సోషల్ సెన్సారింగ్ దాటి రాయండి….

తెలుగులో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి ఉంది. పాఠకులు తగ్గిపోయారు. రచయితలే పాఠకులు.

తెలుగు కథకుల్లో  భాష పరంగా, వస్తు పరంగా, వ్యక్తీకరణ పరంగా…విభిన్న కథకులు లెనిన్ ధనిశెట్టి. గాజుబొమ్మ, యంత్రరాక్షసి.కామ్, జర్నీ విత్ ఐరన్ ఓర్, నువ్వు-నేను-పడమటి ఆకాశం. వొర్షాకాలం ఇరవై ఎనిమిదో రోజు, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అభిమాని…ఇలా అనేక కథలతో తెలుగు పాఠకులకు సుపరిచితులు లెనిన్. గ్లోబలైజేషన్ తెలుగు సమాజాన్నే కాక తెలుగు కథను కూడా…విస్తృతంగా ప్రభావితం చేసింది. ఆ సమయంలో తెలుగు కథ అనేక కొత్త కథలను, కొత్త కథకులకు వేదిక అయ్యింది. ఆ కాలంలోనే తెలుగు కథ స్వరూప స్వభావాలను మార్చడానికి ప్రయత్నించిన రచయితల్లో లెనిన్ ధనిశెట్టి ఒకరు. మూస కథలకు భిన్నంగా తనదైన డిక్షన్ తో కొత్తతరహా కథలు రాశారు. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అభిమాని కథ సాహిత్యంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా చర్చకు దారితీసింది. ఆ తర్వాత కొంత కాలంగా సాహిత్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. మర్చిపోలేని కథానుభవం కాలమ్ లో భాగంగా….ఈ పక్షం లెనిన్ ధనిశెట్టి సారంగతో తన ఆలోచనలు పంచుకున్నారు.

*

అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత సారంగ ద్వారా మీ అందరితో నా భావాలు పంచుకునే అవకాశం కలిగింది. సారంగకు, అఫ్సర్ గారికి ధన్యవాదాలు. నాకు నచ్చిన కథ అని కాకుండా కథకు సంబంధించిన కొన్ని ఆలోచనలు ఈ తరం కథకులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

స్పష్టంగా చెప్పాలంటే  నా కథల్లో ఇప్పుడు నాకు నచ్చిన కథలు, నచ్చని కథలు అంటూ ఏమీలేవు. నా కథలన్నింటికి  ఎప్పుడో నేను డిటాచ్ అయ్యాను.  కథలు రాయడం పట్ల కూడా నాకు ఆసక్తి లేదు.  నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, నేను చూసిన అనేక అనుభవాల ఫలితంగా నగర జీవితం, అర్బన్ లైఫ్ పట్ల విరక్తి పుట్టి సిటీకి దూరంగా బతుకుతున్నాను. కావాలనే ఇలా ఒంటరిగా , స్వేచ్ఛగా బతుకుతున్నాను.

నాకు కథల పట్ల సాహిత్యం పట్ల ఆసక్తి చిన్నప్పుడే మొదలైంది. రెండో తరగతి నుంచే మా ఊరిలో ఉన్న గ్రంథాలయంలో విస్తారంగా చదువుతూ పోయాను. చలం, త్రిపుర, చండీదాస్…ఇలా చాలా మంది రచనలు చదివాను. సాహిత్యం  విస్తృతంగా చదువుతూ పోయాక ఏ మనిషికైనా ఒక దశ తర్వాత రాయాలనే ఆరాటం వస్తుంది. నాక్కూడా కథలు రాయాలని అనిపించి నా ఆలోచనలన్నింటినీ కథలుగా రాశాను. కానీ నేను కథలు రాసిన కొత్తలో చాలామందికి అవి అర్థం కాలేదు. అసలు చాలామంది అవి కథలే కాదని తిరస్కరించారు. ఒక్క ప్రొఫెసర్  తిరుపతి రావుగారే నన్ను ప్రోత్సహించారు. నా కథల గురించి 16 పేజీల సమీక్ష చేశారు. అలాగే నా కథల గురించి  నా కథలను మో గారు కూడా ప్రోత్సహించారు. నా కథల గురించి సమీక్ష రాశారు.

నా అదృష్టమో, దురదృష్టమో కానీ…. చిన్న వయసులోనే త్రిపుర, వడ్డెర చండీదాస్ వంటి రచయితలతో కలిసి తిరిగాను. అనేక చర్చలు చేశాను. వారి ద్వారా కథల గురించి, సాహిత్యంగా గురించి తెలుసుకున్నాను. వాళ్ల కథలే కాదు. వాళ్ల ఆలోచనలు, వ్యక్తిత్వం కూడా నాపై ప్రభావం చూపింది. అందుకే నేను వాళ్లలాగే జీవించాలని కోరుకున్నాను. అలా మారిపోయాను. ఇప్పుడు అలాగే జీవిస్తున్నాను.

ఇక నేను కథలు రాయడం ఎందుకు ఆపేశానంటే… నా కథలకు సంబంధించి నేను రచయితని అని ఎప్పటికీ  చెప్పుకోను. నేను రచయితను కాదు, ఉత్త పాఠకుడిని మాత్రమే. నేను రకరకాల కథలు, నవలలు చదివిన తర్వాత వచ్చిన ఆలోచనలను ….ఏదో నాకు ఆ సమయంలో ఏం అనిపిస్తే దాన్ని కాగితం మీద పెట్టాను. అంతే తప్ప అవి కథలో, కవితలో కూడా పట్టించుకోలేదు. వాస్తవానికి నేను దేనికీ కనెక్ట్ కాలేదు. నాకు ఆ సమయంలో రాయాలనిపించింది. రాశాను అంతే.  రాశాను తప్ప నేను మాత్రం వాటికి కనెక్ట్ కాలేదు.

చాలామంది రచయితల పట్ల నాకు ఉండే అభ్యంతరం ఏమంటే…తాము రచయితలం కనుక తమని తాము స్పెషల్ అనుకుంటారు. రచయితలు కావడం గొప్పోకాదో కానీ…దాని వలన వ్యక్తులుగా వాళ్లు చాలా నష్టపోతారు. రచయితలం అనుకుని ఒక ప్రపంచంలో బతకడం వలన వాస్తవ ప్రపంచానికి దూరమై… అక్కడే ఉండిపోతారు.

నా దృష్టిలో నిజంగా రాయగలిగి కూడా రాయకుండా ఉండడమే చాలా గొప్ప. నాకు మిగతా వాళ్లకంటే ఎక్కువ తెలుసు, వాళ్లకి నేనేదో చెప్పాలి అని రాయడం నాకు నచ్చదు. అలా రాయడం అనే భావనని జయించాలని అనుకున్నాను. వాస్తవానికి రాయడం ద్వారా ఎవరైనా ఏం కోరుకుంటున్నారు. ? ఒక ప్రత్యేక గుర్తింపు. ఐడెంటిటీ కదా. కానీ ఐడెంటిటీ మనుషులను గందరగోళ పరుస్తుంది. నాశనం చేస్తుంది. దానిలోంచి బయటకి రావడం చాలా కష్టం అవుతుంది. అందుకే నేను వాటన్నింటికి దూరంగా ఉంటున్నాను.

నేను రాసిన కథల్లో నాకు నచ్చిన కథ ఏమంటే ఫలానా అని చెప్పలేను.  పైగా మీకో తమాషా సంగతి చెప్పాలి. నేను ఎప్పుడో పాతికేళ్ల క్రితం రాసిన కథ నాకు ఇప్పుడు నిజ జీవితంలో  ఎదురువస్తోంది. వాస్తవ రూపంలో నా కళ్లముందు జరగుతోంది. మీరు నమ్మరు కానీ నాకు ఇదో చిత్రంగా అనిపిస్తుంది. నా 22 ఏళ్ల వయసులో గాజుబొమ్మ అనే కథ రాశాను.  ఇపుడే చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆత్మరాగం అనే నేను రాసిన కథే ఇప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. బహుశా ఆరోజు నా అంతఃచేతలోని ఆలోచనలను యథాతథంగా, పచ్చిగా రాశాను కాబట్టే ఏమో… వాస్తవాలుగా ఇప్పుడు అవి నిజజీవితంలో ఎదురవుతున్నాయి.

తెలుగు కథల మీద నా పరిశీలన, అభ్యంతరం  ఏమంటే.. సోషల్ సెన్సారింగ్ ని దాటి తెలుగులో రచనలు చేసినవాళ్లు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. చలం లాంటి ఒకరిద్దరు సోషల్ సెన్సారింగ్ అనే సరిహద్దులు దాటి రాశారు తప్ప తెలుగు కథకులు అందరూ దానిలోపలే కథలు రాశారు. అందుకే మన కథల్లో కొత్తదనం కనపడదు. మూసలా ఉంటాయి. కానీ పాశ్చాత్య దేశాల రచయితలు చాలా మంది సోషల్ సెన్సారింగ్ బద్దలు కొట్టారు.  దాన్ని దాటి వచ్చి రాశారు  కాబట్టి ఆయా దేశాల్లో గొప్ప రచయితలు ఎక్కవగా కనిపిస్తారు. కానీ మన తెలుగులో ఇప్పటికీ నిజ జీవితంలో విరివిగా వాడే ఒక బూతు పదం రాయడానికి భయపడతారు. కేవలం బూతులు కాదు. మనం నిత్యం జీవితంలో వాడుకునే భాషకు, రాసే భాషకు చాలా తేడా ఉంటుంది. బహుశా అందుకే అది సహజత్వాన్ని కోల్పోతోంది.

నేను రాసిన ఓ కథ ….నువ్వూ నేనూ పడమటి ఆకాశం కథలో చివరకు అగ్ని ప్రమాదం జరిగి… ప్రోటోగనిస్టుతో సహా అందరూ చనిపోతారు. ఆ కథ ముగింపు నాకు బాగా నచ్చింది. ఐతే ముందే ….. నేను ఇలా రాయాలి అని కథ మొదలు పెట్టను. అదో లైన్ ఆఫ్ థాట్ అంతే. నాకు ఎప్పుడో ఒకసారి రాయాలనిపిస్తుంది. అప్పుడే రాశాను. మొదట్లో అందరిలాగే కథ రాసేవాడిని. ఒక మొదలు, ముగింపు..ఇలా అనుకుని. కానీ కొంతకాలానికి అలాంటి కథల మీద విరక్తి పుట్టింది. రాయాలి…రాయాలి అనుకుని  అలాగే వదిలేసిన కథలు చాలా ఉంటాయి .  కొంతకాలం ఆలోచించి, ఆలోచించీ…ఏదో ఒక రోజు ఒక రాయడానికి కూచొనే వాడిని. కథ మొదలు పెట్టిన రెండు మూడు గంటల్లో పూర్తి చేసేవాడిని. ఒక సారి రాసిన కథను  మళ్లీ ఫెయిర్ చేయడం కూడా నాకు నచ్చదు.నేను రాసిన యంత్రరాక్షసి కథ కొంత కాలం ఆలోచించాను. రాయలనుకున్న రోజు రెండు గంటల్లోనే చకచక కథ పూర్తి చేశాను. నేను రాసిన ఇంకో కథ  మౌనవీణ గానమిది మా ఫ్రెండ్ కథ. వాడు ఐఎస్ సాధించాలనుకుని చివరకు టీచర్ గా మిగిలిపోయాడు. వాడి ఆవేదన, ఆలోచనలన్నీ ఆ కథగా మలిచాను. నాకు మొదటి నుంచీ అవతలి మనిషిని ఆవాహన చేసుకునే అలవాటు ఉంది.   నేను సైకాలజీ, ఫిలాసఫీ చదువుకున్నాను. ఫిలాసఫీలో ఎస్వీ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ చేశాను. అందుకే మనుషులను బాగా చదివాను.. తిరుపతి హాస్టల్ లైఫ్ లో నేను పడిన సంఘర్షణని కథగా మలిచాను. చలసాని ప్రసాదరావు, సోదుం రామ్మోహన్ లాంటి పెద్దలు నా రూంకి వచ్చేవారు.

ఇంకో సంగతి ఏమంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేయడం వల్లనే నా కథలు బయటి ప్రపంచానికి తెలిశాయి అనుకుంటాను. తెలుగు కథలకు సంబంధించి ఏ రోజైనా  పత్రికల్లో పనిచేసే వారి, లేదా పత్రిక ఎడిటర్ కి పరిచయం ఉన్నవారి కథలే ప్రచురించే దుస్థితి ఉంది తప్ప….ఎక్కడో మారుమూల ఉన్న కథకులను పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికీ తెలుగులో వేలమంది కథలు రాస్తున్నారు కద..ఎంతమందివి వెలుగు చూస్తున్నాయి. వెబ్ మాగజైన్లు వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం మారింది తప్ప…ఆన్ లైన్ పత్రికలు లేకముందు అలాంటి పరిస్థితే ఉండేది.

తెలుగులో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి ఉంది. పాఠకులు తగ్గిపోయారు. రచయితలే పాఠకులు.  వీళ్ల కథలు వాళ్లు, వాళ్ల కథలు వీళ్లు చదువుకోవడం.. అంతే.  ఫేస్ బుక్ లో ఒకరికి ఒకరు కామెంట్లు పెట్టుకున్నట్టు రచయితలే పాఠకులుగా మారిన దుస్థితి ఇవాళ తెలుగు సాహిత్యంలో నెలకొంది.

సీనియర్ కథకులను, పత్రికా సంపాదకులను నేను కోరుకునేది ఒక్కటే. కొత్త కథకులకు అవకాశం ఇవ్వాలి. కథకులు మూసను దాటి ఆలోచించాలి.  సోషల్ సెన్సార్ షిప్ ను దాటడానికి ప్రయత్నించండి.

ఇవాళ సమాజంలో తరచి చూస్తే అనేక వందల వస్తువులు ఉన్నాయి. అనేక హింసలు ఉన్నాయి. ఉదాహరణకు ఆధార్ కార్డు చుట్టూ చూడండి. వృద్ధులు, నిరక్షరాస్యులు…ఆధార్ కార్డు కోసం ఎంత మంది ఇబ్బంది పడ్డారు…? ఏటీఎంల ముందు నోట్ల కోసం క్యూలో నిలబడి కొంతమంది చనిపోయారు. ఇలాంటి సమకాలీన సమస్యల గురించి మనం రాయకపోతే ఇంకెవరు రాస్తారు…?  మీరు కొత్త తరహా కథలకు ప్రయత్నించండి. కొత్త తరహా నేరెషన్ తో ప్రయత్నించండి. ప్రపంచ సాహిత్యం తెలుసుకోండి. మనం రాసిన  కథ చదివిన పాఠకుడిపైన గాఢమైన ముద్ర వేయాలి. అతన్ని ఆలోచింపజేయాలి.  అలా కానప్పుడు రాయడమే వృధా.

*

లెనిన్ ధనిశెట్టి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • *రచయితలే పాఠకులు*
  *సోషల్ సెంసారింగ్ దాటి బయటకు రండి*
  అవును కచ్చితంగా నిజం

 • నీవెప్పుడూ స్పెషల్ లెనిన్… నీ కథల్లాగే. అందుకే నువ్వంటే నాకిష్టం.

 • చాలా నిజం గొప్పగా చెప్పారు. రోజు వారి సమస్య లు చిత్రమైన సర్రియల్ రూపం దాల్చి ఉంటున్నాయి. రచయిత లు పాఠకులు ఒకటే అయిపోయి, సమస్య కీ దూరం అయిపోతున్నారు.

 • రచయిత లెనిన్ ధనిశెట్టి గారు చాలా చెప్పినవి బావున్నాయా అంటే అవును/కాదు (yes/no). “. చలం లాంటి ఒకరిద్దరు సోషల్ సెన్సారింగ్ అనే సరిహద్దులు దాటి రాశారు తప్ప తెలుగు కథకులు అందరూ దానిలోపలే కథలు రాశారు. అందుకే మన కథల్లో కొత్తదనం కనపడదు.” ఇది ఏ ఉద్దేశంతో అన్నారో అర్ధం కాలేదు. రావి శాస్త్రిగారు చాలా కధలు రాశారు ఆయన సోషల్ సెన్సారింగ్ గురించి పెద్ద పట్టించుకొన్నట్టు నాకయితే అనిపించలేదు. అలాగే కాళీపట్నం మాస్టారు, భూషణం గారు తమాచుట్టూ జరుగుతున్న అక్రమాలగురించి రాశారు. ఓల్గా గారు ఈ సంఘం లో స్త్రీ స్వేచ్చ గురించి రాశారు. ఇలా చాలా మంది ఉన్నారు.
  సోషల్ సెన్సారింగ్ అనే పదం ఎందుకు వాడెరో చాలా అయోమయంగా ఉంది

 • చాలా గొప్ప , మంచి, వాస్తవ సహితమైన అభిప్రాయాలు వ్యక్త పరిచారు .

  ఈ ఆలోచనలు ప్రతి రచయిత మెదడు లోనూ పుట్టాలి

 • చాలా మంచి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. అయితే కథలు, నవలలో సోషల్ సెన్సారింగ్ దాటి రాయడం ఉండదనేది ఒప్పుకోలేను. నాటి నుండి తెలంగాణలో సాహిత్యం జీవితం, వాస్తవికతను అనుసరించడం ప్రధానంగా ఉంటుంది. పత్రికలు ఇప్పటి రచయితలకు అవకాశం ఇవ్వాలనడం సమంజసం. పత్రికలు కావాలనే పాఠకులకోసం ఫాంటసిని ప్రోత్సాహించాయి.

  తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్రం నేపధ్యంలో వచ్చిన కథలు, నవలా సాహిత్యంలో, తెలంగాణ రైతు నేపథ్యంలో వచ్చిన కథలు, అంతెందుకు మొదటి కథ రాసిన రచయిత్రి బండారు అచ్చమాంబ కథలు , పాకాల యశోదారెడ్డి ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు, నెల్లూరి కేశవస్వామి చార్ మినార్ కథలు,పసిడి బొమ్మ, గూడూరి సీతారాం కథలు, వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, దాశరధి నవలలు, కక్క సిద్ధి దళితవాద నవలలు, ముస్లిం, బహుజన వాద సాహిత్యం తీసుకుంటే ఇలా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. విశ్లేషణకు ఆధారాలు చూపి ఉంటే బాగుండేది

 • వీరి అభిప్రాయాలు సరిగా అర్ధం కాలేదు. చలం కూడా సోషల్ సెన్సారింగ్ పరిధి లోనే రాశారు. బూతులు రాయలేదు. అయినా స్త్రీలను కించ పరచే పదాల వాడకం కనీసం సాహిత్యం లోకి రాకపోవడం మంచిది.

 • కొన్ని అభిప్రాయాలు రచయితలకు వ్యక్తి గతంగా ఉపయోగ పడవచ్చు.

  అనేక కళా రూపాలు తమ ప్రాధాన్యత కోల్పోతున్నట్లే (పోయెట్రీ, నాటకం లాగా) కథ కూడా తన ప్రాధాన్యతను కోల్పోతుందా? అవుననిపిస్తుంది.

  ఆర్ట్ హిస్టోరియన్స్ చెప్పాల్సిన విషయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు