వెన్నెల కురిసిన కాలం

వేరా బార్ నుండి రూమ్‌కి వెళ్తున్నాను. మత్తుగా ఉందంతా. చిత్తుగా తాగిన తర్వాత ఈ మాత్రం మత్తు లేకపోతే ఇక తాగడమే దండగ. రోడ్డు మధ్యలో నడుస్తున్నాను. ఇప్పుడు భయం లేదు. నాలో ఉన్న భయమంతా ఎటో ఎగిరిపోయింది. లేదు.. లేదు.. నాలుగు పెగ్గుల మాన్షన్‌హౌస్ పవర్ ఇదంతా. ఓహ్ గాడ్! ఈ రాత్రి ఆ పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రాకుండా దీవించు! దీవిస్తావా, లేదా చిన్నప్పటి నుండి వీడు నన్ను మొక్కనే లేదని లైట్ తీసుకుంటావా? అలా మాత్రం చెయ్యకు ప్లీజ్! ఈ దుఃఖానికి విరామం లేకపోతే పిచ్చోణ్నవుతాను. అందుకే ఈ ఒక్క సాయం చెయ్.

హా…! ఘాటుగా పొగ వాసన. పాన్ డబ్బా దగ్గర ఒకడు రెండు సిగరెట్లు వెలిగిస్తున్నాడు. అది నాకోసమేనా? నా దగ్గరికి వచ్చి తీసుకోమని ఆఫర్ చేస్తే బావుండు. జేబులో సిగరెట్లు లేవు. కొనడానికి పైసలూ లేవు. ఈ రాత్రి ఎలా గడుస్తుందో దేవుడికే తెలియాలి. సిగరెట్ పొగ అలా లాగుతుంటే పెచ్చుపెచ్చులుగా రాలిపోతుంది దుఃఖం.

వాడు నా వైపే వచ్చాడు. కానీ నా పక్కనోడికి ఇచ్చాడా సిగరెట్. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఛీ! మనిషిలో మానవత్వం లేదు. ఒకడి దుఃఖం మరొకడికి సంతోషాన్ని ఇస్తుంది తప్ప బాధని ఇవ్వట్లేదు. ఈ పిచ్చిలోకం నుండి వెళ్ళిపోయినా పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. నిజంగా యమలోకమూ యముడన్నవాడూ ఉంటే వాడికి చెప్పాలి. రేయ్! ఈ నరకం నాకు ఆఫ్ట్రాల్‌రా! కింద ఇంతకంటే పెద్ద నరకమే చూశానని.

అడుగులో అడుగులేసుకుంటూ పోతున్నాను.

తడబాటు.‌.

జీవితమంతా ఇదే తడబాటు..

నచ్చినట్టుగా సాగని జీవితం..

ఇష్టమైనట్టు బతకనివ్వని మనుషులు..

రేపు ఎప్పుడైనా నడిచొచ్చిన దారి వైపు చూస్తే, ఇలాంటి బతుకు బతికామా అని బాధపడతానన్న భయం..

ఈ రోడ్డు మీదనే ఏ నొప్పీ తెలియకుండా నా కథ అంతమైతే బావుండు. శాంతి.. శాంతి.. శాంతి! కాస్త రిలాక్స్‌డ్‌గా ఉన్న వెంటనే జ్ఞాపకాలు వచ్చి దాడి చేస్తాయి. ఇంకెక్కడి శాంతి? గాయాలు పాతవే అయినా ప్రతి రాత్రి వాటిని కొత్తగా అనుభవించాల్సి ఉంటుంది.

ఎలాగోలా ఏ లారీ కిందో, కారు కిందో పడి పచ్చడవ్వకుండానే రూమ్‌కి వచ్చాను. పచ్చడయ్యి మరణిస్తే ఏంటి? ఈ దుఖం నుండి బయటపడతాను. కాదు, అస్సలే కాదు. మరణించడంలో బాధ ఉంటుంది. అది ఇంకా కష్టం. ఏ నొప్పీ తెలియకుండా మరణం ఉంటే ఇక్కడిలా జీవించేదెవరు? ఎవరూ మిగిలేవారు కాకపోవచ్చు. చిన్న గాయానికే టపీమని మాయమయ్యేవాళ్ళు అందరూ.

కిటికీ తెరిచాను. చల్లటి గాలి. గతకాలపు గాయాలన్నీ నన్ను వెనక్కి లాగుతుంటే ఈ ప్రకృతి మాత్రం ఏదో తెలియని ఆశ చూపి నన్ను ముందుకు నడిపిస్తుంది. అవునూ! ప్రకృతి చాలా గొప్పది. రెక్కలే లేని మనిషికి కూడా రెక్కలివ్వగలదు. బతికే ఆశ చూపగలదు. తాగిన మత్తు మెల్లగా దిగిపోతోంది. మత్తు దిగిపోయే కొద్దీ గాయం పచ్చిగవుతోంది. నిజమేనా? ఏమో? ఇప్పటికైతే నిజమే అనిపిస్తుంది. కిటికీ దగ్గర నుండి మంచం వైపు వచ్చాను. మంచం చుట్టూ పుస్తకాలు. బాధని, దుఃఖాన్ని చెరపలేని పుస్తకాలు. ఎవడికుపయోగం? నవ్వొచ్చింది. ఆ పుస్తకాల మధ్య నేను రాసుకున్న కవితల పుస్తకం కనిపించింది.

“నాకొక ఆశ

అలలు లేని సంద్రం

అమవాస లేని గగనం

అదే నీ జీవితమవ్వాలని

నీ గతమంతా అబద్ధమైపోవాలని”

అనేకసార్లు ఈ కవిత చదువుకున్నాక నేనూ, తనూ, హైదరాబాద్ రోడ్లూ గుర్తుకొచ్చాయి.

 

@ @ @

 

కృష్ణానగర్ గడ్డ మీద తన కోసం ఎదురుచూస్తున్నాను. ఊరూ పేరు తెలియని ఒక అమ్మాయి కోసం ఈ ఎదురుచూపులు. కోరికలంటే అంతే! ఎక్కడివరకైనా తీసుకెళ్తాయి. ఏ చీకటిలోనైనా వదిలేస్తాయి. కిరణ్‌గాడు పక్కనే ఉన్నాడు. అయినా నాకు కొంచెం భయంగానే ఉంది. వాడు చాలా నార్మల్‌గా సిగరెట్ వెలిగించి నాకిచ్చాడు.

“ఒక్కరోజు పరిచయంలోనే తను నీ రూమ్‌కి వచ్చిందా?” అని అడిగాను.

“మళ్ళీ మళ్ళీ ఎందుకడుగుతున్నావురా?” అన్నాడు వాడు.

“సరే గానీ, ఇప్పుడైతే నాతో రూమ్‌కి వస్తదిగా?”

“పక్కా వస్తది. కానీ పనికి ముందు రేపు మూవీకి తీసుకెళ్తావా అని అడుగుతుంది. ఆఫీస్ ఉందని సొల్లు చెప్పకుండా సరే అను. పని ఈజీగా అయిపోతుంది. మనం ఇప్పుడు జస్ట్ కలవడానికే రమ్మన్నాం కాబట్టి తనని లైన్లోకి తీసుకురావడం నీ మీదనే డిపెండై ఉంటది.”

“సరే” అన్నాను.

గట్టిగా ఓ దమ్ము లాగి మళ్ళీ అడిగాను, “జూనియర్ ఆర్టిస్ట్‌లు అందరూ ఇంతేనారా?”

“అందరూ కాదు” అన్నాడు.

అవును! సినిమా మనసుని దేని మీదా నిలకడగా ఉండనివ్వదు, ఒక్క సినిమా మీద తప్ప. ఒక్కసారి సినిమా మీద ఆకర్షణ కలిగితే ఏ దారిలో నడిచినా చివరకు సినిమా దారివైపే వస్తారందరూ. ఇదొక యుద్ధం.

గెలిచినవాళ్ళ కథలు తెర మీద కనిపిస్తాయి. ఓపిక లేని వాళ్ళ కథలు కృష్ణానగర్‌లోనే అంతమవుతాయి. అయితే తనిక్కడికి సినిమా మీద ఆకర్షణతోనే వచ్చిందో లేదో తెలియదు. తను ఎలా వచ్చినా, తను ఎలాంటి అమ్మాయి అయినా సరే, తననీ తన వ్యక్తిత్వాన్ని మార్చేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారని మాత్రం తెలుసు. కాసేపటి తర్వాత ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూపించి తనే అన్నట్టు సైగ చేశాడు కిరణ్.

తను దగ్గరకొచ్చేకొద్దీ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. అందం కాదు గాని, తనలో ఏదో ఆకర్షణ ఉంది. దుఃఖంలో ఉన్నవాళ్ళని కూడా సంతోషపెట్టగలదు ఆమె నవ్వు. ఏ మొహమాటమూ లేకుండా దగ్గరకొచ్చి నా చేయి తీసుకుని షేక్‌హ్యాండ్ ఇస్తూ “నువ్వేనా వీరా?” అంది. కిరణ్‌గాడు అవునన్నట్టు సైగ చేశాడు.

“కిరణ్ నా గురించి ఏమని చెప్పాడు?” అంది తను. అస్సలు ఊహించలేదు తనలా అడుగుతుందని. ఏం జవాబివ్వాలో అర్థం కాలేదు. అన్నీ తెలిసినట్టుగా ఆమె చూపులు. తీయ్! నీలో ఉన్న విలన్ యాంగిల్ని బయటపెట్టు అని అడుగుతున్నట్టున్నాయి. నేను నటిస్తున్నానని, ఆమెతో కేవలం సెక్స్ కోసమే నేనిప్పుడు ఆమె ముందు నిలబడ్డానని తనకు అర్థమైనట్టు అనిపించింది.

అంతలో కిరణ్‌గాడు అందుకున్నాడు. “ఏం చెబుతానే? నాకొక అందమైన ఫ్రెండ్ ఉందని చెప్పి తీసుకొచ్చా” అన్నాడు. అప్పటివరకు ఆమెలో ఉన్న ఉత్సాహం కాస్తా చల్లబడింది. నా చేతిని వదిలేసింది. ఛాయ్ తాగుతారా అని అడిగి లైబాస్ కేఫ్ దగ్గరకు తీసుకెళ్ళింది. తనే బిల్ కట్టి చాయ్ కప్పులు తెచ్చింది.

నిజమే! తను పైసలిస్తే వస్తుందని, కొన్నిసార్లు పైసలు పెట్టకుండా కూడా పని కానివ్వొచ్చని కిరణ్ గాడు చెప్పాడు. అందుకే కదా తనివన్నీ చేస్తున్నా నేను సిగరెట్ కాలుస్తూ మౌనంగా ఉన్నాను. అదే తనిలా కాదని వాడు చెప్పి ఉంటే అప్పుడు మనలో ఉన్న నటుడు బయటకొచ్చేవాడు.

“లేదు, నేను బిల్ పే చేస్తా”, “నువ్వు అక్కడ కూర్చో నేను చాయ్ తీసుకొస్తా. నీకెందుకు ఇబ్బంది?” అంటూ సొల్లు చెప్పేవాడు. మన మనసులో గౌరవమే లేనివాళ్ళ దగ్గర ఎందుకు నటిస్తాం?

ఫుల్ చాయ్ షేర్ చేసి చేతికిచ్చింది. “చాలా హెవీగా రెడీ అయ్యావ్. ఏంటి కథ?” కిరణ్‌గాడు అడిగాడు.

“పబ్బుకెళ్తున్నారా! టింకూకి తెలిసినవాళ్ళు. రెండు వేలు ఇస్తామన్నారు. నాకూ కొంచెం టైట్‌గానే ఉంది. అందుకే వెంటనే ఒప్పేసుకున్నా. గోవా ప్లాన్ కూడా ఉందంట, పదిహేను వేలు ఇస్తామన్నారు” అంది.

“ఎవరో తెలియకుండా ఎలా వెళ్తున్నావే అంత ధైర్యంగా?”

“వీళ్ళందరూ పెద్ద పీకుడుగాళ్ళేం కాదురా! తాగిన తర్వాత రెండు నిమిషాల పని. ఆ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే సాల్.”

“కొంచెం తేడాగాళ్ళు తగిలితే?”

“కాస్త గట్టిగా మాట్లాడితే ఎవడైనా భయపడతాడు. మొన్న గోవా పోయినప్పుడు ఒకడింతే! బాగా కతలు పడ్డాడు. నీ ఫ్రెండ్స్ అందరికీ నీకు లేవట్లేదని చెబుతా అన్నాను. ఉచ్చపోసుకున్నాడు కొడుకు. ఆ తర్వాత నా పక్కన కూర్చోడానికి కూడా ఒణికిపోయాడు.”

ఆమె మాటలకి నవ్వుకుంటూ సిగరెట్ వెలిగించాడు కిరణ్. నేనూ ఆమెతో మాటలు కలిపాను. ఏ ఆలోచనలూ, హద్దులూ, భయాలూ ఏవీ లేకుండా నేను మాట్లాడిన ఒకే ఒక్క అమ్మాయి తనే కావొచ్చు. కాసేపటి తర్వాత ఎవరో కారెక్కి వెళ్ళిపోయింది. రేపు మాట్లాడదాం అని కిరణ్ కూడా అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి..

వీధిదీపాల మధ్య ఒక్కణ్నే నడుస్తూ వెళ్తుంటే తను ఇంకా నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు తోచింది. ఆమె తన బాధల్ని కూడా నవ్వుతూ చెప్పగలదు. తనతో సెక్స్ ఎంత సుఖాన్నిస్తుందో తెలియదు గాని, తన మాటలు మాత్రం నొప్పి తెలియకుండా గాయాల్ని చెరపగలవు.

రాత్రి నిద్ర పట్టలేదు. ఆ తర్వాత రోజు కొంచెం లేటుగా ఆఫీస్‌కి వెళ్ళాను. అన్నీ తన ఆలోచనలే. తనలాంటి అమ్మాయి నాకెప్పుడూ ఎదురుపడలేదు. తను డబ్బుల కోసం బట్టలు విప్పే అమ్మాయని తెలిసినా ఎందుకో తన మీద ఏదో తెలియని ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఇది కచ్చితంగా తనతో సెక్స్ చేయాలన్న కోరిక మాత్రం కాదు. ఇంకేదో, బహుశా తనతో నేను స్నేహాన్ని కోరుకుంటున్నాను కావొచ్చు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన వెంటనే మళ్ళీ నా మీద నాకే చిరాకేస్తుంది. తనతో స్నేహం ఏంటి? ఎంతమంది తనని ఏ విధంగా అనుభవించారోనన్న ఆలోచనలు కోపం తెప్పిస్తున్నాయి.

నేనిలా ఆలోచిస్తున్నానని కిరణ్‌గాడికి తెలిస్తే? నవ్వుతాడు. పని పూర్తయిన తర్వాత అది ఎవరో, నువ్వు ఎవరో అనుకోవాలి తప్ప ఇలా పిచ్చోడిలా ఆలోచించకూడదని చెబుతాడు. అవునూ! ఇలా ఆలోచించకూడదా? ఎందుకు ఆలోచించకూడదు? తన నుండి నాకు సెక్స్‌‌ని మించి ఇంకేదో కావాలనిపిస్తుంది.  కానీ అదేంటో అంతుపట్టట్లేదు. తన మీద జాలితో ఇలా ఆలోచిస్తున్నానా అనుకున్నాను చాలాసార్లు. కానీ కాదు. జాలైతే తను హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడ్ని కానీ, తను నాకు తోడుగా నా పక్కనే ఉండాలని ఆశపడేవాడ్ని కాదు. తల బరువెక్కింది. ఆఫీస్ నుండి టీస్టాల్‌కి వచ్చాను. కాసేపు ఈ లోకంలో ఉందామంటే కుదరదే! నేనీ లోకాన్ని పూర్తిగా మర్చిపోయి తన ఆలోచనల చుట్టూ తిరుగుతున్నాను. తను నాలోనే ఉన్నట్టు, నేను తన నుండి వేరు కాలేనట్టు అనిపిస్తుంది.

ఆమె చూపులు జీవితాన్ని పూర్తిగా చదివేసినట్టు ఉంటాయి. అవతలి మనిషి ఆలోచనలను ఇట్టే కనిపెట్టగలవు. కానీ ఆమె కళ్ళల్లో కొన్ని వేల కథలు కనిపిస్తాయి. దీనికి తోడు ఆమె నవ్వుతూ ఉంటుంది, ఏ బాధా లేనట్టు. ఎలా వచ్చింది ఆమెకింత ధైర్యం?

ఏమో? ఇప్పుడు తనతో మాట్లాడాలని ఉంది. కానీ కుదరదు. సాయంత్రం వరకూ ఆగాల్సిందే! ఒకవేళ తను ఈరోజు కలవడం కష్టమని చెబితే? నో.. అలా మాత్రం అస్సలు జరగకూడదు. ఒకవేళ జరిగితే?

రాత్రి.. చీకటి.. తన ఆలోచనలు.. నరకం..

రేయ్ పిచ్చోడా! ఒక్కరోజు పరిచయానికే ఇంత వీకయ్యావ్ ఏంట్రా అని లోపల ఎవడో గునుగుతున్నట్టు ఒకటే గోల. ఎందుకూ? ఎందుకింత బలహీనపడుతున్నాను? సమాధానం దొరకట్లేదు. ఫోన్ రింగయ్యింది. అన్‌నోన్ నెంబర్. లిఫ్ట్ చేశాను.

“హెలో! వీరా!”

తనే.. తనే.. తనే.. నా మనసుని చదివేసినట్టుంది తను.

“నేనూ.. నిత్యని.”

‘పేరు చెబితేగాని తెలుసుకోలేననుకున్నావా పిచ్చిదానా? నీతో మాట్లాడడం కోసమే నిమిషాలను కూడా లెక్కేసుకుంటూ గడుపుతున్నానే. ఈరోజు కలవడం కుదరదని మాత్రం చెప్పకు ప్లీజ్!’ అని మనసులో అనుకున్నాను. కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుని జవాబిచ్చాను.

“హా! చెప్పు నిత్యా!”

“సాయంత్రం కలుస్తావా?”

“సరే”

“కిరణ్‌ని తీసుకురాకు. ఒక్కడివే రా!”

ఎందుకు, ఏమిటి అని అడగాలనిపించలేదు.

“ఓకే”

“ఇదే నా నెంబర్. సేవ్ చేసుకో”

“ఓకే”

“ఏమన్నా చెప్పాలా నువ్వు?” అని అడిగింది.

ఎంతో చెప్పాలని ఉన్నా ఏమీ చెప్పలేక “లేదు” అని సమాధానమిచ్చాను. తను సరే అని ఫోన్ కట్ చేసింది.

సాయంత్రం కలవాల్సిన మేము, తనకి వేరే పనులుండటం వల్ల రాత్రి 11 గంటలకు కలుస్తున్నాం. తనింకా రాలేదు. కృష్ణానగర్ మోర్ దగ్గర ఆమె కోసం ఎదురుచూస్తున్నాను. కాల్ చేస్తుంటే బిజీ అని వస్తోంది. ఏమో! తనిలా ఎవరితోనో మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు. తను ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తోంది ఇలా? తెలియదు.

చివరకు తనొచ్చింది. కానీ ఆమెలో వెలుతురు లేదు. దుఃఖాన్ని దాచుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నం నా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తోంది.

అమావాస్య…ఆకాశం.. తనూ.. దుఃఖం..

బుర్రబద్ధలైపోతుంది. నాకు దగ్గరగా వచ్చి అడిగింది. “నాకీ రాత్రంతా తిరగాలనిపిస్తోంది. తిప్పుతావా?”

క్షణం ఆలోచించకుండా సరే అన్నాను. ముందుగా గ్రీన్ బావర్చిలో తినేసి ఆ తర్వాత మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి వెళ్ళాం. రెండు కప్పుల ఛాయ్ తెచ్చి ముందు పెట్టాను. తను ఇంకా ఫోన్‌లోనే మునిగిపోయింది. అది నాకు బొత్తిగా నచ్చట్లేదు. కాసేపటి తర్వాత ఫోన్ పక్కన పెడుతూ తనడిగింది.

“ఏమన్నా మాట్లాడొచ్చు కదా!”

“నువ్వు ఫోన్ చూస్తున్నావ్ కదా, అందుకే కదిలించలేదు.” ఏమాత్రం ఆలోచించకుండా అన్నాను.ఒక్కసారిగా తను నా కళ్ళలోకి సూటిగా చూసి సన్నగా నవ్వింది.

“నీకు బెస్ట్‌ ఫ్రెండ్స్ ఉన్నారా?” ఛాయ్ చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది.

“అదేం ప్రశ్న? ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా!”

“ఓకే! అయితే నీకూ ఉన్నారన్నమాట.”

“హా..”

“నీకు వాళ్ళ వల్ల లాభం ఏంటి?”

ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు తనిలా అడుగుతోంది? ఏమో?

కొన్ని సెకండ్లు ఆలోచించి అన్నాను, “ఫ్రెండ్స్ అవసరాల కోసం కాదు.”

తను పెద్దగా నవ్వింది. చాలాసేపటి వరకు అలా నవ్వుతూనే ఉంది. మొదటిసారి కావొచ్చు ఆమె నవ్వు నాకు చిరాకు తెప్పించింది.

“ఎందుకలా నవ్వుతున్నావ్?” కోపంగా అడిగాను.

“Friendship is nothing but Mutual benefits..” అంది.

“వ్వాట్?”

చాలా కోపం వచ్చింది. ఈ అమ్మాయికి స్నేహం విలువ కచ్చితంగా తెలిసుండదు. ఛా! ఇలాంటి అమ్మాయి గురించా నేను ఇంత మంచిగా ఆలోచిస్తుంది? ఓ రెండు మాటలతో తన మీద నాకున్న ఫీలింగ్ అంతా ఎటో  కొట్టుకుపోయినట్టు తోచింది.

“నీ దృష్టిలో ఫ్రెండ్‌షిప్ అంటే బెని‌ఫిట్స్ కావొచ్చు, కానీ అందరికీ అలా కాదు” అన్నాను.

ఆమె కళ్ళల్లో నీళ్ళు. నవ్వుతూనే కళ్ళు తుడుచుకుంటోంది. ఎంత విచిత్రమైన అమ్మాయి తను! కానీ ఎందుకిలా మాట్లాడుతోంది. ఛాయ్ పక్కన పెట్టి మాట్లాడడం మొదలుపెట్టింది.

“ఇంటర్లో ఒకణ్ని ప్రేమించాను. అన్నయ్యకి తెలిసింది. ఇంట్లో చెప్పేశాడు. ఆ తర్వాత ఏముంది? ఇష్టం లేని పెళ్ళి. అమ్మాయిల్ని హద్దులు దాటకుండా వేసే ఉచ్చుముడే ఈ పెళ్ళి. ఒక అమ్మాయి ప్రేమను ఈ ప్రపంచం ఎలా చూస్తుందో తెలుసా? కామం.. కామంగా మాత్రమే చూడగలుగుతుంది. పదహారేళ్ళ అమ్మాయికి పెళ్ళి చేయడం అంటే ఈ లోకం చాలా క్రూరమైంది కదూ!

వచ్చే పండుగల కోసం ఆశగా క్యాలెండర్ వైపు చూస్తూ గడిపిన జీవితం అది.

నా మొగుడు క్రూరుడు, కసాయోడు కాదు. కానీ అతని మాటలు కత్తి కన్నా పదునైనవి. లోతుగా గుండెల్లోకి దిగుతాయి. ఏ సంతోషం లేకుండా గడిపిన ఏడేళ్ళ జీవితంలో ఓ రోజు వచ్చింది. అన్నయ్య నాకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. నా బాధని, దుఃఖాన్ని, సంతోషాల్ని, భావాలను పంచుకోవడానికి ఎవరైనా ఉంటారా అని ఆశగా చూశాను. అప్పుడు పరిచయమయ్యారు కృష్ణానగర్ ఫ్రెండ్స్.

షేర్‌చాట్‌లో మాట్లాడుతూ ఒక నమ్మకం ఇచ్చారు వాళ్ళు. గడిచినదంతా గతమనుకుని చెరిపేయమన్నారు. నాకూ సినిమాలంటే పిచ్చి. ఇన్ని సంవత్సరాలు ఇంత బాధని మోస్తున్నా బ్రతికే ఉన్నానంటే కారణం సినిమాలే! కష్టాలన్నవి దరి చేరవన్న ఆశతో భర్తని, అమ్మానాన్నలనీ, అన్నయ్యనీ, అందరినీ వదిలేసి వచ్చాను.

మొదట్లో అంతా బావుండేది. రాత్రులు కూడా చీకటిగా అనిపించేవి కావు. కానీ కొన్ని రోజులకే అంతా అబద్ధమని తేలింది. నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రెండ్ నా నుండి ఏం కోరుకున్నాడో తెలిసింది. కానీ కాదనలేక నన్ను నేను ఇచ్చేశాను. అంతటితో ఇది ఆగలేదు. మెల్లగా ఒక్కొక్కరూ ముసుగులు తీయడం మొదలుపెట్టారు. నాకూ తప్పలేదు. కానీ వాళ్ళతో కూడా ఇది అంతమవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా వస్తుండేవాళ్ళు. నేను ఏం చేయగలను? నాకు వాళ్ళతో స్నేహం కావాలి, కానీ వాళ్ళకు నా శరీరం కావాలి.

నాకంటూ ఎవరున్నారు ఇక్కడ? జీవితమంతా తలకిందులైపోయింది. ఇప్పుడు చెప్పు. ఏదీ ఆశించకుండా ఎవరైనా స్నేహం చేస్తారా?”

నా నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో అర్థం కాలేదు.

రాత్రి మాత్రమే చీకటి కాదు

ఉదయం…ఉదయం కూడా చీకటేనా?

ఛా.. ఎవడ్రా తన జీవితాన్ని ఇలా చేసింది? కోపం, బాధ ఎందుకోసమో, ఎవరికోసమో తెలియదు. దుఃఖాన్ని అణుచుకుంటూ అలా ఆమె ఎదురుగా ఉండలేకపోయాను. వెంటనే అక్కడి నుండి లేచి పక్కకి వచ్చేసి కాసేపు అలానే ఉన్నాను. సిగరెట్ వెలిగించి ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాను.

ఇంత ఇరుకైన దారిలో తను ఎలా ప్రయాణం చేస్తూ వచ్చింది? చిన్న చిన్న సంతోషాలతో తృప్తిపడుతూ జీవించడం చాలా కష్టం కదూ! ఉట్టి కష్టమేనా? నరకం!

అయినా, రేపు బావుంటుందని వచ్చిన తనకి

ఈ ప్రపంచం ఎంత వికృతమైందో తెలిసింది. ఒక అమ్మాయి దుఃఖంలో ఉన్నప్పుడు వేరే మగాడు ఆమె మనసులోకి చాలా తేలికగా ప్రవేశిస్తాడు. తోడున్నట్టు, ఓదారుస్తున్నట్టు నటిస్తే చాలు.. ఇంకా చెప్పాలంటే నాలుగు అభ్యుదయ మాటలు సరిపోతాయి. ఛా! చెత్త వెధవలు. ఇలాంటి కొడుకుల్ని అడ్డంగా నరికేయాలి.

నేనలా ఆలోచిస్తుండగా తను పిలిచింది. దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. చాలా మామూలుగా ఉంది, ఏమీ జరగనట్టు. నావైపు చూసి నవ్వింది. ఇంత సహజంగా తను నవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నా చేతిని దగ్గరకు తీసుకుని “నాకిప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళాలని ఉంది. తీసుకెళ్తావా?” అని అడిగింది. ఇప్పుడు తను ఆనందంగా ఉండటం నాకు అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. వెంటనే తలూపాను చిన్నగా నవ్వుతూ.

క్షణాలు యుగాలుగా మారి, జీవితమంతా ఆ రాత్రితో నిండిపోవాలనిపించింది. కానీ మనం కాలాన్ని ఎంత ఎక్కువ ఇష్టపడితే అది అంత వేగంగా కదుల్తుంది. ఆ రాత్రంతా సెకండ్లలో గడిచిపోయినట్టుగా అనిపించింది. ఉదయం 6:30 అయింది. మంగా టిఫిన్స్ దగ్గర తినేసి తనని మోర్ దగ్గర డ్రాప్ చేశాను. తను వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పింది. కృష్ణానగర్ వచ్చాక తను నాతో ఉన్నంత హాయిగా ఎవరితోనూ లేదని. ఆ ఒక్క మాట నాలో కొండంత వెలుగును నింపింది.

ఆరోజు తర్వాత తను నాకు మరింత దగ్గరైంది. అమావాస్యను దాటుకొని వచ్చిన వెన్నెలలా ఉండేది తను. నాతో ఉన్నప్పుడు నవ్వుతూనే ఉండేది. తనతో గడిపే ప్రతిక్షణం నాకు సంతోషాన్నిచ్చేది. ఏదైనా ఒక రోజు తను నన్ను కలవకపోతే, ఆ రోజంతా నాకు ఏడుపొక్కటే తక్కువ. అంతలా తను నాలో భాగమైపోయింది. ఎప్పుడైనా అలా బైక్ మీద వెళ్తుంటే ఉన్నట్టుండి తన మాటలు గుర్తొచ్చి బైక్ ఆపి మరీ నవ్వుకునేవాడ్ని. బహుశా తను నా జీవితంలోకి ముందే వచ్చి ఉంటే నాకు ఇన్ని బాధలు ఉండేవి కావేమో? ఏది ఏమైనా జీవితమంతా ఇలాగే గడిచిపోతే చాలనిపిస్తుంది.

తను.. నేను.. కృష్ణానగర్.. ఎప్పటికీ ఇలానే ఉంటే బావుండని అనుకునేవాడ్ని. అసలప్పుడు నా జీవితం ఎలా గడుస్తుండేదో తెలుసా? రోజూ ఉదయం పదింటికి ఆఫీస్‌కి వెళ్ళడం, సాయంత్రం ఐదున్నరప్పుడు తనని కలవడం. హైదరాబాద్ రోడ్లపైన తిరుగుతూ ఎప్పటికో ఆకలేస్తే తన రూమ్‌కి వెళ్ళి తినేవాళ్ళం. ఎన్నో కబుర్లతో ఆ రాత్రులు అందంగా గడిచేవి. ఎంత అందంగా అంటే మాటల్లో చెప్పడం సాధ్యపడనంత అందంగా. మా ఇద్దరి మధ్య ఏ గీతలూ ఉండేవి కావు. ఏ హద్దులూ లేని బంధం మాది. రెండింటప్పుడు తననలా ఒంటరిగా రూమ్‌లో వదిలేసి నేను నా రూమ్‌కి వెళ్తుంటే అస్సలు నచ్చేది కాదు. అందుకే కొన్నిసార్లు తన రూమ్‌లోనే ఉండిపోయేవాణ్ని.

ఓరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర మేముంటే, తన పాత ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి డబ్బులిస్తాం వస్తావా అని అడిగారు. ఆమె కూడా సరే అన్నట్టు మాట్లాడటం నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే నేను వివరించలేను. నచ్చలేదు అంతే! తను ఎప్పుడైనా కలవడం కుదరదని చెబితే అర్థం చేసుకుని ఊరుకునేవాడ్ని. కానీ ఇప్పుడలా లేదు. ఊరుకోవడానికి తను నాకు అంత దూరంగా లేదనిపిస్తోంది. నాలో సమస్తం తనే అయినట్టు అనిపిస్తుంది. బహుశా అందుకే కావొచ్చు ఇంత తీవ్రమైన బాధ. ఎక్కడా ఎవరితోనూ, చివరికి తనతోనూ చెప్పుకోలేనంత బాధ. ఎలా చెబితే తనకి అర్థమవుతుందో తెలియదు. అయినా నా బాధని తను పట్టించుకుంటుందా? ఏమో? వాళ్ళ మాటలు వినలేక నేను పక్కకు వెళ్ళిపోయాను. తను నన్ను పట్టించుకోలేదు.

కాసేపటి తర్వాత తను నా దగ్గరకు వచ్చింది. “ఏంటి సార్ చెప్పకుండా వచ్చారు?” అంది. నేనేం మాట్లాడలేదు. తనకి ఎదురుగా నిలబడి ఈ బాధని దాచుకోవడం నా వల్ల కాలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“ఏమైంది?” అని అడిగింది.

కళ్ళు తుడుచుకుంటూ అచ్చం తనలాగే నవ్వుతూ ఏం లేదన్నట్టు తలూపాను. నన్ను తన గుండెకు తీసుకుంది.

“అర్థమైంది. ఇక ఎప్పుడూ వెళ్ళను. సరేనా?” అంది. తనలా అనేసరికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సంతోషం.. మనసంతా నిండిపోయిన సంతోషం. తను నన్ను అర్థం చేసుకుంది. ప్రతిసారీ నేను ఏమనుకుంటున్నానో తనకి మాటలతో చెప్పాల్సిన పనిలేదు. నా భావాలని తను అందుకోగలదు. కానీ ఇదంతా నాకోసమేనా? ఆ క్షణం.. ఆ ఒక్క క్షణం నాకు నేను మంచిగా అనిపించాను. నా భావాలకు విలువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు.

నేను.. తను.‌. చీకటి.. వెన్నెల

తనతో ప్రయాణం ఏ ఒడిదుడుకులూ లేకుండా సాగిపోతోంది. ఇందుకోసమే పుట్టానేమో అనిపించే

అందమైన క్షణాలవి. కష్టాల్ని తేలికగా దాటగలిగేలా నన్ను తయారుచేసింది. జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడం ఎలాగో నేర్పించింది. గతం నన్ను తట్టిలేపి బాధపెట్టకుండా

నిన్నటిని మర్చిపోయేలా చేసింది. రేపటి కోసం ఎదురుచూడడం కూడా మాన్పించింది. ఈరోజును ప్రేమించాలని చెబుతుండేది. తనంటూ నా జీవితంలోకి రాకుండా ఉంటే శూన్యంలో అలానే బతుకుతూ ఉండేవాడ్ని. ఏదో తెలియని అనుబంధం మా మధ్య.

ఓరోజు నేను తన రూమ్‌కి వెళ్ళేసరికి తాళం వేసి ఉంది. కాల్ చేశాను. తను లిఫ్ట్ చేయలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు చెప్పకుండా తను ఎక్కడికీ వెళ్ళదు. కొంచెం భయమేసింది. ఆమె కోసం అక్కడే తన రూమ్ దగ్గరే ఎదురుచూస్తూ ఉన్నాను. చాలాసేపటి తర్వాత తన పక్క రూమ్ అమ్మాయి వచ్చింది. తను పబ్బుకి వెళ్ళిందని చెప్పింది. విపరీతమైన కోపం వచ్చేసింది నాకు. వెళ్ళనని నాకు మాటిచ్చి మళ్ళీ ఏంటి ఇదంతా? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? బుర్ర పగిలిపోయింది. అక్కడి నుండి బయటకి వచ్చేసి సిగరెట్ వెలిగించాను.

కోపం.. కోపం మాత్రమేనా? బాధ కూడా! తను మాట తప్పింది. విపరీతమైన చిరాకుతో నా రూమ్‌కి వెళ్ళిపోయాను. రాత్రి ఒకటింటికి తను కాల్ చేసింది.

“సారీరా! ఫోన్ సైలెంట్‌లో ఉంది. చూసుకోలేదు.”

“సరే”

“కృష్ణానగర్ మోర్ దగ్గర ఉన్నా, వస్తావా?”

“పబ్బుకి పోయినవ్‌గా! ఎవడూ రూమ్‌కి తీసుకెళ్ళలేదా?”

“కోపం వచ్చిందా?”

“ఇప్పుడు నాకు కోపం వస్తే ఏంటి? మళ్ళీ ఫేక్ ప్రామిస్ చేస్తావా ఇక వెళ్ళనని?”

“వీరా! నేను నిన్న ఆకలేస్తుందంటే ఏమన్నావ్?”

“ఏమన్నాను?”

“నాకు సిగరెట్లకే పైసల్లేవు, ఇప్పుడు నీకు ఫుడ్ ఎక్కడ తీసుకురావాలన్నావ్?”

అవును! అది నేనన్న మాటే! కానీ తనా మాట చెబుతుంటే గుండె కలుక్కుమంది.

“నా ఆకలికంటే నీకు సిగరెట్లే ఎక్కువా? నేను ఎక్కడికీ వెళ్ళనని మాట ఇచ్చాను. మరి నన్ను ఎవరు చూసుకోవాలి? మాట తప్పాను నిజమే! కానీ ఎందుకు? కారణం నువ్వు కాదా?”

ఆమె మాటలు నన్ను ఛిద్రం చేశాయి. క్షణం ఆలోచించకుండా తన దగ్గరకు బయలుదేరాను. ఛా! నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకలా ప్రవర్తించానో అర్థం కాలేదు. తనెంత బాధపడి ఉంటుంది. తలుచుకుంటేనే ఎలానో ఉంది.

తనూ…నేనూ

ఆకలి…పొగ

తన బాధ ఇప్పుడు నాకు నరకంగా అనిపిస్తుంది. పాపం! చాలా బాధపడింది. కాదు, నేనే బాధపెట్టాను. తను మోర్ దగ్గరే నిలబడి ఉంది. నేను వెళ్ళగానే మౌనంగా నా బండెక్కింది. నేనూ ఏం మాట్లాడలేకపోయాను. రూమ్‌కి వెళ్ళాక తను అడిగిన మొదటి ప్రశ్న ‘తిన్నావా’ అని. నేనెంత నీచుడినో నాకర్థమైంది. తనని గట్టిగా హత్తుకున్నాను.

“ఎప్పుడూ.. ఎప్పుడూ ఇలా చేయను. అయామ్ సారీ! ప్లీజ్!” అన్నాను. తను నన్ను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టింది. అదే తనతో చివరి రోజని నాకప్పుడు తెలియదు. ఆ తర్వాత రోజే వాళ్ళ వాళ్ళొచ్చి తనని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి తను లేదు.

నేనూ…తనూ…కొన్ని రోజులు

కవితల పుస్తకాన్ని పక్కకు విసిరేశాను. అసలు ఎవడ్రా మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ ఆలోచనల్ని రిపీట్ మోడ్‌లో ప్లే చేస్తుంది? అవే…అవే పిచ్చి ఆలోచనలు మెదడులో తిరుగుతూ ఉంటే జీవితం మీద ఆశపోతుంది. ఈ రోజును ప్రేమించాలని తను చెప్పింది. ఎలా ప్రేమించాలసలు? తను లేకుండా జీవితం శూన్యమనిపిస్తుందే! తను లేకుండా ఎలా బతకాలో తను నాకు నేర్పించి ఉంటే బావుండేది. నేను కాస్త సంతోషంగా ఉన్నప్పుడు ఉన్నట్లుండి తను గుర్తొస్తుంది. వెలుతురు పోయి చీకటి వచ్చినట్టు. ఎన్ని…ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాను తన కోసం. కుదరదని అర్థమయ్యాక..

తను లేదు.. వెన్నెలా లేదు

ఉన్నదొక్కటే ఇప్పుడు.. చీకటి

*

ఊహాధారిత కథలు రాయలేను: రవీంద్ర

* హాయ్ రవీంద్రా! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అమ్మపాలెం. ఇంటర్ దాకా అక్కడే చదివాను. హైదరాబాద్‌లో డిగ్రీ చేశాను. కమ్యూనికేషన్ జర్నలిజంలో ఇటీవల పీజీ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాను.

* సాహిత్యంపై ఆసక్తి ఎలా ఏర్పడింది?

చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పే కథలు వినేవాణ్ని. అవి చాలా ఆసక్తిగా అనిపించేవి. స్కూల్లో మా తెలుగు టీచర్ కల్యాణి నన్ను చాలా ప్రోత్సహించేవారు. ఆరో తరగతిలోనే ‘మహాప్రస్థానం’, ‘చివరకు మిగిలేది’ లాంటి పుస్తకాలు ఇచ్చి చదవమనేవారు. నాకు సినిమాలంటే ఇష్టం. ఇంటర్‌లో ఉన్నప్పుడు స్నేహితులందరం కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరించాం. ఆ సమయంలో నాకు తట్టిన కొన్ని ఆలోచనలను షార్ట్ ఫిల్మ్స్‌గా మార్చేందుకు మా దగ్గర వనరులు లేవు. వాటినే కథలుగా రాస్తే బాగుంటుందని అనిపించింది. నాకు నచ్చిన రీతిలో కథలు రాయడం మొదలుపెట్టాను. వాటిని నా స్నేహితులకే చూపించేవాణ్ని‌‌.

* ఇంటర్‌లోనే కథలు రాశానంటున్నారు. ప్రచురణ కోసం పత్రికలకు పంపలేదా?

చిన్నప్పటి నుంచి నేను కథలు ఎక్కువగా చదవలేదు. కథలు ఎలా రాయాలన్న స్పష్టమైన అవగాహన లేదు. అప్పట్లో నేను రాసే కథలన్నీ నీతిని బోధించే కథల్లా ఉండేవి. నాకు రాయడం ఆనందమే కానీ, రాశాక పత్రికలకు పంపాలన్న ఆసక్తి ఉండేది కాదు. కొన్నేళ్ల క్రితం పత్రికల్లో ఒక రెండు కథలు ప్రచురితమయ్యాయి. కానీ ఇప్పుడు చదువుకుంటే అవి నాకే నచ్చవు. ఆ తర్వాత 18 కథలు రాశాను. కానీ ఎక్కడా ప్రచురణకు పంపలేదు. ఒకరకంగా ఇదే నా తొలి కథ అనొచ్చు.

* కథలతోపాటు కవిత్వం రాస్తున్నారు కదా! రెండూ రాయడం ఎలాంటి అనుభూతిని ఇస్తోంది?

నాకు కవిత్వం రాయడం సులువుగా, కథలు రాయడం కష్టంగా అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే! రెండూ ఇష్టంగానే రాస్తాను. కథలనూ కొంత కవితాత్మకంగా రాసేందుకు ప్రయత్నిస్తుంటాను.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నేను ఊహాధారిత కథలు రాయలేను. నా చుట్టూ సమాజంలో జరిగే విషయాలకే కొంత ఊహ జోడించి కథలు రాస్తాను.‌ నా కథలతో త్వరలో కథాసంపుటి వెలువరిస్తున్నాను. దాంతోపాటు ఒక నవల రాస్తున్నాను.

*

రవీంద్ర రావెళ్ళ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Ravi he is my degree mate ni story eppuday study chesa ra story lo nenu ni place lo unnatu feel ayyara same epppduu nenu ela undali amey leykunda aney feeling vastundhi ala nanuu verey trans Loki tesukuvellav ra.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు