| నీ ఇంటి ఎదురు గోడకు వేలాడే పూల తీగెలు గజల్ గుత్తులుగా అనిపిస్తాయి నాకు వాకిలికావల లోపల్నించి స్వరమయమైన ధ్వనులు వినపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో మనుషులు పాటల్లాగా పాడుకునే మాటలేమో అవి 
 సామాన్యమైన ఇల్లే నీది నా అడుగు ఎప్పుడూ లోపల పడనిది బీదరికపు అమాయకత్వం తోరణంగా తొడిగినది మనుషుల గుల్మోహర్లతో నిండిన తోటలాంటి ఇల్లు నీది 
 నీ గురించి నేనూ నా గురించి నీవూ అనుకునేదే కదా ఎపుడూ విరహం ఒక యుగకాలపు భారాన్ని మోస్తున్నదనీ ఏదో మార్గంలో నువ్వు బయటికీ నేను లోపలికీ అడుగులు మార్చుకునే వసంతం కోసం వేచి చూడ్డం మొహబ్బత్ కీ నిషానీ 
 నీ స్నేహం నేర్పిన నవ్వుని కళగా ముఖమంతా పులుముకొని ముందుకు కదులుతానా నీ ఇల్లు నా వెనుకే నడుస్తున్నట్టు పరదా వెనుక నుంచి నువ్వు పిలుస్తున్నట్టూ సువాసనల ధార నీ పెదాల చివరల నుంచి జారుతున్నట్టూ నేనే పూలగుఛ్ఛాన్నై ఆ పరిమళాల్ని స్వీకరించి వెదజల్లుతున్నట్టూ 
 “ఓ లడ్కే మెరి బెటియా తుఝె ఆవాజ్ దేరహీ హై సునాయీ దియా క్యా” అని మీ అబ్బాజాన్ అంటున్నట్టూ వినిపిస్తుంది 
 మన ప్రేమెందుకో నీ లోగిలి లోపల చిరాగ్ లాగా వెలుగుతున్నదేమో అనిపిస్తుంది నీ అమ్మీజాన్ దువాకై చాచిన దోసిట్లో నెలవంకలా అల్లా జార్చడేమో అని కూడా అనిపిస్తుంది 
 ఎన్నడైనా ఆ పరదా తప్పించి ఓ నవ్వుని నా వైపు విసురు దాన్నడిగి తెలుసుకుంటాను. ఈ సారీ జుమేరాత్ చౌసేన్అలీ సాహెబ్ సాక్షి గా ఒక ఫాతేహా మన ప్రేమ కోసం సమర్పిస్తాను 
 మన ప్రేమ పూలను వికసింపజేసే భ్రమరమే కాని భ్రమ కాదని నిరూపిస్తాను. * | 
 
            







💐👌👍.భ్రమరమై కానీ,భ్రమ కాదని నిరుపిస్తాను!.సర్!