విస్పృహ

చెఱువు గట్టుమీద ఓ కొంగ
చెఱువు నీళ్లలోపల ఓ చేప
ఎవరి పాట్లు వారివి
బతకడానికి
వాడు విసిరే వలకు మాత్రం
ఇద్దరూ సమానమే
ఎవరికేం ఇవ్వాలో ఆ వాడికే బాగా తెలుసు
ఇప్పుడందరి మెదళ్ళనూ వేదికలను చేసుకుని
రాజ్యకాంక్ష జెండాను పాతుకున్నాడుగా
ఎవరికెంత ఇవ్వాలో ఇంకా బాగా తెలుసు
ఇక్కడందరి చేతులకూ భిక్షాపాత్రలను మొలిపించి
ఉచిత సలహాల దానాలు చేస్తూనే ఉన్నాడుగా
భలే చమత్కారి ఆతడు
తలొక్కింటి వేలునూ దోచుకుని
ఐదు వేళ్ళను ప్రోగుచేసుకుంటాడు
ఎంత సహనశీలి అతడు
కలుపు పెరుగుతోందంటే
ఒడుపుగా కత్తిరించగలడు
అవసరపడే వేరు కుంపటి మంటల్ని
రైలు పట్టాలుగా మార్చి సమాంతరంగా నడిపించుకోనూ కలడు
వెయ్యినొక్క కిటుకులు తెలుసాతనికి
హక్కుల్ని ప్రలోభ పెట్టి
బాధ్యతల్ని తన వాకిటి సేవకులుగా మార్చి
నీ నా నవ్వుల్ని తానే నవ్వేయగలడు
నీ నా జేబుల్ని తన దగ్గరే భద్రపరచుకోనూ గలడు
అతడే ఓ సైన్యం
నువ్వు కేవలం ఓ విల్లు
నీ ప్రమేయం ఏమీ లేదు
ఎటు విసిరితే అటు వెళ్లి
అతననుకున్న కుంభస్థలాన్ని కూలకొట్టడమే
అతడే ఓ సాలోచన
నువ్వు కేవలం ఓ మాటవు
నీదేం కష్టం ఉండదు
ఎలా కావాలంటే నిన్నలా
వాడుకోవడం అతని ఎరుకలోని పదం
ఎప్పుడో
ఎందుకో
నీకో స్పృహ కలిగితే
తుంచేయడం అతనికి క్షణాల్లో పని
అతని మాయలో మళ్లీ మునకలేయడం
నీకు మరో జీవితకాల వ్యసనం
*

సుధా మురళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు