పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహ విధ్వంసం చాలామంది ఆలోచనాపరులను కలచివేసింది.
-
1993లో రాహుల్ సాంకృత్యాయన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బొగ్గు గని ప్రాంతమైన రాణిగంజ్‌లోని కార్మికులు, రచయితలు, ఉపాధ్యాయులు కలసి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు.
-
1994లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9న ఆయన జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ గణతాంత్రిక లేఖక్ శిల్పి సంఘ్ అక్కడ వేడుకలు నిర్వహిస్తోంది.
రాహుల్ సాంకృత్యాయన్ గ్రంథాలు ఎన్నో తెలుగులోకి అనువాదమయ్యాయి. ఆయన తెలుగు పాఠకులకు సుపరిచితుడు. కాల్పనిక రచయితగా, చరిత్రకారుడిగా, తాత్వికుడిగా, పండితుడిగా ప్రసిద్ధుడైన బహుముఖీన ప్రతిభగల రాహుల్ సాంకృత్యాయన్‌లో నన్ను ప్రధానంగా ఆకర్షించినది ఆయన బహుముఖీన పాండిత్యం, తత్వం . ఆయన కాల్పనిక సాహిత్యాన్ని పట్టించుకున్నంతగా, ఆయన చేసిన గొప్ప పండిత చర్చలను తెలుగు సమాజం పట్టించుకోలేదు. ప్రధానంగా సనాతన బ్రాహ్మణులతో ఆయన చేసిన చర్చలు విశేషంగా పరిశీలించదగినవి. వర్ణాశ్రమ ధర్మాలను, కుల వ్యవస్థను గట్టిగా సమర్థించిన గొప్ప పండితుడు, రాజకీయ నేత, సన్యాసి అయిన కరపాత్రి స్వామితో (Karpatri Swami) ఆయన ముఖాముఖి చేసిన చర్చలు ఈనాటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నాయి.
ముఖ్యంగా భారతదేశంలో హిందూత్వ బలపడి, రామాలయ నిర్మాణం మరియు ‘రామరాజ్య’ భావన విస్తరిస్తున్న ఈ కాలంలో, రామరాజ్యం అనే భావన గురించి కరపాత్రి స్వామి, రాహుల్ సాంకృత్యాయన్ జరిపిన చర్చలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
స్వామి కరపాత్రి ‘మార్క్స్ వాద్ ఔర్ రామరాజ్య’ (Marxvad aur Ramrajya) అనే గ్రంథాన్ని రాశారు. దానికి సమాధానంగా రాహుల్ సాంకృత్యాయన్ ‘రామరాజ్య ఔర్ మార్క్స్ వాద్’ (Ramrajya aur Marxvad) అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సాంకృత్యాయన్ బౌద్ధం, బ్రాహ్మణ వైదిక తత్త్వశాస్త్రం, మార్క్సిజం వంటి విషయాలను కూలంకషంగా చర్చించారు.
పీపుల్స్ డెమోక్రసీ పత్రిక ఆగస్టు 2026 సంచికలో మాలిని భట్టాచార్య రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహ విధ్వంసాన్ని ఖండిస్తూ రాసిన వ్యాసంలో — రాహుల్ సాంకృత్యాయన్ తన ‘రామరాజ్య ఔర్ మార్క్స్ వాద్’ పుస్తకంలో సనాతనవాదుల విమర్శలను ఖండిస్తూ, మతాన్ని ఉపయోగించి జరిగే దోపిడీని మూఢనమ్మకాలను మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద కోణంలో తీవ్రంగా వ్యతిరేకించారని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ఈ పుస్తకం 1993లో పశ్చిమ బెంగాల్‌లో బెంగాలీ భాషలోకి (Ramrajya O Marxbad) అనువాదమై పునర్ముద్రించబడింది. రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహ స్థాపన సందర్భం అది. దేశంలో రామరాజ్య భావన విస్తరిస్తున్న సమయంలో ఈ పుస్తకానికి ప్రాసంగికత ఉందని భావించి ప్రచురణకర్తలు దానిని బెంగాలీలో ముద్రించారు. సరిగ్గా అక్కడ, 33 సంవత్సరాల తర్వాత (2026లో) రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహమే ధ్వంసం కావడం యాదృచ్ఛికం కాదు; అది హిందూత్వ ఫాసిజం యొక్క విస్తరణను సూచిస్తుంది.
పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు నక్సలైట్లు జాతీయ నాయకులను బూర్జువా భావాలు కలవారిగా, విప్లవ వ్యతిరేకులుగా భావించి వారి విగ్రహాలను ధ్వంసం చేశారు; అది చరిత్ర.తర్వాతి కాలంలో నక్సలైట్ నాయకుల్లో కొందరు (కె.వేణు వంటివారు) ఈ విగ్రహాల ధ్వంసకార్యాన్ని తీవ్ర రాజకీయ వ్యూహాత్మక పొరపాటుగా అంగీకరించారు.
ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహం ధ్వంసమైంది. బహుశా ఆయన కేవలం బౌద్ధుడు మాత్రమే కాక కమ్యూనిస్ట్ కూడా కావడం వలన వారు అలా ధ్వంసం చేసి ఉండవచ్చు. మతతత్వ ధోరణి అనేది పండితులను కూడా గౌరవించటానికి ఆటంకంగా నిలుస్తుంది. రాహుల్ సాంకృత్యాయన్ కానీ, అత్యంత చాందసవాదిగా భావించబడే కరపాత్రి స్వామి కానీ పరస్పరం చర్చించాలని మాత్రమే భావించారు; చాలా గౌరవంగా, పాండిత్యపూర్వకంగా చర్చించారు. అటువంటి ధోరణి పోయి విగ్రహాలను ధ్వంసం చేయడం, దాడులు చేయడం అనేది భారతదేశపు ప్రాచీన సంవాద సంప్రదాయానికే ప్రమాదకరం. హిందూత్వవాదులు దీనిని ఒక సానుకూల ధోరణిగా, దేశభక్తిగా, జాతీయవాదంగా ప్రచారం చేస్తుంటారు; అది అసలైన ప్రమాదం.
ఇలా భావజాలాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తూ సంవాదానికి ద్వారాలు మూసేస్తున్న కాలంలో, మళ్ళీ కేవలం విగ్రహాలను నెలకొల్పడం కంటే సంవాద సంప్రదాయాన్ని బలపరచడం అత్యంత ప్రధానం. అదే నిజానికి విగ్రహ స్థాపన కన్నా ఎక్కువగా ప్రజాస్వామిక ధోరణులను బలపరచడానికి ఉపయోగపడుతుంది; తద్వారా మనలో సృజనాత్మకతను, సంవాద దృష్టిని పెంచుతుంది.
భారతదేశపు సంవాద సంప్రదాయం (Tradition of Dialogue / Discussion)ఎంత గొప్పది అంటే— వర్ణాశ్రమ ధర్మ సమర్థనతో విరుచుకుపడిన కరపాత్రి స్వామి, ఈనాడు దేశమంతా ఆవిష్కరిస్తున్న సంఘపరివార్, RSS లను విమర్శిస్తూ కూడా ఒక గ్రంథం రాశారు. ఆ పుస్తకమే ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఔర్ హిందూ ధర్మ్’ (Rashtriya Swayamsevak Sangh aur Hindu Dharm). ఇందులో ఆయన RSS భావజాలం, ఎమ్. ఎస్. గోల్వాల్కర్ ఆలోచనలు సాంప్రదాయ హిందూ ధర్మానికి వ్యతిరేకమని, వారు పాశ్చాత్య ఫాసిజం వైపు మొగ్గు చూపుతున్నారని తీవ్రంగా ఖండించారు.
(స్వామి కర పాత్రి (1907–1982) సనాతన ధర్మ పరిరక్షణకు, అద్వైత వేదాంత ప్రచారానికి కృషి చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మరియు ‘అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్’ రాజకీయ పార్టీ స్థాపకుడు. శాస్త్ర ఆధారిత ధర్మ పరిరక్షణ, గోహత్య నిషేధం కోసం ఉధృత ఉద్యమాలు నడిపిన ఆయన ‘వేదార్థ పారిజాతః’, ‘మార్క్సవాద్ అవుర్ రామ్‌రాజ్య’, ‘రామాయణ్ మీమాంస’, ‘భక్తి రసార్ణవ్’ వంటి గ్రంథాలను రచించారు.)
ఇది భారతీయ తత్వంలో ఉన్న సంక్లిష్టతను సూచిస్తుంది. వర్ణాశ్రమ ధర్మ తత్పరుడైన కరపాత్రి స్వామి, RSS ని విమర్శిస్తూ ఒక పెద్ద ఖండన గ్రంథమే రాశారు అనేది ఒక విశేషమైన విషయం. సాధారణంగా పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని గురించి మాట్లాడే మన భారతీయులు, ఈ భారతీయ సంప్రదాయాల్లోని సంక్లిష్టతను, లోతును అర్థం చేసుకోవడానికి తగినంత ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ప్రయత్నం చేసినా దాన్ని ఒక ప్రోటెస్టెంట్-క్యాథలిక్ విభేదంగానో, సంప్రదాయవాదం-ప్రగతిశీలత మధ్య విభేదంగానో, ప్రాచీనత-ఆధునికత మధ్య వైరుధ్యంగానో సరళీకరించారు. దీనివల్ల నిజానికి మనము ఏ తత్వవేత్తనూ, ఏ మేధావినీ, ఏ పండితుడినీ సరిగ్గా అర్థం చేసుకోవడంలో సఫలం కాలేము.
నేను చెప్పేది ఏమిటంటే— మనం కమ్యూనిస్టుగా, బౌద్ధుడిగా గౌరవించే రాహుల్ సాంకృత్యాయన్‌ను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆయనతో విభేదించి తలపడిన కరపాత్రి స్వామిని కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయడం అంతే ముఖ్యం. వీళ్ళిద్దరినీ కేవలం పరస్పర శత్రువులుగా కాకుండా, ఒకరినొకరు పూర్ణత వైపు నడిపే పూరకాలుగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
కరపాత్రి స్వామి సిద్ధాంతాలను ఎంత విమర్శించినప్పటికీ, ఆయన నిరాడంబరత్వాన్ని, పాండిత్యాన్ని, నిజాయితీని రాహుల్ సాంకృత్యాయన్ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలాగే గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, వారి చర్చలు మరియు సంభాషణలు పరస్పర గౌరవంతో సాగేవి. ఇది భారతీయ సంవాద సంప్రదాయం యొక్క విశిష్టత.
నక్సలైట్లు జాతీయ నాయకుల విగ్రహాలనే ధ్వంసం చేశారు. కానీ ఈనాడు హిందూ జాతీయవాదం వల్ల వచ్చే ముప్పును తాత్వికంగా మొదట విశ్లేషించినది, నక్సలైట్లు ‘బూర్జువా’గా భావించిన రవీంద్రనాథ్ ఠాగూర్. కనుక కమ్యూనిస్ట్ తీవ్రవాదం ఎంత మేలు చేసిందో, అంత కీడు కూడా చేసింది; సత్యం యొక్క మరో ముఖాన్ని చూడటానికి అది ఆటంకంగా నిలిచింది. కమ్యూనిస్టులు విప్లవ పంథాను ఎంచుకున్న మాట నిజమే అయినప్పటికీ, వారు బహుముఖీనమైన సత్యాన్ని తమ తక్షణ రాజకీయ అవసరాల కోసం బలిపెట్టారు. మనం ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారి జాతీయవాద విమర్శలు, మాతృభాషల ఆవశ్యకతపై వారు చేసిన సృజనాత్మక విశ్లేషణలను తిరిగి పునరుద్ధరించుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. కెన్యా రచయిత కమ్యూనిస్టు ఙ్గూగీ వా థియోంగో (Ngũgĩ wa Thiong’o) తన ‘డికలోనిజంగ్ ది మైండ్’ (Decolonising the Mind – 1986) అనే వలసవాద వ్యతిరేక గ్రంథానికి మూలం ఠాగూర్ ఆలోచనలేనని స్వయంగా చెప్పారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే— ఒక సంప్రదాయవాది అయిన కరపాత్రి స్వామికి, భౌతికవాది బౌద్ధ కమ్యూనిస్ట్ అయిన రాహుల్ సాంకృత్యాయన్‌కు మధ్య ఉన్న సంభాషణను అర్థం చేసుకోవడానికి మనకు విశాల దృక్పథం అవసరం. వారిని కేవలం శత్రువులుగా చూడటం కుదరదు; కరపాత్రి స్వామి RSS పై రాసిన ఖండన గ్రంథం నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఈ సంక్లిష్టతను చెప్పడం కోసమే ఇంత ఉపోద్ఘాతం రాయవలసి వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ గురించి రాసే వ్యాసంలో ఆయనను వ్యతిరేకించిన వ్యక్తులను కూడా మనం జాగ్రత్తగా, మెలకువతో అర్థం చేసుకోవాలి అని చెప్పడమే నా ఉద్దేశం. సాధారణంగా అందరూ నడిచే దారి కాకపోవడం వలన నేను ఈ ప్రత్యేక స్పష్టతను ఇవ్వవలసి వస్తోంది.
వర్ణవ్యవస్థ సమర్థకులు – కుల నిర్మూలన వాదం
రాహుల్ సాంకృత్యాయన్ చేసిన ఒక విమర్శ ఇక్కడ ప్రధానంగా పరిశీలించదగినది. కులం విషయంలో సంస్కరణ భావాలు కలిగిన హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. (RSS) వంటి సంఘ పరివార సంస్థల కంటే, కరపాత్ర స్వామి (స్వామి కరపాత్రి) భావాలు — ముఖ్యంగా ఆయన స్థాపించిన ‘రామరాజ్య పరిషత్’ అనే రాజకీయ పార్టీ భావాలు — అత్యంత సంకుచితంగా ఉన్నాయని, అవి కులవ్యవస్థను ప్రత్యక్షంగా సమర్థించేలా ఉన్నాయని రాహుల్ సాంకృత్యాయన్ తీవ్రంగా తప్పుబట్టారు.
రాహుల్ సాంకృత్యాయన్ రాసిన “రామరాజ్య ఔర్ మార్క్స్ వాద్” అనే పుస్తకంలోనూ, దాని బెంగాలీ అనువాద గ్రంథం (“రామ్‌రాజ్య ఓ మార్క్స్‌బాద్” – 1993) ముందుమాటలోనూ ఇదే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.
బెంగాలీ అనువాదం ముందుమాటలోని ముఖ్యాంశం: కరపాత్రి స్వామి వంటి సంప్రదాయవాదులు ప్రతిపాదించే కులవ్యవస్థ సమర్థనను, వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణను బెంగాలీ అనువాదకులు ఫాసిజంతో పోల్చారు. మానవ సమాజంలో పుట్టుక ఆధారంగా హెచ్చుతగ్గులను సమర్థించడం ఫాసిజం యొక్క క్రూరమైన రూపాన్ని గుర్తుచేస్తుందని, సమానత్వానికి ఇది పూర్తిగా విరుద్ధమని ఇందులో విశ్లేషించారు.
అయితే, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన వి.డి. సావర్కర్, హిట్లర్ ఫాసిస్టు భావాలనే సమర్థించాడు. హిందుత్వ అనే భావజాలానికి మూలపురుషుడు ఈయనే కావడం విశేషం. ఈ వైరుధ్యాన్ని రాహుల్ సాంకృత్యాయన్ కానీ, బెంగాలీ అనువాదకులు కానీ పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయారు.
అందువల్లనే, ఆర్.ఎస్.ఎస్. మరియు ఇతర హిందూ పరివార సంస్థలు కేవలం బ్రాహ్మణుల్లోనే మిగిలిపోకుండా, అన్ని కులాలలోకి — ముఖ్యంగా దళిత, బహుజన, గిరిజనుల్లోకి — ఎలా విస్తరించాయో (చొచ్చుకెళ్లాయో) అర్థం చేసుకోవడంలో విమర్శకులు విఫలమయ్యారు. అదే సమయంలో, కరపాత్ర స్వామి వంటి ఉగ్ర బ్రాహ్మణ సంప్రదాయవాదులు మరియు కుల సమర్థకులు ఇటువంటి ఫాసిస్టు/సంస్కరణాత్మక సంస్థలను ఎందుకు వ్యతిరేకించారో కూడా అర్థం చేసుకోవడంలో వారు సఫలీకృతులు కాలేకపోయారు.
ఇటీవలి పరిణామాల తర్వాత, ఉత్తరాదిలో బ్రాహ్మణ, రాజపుత్ర వంటి అగ్రవర్ణాల వారు కూడా బిజెపికి ఓటు వేయకూడదని దేవుళ్ల ప్రమాణాలు చేయడం గమనార్హం. అలాగే శంకరాచార్యులు సైతం( ఉదాహరణకు జ్యోతిర్మయ్ పీఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ) సంఘ పరివార సంస్థలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు; సంఘ పరివార్ వారు హిందూ ధర్మానికి వ్యతిరేకులని చాటుతున్నారు.
అయినప్పటికీ, భారతీయ సంస్కృతిలోని ప్రత్యేకతలను ఇతర కమ్యూనిస్టుల కంటే రాహుల్ సాంకృత్యాయన్ చాలా బాగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా భౌతికవాదం–భావవాదం, ఆస్తికత్వం–నాస్తికత్వం అనే విభజనల మధ్య ఆయన ఇరుక్కుపోలేదు. అందువల్లనే, కరపాత్ర స్వామి వంటి సంప్రదాయ పండితుడికి దీటుగా నిలబడగలిగిన గొప్ప ప్రాచ్య విద్వాంసుడిగా రాహుల్ సాంకృత్యాయన్ అనేక చోట్ల కనిపిస్తారు.
తన ప్రత్యర్థి కరపాత్రి స్వామిని ఒక గొప్ప పండితుడిగా గుర్తిస్తారు రాహుల్ సాంకృత్యాయన్. అదే సమయంలో ఆయన ప్రమాణాలతోనే ఆయనను ఎదుర్కొంటారు. భారతీయ తత్వశాస్త్రంలో వితండవాదం అనే ఒక తార్కిక పద్ధతి ఉంది. ఆ తార్కిక పద్ధతి ప్రకారం ఇతరుల ప్రమాణాలతోనే ఇతరులను ఖండించడం జరుగుతుంది. స్వపక్షాన్ని స్థాపించకుండానే, పరపక్షాన్ని వారి పద్ధతులతోనే ఖండించటం వితండవాదం. ఈ సంక్లిష్ట పద్ధతిని అద్వైత వేదాంతంలో శ్రీహర్షుడు ‘ఖండనఖండఖాద్యం’ అనే గ్రంథంలో ప్రత్యేకంగా ఉపయోగించాడు. ఇదే తార్కిక పద్ధతిని రాహుల్ సాంకృత్యాయన్ కరపాత్రి స్వామిపై ఎక్కుపెట్టారు.
కరపాత్రి స్వామి హిందూ ధర్మానికి ఈశ్వరుడిని ఇరుసుగా భావిస్తారు. అదే సమయంలో కమ్యూనిజాన్ని నాస్తిక సిద్ధాంతమని ఈసడించుకుంటారు. దీన్ని రాహుల్ సాంకృత్యాయన్ తిప్పికొడతారు.
వైదిక దర్శనాలుగా చెప్పబడే ఆరింటిలో మూడు దర్శనాలు పూర్తిగా నాస్తికమైనవని గుర్తుచేస్తారు రాహుల్ సాంకృత్యాయన్. ప్రధానంగా బ్రాహ్మణ వైదిక పద్ధతిపై ఆధారపడిన పూర్వమీమాంస (లేక కర్మమీమాంస) అనబడే దర్శనంలో దేవుడు అనే భావన లేదు; మంత్రాలే, కర్మకాండే స్వయంగా ఫలితాన్ని యిస్తాయని వారు భావిస్తారు. అలాగే సాంఖ్య, వైశేషిక దర్శనాలలో కూడా దేవుడు అనే భావన లేదు; సృష్టి స్వయంసిద్ధంగా చలిస్తుందని వారు భావిస్తారు.
అద్వైత వేదాంతంలో కూడా అంతిమంగా దైవం లేడు. బ్రహ్మజ్ఞానం కలిగాక సృష్టి కూడా మిథ్య అని తేలుతుంది. అప్పుడు సృష్టికర్త ఉండడు, అలాగే వేద ప్రామాణ్యత కూడా ఉండదు. అందువల్ల అద్వైతంలో వేద ప్రామాణ్యత నిలవదని రాహుల్ సాంకృత్యాయన్ చెప్తారు. అందువల్ల వేదాన్ని పదేపదే ప్రమాణంగా చెప్పే అద్వైత వేదాంతి స్వామి కరపాత్రి వాదన స్వవ్యాఘాతంగా (Self-contradictory) మారుతుందని అంటారు రాహుల్ సాంకృత్యాయన్.
అంటే స్వామి కరపాత్రి అనుసరిస్తున్న అద్వైత వేదాంతం అంతిమంగా ఒక పవిత్ర గ్రంథం పైన కానీ, దేవుడి పైన కానీ ఆధారపడినది కాదు అని తేల్చేస్తారు రాహుల్ సాంకృత్యాయన్. కానీ కరపాత్రి స్వామి తన్ను తాను, అలాగే హిందూ ధర్మాన్ని దైవంపై తీవ్రమైన నమ్మకం ఉన్న సిద్ధాంతంగా చిత్రీకరించడాన్ని రాహుల్ సాంకృత్యాయన్ తప్పుపడతారు. మరి దైవం గురించి, ఈశ్వరుడి గురించి అంత ప్రత్యేకమైన వక్కాణింపు ఎందువలన స్వామిలో ఉంది?
నిజానికి భారతీయ తత్వశాస్త్రంలో ఆస్తిక-నాస్తిక భేదం అనేది దేవుడి ఉనికిపై ఆధారపడినది కాదు; వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడంపై ఆధారపడినది. దానివల్లనే దేవుడిని ఏమాత్రం అంగీకరించని పూర్వమీమాంస వైదిక దర్శనంగా విరాజిల్లింది. మరి అలాంటప్పుడు స్వామి కరపాత్రి ఈశ్వరుడు, దైవం అనేదానిని ఒక కేంద్రంగా ఎందుకు చేశారు? అంత ప్రత్యేకంగా ఎందుకు నొక్కి వక్కాణించారు?
నేను అనుకోవడం—ఇటువంటి తీవ్రత రమణ మహర్షి, కంచి పరమాచార్య, చంద్రశేఖర భారతి స్వామి వంటి వారి సంభాషణలలో కూడా అంతగా కనబడదు. స్వయంగా రాజకీయ నాయకుడైన స్వామి కరపాత్రి, అబ్రహామిక్ మతాల (Abrahamic religions) ప్రభావం వల్ల ఈ దైవకేంద్రకతను ఆశ్రయించి ఉండవచ్చు.
అయితే స్వామి కరపాత్రి తీవ్ర వర్ణాశ్రమ ధర్మ తత్పరుడైనప్పటికీ, అబ్రహామిక్ మతాల పట్ల లేదా ఇతర మతాల పట్ల ద్వేషాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు. ముఖ్యంగా ‘ఆర్ఎస్ఎస్ ఔర్ హిందూ ధర్మ్’ (RSS Aur Hindu Dharm) అనే పుస్తకంలో సంఘపరివార్‌లో ఉన్న ముస్లిం ద్వేషాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌ను హిట్లర్, ముస్సోలినిలను అనుసరించే వారిగా ఈసడించుకున్నారు.
భారతదేశాన్ని ‘పుణ్యభూమి’గా అంగీకరించని వారందరూ విదేశీయులు, విజాతీయులు అనే సిద్ధాంతాన్ని ఆయన నిరసించారు. ముఖ్యంగా సావర్కర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం హిందువులకే, హిందూత్వ ఉనికికే ముప్పుగా పరిణమిస్తుందని స్వామి అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న హిందువులను ఇదే ప్రమాణంతో దూరం పెట్టే ప్రమాదం ఉందని స్వామి గుర్తించారు. ఏకశిలారూప మతవిశ్వాసాలను, హిందూత్వాన్ని ఆయన కుల బహుళత్వం ఆధారంగా తిరస్కరించారు. వర్ణాశ్రమ ధర్మ తత్పరత కలిగిన ఒక సంప్రదాయవాది ఆధునిక హిందూ జాతీయవాదంపై తిరుగుబాటు చేసిన విధానం ఇది.
రాహుల్ సాంకృత్యాయన్, కరపాత్రి స్వామిని ఒక యథాతథవాది (Status Quoist) గాను, మార్పుకు వ్యతిరేకిగాను విమర్శించారు. కరపాత్రితో పోలిస్తే జనసంఘ్‌లో కొంత సంస్కరణ భావాలు ఉన్నాయని ఆయన భావించారు.
అయితే 1957లో రాసిన ‘ఆర్ఎస్ఎస్ ఔర్ హిందూ ధర్మ్’ పుస్తకంలో కరపాత్రి స్వామి — “ఆర్ఎస్ఎస్‌కు సనాతన హిందూ ధర్మంతో గానీ, భారతీయ ఆధ్యాత్మికతతో గానీ, భారతీయ తత్వంతో గానీ ఏమాత్రం సంబంధం లేదు” అని చేసిన విమర్శ ఇప్పటికీ ప్రాసంగికత (ప్రస్తుత సందర్భానికి ప్రాముఖ్యత) కలిగి ఉంది.
ముఖ్యంగా ఆయన చేసిన ప్రధాన విమర్శ ఏమిటంటే — ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్, అలాగే సావర్కర్ వంటివారు భారతీయ స్థానికతతో ఎటువంటి సంబంధం లేనివారని, విదేశీ జాతీయవాదం, ఫాసిజం, నాజీయిజం మరియు ప్రొటెస్టెంట్ క్రైస్తవం నుండి స్ఫూర్తి పొందారనే సత్యాన్ని ఆయన బట్టబయలు చేశారు.
నిజమే, ఆనాటి జనసంఘ్ పట్టణ మధ్యతరగతితోనే ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఈనాటి హిందూత్వం కూడా పట్టణవాసులతో, పట్టణ మధ్యతరగతితోనే ఎక్కువ సంబంధం కలిగి ఉండి, గ్రామీణ ప్రాంతాలతో తక్కువ సంబంధాన్ని కలిగి ఉంది. అయితే కరపాత్రి స్వామి భూస్వామ్య వ్యవస్థను సమర్థించారు. ఆయనకు గ్రామీణ వ్యవస్థతో ఉన్న అనుబంధం వల్ల కావచ్చు, ఆధునిక హిందూత్వాన్ని మూలమట్టంగా కదిలించే కొన్ని ప్రతిపాదనలు ఆయన చేయగలిగారు.
మార్క్సిస్టు దృక్పథంలోని పరిమితుల వల్ల కావచ్చు, ఈ విమర్శనా ధోరణిలోని సానుకూల అంశాలను రాహుల్ సాంకృత్యాయన్ పసిగట్టలేకపోయారు. పైగా, కరపాత్రి కన్నా సంఘ పరివార్ వారే మెరుగు అనే భావనను కలిగి ఉన్నారు. ఇక్కడ ‘యథాతథవాదం – సంస్కరణవాదం’ (Orthodoxy vs Reformism) అనే బైనరీ థింకింగ్‌లో రాహుల్ సాంకృత్యాయన్ ఇరుక్కుపోయారు.
రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘రామరాజ్య ఔర్ మార్క్స్ వాద్’ పుస్తకాన్ని1993లో బెంగాలీ అనువాదంగా ప్రచురించిన ప్రచురణకర్తలు కూడా — స్వామి కరపాత్రి ఆలోచనలను కొనసాగించేదే ‘హిందూ ఫాసిజం’ అని తమ ముందుమాటలో పేర్కొన్నారు. అదే సందర్భంలో స్వామి కరపాత్రి ఆర్ఎస్ఎస్‌ను ఖండిస్తూ ఒక పుస్తకం రాశారనే సంగతిని వాళ్లు ప్రస్తావించలేదు.
కరపాత్రి స్వామి — పురుషసూక్తం ఆధారంగా, అలాగే సంస్కృత, భారతీయ, తాత్విక, వైదిక ప్రస్తావనల ఆధారంగా హిందూ జాతీయవాదాన్ని, ‘హిందూ మతం’ అనే భావనను డిరైవ్ (ఉత్పత్తి) చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని సప్రమాణంగా, తార్కికంగా ఖండించారు. ఆ విధంగా హిందుత్వకు ఎలాంటి శాస్త్రీయ మూలాలు లేవని ఆయన తీవ్రంగా దాడి చేశారు.
అదే సమయంలో ఆర్యసమాజ్ లాంటి వారు చేసే ‘ఘర్ వాపసీ’ — అంటే ఇతర మతాల వాళ్లను హిందూ మతంలోకి లేదా ఆర్య మతంలోకి తీసుకురావడం కోసం చేసే శుద్ధి కార్యక్రమాన్ని, అవి వైదిక ధర్మ విరుద్ధమని నిరసించారు. ఇది ఆనాడు శుద్ధి కార్యక్రమంతో జరిగిన తంతుకు, ఈనాటికీ జరిగే తంతుకు పూర్తి విరుద్ధం. ఇప్పటికీ ఆర్యసమాజ్‌వాళ్లు కరపాత్రి స్వామి గురించి సామాజిక మాధ్యమాలలో ఇదే విషయంపై వ్యతిరేకంగా రాస్తూనే ఉంటారు.( ఆర్య సమాజ్ కుల నిర్మూలన వాద సంస్థ . పురాణాలను కూడా తిరస్కరించిన హేతువాద భావాలు గల హిందూ సంస్కరణ సంస్థ. అయితే ముస్లిం మైనారిటీ వ్యతిరేకతని ద్వేషాన్ని పెంచి పోషించడంలో ఈ సంస్థ ముందుంది అనే ఆరోపణలు ఉన్నాయి )
మరి ఇటువంటి మౌలిక విషయాలను, కేవలం ఆయన ఒక సంప్రదాయవాది కావడం వల్లే పక్కన పెట్టేశారు. ఎంతో పాండిత్యం ఉన్న సహృదయుడైన రాహుల్ సాంకృత్యాయన్ కూడా దీనిని ఎందుకు పట్టించుకోలేదు? కరపాత్రి స్వామి యొక్క ఈ వాదాన్ని ముందు తీసుకెళ్లి ఉంటే, హిందూ ఫాసిజానికి మరింత దెబ్బ తగిలేది; దాని మూలాలే కనుమరుగయ్యేవి.
నిజానికి కరపాత్రి స్వామి ఆర్ఎస్ఎస్ వారికి, సంఘ పరివార్‌కు విరుద్ధంగా చేసిన వాదనలను ముందుకు తీసుకెళ్లి మరింత పరిపుష్టం చేయగల శక్తి రాహుల్ సాంకృత్యాయన్‌కు మాత్రమే ఉంది. అటువంటి తాత్విక పరిణతి ఆయనలో ఉంది. కానీ దానిని ఆయన ఎందువల్ల వినియోగించలేదు? కరపాత్రిలోని భూస్వామ్య, ప్రాచీన సనాతన లక్షణాలను ఖండించడంలో చూపించిన శ్రద్ధను, ఫాసిజంపై కరపాత్రికి ఉన్న అవగాహనను అర్థం చేసుకోవడంలో చూపించలేదు.
నిజానికి ఆధునిక హిందుత్వాన్ని పరిపుష్టం చేసిన గ్రీకు దేశానికి చెందిన సావిత్రీ దేవి (Maximiani Portas) గానీ, సావర్కర్ గానీ ఆధునికులే కానీ సనాతనులు కారు. వారికి ఆధునికత, పారిశ్రామికత, జాతీయత, ఫాసిజం, నాజీయిజంలపై ఉన్న శ్రద్ధ హిందూ ధర్మంపై లేనే లేదు. (ప్రధానంగా హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ హిందువులలోని మూఢాచారాలను, కులతత్వాన్ని, అస్పృశ్యతని, గుళ్ళ చుట్టూ తిరిగే భక్తి భావాన్ని, గో పూజని, బ్రాహ్మణ సంప్రదాయాలని అన్నిటిని హేతువాదంతో తిరస్కరించిన వాడు. )వారు ఆధునిక యుగంలో ఒక కేంద్రీకృతమైన అధికారానికి, నియంత్రణకు, నియంతృత్వానికి కారణమయ్యారు. ఆశ్చర్యకరంగా, ఆధునికుడైన రాహుల్ సాంకృత్యాయన్ కాకుండా సనాతన ధార్మికుడైన కరపాత్రి స్వామి మాత్రమే ఆధునిక హిందుత్వంపై ఒక గ్రంథం రాయడం విశేషం. ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం.
రాహుల్ సాంకృత్యాయన్ అంటే ఆర్ఎస్ఎస్ వారికి, హిందూత్వవాదులకు ఎందుకంత కోపం? విగ్రహం పడగొట్టేంత కోపం ఎందువల్ల? ఆయన కమ్యూనిస్టు కావడం వల్లనా, లేక ఆయన బౌద్ధ పండితుడు కావడం వల్లనా?
అయితే రాహుల్ సాంకృత్యాయన్‌కు, నవబౌద్ధులకు (Neo-Buddhists) మౌలికమైన తేడా ఉంది. ఆయన దృష్టిలో బౌద్ధం అంతరించడానికి బ్రాహ్మణులు గానీ, బ్రాహ్మణవాదం గానీ కారణం కాదు. ఆయన మార్క్సిస్టు దృష్టితో సాధారణంగా మత భావనను వ్యతిరేకించారు, కానీ ‘బ్రాహ్మణిజం’ అనే ప్రత్యేక ఆలోచనల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. పైగా ‘బుద్ధ చరియ’ గ్రంథానికి రాసిన ముందుమాటలో — “బౌద్ధులను శంకరాచార్యులు అంతమొందించాడు, హతమార్చాడు” అనే కథనాలను ఆయన ఖండించారు. అంతర్గత బలహీనతలు, ముస్లింల దాడులే బౌద్ధం అంతరించడానికి ప్రధాన కారణాలని ఆయన అన్నారు. ఈ నేరాన్ని శంకరాచార్యుడిపై మోపడానికి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంకా నవబౌద్ధులు చెప్పే పుష్యమిత్ర శుంగుడు వంటి చారిత్రక కథనాలను ఆయన ఆశ్రయించలేదు.
ఆ విధంగా రాహుల్ సాంకృత్యాయన్ కూడా మన సంప్రదాయ పద్ధతిలోనే వారిని ఖండించడానికి ప్రయత్నించారు. భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించడాన్ని మార్క్సిజంలో భాగంగా చేశారు; అలాగే భూస్వామ్య లక్షణాలను, ప్రాచీన నమ్మకాలను మౌలికంగా ఖండించారు. కానీ ‘బౌద్ధ-బ్రాహ్మణ’ బైనరీని ఆయన సృష్టించలేదు, దానిపై ఆధారపడనూ లేదు. ఇది నవబౌద్ధుల కంటే భిన్నమైన వైఖరి.
అయితే బ్రాహ్మణ తత్త్వశాస్త్రం కంటే, వైదిక దర్శనాల కంటే బౌద్ధం మార్క్సిజానికి చాలా దగ్గర అని ఆయన వాదించారు. బౌద్ధంలో ‘గతితార్కిక భౌతికవాదానికి’ (Dialectical Materialism) మూలాలను వెతికారు. “మార్పే సత్యం” అనే మార్క్సిస్టు సిద్ధాంతానికి బౌద్ధంలోని ‘క్షణికవాదం’ చాలా దగ్గరగా ఉంటుందని ఆయన భావించారు. అయితే రాంభట్ల అనే తెలుగు కమ్యూనిస్టు మేధావి అద్వైత వేదాంతాన్ని మార్క్సిజానికి దగ్గర త్రోవగా భావించారు తన ఆత్మ కథలో,
రాహుల్ సాంకృత్యాయన్ రాసిన అత్యంత ప్రామాణిక తత్వశాస్త్ర గ్రంథం ‘దర్శన్ – దిగ్దర్శన్’ (Darshan-Digdarshan) లోని చారిత్రక, దార్శనిక విశ్లేషణను ఆధారంగా చేసుకుని, భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ బహుళత్వాన్ని (Pluralism) మరియు దార్శనిక వైవిధ్యాలను మరింత విపులంగా క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు:
బహుళత్వ నిరూపణ – ‘దర్శన్ – దిగ్దర్శన్’ ఆధారంగా:
రాహుల్ సాంకృత్యాయన్ మార్క్సిస్టు సిద్ధాంతం బౌద్ధ దర్శనానికి దగ్గరగా ఉందని పేర్కొన్నప్పటికీ, బ్రాహ్మణ (వైదిక) – బౌద్ధ సంప్రదాయాల మధ్య ఎటువంటి కృత్రిమ ద్వంద్వాన్ని (Binary Opposition) కానీ, పరస్పర విరుద్ధమైన విభజనను కానీ సృష్టించలేదు. వైదిక లేదా బ్రాహ్మణ సంప్రదాయం అనేది ఏకశిలా సదృశమైనది (Monolithic) కాదని, దానిలో ఎంతో దార్శనిక వైవిధ్యం దాగి ఉందనే సత్యాన్ని ఆయన నొక్కివక్కాణించారు. వైదిక తత్వశాస్త్రం అంటే కేవలం దేవుడు, పూజలు, పునస్కారాలకే పరిమితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు.
తన ‘రామరాజ్య ఔర్ మార్క్స్ వాద్’ (Ramrajya aur Marxvad) గ్రంథంలోనే కాకుండా, ‘దర్శన్ – దిగ్దర్శన్’ లో కూడా ఈ అంశాలను రాహుల్ సాంకృత్యాయన్ విస్తృతంగా విశ్లేషించారు:
-
రామానుజాచార్యులు & జగత్ సత్యం: రామానుజాచార్యులు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో (శ్రీభాష్యం) శంకరాచార్యుల ‘జగత్ మిథ్యా’ వాదాన్ని తిరస్కరిస్తూ, భౌతిక జగత్తు వాస్తవికమైనదని (‘జగత్ సత్యం’) స్థాపించిన తీరును రాహుల్ సాంకృత్యాయన్ చర్చించారు. వైదిక దర్శనంలోనే భౌతిక ప్రపంచ సత్యత్వాన్ని అంగీకరించే భౌతిక/పరిణామాత్మక కోణాలు ఉన్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం.
-
గౌడపాదుడు, శంకరాచార్యులు & బౌద్ధ సంబంధం: బౌద్ధం, వైదిక దర్శనాలు పరస్పర వినాశకరమైన దూరంలో లేవని నిరూపించడానికి అద్వైతంలోని ‘ప్రచ్ఛన్న బౌద్ధాన్ని’ ఆయన విశ్లేషించారు. శంకరాచార్యుల పరమగురువైన గౌడపాదుడు తన ‘మాండూక్య కారిక’ (ఆగమ శాస్త్రం) గ్రంథాన్ని బుద్ధుని ప్రార్థన/నమస్కారంతోనే ప్రారంభించడాన్ని ఎత్తిచూపుతూ, అద్వైత వేదాంతంపై బౌద్ధ మాధ్యమిక తత్వాల ప్రభావం ఎంతగా ఉందో స్పష్టం చేశారు.
‘దర్శన్ – దిగ్దర్శన్’ నుండి లభించే అదనపు ఆధారాలు:
-
భౌతికవాద, అనాత్మవాద వైవిధ్యం (సాంఖ్య-చార్వాక ధోరణులు): ‘దర్శన్ – దిగ్దర్శన్’లో రాహుల్ సాంకృత్యాయన్ ప్రాచీన వైదిక/బ్రాహ్మణ సంప్రదాయంలో భాగమైన సాంఖ్య దర్శనాన్ని లోతుగా విశ్లేషించారు. ప్రాచీన సాంఖ్య తత్వంలో ఈశ్వరుడికి (దేవుడికి) స్థానం లేదని, ప్రకృతి పరిణామం ద్వారానే జగత్తు సృష్టి జరుగుతుందని నిరూపించారు. అంటే, వైదిక ధారలోనే దేవుడిని తిరస్కరించే ‘అనీశ్వరవాద’ (Atheistic) తత్వాలు సుదీర్ఘ కాలం వర్ధిల్లాయి.
-
కార్యకారణ నియమం – శూన్యవాద, న్యాయ-వైశేషిక వైరుధ్యాలు: వైదిక ఆలోచనాపరులలో న్యాయ-వైశేషిక దర్శనాలు భౌతిక పరమాణువులను, తార్కిక విశ్లేషణను నమ్మితే, శంకరాచార్య అద్వైతం దానికి భిన్నంగా జగత్తును మాయగా భావించింది. ఒకే వైదిక పరంపరలోని దార్శనికులు పరస్పరం విభేదిస్తూ, విభిన్న సత్యాలను శోధించారని రాహుల్ సాంకృత్యాయన్ చూపించారు.
-
బౌద్ధ-వైదిక నిరంతర ఆదాన-ప్రదానాలు (Mutual Influence): బౌద్ధ తత్వవేత్తలైన నాగార్జునుడు, దిజ్ఞాగుడు, ధర్మకీర్తి వంటి వారి తర్కం వైదిక నవ్య-న్యాయ శాస్త్ర అభివృద్ధికి ఏ విధంగా పునాది వేసిందో ‘దర్శన్ – దిగ్దర్శన్’లో స్పష్టం చేశారు. వైదిక, బౌద్ధ ధారలు నిరంతరం సంవాదం (Dialogue) చేసుకుంటూ, ఒకరి ఆలోచనలను ఒకరు సమృద్ధి చేసుకున్నాయే తప్ప అవి ఒకదానినొకటి పూర్తిగా తుడిచిపెట్టుకునే ద్వంద్వాలు కావని తేల్చారు.
ఇటువంటి చారిత్రక, దార్శనిక సత్యాలను కొల్లూరిసోమశేఖర శాస్త్రి వంటి ప్రముఖ పండితులు (మాధ్యమిక కారికా సుభోధినీ వ్యాఖ్య ) కూడా తమ గ్రంథాలలో స్పష్టం చేసినవారే.
అందువల్ల, బ్రాహ్మణ – బౌద్ధ ధర్మాలు ప్రత్యర్థి పక్షాలనే ‘బైనరీ ఆపోజిషన్’ అనేది అసత్యమైనది. అలాగే బ్రాహ్మణ లేక వైదిక దర్శనాలు, విశ్వాసాలు ఒకే మూసలోకి ఇమిడేవి కావు.
-
దేవుడిని నమ్మడం (ఈశ్వరవాదం) – నమ్మకపోవడం (సాంఖ్య/నిరీశ్వరవాదం),
-
విగ్రహారాధనను ఆమోదించడం – తీవ్రంగా నిరసించడం,
-
జగత్తు సత్యమని చెప్పడం (రామానుజాచార్యులు) – జగత్తు మిథ్య అని చెప్పడం (శంకరాచార్యులు)
ఇలాంటి అనేక వైరుధ్యాలు, విభిన్న దృక్పథాల సమాహారమే వైదిక సంప్రదాయం. వీటినన్నింటినీ ప్రామాణికంగా స్పష్టం చేయడం ద్వారా, భారతదేశంలో ఎప్పుడూ ఒకే ఒక మూస సంస్కృతి వర్ధిల్లలేదని, భారతీయ సంస్కృతికి మూలస్తంభం దాని బహుళత్వమేనని (Pluralism) రాహుల్ సాంకృత్యాయన్ అత్యంత స్పష్టంగా నిరూపించారు.
ఆధునిక యుగంలో స్పష్టమైన ఐడెంటిటీ కోసం, కాలానుగుణంగా తమను వేరుపరుచుకునే ప్రత్యేకమైన మతపరమైన, ధార్మికమైన ఐడెంటిటీల కోసం అన్వేషణ మొదలైంది. జనాభా లెక్కల్లోనే కాదు… తత్వశాస్త్రంలోనూ, ధర్మంలోనూ, మతంలోనూ — అన్ని చోట్లా ఈ అస్తిత్వ ప్రత్యేకత కోసం తపన మొదలైంది.
ఇలా ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ‘సంకరం’ (మిశ్రమం) ఉండకూడదు; మతపరమైన, తాత్వికమైన, ధర్మపరమైన ఎటువంటి సంకరం లేని స్వచ్ఛమైన సాంస్కృతిక అస్తిత్వం కావాలనే కాంక్ష ఆధునిక యుగంలో తీవ్రంగా ఉంది.
అద్వైతాన్నే చూడండి… దానిలో కొంత ‘బౌద్ధ సంకరం’ ఉందని అనేకమంది విమర్శకులు అన్నారు. దానిని అద్వైతులు కూడా అన్ని సందర్భాల్లోనూ కొట్టిపారేయలేదు. ఆశ్చర్యకరంగా, కంచి పరమాచార్య “శంకరాచార్యులు బుద్ధుడిని కాదు, అంతకంటే ఎక్కువగా మీమాంసకులనే విమర్శించారు” అని అన్నారు.
మా నాన్నగారు మహామహోపాధ్యాయ రాణి నరసింహశాస్త్రి ఒక వేద శాస్త్ర సభలో చెప్పారు — మైలాపూర్ సంస్కృత కళాశాలలో తమ గురువైన రామచంద్రశాస్త్రి అనే తమిళ పండితులు “ద్వైతం కన్నా, ఇతర సిద్ధాంతాల కన్నా బౌద్ధమే మన అద్వైతానికి దగ్గర” అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. నిజానికి భాస్కరాచార్యులు, రామానుజాచార్యులు వంటి ఎందరో పండితులు ఈ ‘బౌద్ధ సంకరాన్ని’ అద్వైతంలోని లోపంగా విమర్శించారు. కానీ అద్వైతులు తమ తర్కం కోసం, సిద్ధాంత నిరూపణ కోసం బౌద్ధంపై ఆధారపడడాన్ని తప్పుగా భావించేవారు కాదు అనిపిస్తుంది.
అయితే, ఆధునిక యుగంలో ఈ పరిస్థితి మారిపోయింది. ఒక ‘మోనోథీయిస్టిక్’ (ఏకేశ్వరవాద) మతం, ఒక ‘మోనోకల్చర్’ (ఏకసంస్కృతి) కోసం పడే తపనలో భాగంగా — బౌద్ధంతో కానీ, మరే ఇతర సిద్ధాంతంతో కానీ, మతంతో కానీ బ్రాహ్మణ వైదిక ధర్మాలకు సంబంధం లేదు అని చెప్పుకోవడం అవసరమైంది. లేకపోతే, ఇలాంటి సంబంధాలను అంగీకరించినట్లయితే… చివరికి సెక్యులరిస్టులు చెప్పినట్లు అబ్రహామిక్ మతాలతో, సూఫీలతో కూడా సంకరం జరిగిందని చెప్పే సిద్ధాంతాలను కూడా అంగీకరించవలసి వస్తుందని సంస్కృత పండితులు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు భయం వ్యక్తం చేశారు (ఈ అంశం ‘పుల్లెల వారి ప్రస్తావనలు’ అనే పుస్తకంలో పేర్కొనబడింది).
ఆధునిక యుగంలో బహుళత్వం పట్ల వ్యతిరేకత, ఒకే తరహా మూస సంస్కృతి పట్ల ఆకర్షణ, ఒక మోనోథీయిజం వైపు ప్రయాణం — ఇవన్నీ ‘సంకర భయాన్ని’ (Fear of syncretism) రెట్టింపు చేశాయి.
దళిత-బహుజనవాదులు కూడా బౌద్ధ-బ్రాహ్మణ ద్వివిధ వైరుధ్యాలను (Binary Oppositions) ఆశ్రయించి, శంకరుడి రచనలు బౌద్ధ సిద్ధాంతాల తో సంబంధం కలిగి ఉన్నాయనే అంశాన్ని మరుగుపరుస్తారు. వ్యతిరేకిస్తా రు. మరోవైపు ఆధునిక హిందుత్వ ప్రభావం ఉన్న కొందరు పండితులు కూడా ఈ భావనను వ్యతిరేకిస్తున్నారు. కానీ విచిత్రమేమిటంటే, కుంభమేళా వంటి సందర్భాలలో బౌద్ధులు, హిందూత్వవాదులు ఒకే వేదికను పంచుకోవడమే కాకుండా, ఉగ్రవాదం మరియు మైనారిటీ వ్యతిరేకత వంటి విషయాలలో ఒకే రకమైన సామీప్యతను కలిగి ఉన్నారు. ఈ విషయాలు మనకు సోనియా ఫలేరో రచించిన ‘ది రోబ్ అండ్ ది స్వోర్డ్’ (The Robe and the Sword) అనే పరిశోధన గ్రంథంలో వివరంగా తెలుస్తాయి.
‘అనేక రామాయణాలు’ (Many Ramayanas) అనే భావనను ఎ.కే. రామానుజన్ వంటివారు వ్యక్తపరచినప్పుడు, ఆధునిక హిందూత్వవాదులు ఆ కథనాలను యీఆధునిక దృక్పథం ద్వారానే తిరస్కరించారు, వ్యతిరేకించారు. అయితే స్వచ్ఛత గురించిన భావాలే కాకుండా, సాంకర్యం (సాంస్కృతిక మిశ్రమం) గురించిన తాత్విక భావాలు కూడా భారతీయ తత్వశాస్త్రంలో అనివార్య భాగంగా ఉన్నాయి.
ఉదాహరణకు, ఆది శంకరాచార్య చెప్పిన ‘పంచీకరణ సిద్ధాంతం’లో పంచభూతాల గురించి వివరించారు. ప్రతి భూతమూ ఇతర భూతాలతో సంబంధం కలిగి ఉంటుంది; ఏదీ కూడా సంపూర్ణ స్వచ్ఛమైన (కేవల) స్థితిలో ఉండదు. నేల, నీరు మొదలైన పంచభూతాలు ఏ విధంగా పరస్పరం వివిధ పాళ్లలో మేళవించబడతాయో ఆయన వివరించారు. ఈ విశ్వంలో ఏ పదార్థమూ లేదా భూతమూ పూర్తి స్వచ్ఛమైన ఒంటరి స్థితిలో ఉండదని శంకరుల సిద్ధాంతం చెబుతోంది.
రాహుల్ సాంకృత్యాయన్ కూడా ఈ బహుళత్వాన్ని, సాంకర్యాన్ని (మిశ్రమ సంస్కృతిని) స్పష్టంగా వివరించారు.
ఆధునికతపై, ఆధునిక పరిణామాలపై విమర్శ లేకపోవడం వల్ల రాహుల్ సాంకృత్యాయన్ హిందూ మహాసభ మరియు జనసంఘ్ వంటి హిందూత్వ సంస్థలను కేవలం సంస్కరణవాద సంస్థలుగా భావించారు; కాంగ్రెస్‌ను కూడా వాటి గాటన కట్టారు. అవి విప్లవాత్మకమైన మార్పులను కోరుకోవని, కొన్ని సంస్కరణలతో సరిపెట్టుకుంటాయని అన్నారు. మరోవైపు, పూర్తి సంప్రదాయవాదాన్ని, వర్ణ వ్యవస్థను సమర్థించే రామరాజ్య పరిషత్‌ను తిరోగమన శక్తిగా నిందించారు.
1993లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత హిందూత్వ విజృంభణ నేపథ్యంలో బెంగాలీ భాషలో ఈ పుస్తకాన్ని ముద్రించినప్పుడు, దాని ముందుమాటలో మాత్రమే ప్రచురణకర్తలు హిందూత్వ వాదులను ఫాసిస్టులుగా వర్ణించారు. కానీ వారు ఆ సంస్థలను రామరాజ్య పరిషత్ కు కరపాత్ర స్వామి భావజాలానికి కొనసాగింపుగా భ్రమపడ్డారు కానీ మూల గ్రంథంలో ఎక్కడ కూడా రాహుల్ సాంకృత్యాయన్ సంఘపరివార్ సంస్థలను ఫాసిస్టు సంస్థలుగా చెప్పకపోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పైగా వాటిని సంస్కరణవాదులుగా భావించడం వింత.
కానీ, రామరాజ్య పరిషత్ స్థాపించిన సంప్రదాయవాది కరపాత్రి స్వామి మాత్రం ఆర్ఎస్ఎస్ (RSS) ను, హిందూ పరివార్ సంస్థలను ముస్సోలిని, హిట్లర్‌లతో పోలుస్తూ ఒక పుస్తకమే రాశారు. దాని గురించి రాహుల్ సాంకృత్యాయన్ ఎక్కడైనా వ్యాఖ్యానించినట్లు కనబడదు.
హిందూత్వ అనేది ఒక ఆధునిక ఫాసిస్టు జాతీయవాద భావజాలం, ప్రచ్ఛన్న క్రైస్తవ అనుకరణ అనే ఈ మౌలిక ఆలోచన రాహుల్ సాంకృత్యాయన్‌లో లేకపోయింది. అయితే, సంప్రదాయవాది కరపాత్రి స్వామికి ఆధునికతపై తగినంత విమర్శనాత్మక దృష్టి ఉండడం వల్ల కావచ్చు, సంఘపరివార్ సంస్థలను ఫాసిస్టు సంస్థలుగా స్పష్టంగా గుర్తించగలిగారు. ఇది విచిత్రం.
అందువల్ల ఆధునికత తీసుకువచ్చిన వికృత ధోరణులను విమర్శించే శక్తిని అలవర్చుకోవాల్సి ఉంది. దానికోసం ఒక ప్రత్యేకమైన భాషను, తర్కాన్ని వృద్ధి చేసుకోవాలి అని ఈ పరిశీలన తెలియజేస్తోంది. సంప్రదాయవాదులు కాదు, రాహుల్ సాంకృత్యాయన్ స్వయంగా సంస్కరణవాదులుగా భ్రమ పడిన హిందూ పరివార సంస్థల వారే రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ఈనాడు విధ్వంసం చేశారు.
ఎందుకు సంఘపరివార్ వారు రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహం ధ్వంసం చేశారు అంటే- భారతీయ సంప్రదాయం సంస్కృతి లోని బహుళత్వాన్ని రాహుల్ సాంకృత్యాయన్ గౌరవించారు. బౌద్ధం పట్ల ఆసక్తిని కనబరిచినప్పటికీ వైదిక సంప్రదాయంలోని వైవిధ్యాన్ని కూడా ఆయన తరచి చూసారు. ఈ వైవిధ్యాన్ని ఒకొక్కసారి స్వామి కరపాత్రి లాంటి సంప్రదాయవాదులు కూడా సరిగా గుర్తించలేకపోతున్నారని, సంప్రదాయ వాదులు కూడా ఆస్తిక నాస్తిక ద్వంద్వాలలో కొట్టుకుపోతున్నారని తద్వారా వైదిక సంస్కృతిని బ్రాహ్మణ వైదిక ఉపనిషత్ తత్వాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని రాహుల్ సాంకృత్యాయన్ స్పష్టం చేశారు. అంటే మొత్తంగా భారతీయ సంస్కృతులు అన్నిటిలో బహుళత్వం వైవిధ్యం ప్రధానమైనవి. భారతదేశంలోని ప్రకృతి లాగే ఇక్కడ సంస్కృతులు కూడా చాలా బహుళమైనవి. మహా పండితుడు బహుభాషాకోవిదుడైన రాహుల్ సాంకృత్యాయన్ ఈ సత్యాన్ని గుర్తించారు. ఎంతో పరిశోధనాత్మకంగా ఈ బహుళత్వాన్ని బహిర్గతం చేశారు. ఒకే దేశం ఒకే చట్టం ఒకే సంస్కృతి ఒకే దేవుడు ఒకే మతం అంటూ బహుళత్వాన్ని నిరాకరించే సంఘపరివార్ కి రాహుల్ సాంకృత్యాయన్ లోని యీవైఖరి చెంపపెట్టుగా బాధించింది . అందుకే హిందూ ఫాసిస్టులు రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కానీ ప్రజల హృదయాలలోని బహుళత్వంలో రాహుల్ సాంకృత్యాయన్ వెయ్యి రూపాలుగా ప్రతిబింబిస్తూనే ఉంటారు.
*








విగ్రహ ధ్వంసాన్ని కేవలం ఒక భావజాల/సాంస్కృతిక దృగ్విషయంగా, “సంవాద సంప్రదాయం” కుంచించుకుపోవడంగా చదవడం సరైనదేనా? హిందూత్వ మూకలు రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని పగలగొట్టడాన్ని “సంభాషణా సంస్కృతి క్షీణత”కు సూచికగా చూడటం సరిపోతుందా, లేక ఇది నయా ఉదారవాద సంక్షోభంలో కార్పొరేట్ మూలధనం, హిందూత్వ మధ్యతరగతి, భూస్వామ్య-బ్రాహ్మణీయ అవశేషాల కూటమి కమ్యూనిస్టు వారసత్వంపై, మెటీరియలిస్ట్ చరిత్ర దృష్టిపై సాగిస్తున్న వర్గ దాడిలో ఒక సంకేతమేనా? “సంవాదం లేకపోవడం” గా దీన్ని చూడటం వల్ల ఫాసిజాన్ని ఒక తప్పు ఆలోచనా విధానంగా, తర్కంతో సరిదిద్దగలిగే పొరపాటుగా చిత్రించడం జరగడం లేదా — దాని వర్గ పునాదిని, రాజ్యాధికార లక్ష్యాన్ని మరుగుపరచడం జరగడం లేదా?
కరపాత్రి స్వామి–RSS వైరుధ్యాన్ని అసాధారణ ప్రాధాన్యతతో చూపించడం కూడా ఇదే పొరపాటుకు కొనసాగింపు కాదా? ఫ్యూడల్ బ్రాహ్మణీయ సనాతనవాదికి, కార్పొరేట్-ఆధారిత ఆధునిక హిందూత్వ ఫాసిజానికి మధ్య ఉన్న ఘర్షణ అగ్రవర్గాల అంతర్గత వైరుధ్యం కాదా ? ఒకే దోపిడీ వ్యవస్థను ఎలా నిర్వహించాలనే దానిపై భూస్వామ్య పాత రూపానికి, గుత్త పెట్టుబడి కొత్త రూపానికి మధ్య పోటీ కాదా? కరపాత్రి వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల వ్యవస్థను వదులుకున్నాడా? అతను RSSను వ్యతిరేకించడం కులాన్ని రద్దు చేయాలని కాదు కదా, దాన్ని “సరైన” మతపరమైన ఛత్రం కింద నిలబెట్టాలనే కాదా? ఇద్దరూ శ్రామిక వర్గ, దళిత, ఆదివాసీ విముక్తికి శత్రువులు కాదా? వీళ్ళిద్దరి మధ్య “పరస్పర గౌరవపూర్వక సంవాదాన్ని” ఒక ఆదర్శంగా చూపడం వర్గ దృష్టి లేని పాండిత్య వ్యామోహం కాదా? ఇది ద్వంద్వాత్మక భౌతికవాద పద్ధతా, లేక భావజాలాల చరిత్రను వర్గ చరిత్ర నుంచి వేరు చేసే పద్ధతా?
నక్సలైట్ల విగ్రహ ధ్వంసాన్ని, నేటి సంఘ్ పరివార్ దాడిని ఒకే చట్రంలో ప్రస్తావించడం ఒక తప్పు సమీకరణ కాదా? జాతీయ నాయకుల విగ్రహాలపై చేసిన నక్సలైట్ చర్య వర్గ దృక్పథం నుంచి బూర్జువా నాయకత్వ వారసత్వాన్ని తిరస్కరించే రాజకీయ చర్య కాదా దాని వ్యూహాత్మక తప్పిదాలను విమర్శించవచ్చు గానీ, దాని వర్గ లక్ష్యం భిన్నమైనది కాదా? హిందూత్వ మూక దాడి కమ్యూనిస్టు, బౌద్ధ వారసత్వాన్ని తుడిచిపెట్టే ఫాసిస్టు ప్రతీకాత్మక హింస కాదా? వీటిని ఒకే తర్కంలో ఉంచడం అంటే — విప్లవ శక్తుల విమర్శనాత్మక చర్యలను, ఫాసిస్టు రాజ్య-అనుబంధ హింసను సమానం చేయడం కాదా?
రాహుల్ సాంకృత్యాయన్ contribution చారిత్రక భౌతికవాదాన్ని ఉపయోగించి మతతత్వ మిస్టిఫికేషన్‌ను, వేద ప్రామాణ్యతను తర్కబద్ధంగా కూల్చడమే, అది సరైనదే కదా? కానీ అతని పరిమితి బ్రాహ్మణ-బౌద్ధ ద్వంద్వాన్ని తిరస్కరించడంలో ఉందా (అది సబబే కదా)? లేక అతని పరిమితి కుల వ్యవస్థను శ్రమ విభజన, ఉత్పత్తి సంబంధాల డయలెక్టిక్‌గా కాక, తాత్విక వాదోపవాదాల స్థాయిలోనే ఖండించడంలో ఉందా? వ్యాసకర్త దీన్ని పట్టుకున్నారా — లేక దీన్ని “బహుళత్వం” అనే ఉదారవాద కేటగిరీ కిందికి తీసుకెళ్లారా?
చివరకు వ్యాసం మొత్తం “బహుళత్వం”, “సంవాదం”, “సాంకర్యం” అనే భావనలను అంతిమ రాజకీయ విలువలుగా స్థాపించడానికి ప్రయత్నిస్తుందా ఇది పోస్ట్-మాడర్న్ ఉదారవాద ధోరణి కాదా, వర్గ పోరాట దృష్టికి ప్రత్యామ్నాయం కాగలదా? భారత సమాజపు అసలు ప్రశ్న తాత్విక వైవిధ్యమా — లేక కుల-వర్గ నిర్మాణం, భూమి సంబంధాలు, గుత్త పెట్టుబడి-భూస్వామ్య కూటమి రాజ్యాధికారాన్ని ఎలా పట్టుకుంది అనేదా? “ప్రజల హృదయాల్లో వెయ్యి రూపాలుగా రాహుల్ సాంకృత్యాయన్ ప్రతిబింబిస్తారు” అనే భావోద్వేగపూరిత ముగింపు రాజకీయ కార్యాచరణకు ఏ మార్గమైనా చూపుతుందా — ఇది వర్గ పోరాట కర్తవ్యాన్ని సాంస్కృతిక ఓదార్పుతో భర్తీ చేసే క్లాసిక్ ఉదారవాద ఎస్కేపిజం కాదా?
This post is purely in support of Rahul sankrutyan belittling the narrative into Hindu fascism . Marxist ideology is being viewed in their coloured glasses . In fact , in this post , certain assumptions are wrong. Sri Ramanuja did not dispute Adi Shankar’s Adhvaitha philosophy infact he touched the finer version of vishista Adhvaitha which paves clear path to human beings to transcend the realm of the almighty by the concept of Bhakti ultimately leading to oneness with God