విలువల మధ్య సంఘర్షణ “వలస”

“కొత్తావకాయ” సుస్మిత  రాసిన “వలస” నవల, భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన తెలుగు కుటుంబాల జీవితాలను, వారి అనుభవాలను, సందిగ్ధాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని నడిచింది. భారతీయులు అమెరికాలో ఎదుర్కొనే వీసాల సమస్యలు, సాంస్కృతిక వైరుధ్యాలు, కొత్త తరంతో వచ్చే మానవ సంబంధాల వైరుధ్యాలు, పిల్లల పెంపకం, అమెరికన్ స్వేచ్ఛ- భారతీయ విలువల మధ్య సంఘర్షణ లాంటి అనేక అంశాలను ఈ నవల సూటిగా చర్చిస్తుంది.

నవల కేంద్రబిందువయిన స్వామి పాత్ర, ఇంట్లో పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని, మొదటి తరం వలసదారుడిగా అమెరికా వచ్చి, కష్టకాలంలో ఉన్న అనేక తెలుగు కుటుంబాలకు సలహాదారుడిగా, సూత్రధారిగా నిలుస్తాడు. అయితే, అమెరికన్ సంస్కృతిలో ఇమిడిపోయిన స్వామి తన స్వంత కుటుంబంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కొంటాడనేది కథలో హృదయాన్ని కదిలించే అంశం. కల్యాణి పాత్ర ద్వారా అంటీముట్టనట్టుండే పెద్దగా బాధ్యత తీసుకోని భర్తతో, చిన్నారి కూతురు పెంపకంతో ఆమె పడే ఆరాటాన్ని, ఊహించని పరిస్థితుల్లో ఆమె తీసుకునే నిర్ణయాలు పాఠకులను ఆలోచింపజేసేలా రచయిత్రి స్త్రీల సంఘర్షణను చిత్రీకరించారు. అలాగే శ్యామ్ పాత్ర జీవితంలో అనూహ్యంగా వచ్చే శారీరక సమస్యలను, వాటిని అధిగమించే మానసిక స్థైర్యాన్ని హృద్యంగా చిత్రించింది.

సుస్మిత గారి కథన శైలి ఎలాంటి అతిశయోక్తులు, ఉపన్యాసాలు లేకుండా పాత్రల జీవితాలను, సంఘర్షణలను ఒక నిష్పాక్షిక పరిశీలకురాలిలా, ఒక డాక్యుమెంటరీ పద్ధతిలో సర్వసాక్షి కథనంలో ప్రదర్శిస్తుంది. కథలో నాటకీయత కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పే వాస్తవికత కనిపిస్తుంది. నవల ప్రారంభం మరియు ముగింపు ఒకే దృశ్యంతో మొదలై అదే దృశ్యంతో ముగియడం, ఈ వృత్తాకార నిర్మాణం రచయిత్రి ప్రతిభకు నిదర్శనం, ఇది పాఠకుల మనసులో చెరగని ముద్ర వేస్తుంది. “ఈనగాచి నక్కలపాలు చేయకూడదు” అనే వాక్యం ఈ నవలకు కీలకమైంది, ఇది వలస జీవితపు అంతిమ ప్రయోజనం ఏమిటి, దాని వైఫల్యాలు ఏమిటి అనే ప్రశ్నలను పాఠకుల మనసులో మెల్లగా నాటుతుంది. వలస జీవితపు బంధాలను నిలబెట్టే ప్రయత్నంలో, కవిత త్యాగం, కల్యాణి త్యాగం, స్వామి-గోమతి దంపతుల సర్దుబాట్లు, రుక్మిణి-శేషగిరి జంటల ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ కంటే కుటుంబ విలువలకే ప్రాధాన్యతనిచ్చి, ఒక కుటుంబ కేంద్రక సమాజాన్ని ఆదర్శంగా నిలబెట్టడానికి రచయిత్రి ప్రయత్నించారు. అయితే, తురీయ (రియా) పాత్ర, తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత మార్గాన్ని ఎంచుకునే వ్యక్తులకు ప్రతీకగా ఉన్నా, ఆమె పాత్ర ద్వారా భారతీయ తల్లిదండ్రులకు అమెరికన్ స్వేచ్ఛ ఎలా ఒక పీడకలగా మారుతుందో చూపడం, కుటుంబ విలువలను బలంగా నిలబెట్టే ప్రయత్నంలో వ్యక్తిగత స్వేచ్ఛ కొంత వెనక్కి వెళ్లిందని చెప్పవచ్చు.

అయితే, నవలలో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. ప్రధాన కథాంశానికి సంబంధం లేని శంకర్ లాంటి పాత్రల ప్రవేశం, అతని రైలు ప్రయాణం లాంటి సన్నివేశాలు నవల ప్రవాహానికి ఆటంకం కలిగించాయి.

వలస జీవితాల్లో తప్పనిసరిగా ఎదురయ్యే మానసిక ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, ఎన్నారై పిల్లలలో పెరిగే ఒత్తిడిని, దాని తీవ్రతను తగ్గించి, కేవలం క్రీడలు, ఇతర కార్యకలాపాల ద్వారా సమస్య సులభంగా పరిష్కారమవుతుందని చూపడం వాస్తవికతకు దూరంగా ఉంది. అలాగే, భారతీయులు ఎదుర్కొనే ఆహార సంస్కృతి వైరుధ్యాలు, వర్ణ వివక్ష లాంటి అంశాలను, రిషి హత్య సన్నివేశం, కవిత కొడుకు ఆదిత్యకు వివరించే సందర్భానికి మాత్రమే పరిమితం చేయకుండా, మరింత లోతుగా చర్చించే అవకాశం ఉన్నా, రచయిత్రి ఆ కోణాన్ని పెద్దగా స్పృశించలేదు. మరోవైపు, ఈ నవల భారతీయ ఆచారాలు, కట్టుబాట్లు అమెరికాలో ఎలా పాటించబడుతున్నాయో, వలసదారులు తమకు అనుగుణంగా వాటిని ఎలా మార్చుకుంటున్నారో, భారతదేశంలో మరుగున పడుతున్న ఆచారాలను కూడా ఎలా నిలబెడుతున్నారో అందంగా చిత్రీకరించింది.

భాషా పరంగా చూస్తే, సుస్మిత గారి తెలుగు వచనం చాలా మృదువుగా, ప్రవాహంగా ఉండడం వలన ఈ నవలను ఏకబిగిన 5 గంటలలోపే చదవగలిగాను. అయితే, కొన్ని అక్షరదోషాలు, ఒకటి రెండు చోట్ల వ్యాకరణ లోపాలు, కొన్నిచోట్ల తెలుగు పదాలకు బదులుగా ఇంగ్లీష్ పదాల వాడకం సహజత్వం కోల్పోయినట్టు అనిపించాయి. మొత్తంమీద చూస్తే, నిష్పాక్షిక కథనం, వాస్తవిక చిత్రణ, చక్కటి తెలుగు వచనం, ఆలోచింపజేసే ఇతివృత్తం ఈ నవల బలాలు. వలస జీవితాల గురించి తెలుసుకోవాలనుకునే పాఠకులకు, ఆ అనుభవాలలో తమను తాము చూసుకోవాలనుకునే ఎన్నారైలకు ఈ నవల తప్పక చదవదగినది. దీని ప్రవాహం, వచనశైలికి నేను పదికి పది మార్కులు ఇస్తాను.

*

రహ్మానుద్దీన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.