”నిన్న మన బాస్ ఇద్దరు టాప్ నక్సలెట్లని పట్టుకొచ్చాడట…” అన్నాడు రవిశంకర్, రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్.
”ఔను… నేనూ విన్నాను. అందులో ఒకడైతే సామాన్యుడు కాడు… వీరప్పన్‌ను మించినోడు… వాడు చేసినన్ని దొరల హత్యలు, ఇటీవలి కాలంలో ఎవరూ చేయలేదనుకుంటాను… వాడెంత కాలంగానో తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోవడం మామూలు విషయం కాదు. ఎన్‌కౌంటర్లో ఖతం చెయ్యకుండ వాళ్ళను ప్రాణాలతో పట్టుకురావడం మన బాస్ గొప్పతనం” అన్నాడు సుమంత్, మరో రిజర్వ్ కానిస్టేబుల్.
వాళ్ళిద్దరలా మాట్లాడుకుంటుండగానే ఎ.సి.పి. హరివిఠల్‌రావు వాళ్ళ పక్కనుండే ఊరికి దూరంగా ఉన్న ఒక సీక్రట్ పోలీసుస్టేషన్ లోపలికి వెళ్ళాడు.
హరివిఠల్‌రావుకు పోలీసు ఆఫీసర్‌గా చాలా మంచిపేరుంది. డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ అంటారు. ఎవరికీ భయపడడు… లంచాలు తీసుకోడు. యేది జరిగినా చట్టప్రకారమే జరగాలంటాడు. చేయదల్చుకున్న పనిని ప్రాణాలకు తెగించైనా చేస్తాడని చెప్పుకుంటారు.
కైలాసం అనే ఓ పెద్ద మావోయిస్టును పట్టుకునే బాధ్యతను ఇటీవలనే హరివిఠల్‌రావుకు అప్పగించారు. ఆ బాధ్యతను నెత్తికెత్తుకున్న హరివిఠల్‌రావు ఆరునెలల్లోనే అతన్ని పట్టుకోవడం అతడు సాధించిన మహత్తర విజయమని మీడియావాళ్ళు, అతని పై అధికారులు, సామాజిక కార్యకర్తలు అతన్ని అభినందించారు.
స్టేషన్ లోపలకొచ్చిన హరివిఠల్‌రావు చక్కగా ఆ స్టేషన్ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న ఓ రూంలోకెళ్ళాడు. నల్గురైదాుగురు సీఆర్‌పీఎఫ్ పోలీసువాళ్ళ మధ్యలో నిన్న అరెస్టు కాబడిన ఇద్దరు మావోయిస్టులు రౌండ్ కుర్చీల మీద కూర్చొని ఉన్నారు.
హరివిఠల్‌రావు ఆ రూంలోకి రాగానే అక్కడున్న పోలీసువాళ్ళంతా అతనికి సాల్యూట్ చేశారు.
మావోయిస్టులకు ఎదురుగా ఉన్న మరో కుర్చీలో హరివిఠల్‌రావు కూర్చున్నాడు. వాళ్ళిద్దరికేసి ఓసారి పరీక్షగా చూశాడు.
అక్కడున్న పోలీసులకేసి చూసి ”ఈ కొమురయ్యగాడి సంగతి తర్వాత చూద్దాం! వాడ్నిక్కడ్నుంచి తీసికెళ్ళండి” అన్నాడు.
బక్కపలుచగా, ఎత్తుగా, చిన్నచిన్న కళ్ళతో, చూడగానే వీడో ప్రమాదకర వ్యక్తి అనే అభిప్రాయం కల్గించే కొమురయ్య అనే వాడిని అక్కడ్నించి తీసికెళ్ళారు. బాగా పెరిగిన గడ్డంతో కైలాసం చాలా గంభీరంగా, చురుకైన కళ్ళతో ఒక మేధావిలా కనిపించాడు.
”కైలాసం గారు, ఎలా ఉన్నారు, మా గరీబుఖానాలో మీకు జరగాల్సిన మర్యాదలన్నీ జరిగాయా?” అన్నాడు హరి.
కైలాసం యేమీ మాట్లాడలేదు. మోచేతులను, మోకాళ్ళను చూపించాడు… లాఠీలతో కొట్టారన్నట్లుగా సైగ చేశాడు.
”జరిగింది చాలా తక్కువ… జరగబోయేది చాలా ఎక్కువ… అయితే నువ్వు మాతో కోఆపరేట్ చేస్తే నీ మోచేతులు, మోకాళ్ళు క్షేమంగానే ఉంటాయి…” అన్నాడు హరి.
”యేం చెయ్యమంటారో చెప్పండి” అన్నట్టుగా చూశాడు కైలాసం.
”వెరీ సింపుల్… నీ ముఠాలోని మిగతా వాళ్ళెక్కడున్నారో చెప్పాలి”
“మా ముఠాలోని వాళ్ళు ఒక దగ్గరుంటారని ఎలా అనుకుంటారు…? రోజుకో పది స్థావరాలు మారుతుంటారు వాళ్ళిప్పుడు ఫలానాచోట ఉన్నారని ఎలా చెప్పను. అదేం సాధ్యమైన పనికాదని మీకూ తెలుసు” అన్నాడు కైలాసం.
”అవును నాకూ తెలుసు… కానీ మీకు కొన్ని పర్మనెంట్ స్థావరాలుంటాయని నాకు తెలుసు… మీ ముఠాలోని అందరి స్థావరాలు చెప్పకపోయినా ఫరవాలేదు. మీ అందరి నాయకుడు పరుశురామ్ అనే వాడొక్కడి స్థావరం చెప్పినా చాలు… నిన్ను వదిలేస్తాను” అన్నాడు హరి.
కైలాసం గొల్లున నవ్వాడు. అతడలా నవ్వడం అక్కడున్న వాళ్ళందర్నీ ఆశ్చర్యపరచింది.
”ఎందుకలా నవ్వావు?” అన్నాడు హరి.
”పరుశురాం ఇంకా బతికే ఉన్నాడనుకుంటున్నారా మీరు… అతడెప్పుడో పోయాడని మీకు తెలియకపోవడం ఆశ్చర్యమే” అన్నాడు కైలాసం.
”మిస్టర్ కైలాసం! పరుశురాం చనిపోయాడన్న రూమర్‌ను మీరే క్రియేట్ చేశారు… అతడు చనిపోయాడని నమ్మిస్తే పోలీసులు అతన్ని గురించి పట్టించుకోరన్న ఉద్దేశ్యంతోటే మీరీ రూమర్‌ను క్రియేట్ చేశారు. మీరో గుర్తుపట్టానికి వీల్లేని శవాన్ని మాముందు పడేసి అది పరుశురాంది అని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అది పరుశురాం శవం కాదని డిఎన్‌ఏ పరీక్షల ద్వారా మేం గుర్తించాం… పరుశురాం బతికే ఉన్నాడని మాకు ఘంటాపథంగా తెలుసు. అతడు నీకు చాలా సన్నిహితుడని కూడ మాకు తెలుసు. అతడు, మీరు కలిసి ఎన్నెన్ని హత్యలు చేశారో, ఎన్ని పోలీసుస్టేషన్స్‌ని దోచారో… అంతా తెలుసు. నీకు 24 గంటల టైమిస్తున్నాను. రేపు సరిగ్గా ఈ టైమ్ వరకు పరుశురాం ఎక్కడున్నాడో చెప్పాలి… అతని ముఖ్య స్థావరాలన్నీ నీకు తెలుసు… నిన్న మీ ముఠాలో అతడు కూడ ఉన్నాడని తెలిసే నేను మీ ముఠాను పట్టుకుందామని నా వాళ్ళతో వచ్చాను. మీరిద్దరు దొరికారు గానీ అతడూ, అతనితోపాటు మరో ఇద్దరు చాలా తెలివిగా తప్పించుకున్నారు. అతడిక్కడిక్కడనే, దగ్గర్లోనే ఉంటాడు. ఎక్కువ దూరం పోలేడు. ఎందుకంటే ఈ చుట్టుపట్ల పోలీసుస్టేషన్లనన్నింటిని అలర్ట్ చేశాం. ఈ చుట్టుపక్కల దట్టమైన అడవులు కూడ లేవు… ఇక్కడికి దగ్గర్లోనే ఎక్కడో తలదాచుకున్నాడని నీకు తెలుసు… అతడెక్కడున్నాడో నీకు తెలుసునని నాకు తెలుసు. ఆ ఇన్‌ఫర్మేషన్‌ను మాకిస్తే బతికిపోతావు. లేదా రేపు నిన్ను బయటకు తీసికెళ్ళి ఎన్‌కౌంటర్ చేసేస్తాం. నేను చట్టాన్ని గౌరవించే ఆఫీసర్‌ని. ఎన్‌కౌంటర్ చెయ్యడం నాకిష్టముండదు. కానీ దొరికినట్టే దొరికి తప్పించుకున్న పరుశురాంను పట్టుకొని తీరాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ…”
”నాకేమీ తెలీదు సార్… నాకు తెలిసింది పరుశురాం చనిపోయాడనే… మీ పోలీసు ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడని తెలుసు… అంతకు మించి నాకేమి తెలియదు”
‘చాలు… చాలు. ఈ పరుశురాం చనిపోయాడన్న డ్రామా ఇక చాలు… నిన్నిప్పట్నించే థర్డ్‌డిగ్రీ మెథడ్స్‌తో లొంగదీయొచ్చు… కానీ ఆ థర్డ్‌డిగ్రీ మెథడ్స్‌ని నీమీదా ప్రయోగించటం నాకిష్టం లేదాు… నీకు 24 గంటల టైమిస్తానని మళ్ళీ చెబుతున్నా… వాడి స్థావరమెక్కడో చెప్పు… నిన్ను వదిలేస్తాను. నువ్వు చేసిన నేరాలకు నీకు ఉరిశిక్ష పడ్తుంది. కానీ నువ్వు సరెండరయ్యావని చెప్పి నీకు ఉరిశిక్ష పడకుండా చేస్తాను. నువ్వు చేసిన నేరాలన్నీ పరుశురాంతో కలిసి చేసినవే. వాడికే ఉరిశిక్ష పడ్తుంది. నీకు పడదు. అది నేను చూసుకుంటాను. రేపు ఈ టైమ్‌కు నేను మళ్ళీ వస్తాను. నీ ఆయుష్షు రేపితో ముగుస్తుందో లేక పెరుగుతుందో నువ్వే డిసైడ్ చేసుకో… నీ చావైనా, బ్రతుకైనా నీ చేతుల్లోనే ఉంది…” అని చెప్పి హరివిఠల్ లేచి అక్కడున్న పోలీసులతో ”వీడ్ని జాగ్రత్తగా చూసుకొండి. తప్పించుకునే ప్రయత్నం చేస్తే లేపెయ్యండి” అని చెప్పి హరివిఠల్ వెళ్ళిపోయాడు.
కైలాసానికి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి పక్కనే ఉన్న లాకప్ రూంలో పడేసి ఆ రూంకు తాళం వేసి పోలీసులు ఆ రూం ముందరే కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు.
కైలాసం బుర్రలోకి అనేక ఆలోచనలు ప్రవేశించాయి…
రేపు ఈ ఆఫీసర్ నిజంగా తనను చంపేస్తాడ? అతడు చాలా స్ట్రిక్టు ఆఫీసర్ అని చెప్పుకుంటారు. మాటంటే తప్పడన్న పేరు కూడ అతనికుంది… పరుశురాం చనిపోయాడని అటు జనాన్ని, ఇటు పోలీసుల్ని నమ్మించానికి చాలా పెద్ద ప్లానే వేశాం… అయినా అతడు చనిపోలేదాని పోలీసులు కనిపెట్టేశారు.
అతడు నిజంగా ఇప్పుడెక్కడ తలదాచుకున్నాడో తనకు తెలియదు. తనకు తెలియదంటే ఆ ఏసీపీ నమ్మడు. రేపు నిజంగానే తనను ఎన్‌కౌంటర్ చేసేస్తాడు. కళ్ళు మూసి తెరచే లోగానే తను శవంగా మారిపోతాడు. పరుశురాం ఎక్కడున్నాడో ఊహించి చెబితే తనను వదిలేస్తాడ? ఊహించి యేదో ఒక ప్లేస్ పేరు చెబుతాడు. నిజంగా అతడక్కడ ఉండాలని యేమీ లేదు. యేదో ఒక ప్లేస్ పేరు చెబితే అది నిజమో కాదో తేల్చుకోకుండానే అతడు తనను వదిలేస్తాడ? ఈ పోలీసువాళ్ళ మాట నమ్మొచ్చా? లేదు. లేదు… తనేమీ చెప్పడు. తనకేమీ తెలీదనే మాటమీదనే నిలుస్తాడు. అతడు తనను చంపుతాడేమో… ఎన్‌కౌంటర్ చేస్తాడేమో… చెయ్యనీ… చస్తే చస్తాను… కానీ ఎన్నోసార్లు తన ప్రాణాలు కాపాడిన పరుశురాంకు ద్రోహం చెయ్యను…. వద్దు వద్దు… తను చావకూడదు… బతకాలి. తనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతున్న అమ్మను చనిపోయేలోగా ఒక్కసారైనా చూడలి… అయినా తను పరుశురాంకు ద్రోహం చెయ్యకుండానే తప్పించుకోవచ్చు… పరుశురాం ఇప్పుడు నిజంగా ఎక్కడున్నాడో తనకు తెలీదు. కానీ సాధారణంగా అతడు షెల్టర్ తీసుకునే ఐదారు స్థావరాలు తనకు తెలుసు. ఈ టైమ్‌లో అతడు ఆ ఐదారు స్థావరాల్లో కూడ ఉండే అవకాశం లేదు. అవి చాలా దూరం. నిన్న జరిగిన పోలీసుల దాడిలో అతడు కూడ ఉన్నాడన్న ఎసీపి మాట నిజమే. ఈ 24 గంటల్లో పరుశురాం అంత దూరపు స్థావరాలను చేరుకోవటానికి అవకాశం లేదు. అతడిక్కడే ఈ సిటీలోనే ఉండి ఉంటాడు. ఈ సిటీలో కూడ అతడుండే స్థావరాలు తనకు తెలుసు. కానీ ఆ స్థావరాలను గురించి తను ఏ.సీ.పికి చెప్పడు. చెప్పకూడదు. ఈ సిటీలోని స్థావరాల పేర్లు చెబితే పరుశురాంకు ద్రోహం చేసినట్టవుతుంది. చాలా దూరంలో ఉన్న యేదో ఒక స్థావరం పేరు చెబితే యే గొడవా ఉండదు. పరుశురాం అక్కడుండడు…కాబట్టి వాళ్ళకు దొరకడు… తన అంతరాత్మ తృప్తి పడ్తుంది. వద్దు… వద్దు… యే స్థావరం పేరు చెప్పకూడదు. తను పట్టుబడినా, అతడు పట్టుబడినా పోలీసులెంత టార్చర్ చేసినా మన రహస్య స్థావరాలను గూర్చి పోలీసులకు చెప్పకూడదన్నది పరుశురాంకు, తనకూ మధ్య ఉన్న ఒప్పందం. దాన్ని తనిప్పుడు బ్రేక్ చేస్తే అంతకంటె పెద్ద నేరం ఇంకేది ఉండదు. కానీ… కానీ… రేపు ఏసీపీ రాగానే తనను పోలీసు జీపెక్కిస్తాడు… ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న మామునూరు అడవుల్లోకి తీసికెళ్తాడు… జీపు దిగి పారిపొమ్మాంటాడు…తను జీపు దిగి కొంచెం దూరం పరిగెత్తగానే వెనుకనుండి ఏ.కె. 47 గన్‌తో కాల్చేస్తాడు… తను కుప్పకూలిపోతాడు.
కైలాసం కళ్ళముందు ఆ ద్రుశ్యం అలాగే నిలిచిపోయింది.
తను జీపు దిగతూ… పారిపోవడం… తుపాకి పేలడం… తను కుప్పకూలిపోవడం… ఆ ద్రుశ్యం పదేపదే అతని కళ్ళముందు సినిమా రీలులా తిరగసాగింది.
అతని శరీరమంతా జలధరించింది. భయం అతని శరీరమంతా ఆక్రమించింది… చెమటతో అతని శరీరమంతా తడిచిపోయింది… అతడు శవంగా మారటం… ఆ శవాన్ని మళ్ళీ జీపెక్కించి, కొంతదూరం తీసికెళ్ళి పెట్రోల్ పోసి తగులబెట్టటం… భగ్గున ఎగిసిన మంటల్లో తన శవం కాలిపోవటం…
”నో” అంటూ అతడు పెద్దగా అరిచాడు.
”ఆ సెల్‌లోనే ఉన్న కొమురయ్య ”యేమైంది కైలాసం?” అన్నాడు.
”యేమీ లేదు… పీడకల…” అన్నాడు.
”మన పీడకల నిజమయ్యింది కదా… ఎందుకో ఈసారి మనం పట్టుబడతామని నాకు నా అంతరాత్మ చెప్పింది…. పోనీయ్ గానీ మనల్ని ఈ ఏసీపీ యేం చేస్తా డంటావు కైలాసం…” కొమురయ్య అడిగాడు.
”నీకేం కాదులే… నువ్వు మా దళంలోకి మొన్నమొన్ననే వచ్చావు… నీమీదా చార్జెస్ పెద్దాగా యేం లేవు… చిన్న శిక్షతోటే బయటపడ్తావు….” అన్నాడు కైలాసం.
”నిన్నేం చేస్తారు? ఎన్‌కౌంటర్ చేస్తానని ఆ ఏసీపీ అనడం నాకు వినిపించింది” అన్నాడు కొమురయ్య.
”వాని బొంద… నన్ను ఎన్‌కౌంటర్ చేసేవాడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు” అన్నాడు కైలాసం.
ఆమాట వట్టి మేకపోతు గాంభీర్యమేనని తనకు తెలుసు… ఆ కొమురయ్య ముందు భయపడ్తున్నట్టుగా కనిపించకూడదని అలా అనేశాడు.
ఈలోగా చీకటి పడింది.
ఇద్దరికి అన్నాలు తెచ్చిపెట్టారు… తింటున్నప్పుడు చేతులకు వేసిన సంకెళ్ళు విప్పారు.
రేపు చచ్చేవాడికి ఈ తిండెందుకు? అతనికి అన్నం సహించలేదు…
రేపు తను చావకూడదు… బతకాలి. ఏసీపీ తనకు బతికే అవకాశం ఇచ్చాడు. చావైనా, బతుకైనా నీ చేతుల్లోనే ఉందని చెప్పాడు… తను బతుకుతాడు. తనకిప్పుడు కేవలం పాతికేళ్ళే… ఎంతో జీవితం ముందుంది. బతికి బయటపడ్తే తను ఇప్పుడు గడుపుతున్న ఈ జీవితం నుండి బయటపడ్తడు. కొత్త జీవితం ప్రారంభిస్తాడు. తను లొంగిపోతే ఐదు లక్షలిస్తామన్నారు. లేక తనను పట్టుకున్నవాడికి ఆ ఐదు లక్షలిస్తామన్నారు. తను సరెండర్ అయినట్టుగా రికార్డు సృష్టించి ఏసీపి తనకు ఐదులక్షలు వచ్చేలా చేస్తాడు. ఆ ఐదు లక్షలతో తను కొత్తజీవితం ప్రారంభిస్తాడు. అందరిలా తనూ తనకు నచ్చిన అమ్మాయిని చూసుకొని పెళ్ళి చేసుకుంటాడు. ఎవరో ఎందుకు? తన మేనత్త బిడ్డ నీరజే ఉంది… తనను చేసుకోవాలని ఆశపడింది. నీరజనే చేసుకుంటాడు. ఒకరో ఇద్దరో పిల్లల్ని కంటాడు. వాళ్ళను బాగా చదివించి, తనలా కాకుండ వాళ్ళకు మంచి జీవితం యేర్పడేలా చూస్తాడు…లేదు… లేదు… తను చావకూడదు….
అయినా తను చేస్తున్న ద్రోహమేముంది… ఏటూరునాగారం దగ్గరి అడవుల్లో ఉన్నాడని చెబుతాడు. నూటికి నూరుపాళ్ళు పరుశురాం అక్కడ ఉండడు… వీళ్ళకు దొరకడు…. ఆయన ప్రస్తుతం ఇక్కడే… ఈ సిటీలోనే ఉండి ఉంటాడు. ఈ మహానగరంలో అతన్ని పట్టుకోవడం అసాథ్యం …
ఆ పని చేస్తాను… ఏటూరునాగారం అడవుల్లో ఆ గుట్టుంది…. దాన్ని యేనుగుల గుట్ట అంటారు. ఆ గుట్టమీదున్న ఓ గుహలో ఉన్నాడని చెబుతాను… ఎప్పుడో ఐదారు నెలల క్రితం తనూ, పరుశురాం ఆ గుహలో ఐదారు రోజులున్నారు. తర్వాత ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళారు. ఆ స్థావరాన్ని ఖాళీ చేశాక మళ్ళీ అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదు. పోలీసులక్కూడ ఆ గుహ నక్సలైట్ల స్థావరమన్న అనుమానం ఎప్పుడూ రాలేదు. కాబట్టి పరుశురాం ప్రస్తుతం అక్కడే ఉన్నాడని చెబితే అతనికి ద్రోహం చేశానన్న బాధా ఉండదు…
ఇలాంటి ఎడతెగకుండ వస్తున్న ఆలోచనలతో కైలాసం అర్ధరాత్రి తర్వాత ఎప్పుడో కాస్సేపు నిద్రపోయాడు.
ఆ మర్నాడు పదిగంటలకల్లా ఏసీపీ హరివిఠల్‌రావు వచ్చేశాడు.
”వ్హాట్ కైలాసం? కైలాసం వెళ్తావా? లేక హాయిగా మీ ఊరికి వెళ్ళిపోతావా? యేం డిసైడ్ చేసుకున్నావు?” అడిగాడు ఏసీపీ.
కైలాసం యేమీ మ్లాడలేదు. ఏసీపీకేసి దీర్ఘంగా ఓ చూపు చూశాడు.
”పరుశురాం ఎక్కుడున్నాడో చెబితే నిజంగా నన్ను వదిలేస్తారా?” అన్నాడు.
అతని గొంతు నీరసంగా ధ్వనించింది.
”తప్పకుండ వదిలేస్తాను. ఈ ఏసీపీ మాట తప్పడు…”
”నేను సరెండరయితే ఐదు లక్షలిస్తామని ప్రకటించారు… ఆ ఐదులక్షలు నాకే ఇస్తారా సరెండరయ్యానని చెప్పి…?”
”తప్పకుండ ఇప్పిస్తాను”
”నేనో రెండు అడ్రసులు చెబుతాను… తప్పకుండ ఉంటాడు. ఒకవేళ ఆ స్థావరం ఈ రెండ్రోజుల్లో ఖాళీ చేసైనా పోవచ్చు… ఖాళీ చేసిపోతే నన్ను బ్లేమ్ చెయ్యొద్దు”
”అలాగే… చెప్పు. త్వరగా చెప్పు… వాడిక్కడి నుండి తప్పించుకోకముందే చెప్పు…” అన్నాడు ఏసీపీ.
”అతడు ఏటూరునాగారం అడవుల్లో ఏనుగులగుట్ట పేరుతో ఒక గుట్టుంది. అక్కడ ఉంటాడని నా అంచనా…”
”గుడ్… మరో స్థావరం కూడ చెప్పు”
”కాళేశ్వరం దగ్గరి అడవుల్లో కోయగూడెం అనే చిన్న ఊరొకటుంది. అక్కడందరూ కోయవాళ్ళే ఉంటారు… అక్కడైనా ఉండొచ్చు… ఈ రెండు ప్లేసెస్‌లో తప్ప వేరే ఎక్కడ ఉండే అవకాశం లేదు…” అన్నాడు కైలాసం.
”గుడ్… వెళ్తున్నాం… ఇప్పుడే ఈ రెండు ప్లేసెస్‌ను జల్లెడ పడతాం” అంటూనే ఏసీపీ అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
కైలాసం నవ్వుకున్నాడు.
ఈ రెండు ప్లేసెస్‌లో కూడ పరుశురాం ఉండే అవకాశమే లేదు. పోలీసుల్ని పెద్ద ఫూల్స్‌ని చేశాడు… అతడు ఈ సిటీలోనే క్షేమంగా ఎక్కడో ఉన్నాడు… ఆ ప్లేస్ కూడ తనకు తెలుసు… కానీ చెప్పలేదు… తన అంతరాత్మ ఇప్పుడు తృప్తిగా ఉంది.
✧ ✧ ✧ ✧ ✧
రెండ్రోజుల తర్వాత ఏసీపి హరివిఠల్‌రావు కైలాసం దగ్గరకొచ్చాడు.
”థాంక్యూ కైలాసం… పరుశురాం మాకు దొరికాడు… సరిగ్గా నువ్వు చెప్పిన ఏటూరునాగారం అడవుల్లోని ఏనుగుల గుట్ట మీదున్న గుహలోనే అతడు అతనితోపాటు మరో ఐదుగురు అతని బాడీగార్డ్స్ కూడ దొరికారు. మేం రావడం గమనించిన మీ సెంట్రీ వాళ్ళను అలర్ట్ చేశాడు. వాళ్ళు కాల్పులు జరిపారు. వాళ్ళళ్ళో ముగ్గురు, మాలో ఒకడు కాల్పుల్లో చనిపోయారు.
పరుశురాంను మాత్రం సజీవంగా పట్టుకున్నాం. అతన్ని కూడ ఎన్‌కౌంటర్‌లో లేపెయ్యొచ్చు… కానీ నేనా పని చెయ్యనని నీకు తెలుసు… ఎనీవే, పరుశురాం తలమీద గవర్నమెంట్ 25 లక్షలు పెట్టింది” అన్నాడు ఏసీపీ హరివిఠల్‌రావు.
”ఇదెట్లా జరిగింది?” అన్న షాక్‌తో కైలాసంకు మూర్ఛ వచ్చినంత పనైంది. ”పరుశురాం తలమీదా గవర్నమెంట్ పెట్టిన ఆ 25 లక్షలు ఏసీపీ హరివిఠల్‌రావు కొస్తాయా? తన గతేమౌతుంది? తనను వదిలేస్తారా? లేక….” అతడికి ఆలోచిస్తున్నకొద్దీ మతిపోసాగింది. ”ఈ పోలీసువాళ్ళ మాటల్ని నమ్మొచ్చా? వాళ్ళను ఫూల్స్‌ని చెయ్యబోయి తనే పెద్దా ఫూలయ్యాడ…?” అతనికి ఎడతెగకుండ ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి….
✧ ✧ ✧ ✧ ✧
(జాపాల్ సార్త్ర రాసిన ”వాల్” అన్న కథతో ఇన్స్పైర్ అయి ఈ కథ రాశాను.
ఆ కథకు ఇది అనుకరణ గానీ, అనువాదం గానీ కాదు.)
Add comment