శ్రీశ్రీని తూచే రాళ్ళు దళితవాదుల దగ్గర లేవు

శ్రీశ్రీ కంటే శివసాగర్ ఎక్కువ, మద్దూరి మహాకవి, తెలుగు కవిత్వంలో కలేకూరికి ముందు వెనక శూన్యం వంటి ప్రకటనలు బోలు చప్పుళ్లగానే, శుద్ధ వాచాలత గానే మిగిలిపోతాయి.

శ్రీశ్రీకి ‘మహాకవి’ అనే అగ్రతాంబూలం ఇవ్వాలని కొందరు ప్రయత్నించడం, వాళ్ళని మార్క్సీయులుగా, అగ్రవర్ణీయులుగా, నేటి నిజం చూడలేని కీటక (కాషాయ) సన్యాసులు…’గా అభివర్ణిస్తున్న కొందరు self-proclaimed దళిత ‘ముందుతరం దూతలు’ రగడ చేయడం చూస్తుంటే కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తోంది.

పశ్చిమబెంగాల్ సాహిత్య ప్రపంచంలో 1961- 65 మధ్య వచ్చిన ఉప్పెన- హంగ్రీ జనరేషన్. మన దిగంబర కవులకు మల్లే హంగ్రీ జనరేషన్ కవులు మలయ్‌రాయ్ చౌధురి, అతని సోదరుడు సమీర్‌రాయ్ చౌధురి, శక్తి చటోపాధ్యాయ, దేవీరాయ్ (హరధోన్ ధార) కూడా అమెరికా ‘బీట్ జనరేషన్’తో ప్రేరణ పొందారు(ట). పశ్చిమబెంగాల్ హంగ్రీ జనరేషన్, మన దిగంబర కవులూ, కొలంబియా Papelipolas, స్పానిష్ Generation – 68 వంటి కవి బృందాల ఆక్రోశం, ఆగ్రహాల్లో సారూప్యాలున్నాయి. Statusquo ని నడ్డి విరిచి, ధ్వంసం చేసి కొత్త దారి వేయాలన్న వారి ఉద్రేకాల్లో పోలికలున్నాయి. అటువంటి హంగ్రీ జనరేషన్ కవులలో ప్రదీప్ చౌధురి ఒకడు. మాతృభాష బంగ్లాతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచిలలో కూడా అదే స్థాయి అభివ్యక్తి ఉన్నవాడు.అందరిలోనూ బహుశా చిన్నవాడైనందు వల్లనేమో కొంచెం దుందుడుకువాడు కూడా. 13,14 ఏళ్లకే కవిత్వం మొదలెట్టి ‘చెడి’పోయాడు. నలభయేడేళ్లకే చనిపోయిన బీట్ కవి, రచయిత Jack Kerouac తో మమేకమైనవాడు. తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి ఢిల్లీ, అగర్తలాల్లో చదువుకున్న ప్రదీప్‌కి పాఠాలు చెప్పినందుకే కాదు, ప్రేరణ అయినందువల్ల కూడా మన త్రిపుర గురువు అయ్యారు, మిత్రుడయ్యారు, తరవాత సహోద్యోగి కూడా అయ్యారు (ప్రదీప్ కొంతకాలం జూనియర్ లెక్చరర్‌గా మహారాజా బీర్‌బిక్రమ్ కళాశాలలో పని చేశారు). ఈ గురుశిష్యుల మైత్రి ఆనాటి నుంచీ కొనసాగింది. త్రిపుర ఆత్మకథనాత్మక కవిత Segments(1975)ని ప్రదీప్ తాను నడిపే త్రిభాషాపత్రిక ‘స్వకాల్’ లో 1979లో ప్రచురించారు కూడా.

ఇక్కడ మన contextలో ప్రదీప్ కి సంబంధించిన ఒక విషయం చెప్పాలి. విశ్వకవి అయిన రవీంద్రుడు బెంగాల్ కి ఎంతముఖ్యుడో చెప్పాల్సిన పనిలేదు. రవీంద్రనాథ్ టాగోరు కీర్తిచంద్రికలతో పోలిస్తే, మన శ్రీశ్రీ ప్రభ వెలతెలబోతుంది. అక్కడ బెంగాలీయుల ఆలోచనలో, ఉద్వేగంలో, పీల్చే గాలిలో కూడా రవీంద్రత్వం సారస్వతంగా, సంగీతంగా కూడా వ్యాపించి ఉంటుంది. అటువంటి రవీంద్ర భావనని ప్రదీప్ ఎంతగా వ్యతిరేకించాడంటే, ఆ ప్రభావం నుంచి దూరం చేయడానికి తన కొడుకుని పశ్చిమబెంగాల్ కి దూరంగా మన ఆంధ్రాయూనివర్శిటీలో చదివించాడు కూడా.

అటువంటి ప్రదీప్ ని రవీంద్రుడి సాహిత్య సేవ గురించి మాట్లాడటానికి విశ్వకవి జయంతి సందర్భంగా ప్రధాన వక్తగా పిలిచారట (ఇది త్రిపుర గారు నాకు చెప్పిన సంఘటన) ఓ విద్యాసంస్థ నిర్వాహకులు. ఆర్భాటమైన ఆవరణ, మంద్రంగా రవీంద్ర సంగీతం, రంగులన్నీ అక్కడే పుట్టాయా అన్నట్టున్న శోభాయమానమైన ఆ ప్రాంగణం చుట్టూ ఒక చెయ్యి త్రిపుర భుజం మీద వేసి, మరో చేత్తో నాటు సారా ప్యాకెట్లు తాగుతూ కలియదిరుగుతున్నాడు ప్రదీప్. అప్పటికే నిలదొక్కుకోలేని స్థితిలో తప్పతాగి ఉన్న ప్రదీప్, త్రిపుర ఎంత వారించినా వినకుండా జేబులోంచి ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తీస్తూ తాగుతూనే ఉన్నాడు. సభ ఆరంభమై ముఖ్య అతిథి ప్రదీప్‌ను వేదిక మీదకి ఆహ్వానించారు నిర్వాహకులు. అతికష్టంమీద వేదిక మీద మైకు దగ్గరకు వెళ్లిన ప్రదీప్, భళ్లున పెద్ద వాంతి చేసుకుని,  ‘రవీంద్రుడు బెంగాలీ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి చేసిన కాంట్రిబ్యూషన్ పట్ల నా అభిప్రాయం ఇదే’ అన్నాడు(ట).

దీనితో పోల్చితే, మన దళితకవులు/ రచయితలు ఇప్పుడు శ్రీశ్రీ పీఠాధిపత్యం గురించి, తెలుగు ఆధునిక సాహిత్యానికి శ్రీశ్రీ కాంట్రిబ్యూషన్ గురించి చేస్తున్న రచ్చ ఏమంత పెద్దది కాదేమో. నిజానికి, అప్రతిహతంగా కొనసాగే పెద్దరికాలు, పీఠాధిపత్యాల్ని ఎదిరించడంలో శ్రీశ్రీ కూడా వెరవలేదు. ఇదే రవీంద్రుడి గురించి- ‘టాగూరు నా ఎల్లెర్జీ’ అన్నారు శ్రీశ్రీ. “గీతాంజలి- కవిత్వం వేషం వేసుకొచ్చి, వచనం కాని వచనభావాలను మాత్రమే నాలో ప్రసరిస్తుంది. ‘వాడేవీడు (పాంచ్ కడీదేవ్ డిటెక్టివ్ నవల)- ఏ మోసాన్నీ ప్రకటించకుండా, ‘నేను ఉత్త వచనాన్ని, చెత్త డిటెక్టివ్ నవలని…’ అని చెప్పుకొని నా చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ, పాపాన్నీ జ్ఞాపకం చేసి ‘మదశ్రుకణాళిహేతు ‘వవుతుంది,” అంటారు శ్రీశ్రీ (పేజి 223, శ్రీశ్రీ వ్యాసాలు- విరసం ప్రచురణలు). కాలక్షేపం నవలలు రాసిన పాంచ్ కడీదేవ్ కంటే రవీంద్రుడి స్థాయి గొప్పదేమీ కాదంటారు శ్రీశ్రీ.

“బెంగాలీ భాష నుంచి రకరకాల సంస్కారం దిగుమతి చేసుకున్న రోజులలో రవీంద్రనాథుడికి మనం ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ప్రశంస ఇచ్చాము,” అని సెప్టెంబర్ 5, 1948 తెలుగు స్వతంత్ర పత్రికలో శ్రీశ్రీ రాసిన వ్యాసం మీద దుమారం రేగింది. మన చలం గారి నుంచి, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట వంటి ఎందరి మీదో రవీంద్రుడు చూపిన ప్రభావం ఎంతో. అయినా, ఆ ఆధిపత్యంతో తలపడటానికి శ్రీశ్రీ వెరవలేదు. ‘శ్రీశ్రీవి ప్రిజుడీస్’ అని చలం గారు వ్యాఖ్యానిస్తే, ‘గొప్పవాణ్ణి తిట్టడం ద్వారా గొప్పదనం సాధించాలనే పూనిక…’ శ్రీశ్రీకి అంటగట్టాడు మరో విమర్శకుడు. అదే ఏడాది డిసెంబర్ 13 తెలుగు స్వతంత్ర సంచికలోనే సమాధానం రాశారు శ్రీశ్రీ. రవీంద్ర గీతాంజలిలో ఆధ్యాత్మికత మీద అయిష్టం, ఆగ్రహం ఉండటానికి శ్రీశ్రీ నాస్తికత్వం, వామపక్షత్వం కారణాలు కానేకావని తేల్చి చెబుతుందా వ్యాసం. కవిత్వంలో ఆధ్యాత్మిక సౌందర్యం టాగూరులోనే చూడనక్కరలేదని, ‘శ్రీనాథుడి కవిత్వంలో కస్తూరి పరిమళాలు, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకములోని సౌందర్య ఝంఝ, వేమన వేసిన ఒక్కొక్క వెర్రికేక వంటి దాఖలాలెన్నో మనకున్నా’యనీ అంటారు శ్రీశ్రీ. మరో అడుగు ముందుకేసి, వస్తు రూప సారూప్యతలో వడ్డాది సుబ్బారాయుడు రాసిన ‘భక్త చింతామణి ‘ ‘గీతాంజలి’కి ఎంతమాత్రం తీసిపోదంటారు శ్రీశ్రీ, ఆ వ్యాసంలో. బెంగాలీ ‘గీతాంజలి’లో ఛందస్సులతో ఎన్నోప్రయోగాలు చేసిన రవీంద్రుడు, ఇంగ్లీషు తర్జుమాలో వచన కవిత్వాన్ని వాడుకున్నారని, ఛందస్సులో ఆయన ఒక్క ఆంగ్లగీతం కూడా రాయలేదని, అందుకు కారణం ఆంగ్లఛందస్సుల మీద అధికారం లేకపోవడమేనంటారు శ్రీశ్రీ.

“ఉదయశంకర్ చిందుల్ని చూసి ఇదే భారతీయ నాట్యకళ అనుకున్న పడమటి దొరలు లేరూ… ” అని అంత oriental  దృష్టిని  ప్రదర్శించిన అదే శ్రీశ్రీ, ఎడార్ అలెన్ పో, మొపాసా, బాదెలేర్- తన రుషిత్రయమని కూడా ప్రకటించారు. ఇక రవీంద్రుడి గురించి వ్యాఖ్యానిస్తూ, ఆయనని కాళిదాసు సరసన కాదు సరికదా, షేక్సిపియర్, ఇబ్సెన్ ల పక్కన కూడా నిలపలేమని అంటారు. సాహిత్యం దగ్గర ఆగకుండా, సాహిత్యేతర అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, టాగూరుకి ఆధునిక ప్రచార సాధనాలను వాడుకోవడం బాగా తెలుసని అంటారు శ్రీశ్రీ (తన పరిశీలన చెప్పేనాటికి రవీంద్రుడి ‘కెరీరిజం’ మీద పుస్తకాలేమీ రాలేదు). దక్కవల్సిన దానికంటే ఎక్కువ ప్రశంసని రవీంద్రుడు పొందటానికి ఆ publicity management  నైపుణ్యమేనని శ్రీశ్రీ విసురు.

ఇప్పుడు తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, ఇండస్ మార్టిన్ వంటి కొందరు దళిత కవులు/ రచయితలు కూడా అంటుంది అదే అనుకుంటా-  శ్రీశ్రీకి దక్కవల్సిన ప్రశంస కంటే ఎక్కువ దక్కుతుంది. తమతమ వర్గ, వర్ణ ప్రయోజనాల కారణంగా శ్రీశ్రీ అగ్రపీఠత్వాన్ని dogmatic గా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న శక్తుల్ని వ్యతిరేకిస్తూ, శివసాగర్, మద్దూరి, పైడి, కలేకూరి వంటి దళిత కవులకి దక్కవల్సింది దక్కడం లేదని ఆక్రోశిస్తున్నారు. అయితే, దళితవాదుల వ్యతిరేకతలో ఆర్భాటమే గానీ, అవగాహన, వాదనా పటిమ కనిపించడం లేదు.

శ్రీశ్రీ కంటే శివసాగర్ ఎక్కువ, మద్దూరి మహాకవి, తెలుగు కవిత్వంలో కలేకూరికి ముందు వెనక శూన్యం వంటి ప్రకటనలు బోలు చప్పుళ్లగానే, శుద్ధ వాచాలత గానే మిగిలిపోతాయి. ‘శ్రీశ్రీ నడయాడిన నేల మీద నేనూ తిరుగాడినందుకు గర్విస్తున్నాను’- తరహా శ్రీశ్రీ వీరారాధకుల ప్రకటనలు ఎంత విలువైనవిగా దళితవాదులు చూశారో, దళిత రచయితల వాగాడంబరమూ అంతే చులకనకి లోనవుతుంది. శ్రీశ్రీ పరిమితి గురించి మాట్లాడాలంటే, విస్తృతి గురించి అంతకంత అవగాహన ఉండాలి. ఆయనని బ్రాహ్మడిగానో, వామపక్షీయుడిగా మాత్రమేనో గుర్తిస్తే, నష్టపోయేది దళితవాదమే.

శ్రీశ్రీ శతజయంతి (2010)సందర్భంగా కవితా (సాహితీమిత్రులు- విజయవాడ) సంచికలో ఇలా రాశాను:

“శ్రీశ్రీకి సాహిత్యం ఒక ఎడతెగని అన్వేషణ. ‘కవిత్వమొక తీరని దాహం’ అన్నది కేవలం ఒక కవితాపంక్తి కాదు. ఆయన సహజాత రసాత్మని ప్రతిఫలించే పతాకశీర్షిక. ఆయన కావ్యస్వప్నం సఫలీకృతం కావటానికి ప్రపంచం నలుమూలలా స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా వెదుకులాడాడు. ‘నా హృదయం నిష్కల్మషంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. ఆ హృదయం మీద ప్రతి గీతాన్ని చేర్చుకొని చూస్తాను. ఏమాత్రం స్పందన తోచినా ప్రకటిస్తాను (పేజీ 142, శ్రీశ్రీ వ్యాసాలు- విరసం ప్రచురణలు),’ అని ఆయన చేసిన ప్రకటన పరమసత్యం. అలా ఆయన హృదయపుటం మీద నిగ్గుతేల్చి తిక్కన, వేమన, గురజాడలను మహాకవులుగా ఎలుగెత్తటం సమగ్రదర్శనంగా అందరూ అంగీకరించక పోవొచ్చేమో గానీ, ఆయనది ‘సూత్ర విమర్శ..’ మాత్రం కాదు. విశ్వనాథ, కృష్ణశాస్త్రి ప్రభావంలో సాహితీయాత్ర ప్రారంభమైన నాటి నుండి, సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్ ప్రభృతులను ప్రజాకవులుగా కీర్తించే చివరి దశ వరకూ కూడా కవిత్వాన్ని ఎన్నడూ ఆయన ‘వ్యక్తిగత అభిరుచి..’ ప్రమాణాల ద్వారా తూచలేదు. కమ్యూనిజం ఆయన దృష్టిని ఎప్పుడూ పాక్షికం చేయలేదు.

“సెప్టెంబర్ 1981లో మో సంపాదకత్వంలో వచ్చిన ‘దిస్ టెన్స్ టైమ్స్’ (ఆధునిక తెలుగు కవిత్వం ఆంగాల్నువాద) గ్రంథావిష్కరణ సభలో కావ్య స్వీకర్తగా మాట్లాడుతూ, గురజాడతోనే ఆధునిక కవిత్వం ప్రారంభం కాలేదని, చెళ్లపిళ్ల కవుల శతావధానాలు కూడా ఒక విధంగా ఆధునికకవిత్వానికి మాతృకలేనని, వేంకట పార్వతీశం కవుల గ్రంథాల నుంచి కూడా ఆధునిక కవిత్వాన్ని ఎంపిక చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

“వెనకటి గ్రంథాలు చదవని వాడెవ్వడు ఈనాడు సరసమైన సాహిత్య రచన చెయ్యలేడు. ఇదివరకు వేయబడిన గట్టిపునాదుల మీదనే ఈనాటి సాహిత్య సౌధం నిర్మించబడుతుంది… ”

శ్రీశ్రీని తక్కువ చేస్తూ, మరి కొందరిని తలకెత్తుకుంటున్న దళితవాదులు విస్మరించడానికి వీల్లేనిది ఇదే. నన్నయ ఆడంబరం, తిక్కన విస్తృతి, పోతన శబ్దలౌల్యం, పెద్దన భావచౌర్యం, వేమన సామర్థ్యం, గురజాడ వైశిష్ట్యం… అర్థం చేసుకొని, ఇంకా కవి చౌడప్ప నుండి, రాయప్రోలు, అబ్బూరి, బసవరాజు, నండూరి, విశ్వనాథ, దేవులపల్లి, కవికొండల నుంచి, ఆరుద్ర, అనిశెట్టి మీంచి, దిగంబర కవులు, విప్లవ కవుల వరకూ, ఇంకా ఫ్రెంచి, ఆంగ్ల, జర్మన్ పురానవ కవుల వరకూ అనంతమైన సాహిత్యాన్ని ఔపోసన పట్టిన మహా సాహితీ మేరునగం- శ్రీశ్రీ పరిమితులు చెప్పడానికి దళితవాదులు ఇప్పుడు చేస్తున్న లోతులేని, సారహీనమైన ప్రయత్నాలు ఎంత మాత్రం చాలవు.

*

Avatar

నరేష్ నున్నా

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఎక్కువలు తక్కువలు కాకుండా ఎవరి కవిత్వం ఎంత ప్రభావం చూపుతోంది
  ఏ సమాజం వైపు దిశా నిర్దేశం చేస్తోంది ఆలోచించు కోవాలి ! ఇప్పటి కి
  మనం అలి శెట్టి ప్రభాకర్ ని, కలేకూరి ని తలుచు కున్నాం అంటే
  వారి ది
  శక్తి వంత మైన కవిత్వమని అర్థ మవుతోంది కదా !
  కవి కీర్తి అతని ప్రతిభ నిజాయితీ ల ని బట్టి ఉంటాయి ! శాలువా లు బట్టి కాదు

  • కవిత్వం చూపే ప్రభావం, అది చేసే దిశానిర్దేశం, దాని శక్తిమంతనం … వగైరాల మీద నాకు మీతో ఏకీభావం లేదు Mula గారూ. శాలువాల మీద మీ అభిప్రాయమే నాదీనూ.

 • ఒక అభిప్రాయాన్ని ఇంత నిష్కర్షగా చెప్పటానికి
  దమ్మూ ధైర్యముండాలి..
  అభినందనలు సర్

 • Thank you sir for expanding the protocols of the criticism. I believe that your essay points to the need of sharpening the critical tools to assess the contribution of Sri Sri to Telugu language and literature.

 • మంచి విశ్లేషణ… అందరూ అంగీకరించకపోయినా ఈ గొప్ప కవులను వెలకట్టడం అనేది కులం ప్రాంతం మతం ఇంకా వారి వ్యక్తి గత జీవితం ప్రాతిపదికన కాకుండా వారి కవిత్వం బట్టి వుండాలి.ఇది పైనుంచి కిందికి vertical కాకుండా పక్క పక్కనే , horizontal గా వుండాలి.కవి వాడే ప్రతీకలు అతని నేపథ్యం బట్టి వుంటాయి…అవి ఎంత తీవ్రంగా భావాన్ని బాథనీ అభ్యుదయ మార్గం లో పరిష్కారం సూచించడం బట్టి అతన్ని మూల్యాంకనం చేయాలి.మన స్వంత నేపధ్యం లో ని ద్వేషాన్ని బట్టీ, అసహనం తోనూ కాదు. తెలుగు కవిత్వానికి వీరందరూ ముఖ్యమే.

 • You have courageouly reopened a pandora’s box. Hope and pray that all the evils and miseries do not start over to afflict you. Couldn’t agree with you more! Enjoyed reminding me of the Bengali Hungry Generation. Congratulations on your outspokenness, Naresh Nunna!

  • Veluri varu,
   Thank you sir. The actual evil and misery is the foray of the contemporary Dalit poets/ writers and the people in the bandwagon of solidarity, who plod not to go through the article. It seems, they scare that the slings and arrows of their ‘critical’ reaction on my article may get influenced by its text. 🙂

 • ప్రపంచ సాహిత్య చరిత్రలో నే దళితులు జీవితం చిత్రం భిన్నమైనది. దాన్ని అందకొనే తూకపు రాళ్లు మీదగ్గర లేవు‌. మీకు అర్థమూ కాదు.

  • తిరుపాల్ గారూ…
   శ్రీశ్రీ తన కావ్యస్వప్నం సఫలీకృతం కావటానికి ప్రపంచం నలుమూలలా స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా వెదుకులాడాడు; సాహిత్యం అంతటి తీరని దాహం చేసుకున్న దళితసాహిత్యకారులు మాత్రమే శ్రీశ్రీని reappraise చేయడానికి అర్హులు- అన్నదే నా ప్రతిపాదన తిరుపాలు గారు. పునర్నిర్వచించబడిన/ బడుతున్న Dalit aesthetics/ poetics ని ఆకళింపు చేసుకుంటున్న దళితవాదుల కొరత తెలుగు సాహిత్యలోకానికి ఉందని, దానికి తగ్గ చదువు దళిత ప్రతినిధులకి ఉందని నా ఆరోపణ. కానీ, మీరు నా దగ్గర లేని వాటి గురించి మాట్లాడుతున్నారు, పొంతన లేకుండా.

   • “దానికి తగ్గ చదువు దళిత ప్రతినిధులకి లేదని నా ఆరోపణ. “- ఉందని అని వచ్చింది పై కామెంట్ లో

 • ఉమ్మడి పాపం-శ్రీశ్రీ’ దేశ చరిత్రలు’
  కమ్యూనిస్టులు, దళిత వాదులు, హిందుత్వ వాదులు అందరిని ఒకటి చేసేదే వలస చారిత్రక దృష్టి.అది వుమ్మడి మహా పాపం. దానివల్లనే యింత ముస్లిం వ్యతిరేకత.
  శ్రీ శ్రీ కసాయిబు పదసృష్టి వెనుక అంబేద్కర్ ప్రభావం ఉందా?
  అంబేద్కర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలోనే కాదు చివరి పార్లమెంటు ప్రసంగంవరకు ముస్లింలని ప్రమాదకర ఫండమిస్టులు గా చిత్రి౦చాడు అనేది కఠిన వాస్తవం.
  నిజానికి వలసవాదులు ప్రచారం లోకి తెచ్చిన చరిత్ర భావనతోనే ముస్లిం వ్యతిరేకత ఉంది. వలస పాశ్చాత్య[క్రిస్టియన్] సానుకూలత ఉంది. జేమ్స్ మిల్ హిందూ యుగం ముస్లిం యుగం అని మతపరం గా యుగవిభజన చేసి తెల్లోల్లకాలాన్ని మాత్రం బ్రిటిష్ యుగం అన్నాడు.అంటే యింగ్లీషు వాళ్ళే సెక్యులరిజానికి మూలం అన్న మాట.
  వందేమాతరం రాసిన బంకించంద్ర ఛటర్జీ యింగ్లీషు దొరల్ని దేవుడు ముస్లిం నియంతృత్వం నుంచి విముక్తి కోసం పంపారన్నాడు. బ్రాహ్మణ సంస్కర్తలే కాదు జ్యోతిబాఫూలే అంబేద్కర్ లాంటివాళ్లు తెల్లోళ్ళపాలనని కీర్తించారు.ముస్లింలని గర్హించారు .
  శ్రీశ్రీ పురాణం ప్రతీకలు వాడాడని గోలపెట్టే దళిత ముస్లింవాదులు శ్రీ శ్రీ దేశచరిత్రలు కవితని ఎందుకు విమర్శించరు?ఎందుకంటే వాళ్ళు ఆతానులోని గుడ్డలే మరి.
  ఇటీవల జనరల్ డయ్యర్ దేశప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వందేళ్లు ఐన సందర్భంలో బిజెపి సరిగా స్పందించలేదు అని విమర్శలు వచ్చాయి.ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ బిజెపిని నిలదీశారు.ఈ సందర్భంగా బిజెపి దేశభక్తి ప్రశ్నకి గురి అయింది.
  నిజానికి మెకాలే మానస పుత్రులైన మనవాళ్ల దృష్టిలో ముస్లింవ్యతిరేకత,పాశ్చాత్య అమెరికా భక్తియే దేశభక్తి.
  అందుకే శ్రీశ్రీ దేశచరిత్రలు కవితలో గజని; గోరీ లాంటి ముస్లింనియంతలని మహా హంతకులు అన్నాడే కానీ డయ్యరో మరో యింగ్లీషు పేరో ప్రస్తావించలేదు.ఈ విషయాన్ని ఏతెలుగు వెధవ ప్రశ్నించలేదు.
  ‘మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్ -గురజాడ
  వచ్చెనిదే[యింగ్లీషు దొరల] బంగారు కాలం-గురజాడ.
  గురజాడ నా అడుగు జాడ -శ్రీశ్రీ

 • చక్కని ఆలోచింవచేసిన విశ్లేషణ

 • దళిత వాదానికి శ్రీ శ్రీ కి ఏమిటి సంభంధం. దళిత వాదం అరువు తెచ్చుకున్న సాహిత్యం మీద పుట్టలేదు, పెరగనూ లేదు. అరువు తెచ్చుకున్న మూస కమ్యూనిస్టుల మద్దతో బ్రతకలేదు.

  కారంచేడు నుండి గరగపర్రు వరకూ మా అడుగులో అడుగువేసి కలగాపులగం చెయ్యడానికి ప్రయత్నించారే తప్పా మీ ప్రతిభ ద్వారా సాధించింది ఏమీలేదు.

  ఏమీ లేనప్పుడు ఇక నష్టపోయేది ఎక్కడ?

 • దళిత వాదానికి శ్రీ శ్రీ కి ఏమిటి సంభంధం. దళిత వాదం అరువు తెచ్చుకున్న సాహిత్యం మీద పుట్టలేదు, పెరగనూ లేదు. అరువు తెచ్చుకున్న మూస కమ్యూనిస్టుల మద్దతో బ్రతకలేదు.

  కారంచేడు నుండి గరగపర్రు వరకూ మా అడుగులో అడుగువేసి కలగాపులగం చెయ్యడానికి ప్రయత్నించారే తప్పా మీ ప్రతిభ ద్వారా సాధించింది ఏమీలేదు.

  ఏమీ లేనప్పుడు ఇక నష్టపోయేది ఎక్కడ?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు