ఆమె ఎలా నిలబడిందో ఆశ్చర్యమే!

ది 2015. పర్సనల్ గానూ, కెరీర్ పరంగానూ ఓ సందిగ్ధ సమయం.    ఇప్పుడు నాకేం కావాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్నాను. నేను ఏమన్నా సాధించేశాను అని తృప్తి పడచ్చా, లేక వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వాడుకో లేక పోయినందుకు అపజయాన్ని ప్రకటించేయాలా అని అద్దంలో చూసుకుంటున్న సమయం.  ఎక్కణ్ణించి బయల్దేరానో అక్కడికే వెళ్లి నన్ను నేను కొలుచుకోవాలి అనిపించింది.  పల్లెటూరినించి, ఏజెన్సీ ప్రాంతం నించి వచ్చినవాణ్ణి, మళ్లీ అక్కడికే వెళ్ళాలి.

అప్పుడు తట్టిన మొదటి పేరు సాయి పద్మ.  ఆవిడకి పింగ్ చేసి ‘మీ హాస్టల్ పిల్లలతో ఓ వారం గడిపే అవకాశం ఇస్తారా’ అని అడిగా.   చారిటీ కాదు, దాతగా కాదు.  వాళ్ళలో ఒకడిగా ఉంటూ,  వాళ్లకి చదువులో సందేహాలుంటే చెప్తాను అని అడిగా.  అప్పటికే ఆవిడతో ఫేస్బుక్ లో పరిచయం ఉండింది.   ఆవిడ వెంటనే ఒప్పుకుంది.  ‘బర్త్ డేలకీ, పండగలకీ పిల్లలకి  భోజనాలు పెట్టే పద్ధతి నాకు నచ్చదు కానీ స్వయంగా వచ్చి పిల్లలతో గడిపే వాళ్ళు మాకు సమ్మతమే. వాళ్ళకి బయట ప్రపంచం కూడా తెలుస్తుంది’  అన్నది.   పిల్లలకి వసతులు కూర్చడమే కాదు, వాళ్ళ డిగ్నిటీ మీదకూడా ఈవిడకి ఆలోచన ఉంది అని అర్థమయింది.

వైజాగ్ లో ఫ్లైట్ దిగి వాళ్లింటికి నేరుగా వెళ్ళాను. వాళ్లింట్లో భోజనం చేసి ఓ కారు మాట్లాడుకుని గజపతినగరం వెళ్ళాను.  అక్కడ హిస్కూలు పిల్లల కోసం ఓ హాస్టల్ నడుపుతున్నారు.  ఈ హాస్టల్ లో  చేరే పిల్లలు చుట్టుపక్కల్ ఉండే చిన్న చిన్న ‘వలస’ ల నుంచి వచ్చిన వాళ్లు.  ఆ వలసల్లో ఒకటి నించి అయిదు దాకా చదువుకుని ఆ తర్వాత ఈ హాస్టల్ కి వస్తారు.

నా కార్యక్రమం రోజంతా వాళ్ళ ఉద్యోగి రాజు తో ఈ వలసలకి బైక్ మీద వెళ్ళడం, ఆ చిన్న చిన్న ఒక్క గది స్కూళ్ళన్నీ చూడటం, సాయంత్రానికి గజపతి నగరం వచ్చి హాస్టల్ పిల్లలకి లెక్కలు చెప్పడం, కబుర్లు చెప్పడం, ఆడుకోవడం.   (నన్ను అన్ని ఊళ్ళల్లో తిప్పి నాకు ఎంతో సహాయం చేసిన ఈ ఉద్యోగి రాజు ఓ సంవత్సరం క్రితం చనిపోయాడు).

ఆ ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని సార్లు దుఖం ఆపుకోవడం కష్టమయ్యేది.  ఒక్కోసారి ఆ పిల్లల తెలివితేటలకీ, వాళ్ళ చలాకీ తనానికీ ఆశ్చర్యపోవాల్సివచ్చేది.

ఆ ఊళ్ళలో తాగుడికి బలై నలభైదాకా కూడా మగవాళ్ళు బతకరు అని చెప్తే నమ్మలేకపోయాను. తల్లులు, అమ్మమ్మలూ, బామ్మలు పెంచాలి పిల్లల్ని.   బురదలో బైక్ కూడా వెళ్ళని ఊళ్లకి  అన్నంతో తయారు చేసే లిక్కర్ లో కలపడానికి కావల్సిన రసాయనం ఏదో దేశం ఉత్తర భారతం నించి దిగుమతి అవుతుందిట. మంచి నీళ్ళు ఊళ్లకి చేరవు గానీ, పరదేశం నించి ఓ రసాయనం మాత్రం ఈ గూడేలకి చేరగలదు. ఆ వలసల దగ్గరకి వెళ్తుంటేనే చిక్కటి సారా వాసన.    ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోతున్నా, పిల్లలు దిక్కులేకుండా పోతున్న పట్టించుకునే నాథుడు లేడు.

ఈ విషయం అర్థమయ్యాక నకు సాయి పద్మ చేస్తున్న పని విలువ మరింత  అర్థమయింది. ముందుగా రోడ్డున పడ్డపిల్లల్ని ఆ చిన్న ఒక్క గది బడిలోకి చేర్చడం.  ఆ రాజు అన్నాయన ఆ తల్లుల్ని బతిమిలాడటం, ఎందుకు మీ అమ్మాయి లేదా అబ్బాయి బడికి ఈ వారం రాలేదు అంటూ.

ఈ చిన్న బడుల్లో అయిదు పూర్తయితే వీళ్లలో ఆసక్తి ఉన్నవాళ్ళనీ, గ్లోబల్ ఎయిడ్ సంస్థ సామర్థం మేరకు గజపతినగరం హస్టల్ కి చేరుస్తారు.

నేను పాఠాలు చెప్పిన ఒకళ్లిద్దరు పిల్లల గురించి సాయి పద్మ కి చెప్పాను.  వీళ్ళు చాలాదూరం వెళ్తారు అని. ఓ అమ్మాయి ఇప్పుడు బి.ఫార్మ్ చదువుతోంది.

గజపతి నగరం నించి మళ్లీ వైజాగ్ వచ్చిందాకా నాకు నాగురించి గుర్తురాలేదు. మరుసటి రోజు పొద్దున హైదరాబాద్ ఫ్లైట్ అవడంతో రాత్రి ఓ బీచ్ ఫ్రంట్ హోటల్లో ఉన్నాను. స్నేహితులంతా వచ్చి కలిసి వెళ్ళాక, నాకు ఒంటరిగా సమయం దొరికాక ఏడవకుండా ఉండటానికి చాలా కష్టపడాల్సొచ్చింది.  చేతిలో ఉన్న ఖరీదైన ఓడ్కా, బీచ్ ఫ్రంట్ రూం, బీచ్ రోడ్డుమీద పరిగెడుతున్న ఖరీదైన కార్లు… నాకు తెలిసిన జీవితమూ, నేనూ…  కొత్తగా కనపడ్డాయి.  నాకేమీ గిల్ట్ లాంటివేమీ లేవు.  ఈ దేశంలో అంతరాలు ఏస్థాయిలో ఉన్నాయో నగ్నంగా నాకు అర్థమయిన రోజు. కథల్లో, వ్యాసాల్లో, అంకెల్లో ఈ అంతరాలగురించి మనకి తెలుస్తుంది కానీ అర్థం కాదు.  మనకి పక్కనే మనం ఎక్కణ్ణించి వచ్చామో  ఆ సమూహాలే మనకి ఇంత దూరం ఎలా అయిపోయాయి?

కావాలనే నేను సాయి పద్మ గురించి కన్నా ఈ పిల్లల గురించీ, నా గురించీ రాస్తున్నాను.  ఈ ఒక్క గ్రామం గురించీ, మనుషుల గురించీ నేను చాలా రాసి ఉండాల్సింది. ఇప్పటిదాకా  రాయక పోవడం నేరం.  వీటన్నిట్నించీ రాయడమే సాయిపద్మ గురించి రాయడం.   ఒక్కవారం రోజులు ఆ ప్రాంతంలో గడిపితేనే తట్టుకోలేక పోయిన నాకు, ఆ మనిషి ఆ వీల్ చైర్ లో కూర్చుని ఎలా అన్నేళ్ళు  ఆ పరిస్థితుల్ని ఎదుర్కుని ‘నిల’బడగలిగింది అనేది నాకు ఊహకందని విషయం.  అదికూడా మొహమ్మీద చిరునవ్వు చెరక్కుండా.  ఆవిడ దగ్గర బోలెడు పుస్తకాలు.  సాహిత్యం మీద ఖచ్చితమైన అభిప్రాయాలుకూడా ఆవిడకి ఉన్నాయి.

2015 లో నా అసంబద్ధ సందిగ్ధాలూ, అసంతృప్తులూ  అన్నీ ఆవిడని కల్సి, ఆ ప్రపంచం చూశాక హాస్యాస్పదంగా అనిపించాయి.

ఇకనించీ ఏ పిల్ల ఎడ్మిషన్ గురించీ, మరింకేదో అవసరం గురించో ఆవిడ నా వాట్సాప్ కి మెస్సేజ్ పెట్టదు అని నమ్మాలని లేదు.  ఆవిడ మొదలెట్టిన పన్లని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడం, అందుకు సహకరించడమే మనం ఇప్పుడు చెయ్యాల్సినపని.

*

అక్కిరాజు భట్టిప్రోలు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజమే…. మీరు రాసిన ఆ పిల్లల గురించీ ఆ ప్రాంతం గురించీ చదువుతుంటే ఏమాత్రం పరిచయం లేని సాయి పద్మగారిని దగ్గరగా చూస్తున్నట్టు అనిపించింది.

    సాయి పద్మగారి జ్ఞాపకాలలోనుండీ గుప్పెడు ధైర్యాన్ని తీసుకున్నాను.

  • Apt tribute to Sai Padma. ఆడపిల్లలకు బట్టలు కుట్టడం నేర్పడానికి పాత Dupattas ని పంపమని అడిగారు. వాటితో ఎవరికి వారే బట్టలూ కుట్టుకుంటారు. కుట్టడం కూడా నేర్చుకుంటారు. చాలా ఆలోచించారు…ఎన్నో చేశారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. Unfortunate.

  • ఆమెని కారణజన్మురాలు అని అనేదాన్ని. నిలబడగలగడమే ఆమె గొప్పతనం!

  • She is very inspiring. Proud to say that I met her a couple of times. Couldn’t believe that she left.

  • కదిలించేలా సాయి పద్మ సేవ గురించి మీ మీద దాని ప్రభావం గురించి రాశారు. మీలాంటి వాళ్లకి స్పూర్తి నివ్వడమే సాయి యొక్క నిజమైన కాంట్రబ్యూషన్ అనిపించింది. తనని కదిలించిన సేవా భావం మీలో కలిగించింది. అంతకన్నా ఏంకావాలి. ఆనంద్ కి అండగా ఉండడమే మనం చెయ్యగలిగింది.

  • I was fortunate to meet her twice in last few years and latest one only in Jan. Hard to believe she is no more.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు