సశేషం

దొక ఖరీదైన కారు.మెత్తని రోడ్డు మీద చాలా దూకుడుగా పోతోంది.కారులో ఇద్దరున్నారు.వాళ్ళు తండ్రీకొడుకులు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటి దారి పట్టిన వారి మధ్య సంభాషణ ఉభయ కుశలోపరి తరువాత ఇలా సాగింది.-

“నేను పెళ్ళి చేసుకున్నాను”

“ఏమిటీ…..?”

“నేను చేసుకున్నది ఏమిటి కాదు- పెళ్ళి! నెలయింది.-రోడ్డు పక్కన కారాపుతూ అన్నాడు రాజశేఖర్!.

“నిజమా? నాకు చాలా సంతోషం కలిగించే వార్త చెప్పావ్ నాన్నా! అయాం రియల్లీ హేపీ” అశ్చర్యం నుంచి తేరుకున్నాక అభినందన పూర్వకంగా తండ్రి చేయి నొక్కుతూ అన్నాడు చంద్రశేఖర్.

“థాంక్స్! ఛీ కొడతావేమోనని భయపడ్డానురా”

“అవేం మాటలు నాన్నా!ఇన్నాళ్ళకైన నా సుఖం గురించే కాక మరో మంచి ఆలోచన నీకు వచ్చినందుకు ఆనందంగా ఉంది.

“కాని….ఇదేంటి అని చెవులు కొరుక్కుంటోందిరా…..!”

ఎవరు…పిన్నా? అదేంటి నాన్నా ….కొత్త పెళ్ళికూతురు కదా…తనకదేం ఖర్మ?- తండ్రి మాటలకు అడ్డం వస్తూ అన్నాడు చంద్రశేఖర్.

“ఛ ఛ….ఆ పని చేస్తున్నది మీ పిన్ని కాదురా!….లోకం…”ఇన్నేళ్ళూ బాగానే ఉన్నాడు కదా….ఇప్పుడు ముసలాడికి దసరా పందగ  కావల్సి వచ్చిందా….కన్నెపిల్ల గొంతు కోసాడూ అని నోళ్ళు నొక్కుకుంటోందిరా పాడు లోకం.”బాధగా అన్నాడు రాజశేఖర్.

“పాడు లోకమని నువ్వే అంటున్నావు కదా నాన్నా!మరి బూజు పట్టిన ఈ సమాజం గురించి ఎందుకు పట్టించుకోవాలి? దాన్ని మొరగనీయ్! మొరిగి మొరిగి నోరు నొప్పెట్టి అదే ఊరుకుంటుంది.”

“నువ్వన్నది నిజమేరా చందూ! ఇకపై ఆ పాడు మాటలు గుర్తు చేసుకొను.ఇదిగో! బుర్రలోంచి తుడిపేస్తున్నా!” కొడుకు మాటలతో రాజశేఖర్ ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది.

“సరే కాని నాన్నా….వాంఛలూ,సుఖాలూ…అన్నీ త్యజించి ఒక యోగిలా బ్రతుకుతున్న నువ్వు ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకున్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. తెలుసుకోవాలని నాకు  చాలా కుతూహలంగా ఉంది. చెప్తావనే  అశిస్తున్నా!” తండ్రి వైపు అపేక్షగా చూస్తూ అడిగాడు చందూ.

“అందుకేరా ఇక్కడ కారు ఆపింది…! లోకానికి ఎలుగెత్తి చాటాల్సిన అవసరం నాకు లేదు కాని నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది.నీకో చిత్రమైన కథ చెబుతా! శ్రద్ధగా విను.” కథ చెప్పడానికి ఉపక్రమించాడు రాజశేఖర్.

***

“సుజీ! నువ్వు నా ప్రాణం”-చెప్పాడు రాజు.

“తెలుసు”

“లేదు….నీకు తెలియదు.”

“అబ్బా! తెలుసండీ! మీరిప్పటికి చాలాసార్లు చెప్పారు.”

“చెప్పి ఉండొచ్చు! అయినా మళ్ళీ చెబుతున్నా! నువ్వు నా ప్రాణం.” నిన్ను నా గుండెల్లో భద్రంగా దాచుకున్నాను!”

“నిజమే! నన్ను మీ హృదయంలో నిలుపుకున్నారు, కాని ఒక్కసారి బయటకు తీసి మీ వాళ్ళకు చూపించడానికి మాత్రం దారి లేదు.”

“సమయం రావాలి సుజీ! మన విషయం తెలిసిన తక్షణం ఆస్తులు-అంతస్తులూ అంటూ మన మధ్య అడ్డుగోడలు కట్టడం మొదలెడతాడు మా నాన్న. అందుకు ఆయనకు ఇటుకలు అందించమంటాడు. చేతులన్నా విరిచేసుకుంటాను తప్ప ఆ కట్టడం వ్యవహారంలో చస్తే సహకరించను. రాళ్ళెత్తని కూలీగా మిగిలిపోతాను.ఎందుకో తెలుసా?”

“నాకు తెలుసు.”

నీకు తెలియదు. నేను చెబుతున్నా విను….నువ్వు నా ప్రాణానివి. నా సర్వస్వానివి. మనది జన్మ జన్మల బంధం! ఈ బంధం కొనసాగుతుంది.” అతడలా అనగానే తథాస్తు దేవతలు మురిసి దీవించినట్లు  ఆకాశంలో చిన్న మెరుపు.

*  *  *  *  *  *

“సుజీ! మన విషయం మా నాన్నకు తెలిసిపోయింది-నిలదీసి అడిగాడు.”

“మీరేమన్నారు?”

“నిన్ను ప్రేమించాననీ, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని నిక్కచ్చిగా చెప్పాను.”

“తర్వాత….?”

“ఏముందీ…ఘర్షణ పడ్డాం”.

” ఆ పిల్లతో నీ పెళ్ళి అసంభవం. వంశ మర్యాద అంటూ ఒకటుంది. అది మంటగలిసిపోవడం చూస్తూ సహించలేను.తలచుకుంటే ఏమైనా చెయ్యగలను.-అంటూ చిందులు తొక్కాడు మా నాన్న.”

“మరెట్లా…..?” బేలగా అడిగింది సుజాత.

ఆమె వంక సూటిగా చూసాడు రాజు.

“సుజీ! ఇది మన ప్రేమకు పరీక్షా సమయం.నువ్వు ధైర్యంగా నిలబడగలవనే నా నమ్మకం. నిన్ను నాకు కాకుండా చెయ్యడానికి మా నాన్న ఈసరికే పథకాలు వెయ్యడం ప్రారంభించి ఉంటాడు. ఆయన ఎత్తుగడలు సాగడానికి వీల్లేదు.అందుకు నీ సహకారం కావాలి.”

“నేనేం చెయ్యగలను?”-హీన స్వరంతో అంది సుజాత.

“మనం మద్రాస్ పారిపోదాం సుజీ! అక్కడ నాకో స్నేహితుడున్నాడు. వాడి సహాయంతో మనం పెళ్ళి చేసుకుందాం. తరువాత మా వాళ్ళ వేడి చల్లారాక తిరిగి వద్దాం. పెళ్ళయ్యాక మనల్ని కాదనే వాళ్ళుండరు.అంతా దానంతటదే సర్దుకుంటుంది.”

“కానీ,,,,”

“అడ్డు చెప్పకు సుజీ! మన ప్రేమ వర్ధిల్లాలంటే ఇదొక్కటే మార్గం. మరో దారి లేదు. మద్రాస్ రైలు రాత్రి పదకొండున్నరకు కదులుతుంది. ఈ రాత్రి పదకొండు గంటలకు నీకోసం స్టేషన్ లో

ఎదురు చూస్తుంటాను. నువ్వు రావడం,మనం బండెక్కడమే తరువాయి. అంతే! మనం కన్న కలలన్నీ నిజమవుతాయి.”

“నాకేదో భయంగా ఉంది.”

“నీకేం భయం వద్దు సుజీ! మన  ప్రేమను ఆటంకపరిచే హక్కెవరికీ లేదు. మనల్నెవరూ విడదీయలేరు. అలా నీరసంగా ఉంటే కుదరదు. ఏది ….ఒక్కసారి నవ్వు! నవ్వాలి మరి!”

” నవ్వు పెదాలపై పులుముకుంది సుజాత.”

“గుడ్! అలా ఉండాలి.-రాత్రి పదకొండు గంటలకురావాలి- గుర్తుంచుకో! జాగ్రత్త!”

*   *   *   *   *   *    *

ఆ రాత్రి పన్నెండు గంటలు దాటింది. మద్రాస్ పోయే బండి వెక్కిరిస్తూ వెళ్ళి పోయింది- రాజునొక్కడ్నే ప్లాట్ ఫారం మీద వదిలేసి.

“సుజాత ఎందుకు రాలేదు?వాళ్ళింట్లో పసిగట్టేసారా? లేక…ఊహూ….సుజాత ప్రేమను శంకించలేడు. తన కోసం ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సుజాత సిద్ధమే!మరెందుకు రాలేకపోయింది? పరిపరి విధాలుగా అలోచనలు రాజు మస్తిష్కాన్ని తొలిచేస్తున్నాయి. యాంత్రికంగా స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు.

ఎలాగోలా తెల్లారింది-  అంతేనా….? పాడు బావిలో పడిన సుజాత బ్రతుకూ తెల్లారిందన్న వార్త ఊరంతా గుప్పుమంది. గుప్పు గుప్పున సిగరెట్ పొగలు వదుల్తూ రాత్రంతా జాగరణ చేసిన రాజుకీ ఘోరం తెలిసిన వెంటనే పరుగులు తీసాడు. కాని ఏం మిగిలింది? గుండెలు పగిలేలా ఏడ్చాడు. బ్రతుకు మీద పూర్తిగా విరక్తి పుట్టి పిచ్చివాడిలా తయారయ్యాడు.నిర్ధాక్షిణ్యంగా తన చేయి విడిచిన సుజాత తలపులతోనే రోజులు గడపసాగాడు.

ఐతే, సుజాత ఆత్మహత్య చేసుకోలేదనీ, ఆమె మరణం వెనుక తన తండ్రి అదృశ్య హస్తం ఉందనీ, ఆమె హత్య చేయబడిందనీ తెలిసిన రోజున అతడి ఆగ్రహం అవధులు దాటింది. తన ప్రేమకు సమాధి కట్టిన తన తండ్రి మీద కసి తీర్చుకోవడానికి బయలుదేరాడు. కాని, ఇంటికి

చేరేసరికి ఎదురు చూడని సంఘటన ఎదురయింది. మేడ మెట్ల మీదనుంచి దొర్లి క్రిందపడిన తన తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది. చివరి కోర్కెగా మేనరికాన్ని చేసుకోమని ప్రాధేయపడిన ఆమె కన్నీటికి కరిగి పోయాడు. తన తప్పును మన్నించమని తల వంచిన తండ్రిని క్షమించకుండా ఉండలేక పోయాడు.

అలా రాజుకి పెళ్ళయింది. సుజాత స్మృతులు తనను అనుక్షణం వెంటాడుతున్నా,కట్టుకున్న భార్యకు అన్యాయం చెయ్యకూడదనుకున్నాడు. జీవితంతో రాజీ పడడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కాని, దురదృష్ట దేవత కరుణాకటాక్షం కారణంగా మగబిడ్డను కని భార్య కన్నుమూసింది.ఇక ఆ పసికూనే తన సర్వస్వమనుకున్నాడు. తన సుఖ సౌఖ్యాల గురించి యోచించలేదు. తాతలు,తండ్రులు ఆర్జించి పెట్టిన ఆస్తిని తన బుద్ధికుశలతతో ఎన్నో రెట్లు పెంచి పెద్ద ఆర్థిక సామ్రాజ్యం నెలకొల్పాడు. తనయుడ్ని గారాబంగా పెంచాడు. పెద్ద చదువుల నిమిత్తం అమెరికా పంపాడు. చదువు పూర్తయి వచ్చిన కొడుకుని చెట్టు కింద నిలబెట్టి కథ చెప్పడం మొదలెట్టాడు.”

ఫక్కున నవ్వాడు చందూ! ” నిలబెట్టి చెప్పలేదు నాన్నా! నా కాళ్ళెక్కడ  నొప్పెడతాయోనని ఇప్పుడు కూడా కారులోనే కూర్చోబెట్టి కథ చెప్పావు!”

రాజశేఖర్ తనూ నవ్వేసి  ప్రేమగా చందూ భుజం తట్టి  ఇలా అన్నాడు-

ఈ కథకీ, నా పునర్వివాహానికీ సంబంధమేమిటా అన్న సందేహం నీకు కలగడం సహజం. అదే నేను చెప్పబోయే చిత్రమైన అంశం. శ్రద్ధగా విను-  ఈమధ్య నా పర్సనల్ సెక్రటరీ అమెరికా సంబంధం కుదరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొత్త సెక్రటరీ కొసం పేపర్లో ప్రకటన ఇచ్చాను. కొన్నాళ్ళ తరువాత ఒక రోజున వచ్చిన అభ్యర్థుల్ని వరుసగా ఇంటర్వ్యూ చేస్తున్నాను.అప్పుడు నా గదిలోకి సుడిగాలిలా దూసుకువచ్చిందామె. ఆమె పేరు నళిని. తనని చూడగానే నేను నివ్వెరపోయాను. కలా? నిజమా? అన్న భ్రాంతికి లోనయ్యాను. నన్ను చూడగానే నళిని కూడా అప్రతిభురాలయ్యింది. నా వంక అలా పిచ్చిగా చూస్తూ చూస్తూ మైకం కమ్మినట్లు తూలి స్పృహ తప్పి కుప్పగా కూలిపోయింది.

చందూ! ఇది నిజం. నువ్వు నమ్మి తీరాలి. ఆమె ముమ్మూర్తులా నా సుజాతను పోలి ఉంది.అదే రూపం…అదే వర్ఛస్సు! నువ్వు తిన్నగా విదేశాలనుంచి వస్తున్నావు. జన్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు. కాని ఇది ఊహకందని నిజం. స్పృహ వచ్చాక నళిని నన్ను గుర్తించింది. ఆమె ఎవరో కాదు. నా సుజాతే! నా కోసం తిరిగి జన్మెత్తి వచ్చింది. నన్ను చేరుకుంది.నెమ్మదిగా ఆమెకు పూర్వ జన్మలో సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. ఎడారిలాంటి నా జీవితంలో తిరిగి వసంతం తొంగి చూసింది. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నళినిని నాదాన్నిగా చేసుకున్నాను.

లోకం కూసే కారుకూతల్ని నేను లెక్క చెయ్యలేదు. ఈ అసాధారణమైన సత్యాన్ని ఎలుగెత్తి చాటాలని నేను ప్రయత్నించలేదు. ఇదిగో! నేను అపురూపంగా నా పర్స్ లో దాచుకున్న సుజాత ఫొటో. ఇదేమో …ఈమధ్య తీసిన నళిని ఫొటో! ఏమంటావు? ఆశ్చర్యంగా లేదూ? పవిత్ర ప్రేమకు ఓటమి లేదు చందూ! ఇదీ జరిగింది….అర్థం చేసుకోగలవ్ కదూ? నా ఆనందంలో పాలు పంచుకుంటావు కదూ?

బదులుగా చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ ఆప్యాయంగా ఆయన చేయి నిమిరాడు చందూ!

*   *    *     *    *     *       *      *      *

మరుసటి రోజు రాత్రి…..నళిని ఒడిలో సేద తీరుతూ అంటున్నాడు రాజశేఖర్- “చందూ అమెరికాలో ఒక అమ్మాయిని ప్రేమించాడట.పెళ్ళాడి అక్కడే సెటిలయిపోతానంటున్నాడు.”

“మంచిదేగా!అలాగే కానివ్వండి.”

“అది కాదు సుజీ! నువ్వు ఒంటరిదానివైపోతావనే నా బెంగ.”

“మీరుండగా నేను ఒంటరిదాన్ని ఎలాగవుతాను?

“పిచ్చి సుజీ! నేను అయిదో పడిలో పడ్డాను. మృత్యువుకు సమీపంలో ఉన్నాను. నేను చచ్చి……”

“ఛీ….ఏమి మాటలవి? అశుభం పలకొద్దు! ఏ శక్తికీ మనల్ని విడదీసే శక్తి లేదు. మనది జన్మ జన్మల బంధం.” అతని నోరు నొక్కేసి హృదయానికి హత్తుకుంటూ అంది నళిని. సరిగ్గా అప్పుడే  ఆకాశంలో పెద్ద మెరుపు………

*     *      *      *      *

ఇది జరిగిన పాతికేళ్ళ తరువాత- ఒక ఇంట్లో కిరీటి అనే యువకుడు తన తండ్రితో ఘర్షణ పడుతూ ఇలా అంటున్నాడు……. “మీరెన్నయినా చెప్పండి! నేను నళినిని వివాహమాడే తీరుతాను. దయచేసి కారణాలు అడక్కండి!”

నీకు పిచ్చి పట్టిందిరా! లేకుంటే ఎంత డబ్బున్నదయితే మాత్రం కోరికోరి  ఒక ముసలిదాన్ని పెళ్ళాడతానని భీష్మించుకు కూర్చోవురా! కుల మతాల ప్రసక్తి  కూడా తీసుకురాము. నీకు జోడైన పిల్లను చేసుకుని మా ముచ్చట తీర్చరా!”- ఇది అతని తండ్రి వేడికోలు.

అయినా కిరీటి తన  పట్టిన పట్టు విడువలేదు. తన పంతం నెగ్గించుకున్నాడు.

ఇదిలా జరిగిందా….? జరిగి ఆగిందా….?

ఊహూ….మరో పాతికేళ్ళ అనంతరం-

జ్యోతి అనే పడుచుపిల్ల తల్లిదండ్రుల మాట కాదని కిరీటి అనే పండు ముదుసలిని పరిణయమాడింది.

అలా మరో పాతికేళ్ళు గడిచాయో లేదో…..గిరి అనే నవ యువకుదు సుమతి అనే వృద్ధ వనితను………..

……………”సశేషం”

*

విజయ్ ఉప్పులూరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు