వాన మొదలయ్యింది

“ఇప్పుడెందుకో

ఆ గోడ మీద కాకులు గుంపుగా

ఏదో ఆపదను పసిగట్టినట్టు

రహస్యాలను మాట్లాడుకుంటాయి

అటుపక్కన ఇంకో కాకుల గుంపు వచ్చి”

“ఆ తర్వాతేమీ రాయలేదు. చూడు యెన్నేసి కాగితాలో. కవిత్వాలు. చాలమటుకు సగంలోనే ఆపినవి. కథలు కూడా అలాగే. యెందుకూ యిట్లా అంటే నవ్వుతాడు. మహా జ్ఞానులకి వచ్చే నవ్వులా వుంటుంది. ఆ నవ్వు ఆ సమయానికి… ” అంది యమునా చేతిలో పేపర్ టేబుల్ మీద పెడుతూ.

A4 సైజు పేపర్లు. కట్టలు. కొన్ని సగం చినిగిపోయి.

సాయంత్రం కిటికీ యెండ వాటిపై పడి దుమ్ము కనపడుతుంది పైకి లేస్తూ.

శంకరం గురించి యమున యిట్లా మాట్లాడ్డం చాలాసార్లు జరిగింది. నేను ఊఁ అంటూనే నచ్చిన విషయాలు కూడా గుర్తుచేస్తూనే వుంటా. నావైపు కోపంగా చూసి మళ్ళీ చెప్పడం మొదలుపెడుతుంది.

“దేవమ్మా…కాఫీ…” అరుపు విసుగూ తన గొంతులో.

నేను సిగరేట్ వెలిగించా.

“దేవమ్మా హాష్ కూడా ” అని పక్కన వున్న కాగితం అందుకుని

“రాత్రిళ్ళూ

నువ్వూ నేనూ

నగ్నన్గా

నగరాన్ని చుట్టి వద్దాం

కొన్ని సమాధులను కూడా

తాకి వద్దాం

వుదయమయ్యే వేళ

రా సూర్ణుణ్ణి కప్పుకుందాం

చూసావా యీ కవిత. రాసిచ్చి దాచిపెట్టకు పొద్దున్నే   కి పం పాలంటాడు. పైగా మనగురించి లోకానికి తెలియాలి అంటాడు. కొట్టేసా ఆ రాత్రి. పేపర్ చిమ్పేలోపే లాగేసాడు.”

“ఊ” అన్నాను.

యమున చాలా తక్కువ సమయాల్లో చాలా అంటే చాలా యెక్కువ వొక లోతైన డిప్రెషన్కి లోనైనప్పుడే యిట్లా మాట్లాడుతుంది. ఆ డిప్రెషన్ కూడా శంకరం చెప్పకుండా సడ్డెన్గా ఎటో వెళ్ళిపోయినప్పుడే.

నిజానికి యెవరైనా యెంతని సహిస్తారు.

శంకరం ఒక గొప్ప కవి. మంచి ఆలోచన వున్నోడు. కవులకు ఆచరణ లేదు అనే రకం యమున. నేను వొప్పుకోను.

“లోపల గదిలో చూడు. యెంత కమురు వాసనో. ఆ సిగరెట్లు ఆ మందు వాసన. నువ్వు ఆడదానివి ఐతే సహిస్తావా?”

సహించను. నిజంగా సహించను. కానీ శంకరాన్ని సాహిస్తా. నేను ఆడ ఐతే. అతన్ని నేను అర్ధం చేసుకున్నాను కాబట్టి.

 

ఆదివారం రోజు కోఠీ నుండి అట్లా అబిడ్స్ వైపు పాత పుస్తకాల కోసం నడుస్తున్నప్పుడు శంకరం కనబడ్డాడు కొందరు భిచ్చగాళ్లతో మాట్లాడుతూ. వాళ్ళిచ్చిన బీడీ తాగుతూ. నన్ను చూసి యేమాత్రం మొహమాటం సిగ్గూ లేకుండా “హే మాన్… రా.. మనోళ్లే… కలువ్…” అంటూ పరిచయం చెయ్యబొయ్యాడు. నా మొఖంలో యే యెమోషన్ లేదు. పసిగట్టాడు.

పక్కకు వొచ్చామ్.

“వాళ్ళు చాలా స్వచ్చంగా వుంటారు. నవ్వుతారు. యేడుస్తారు. నటన వుండదు అందులో. యిలాంటివాళ్లే అవసరం మనకు” అంటూ బీడీ పడేసాడు…

నేనేమీ మాట్లాడలేదు. అతనికదే సమాధానంలా.

“చలో మళ్లీ కలుద్దాం” అన్నాడు.

కొంచెం ముందుకు నడిచాను. తిరిగి నేను వెనక్కి చూసేలోపు మాయమయ్యాడు శంకరం.

ఆ రోజు  రాత్రి  ప్రపంచం అంతా నిద్రపోయాక కాల్ చేసాడు ‘రా వొక కవిత రాసాను. విను. మందు కూడా వుంది. నీకు యిష్టమైన నెపోలియన్” అని.

వెళ్లాను.

బయటే కూర్చుని వున్నాడు. కుర్చీలో వెనక్కి వాలి రెండు కాళ్ళు టీపాయ్ మీద పెట్టుకుని కళ్లద్దాలు సెట్ చేస్తూ యేదో పేపర్ చేతిలో పట్టుకుని. మేధావిలాగా. వొక్కోసారి భయం అవుతుంది శంకరాన్ని చూస్తే.

“భూమిలాగా ఆకాశంలాగా

చూడట్లా నా కిటికీ పక్కన కొత్తగా కుండీలో మొలచిన

మొక్కలాగే

వాళ్లంతా

వొకానొక కాలానికే అంకితమయ్యే

దేవుళ్ళు

 

రోడ్డున

తోరణాలు

 

గుండెను కడిగేసుకున్న

వాళ్ళు

నా ఊపిరులు” అని ఆపి. మళ్ళీ “భాష సరిపోవడం లేదు వాళ్ళ గురించి రాద్దామంటే” అన్నాడు..

నాకు నచ్చింది.

 

సగం పెగ్ ఆపేసి సిగరేట్ అంటించా.

 

“యేలోకంలో ఉన్నావ్” యమున గొంతు.

“యేదో ఆలోచిస్తున్న… చెప్పూ.” అన్నాను.

నన్ను వింతగా చూసి “దేవమ్మా… యిలారా” అంది.

వొచ్చింది దేవమ్మా. అమాయకంగా అట్లా నిలబడి “అమ్మా…” అంది.

“మొన్నప్పుడో అయ్యగారు నిన్నేమన్నారో చెప్పూ”

“యెందుకమ్మా యిప్పుడవన్నీ”

“పర్లేదు చెప్పూ. అయ్యగారి భాగోతం బయటపడాలిగా… చెప్పూ…”

దేవమ్మ చాలా భయంగా బేరుగ్గా నా పక్కన నిలబడి “యెందుకిట్లా పాచిపన్లు. యింకేదన్నా పని చూస్కో. మా యెంగిలి ప్లేట్లు కడగడం. మా మురికి బట్టలు ఉతకడం. బానిస బతుకు. అవసరమా నీకు. అమ్మగారు చేసుకుంటారు ఆ పనులన్నీ అని అన్నారండీ” అని లోపలికి వెళ్ళిపోయింది. పాపం.

బతకాలి, కడుపు నిండాలి అంటే తప్పవు యెలాంటి పనులైనా.

“యిదీ విషయం” అంది యమున..

నేనేం మాట్లాడలేదు.

తనే అంది “ప్రపంచం యెటు కొట్టుకుపోతే యితనికెందుకు. కనీసం పనిచేస్కు బతికే అవకాశాన్ని కూడా యివ్వడా?”

తప్పది. యింకొకరి బతుకుల్ని యితనెల కమాండ్ చేయగలడు. నిజమే బతకడానికి యే పని ఐతేనేం. స్వతంత్ర భావాలు వుండాలి అనుకునే శంకరమేనా యిట్లా అన్నది.

“కాఫీ..?” అంది యమున.

టైం చూసుకున్నాను. 6.30. “వొద్దు. మాస్టర్ ని కలిసి ఇంటికి వెళ్లాలి. టైం సరిపోదు. టూ డేస్ లొ కలుస్తా నేనే” అంటూ లెచాను.

నాతో పాటే తలుపు వరకు వచ్చింది యమున.

గేట్ వరకు వచ్చాక “శంకరం యెక్కడన్నా కనిపిస్తే చెప్పు యింటికి రమ్మని” అంది.

“సరే” అంటూ నేను స్కూటర్ తీసాను.

*

శంకరం.

యెప్పుడూ యింతే అతను. కనబడకుండా చాలా రోజులు బయటే వున్నవి యెన్ని సందర్భాలో యిట్లా. యమునక్కూడా అలవాటు అయిపోయింది. మొదట్లో యెంత కంగారు పడేదో. కాల్ చేసేది అర్ధ రాత్రులప్పుడు యేడుస్తూ.కానీ యిప్పుడు కనిపిస్తే రమ్మను అని యెంత తేలిగ్గా అనేస్తుందో. అనుభవాలు మనుషుల్నియెంత బలంగా మారుస్తాయో.

శంకరం నాకు టెన్ యియర్స్ నుండి పరిచయం. మొదటి పరిచయం లైబ్రరీలో.

ఐదుకి ఆఫీస్ ఐపోగానే లైబ్రరీ పోయి కొన్ని పేపర్స్ చదివి యేదన్నా నవల కార్డు కింద తెచ్చుకుని చదుకోవడం, నవల బాగుంటే ఆఫీస్ తీసుకుపోయి చదవడం అలవాటు. యేదో నవల నాకా పేరు గుర్తులేదు. ఐపోయింది చదవడం.యిచ్చెయ్యాలి సాయంత్రం.వెళ్లి యిచ్చి యింకేదో వెతుకుతుంటే పెద్దగా అరుపులు. గొడవలాగా.

లైబ్రేరియన్తో శంకరం గొడవ. అందరూ సైలెంట్గా వాళ్లనే చూస్తూ. దగ్గరికి వెళ్ళాను. కార్డ్ డేట్ ఎక్పైర్ గురించి గొడవ. శంకరం డేట్ చూసుకోలేదు. బుక్స్ ఇచ్చి వేరే బుక్స్ తీసుకుపోవాలి అతను. లైబ్రేరియన్ ఒప్పుకోవట్లేదు రేపు వొచ్చి మనీ ఇస్తాను డేట్ ఎక్స్టెండ్ చెయ్యండి అంటే.

నేను యిచ్చాను డబ్బులు. శంకరం యేవో బుక్స్ తీసుకున్నాడు. నేను కూడా తీసుకున్నాను. యిద్దరం బయటకు వొచ్చం. వొకటే కాలనీ యిద్దరిది. కవిత్వం రాస్తాను నా పేరు శంకరం అని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరం సలీం హోటల్లో కూర్చుని యేవేవో మాట్లాడుకున్నాం. అతను రాసిన కవిత్వం చూపించాడు. మీరు రాస్తారా అని అడిగాడు. లేదు, చదవడం మటుకే అన్నాను. చాలా కబుర్లు. చాయ్ సిగరెట్స్. ఆ సాయంత్రం అట్లా గడిచింది. కానీ శంకరం నాకు థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. నాక్కూడా అతని పరిచయం తరువాత థాంక్స్ అవసరం లేదు అనిపించింది.

తను చూసిన అనుభవించిన ప్రతి సన్నివేశాన్ని కవిత్వం చెయ్యడం శంకరంకి వొచ్చు. ఊహించుకుని కల్పితంగా ఏమీ రాయడు. అట్లా రాసేవాళ్ళు అన్నా అతనికి యెందుకో పడదు. అనుభవం నుండి చూసిన దాని నుండి మన నుండి రాయాలి యేదైనా అంటాడు.

దారిలో సలీం హోటల్ దగ్గర స్కూటర్ ఆపి చాయ్ చెప్పి సిగరెట్ అంటించాను. నేనూ శంకరం యీ హోటల్లో చాలా గంటలసేపు కూర్చునే వాళ్ళం. యిప్పుడు యింకా గుర్తొస్తున్నాడు. యెన్ని కవితలు చెప్పేవాడో. చిన్నపాటి పాకెట్ డైరీ వుండేది తన దగ్గర. యేదో వొక కవిత్వం రాస్తూ ఉండేవాడు. కలిసినప్పుడు వినిపించేవాడు. ఆ కవిత్వం వెనక సందర్భం కూడా చెప్పేవాడు.

వొకరోజు నాకు ఆఫీస్ నుండి రావడం లేట్ అయితే నేను వొచ్చేవరకు యిక్కడే యీ మూల టేబుల్ దగ్గరే కూర్చుని వున్నాడు. మూల ఉండే టేబుల్ మాకు యిష్టమైంది. ఎవరితో సంబంధం లేకుండా చివరగా వుంటుంది. మేము యేమ్మాట్లాడినా మిగితావాళ్లకు వినబడేవి కాదు.

నేను వొచ్చి కూర్చుంటూ ”ఎక్ట్రా వర్క్”అనేలోపు అతనే “మా ఇంటి ముందు ఎప్పుడూ నాకోసం ఎదురు చూసే ఆ కుక్క. లక్కీ. అవతలి రోడ్డులో నన్ను చూసి పరిగెత్తుకొచ్చి. మధ్యాహ్నం. కార్ గుద్దేసి. గోరంగా. రక్తం నేలనంత తడిపేసి. హాస్పిటల్ తీసుకుపోయినా యూస్ లేకుండా. అక్కడికక్కడే. ” అన్నాడు.

నీళ్లు అతని కళ్ళల్లో. శంకరం చాలా సెన్సిటివ్. తను యిష్టపడే యెవరినైనా అస్సలు వొదులుకోడు. వాళ్లకేమన్న జరిగితే తట్టుకోలేడు.

నేనేం మాట్లాడలేదు. చాయ్ చెప్పి సిగరెట్ యిచ్చాను.

“మరేం చేసావ్?”

“అక్కడే పెరట్లో పాతిపెట్టి బయటకు వొచ్చేసాను. యమునకు అట్లా చెయ్యడం నచ్చలేదు. చిన్న గొడవ. అంతే.”

“ఓకే”

ఇద్దరం కొద్దిసేపు సైలెంట్ గ ఉన్నాం. ఇంకో చాయ్ చెప్పి యింకో సిగరెట్ వేలిగించాం.

“హే మై డియర్ యంగ్ పోయెట్ అండ్ రీడర్” మాస్టర్ వొచ్చి నా పక్క కూర్చుంటూ అన్నాడు. మేమేం మాట్లాడలేదు.

“యేంటీ యింత సైలెంట్గా. కిందకు మొహాలు వేస్కుని. ఏదో తూఫాన్ వొచ్చేలా ఉందే” అన్నాడు

శంకరం మాస్టర్ వంక యే ఎమోషన్ లేకుండా అట్లా చూస్తూ వున్నాడు. నాకు యెందుకో యేదో జరగబోతోంది అని అనుమానం. అనుకున్నట్టే లేచాడు శంకరం. మాస్టర్ కళ్ళల్లో గాబరా.

“సైలెంట్ గ ఉండక ఏం చేయమంటావ్. నీలాగా ఆఫీస్లో ఏసీ కేబిన్లో కూర్చుని సమాజం పట్ల బాధ పడుతూ, నటిస్తూ కథలు రాయమంటావా. ఎందుకూ పనికిరాని చెత్త కథలు. బుల్ల్షిట్” అంటూ లేచి వెళ్ళిపోయాడు.

మాస్టర్ ఏం మాట్లాడలేదు. నాకూ ఏం మాట్లాడాలో తోచలేదు.

హోటల్ బయటకు వొచ్చం. మాములుగా బై చెప్పి వెళ్ళిపోయాడు మాస్టర్.

శంకరం ఆవేశం నాకు వింత. అర్థం కాడు కొన్నిసార్లు. యేం సాధిస్తాడు. యెవరు యెట్లా రాస్కుంటూ పోతే యెందుకు యితనికి.

*

స్కూటర్ ఆపాను. మాస్టర్ యిల్లు.

” మాస్టర్ … మాస్టర్…”

“వొస్తున్న”

తలుపు తేరుచుకుంది.

“రావోయ్… టైం కి వోచ్చావ్ ”

“మందా”

“అంతేగా మరి… రెండు పెగ్గులెస్కో”

“రెండు కాదు మాస్టర్ నాలుగు.తాగాలనుంది. ”

“దానికేం… ఆ కుర్చీ వేస్కో”

కుర్చీ వేస్కున్నాను.

మాస్టర్ రచయిత. మంచి పేరున్న రచయిత. మూడ్నెల్ల కింద ఒక కథల బుక్ పబ్లిష్ అయ్యింది. యిప్పుడు అదే పుస్తకం రెండో ముద్రణ. యిద్దరు పిల్లలు. కొడుకు యెక్కడో ప్యారిస్లో. కూతురు అల్లుడు సౌదీలో. ప్రైవేట్ కంపెనీలో మాస్టర్ జాబ్. భార్య యింట్లో కొన్ని రోజులు, పారిస్ సౌదీలో కొన్ని రోజులు గడిపేస్తుంటుంది. లైఫ్ చెప్పాలంటే.

“ఆ కవర్లో చికెన్ ఉంది. ఈ ప్లేటులో వెయ్ .”

వేసాను.

”చీర్స్ మాస్టర్.”

”చీర్స్”

“శంకరం ఇంటి నుండి వొస్తున్న మాస్టర్. మళ్ళీ ఎటో పోయాడు”

”ఎటూ పోలేదు. నాలుగు రోజుల క్రితం సలీం  హోటల్లో చాయ్ తాగుతుంటే కనబడ్డాడు. స్మోక్ చేస్తూ. పలకరించాను. అంతే.”

”ఏమైంది?”

“రెండు వారల కింద అచ్చయిన నా కథ గురించి పెద్ద గొడవ.”

”యేమని?”

“యింకేముంటుంది. మీ కథ చదివాను. మీకో శైలి లేదు. మీ ఒక్కో కథ ఒక్కో రచయిత రాసినట్టు, వాళ్ళు మీ మీలోకి వొచ్చిరాసినట్టు, చలం త్రిపుర ఇంకేదో అనువాదకథలా. మీకంటూ ఒక మార్క్ ఉందా అని.”

“శంకరం అంతేలెండి . మీకు తెలియనిదా. ఆ మధ్య రాసిన కథ చది ఇంటికి వొచ్చి మరీ మెచ్చుకుని హగ్ ఇచ్చి పోయాడు. గుర్తుందా.”

“ఔను నిజమే. ఏదోలే.యీ శంకరం.”

చాలాసేపు యేవేవో మాటలు. టైం యెక్కువ అయింది. మందు కూడా.

“నేనింకా వెళ్తా.చాలు. మాస్టర్. బై. గుడ్ నైట్”

“బై యాన్.. గ్ బోయ్ ”

*

వారం తరువాత కాల్ యమున నుండి. శంకరం వొచ్చాడు అని. సాయంత్రం కలుస్తానన్నాను.

*

బార్.

నేనూ శంకరం. కొన్ని A4 సైజు పేపర్ల చిన్నపాటి రోల్ శంకరం చేతిలో.

ఆర్డర్ చేసాను.

ఒక పెగ కొట్టి ఆ పేపర్స్ నా ముందు పెట్టాడు “కథ రాసాను. ఎలా ఉందొ చెప్పు” అన్నాడు.

పేపర్స్ అటూ ఇటూ తిప్పి పక్కన పెట్టుకున్నాను. శంకరం రాయడం బాగుంటుంది. గుండ్రని అక్షరాలు. ఊర్లో చదువుకున్నవాళ్ళు యిట్లా రాయడం నేను ఎక్కువ చూసాను.

“సరే… యీ వారం యెక్కడ వున్నావ్?” అనడిగాను.

”మా ఫ్రెండ్ ఊరికి వెళ్ళాను. ఆదిలాబాద్. అక్కడ లంబాడీ తండా. ఆ మనుషులు వాళ్ళ మాటలు మర్యాద. నాకు రాబుద్ధి కాలేదు అసలు. కల్మషం లేని మనుషులు. కలుషితం కానీ మనుషులు. యిప్ప సారా పోశారు.  వాళ్ళు తినే అన్న నాకు ప్రేమగా పెట్టారు.  ఉన్న ప్రాంతం నుండి కొద్దిగా లోపలి అడవిలోకి తీసుకుపోయారు. కుందేలు వేట ఆరోజు. ఎంత షార్ప్ చూపు అనుకున్నవ్ వాళ్ళది. నాలుగు కుందేళ్లు పట్టుకుని సాయంత్రం వొచ్చం. అక్కడి కథే వాళ్ళ కథే నీకిచ్చింది” అన్నాడు.

అట్లా చెబుతుంటే ఎంతవెలుగో శంకరం కళ్ళల్లో. యీ లోకంలో లేదు అట్లా చెబుతూ. నిజమే శంకరం అన్నట్టు ఏధైనా అనుభవించాలి అదే రాయాలి అనుకుంటా. ఇంకా లోతుగా రాయొచ్చు.

ఇంకా చాల విషయాలు చెప్పాడు శంకరం. వాళ్ళ భాష పలికేవిధానం చెప్పాడు. అది పేలడం ఎంత అందమో అన్నాడు.

యమున నాకు మెస్సేజ్ చేసింది ‘సేఫా’ అని. యెస్ అని రిప్లై యిచ్చాను. ‘త్వరగా వచ్చేయండి యింటికి బై’ అని మల్లొక మెస్సేజ్.

మొబైల్ పక్కన పెట్టేసాను.

టాయిలెట్ అని వేలు చూపించి వెళ్ళాడు శంకరం. నేను నవ్వాను.

పేపర్స్  చూసాను.

“వుదయం లేవాగానే మేకపాలు పిండుతూ చిన్నపిల్ల. అప్పుడే లేచిన నన్ను చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు పాలంత స్వచ్చంగా ప్రశాంతంగా ఎంత బాగుందో. ఆగు అన్నట్టు చేయి చూపించి. వేపపుల్ల తెచ్చి ఇచ్చింది. తీస్కుని ముందు చాయ్  అన్నాను. సరే అన్నట్టు తల ఊపి ఆభాషలో వాళ్ళ అమ్మకు చాయ్ గురించి అరుస్తూ పరిగెత్తింది.

బయటకు వొచ్చాను. చలి కాలం ఎంత బాగుందో యిక్కడ. దూరంగా చెట్టు దగ్గర కొందరు ముసలి వాళ్ళు చలి కాగుతున్నారు. రమ్మని సైగ చేశారు. అటువైపు నడిచాను” అక్కడికక్కడే కథ అంత చదవాలి అనిపించింది. శంకరం వొచ్చి కూర్చున్నాడు. నేను పేపర్స్ పక్కన పెట్టేసాను.

“నేను పిచ్చిగా బెహేవె చేస్తున్న అని యమున చెప్పింది కదా నీకు’ అన్నాడు.

“తను కొత్తగా నాకేమ్ చెప్పలేదు. వున్నదేగా”

“నాకు యిక్కడ ఈ మనుషుల మధ్య వుండబుద్ది కాదు”

“తెలుసు నాకు”

“వీళ్ళ రెండు ముఖాలు. స్వార్ధబుద్ధి. జీవితంలో నిజాయితి వుండదు ”

“ఊ”

“యమునని తీస్కుని ఆ తండాకు షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా”

“మంచిదేగా”

నేనేం అనగలను యింక. శంకరం యిష్టం అది. నచ్చిన మనుషుల మధ్యకు దూరంగా. అతని కవిత్వానికి కథలకు సరిపోయే ప్రపంచానికి దారి కనబడింది. శంకరం ఒక వింత నాకు యెప్పటికీ.

మాస్టర్కి చెప్తే యేమంటాడో శంకరం వెళ్లిపోయే విషయం. చూడాలి.

బార్ నుండి బయటకు వొచ్చి నిలబడ్డాం. చల్లని గాలి.  వాన వొచ్చేటట్టు వుంది. చలికాలంలో వాన. గొప్పగా ఉంటుంది.

ఆటో మెయిన్ రోడ్ మలుపు తిరిగింది. టైం కోసం మొబైల్ తీస్తే యమున మెస్సేజ్.

”రేపే వెళ్దాం అన్నాడు శంకరం” అని.

”ఔను. చెప్పాడు. హ్యాపీ జర్నీ” రిప్లై యిచ్చాను.

“థాంక్ యూ సో మచ్” అని పక్కన స్మైల్ ఎమోజితో మెస్సేజ్.

మొబైల్ జేబులో పెట్టుకున్నాను. రోడ్ మీద జనాలు అక్కడక్కడా తలదాచుకునేందుకు పరుగులు తీస్తున్నారు.

చిన్నగా వాన మొదలయ్యింది.

*

విజయ్ కుమార్ ఎస్వీకే

విజయ్ కుమార్ ఎస్వీకే

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముగింపు అర్థవంతంగా ఉంది…చాలా సంతోషం….అక్షర దోషాలు నువ్వూ చూసుకోలేదు….ఈ పత్రిక వాళ్ళూ చూసుకోలేదు….చాలా బాధాకరం.నా మాటిని హాయిగా కథలు రాస్కో…… పిచ్చ క్లాసీగా ఉంది….నాకు చాలా నచ్చింది. Unexpected…… It’s a good surprice for me from you………. Gasthee

  • U have got a very unique and pleasent way story telling brother ..! Loved it alot !! Keep rocking Anna ! Love u ❤️

  • Story narration is nice. But do u think it is possible to shift to a place where we like.. not in real life .

  • నాకు చాలా‌కొత్తగా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది చదువుతుంటే..
    కంగ్రాట్స్ విజయ్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు