వెంబడించిన జ్ఞాపకాల ‘సంచారం’

‘‘సంచారమే ఎంతో బాగున్నది

దీనంత ఆనందమేదున్నది

ఇల్లు పొల్లు లేని ముల్లె మూట లేని

వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే

జ్ఞాన సంచారమే గాన సంచారమే లోన సంచారమే’’ అని గోరటి వెంకన్న పాటకు ప్రతిరూపమే అన్నవరం దేవేందర్ యాత్రా వ్యాసాలతో కూడుకున్న ‘సంచారం’. వివిధ ప్రాంతాల మట్టి పరిమళాలను ఆస్వాదిస్తూ తన అనుభవాలు, అనుభూతులను కలగలిపిన యాత్రా వ్యాసాలివి.

ఆయా ప్రాంతాల జీవనసరళిని, వృత్తిపరంగా, సాహిత్యపరంగా వారు చేస్తున్న నిరంతర కృషిని కూలంకషంగా తడిమి సాహిత్యాభిమానుల ముందు కొత్త కోణాలతో ఆవిష్కరించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలంలో చేసిన సంచారంలో ఆయా ప్రాంతాల్లో హృదయాలను కలిపే మానవ సంబంధాలను మన ముందుంచాడు. బంధాలు, అనుబంధాలు పెనవేసుకుపోయి పిచ్చి సెంటిమెంట్లు, సంప్రదాయాల మధ్య తిరుగుతూ ఒకరి మీద ఒకరు ఆధారపడిన బతుకులు కనిపిస్తాయి. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తోటి కవులు, రచయితలతో చేసిన పాపికొండల కవిగాన యాత్ర ఇందుకు తార్కాణం. తెలంగాణకు నడక నేర్పిన గోదావరి ప్రవాహంపై పయనిస్తూ అలల ఘోషను ఆలకించారు. గిరిజన ప్రజల ఆర్తిని పట్టుకున్నారు.

పోలవరం చేసే మాయాజాలాన్ని తిలకించారు. పడవపై పయనిస్తూ అప్పటికప్పుడే కవిత్వం, పాటల ద్వారా తమ తమ అంతరంగాన్ని గోదావరికి విన్నవించుకున్నారు. ఇదే తరహాలో సాగిన ఉత్తర తెలంగాణ కవుల ఉత్తరాంధ్ర యాత్ర ద్వారా ఇరు ప్రాంతాల సామాజిక సాంస్కృతిక తేడాలను సమీక్షించుకున్నారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరాలలో పర్యటించి క్రీ.శ. 4వ శతాబ్దంకు చెందిన చారిత్రక సంపదను చూశారు. ఈ సంపదను ఆ ప్రాంతంవారు కాపాడుకున్న తీరును చూసి అబ్బురపడిన ఈ బృందం, తమ ప్రాంతంలోని కురిక్యాల కోటిలింగాల వంటి సంపదపట్ల నిర్లక్ష్యం వహించడం గుర్తుకువచ్చి బాధను వ్యక్తపరిచారు.

శ్రీకాకుళంలో కారా మాష్టారు ‘కథానిలయం’ చూసిన తర్వాత ‘కవినిలయం’ ఆలోచన దేవేందర్ కు రావడం సహజమే అయినప్పటికీ, తెలంగాణ భాష యాస సంస్కృతి, సంప్రదాయాలతో కూడుకున్న రచనలతో  ఓ నిలయం ఏర్పడితే బాగుండేది. ఈ పనిని తెరవే చేయవలసి ఉండింది. ఎందుకో ఆ దిశగా ప్రయత్నాలు జరుగలేదు. ఉత్తరాంధ్ర కవులు, రచయితలతో ములాఖత్లో ఇరు ప్రాంతాల వారు కలసి ఉండాలనే ఓ మంచి సంప్రదాయానికి తెరలేపారు. 170 మంది కవులు, రచయితలు, తెలుగు పండితులు కలసి బమ్మెర పోతన నడయాడిని నేలను దర్శించుకున్నారు. 15వ శతాబ్దంనాటి ప్రజా కవిని స్ఫూర్తిగా తీసుకోవడానికి చేసిన ఈ యాత్ర మనుషులంతా ఒక్కటేనని నినదించడానికి వీలు కల్పించింది. పోతన భాగవత దృశ్యాలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఆయన నడయాడిన నేల, సమాధి తదితర శాసనాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి ఊపునిచ్చిందనడంలో సందేహం లేదు.

తొలి తెలుగు కవిగా ప్రసిద్ధికెక్కిన పాల్కురి సోమనాథుడు జన్మించిన పాలకుర్తిలోని క్షేత్రం దర్శించుకున్న యాత్రికులలో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసిన వీరశైవ కవి ధన్యుడు. ఇక కొమరం భీం జోడేఘాట్ యాత్ర జల్, జంగల్, జమీన్ పోరాటం యాదికొస్తుంది. గెరిల్లా పంథాలో సాగిన యుద్ధంకు కేంద్ర బిందువుగా మారిన జోడేఘాట్ నిజాంను మెడలు వంచిన సంఘటనలు కళ్ల ముందునుంచి కదిలిపోతుంటాయి. గుట్టల్లోని దట్టమైన అడవుల్లో ఉన్న గిరిజన గూడెంల పోరుబాట తెలంగాణలోని అన్ని పోరాటాలకు మార్గదర్శనం చేసింది. 39 ఏళ్ల వయస్సులో చివరి శ్వాస విడిచినప్పటికీ, నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య పెత్తందారి వ్యవస్థ అంతానికి ఆయన త్యాగం మనల్ని కలవరపరుస్తుంది. నిమ్మపల్లి, గర్జనపల్లి, వీర్నపల్లి తదితర ప్రాంతాలన్నీ ఆనాటి స్వాతంత్ర్య పోరాటానికే కాకుండా తెలంగాణ రైతాంగ పోరాటానికి ఆయువుపట్టులా నిలిచినవి. విముక్తి పోరాటానికి ఈ గ్రామాల ప్రజల త్యాగం, ఈరోజు ఇలా జీవనం సాగిస్తుండటానికి వేసిన మార్గంగా గుర్తించాలి. ఇక్కడి కొండలు, గుట్టలు, చెట్లతో కూడుకున్న కమనీయ ప్రకృతిలో ఒకింత సేదదీరి, ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఆస్కారం కలిగించింది. గోండు గూడెంలో గిరిజనుల మధ్య తిరుగుతూ వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతిని తెలుసుకోవడం యాత్రికుల సామాజిక అవగాహనకు పదును పెట్టుకున్నట్లయింది.

కేరళ, కాశ్మీర్ యాత్రలు అన్నవరం వ్యక్తిగత పర్యటనలైనప్పటికీ, అక్కడి ప్రకృతితో మమేకమవడం కవిగా, రచయితగా కొత్తలోకంలో విహరిస్తూ జీవన వికాసానికి ఆయుర్వేద మాత్రలుగా పనిచేశాయి. ఇక సాహితీ ఉత్సవాలను యాత్రా విశేషాలుగా మలచడం మంచి ప్రయోగం. తిరువనంతపురం సాహితోత్సవంలో 12 భాషల  కవులు, రచయితల మధ్య పాల్గొనడంతో ఆయా రాష్ర్టాల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య విశేషాలను తాను తెలుసుకోవడంతో పాటు చదువరులకు అందించి సంచార బాటను సంపన్నం చేశాడు. ముంబాయిలో తెలంగాణ వాసుల మధ్య గడిపి తన పేగుబంధంతో ముడిపడిన ఆర్తిని పంచుకున్నాడు. మూడు తరాల కథకుల మధ్య ముచ్చట్లు పెట్టినా, ఎన్నీల కాంతిలో అంతరంగాల్ని ఆవిష్కరించుకున్నా… తెలంగాణ జన జీవనస్రవంతిలోని సారాన్ని వొడిసి పట్టుకుని పాఠకుల ముందు పెట్టినట్లయింది. రుద్రంగి గల్ఫ్ వలసల గోసను తన కన్నీటితో కొలిచినా, రచయితల సభల్లో తెలంగాణ కోసం ముచ్చట్లాడినా… దేవేందర్ ను వెంబడించిన జ్ఞాపకాలకు అక్షర ప్రతీకలు.

ఈ యాత్రా సంకలనంలోని ప్రతి సంచారంలో  పోరాట దృక్పథాన్ని మౌలికంగా వ్యక్తం చేశాడని చెప్పుకోవచ్చు. పోరాట ప్రాంతాల చరిత్ర ఏవిధంగా నిర్లక్ష్యానికి గురయిందో సోదాహారణంగా వివరించే ప్రయత్నం చేశాడు. ఈ యాత్రల వల్ల నిర్దిష్టమైన ప్రతిపాదనలతో కొన్ని అంశాలను యాత్రికుల మధ్య చర్చించడానికి ఆస్కారమేర్పడింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడిపడిన తెలంగాణలోని పలు ప్రాంతాలు ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తీరును కవులు, రచయితలు, పండితులు గుర్తించారు.  ఈ సంచారంతో అన్నవరం దేవేందర్ కొత్త పాఠకులను అక్కున జేర్చుకున్నట్లయింది.

*

కోడం పవన్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు