స్వేచ్ఛా గీతిక

తెల్లారేసరికి నిన్నటిదాకా మనతో ఉన్న ఒక మనిషి ఇవాళ లేడే అనే ఆలోచనే లేకుండా, ఎవరి క్లాసులకు వాళ్ళు పోవడంలో బిజీగా ఉన్నారు.

“ వివక్ష, అణిచివేత గళం ఎత్తుకున్న కథలలో నేను గమనించింది ఏంటంటే, ఆ కథలలో అణిచివేతకు గురైన జీవితాలను కేవలం ఒక “sympathetic tone” లో సృష్టించి, వాళ్ళ అస్తిత్వాలను “victimhood” అనే చెరలలో బందించి, బొత్తిగా జీవంలేని బొమ్మల్లా ఆడిస్తారు చాల మంది రచయితలు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, కులంని ఒక “homogenized category”గా మాట్లాడతారు. నాకు ఎందుకో నేను పుట్టిన ఊరు, ఎరిగిన మనుషులు, చూసిన లోకం, ఈ కథలలో ఉన్న పాత్రలు, కథకులు సృష్టించిన లోకం తీరు అన్ని చాలా భిన్నంగా ఉన్నాయనిపించింది.’’

మ్మం జిల్లా బోనకల్ దగ్గర్లోని ఆళ్లపాడు అనే ఒక చిన్న గ్రామం మేడి చైతన్యది.  చిన్నవయసులోనే కథలు రాయడం ఒక విశేషమైమే…భిన్నమైన కథలు రాస్తూ పాఠకుల దృష్టిని ఆకర్షించారు. కొత్తతరం యువత ఎదుర్కొంటున్న అనేక అంతర్, బహిర్గత సంఘర్షణలను తన కథల్లోని పాత్రలతో అద్భుతంగా చిత్రించడం ఈ కథకుని బలం.  “డోంట్ లివ్ ఇన్ ఉటోపియన్ సొసైటీ…లిన్ ఇన్ రియాలిటీ” అని పాఠకులకు తన పాత్రలతో చెప్పిస్తారు. దళిత అస్తిత్వ వాద కథలను తనదైన పదజాలం, నెరేషన్ తో కొత్త తరహాలో చెబుతారు. నిజ జీవిత కథల నుంచే స్ఫూర్తి పొంది రాస్తానంటున్న మేడి చైతన్య  పలు కథల పోటీల్లో బహుమతులు గెల్చుకున్నారు. చైతన్య రాసిన స్వేచ్ఛాగీతిక ఈ పక్షం సారంగ రేపటి కథ.

~

క్లాసులు మొదలయ్యు వారం రోజులయినా ఇంకా తెమల్లేదే అయ్యగారు- ఫోనులో నరేష్ గాడి ఆదుర్దా బాకా హోరుకి అలసిపోయి అలా కన్నారుతుందో లేదో కానీ, తడిక చప్పుడికి మెలుకువొచ్చింది.

“చైతాను బావా… ఏదో సదువుకున్నోడివని సూడమంటే, మరి రెండంటే రెండే పేర్లేనా? నీ…” అని దీర్ఘం తీస్తూ, పెళ్ళాం అయిష్టత తాలూకా టిక్కురక్కులను మొకానికి ముసుగుగా పూసుకొని వచ్చాడు మా గోపిగాడు.

పేడి మొహం నుండి గోదుమ్మీసాలు వచ్చేదాకా టీరింగ్ తిప్పి మొద్దుబారిన బండ చేతులతో నే కప్పుకున్న రెక్కదుప్పటి అమాంతం లాగేసరికి, మంచంక్కోడుకి పట్టి అది కాస్త బరుక్కుమంది.

రేప్పొద్దున్న జమలక్క పీతురు మాటల కంపు ముందే పసిగట్టి, కిరాయి సగానికి తెగ్గొట్టడిగే పీసు వెధవల మీదకి విసిరే తొర్రి పళ్ళ నవ్వుని ఒకటి ఇప్పుడు పెదాలకు అతికించుకొని, మంచం పట్టె మీద చల్లగా కూసున్నాడు. అసలికే ముక్కదైపోయిన మా ముసల్దాని మంచం, నిశ్శబ్దంగా మూలిగి ఇంకొంచెం జోలగయ్యింది.

తాలింపెయ్యని ఉల్లిగడ్డకారం మూడు పూట్ల గోళ్ళతో పళ్లెంలో గెలుక్కుతినేలా చేసిన అమ్మ ఊరి పయనాల మీద ఉన్న కడుపు(లో) మంటంతా, గోపిగాడి మీదకి కక్కేయాలనేంత మా చెడ్డకోపం తన్నుకొచ్చింది .

“అయినా మీ మొండి తోకోల్లకి పెట్టేంత పేషను పేరు మాకేం తెలిసిద్దిలేరా..! వచ్చిం తరువాత మీ జమలక్కని అడుక్కో, మీ సోకుకి తగ్గట్టు ఇచ్చిత్రం పేరు పెడతాది”. పనికిరాని ఆవేశం వల్ల పిడస గట్టుకుపోయిన గొంతులో నీళ్ళు నింపేసుకుంటున్నాను.

ఇంటిపేరును ఎచ్చరిక చేయగానే ఎక్కడలేని ఇది గొంతులోకొచ్చి “మా అక్కనెందుకు అడగటం, మీ అయ్య నీకు టైలీసు పేరు పెట్టాడుగా, చైతాను అని, ఓ ఆడంగోళ్ళ పేరు” అని, టీవీ బల్ల మీదున్న పుత్తకం పేజీలు విసురుగా ఒక నిముషంలో చివరిదాకా తిప్పేసాడు.

ఇంకొక మాట జారితే, రేప్పొద్దున టేషనులో దిగపెట్టడనే భయంతో, ఎక్కడలేని పెద్దతనాన్ని అరువుతెచ్చుకొని, “మరేందిరా, మీ అమ్మాయి పేరు కోసం మా క్లాసోళ్లందరికి లంచంగా టీ పోయించగా వచ్చిన పదమూడు పేర్లలో, రెండు చూడసక్కనివి నీకు చెబితే, నడిజాముకాడ వచ్చి నన్ను నిలదీస్తావా?” అంటూ వేడిగా ఒక చూపు చూశాను.

నా డాబుసరి మూటల బుట్టలో పడిపోయి, రెండేళ్లకింద ఆటో యాక్సిలెంట్ గుర్తుగా మిగిల్చిన ఎడమచేయి కుట్లుని బర్ర బర్ర గీకుతూ “అదిగాదు బావా, మా జోతేమో పొయ్యి మా వదినకి చెప్పింది. ఆమేమో బాగానే ఉన్నాయి కానీ, కొంచెం వోల్డుగా ఉన్నాయని ఈమెగారికి నూరిపోసింది”- ఇద్దరాడోళ్ల మధ్య రాపిడికి ఒకింత మెత్తగయ్యినట్టున్నాడు.

పండబెట్టి కోత్తే గూడెం మొత్తానికి మూడ్రోజులు వత్తాడు గానీ, పెళ్ళాన్ని గదిమిచ్చి ఏదోక పేరు పెట్టలేడు. ఇక్కడికొచ్చి లోపలనుసుకున్నకోపాన్ని సకిలిస్తున్నాడు వీడు.

పొద్దునుతుక్కున్న కడ్డాయర్లు పెట్టుకున్నానో లేదో అని, మళ్లొకసారి బ్యాగంతా కల్లిబిల్లి చేసి, గుడ్డలన్ని ఉండల్లా చుట్టి, దాని నోటిలో కుక్కాను. దెబ్బకు బ్యాగు పొట్టపగిలి జిప్ పేలయింది.

అసలీ పెంటంతా వీడి పిల్ల పేరు వల్లే వచ్చిందని, “మీ అయ్య పేరు కలిసేట్టు కిట్టమ్మనో లేక అమ్మపేరు కలిసేట్టు మరియమ్మనో పెట్టుకోండి ఇక. అయినా, మీ రమేశన్నోళ్లకి కూడా పేరు కావాలి కదరా. ఆయన్నడుగు, మా మంచి తేటగున్న పేరు చెప్తాడని” నల్లదారం సూదిలో ఎక్కించి, బ్యాగుమీద యుద్ధం ప్రకటించాను.

“ ఓ అయ్యా సక్కగాడా, ఆయన్ని అడిగేదానికైతే నీకెందుకు చెప్తానయ్యా సామీ? అయితే అయిందిలే కానీ, రాత్రి ఇదేదో పేరు ఇంగిలీసులో వాటుసాపులో పంపాడు సూడు” అని పోను నా కళ్ళలో పెట్టాడు.

ఎప్పుడూ వినని, చూడని ఆ పేరుని చూసేసరికి బహుశా ఎక్కువ ఎటకారంగా నవ్వాననుకుంటా, సూదొచ్చి బ్యాగుని అదిమిపట్టుకున్న ఎడమచెయ్యి చూపుడువేలిలో పుటుక్కున గుచ్చుకుంది. రొడ్డచెయ్యి వేలిని నోట్లో చప్పరిస్తూ, పసుపుకోసం “వంటగదనే” ఒక మూలగా అమర్చిన డబ్బాలన్నీవెతికాను.

సిన్నపిల్ల ఉసురు తగిలిందని సంకలు గుద్దుతూ మిగిలిపోయిన ఆ కాస్త బ్యాగు కన్నాన్ని పూడుస్తూ, “వాళ్ళిద్దరి పేర్లు కలిసేట్టు పెట్టుకున్నారటయ్యా, నీకేంది నొప్పి ఇప్పుడు? ఆ నెట్లోనో, గిట్లోనో వెదుక్కొని పట్టుకున్నారట ఆ పేరు. ఆ సొదంతా ఎవడు పడతాడని నీకు చెబితే, ములగ చెట్టెక్కుతున్నావ్ గా” అని నాకెళ్లి చూసి కిసకిస నవ్వుతున్నాడు.

ఇక గొడవాడలేక, సరే లేరా పుట్టి పదిరోజులే కదా అయ్యింది, రేపు నేను యూనివర్సిటీకి పొయ్యిన తర్వాత ఇంకొన్ని పేర్లు పంపిస్తాలే అని చీర ముసిగేసిన పక్కబట్టల్లోంచి ఇంకొక చద్దరు కప్పుకొన్నాను.

మునగదీసుకొని పడుకునేసరికి పక్క బొంత కాస్త సగం కిందకి వాలి, వళ్ళు విరుచుకొని పడుకుంది. మధిరలో అందుకోవాల్సిన సాతవాహన కోసం అలారం అయిదున్నరకే గావుకేకలు పెడుతుంది. బద్దకంగా నోరు తెరిచిన నవారు మంచం కన్నాల్లోనుంచి చెయ్యిపోనిచ్చి, ఫోనుని ఒక దెబ్బేసాను. కుయ్యి కుయ్యి మంటూ, బోర్లాపడింది అది.

కాళ్ళుజాపి నిండా చద్దరు కప్పుకుంటుంటే, కళ్ళల్లో దూరుతున్న అమాస చీకట్ల తాలూకా తలపు నెట్టుకొని ఇటుపడ్డాడు గోపిగాడు చేతిలో ఫోనుతో. పెపంచం ఆగిపోతుందన్న ముక్క ముందే తెలుసనట్టు  పిచ్చి పాటలు అల్లే మా జంగమోళ్ళ కనకం తాతకున్న  నిచ్చలత్వం, వాడి ముఖంపై చిందులు తొక్కుతున్నట్టుంది.

ఏమైందిరా అని లేద్దామనుకున్నలోపే, ఏమి పట్టనట్టుగా “రమేశన్నోళ్ల పిల్ల సచ్చిపోయిందట బావా” అని, తెల్లారుజాము చీకట్లో కన్నీళ్ళని కలిపేసుకుంటున్నాడు.

స్తల, కాలాలేవీ పట్టనట్టుగా గోపిగాడు నడిచివెళుతుంటే, వాడి అడుగులతోపాటు, వాకిట్లో విషాద సంద్రంలో మునిగిన పొద్దు ఉదయిస్తున్నట్టనిపించింది.

ఏ సడి, సప్పిడి లేకుండా వచ్చిన గాలి దుమారానికి తేరుకొని మొత్తల్లోకొచ్చిన నాకు, బొలెరో ఇంజిను శబ్దం వినిపించింది. మాయ్యేళ్ళకి చెప్పవరా అని అడుగుతున్నా, అసలేమీ వినపడనట్టు, ఎనకమాల టక్కువైపు నడిచాడు. నిన్న ఏరుకొచ్చిన కట్టెలదుంపలు, వాళ్ళ సీనన్న సెంట్రింగ్ ఇనుప షీటులను, ఏది నిజమో, ఏది అబద్దమో, అని తూకం వేస్తున్నట్టు మెల్ల మెల్లగా బయటకు లాగుతున్నాడు. డూటీకి పోతున్న వాళ్ళన్నని మధిరలో దింపినపుడు, వీడి కళ్ళముందే వీడియో కాలు చేసి మురిసిపోయాడని చెప్పాడు. అట్టా పంపించి, మా అమ్మ ఎలాగూ లేదని మా ఇంటికొచ్చి పడుకున్నానని, ఇంకా ఏదేదో అర్ధం కాకుండా గొణుక్కుంటున్నాడు లో, లోపలే.

వాడు ముక్కు చీదడంలోనే ఏమి చెయ్యాలో తెలిసొచ్చి, నేను కూడా మిగిలిన చెత్తంతా తీసి, చీపురుతో బాడీ మొత్తం ఊడ్చి, బులుగు పట్టా ఒకటి వేశాం కింద కూర్చునే విధంగా.

ఇంటికెదురుగానున్న వేపచెట్టుపుల్లొకటి వేసుకొని, రెండు నిముషాల్లో పళ్ళుతోముకొని బులెరో దగ్గరికెళ్ళా. అందరెక్కిన తరువాత డోరువేసి, వెనక అడ్డంగా పెట్టిన కడ్డీ పట్టుకొని నిలబడ్డా.

“ఎట్టాగూ కాలిగానే ఉన్నావ్ కదరా, ఆ రమేశయ్య బిడ్డని చూసిరారాదు?”. నిన్న ఆటో ఎక్కే ముందు అమ్మన్న మాటలు గుర్తొచ్చాయి.

“మూణ్ణెల్ల పిల్లని నాకు ఎత్తుకోవడం చేతకాదే, కొంచెం పెద్ద అయినా తరువాత ఒకేసారి చూసి ఎత్తుకుంటాలే”-నా పేలవ మాటలు పెడేల్మని మొహానికి తగిలాయి. వెనుకటైరు ఎత్తేత్తే , కర్ర పట్టు తప్పి, ఎడమ చెయ్యి డోరు రేకుకి గుచ్చుకుంది. ఎన్నడూ గమనించని, గతుకుల గుంతలు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయి.

బులెరో ఆరను శబ్దం, ఏడుపాపుకోవడానికి నోట్లో పెట్టిన చీర కొంగు గాలికిచేస్తున్న టపటప శబ్దం, మా లోకమయ్యాయిప్పుడు. చెప్పాపెట్టకుండా వచ్చిన ఆపద, బండిలోనున్న వాళ్ళందరిని కొంచెం కొంచెం కోసుకుతింటున్నట్టుంది.

ఆగకముందే దిగి డోరు తీయాలనే తొందరలో కిందకి దూకేసరికి, బుడుగులో కాలుపడి ప్యారాగాను చెప్పు తొడిమ తెగింది. పిన్నీసు పెట్టి సరిచేసే టయిము లేక టక్కులో జత పడేసి, ఆదరాబాదరాగా ఉరుక్కుంటూ వెళ్ళా మిగతావారిని అందుకోవాలని.

గుమ్మానికి ఇంకో పదడుగులు ఉందనగానే, ఎదో తెలియని కారుమబ్బొక్కటి నా ఇంద్రియాలన్ని మొద్దుబారేలా చేసి, నాకే తెలియకుండా ఇంటిలోపలికి లాక్కుపోతున్నట్టనిపించింది.

అమ్మలక్కల గోసపెడుతున్నా చెవుల్లో “గీ” అనే మోత తప్ప ఏమి వినిపియ్యట్లే. వీళ్ళ గోలతో తనకేమి సంబంధం లేనట్టు, అందరూ రొమ్ములకత్తుకొని ఊపుతున్నా ఆ చిన్ని తల్లి ఏడవకుండా ఉంది.

నాకు గుర్తెరిగి ఒక చిన్నపిల్లను ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటసారి. అది కూడా ఇలా.

పారేసుకున్న కళ్ళు. రెప్పలు అదే పనిగా మూసుకొని ఉండటంవల్ల, కనుబొమ్మలు ఉబ్బి నవ్వుమొహంలా అనిపించింది. గుక్కపట్టి ఏడుస్తున్న ఇన్ని గుండెల రాపిడికి ఒరుసుకుపోయి కమిలిన తన లేత చర్మం.

“నలుపైనా, ఎంత కళ మొగమో, మా బుడ్డదానిది”-వాళ్ళ అమ్మమ్మ, వంకర్లుపోతున్న చిన్నివేళ్ళను అతిసుతరంగా నొక్కుతుంది. చిన్న పిల్ల చనిపోయిన దగ్గరనుంచి, ఏడ్చి, ఏడ్చి, గేరొచ్చి, శారదా కూడా చలనం లేకుండా పడుంది పిల్లకిమల్లే. ఇంకా ఏడిస్తే, బిడ్డతో సహా తల్లి దక్కదని గోపిగాడిని బయటకు లాక్కొని వచ్చా.

ఈ లోగా సీను గాడు, మధిరపొయ్యి రమేష్ ని బండిమీద ఎక్కించుకొని వచ్చాడు. నిన్న రాత్రే, తనకి మాత్రమే అర్ధమయ్యే బాసలో కబుర్లెన్నో చెప్పి, పొద్దుటకల్లా ఎవరికీ అర్థంకానీ నిశ్శబ్దమైన కదలికలు మూటకట్టివెళ్లిపోయిందని, వాడు బావురుమంటున్నాడు. ఎక్కడ బొందబెట్టాలని తజ్జన బజ్జన పడుతుంటే, ముసలోళ్ళందరూ తమ జీవితానుభవాలనుండి కూడ బలుక్కొని చెప్పిన మాట “ఇంటి దగ్గర్లో పెడితే, మళ్ళీ కాన్పు తొందరగా అందుకుంటుందని.”

గాబు పక్కనున్న గుబ్బ చెట్టుకాడ గుంత తీద్దామంటే, “ఒకేల, మా వదినకు ఎప్పుడైనా ఈ ఇషయం తెలిస్తే, పరగడుపునే ఇక్కడే కూలబడి లేవదు. ఇంకేదైనా తలం చూడండి” అన్న గోపిగాడికి, ఆడున్న పెద్దోళ్ళందరూ 10 గజాల్లో ఉన్న ఎన్నెస్పీ కాలువ చూపించారు.

ఆడోళ్ళేవరిని రావొద్దని చెప్పి, వాళ్ళ నాన్న ఏంతో మురిపెంగా కొనుక్కొచ్చిన గులాబీ దూది దుప్పట్లోనే తనని తీసుకెళ్లారు పెద్దోళ్ళు.

ఆవల గట్టుకానుకొనే ఎవరో ప్రవారి కట్టుకున్నారు కాలువ మీదే. అందాజగా ఒక నాలుగడుగులు తవ్వి పిల్లని పడుకోబెట్టారు. బడి అయిపోయుందనుకుంటా, ఇక్కడున్న పిల్లోళ్ళందరూ బులెరో ఎక్కి, ఆ కడ్డీలు పట్టుకొని వేలాడుతూ కళ్లెళ్లబెట్టి చూస్తూ, గోల చేస్తున్నారు.

“ఓరి పోరగాల్లరా, ఎందుకురా అరుత్తున్నారు, ఆ ఇంటోళ్లు బయటకొత్తార్రా” అని, మీదున్న కండువాతో గింజల్ని తినడానికి వచ్చే పిట్టల్లకిమల్లే పిల్లల్ని అదిమిస్తున్నాడు.

ఇంకో రెండు పారల మట్టి అయితే అయిపోయిద్దనగా, గోడకిటుపక్క చేతులేసి ఆ ఇంటామె అరవడం మొదలెట్టింది. “ఏమయ్యా, మీకు వేరే ప్లేస్ దొరకనట్టు ఇక్కడ పెట్టారు. అసలు మీకు బుద్ది ఉందా? మీ స్మశానానికి పోవొచ్చు కదా? నేను ఇప్పుడే ఎస్సై కి ఫోను చేసి, న్యూసెన్స్ కంప్లైయెంట్ ఇస్తా” అని లోపలి విసురుగా వెళ్ళిపోయింది.

ఈ చీదరింపులు మనకెలాగూ అలవాటే అన్నట్టుగా, ఇంట్లోకొచ్చి, లోటాతో కాళ్ళు కడుక్కొని, కిరసనాల దీపానికి దండంబెట్టుకున్నాం. “దైర్యం జేసుకొని, శారదని కడుపులో పెట్టుకొని ఉండాలన్న మరిమ్మక్క మాటకు, రమేష్ గాడు తలూపుతుంటే, బొట బొట మంటూ, కన్నీళ్లు చెంపలమీదకి కారుతూనే ఉన్నాయి. అంత అయిపోయుందనుకున్న తర్వాత అందరు టక్కుకాడికి పోతుంటే, “బీ స్టాంగు” అని వాడికి చెప్పి, వెనక్కి తిరిగి చూసే దమ్ములేక బండి ఎక్కినా. ఏందిరా బిడ్డా, ఇవాళ కూడా రాలేదన్న నరేష్ గాడి మెసేజికి, జరిగిందేంటో పొడి పొడిగా చెప్పి, ట్రక్కులో సతికిలపడ్డా.

ఎర్రటగ్గిలో రోజంతా ఎండిపోయి, సాయంత్రం చెడు వానలో తడిసిన కరెంటు కోడిపిల్లకిమల్లే రెక్కలు ముడుచుకొని ఇంటికి చేరుకున్నాం.

కాలేజీకి పోదామని సర్దిన బ్యాగునిపక్కకి తన్ని, రెండు ముద్దలు గొడ్డుకారం నోట్లో వేసుకుంటున్నానో లేదో, గోపిగాడు రొప్పుతూ వచ్చి తెల్ల తెల్లగా ఎదో మాట్లాడుతున్నాడు. ఎంగిలి చెయ్యి పళ్లెంలోనే కడిగి, ఈ సారి ఉత్తకాళ్లతోనే బండిమీద పొయ్యాం వైరాకి.

మేం పొయ్యేసరికి ఎస్సై గారు గట్టిగ కేకలేస్తున్నారు. “ఏం రా? మీ అయ్యా జాగీరురా ఆ కాలువా? కేసుపెట్టి బొక్కలో తొయ్యమంటారా లేక ఇంకెక్కడైనా పాతేసుకుంటారా” అని, సిగరెట్ వెలిగించుకున్నారు.

“అట్టగాదు సార్. ఇంటి దగ్గర్లో పెడితే, కడుపు తొందరగా అందుకుంటుందంటే పెట్టినాం. మళ్ళా , ఇప్పుడు తీస్తే, పాపం తగిలిద్ది సార్. అయినా, వాళ్ళ గోడ కూడా ఎన్నెస్పీ కాలువమీదే కట్టారు కదా” అని, గోపిగాడు నసిగాడు దూరం, దూరంగా జరుగుతూ.

కుడిచేతి బొటనవేలితో టచ్చు ఫోను నొక్కుతున్న ఆయన, ఒకదమ్ము పొగ గట్టిగ వదిలి “ఏందిరో, నోరు లెగుస్తుంది. ఆ ఇళ్లెవరిదో తెల్సునా? ఎమ్మెల్యే గారి బామ్మర్దిది. అవసరమైతే ప్రొక్ లేనరు పెట్టి, ఆ బొందని తవ్వించమని చెప్పిండు. లమ్మిడి కొడుకుల్లారా, గుద్దమూసుకొని, 5 నిముసాల్లో పని కానియ్యాలి” అని, గోపిగాడి కాలర్ పట్టుకొని లాగేసరికి అది కాస్త చినిగిపోయింది. ఏమైందో నాకు పదినిముషాల్లో కాల్ చేసి చెప్పమని, అక్కడున్న ఐదారు కానిటేబులకి చెప్పి, బండెక్కి వెళ్ళిపోయాడు.

గడ్డపారతో తొవ్వితే ఎక్కడ చిన్ని పాపకు తగులుతుందనే భయంతో, కొంచెంసేపు పార, ఇంకొంచెంసేపు వట్టిచేతులతోనే తిరగతోడాం బొందంతా. ఎడమచేయికున్న నల్ల దిష్టి పూసలు కనపడగానే గోపిగాడు ఆ చేతిని ముద్దెట్టుకుంటూ, వాడి నెత్తిని మట్టిలోకి కూర్సుకుంటున్నాడు. పక్కనున్న ఇద్దరొచ్చి వాడి రెక్కపట్టుకొని ఈడ్చుకెళ్లారు దూరంగా.

మట్టికొట్టుకుపోయిన ఆ చిన్న పిల్ల మొఖం చూడలేక ఫోన్ లైట్ బంజేయమని చెప్పినా. బొందలోనుండి అమాంతంగా తనని రెండు చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు, నేలకూలి లోపలికి కూరిపోతే బాగుండనిపించింది.

కాలువకాన్నుంచి గాబు గుంతదాకా తనని ఎత్తుకొని నడుస్తుంటే, పుట్టినప్పటినుండి ఇప్పటిదాకా నడచిన అడుగులన్నీ వెనక్కి వేస్తున్నట్టనిపించింది. ఎక్కడ శారదా లేస్తుందనే కంగారులో, ఆ దూదిదుప్పటి మునుపటిదగ్గరే కంగారులో వదిలేశాం. కండువకటి కింద పరచి మెల్లగా మట్టిపోసాము. మట్టి అదునుగా సదురుతుంటే, ఆ చిన్ని తల్లంతా చిల్లు, నా గుండెల్లో పడినట్టు అనిపించింది.

మట్టి చేతులు కడుక్కొని ఇంట్లోకొచ్చేసరికి, శారదకి ఆర్.యం.పి డాక్టరు ఏయ్యె మందులు ఇచ్చి, ఇంజిషను పొడుస్తున్నాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండలేక, వెంటనే ఇంటికి వచ్చేసాం.

ఈ రోజంతా చీకటిలోతులకి అలవాటైన కళ్ళకి, బండి లైట్ తో పని ఏమి లేకుండా పోయింది ఈ అర్ధరాత్రప్పుడు.

“పట్నంలో ఉంటే మాత్రం ఏమంత బాగుపడ్డార్రా మనోళ్లు, సరైన బొందలగడ్డే లేదు అసలు. ఈ సిటివోల్లు పీనుగులని కూడా తినేరకం రా” అని, ఎస్సై మీదున్న కోపం బుగ్గనేసుకున్న పొగాకు మీద చూపిస్తున్నాడు కిట్టమాయ్య.

నాకెందుకో ఈ రోజు జరిగిన వాటిని తలచుకుంటే అదే నిజమనిపిస్తుంది.

నేను పెద్ద బళ్లోకి పోయిన సంవత్సరం అనుకుంటా, చుట్టింటి గోపులతాత నిద్రలోనే చనిపోయాడు. నేను పొద్దున్న లేచి బొగ్గుతో పళ్ళు తోముకొని పోయేసరికి, చాలామంది గూమిగూడి ఉన్నారు ఇంటి ముందు. ఆఖరుకు అంతకుముందు రోజు రాత్రి పాటలు పాడిన దండోరా హైద్రాబాదు అన్నలతో సహా.

డబ్బులన్నీ జమచేసి, బొంగుపేలాలు, బాంబులుకొని, బుక్కాయి చల్లుకుంటూ పీతిగొద్దెలు  తొక్కకుండా డొంకలో గడ్డి దోవెమ్మటి బొందలగడ్డకి పోయినాం. దండోరన్నలు చాల సేపు మాట్లాడి, ఎయ్యయ్యో పాటలు పాడారు. మా పొట్ట అయ్యగారు పార్దన చేసి అందరికంటే ముందు మూడంటే మూడుసార్లు మట్టేసారు. మా బామ్మర్ది గోపిగాడు, నేను మాత్రం పోటీపడి, పదిసార్లదాకా మట్టేసాం ఎవరికీ తెలియకుండా.

ఆ రోజు నెత్తిమీదకు ఎండొచ్చేదాకా బువ్వతినకపోయేసరికి, పాకలోకి పొయ్యి చూస్తే, అన్నం తపెలా, కూర సట్టే ఖాలిగా వెక్కిరించాయి. నీ యమ్మో నాకు ఆకలెత్తుందని కల్లెపు మీదబడి పొర్లుతుంటే, మా అమ్మమ్మోచ్చి నిక్కరుబొంది పట్టుకొని పైకి లేపింది.

“ఎవరైనా సచ్చిపోయినపుడు బువ్వ తింటే, ఆ సాతానొచ్చి తీస్కపోతాడు రా. అందుకే, గూడెంలో ఎవరు మాటేల వరకు అన్నం వండుకోరు రా” అని, వీపుకంటిన పేడనంతటిని దులిపింది. అప్పటిసంది ఇప్పటిదాకా నా చుట్టుపక్కల్లో ఎవరైనా చనిపొతే, నాకు అన్నం తినబుద్దికాదసలు.

మా గూడెం చేరుకున్నామో లేదో కిట్టమాయ్య బండిమీదనుండి దూకి, పొగాకును తుపుక్కుమంటూ ఊసి “ఏం బదుకులో ఏందో? పుట్టిందగ్గర్నుంచి ఊడిగం చేయడమే. ఆకరుకు ,సచ్చిపోయిన మనిషిని పెశాంతంగా బొందకుండా పెట్టుకోలేకపోయిన బ్రదుకులాయే” అని, నీళ్ళు పుక్కిలిస్తున్నాడు.

రేప్పొద్దున గోల్కొండకైనా బోనకల్ వెళ్లి పోవాలనుకొని, బయట శబ్దాలేవి వినిపియ్యకుండా, దుప్పటితో రెండు చెవులను గట్టిగా మూసుకున్నా. పొద్ద్దున్నే, గోపిగాడు ఊరిచివర చెరువుదగ్గరకొచ్చాడు. ఆటో ఎక్కి వాడిని ఇంటికి వెళ్లిపొమ్మన్నాను నిన్నటి బరువు జ్ఞాపకాలు నాతో తీసుకెళ్లేంత శక్తిలేక. సాయంత్రం ఆరింటికి హాస్టల్ కి చేరుకొని, సోయలేకుండా నిద్రపొయ్యా.

ఈ మాయదారి కోర్సులో జాయినయ్యి, ఒక సంవత్సరం అయినా, ఇంగిలీసుతో ఇంకా కుస్తీలు పడుతూనే ఉన్నా. ఇంటి దగ్గరనుండి వచ్చిన తర్వాత కోర్స్ వర్కులో పడి ఒక నెల రోజులు ఎలా గడిచాయో గుర్తు లేదు.

ఇంటిదగ్గరనుండి వచ్చిన కొత్తలో, నా దిగులంతా ఎవరికి చెప్పిన అర్ధం చేసుకోలేరన్న బాధతో, రాత్రి మెస్ లో అన్నం తిన్న తర్వాత ఒక్కడినే రోడ్లన్నీ నా మాటలతో నింపుకుంటూ నడచేవాడిని. ఓ ఆదివారం రాత్రి, నా గరుకు గొంతుతో ఎదో పాత పాడుకుంటూ బఫెల్లో లేక్ దగ్గరికి వెళుతుంటే, చీకట్లో ఎవరో నీళ్లలో బుటక్ , బుటక్ మని, గులకరాళ్లేస్తున్నారు.

జులపాలు చూసి తెలుగోడు కాదనుకొని, “కోన్ రే” అని నాకొచ్చిన ఇందీలో కేకేసా.

రాళ్లు పక్కన పడేసి, పేంటు అడ్డ దిడ్డంగా మడతలేసి ట్యూబులైట్ వెలుగులోకి వచ్చాడు.

“వాట్ ఆర్ యూ డూయింగ్ అలోన్, మ్యాన్” అని నేను అడగాల్సిన ప్రశ్నని, నన్నే అడిగి జీను పేంటు జేబులోంచి ఫోను తీసుకోని టయిము చూసుకుంటున్నాడు.

“ఐయామ్ లిజనింగ్ సాంగ్సు, వాకింగ్” అని ముక్తసరిగా బదులిచ్చి, ఇంకేదైనా అడిగితె ఇంగిలీషు పదాల కోసం వెతుక్కోవాలని, గిర్రున వెనక్కి తిరిగి హాస్టల్ కేసి పరుగులాంటి నడక మొదలెట్టా. రెండు నిముషాల తరువాత వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చి, ఎక్కడ ఉంటావ్ అని అడిగితె, “హెచ్ హాస్టల్” అని చెప్పి నిల్చుండిపోయాను.

ఉరుకులాంటి నడకతో రెండు అడుగులువేసి, నేను పక్కన లేనని రియలైజ్ అయ్యి, వెనక్కిదిరిగి చూసి ఏమైందన్నాడు. ఏమిలేదని ఎంచక్కా భుజాలెగిరిసి, ఈ సరి ఇంగిలీసులో ఏమడగాలా అని నోట్లో అనుకుంటున్నాను.

“ఐయామ్ రజనీష్, ఇంగ్లీష్ డెప్ట్. వాట్స్ యువర్స్, మ్యాన్” అని, చేయిజాపాడు.

పేంటు జోబులో దోపుకున్న చెయ్యిని బయటకు తీసి, “చైతన్యా, ఫిలాసఫీ” అని రెండు, మూడు సార్లు చెయ్యి,పైకి కిందకి ఊపా.

రెండు క్షణాల మౌనం తరువాత ఎదో గుర్తుకు వచ్చి, ఓషో అసలు పేరు రజనీషే కదా అని అడిగితె, “ యా మ్యాన్, బట్ దట్ ఫక్కర్ హ్యాజ్ లాట్ అఫ్ సెక్స్. అయామ్ స్టిల్ ఏ వర్జిన్” అని గట్టిగా నవ్వేసాడు.

ఆ రోజు నుండి, ఈ నెల రోజులు వాడు నాకు ఇంగ్లీష్ నేర్పించడం, నేను వాడికి తెలుగు బూతులు నేర్పడమే పని.

పోయిన సుక్రోరం కలిసినపుడు, ఈ వారం పరీచ్చలు అని చెప్పి, రాత్రి కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని ముభావంగా చెప్పాడు.

ఎందుకంత సైలెంట్ గా ఉంటావ్, నీలాంటి వాళ్ళకోసమే “యూనివర్సిటీ హ్యాజ్ గివెన్ యాక్సిస్ టూ పోర్న్ సైట్స్ ” అని భుజంమీద చెయ్యేసాను.

“దట్స్ వై యువర్ హ్యాండ్స్ ఆర్ స్మెలింగ్ డర్టీ. గో అండ్ వాష్ యువర్ సెల్ఫ్ ముండ ” అని ఎద్దేవా చేశాడు.

సోమవారానికి పెన్నులేకపోతే వాడి బ్యాగ్ లో నుండి ఒకటి దొంగలించా.
డెకార్ట్ గురించి ఎదో సొల్లు రాసి, రజనీష్ కి మెస్సేజి పెట్టా ఎప్పుడు కలుద్దామని. బాబు దగ్గరినుండి సాయంత్రమయ్యేదాకా రిప్లయ్ లేకపోతె, నరేష్ గాడితో కలిసి సినిమాకెల్లా.

పనికిమాలిన పాటలు, అనవసరమైన ఫైట్లు మెదడులోని సగం గుజ్జు తిన్నాక, ఉచ్చపోసుకొనిచ్చి కుర్చీలో కూలబడుతుంటే, అరే మళ్ళా ఎవడో హాస్టల్ లో చచ్చిపోయిండటరా అని నరేష్ గాడు చెప్పాడు. రీజనేంటి రా అని అడిగితె, ఎదో ప్రేమ విషయం అయ్యిఉండిద్దిలేరా అని సినిమాలో కళ్ళు బెట్టాడు మళ్ళీ వాడు.

సినిమా బోరుకొట్టి నెట్ ఆన్ చేయగానే, ఎన్నడూ లేని విధంగా వాట్సాప్ లో చాలా మెసేజిలు. ఓపెన్ చేసి చూస్తే, కామన్ గ్రూప్ లో “రిప్, రజనీష్” అని ఒక ముప్పైకిపైగా ఉన్నాయి. ఆ సినిమాహాలు చీకట్లో కళ్ళలో వెలుగు నింపుకొని చుస్తే, “M.A first year Rajanish has committed suicide” అని నోటిఫికేషన్ వచ్చింది.

తర్వాత నేను ఏమేమి చేసానో నాకు నాకు ఒక క్రమ పద్దతిలో గుర్తు లేవు. నరేష్ గాడు నన్ను సౌత్ క్యాంపస్ లో దించేసి, వాడి హాస్టల్ కి వెళ్ళిపోయాడు. ఆ పాటికే, రజనీష్ నీ పోస్ట్ మార్టం కోసం పంపి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు అసలేమీ జరగనట్టుగా.

ఇప్పుడు ఒక్కడినే సౌత్ నుండి నార్త్ వరకు నడుస్తున్నా వాడి మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ. కప్,సాసర్ జంక్షన్ దగ్గర కేకు మొఖానికి పూసుకుంటూ, ఫోమ్ స్ప్రే గాలిలో కొడుతూ, ఎవరో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బైక్ మీద ఎవరో అమ్మాయి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, గట్టిగ వాటేసుకొని చెవిలో ఎదో గుస గుసలు చెప్తుంది. పేరు మోసిన స్టూడెంట్స్ నాయకులు, పంపుసెట్టు బాగుచేశామని, మెస్ ఫుడ్ కోసం ప్రొటెస్ట్ చేశామని FBలో పోస్టు చేస్తున్నారు.

తెల్లారేసరికి నిన్నటిదాకా మనతో ఉన్న ఒక మనిషి ఇవాళ లేడే అనే ఆలోచనే లేకుండా, ఎవరి క్లాసులకు వాళ్ళు పోవడంలో బిజీగా ఉన్నారు. మాయదారి అటెండన్స్ కోసం నేను కూడా క్లాసుకి పోవాల్సివచ్చింది.

రెండు సార్లు బొంద తీసేలా చేసిన వైరావోల్లు, సచ్చిన మనిషిని పక్కనెట్టుకొని సంబరాలు చేసుకుంటున్న యూనివర్సిటీవాళ్ళు ఒక వైపు, ఒక ఇంట్లోని దుఃఖం అందరూ పంచుకోవాలని అని నమ్మే నేను ఎరిగిన గూడెపోల్లు ఇంకొక వైపు, రెండు భిన్నమైన మనుషుల గుంపులుగా, నా బుర్రలోపలి విలువల కాటాలో ఊగుతున్నారు.

వెనకెక్కడో కూర్చున్న నాకు, ప్రొఫెసరు చెప్పేది లోనికి పొవట్లేదు. కిటికీ సువ్వల గుండా బయటకు చూస్తే, బయట కారిడార్ లో ఒక అమ్మాయి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎదురుగా గోడకానుకొని. వాడి దగ్గర తీసుకున్న పెన్నుతో ఇప్పుడు నాకు ఏమి రాయాలనిపించట్లే. నోట్స్ తీసుకోకుండా దిక్కులు చూస్తున్న నన్ను ప్రొఫెసరు నిలబెట్టాడు. ఫోన్ వైబ్రేట్ అవుతుంటే, ఆయన ఏమంటున్నాడో ఏంటో అంతగా పట్టించుకోకుండా బయటకొచ్చేసా.

ఈ టైం లో గోపిగాడేందుకు కాల్ చేస్తున్నాడునుకొని లిఫ్ట్ చేసి సైలెంట్ గా వింటున్నా. “ఓ బావో, మా శారదొదిన ఫోన్ చేసింది పిల్లకు ఏమి పేరు పెడుతున్నారని అడిగింది. కొత్త పేర్లు ఏమైనా చూసినవా” గద్దిచ్చినట్టుగా అడిగాడు.

గొంతులో తడి కనిపెట్టనీయకూడదనుకొని గట్టిగా ఒకసారి దగ్గి “లేదు గోపి ఇంకా. రేపటికల్లా చెప్తాలే ఎదో ఒకటి అని” ఫోన్ పెట్టేయబోతుంటే, బావా … బావా… కట్ చేయకు అన్నాడు.

“అసలు నువ్వు ఇంతకూ ముందు చెప్పిన రెండు పేర్లలో ఒక పేరు వదినకు బాగా నచ్చిందట. వాళ్ళ అమ్మాయికి పెడదామని ఏమి బాలేదని చెప్పిందట. ఇప్పుడు, ఆ పేరే పెట్టమని చెప్తుంది” అని, గట్టి గట్టిగ అరుస్తున్నాడు, సిగ్నల్ లేదనుకుంటా.

“మీ అమ్మాయిని కూడా నేను చూడలేదు కదా రా, ఒకసారి ఫోటో వాట్సాప్ చేయరా” అని అడిగిన వెంటనే మెసేజి రింగ్ స్టోన్ వచ్చింది.

సరిగ్గా నెలరోజుల క్రితం ఈ రెండు చేతుల్తో మోసిన పాపల్లె తోచింది ఈ చిన్నితల్లి కూడా.

స్క్రీన్ ని గట్టిగా ముద్దెట్టుకొని, నాకే తెలియకుండా “స్వేచ్చా గీతికా” అని గట్టిగా అరిచా.

క్లాస్ టయిం అయిపొయింది అనుకుంటా, మా ప్రొఫెసరు డోరు తీసి, నన్ను వింతగా చూసుకుంటూ మెట్లెక్కి వెళ్లిపోయాడు.

*

                                

రాయడం అనేది ఒక “aversion” లాంటిది.

 1. మొదటి కథ, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు రాయాలనిపించింది?

నా అచ్చయిన మొదటి కథ “చెదిరిన ఆదర్శం”. మెహెరన్న సంపాదకత్వంలో వెలువడిన కినిగే పత్రిక 2013, డిసెంబర్ లో ఒక “short story” పోటీ పెట్టింది (750 పదాలకు మించకుండా, 30 ఏళ్ళ లోపు వారికి). అందులో నా కథకు మూడో బహుమతి వచ్చింది. ఎందుకు రాయాలనిపించిందో ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ, నా కథ ఎంపిక అయింది అని తెలిసి ఆ రోజు నిద్రకూడా పోలేదు. ఆ తరువాత, ప్రైజ్ గా వచ్చిన 500 రూపాయలతో ఓ రెండు, మూడు రోజులు మంచి ఫుడ్  మాత్రం తిన్నా, అంతే గుర్తుంది ఇప్పుడు. బహుశా, నేను అప్పుడే ఇంటిదగ్గర నుండి హైద్రాబాద్ వచ్చి, ఇక్కడ ఉన్న కల్చర్ కి ఇమడలేక, ఆ ఇబ్బందిలో నుండి రాసిన  కథ ఏమోనని అనిపిస్తుంది. ఈ కథలో అక్కడక్కడా నాకు నేను కనిపిస్తా అని నా ఫీలింగ్ అండి. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏమి లేదు. అలా అని, ఆ  కథని disown చేసుకునెంత దరిద్రంగా కూడా ఏమి రాయలేదని నా ఫీలింగ్.

 1. కవిత్వం కూడా రాసినట్లున్నావ్ కదా, ఏది కంఫర్ట్ గా ఫీల్ అవుతావు..?

నా మటుకు రాయడం అనేది ఎప్పుడు “comfortness” కానే కాదు, అది కథైనా, కవిత్వమైనా. నేను కవిత్వం రాసింది చాలా చాలా తక్కువ. కథ కన్నా, కవిత్వం మనిషిని ఇంకా ఎక్కువ క్షోభ పెట్టి, లోపలనుంచి కోసుకొని తింటుందని అని నేను అనుకుంటాను. అదేంటో కానీ, నేను రాయడాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. నేను రాయడానికి కూర్చునప్పుడల్లా, చలిజ్వరంతో వళ్ళంతా కాగే మా అమ్మమ్మ వళ్లులా, ఒక సన్నని వణుకు నాలో వస్తుంది. ఒక సారి జ్వరం వచ్చి తగ్గిన తరువాత వంట్లో ఉన్న మిగతా కల్మషాలు ఎలా మాయమయిపోతాయో, అప్పటిదాకా నన్ను వెంటాడిన ఒక ఎమోషన్ యొక్క గాఢత కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది రాయడం పూర్తి చేసిన తరువాత.

నా ఇష్టమైన రచయిత మాటల్లో చెప్పాలంటే, రాయడం అనేది ఒక “aversion” లాంటిది. పర్యవసనాలు గురించి తర్కించకుండా అందులోకి దూకాలే తప్ప, హేతుబద్దంగా లోటుపాట్ల గురించి ఆలోచిస్తూ ఉంటే, మస్తిష్క చీకటి గుయ్యారంలో పెనుగులాడుతున్న ఆ ఎమోషన్ బయటకు ఎప్పటికీ పోదు. ఏదైనా రాయడం మొదలు పెట్టినప్పుడు, నేను ఆ ఎమోషన్ ని సరిగా convey చేయగలనా లేదా అనే ఆలోచన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తీరా ఎలాగో అలాగా రాసిన తరువాత, నాకు ఒక్కడికే సొంతమయిన భావాన్ని, ఇలా అక్షరాలలో నింపి , ఇంతకాలంగా ఆ భావానికి నాతో ఉన్న సంబంధాన్ని ఇంకా పలచన చేసుకుంటున్నానేమో అనే సంశయం ఎప్పుడూ నా కళ్ళలో మెదులుతూనే ఉంటుంది. పోనీ కొన్ని డక్కీ, మొక్కిలు తిని రాసిన తర్వాత, రాసినకథ/కవిత తనకు తానుగా, తనకంటూ ఒక అస్తిత్వాన్ని సంపాదించుకుంటుందా, లేదా? అనే “skepticism” ఎప్పుడూ  ఉండేదే.

లోపల గింగిరాలు కొడుతున్న ఎమోషన్ ని రాస్తేనే తప్ప నేను పక్కకి నెట్టలేను. అందుకే ఒకవేళ చెడ్డగా రాసి ఆ భావాన్ని ఇప్పుడు మలినం చేసినా, ఈ రాసిన అనుభవం ముందు ముందు కొన్ని మంచి కథలు రాయడానికి పనికివస్తుందనే చిన్ని ఆశతో, ఆ“leap of faith” తో కథ  రాసేస్తా. నేను “సాయిబోళ్ల పిల్ల”ని ఇప్పుడు చూసుకుంటే, భాషా తాలూకా అనవసరపు కొన్ని వంకరటింకర పంక్తులు కొన్ని కనపడతాయి. ఆ లైన్స్  పాఠకుడు ఆ పాత్రని ఇంకొంచెం clear గా  అర్ధం చేసుకోవడానికి ఏమాత్రం పనికిరాని బేల వాక్యాలుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇదే కథని ఒక 2,3 సంవత్సరంల తరువాత రాస్తే, ఒకవేళ ఇంకొంచెం మెరుగ్గా రాసేవాడినేమో, కానీ ఈ subjectతో ఇప్పుడు ఉన్నంత ఎమోషన్, connection  ముందు ముందు  ఉండదేమో! ఎవరికి తెలుసు.

 1. నచ్చిన కథలు, కథకులు

అందరి కంటే ఇప్పుడు రాస్తున్న వారిలో, నాకు మెహెరన్న రచనలంటే చాలా ఇష్టం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.  Michel Foucault, text గురించి, పాఠకుడి గురించి ఒక మాట అంటాడు- “The text itself creates the subject in the process of meaning-making”. ఏదైనా ఒక text మనకు అర్ధం కావాలంటే, ఆ text inherent గా ఒక entry-point ని బయటకు project చేస్తూ ఉంటుంది. మనం కనుక, ఆ ఎంట్రీ పాయింట్ ని ఎంత త్వరగా చేత బుచ్చుకొని, ఆ టెక్స్ట్ లోకి వెళ్ళిపోతామే, అంతగా మనకు ఆ టెక్స్ట్ అర్ధమయినట్టు. నా దృష్టిలో, that is the way one should read any text అండి.(When I say that the text itself fixes the subject-position and readers needs to fill up this place in order to make most of the text, I’m neither saying that the reader should give up her own rational thinking process nor the reader subject to herself to the authority of the text).

అలాంటి entry-points మెహెర్ అన్న రచనలలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. రీడర్ మాత్రం తనకున్న prejudice ఇంకా assumptions మాయలో ఈ ఎంట్రీ పాయింట్స్ మిస్ అవ్వొచ్చు (I agree that it’s hard to get away with one’s own values and prejudices. But, all I’m asking is push yourself a bit further or make prejudice as a tool to understand the text even better rather than outrightly rejecting the text itself). చాలా మంది రచయితలాగా అరువుతెచ్చుకున్న పదాలు కాని, తనవి కానీ నీతి విలువలు కానీ ఏమి ఉండవు ఆయన కథలలో. ఇంకొకలాగా చెప్పాలంటే, తాను కొన్ని కథలు “amoral” tone లో రాస్తాడు. ఆ కథలు నాకు బాగా నచ్చుతాయి. అందుకే ఆయన కథలు ఇష్టం. And they wonderfully work for me.

పూర్ణిమ తమ్మిరెడ్డి గారి కథలు కూడా కొన్ని ఇష్టం అండి. ఆమే ఎప్పటికప్పుడు కొత్త విషయాల మీద తనదైన శైలిలో కథలు రాస్తారు, అందుకే ఇష్టం.  ఇంకా వినోదిని గారి కథలు, నేను చూసిన జీవితాలకు ఎంతో, కొంత దగ్గర ఉన్నాయని నాకు అనిపించింది. ఆమె కథలలో ఉన్న వాతావరణం నన్ను బాగా ఆకట్టుకుంటుంది.  కలేకూరి కవిత్వం, ముఖ్యంగా ఆయన కవిత “అంటరాని ప్రేమ” చాలా సార్లు చదివాను.  ఇంకా కవిత్వంలో అలిశెట్టి, మో కూడా ఇష్టమే.  తెలుగులో ఆల్ టైం ఫేవరైట్స్ అంటే త్రిపుర, చలం, ఇంకొకరి పేరు చెప్పమంటే రాజుగోరు,బొబ్బిలి, గోపాత్రుడు రాసిన పతంజలి గారు అని చెప్తా. కాఫ్కా, దాస్తోయెవ్‌స్కీ ఈ ఇద్దరు మనుషులు వల్ల, ఇలా పిచ్చిగా నేను మాట్లాడుతున్నా అని నా ప్రగాఢ నమ్మకం.

 1. “సాయిబోళ్ల పిల్ల” వెనుక ఏదైనా నిజజీవిత సంఘటన ప్రేరణ ఉందా?

నిక్కచ్చిగా చెప్పాలంటే ఉందనే చెప్పాలి. ఆ మాటకు వస్తే నేను రాసిన కథలన్నీ ఎంతో కొంత అనుభవాలనుంచే రాసినవి. Pure imagination రాయడం నాకు చేతకాదు, అది నా లిమిటేషన్. కానీ, నిజజీవితంలో జరిగిన సంఘటన, నేను రాసిన ఆ కథకు ప్రామాణికం (base) మాత్రం కాదు. కథ రాయడం అనుకున్నాక, కొన్ని details రాయడానికి ఆ సంఘటన ఉపయోగపడింది, అంతే. ఆ కథకు base వేరే ఉంది. నాకు తెలిసి, ఏ  కథనైనా, దాని బేస్ ని బట్టే విలువను నిర్ధారించాలని నా అభిప్రాయం.

వివక్ష, అణిచివేత గళం ఎత్తుకున్న కథలలో నేను గమనించింది ఏంటంటే, ఆ కథలలో అణిచివేతకు గురైన జీవితాలను కేవలం ఒక “sympathetic tone” లో సృష్టించి, వాళ్ళ అస్తిత్వాలను “victimhood” అనే చెరలలో బందించి, బొత్తిగా జీవంలేని బొమ్మల్లా ఆడిస్తారు చాల మంది రచయితలు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, కులంని ఒక “homogenized category”గా మాట్లాడతారు. నాకు ఎందుకో నేను పుట్టిన ఊరు, ఎరిగిన మనుషులు, చూసిన లోకం, ఈ కథలలో ఉన్న పాత్రలు, కథకులు సృష్టించిన లోకం తీరు అన్ని చాలా భిన్నంగా ఉన్నాయనిపించింది.

ఆలా కాకుండా lower-casteలో ఉన్న  ఒక డమనిషి తన లోకాన్ని ఎలా చూస్తుంది అని రాయాలనుకున్నా (In fact, I wanted to write how she experience this world). కానీ, ఒక ఆడమనిషి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుందో నాకు తెలియదు కాబట్టి, తన వైపు కథని నేను రాయలేదు (I make this point because a woman understands the life/world completely differently from a man and since I can only sympathize with her but not share her experience, I wrote this story, not from her perspective). నెరెటర్ (ఒక అబ్బాయి) తన జీవితంలో ఆ ఆడమనిషితో  ఉన్న బంధం తాలూకా జ్ఞాపకాలను నెమరువేసుకున్నట్టు రాశా.

మొదలు పెట్టిన తరువాత ఒకవేళ  ఆ ఆడమనిషి వేరే కులమో, మతం నుండో ఈ నెరెటర్ ఉన్న లోకంలోకి/ఇళ్లల్లోకి  వస్తే, తనది  కానీ ఈ లోకంలో ఎలా నెట్టుకు వస్తుందో అని ఆలోచించి మళ్ళీ తిరగరాశా. అప్పుడు, నిజజీవిత సంఘటన కొంచెం detailings లో ఉపయోగపడింది. కానీ, నా బేస్ మాత్రం ఇది కాదు. అలా అని, భావజాల బాకుతో ఇన్ని  విషయాలను దేయకుండా, ఒక “human condition”ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశా. ఈ విషయాలు కథ చదివే పాఠకుడికి, ఒక స్ఫురణగా తట్టకపోయి ఉంటే, అది కథ రాసిన వాడిగా నా ఫెయిల్యూర్ అవుతుంది. ఒక చోట అనవసరంగా నెరెటర్ గొంతు నొక్కి, నేను చెప్పాలనుకున్న విషయాన్ని explicit చెప్పనేమో. ఆ tone కొంచెం ఇంకా implicit గా చెప్పి ఉంటె బాగుండేది. ఇంతకు ముందు కొన్ని కథలలో కూడా సరిగ్గా నేను ఇదే తప్పు చేశాను.

భాష పరంగా కొన్ని వ్యక్తీకరణలు “text”ని అతుకులబొతుకులాగా చేసినా, నేను ఆ “human condition”ని పట్టుకోవడంలో ఎంతో కొంతో సఫలీకృతం అయ్యానని నేను భావిస్తున్నాను.

 1. ద్వాంతపు తెర, నిషాధునికత… కొత్త కథకుల్లో కనపడని ఒక భాష నీ కథల్లో కనపడుతుంది. ఎక్కడిదా భాష?

నాకు తెలిసి మనం కథలో వాడే పదాలు, భావ వ్యక్తీకరణలు పాత్రల లోకంలో నుండే రావాలె తప్ప, ఎక్కడో ఆకాశం నుండి ఊడి పడకూడదని నా అభిప్రాయం. అలా కాకుండా, నేను ఎక్కడో ఏదో సాహితి వ్యాసంలో చదివాను అనో , లేక ఒక రచనలో నాకు ఈ పదాలు ఇష్టంగా అనిపించాయనో, రాస్తున్న కథలో వాడలేను. కానీ, ఇందుకు భిన్నంగా మనం కొన్ని సార్లు చాల చవకగా, కొన్ని పదాలనో, పాత్రల స్వభావాలనో, లేక అర్ధం  కొంచెం బరువుగా ఉందనో కొన్ని పదాలను దిగుమతి చేసుకుంటాం (చాలా సార్లు ఈ దిగుమతి పదాలు తెలుగు వాడకంలో ఉన్నవి  కాక సంస్కృత భాషతో మిళితమై ఉన్న పదాల లాగ నాకు అనిపిస్తాయి). కథపై ఈ స్పృహ నాకు లేనప్పుడు (ఇప్పుడు మాత్రం పూర్తిగా కథా నిర్మాణం గురించి తెలుసని నేను అనుకోవట్లేదు), నేను కూడా పై తప్పులు చేశా. ఇప్పుడు అంతో, ఇంతో మెరుగు అయ్యానని నా భావన. ఒక వేళ నేను మా అమ్మ గురించి కథ రాసుకుంటా, ‘అమ్మా, నేను పరిపూర్ణంగా అన్నం తిన్నానమ్మా’ అంటే, వీపు మీద ఒక్కటేసి “దెయ్యం, గియ్యం గాని పట్టిందారా చిన్నోడా” అని కంగారు పడుతుంది.

మీరు ఉదహరించిన రెండు పదాలు, నా “కూల్చబడ్డ  చింతచెట్టు” కథలోనివి. కథలోని నెరెటర్ చిన్నప్పటి నుండి ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకున్నాడు, ఇప్పుడు యూనివర్సిటీలో ఉండి చదువుకుంటున్నాడు. హాస్టల్ జీవితం అలవాటు కానీ రోజుల్లో, ఒక్కడే స్కూల్ లైబ్రరీలో కూర్చుని ఏవో కథల పుస్తకాలు, కొన్ని పూర్తిగా అర్ధం కానీ పుస్తకాలు చదివేవాడేమో? అలా ఎంతో, కొంత చదవక పొతే, యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కష్టం కదా! పైగా, ఇప్పుడు యూనివర్సిటీ లో చేరిన తరువాత భిన్న దృక్పథాలు పరిచయం అయి ఉంటాయి, భిన్న పుస్తకాలను చదివి ఉంటాడు. అందుకే, తను వాడే భాషలో ఒక రకమైన దర్పం ఉంటుంది కథలో. In fact, the narrator stands intellectually way above than the people back at home (at least his language and demeanour say so). ఇలాంటి స్వభావం ఉంది కనుకే, అలాంటి పదాలు నెరెటర్ వాడతారు. అవే మాటలు సర్పంచి పదవికి పోటీ చేసిన రెండు పాత్రలు చెప్పి ఉంటే, ఎక్కడినుండో అరువు తెచ్చుకున్నట్టు అనిపించేవి.

ఇలాంటి వ్యక్తీకరణలు, పదాలు ఏమి ఇప్పుడు రాసిన “స్వేచ్చాగీతం”లో కనిపించవు. Incidentally, ఈ కథలో నెరెటర్ కూడా పల్లెటూరి నుండి యూనివర్సిటీకి వచ్చిన వాడే. కానీ, ‘ఇంగ్లీష్ సరిగా రాక, ఇంకా తంటాలు పడుతుంటాడు’. భాష కూడా తను ఇంటి దగ్గర వాళ్ళ మనుషులతో ఎలా మాట్లాడతాడో, అలానే మాట్లాడతాడు కథలో. ఇందులో ఏలాంటి గంభీరమైన పదాలు మీకు కనిపించవు. కాకపొతే రాసిన భాష, ఆంధ్ర అండ్ తెలంగాణ మిక్స్ అయినట్టు ఉంటాయి. మా ఖమ్మంలో,especially  మా బోనకల్ పరిసర ప్రాంతాలలో ఇలానే మాట్లాడతారు. కథ కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి, అక్కడ మాట్లాడే భాషనే రాసా.

ఒకవేళ నాకు ఈ పదాలు లేక ఈ భాష ఎలా పరిచయం అనే sense లో మీరు ప్రశ్న అడిగివుంటే, నా సమాధానము వేరు. నాకు తెలిసి, మనం చదివిన పుస్తకాలు, మాట్లాడిన మనుషులు, చూసిన లోకం మన భాషని ప్రభావితం చేస్తాయి అని నమ్ముతా. ఆ రకంగా, నాకు కొంచెం సాహిత్యం గురించి ఊహ తెలిసిన దగ్గరనుండి, నేను చదువుకున్న పుస్తకాలు, ఈ భాష నేను వాడటానికి కారణం అని నమ్ముతా. ఒకప్పుడు Wittgenstein చెప్పినట్టు “The limits of the language is the limits of the world/knowledge” అని నమ్మేవాడిని కూడా.

6 “డోంట్ లివ్ ఇన్ ఉటోపియన్ సొసైటీ, లివ్ ఇన్ రియాలిటీ”… ఎందుకు ఈ మాటలు అలా అనిపించింది, నేపథ్యం ఏంటి?

ఈ మాటలు నా మొదటి కథలో చివర్లో వచ్చే వాక్యంలో ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టు, కథల్లో వాడే భాష, ఆ కథల్లో ఉన్న పాత్ర తీరుతెన్నును బట్టి ఉండాలనే విషయం, ఈ కథ రాసేటప్పటికీ నాకు తెలిసే అవకాశం లేనే లేదు. మీరు గమనించే ఉంటారు అనుకుంటా, మీరు ప్రస్తావించిన వాక్యాన్ని నేను నా కథలో ఇంగ్లీష్ లో రాసా. ఈ లైన్ తో పాటు, ఇంకొక నాలుగు ఇంగ్లీష్  లైన్స్ ఉంటాయి. కానీ, ఆ నాలుగు నెరెటర్ మాట్లాడితే, ఈ ఒక్క లైన్ మాత్రం అందుకు భిన్నంగా కథలో ఉన్న మిగతా నాలుగు పాత్రలు ఒకేసారి నెరెటర్ తో గద్దించినట్టుగా చెప్తాయి.

నాకు తెలిసి ఈ కథలో నెరెటర్ ఒక “self-righteous” మనిషి అండి. తాను చదివిన పుస్తకాల వల్లనేమో కానీ లేక విన్న పాఠాల వల్లనేమో గాని, తనకంటూ ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకొని, అన్ని విషయాలను ఆ చట్రంలో ఇరికించి ఈజీ గా జడ్జ్ చేస్తుంటాడు.

In fact, if I remember it correctly, when I started to write this story, I have only one thing in my mind i.e. to bring out the age-old fight between rationalism and empiricism in the western world. నాకు బాగా గుర్తు, నేను అప్పుడప్పుడే ఈ ఫిలాసఫీ గురించి, ఈ సాహిత్యం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అప్పుడే ఈ విషయం తెలుసుకొని, దీని మీద కథ రాస్తే బాగుంటుంది అని రాసి ఉంటా అప్పుడు.

కథలో నెరెటర్ కేవలం ఏదో భావజాలం మత్తులో ఉంటాడు. చీకటి అనుభవాల్లోనుండి తన కుటుంబసభ్యులు తెలుసుకున్న జీవిత సత్యాలను ఈజీగా తన “reasoning”తో  కొట్టిపారేస్తాడు ఒకానొక సమయంలో. చివర్లో తాను ఊహించని స్థితిలో నెట్టివేయబడినపుడు, తర్కం కి అందని విషయం, తానూ కూడా experience అయినపుడు, తన కుటుంబసభ్యుల మాటలవెనుకున్న నిజం తెలుసుకుంటాడు.

అన్ని పాత్రలు చివర్లో అలా ఇంగ్లీష్ లో మాట్లాడతారు, అప్పటిదాకా తెలుగులో మాట్లాడి, అలా ఎందుకు రాసానంటే, ఏదైనా డిబేట్ లో interlocutors అందరూ ఒకే ప్లేన్ లో ఉండి మాట్లాడాలి. అందుకే, ఆ నేరేటర్ కి అర్ధమయ్యే భాషలోనే అండ్ ఆ నేరేటర్ ఏ ప్లేన్ లో ఉండి మాట్లాడుతున్నాడో, అదే ప్లేన్ లో నుండి మాట్లాడారు అనే విధంగా ఇంగ్లీషులో రాసా.

నాకు తెలిసి, అప్పట్లో నేను చూసిన కొంత మంది వ్యక్తులు కేవలం “bookish knowledge” తో మాట్లాడటం అబ్బురం అనిపించి, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జడ్జిమెంట్ మీద ఉన్న “certainity”కి రోత పుట్టి, అటువంటి వాళ్ళ మీద నా కచ్చంతా చూపిద్దామని రాసా అనుకుంటా ఆ కథ. అప్పటి నా పనికిమాలిన ఆవేశాన్నీ చూసుకొని, ఇప్పుడు  నాకు నవ్వొస్తుంది.

 1. మీ నేపథ్యం గురించి చెప్పండి

మా ఊరు పేరు ఆళ్లపాడు , ఖమ్మంలోని బోనకల్ మండలంలో ఉంది. అమ్మ, నాన్న వ్యవసాయ కూలీలు. నాన్న, ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది ఇప్పుడు. ఇద్దరిలో నాన్న 4వ తరగతి వరకు చదువుకున్నాడు, కానీ నాకంటే మంచిగా లెక్కలు చేసేవాడు. అమ్మ చదువుకోలే, కానీ నాకు పరీక్షలు ఉంటే, నాకంటే ఎక్కువ కష్టపడేది. నాకు ఇప్పుడు చదువు మీద ఇంత ఇష్టం ఉందంటే, అది మా అమ్మ వల్లే అని చెప్పాలి.

I’m a first generation student. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలో (హైద్రాబాద్) M.A Philosophy 2వ సంవత్సరం చదువుతున్నా.

*

 

Avatar

మేడి చైతన్య

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • స్వేచ్చ గీతిక…ఈ పేరు నాకు పాప పుడితే పెట్టుకోవాలని అనుకుంటున్న పేరు ..మంచి కథ…చాల సహజంగా వచ్చింది… చైతన్య లో ఏదో ఉంది…అతడి రాతల మీద ఒక కన్నేసి ఉంచాలి

  • నాలో ఏమి లేదు సత్యోదయ్ గారు, ఏమన్నా గీమన్న ఉంటే, నేను రాసే కథల్లో ఉంటాయేమో, అది కూడా నాకు సరిగా తెలీదు మరి.

 • చలం, త్రిపుర, పతంజలి శ్రేణి రచయితలను అభిమానిస్తున్న స్వేచ్ఛా గీతిక మేడి చైతన్య గారూ! మీ నుండి మరిన్ని మంచి రచనలను ఆశిస్తూ … నేనీరోజు ఇలా ఉన్నానంటే “అది మా అమ్మ వల్లే అని చెప్పాలి “ అని మీరు అన్న ఆ తల్లి పాదాలకు మొక్కాలని ఆశపడుతూ …

  ‘ధారలు కట్టిన చెమటే జరి పైట నీకు, చల్’ అన్న కవి దేవీప్రియ, పాడిన గద్దరన్న కూడా మీకు ఆదర్శం కావాలి. నామిని, గొరుసన్న, పూడూరి రాజిరెడ్డి, వంశన్న ( డా. వంశీధర రెడ్డి ), చైతన్య పింగళి, చందు తులసి, ఇండ్ల చంద్రశేఖర్, బుడ్డగిత్త రంకి పుట్టాపెంచల్దాస్, ఎండపల్లి భారతి ఇంకా అనేకానేక ప్రతిభావంతులైన సాటి రచయితలు, రచయిత్రులతో మీ రచనలని బేరీజు వేసుకుని చూడటం అలవాటు చేసుకోండి. కధలో నేటివిటీ కనబర్చటానికి బూతులుగా కనబడే పదజాలాన్ని వాడక తప్పదా అని ఆలోచించండి. “amoral” tone లో కథలు రాయడం గొప్పా? కళ కళకోసం కాదు ప్రజల కోసం వారిని చైతన్య పరచడానికి అనుకోవడం పాతచింతకాయ పచ్చడి లా అయిపోయిందా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు