందరు హల్వా , జిలేబీలు తినిపించిగానీ ఇంటికి వెళ్లేవాడుకాదు . నేను బయటకి రావడమే నన్ను చూసి మన్నాన , పెద్దమ్మ గుండెలు అవిసిపోయేలా ఏడ్చారు . అమ్మా నీ చిన్నప్పటి ముద్దు ముచ్చట్లు ఇప్పటికీ మర్చిపోలేదు , నీకేమన్నా అయితే నేను బతకను అని గావురుమన్నాడు .
అందరూ ఆయన ఏడుపు విని ఏదో అయిపోయిందని చుట్టూ చేరారు . విషయం తెలుసుకుని ” పాపం పెద్దాయన అల్లారుముద్దుగా పెంచుకున్నాడంటమ్మా ! ఆ పిల్లకి జబ్బు చేసిందంట , చూడు ఎట్లా ఏడుస్తున్నాడో … పెంచిన ప్రేమ మరి ” అనుకుంటా వెళ్తున్నారు .
నిజమే కడుపుతీపి కన్నా పెంచుకున్న మమత ఎక్కువే మరి . * |
|
|
అన్నీ వరసగా ఇప్పుడే చదివాను. మండుటెండల్లో నీటి చెలమల్లానే అనిపించాయీ కథలు. నిజంగా జరిగింది చెప్తున్నారా కథలా అని కూడా అనిపించింది చదువుతూంటే. మనసుకు హత్తుకునేలా రాసారు.
నిత్యా ఇది అనుభవం నుంచి పుట్టిన కధ . మీకు నచ్చినందుకు థాంక్స్