సత్తెమ్మ

బర్మా కేంపు కథలు  – 18

క్రికెట్ బ్యాట్ లా ఉన్న ఆ  కర్రతో  బట్టలకున్న  మురికి  వదిలించేలా  బాదుతుంది  సత్తెమ్మ . 104 ఏరియాలో  అపార్టుమెంట్లో  ఉంటోన్న  ఆ హిందీవాళ్ల  ఇంటికి సత్తెమ్మ తో  పాటు  వెళ్లిన  నేను  ఒక  చిన్న స్టూలు పై  కూర్చున్నాను .

ఇల్లంతా  శుభ్రంగా  ఉంది.  అపార్టుమెంట్ ప్రశాంతంగా  ఉంది. సత్తెమ్మ  ఉతుకుతున్న  బట్టల  చప్పుడు , బకెట్లోకి వస్తున్న కుళాయి నీళ్లు ,నా  చేతిలో ఉన్న రబ్బరు బాలు  నేను గోకుతున్న చప్పుడు   తప్ప శబ్దాలేమి లేవు.

“ఏ  మేరా  మాలిక్ కా బడా  బేటా ”
అని హిందీలో ఇంటావిడ తో  చెప్పింది. ఆవిడ  నవ్వుతూ  లోపలి రమ్మంది.

గంటలో ఇంటి పనంతా  చేసేశాక  ఇద్దరం తిరిగి బర్మా కేంపు  బయలుదేరి పోయాము . 104 లక్ష్మీనరసింహ  ధియేటర్ ముందు  పోస్టర్లు  చూసుకుంటూ , ఇండస్ట్రియల్ ఎస్టేటు,కప్పరాడ ,పాలిటెక్నిక్  కాలేజీ ,మంచుకొండ గార్డెన్సు  దాటుకుంటూ మెల్లగా నడిచినా , వేగంగా నడిచినా  బర్మా కేంపు  వచ్చేస్తోంది.

అయినా సత్తెమ్మతో  నడుస్తుంటే అలసట తెలియదు . బయలుదేరేముందు ఒక సినిమా మొదలు పెడుతుంది. సినిమా మొదలు ఆఖరు వరకు  ప్రతి దృశ్యం మనం ఎదురుగ్గా ఉండి  చూస్తున్నామా  అన్నంత బాగా చెబుతుంది.

సత్తెమ్మ వాళ్ళది బర్మాకేంపులో  కాందిశీకుల కోసం కట్టిన పెద్దరేకుల  ఇళ్లలో  చివరి ఇల్లు. ఇంటిచుట్టూ  మునగచెట్లు , పెద్ద నీళ్ల గోలెం ,బాదంచెట్లూ ఉంటాయి .

సత్తెమ్మ నా కంటే పదేళ్లు పెద్దది. లావుగా ఉంటుంది. వేగంగా నడుస్తుంది. పని కూడా అంతే వేగంగా చేస్తుంది. బర్మాకేంపులో నీళ్ల ట్యాంకరు నుంచి  నీళ్లు పెట్టాలన్నా , బోరింగు దగ్గర  నీళ్లు పట్టుకోవాలన్నా  ఎంతో ధైర్యం,తెగింపు ,దబాయింపు కావాలి. అవన్నీ  పుష్కలంగా ఉన్న మనిషి .

బ్రాహ్మణ  ఆరెంపీ  డాక్టరు గారు అద్దెకుండే ఆ మేడ  పోర్షన్ ఇంటి  ఎడం గా ఉన్న మా పెంకుటింట్లో బయట సిమెంటు ఖాళీ గోలాన్ని  మూడు సత్తు  బిందెల నీళ్లతో నింపేయగలదు .
మా ఇంటికి అటుపక్కనే సత్తమ్మ అన్నయ్య ఉంటున్నా …  తన రోజువారీ నీళ్లు మోసే పనయిపోయాక   మా ఇంటిదగ్గరే ఉండేది.   మేము ముగ్గురన్నదమ్ములం   మా అమ్మకు మగ వెధవలమే  కాబట్టి  సత్తెమ్మ అంటే  అభిమానం.

“ఏంటీ నాగులచవితికి మీరు పుట్టలో పాలు పొయ్యరా ? రండి పాముల పుట్ట చూపిస్తాను అని అగ్నిగుండాలు తొక్కే గెడ్డల ఇవతల వున్న చాలా పాముల పుట్టలు చూపించి , ఒక పుట్ట పైన శుభ్రం చేసి పుట్టమన్ను తీసి బొట్టు పెట్టినా ,
పరమేశ్వరీ  పిక్చర్ ప్యాలస్  లో  ” గూండా”  సినిమా చూడాలన్నా, నూకాలమ్మ పండుగకు తొక్కే అగ్ని గుండం చూపించినా  , కేంపు   కింద  కొండమీద  కుమారస్వామిగుడి దగ్గర శూలాలు వేసుకొనే భక్తులను చూపించాలన్నా  సత్తెమ్మే  ఆధారం .

సాయంత్రమయితే  సత్తు పళ్లెంలో  ముసిలాళ్ళు అమ్మే ఉప్పేసి ఉడకబెట్టిన  కర్రపెండలం ,బెల్లమేసి ఉడకబెట్టిన చిలకడదుంపలు ,కాలంలో దొరికే ఉసిరి,జామకాయలు ఉప్పూకారం  కలిపి నంజుకుతినడం , ములగాకు ,ములక్కాడలు  కోసుకుని  ఇంటికి పట్టుకెళ్ళటం ,ఆదివారం మధ్యాహ్నాలు తీరికవేళ  కేంపులో చెట్టుకింద జనాలు చేరి ఆడుకొనే   “జల్దిఫైవ్ ” ఆడించడం. ఎక్కినంతమేర కొండెక్కి కొండచీపుర్లు  తెంపడం, ఎవరికైనా  “అమ్మోరు ” వస్తే  వేపకొమ్మలు పట్టుకెళ్ళటం  ఇలా అన్ని సార్లూ  సత్తెమ్మ తో పాటు మేకపిల్లలా  తిరగడమే  జరిగేది .

ఇలా  కేంపంతా   తిరుగుతూ , సినిమా కథలు అరుగుమీద వింటూ  కాలేక్షేపం చేస్తూ ఉన్న మా  ఇద్దరినీ  చూసి  “పెద్దయ్యాక  సత్తెమ్మకీ  ,అన్నయ్యకీ  పెళ్లి  చేసెయ్యాలి” అన్నాడు మా ఆఖరి తమ్ముడు.

అది విన్న మా అమ్మ కర్రతో మా తమ్ముడి పెళ్లి చేసేసింది.

తోడపుట్టినవాడు  పట్టించుకోవటంలేదని భాద పడుతున్న సత్తెమ్మ వాళ్ళ అమ్మను ఓదార్చి  బేరక్స్  దగ్గర ఊరిలో ఉన్న కుర్రాడికిచ్చి  దగ్గరుండి  పెళ్లి జరిపించారు  అమ్మా  నాన్నా .

పెళ్లి తరువాత సత్తెమ్మ ,వాళ్ళాయన తో కలసి నన్ను కూడా సినిమాకు తీసుకెళ్లింది .
బేరక్స్ , బర్మాకేంపు చుట్టూ ఆ జంట  తిరుగుతున్నారు.
మేము బర్మాకేంపు  వదిలిపెట్టి కాలనీకి మారిపోయాము.
….

సత్తెమ్మకు పిల్లలు పుట్టారు. భర్త మరొకరితో ఉంటున్నాడని రోజూ ఇంట్లో గొడవలవుతున్నాయని బాధపడుతూ అమ్మా, నాన్నకు వొచ్చి  చెప్పింది.
పిల్లాడికి భయం చెప్పారు. కొన్నాళ్ళు బాగానే వున్నారు, మళ్ళీ మామూలే. సర్దుబాటు కుదిరిందోలేదో తెలీదు .
పిల్లలు అల్లరోళ్ళు అయ్యారు. పిల్లలు పెద్దయ్యాక కుదిరిఉండవచు ,కుదరకపోయి ప్రయాణం సాగుతుండి వుండవొచ్చు.

కానీ మా నగరంలో బాధ్యతలేని భర్తతో సంసారం చేస్తోన్న , భర్త వొదిలేసి, ఒంటరిగా పిల్లలను సాకుతోన్న, పాచిపనులు చేసుకొంటున్న, నీళ్లు మోస్తూ  బట్టలు ఉతుకుతూ ఇంటిపనులు నాలుగిళ్ళలో చేసుకొని బతుకుతున్న, వేధింపులు నవ్వుతో ఎదుర్కొంటున్న నలభై వేల మంది సత్తెమ్మలు ఉన్నారట, అందులో  మా ” సత్తెమ్మ ” కూడా ఎక్కడో వుండే ఉంటుంది. లేదా పిల్లల మూలాన అయినా హాయిగా వుండి  ఉంటుంది అని ఒక చిన్న ఆశ.

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హరివెంకటరమణ గారు రాసిన సత్తెమ్మ కధ చాలా బాగుంది.చదివినంతసేపు కధ అంతా ఆసక్తిగా సాగింది.రచయిత అభినందనీయులు.

  • Time just flew while I was reading the story; I was lost in thoughts due to the narration- It is so good. It’s more than worth the read!! 🙂

  • కొసమెరుపు చాలా బాగుంది. నలభై వేల మంది సత్తెమ్మలు ఉన్నారట అన్నది అక్షర సత్యం.

  • కథపై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు, కోరాడ రాంబాబు, అనన్య, రామ శర్మ గారు.

  • Kada chala malupulatho baga sagindhi.prastutham vishaalaki anugunamga kada undhi.samajam lo Domestic workers alagi single women gurinchi alochinchali ane vidham ga kada sagindhi.okka vyakti meeda intha abhimanam undatam chala bagundhi. Vallu chese pani batti kakunda valla vyakhithvaniki value ivvadam chala bagundhi. Satthamma e kada vinte chala ananda paduthundhi.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు