మరణించిన వ్యక్తి ఎంతో మంచివాడని అనిపిస్తాడంటే
అతడు బతికున్నప్పుడు కూడా అంత మంచివాడని అనిపించలేదు
అతడి శిరస్సు చుంబించాలనిపిస్తుంది
అతడితో పాటు ఎప్పుడూ కలిసి తిరగాలనిపిస్తుంది
ఎప్పుడూ అతడి గురించి మాట్లాడాలనిపిస్తుంది
అతడి ముందే అతడిని పొగడాలనిపిస్తుంది
అతడు ఏదైనా తప్పుమాట అంటే
అతడిని సరి చేసే ప్రయత్నం చేసేవాడిని కాదు
అతడు చెంపదెబ్బ కొడితే మరో చెంప చూపించేవాడిని
….
మరణించిన వ్యక్తిలో ఇన్ని
మంచిగుణాలు ఎక్కడి నుంచి జన్మిస్తాయో..
ఈ కవిత రచించిన విష్ణు నాగర్ అతి సరళమైన పదాలతో మనలను కదిలించే కవితలు రాసే కవి. హిందీ సాహిత్య ప్రపంచంలో దాదాపు ఐదు దశాబ్దాలు పైగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విష్ణు నాగర్ హిందూస్తాన్, నవభారత్ టైమ్స్, నయీ దునియా మొదలైన అనేక హిందీ పత్రికల్లో పనిచేశారు. కాదంబిని అనే సాహిత్య పత్రికకు సంపాదకత్వం వహించారు. మధ్యప్రదేశ్ కు చెందిన వాడైనప్పటికీ ఢిల్లీలో స్థిరపడి నిత్యం కవితాలోకంలో మునిగి తేలుతుంటాడు. చాల ఏళ్ల క్రితం విష్ణు నాగర్ తో పాటు శ్రీలంకలో సార్క్ రచయితల సదస్సుకు వెళ్లిన నాతో ఆయన సాధారణంగా మాట్లాడుతూనే ఆ మాటలతో కవిత్వాన్ని అల్లగలడని తేలింది. కేవలం మాటలతోనే ఆయన వందలాది కవితలు రాశారు. పలు కవితా సంకలనాలు వెలువరించారు. జనం ఆయన మాటల్ని వింటూ మాట్లాడుకోవడం నేను చూశాను.
ఒక రోజు విష్ణునాగర్ మాటల మధ్యలో తన ఇంటి గురించి నాకు ఇలా చెప్పారు.
ఇంట్లో చీపురు కట్టతో ఊడుస్తుంటే, అంట్లు తోముతుంటే, బట్టలు ఉతుకుతుంటే, వంట చేస్తుంటే, సామాన్లు తీసి పెడుతున్న, నల్లా నుంచి నీరు కారుతున్న, తోముతున్న, కుక్కర్ విజిల్ మోగుతున్న చప్పుడు వినిపిస్తుంది. ఈ ఇంట్లో కవితలు కూడా రాస్తారు.కాని వాటి చప్పుడేమీ వినపడదు.కవికి తప్ప ఎవరికీ తెలియదు. తెలిసినా లెక్కేముంటుంది? ‘ఒకవైపు నీ పని, మరో వైపు నా పని. నా పనిలో ఏమాత్రం శబ్దం ఉండదు తెలుసా’ అంటాను నేను నా భార్యతో. ‘సరే, మీ కవితలతో ఇంట్లో ఊడ్చండి, అంట్లు తోమండి, బట్టలు ఉతకండి. అప్పుడేమీ చప్పుడుండదు..’ అని ఆమె జవాబిస్తుంది. ‘నేను రోటీ చేస్తుంటే మీరు మొక్కలకు నీరు పోయండి. నేను బట్టలు ఉతికితే మీరు వాటిని ఆరబెట్టండి. శబ్దంతో భయపడేవారు కవి ఎలా అవుతారు మహాశయా’ అంటూ ఆమె ఊడ్వడంలో నిమగ్నమైంది. ఆమె కనీసం నవ్వను కూడా లేదు. ఉన్నట్లుండి చెప్పింది. ‘కొంచెం చూస్తూ ఉండరూ పాలు పొంగకుండా.’. అని.
ఇదే కవిత అని విష్ణునాగర్ అన్నాడు. ఇవే వాక్యాలతో ‘ఇంట్లో చప్పుడు’ పేరుతో కవిత కూడా రాశారు..
మనిషి ఎందుకు దు:ఖిస్తాడో తనకి తెలియదంటారు విష్ణు నాగర్
నా అనుభవం పెరుగుతున్న కొద్దీ
నా మనసు కూడా గట్టిదవుతుందనుకున్నాను
కాని ఒకరోజు గంగూబాయి హంగల్ గానం విని
ఏడ్చేశాను
ఇంకో రోజు అమ్మపై కవిత వినిపిస్తూ వినిపిస్తూ
ఏడ్చేశాను
30 ఏళ్లుగా నాతో మాట్లాడే దోస్తు
వరుసగా మూడు రోజులు ఫోన్ చేయకపోతే
ఏడ్చేశాను
టీవీ సీరియల్ లో ఎవరో గ్లిసరిన్ కన్నీళ్లు కారిస్తే కూడా
నా కళ్లు స్రవిస్తాయి
భావుకతకు నేనెంతో వ్యతిరేకం
అయినా ఏడుస్తాను
ఈ కవితా రాస్తూ రాస్తూ కూడా ఏడుస్తానేమో
బహుశా ఈ కవిత ఎవర్నీ సరిగా ఏడ్పించదేమో
లాక్ డౌన్ సమయంలో అలిసిపోయి రైలు పట్టాల మధ్య నిద్రిస్తున్న వలస కార్మికుడి చిత్రాన్ని చూసి ఆయన ఈ కవిత రచించారు.
నిద్రకు ఏమైనా దిండు అవసరం ఉన్నదా?
ఉంటే రాయి తలగడగా మారితేనేమి?
ఇన్ని హాహాకారాల మధ్య నిద్రించే మేము
ఖాళీ కడుపుతో ఎందుకు నిద్రించలేము?
రెండు పట్టాల కంటే సమతలమైన
సురక్షితమైన స్థలం ఎక్కడుంటుంది?
అక్కడ గాఢంగా ఎందుకు నిద్రపట్టదు?
నిద్ర భగ్నం కావడం కంటే
శరీరం పై నుంచి రైలు వెళ్లిపోవడం
ఏమంతా పెద్ద విషయమా?
ఇంత కంటే సరళంగా, వ్యంగ్యంగా ఒక భీభత్స జీవన సన్నివేశాన్ని రాయగలమా?
గాలి దుమారం నుంచి పుట్టిన ధూళి మాదిరి జనం పట్టణాల నుంచి గ్రామాలకు తరలి వస్తున్నారు. 1947 మరో సారి వచ్చినట్లు జనం నడిచి వస్తున్నారు, ఆకలితో నడిచి వస్తున్నారు. ఇసుక తుఫానులా నడిచి వస్తున్నారు.మూటలు నడిచి వస్తున్నాయి, జోలెలు నడిచి వస్తున్నాయి, నీళ్లు నింపిన సీసాలు నడిచి వస్తున్నాయి. ఉదయం అప్పుడవుతుంది గ్రామం వచ్చినప్పుడు. ఏడ్పు అప్పుడొస్తుంది. గ్రామం వచ్చినప్పుడు. అలసట అప్పుడు అనిపిస్తుంది గ్రామం వచ్చినప్పుడు. అని ‘2020లో గ్రామం వైపు’ అనే కవితలో రాశారు విష్ణు నాగర్.
గాడిద కుర్చీపై కూర్చుంటే, మొదటిసారి అనిపిస్తుంది, అది మనమనుకున్నంత గాడిద కాదని, అయినప్పటికీ మన అభిప్రాయం మాత్రం అదే. నిజానికి ఇది గాడిదే కదా అని. ఇవాళ కాకపోతే రేపైనా అది గాడిదని తెలుస్తుందని. కాని రేపు కూడా అది గాడిద అని రుజువు కాకపోతే, ఇది గాడిదే కాని కుర్చీ దానికి కనీసం గుర్రంలా కనిపించేలా నేర్పించిందంటాను. అందువల్లే అది తప్పించుకుంది కాని ఒకరోజు అది గాడిదని తెలిసిపోతుంది, అప్పుడే దాని ఆటకట్టు అవుతుంది అనుకుంటాను.ఆ రోజుకు ముందే నాకు ఒకరోజు గాడిదతో అర్జెంట్ పని పడింది. దాన్ని గాడిద అనుకుంటూనే దాని శరణు జొచ్చాను, గాడిద నాతో మర్యాదగా మాట్లాడుతుంటే ఇది గాడిద కాదేమో ఇప్పటి వరకు తప్పుగా భావించానేమో అని అనుకోవాల్సి వచ్చింది.ఒకరోజు అది దారిలో నన్ను ఒక తన్ను తన్నింది, దగ్గరకు వచ్చి ఉచ్చ పోసింది, దీనితో నా అభిప్రాయం మారింది, ఇది నిజంగా నూటికి నూరు శాతం గాడిదేనని. కాని నేను ‘అరే గాడిదా’ అని అనలేకపోయాను. ‘రోడ్డుపై సరిగ్గా నడువు’, అని గాడిద అన్నప్పుడు తప్పు నాదే అనుకుని రోడ్డు దిగి నడవడం నేర్చుకుని నా తప్పు జీవితాంతం సరిదిద్దుకున్నాను.
గాడిదల ప్రపంచంలో జీవిస్తున్నమన గురించి ఏ కవి అయినా ఇంతకంటే బాగా ఎలా చెప్పగలరు?
వాళ్లు చంపారు. మళ్లీ మళ్లీ చంపారు, మళ్లీ, మళ్లీ మళ్లీ జనాన్నిచంపారు. చంపే పనిలో వారికి 50 ఏళ్లు కూడా గడిచిపోయింది, అయితేనేం ఏర్పడనేలేదు. అవునండీ ఏర్పడనే లేదు పేదల హిందూ రాజ్యం. అని రాయగలిగిన ధైర్యమూ విష్ణు నాగర్ కు ఉన్నది.
అవును. సరళమైన, సాదా సీదా పదాల్లో,అందరూ మాట్లాడే మాటల్లో కవితా వాక్యాలు రాసే కవులు తమను తాము దాచుకోలేరు. అక్షరాలు దట్టంగా వారిని కప్పలేవు. ఎందుకంటే వారు వాక్యాలపై అందమైన పూల తోటల్ని, నీలి మేఘాల్ని, సముద్రపు అలల్నీ తొలగించి ప్రతి అక్షరాన్నీ నగ్నంగా, నిర్భయంగా ఊరేగించగలరు,
మోదీ గారి ఇంట్లో ఎందరో సేవకులున్నారు
ఆయన అన్నా, చెల్లే కూడా అక్కడ లేరు
ఆయన ఇంటి ఆవరణలో ఆడుకునే పిల్లలు లేరు
ఆయన అనుయాయులు లక్షలమంది
కాని చెప్పేందుకు కూడా మిత్రులెవరూ లేరు
…
వెక్కిళ్లు వచ్చినా
వీపు నిమిరే వారు లేరు
అర్థరాత్రి లేపి దుఃఖం వినేవారు,
సుఖం పంచుకునేవారు కూడా లేరు
…
ఆయనకు ఒక అమ్మ ఖచ్చితంగా ఉన్నారు.
ఆమెకు ఆయనను ఆశీర్వదిస్తూ
ఫోటో తీసుకునే పని
అప్పుడప్పుడూ కలుగుతూనే ఉంటుంది.
..
గుజరాత్ మొత్తం ఆయనదే
కాని ఆయనకోసం ఇంటి వద్ద వేచి చూసేవారు లేరు
ఆయనను ప్రధానమంత్రి చేసే వారు చాలా మంది ఉన్నారు
కాని మనిషిని చేయగలిగే వారు ఎవరూ లేరు.
సర్వసంగ పరిత్యాగి అయిన నరేంద్రమోదీ గారి ఏకాకి తనం గురించి అర్థం చేసుకునే ప్రయత్నంలో విష్ణు నాగర్ ఎక్కడైనా విఫలం అయి ఉంటారా? విఫలమైతే అది తన నగ్నత్వాన్ని దాచుకోని అక్షరం తప్పు అయి ఉంటుంది.
*
మంచి పరిచయం చేసారు🙏 సరళంగా రాసి మెప్పించవచ్చని విష్ణు గారు నిరూపించారు.
మోదీపై కవిత అక్షర తూటాలు. ఇలా రాస్తూ ఢిల్లీలో ఉండగలుగుతుండటం ఆశ్చర్యమే.
అక్షరం చేత తప్పులు చేయించే ఎంతో మంది రచయితలున్నారు నేడు. తప్పుడు రాతల్లో అక్షరాలు ఇరుక్కుంటే ఆ తప్పు అక్షరాలది కాదు. అది రాతగాడి తప్పు. మీరు అన్నట్లుగా విష్ణు సాగర్ ఎక్కడా విఫలం కాలేదు. ఆయన అక్షరాల చేత నిజాలనే పలికించారు. అటువంటి ఉదాత్తమైన కవిని పరిచయం చేసిన తమకు హృదయపూర్వక ధన్యవాదాలు.