సర్వీస్ ఇంజనీర్

తనని తాను రక్షించుకోవడానికి మనసు ఎంచుకునే మార్గాలు ఎంతో వింతగానూ, మోసపూరితంగానూ, హేతురహితంగానూ ఉంటాయి.

1

ల్లని రసాయన పారిశ్రామిక వ్యర్థాలు పోగుపడి, వారం రోజులుగా పడుతున్న ముసురుకి నాని, నల్లగా వ్యాపించిన బురదతో నిండిన ఆ రోడ్డు పారిశ్రామిక వాడ నడుమ నుండి సాగుతోంది. అటువైపుగా ఉన్న ఒక గ్రామంలోని ధనవంతుడైన, కేంద్ర మంత్రి యొక్క మామ గారైన రోగికి వైద్యం అందించడానికి కుండపోత వర్షంలో తెల్లవారుజామున నేను బయలుదేరి వెళ్ళాను. నగరంలో అత్యుత్తమ హృద్రోగ నిపుణుడిగా నాకు పేరు ఉన్నందున, అతి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు నా సేవలు వినియోగించుకుంటూ ఉండడం వల్ల, ఆ కుటుంబం నన్ను పిలిచింది. అతను అంత ప్రముఖుడు కావడం వల్ల నాకు వెళ్ళడం తప్పలేదు. ఆయనకు చికిత్స పూర్తి చేసి, నిజానికి ఆయనకి ఆరోగ్యపరమైన సమస్యే లేదు, అది కేవలం తరచుగా ధనవంతులు తమ ఆరోగ్య దుస్థితిని అతిగా ఊహించుకున్నందున ఇతరుల్ని ఇబ్బంది పెట్టే వ్యాకులత మాత్రమే. ఆరోగ్యానికి ఏ సమస్యాలేదని, అది కేవలం గాస్ట్రిక్ సమస్య మాత్రమేనని, ఆయనను సమాధానపరచి, అల్పాహారం తీసుకొని, తిరిగి బయలుదేరేసరికి ఉదయం పది గంటలు దాటింది. వర్షం తగ్గుముఖం పట్టింది.

అసహ్యమైన నల్లని బురదలో చెమ్మగా, చిత్తడిగా, మకిలిగా ఉన్న ఈ దారి తెల్లవారుజామున చీకటిలో ఇంత అసహ్యంగా కనిపించలేదు. వెలుతురులో గనుక ఈ రోడ్డుని చూసి ఉంటే ఆ రోగి కాని రోగి యొక్క వ్యాకులతని సమాధాన పరచడానికి వెళ్ళకుండా వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయేవాడిని. ఈ రోడ్డుని ఇప్పుడు దాటి తీరాలి. మరో మార్గం లేదు. విధిలేక కారుని ముందుకి పోనిచ్చాను. వికారమైన ముఖకవళికలతో కూడిన నా ముఖాన్ని అప్పుడు చిన్నపిల్లలెవరైనా చూసి ఉంటే పగలబడి నవ్వుకొని ఉండేవారు.

ఆ నల్లని దారిలో ఒక వ్యక్తి తెల్లని షర్టు వేసుకుని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లే మాదిరిగా ఫార్మల్ డ్రెస్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. నేను అతన్ని గమనించాను కాని నేను ఉన్న మానసిక స్థితిలో అతడి ఉనికికి ప్రతిస్పందించలేకపోయాను. ఫలితం అతడి తెల్లని షర్ట్ మీద, ముఖం మీద నల్లని బురద. జరిగిన దురదృష్టకరమైన విషయాన్ని సెంటర్ మిర్రర్లో చూసి ఆందోళనగా కారుని రివర్స్ చేశాను. అతడు తిడితే భరించాలని నిర్ణయించుకున్నాను. కాని అతడు తిట్టలేదు సరి కదా, “బాగున్నారా? సార్!” అని ఎంతో గౌరవంగా అన్నాడు. అతనెవరో గుర్తు పట్టలేకపోయాను. అతడు తన ముఖం మీది బురదని రుమాలుతో తుడుచుకున్నాక అర్థమైంది అతను సర్వీస్ ఇంజనీర్ శ్రీనివాస్ అని. సర్వీస్ ఇంజనీర్ అన్నానని అతడు నిజమైన ఇంజనీర్ అనుకోకండి. సాధారణంగా 10 వ తరగతి చదివినవారు మాత్రమే ఉండే ఈ సర్వీస్ ఇంజీనీర్ లలో ఐ.టి.ఐ చదివిన అధిక విద్యార్హత గల సర్వీస్ ఇంజనీర్ ఇతను. అందువల్ల అతనికి వృత్తిపరంగా కాస్త గర్వం ఉండేది. అతడి చిన్న ఉద్యోగానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పెట్టిన గంభీరైన పేరు ‘సర్వీస్ ఇంజనీర్’.

2

“దీనిని నువ్వు కొనుక్కున్నావా, నేను కొనుక్కున్నానా? చెప్పవయ్యా? టీవీ నీదా, నాదా?” అని అరిచాను సర్వీస్ ఇంజనీర్ శ్రీనివాస్ మీద.

“సార్! ఇక్కడ టీవీ ఎవరిదని కాదు. ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేయడం నా జాబ్.” శ్రీను అసహనంగా చెప్పాడు.

“నీ సొంత టివిని మీ ఇంట్లో నీకు నచ్చిన చోట బిగించుకో. నా ఇంటిలో, నా టీవీ ని, నాకు నచ్చిన చోట నువ్వు బిగించితీరాలి.” అన్నాను.

“అసహ్యంగా ఉంటుంది, మీరు చెప్పినట్టు చేస్తే. ఎవరూ మీరు చెప్పిన చోట టీవీని బిగించుకోరు. కనీసం నేలకి 5 అడుగుల ఎత్తులో టీవీ ఉండాలి. మీరు చెప్పినట్టు 2 అడుగుల ఎత్తులో నేను బిగిస్తే గనుక ఈటీవీ ఇన్స్టాల్ చేసిన వెధవ ఎవడని పేరు కనుక్కొని మరీ నాకు ఫోన్ చేసి తిడతారు” ఉద్రేకంగా అన్నాడు శ్రీను.
అసలు ఈ గొడవ ఎలా వచ్చిందో మీకు చెబుతాను. నేను 98 అంగుళాల పెద్ద టీవీ కొన్నందుకు అప్పటికే గర్వంగా ఉన్నాను. అప్పటికే నేను అంతర్జాతీయ కేలిబ్రేషన్ సంస్థలు టీవీని బిగించాల్సిన ఎత్తుకు సంబంధించి నిర్దేశించిన నియమాలని కొంత పరిశోధన చేసి ఉన్నాను. గోడ మీద టీవీ ఎంత ఎత్తులో ఉండాలో కొలిచి పెన్సిల్ తో గుర్తులు పెట్టాను. అంతిమంగా వాటి సారాంశం ఏమిటంటే మనం సోఫాలో కూర్చున్నప్పుడు మన కళ్ళకి సమాంతరంగా టీవీ తెర మధ్యభాగం లేదా కేంద్ర బిందువు ఉండాలి. కాని శ్రీనివాస్ టీవీని నేలకి ఐదు అడుగుల ఎత్తులో బిగించాలని నమ్ముతున్నాడు. తాను మాత్రమే కాకుండా, తన తోటి ఉద్యోగులందరూ, ఇంకా ఇతర కంపెనీల వారు కూడా అంతే ఎత్తులో టీవీలను బిగిస్తున్నారని, నేను చెప్పిన విధంగా టీవీని బిగించడం తాను ఎక్కడా చూడలేదని, తన కంపెనీ నుండి అతనికి అటువంటి ఆదేశాలు ఏమీ లేవని చెప్పాడు. ఆ విధంగా మా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి.

చివరికి “సారీ! మీరు చెప్పినట్టుగా నేను టీవీని బిగించను.” అని అసహనంగా అతడు వెళ్లిపోయాడు.

నా అహం దెబ్బతింది. నేను ఆ టీవీ కంపెనీ సర్వీస్ సెంటర్ కి ఫోన్ చేసి, మేనేజర్ నెంబర్ తీసుకొని అతని మీద విరుచుకుపడ్డాను. అతను క్షమాపణ చెప్పి వేరొకరిని పంపిస్తానని చెప్పాడు. పంపిస్తే శ్రీనివాస్ ని  మాత్రమే పంపించమని అడిగాను నేను. వేరే ఎవరొచ్చినా వెనక్కి పంపేస్తానని హెచ్చరించాను.

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి బీచ్ కి వెళ్లి సిగరెట్లు తాగుతూ గడిపాను. శ్రీనివాస్ ఎప్పుడు వస్తాడా, అతడిని నాలుగు మాటలు తిట్టిపోసి నేను కోరుకున్నట్టుగా టీవీని బిగింపజేసుకోవాలని ఎదురు­చూశాను. కాని సర్వీస్ సెంటర్ వాళ్లు వేరే సర్వీస్ ఇంజనీర్ ని పంపారు. నేను అతడిని తిట్టి పంపించేశాను. మరొకసారి సర్వీస్ సెంటర్ మేనేజర్ కి ఫోన్ చేసి అతని మీద విరుచుకుపడ్డాను. శ్రీనివాస్ రావడానికి ఇష్టపడటంలేదని, ఎవరైతేనేమి నేను కోరుకున్నట్లుగా పని అవుతుంది కాబట్టి కొంచెం ఎడ్జెస్ట్ అవ్వవలసిందిగా కోరాడు.

“నువ్వు శ్రీనివాస్ ని పంపకపోతే మీ హెడ్ ఆఫీస్ కి కంప్లైంట్ చేస్తాను” అని బెదిరించాను.

ఆ రాత్రి కూడా నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా బీచ్ లో అశాంతిగా గడిపాను. తెల్లవారుజామున ఇంటికి వచ్చి సదరు టీవీ కంపెనీ భారతదేశపు ప్రధాన కార్యాలయానికి కంప్లైంట్ మెయిల్ చేశాను. ఉదయం కొత్త సర్వీస్ ఇంజనీర్ వచ్చాడు. నా కోపం పతాకస్థాయికి చేరింది. ఆ రోజంతా ఆ కంపెనీలోని రకరకాల స్థాయిలలో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల ఫోన్ నెంబర్లు సంపాదించి ఒక్కక్కరితో వాదులాడటం మొదలుపెట్టాను. నా కోపాన్ని  హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు మీద చూపించడం మొదలు పెట్టాను.

“హార్ట్ ప్రోబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి?” అని అడిగిన ఒకామెని “పందిలాగా తినడం మానేస్తే ఏ ప్రోబ్లమ్స్ రావు”  అని చిరాకుపడి తరువాతి పేషెంట్ కోసం బజర్ ప్రెస్ చేసాడు.

టీవీ కంపెనీ ఉన్నతోద్యోగులు అందరూ ప్రోటోకాల్ ప్రకారం సమస్యని పరిష్కరించడానికి కొంత సమయం అడిగారు. కాని నేను అనుభవిస్తున్న మానసిక నరకాన్ని మరిన్ని రోజులు కొనసాగించడం నాకు దుస్సహంగా  అనిపించింది. సహనం నశించి, కొరియాలోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలోని అధికారుల ఫోన్ నెంబర్లు సంపాదించి వారితో గొడవ పడ్డాను. వాళ్లు కూడా సమస్యని పరిశీలించి, పరిష్కరించడానికి 48 గంటల గడువు అడిగారు. అంతటితో ఆగకుండా రాజకీయ పలుకుబడి గల మా మామగారి మీద వత్తిడి తెచ్చాను. భారత విదేశీ వ్యవహారాల మంత్రి గారి చేత కొరియా విదేశీ వ్యవహారాల శాఖామాత్యుల వారికి ఫోన్ చేయించి, ఆయన చేత ఆ టీవీ కంపెనీ యాజమాన్యానికి సిఫార్స్ చేయించమని అడిగాను. ఇదంతా పిచ్చితనంగా మీకు అనిపించవచ్చు. కోపం మనల్ని ఎంత అవివేకంగా మారుస్తుందో మన ఊహించలేము. తెల్లవారేలోగా శ్రీనివాస్ నా కాళ్ళ దగ్గర ఉండాలి అన్నది ఒక్కటే ఆ క్షణంలో నా తక్షణావసరం. మా మామగారు మొదట హేళనగా నవ్వినా, నా గొంతులోని తీవ్రమైన క్రౌర్యాన్ని గమనించి మారుమాట చెప్పకుండా ఆయన తన పరపతిని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ఉపయోగించారు. ఇదంతా ప్రోటోకాల్స్ ని అధిగమించి తక్షణం ప్రతీకారేచ్ఛ కలిగించే నొప్పి  నుండి ఉపశమనం పొందడానికి నేను చేసిన అహంకార పూరిత, విచక్షణారహిత చర్య మాత్రమే.

హాస్పిటల్ కి వెళ్ళకుండా ఎక్కడెక్కడో, ఎక్కడికి వెళుతున్నానో నాకే తెలియకుండా తిరుగుతూ, ఎవరెవరికో ఫోన్ లు చేస్తూ, సిగరెట్లు తాగుతూ ఆ రోజంతా గడిపాను. నా మనసు మనసులో లేదు. సంతోషంగా కొత్త టీవీని ఆనందించవలసిన నాకు కలిగిన దుస్థితికి నా మీద నాకే జాలి కలిగింది.
రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను. అనూహ్యంగా ఇంటిలో కొత్త టీవీ నేను కోరుకున్న చోట బిగించివుంది. నాకు చెప్పలేనంత ఆనందం కలిగి నాలో నేనే నవ్వుకున్నాను. ఎంత బిగ్గరగా అంటే నా నవ్వు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నా ప్రతాపానికి నాకు నా మీదే చాలా గౌరవం కలిగింది. “నాకు ప్రతి విషయంలోనూ పెర్ఫెక్షన్ కావాలి. నేను రాజీపడే మనిషిని కాను.” అని నాలో నేనే అనుకున్నాను.

నా భార్యని పిలిచి “ఆ వెధవ, శ్రీను గాడు వచ్చినట్టు నాకు చెప్పలేదేం?” అని అడిగాను.

“ సర్వీస్ సెంటర్ మేనేజర్ స్వయంగా ముగ్గులు ఇంజనీర్ లను తీసుకువచ్చి చాలా దీనంగా క్షమాపణలు చెప్పి బ్రతిమాలాడండి. మీకు నచ్చినట్టుగానే టీవీ బిగించారు. నేను దగ్గరుండి చూసుకున్నాను.” అందామె.

“ఆ శీను గాడే టీవీని ఇన్స్టాల్ చేసాడు కదా!”

“లేదండి. వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసారు.”
నేను ఆగ్రహంతో ఊగిపోయి నా భార్యను తిట్టాను.

“నేను చేసిన తప్పేంటి? పాత టీవీ తీసేశారు. సీరియళ్ళు చూడొద్దా? ఎంత కాలం టీవీ లేకుండా. నేనేం చేసినా మీకు నచ్చదు” అని ఏడ్చుకుంటూ పోయిందామె.

గోడకి బిగించిన టీవీని చూస్తూ అరగంట గడిపాను. నాకు ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో, ఇకపై ఏం చేయాలో అర్థం కాలేదు. చక్కగా గోడకి బిగించిన టీవీని ఎవరి చేత అయినా విప్పించి పక్కన పడేసి, మళ్లీ శ్రీనివాస్ చేత బిగింపజేసుకోవాలా అని ఆలోచించాను. అది నాకే హాస్యాస్పదంగా తోచింది. రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసాను. కొన్ని రోజులుగా భరిస్తున్న ఈ మానసిక వ్యధ నుండి పారిపోవడానికి ఒక అవకాశం దొరికింది. పెద్ద టీవీ కావడంతో, అదీకాక ఈ మోడల్ విడుదల కోసం సంవత్సరం పాటు ఎదురుచూడడంతో, నాకు అనూహ్యంగా ఆనందం కలిగింది. రాత్రంతా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ ని చూసాను. ఎప్పుడు నిద్రపోయానో తెలీదు, సోఫా మీద నిద్రపోయాను. ఆ తర్వాత శ్రీనివాస్ గాని, అతడితో పడిన గొడవగాని ఒక్కసారీ గుర్తుకు రాలేదు. బాధాకరమైన విషయాల నుండి పారిపోవడానికి మనసు ఎన్నో మార్గాలని ఎంచుకుంటుంది. తనని తాను రక్షించుకోవడానికి మనసు ఎంచుకునే మార్గాలు ఎంతో వింతగానూ, మోసపూరితంగానూ, హేతురహితంగానూ ఉంటాయి.

3

ఒక పల్లెటూరిలో, పర్వత ప్రాంతంలో నాకు 30 ఎకరాల ఎస్టేట్ ఉంది. దానిని గత పదేళ్లుగా అప్పయ్య అనే గిరిజనుడు, అతని కుటుంబం చూసుకుంటున్నారు. ఒకరోజు అప్పయ్య ఫోన్ చేసి భయంగా, బెరుకుగా చెప్పాడు తాను కొత్త ఇల్లు కట్టుకున్నానని. నన్ను గృహప్రవేశానికి పిలిచేంత ధైర్యం అయితే అప్పయ్యకు లేదని నాకు తెలుసు. అయితే ఎంతో ఔదార్యంతో(అలా భావించుకున్నాను) గృహప్రవేశానికి నేను వస్తానని చెప్పాను, నిజానికి ఎస్టేట్ పరిస్థితిని ఒకసారి పరిశీలించడం నా ఉద్దేశ్యం. అదీకాక గృహ ప్రవేశం జరిగే రోజు ఆదివారం. అప్పయ్య చాలా సంతోష పడ్డాడు. అనేక పర్యాయాలు ధన్యవాదాలు తెలియజేశాడు.

గృహప్రవేశానికి నేను వెళ్లడం అప్పయ్య కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాకు కుర్చీ వేసి వారంతా చేతులు కట్టుకొని నా చుట్టూ నిలబడ్డారు. వారిని అలా గంటల తరబడి అనాగరికంగా నిలబెట్టి మాట్లాడడం నాకు ఎటువంటి ఇబ్బందినీ కలిగించలేదు. వారికంటే నేను అధికుడిని అనే భావన విషంలా నా మెదడులో వ్యాపిస్తోంది.

నా ఎస్టేట్ ఫలసాయంలో అవినీతి చేసి ఈ ఇల్లు కట్టుకున్నారు అనుకున్నాను. నిజానికి వారలా చేసి ఉంటే ఇంకా మంచి ఇల్లు, కాస్త సౌకర్యవంతమైనది కట్టుకొని ఉండేవారు. ఆ కొత్త ఇంట్లో ఉన్న చిన్న ఎల్ఈడి టీవీ ని చూసి నా మనసు నొచ్చుకుంది. ఎందుకంటే నా కొత్త టీవీ, ఈ టీవీ ఒకే కంపెనీవి.

“మంచి కంపెనీ టీవీ. ఎప్పుడు కొన్నారు?” అడిగాను.

“పాపకి ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, బాబూ! చిన్నప్ప నుండి టీవీ కొనమని అడుగుతున్నాది. ఫస్ట్ క్లాస్ వస్తే కొనిస్తానని…” మధ్యలో ఆ సంభాషణను అడ్డుకుంటూ అన్నాను “దీనిని బిగించడానికి ఎవరు వచ్చారు?” అని.

“శ్రీనివాస్ అనే అతను వచ్చాడు. చాలా మంచి మనిషి, బాబు!”

నేను అసహనంగా తల పక్కకి తిప్పాను. అక్కడ పశువుల కొట్టంలో సుమారుగా 20 గేదెలు ఉన్నాయి.

“చాలా గేదెలు కొన్నావే!” అతడి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండడం నిజానికి నాకు అంతగా నచ్చలేదు. అయినా నాలోని ఆ అయిష్టత ని నేను గుర్తించలేదు.
“బాబు, నా తెలీనితనమో, చేతకానితనమో తెలీదు. ఆ పశువుల్ని చాలా బాధపెట్టాను. వాటిని బురదలో, రొచ్చులో చాలా కాలం ఉంచేసాను. వాటి కాళ్ళు పుండ్లుపడ్డాయి. వాటి నుండి రసి కారి బురదలో కలిసేది. వాటిని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోయేది. పట్నంలోని పశువుల ఆసుపత్రిలో ఒకసారి వచ్చి పశువుల్ని చూసి వెళ్ళమని చాలా సార్లు అడిగాను. కాని వాళ్లెవరూ పట్టించుకోలేదు. పశువుల కాళ్లు వాచిపోయాయి. వాటిని చూస్తే నా గుండె తరుక్కుపోయేది. కానీ ఏం చేయాలో పాలు పోయేదికాదు.

2 నెలల క్రితం టీవీని కొన్నప్పుడు దానిని బిగించడానికి శ్రీనివాస్ బాబు వచ్చాడు. ఇంటిలో దిగడానికి రెండు నెలల వరకూ ముహూర్తాలు లేవు అంటే, “టీవీ చూడడానికి ముహూర్తం ఏమిటి, బాబాయ్? గృహ ప్రవేశం వరకూ కొత్త ఇంటిలోనే టీవీ చూడండి.” అన్నాడు(అతని ముఖంలో చిన్న చిరునవ్వు, అది మెల్లగా గంభీరంగా మారిపోయింది). అలాంటి మనిషిని నేను నా జీవితంలో చూడలేదు. ఈ పశువుల పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నాడు. రెండు రోజుల తర్వాత బస్సులో మళ్ళీ వచ్చాడు, ఈ పశువుల కోసం. మనుషులు చనిపోతేనే ఎవరూ పట్టించుకోని రోజులు, పశువుల కోసం ఎవరైనా ఇంత మారుమూలకి వస్తారా? ఆ రోజు బాధగా ఉన్నాడు. ఉద్యోగం పోయిందని చెప్పాడు. ఎవరో పెద్దమనిషి కంపెనీకి కంప్లైంట్ చేసాడట.” కొంతసేపు ఆగి నిట్టూర్చి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు. అతని స్వరం మరింత పీలగా, బలహీనంగా, బాధగా మారింది. “పశువుల ఆసుపత్రిలో రమ్మని అడిగాడట. ఎవరూ పట్టించుకోలేదట. ఎవరో డాక్టర్ ని సలహా అడిగి మందుల షాపులో ఇంజెక్షన్లు కొని తెచ్చి, స్వయంగా ఆ పశువుల కాళ్ళకు ఇంజక్షన్ చేసాడు. వాటి కాళ్లు శుభ్రం చేసి మందురాసి కట్టుకట్టాడు. వాటిని బురద లేని చోట కట్టాడు. వాటికి నయం అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండి, రోజూ వాటికి వైద్యం చేసేవాడు. వాటికి నయమయ్యాకే పట్నం వెళ్లాడు. అలాంటి మంచి మనిషికి కూడా అపకారం చేసే వాళ్ళు ఉంటారంటే నమ్మలేకపోయాను, బాబు.’

ఆ మాటలు విన్నాక అపరాధ భావంతో తీవ్రమైన మనస్తాపానికి గురి అయ్యాను. అప్పయ్యకి కొంత డబ్బు ఇచ్చి ఆ పశువులకి ఒక మంచి షెడ్ వేయించమని చెప్పి వెంటనే అక్కడి నుండి వచ్చేసాను. అప్పయ్య నా సహాయానికి ఎంతో కదిలిపోయి కృతజ్ఞతలు తెలియజేసాడు.

అప్పయ్య చెప్పిన సంఘటన గురించి తెలిసాక నాకు చాలా బాధ కలిగింది. శ్రీనివాస్ గురించి టీవీ కంపెనీ సర్వీస్ సెంటర్ లో వాకబు చేశాను. వాళ్లు అతని ఫోన్ నెంబర్ ఇచ్చారు. కాని ఆ ఫోన్ నెంబరు డి-ఏక్టివేట్ చేయబడింది. కొంతకాలానికి ఆ విషయం మర్చిపోయాను.

4

శ్రీనివాస్ కారులోకి రావడానికి ఇష్టపడలేదు.

“సార్! ఇంత మంచి కారు. ఈ బురదతో…! వద్దు సార్!”

“శ్రీనివాస్! ఏంటి, ఎక్కడా కనిపించడం లేదు? ఏం చేస్తున్నావ్ ఇప్పుడు?”

“జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్! చూడండి, సార్! అదిగో ఆ ఫ్యాక్టరీ ఉంది కదా! అందులో ఇంటర్వ్యూకి అప్లై చేశాను.”

“దా! కార్ ఎక్కు. నిన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తాను”

“ఏంటి, సార్! ఈ బురదతో ఇంటర్వ్యూకి ఎలా వెళ్తాను?” అని నవ్వుతూ చెప్పాడు.

“ పోనీ, మీ ఇంటికి తీసుకువెళతాను, స్నానం చేసి డ్రెస్ మార్చున్నాక, మళ్లీ ఇంటర్వ్యూకి తీసుకొస్తాను” అన్నాను.

“సార్! అవన్నీ ఎందుకు సార్! 10 నిమిషాల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే ఈ జాబ్ అవకాశం పోయినట్టే” స్వచ్ఛంగా నవ్వుతూ చెప్పాడు. అతడి ముఖంలో తన పట్ల కోపం గాని, మరొకసారి ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టానన్న ద్వేష భావం గాని లేదు.

“మీరు వెళ్ళండి. సార్! నేను మెల్లగా నడుచుకుంటూ వచ్చేస్తాను. దగ్గర్లోనే బస్ స్టాప్ ఉంది” అని నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు.

నేను చాలా సేపు ఆలోచించుకుంటూ కార్ లోనే ఉండిపోయాను. ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియలేదు. అప్పుడు అర్థమైంది అతని ఫోన్ నంబర్ అడగడం మర్చిపోయానని. శ్రీనివాస్ కోసం ముందుకువెళ్ళి ఆ ప్రాంతమంతా వెతికాను. కానీ ఎక్కడా కనిపించలేదు.

5

మరొక ఐదు నెలలు గడిచాయి. ఒకరోజు నా క్లినిక్ కి శ్రీనివాస్ తన తల్లిని తీసుకొనివచ్చాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. అది నా క్లినిక్ అని అతనికి తెలియదు.

తనకి ఇంకా జాబ్ రాలేదని, ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాడు. డయాగ్నసిస్ లో అతని తల్లికి అడ్వాన్స్డ్ అథెరోస్క్లెరోసిస్ వ్యాధి ఉందని, గుండెకి సంబంధించిన ధమనులు (కరోనరీ ఆర్టరీస్) మూసుకుపోయాయని అర్థమయింది. ఆమెకి వెంటనే బైపాస్ సర్జరీ చెయ్యవలసిన అవసరం ఉందని తెలియజేశాను. అతడి ముఖం వివర్ణం అయింది. నిశ్చేష్టుడై ఉండిపోయాడు.

“ఎంత ఖర్చు అవుతుందండి?” అని అడిగాడు.

“8 లక్షలు” అని చెప్పాను.

అతడి దగ్గర 50000 కూడా లేవని అతడి పరిస్థితిని చూస్తే అర్థమైంది.

నా క్లినిక్ లో ఉద్యోగం చేయమని, అతని తల్లికి ఆపరేషన్ చేస్తానని, ఉద్యోగం చేస్తూ మెల్లగా ఆ అప్పు తీర్చుకోవచ్చని అతనికి చెప్పాను.

“నా వృత్తి వేరు, మీరు ఇస్తానంటున్న ఉద్యోగం వేరు. వద్దు సార్! నాకు ఎక్కడో దగ్గర ఉద్యోగం దొరుకుతుందిలెండి. ఏదో ఒక దారి దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది.” అని శ్రీనివాస్ ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంటే నన్ను అపరాధ భావన తీవ్రంగా బాధించింది. అతన్ని వెనక్కి పిలిచి, ఆపరేషన్ ఉచితంగా చేస్తానని చెప్పాను.

శ్రీనివాస్ చాలా ప్రేమగా, సున్నితంగా తిరస్కరించాడు.

6

రెండు రోజులు గడిచాయి.
ప్రిస్క్రిప్షన్ ఫైల్ లో ఉన్న శ్రీనివాస్ నెంబర్ చూస్తూ చాలాసేపు గడిపాను. చివరికి ధైర్యం చేసి ఫోన్ చేశాను. కాని అతను ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాతి రోజు కూడా ఫోన్ చేశాను. కాని అతను ఫోన్ ఎత్తలేదు. మరో రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ నుంచి మెసేజ్ వచ్చింది.
“సార్, ఫోన్ ఎత్తలేకపోయాను. అమ్మ చనిపోయారు. మాట్లాడే పరిస్థితిలో లేను. త్వరలోనే కాల్ చేస్తాను.”

7

వారం రోజుల తరువాత నేను క్లినిక్ లో ఉన్నప్పుడు రిసెప్షన్ నుండి కాల్ వచ్చింది “ఎవరో శ్రీనివాస్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.” అని.
శ్రీనివాస్ చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. కూర్చుని చాలా సేపు మాట్లాడలేకపోయాడు. చివరకి “నేను చాలా తప్పు చేసాను. మీ మాట వినుంటే మా అమ్మని కాపాడుకోగలిగి ఉండేవాడిని. ట్రీట్మెంట్ ఆలస్యమయింది. నా అహకారం….ఆత్మాభిమానం అనుకున్నాను. సర్! మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను” అని ఏడ్వడం మొదలు పెట్టాడు.

శ్రీనివాస్ ని ఓదార్చాను. సర్జరీ ముందుగా చేసినా బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి అతడి బాధను తగ్గించడానికి ప్రయత్నించాను.

వెళ్ళేముందు ఈ విధంగా చెప్పాడు శ్రీనివాస్ “సార్! ఆ రోజు నా మనసు బాగోలేదు. మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ మూర్ఖత్వం అలాగే కొనసాగింది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీరు చెప్పిన విధంగా టీవీని ఇన్స్టాల్ చెయ్యడమే కరెక్ట్ అని ఆలస్యంగా తెలుసుకున్నాను. మీకు సారీ చెబుదామని వచ్చాను.”

8

నెల రోజులు గడిచాక శ్రీనివాస్ స్వీట్స్ తీసుకొని వచ్చాడు. పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఇంకా మంచి ఉద్యోగం వచ్చిందని, సర్వీస్ ఇంజనీర్ ఉద్యోగానికి గతంలో వచ్చిన జీతంకంటే ఇప్పుడు 3 రెట్లు జీతం ఎక్కువనీ చెప్పాడు.

“మీరు నా ఉద్యోగం తీయించేసి నాకు మేలు చేసారు, సార్!” అని నవ్వాడు. ఇద్దరం మనసారా నవ్వుకున్నాం. చాలాసేపు మాట్లాడుకున్నాము.

అప్పటి నుండి నెలకి ఒకసారైనా వచ్చి కొంతసేపు నాతో గడిపి వెళతాడు. ఎప్పుడూ ఏ సహాయం అడగడు. తన బాధలు, సంతోషాలు ఆత్మీయంగా పంచుకుంటాడు, అంతే. మేము స్నేహితులమవ్వడానికి మా సామాజిక హోదాలు అడ్డు. వాటిని మేం ఎప్పటికీ దాటలేము. కాని మనసు లోతుల్లో మా ఇద్దరికీ తెలుసు మేము స్నేహితులమే అని.

(వాస్తవ ఘటనల ఆధారంగా)

*

శ్రీరామ్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీరాం, మీరు కథలు రాస్తారని తెలియదు. మనసుకు హత్తుకునే కవితలే రాసేవారని అనుకున్నాను. మీ పేరు చూడగానే లింకు సేవ్ చేసి పెట్టుకుని చదివాను. ఎంత బాగా రాశారు. ఎంత బాగా కథను నడిపారు. కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి. బాధకూడా కలిగింది. ఎవరిది తప్పు శ్రీ. డాక్టర్ గారిదా, శ్రీనివాస్ దా!??? డాక్టర్ అంతగా పట్టుపట్టి తన ego కు అవమానం అని ఎంత దూరానికి వెళ్ళారు!! ఒక మంచి మనిషి జీవితం పాడైంది. ఆ మనిషి తన మంచి తనాన్ని చివరి వరకు నిలుపుకున్నాడు. ఇది చాలా మంచి పాఠం. పట్టుదలలకు వెళ్ళి ఏం పోగొట్టుకుంటున్నాం,ప్రశాంతమైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నాం! మీకు మనఃపూర్వక అభినందనలు శ్రీ.చాలా మంచి కథను అందించారు. Thank you so much.

  • కథ నడక బాగుంది. అభినందనలు సర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు