The Whisper

“స్వేచ్చకీ,  స్వాతంత్రానికీ తేడా ఏంటి?”

“…”

“స్వేచ్చకీ, స్వాతంత్రానికీ గల తేడా ఏంటో? నీకు తెలుసా, తెలీదా?”

అతనెప్పుడో ఆలోచనల్లోకి జారిపోయున్నాడు. మెదడును పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుని     తనడిగిన ప్రశ్నని తడుముకుంటున్నాడు. తెలిసినట్లే అనిపిస్తోంది. మళ్ళీ అంతలోనే కాదేమోననిపిస్తోంది. ఇదేనని నోరు తెరిచి చెప్పే లోపల వెంటనే మరో ఆలోచన మొదటిదానిని ఆక్రమించేసి నోరుని మూసేస్తూంది. తర్జనభర్జన పడ్డాడు కొద్దిసేపు. భావరహితంగా తనవంక కళ్ళప్పగించి చూడసాగాడు. ఆలోచనలను క్రమబద్దీకరిస్తూ పదాలను పొందుపరుచుకుంటున్నాడు.

“న్నాన్నా!” అతని చెయ్యి పట్టుకుని ఊపేస్తూ, “నీకసలు వినిపిస్తోందా?”

అడ్డంగా తలూపాడతను.

తనేదో బిగ్గరగా చెపుతూనే ఉంది. అవేవీ అతని చెవికి చేరడంలేదు. ఎప్పుడూ అంతే! ఉన్నట్టుండి మాటల మధ్యలో అకస్మాత్తుగా ఎందులోనో కూరుకుపోతాడు. ఎక్కడో ఇరుక్కుపోతాడు. కొద్దిసేపు అచేతనుడవుతాడు. నొక్కి పట్టిన ఆలోచనలన్నీ ఒక్కుదుటున పెల్లుబుకి అతన్ని అడుగంటా ముంచేస్తాయి. ఇంకెక్కడికో లాక్కెళ్తాయి. ఇప్పుడూ అదే పరిస్థితి.

తనెప్పుడూ ఒక పజిల్ లా అనిపిస్తూంటుంది అతనికి. నిరంతరం తననర్ధం చేసుకునే ప్రయత్నమే? పూర్తిగా అర్ధమయ్యి అసంపూర్ణం మిగిలించేస్తూంది. తరలిపోయిన కాలాన్ని తరచి చూస్తే ఆశ్చర్యమనిపిస్తూంటుంది. తను తనకడుపున పుట్టిన బిడ్డేనా అనిపిస్తుంది.తన ఆలోచనల్ని గమనిస్తే తన వయసుని దాటి వెళ్ళిందనిపిస్తుంది.

ఆమె కన్నా అతని వయసు రెట్టింపు. అతనికిప్పుడు యాభై నాలుగు. అతని చేతుల్లోకి తను వచ్చి అప్పుడే ఇరవైనాలుగేళ్ళు. ఇద్దరి మధ్యా ఎన్ని జ్ణాపకాలూ, ఎన్ని అనుభవాలూ ఎన్ని కలలూ…వాటన్నింటినీ పోగు చేసి గుండెలోపలి గదిలో పచ్చబొట్టేసుకుని పదిలపరుచుకున్నాడు.

ఆమెకు సంవత్సరం వయసులో అతనినీ, ఆమెనీ వదిలి ఆమె తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది. మూడు సంవత్సరాల వయసొచ్చేవరకూ అతను దారితెన్నూ లేక, ఆదెరువు లేక, ఆదరణ లేక, ఆలనాపాలనా లేని వ్యవసాయ భూమిలా తయారయ్యాడు.

తొలకరి వానకు చిగుర్చిన పూపొదలా, అస్తవ్యస్తంగా ఉన్న అతనికి ఒక శుభముహూర్తపు వేళనో లేక ఆ రాముడే కరుణించాడోగానీ అతనిలో ఒక ఆలోచన మొలకెత్తింది.

భార్య వదిలిపోతేనే తన పరిస్థితి ఇలా తయారుచేసుకున్నాడూ అంటే కడుపున పుట్టిన బిడ్డ పరిస్థితి ఎలాగుంటుందోనన్న ఆలోచన అతన్ని నిముషంపాటు కూడా నిల్చోనివ్వలేదు.

మూడేళ్ళపాటు తెలిసినవాళ్ళింట్లో జిల్లేడు పొదలా పెరుగుతున్న కూతురిని తనదగ్గరికి తెచ్చేసుకున్నాడు.

అప్పుడక్కడ మొదలైంది వారిద్దరి స్నేహం. ఇద్దరూ ఒకరికొకరయ్యారు. కలిసి తెలుసుకున్నారు, కలిసి నేర్చుకున్నారు. ఆమెకు తెలియచెప్తూ అతను నేర్చుకున్నాడు. తను తెలుసుకుంటూ తనకి నేర్పాడు. పద్ధతులు మార్చుకుని పాటించారు. బాధ్యత తెలుసుకుని, నేర్చుకుని తెలియపరిచాడు. పాటించారు.

ప్రతిరోజునీ ఒక జ్ణాపకంగా మలుచుకునే ప్రయత్నం చేసాడు. ప్రతి గంటనీ తనకి ఏదో కొత్త విషయం తెలిపి జ్ణానాన్ని మెరుగుపరిచాడు. ప్రతి నిమిషాన్నీ తనకోసం వెచ్చించి జిజ్ణాసని రగిల్చాడు. ప్రతి క్షణమూ వెన్నంటే ఉంటూ దన్నుగా నిలిచాడు. ఊళ్ళు పట్టుకు తిరిగే ఉద్యోగాన్ని వదిలేసి, కుదురుగా ఉన్నదగ్గర కూర్చునే చిన్నపాటి ఉద్యోగం వెతుక్కున్నాడు.  సలహాలూ సంప్రదింపులూ చేసే సపరివారాలూ సుదూరమే. స్వతంత్ర నిర్ణయాలు చేసుకుని స్వేచ్చగా…రెక్కలు విశాలంగా చాచుకుని, హద్దులులేని ఆకాశాన్ని అందినంతమేర ఇద్దరూ ఈదేస్తున్నారు.

తనెప్పుడూ అంతే, ఇప్పుడిక్కడుంటాడు, మరుక్షణం మరెక్కడో తేలుతాడు. అల్లిబిల్లి ఆలోచనల్లో చిక్కుకుని, వాటికి చిక్కిపోతూంటాడు. కలగాపులగపు ఊహల్లోంచి దారి చేసుకుంటూ మళ్ళీ ఆలోచనల్లోకి, అలా సాగిపోతూనే ఉంటాడు. అంతర్జాలంలో అడుగంటా మునిగిపోయినట్లు, ఇక్కడ మునిగితే అక్కడెక్కడో అంతరిక్షంలోకి అరక్షణంలో చేరుకుని, మరుక్షణం ‘అంటార్కిటికా’ మంచు సానువుల్లో ‘సీల్’ జీవుల సమూహాల్తో చేరి, సేదతీరి, వెనువెంటనే ‘పెరు’ పర్వత శిఖరాగ్రాల చివర బైటాయించినంతలో అక్కడనుంచి జారి ‘ఉగాండా’ ‘విక్టోరియా’ లేక్ లో పడవపై తేలియాడుతూ, ‘గోబీ’ ఎడారిలో ప్రత్యక్షమై, గంగాతటి ‘కాశీ’ పురవీధుల్లో సమోసాలు కొరికేస్తూన్నప్పుడు కల్గే తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ…

బుజాన్ని కొరికేసిన తనని చిరుకోపంగా చూస్తూ ‘’అబ్బా’’ అని ఆ చోట రుద్దుకుంటూ, “పిల్లరాక్షసి”, అన్నాడు.

గలగలా నవ్వేసింది తను, జుట్టుకున్న క్లిప్ని తీసేస్తూ…

“ఎక్కడివరకు వెళ్ళొచ్చావ్ నాన్నా?”

తేరుకుని నవ్వేసాడు.

“నేనడిగిన దానికి జవాబివ్వలేదు?”.

“ఏమడిగావ్?” ప్రశ్నార్ధకం అయిపోయాడతను.

“ఖర్మ!”, అని తలని చేత్తో సుతారంగా తట్టుకుని మళ్ళీ ఒకసారి నొక్కి అడిగింది,  ” స్వేచ్చకీ… స్వాతంత్ర్యానికీ తేడా అడిగాను,” అంది.

అతను సాలోచనగా శూన్యంలోకి చూస్తూ, ఆ ప్రశ్నని నెమరేసుకుంటూండగానే మళ్ళీ తనే,        “ఆగాగు… మళ్ళీ ఎక్కడో మునిగిపోకు నాన్నా,” అని గడబిడ చేసింది.

ధీర్గంగా తనని చూసి, పదాలని ప్రోది చేసుకుని చెప్పాదు.

“స్వేచ్చ వ్యక్తికి సంబంధించింది…స్వాతంత్ర్యం సమూహానికి సంబంధించినది, అంటే…” విడమరచబోయాడు.

“ఆగు నాన్నా…అక్కడే ఆగు…అర్ధమైంది,” దువ్వెనతో జుట్టు చిక్కులు తీసుకుంటూ అతనన్న మాటలను మరోసారి మననం చేసుకుంటూ, “నిజమేననిపిస్తూంది”, అంది.

నవ్వేసాడతను.

“టీ నా కాఫీ నా.”

“హ్మ్…టీ,” అంది.

రోజూలాగే ఆదివారం అయినా ఆరుగంటలకే బయటపడ్డారిద్దరూ వాకింగ్ కి. దగ్గరలో ఉన్న పార్క్ కి నడిచే వెళ్తారు. సెలవు కావడమ్మూలాన ఏడున్నరవరకూ పార్కులోనే గడిపారిద్దరూ. ఒకరు వాకింగు, ఒకరు జాగింగూ, కలిసి ప్రాణాయామమూ, విడివిడిగా నాలుగైదు సెట్ల సూర్యనమస్కారాలు పూర్తి చేసుకుని అక్కడే పచ్చికలో కూర్చుని ఆ సూర్యోదయాన్ని పూర్తిగా ఆస్వాదించారు.

ఇంటికి బయలుదేరి, మనసు మార్చుకుని వీధి చివర ఉన్న తోపుడు  బండి మీద చెరో రెండిడ్లీలు, తలో పెసరట్టు లాగించేసి వచ్చారు.

తీరిగ్గా కూర్చుని టీ చప్పరించసాగారు. మధ్యాహ్న భోజనానికి ప్రణాళిక రూపొందించి తీర్మానించేశారు. ఈ ఆదివారం ఎక్కడికీ వెళ్ళకుండా పుస్తకాల్తో కుస్తీ పడదామని నిర్ణయించుకున్నారు.

మధ్యాహ్నానికి అన్నం, లివర్ ఫ్రై విత్ సోయికూర, ఇంకా రసం పెరుగుతో సరిపుచ్చుకుందామనుకుని తాగిన టీ గ్లాసులు సింక్లో పడేసి, లివర్ కోసం బయలుదేరాడు.

                    ********

అతను బయటికెళ్ళాక కాసేపు కళ్ళు మూసుకుని చేరగిలపడి కూచుంది. ప్రశాంతంగా ఉంది మనసు. నిశ్శబ్దంగా కూచుని ఆ ప్రశాంతతను తనివితీరా, అణువణువునా నింపుకుంది.

ఏ విధమైన హడావిడి, ఆందోళన లేకుండా జీవితాన్ని యధాతదంగా అనుభవించడం అలవాటు చేసుకున్నారిద్దరూ.

ఊహ తెలిసేనాటికి నాన్న ఒళ్ళో ఉంది తను. అందరికిలాగే తల్లి ఉండాలని ఎప్పుడూ అనిపించలేదు. స్కూలు, చదువు, కొద్దిమంది స్నేహితులు ఇంకా నాన్న…అంతే.

క్రమశిక్షణ అనే పదం కాస్త కఠినంగానే అనిపిస్తుంది కానీ తనను ఏనాడూ దేనికీ అడ్డుచెప్పలేదు. కూర్చుని చర్చించుకోవడం, మాట్లాడుకోవడం అంతే. ఏది మంచో, ఏది చెడో, ఏది ఉత్తమమైనదో అనలిటికల్ గా, లాజికల్ గా, కలివిడిగా ఆలోచన చేసేవారు.

అతని కళ్ళతో ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. క్రమక్రమంగా ఆమె కళ్ళూ దోహదపడ్డాయి అతనికి. నిరంతరం అతను ఎదుగుతూ, ఆమె ఎదగడాన్నీ, ఎదుగుదలనూ సంపూర్ణంగా చవి చూశాడు.

ఎదుగుతున్న క్రమంలోకూడా ఏనాడూ అమ్మ ఉంటే బాగుండనే ఆలోచనే కలగకుండా తనే తల్లి పాత్ర పోషించాడు.

ఏన్నో సార్లు మాటలసంధర్భంలో తల్లి ప్రస్తావన వచ్చినా దాటేసేవాడు. తల్లి గురించి ప్రతికూలంగా మాట్లాడ్డం తనెప్పుడూ వినలేదు. తనకి సంవత్సరంలోపు వయసపుడు, అతను ఆఫీసు పనిమీద టూరుకెళ్ళినపుడు తనని అమ్మమ్మా వాళ్ళింట్లో వదిలి వెళ్ళిపోయిందనే సంగతి తెలిసింది. అంతకుమించి వివరాలేమీ లేవు. ఏవరూ చెప్పలేదు. అమ్మమ్మా వాళ్ళతో సంబంధాలు దాదాపు లేవనే  చెప్పొచ్చు. అతనికన్నా పెద్ద ఒక అక్క మాత్రం కొద్దిగా అంటే చాలా కొద్దిగా సంబంధం నెరుపుతున్నారు. వారిద్దరికీ ఎవరూ లేరు.  వారికి ఎవరి అవసరమూ లేదు. ఇంకెవరికీ వీళ్లవసరమూ లేదు.

ఇది కావాలీ అని నోరు తెరిచి అడగకముందే, అన్నీ అందుబాటులో పెట్టేవాడు. చిన్న చిన్న కోరికలు, కొత్త కొత్త రుచులు అన్నీ…సమస్తం ముందే తెలుసుకుని అమర్చేవాడు. తన ఆనందం తను కళ్ళారా అనుభూతించేవాడు.

అతనికి ముగ్గురు స్నేహితులు. అప్పుడప్పుడు వాళ్ళు వస్తూంటారు. వీళ్ళూ వెళ్తూంటారు.

ప్రతి పదిహేను రోజులకు బయట భోజనం చేస్తారు. ప్రతి నెలా ఒక ప్రదేశానికి వెళ్తారు. ప్రతి మూడు నెళ్ళకి ఒక షార్ట్ ట్రిప్ కి వెళ్తారు. ప్రతి ఆరునెళ్ళకీ మాత్రం అతనొఖ్ఖడే స్నేహితులతో మూడు నాలుగు రోజుల టూరుకి వెళ్తాడు. అప్పుడు తనని ఫ్రెండ్స్ ఇళ్ళ వద్ద దించి వెళ్ళేవాడు. ఇప్పుడు పెద్దైపోయాక తనిష్టం అంటున్నాడు.

అతని నిబద్ధత నచ్చుతుంది తనకి. తననించి ఏ విషయమూ దాచడు. అబద్దం అన్న మాటకి చాన్సే లేదు. అలా అలవాటుపడ్డాడు, తనకి నేర్పాడు. అరమరికలు లేవు. సంజాయిషీలు లేవు. ఏ విషయమైనా చెప్పి చేసేవాడు, లేకపోతే చేసి చెప్పేవాడు. నెలకో రెణ్ణెల్లకో, ఎప్పుడో ఒకసారి అతనికి మూడ్  వచ్చినప్పుడు, ఉన్నప్పుడు రెండు పెగ్గుల వోడ్కా తీసుకునేవాడు. ఒక సిగరెట్ కాల్చేవాడు. అతను మందు తీసుకునేప్పుడు తోడుగా కూచోవడం తనకిష్టం. అతను మందును పూర్తిగా అనుభవిస్తూ ఆస్వాదించడం చూసి తనానందపడేది. ఆమ్లెట్ వేసిచ్చేది. అప్పుడప్పుడు అతని సిగరెట్ వెలిగించేది.

“ఎలా తాగుతారు నాన్నా దీన్ని!”, అడిగిందొక రోజు వోడ్కాని రుచి చూసి. మళ్ళీ తనే అంది, “పెద్ద గొప్ప రుచిగా ఏం లేదు…కానీ కొత్తగా ఉంది…నాల్లుక మీది టేస్ట్ బడ్స్ మీద ఈ లిక్విడ్ నాట్యమాడినట్లుగా, గమ్మత్తుగా ఉంది”.

“ఒక నైంటీ తీసుకుంటె మత్తుగా కూడా ఉంటుంది,” అన్నాడు.

“అదెలా ఉంటుందో చూడాలనే ఉంది కానీ, టేస్ట్ నచ్చలేదు.”

బయటికెళ్ళి ‘ఫాంటా’ తీసుకొచ్చి దానితో కలిపిచ్చాడు.

“ఇది బావుంది నాన్నా”, మెచ్చుకుంది. మొత్తం తాగేసి అల్లరల్లరి చేసి పడుకుండిపోయింది.

మళ్ళీ ఎప్పుడూ దాని జోలికెళ్ళలేదు.

“నన్ను ఇంఫ్లుయెన్స్ చేసే ఏ మనిషైనా, మందైనా నాకు ఇష్టం లేదు. ఏదైనా సొంతంగా తెలుసుకోవడం ఇష్టం, ప్రభావితం కావడం నచ్చదు,” తేల్చేసింది.

అరమరికలు లేని స్నేహం ఇంట్లోనే అమరినపుడు ఏ ఇతర వ్యసనాలూ దరి చేరవు.

షెల్ఫ్ లో అందంగా అమర్చిన పుస్తకలాని పలకరిస్తూ, మునివేళ్ళతో వాటిని అనుభూతిస్తూ చూడసాగింది.

‘చలా’న్ని ఏనాడో చదివి చలించిపోయింది. ‘కొడవటిగంటి’ మధ్యతరగతి పాత్రలు ఇంకా జాగృతపరుస్తూనే ఉన్నాయి. ‘రావిశాస్త్రి’ ఒరవడీ, ‘యండమూరి’ తెంపరితనమూ, ‘మల్లాది’ తుంటరితనమూ, ‘మధురాంతకా’ల ఉరవడీ…ఎన్నెన్ని పుస్తకాలు. అన్నీ చదివేసినవే! కొత్త పుస్తకాల షెల్ఫ్ లో చూస్తే ‘అమిశ్’ రాసిన ‘సీత’ ‘మిథిల యోధ’ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చేత్తో నిమురుతూ, ఆ పుస్తకం మీద ప్రేమని ప్రకటించి దివాను మీద ఒరిగి కళ్ళుమూసుకుంది.

అయితే గియితే బాహ్యవిషయాలు మనలోకి ప్రవేశించి, ప్రవహించి అంతర్గత నాడులమీద ఇంఫ్లుయెన్స్ చేస్తాయి కానీ, ఈ పుస్తకాలు మాత్రం మినహాయింపు. ‘చదవడం’ మాత్రమే అన్ని వ్యసనాల్లోకెల్లా ఉన్న ఒకే ఒక గొప్ప వ్యసనం. ఏ దుష్ఫలితాలకీ తావివ్వని అద్భుత వ్యసనం. చిన్నగా నవ్వుకుంది ఈ ఆలోచనకి.

పుస్తకాలు చదవడంవలన కూడా కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయి అని అనుకుని నవ్వుకుంది. ఎదుటి మనుషులు పూర్తిగా తెలిసిపోతూంటారు. అద్దంలో కనిపించినంత సూక్ష్మంగా అర్ధమైపోతూంటారు. అది జీర్ణించుకోవడం కొంచం కష్టమే. మనకి మొత్తం తెలిసిపోయిన వాళ్ళతో నార్మల్గా ప్రవర్తించడం అంత సులభమేం కాదు. అది మంచిదా చెడ్డదా తేల్చుకోలేకపోయింది.

                 ******

సరుకులు సరంజామాలతో వచ్చాడతను. మళ్ళీ నిశ్శబ్దం నిష్క్రమించింది ఆ ఇంట్లో. కలిసి ఇల్లు శుభ్రం చేసుకున్నారు, కలిసి బట్టలుతికారు, కలిసి వండుకున్నారు. ఇద్దరి మధ్యా అలుపెరుగని మాటల ప్రవాహం…సాగుతూనే ఉంది. జీలకర్ర గొప్పతనం గురించి ఎంత ఉత్సాహంగా మాట్లాడుకుంటారో, ‘శ్రీపాద’ ‘కలుపుమొక్కల’ గురించి కూడా అంతే హుషారుగా చర్చించుకుంటారు. అన్ని సబ్జెక్టులూ వారి మధ్య పేరుకుపోతూనే ఉంటాయి.

పాలు ఎంత వేడిగా ఉన్నప్పుడు తోడు పెడితే చక్కటి పెరుగు తయారవుతుందో దగ్గరి నుంచీ, ‘సగ్గు బియ్యం’ ఎలా తయారు చేస్తారో వరకు. ‘నాటో’ కూటమి ‘ఉక్రెయిన్’ కి చేసే సహాయం నుంచీ,  ‘మంగోలియన్ల’కీ, ‘రెడ్ ఇండియన్ల’కీ గల పోలికల వరకు… విరామమెరుగని జ్ణానభండారం అక్కడ భళ్ళున పగిలిపోతుంది.

అకస్మాత్తుగా పొత్తికడుపుని చేత్తో అదిమి పట్టుకుని, “నొప్పి నాన్నా!”, అంటూనే వాష్రూంలోకి పరిగెత్తింది. అరక్షణం ఆందోళన చెంది, మరుక్షణం తెప్పరిల్లి, “అంతా ఓకేనా?” అడిగాడు.

నిమిషం తరువాత, “ఓకే నాన్నా, డేట్ వచ్చింది,” లోనుంచి జవాబు. తేరుకున్నాడు.

వండిన పాత్రలు టేబుల్ మీద సర్దుతూ, “తొందరగా వఛ్ఛిందా?” కాస్త గొంతు పెంచి అడిగాడు.

కొంచంసేపు నిశ్శబ్దం, లెక్కలు పెట్టుకున్నట్లుంది, “లెక్క సరిపోయింది…ఇరవై ఎనిమిది రోజులు.”

“పర్ఫెక్ట్”, అరిచి, “మెయింటైనింగ్ గుడ్ సైకిల్,”  మెచ్చుకున్నాడు.

“నాన్నా! షెల్ఫ్ లోని సానిటరీపాడ్ ఇవ్వు.”

తలుపు సందులోంచి అందించాడు.

తనకి కాస్త సమయం పడుతుందని మరో బాత్రూంలోకి దూరాడు స్నానం చెయ్యడానికి, మెదడులోకి ఆలోచనల పరంపర కూడా. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అందుకు నిదర్శనం తన ఆరోగ్యమే, శరీరానికి అన్నీ సమపాళ్ళల్లో అందుతున్నాయి కాబట్టే ఆందోళన లేని ఆరోగ్యం సాధ్యమైంది. అన్నీ సమపాళ్ళల్లో అందుతున్నాయి. నిజంగా అందుతున్నాయా? ఆలోచనల్లోకి ఆందోళన చేరింది.

పెళ్ళి చేసుకోమన్నాడు.

పెళ్ళికి తను సరితూగనన్నది.

క్లాస్మేట్స్ లో గానీ, ఆఫీస్ కొలీగ్స్ లో గానీ, స్నేహితుల్లో గానీ, నచ్చినవాడుంటే పెళ్ళి చేసుకోమని బ్రతిలాడి మరీ అడిగాడు.

పిల్లలకి తల్లిదండ్రులు పెళ్ళి చెయ్యడం ఎంత అనాగరికమైన, అసహ్యమైన్ ప్రక్రియ. శారీరకావసరాలు ప్రకృతి ధర్మం అయినపుడు, ప్రకృతిలో గానీ, పశుపక్ష్యాదులు గానీ, క్రిమికీటకాలుగానీ ఏ తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయి. కట్టుబాట్లు, నియమనిబంధనలు సమాజంలో, సమాజంతో అవసరమే కానీ…ముక్కూ మొహం తెలీని, కనీసం పూర్వ పరిచయంలేని మనిషితో జీవితాన్ని పంచుకోవడం, ముఖ్యంగా ఏ అభిరుచీ కలవనప్పుడు కలిసి బతకడం దుర్భరం.

పెళ్ళి చేసుకోమని అడిగినపుడు అదే చెప్పింది.

“బోర్ నాన్నా! మెషీన్ లా బతకడం కష్టం… ఆడవాళ్ళందరికీ స్వాతంత్ర్యం కావాలేమో తెలీదు గానీ, నాకు మాత్రం స్వేచ్చ కావాలి,” అంది.

ఏం జవాబిస్తాడు.

ఈ కట్టుబాట్లనేం చేస్తాడు.

ఈ నియమనిబంధనలని, షరతులని ఏం చేస్తాడు.

శరీరావసరాల సంగతేం చేయ్యడం.

బాత్రూంలోంచి అతను బయటికొచ్చేసరికి  ఫ్రెష్గా తయారయ్యి, ఫాన్ గాలికి తలారబెట్టుకుంటోంది.

“షవర్ కింద తపస్సు పూర్తయ్యిందా నాన్నా?”

బిగ్గరగా నవ్వేసాడు.

ఆవురావురంటూ భోజనం చేశారు. ఎక్కడివక్కడ సర్దేసి, కడిగేసి ఒకరు దివానుపైన, మరొకరు నేలపైన పడుకుని వారం మొత్తం కష్టాన్ని మరిచి, శరీరం సేదతీరేంతవరకు నిద్రపోయారు.

***

నెలవారీ సరుకులకి సూపర్ మార్కెట్ కి వెళ్ళారిద్దరూ అదేరోజు సాయంత్రం.

ఫోన్ రింగయ్యింది. అందుకున్నాడు. ఆనందంగా మాట్లాడి పెట్టేశాడు.

“ఎవరు నాన్నా?”

అతని ఫ్రెండ్ పేరు చెప్పాడు.

“ఏంటి సంగతి?”

“టూర్ ప్లాన్ చేస్తున్నారు, వారం తరువాత ఫిక్స్ చేశారు.”

“ఈ సారెక్కడికి”.

“గోవా”.

“గుడ్ నాన్నా, చిల్,” ఆటపట్టించింది.

“నీ గురించే ఆలోచన”.

“నా కలవాటే కదా! నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, ఎంజాయ్ నాన్నా.”

“మరీ…”

“నాన్నోయి విస్పర్ XL తీసుకున్నావు, నాకు విస్పర్ XXL కదా కావాల్సింది…బిగ్గర్ సైజ్, మోర్ కంఫర్ట్.”

“అది కాదు… మరీ… నువ్వూ…” గొణిగాడు.

“నాకిది ఫస్ట్ టైం ఏంకాదు, ఒక్కదాన్ని ఉండడం నాకు కొత్తేం కాదు…ఐ కెన్ మ్యానేజ్.”

“అదే అంటున్నాను… ఏకాంతంలోకి జారిపోవాలనుకుంటే ఒక్కదానివే ఉండు…అది మనసునీ శరీరాన్నీ సేద తీరుస్తుంది,” అని కాస్తాగి, ఇంకా స్పష్టంగా వినిపించేట్లు దగ్గరగా జరిగి, “ఒంటరిగా ఉండాలని మాత్రం అనుకోవద్దు… అది ఏకాంతానికి విరుద్ధంగా జరుగుతుంది…ఆలోచించుకో” తనకి మాత్రమే అర్ధమయ్యేట్లు, చెవిలో గుసగుసగా చెప్పాడు.

*

కొట్టం రామకృష్ణా రెడ్డి

ఇప్పటివరకు దాదాపు పద్దెనిమిది కథలు రాశాను. హైదరాబాద్ నివాసం. ప్రైవేటు ఉద్యోగం. నాలుగు పుష్కరాల వయసు దాటింది. మొదటి కథ తీర్పు రచన మాసపత్రిక 1994లో ప్రచురింపబడింది. మానవ సంబంధాలు, వారి భావోద్వేగాలు ఇష్టమైన ఇతివృత్తాలు. పూర్వీకులు సేద్యం చేసేవారు. సారంగ లో ఇది మూడవ కథ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సర్వసాధారణ కుటుంబసంబంధాన్ని ఆధారంగా చేసుకొని, స్వేచ్ఛ-స్వాతంత్ర్యం అలాగే ఒంటరితనం-ఏకాంతం వంటి లోతైన ద్వంద్వాలను చర్చకు పెట్టారు. మిత్రుడు కొట్టం కథలన్నిటిలాగానే ఇందులోకూడా ఆధునికత, విభిన్నత్వం ధ్వనించాయి; ఆలోచింపజేశాయి. అభినందనలు!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు