వంతెన మీద

చెట్టుకొమ్మ మీద ఉన్న నమ్మకం
ఆకాశం మీద లేకపోయే !!

కొత్త మాటలేవీ తోచట్లేదు,
పాతవి ఎలానూ  పలకమీద మిగల్లేదు !

కలిసి ఇన్నేసి దూరాలు నడిచాక కూడా
మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోవలసి వస్తుంది
కూడుకొని కూడుకొని సగం పుస్తకం సంతోషంగా చదివాక
మళ్ళీ మొదటి అక్షరం నుంచీ చెయ్యిపట్టి దిద్దించాల్సి వస్తుంది

తప్పదు మరి, కాస్త ఓపిక చేసుకుని
ఈ వసారా గుంజకు ఆ ఎండుతీగను నాజూగ్గా అల్లించాలి

లోనెక్కడో పచ్చగా  ఉందిగా, మళ్ళీ మొలకెత్తక పోతుందా!

వేగంగా నడవాలి,
ఆ గుండె నీడలో నడుం వాల్చేవరకూ
మౌనంగా కూర్చోవాలి,
బీడు హృదయంలో పద్యం పలికే వరకూ !!

రంగు వెలసిన జీవనాకాశాన్ని ఆర్తిగా చూడాలి,
ప్రేమా, పసితనం ఎండావానల్లా కలిసొచ్చి
ఒక ఇంద్రధనస్సు వెలిగే వరకూ
తపస్సు చెయ్యాలి, తపించాలి
దుఃఖమంతా కరిగి శాంతిధారగా ప్రవహించేవరకూ !

ఈ పిడికిలి తెరచే ఉంచాలి
ఎగిరిపోయిన సగం మనసు దానంతట అదే
ఇంటి దిక్కుగా వచ్చి వాలే వరకూ !!

జీవితం కదూ,
క్షమించే కొద్దీ చేదు విరిగి చెమ్మ మిగుల్తుందిలేరా!

2

క్షేత్రజీవి

పికున్నంత కాలం చెప్పాను
భూమి అనేది బరువూబాధ్యత కాదు బంధమని
బిడ్డలు పాపమో, పుణ్యమో కాదు ప్రేమని
నువ్వేదీ చెవిన పెట్టుకోలేదు

బీడు నేలని చూసి బోరుమన్నావ్
వార్తల్లో చూసి ఇదే న్యాయమనుకున్నావ్
ఓపిగ్గా నిలబడే ప్రయత్నమే చేయలేదు

వాన అనేదే ఇక కురవదా ఎట్టా?
చెట్టుకొమ్మ మీద ఉన్న నమ్మకం
ఆకాశం మీద లేకపోయే !!

ఆపై ఇంకేం చేయను?

నీ దారి నువ్వు చూసుకున్నాక,
ఈ వాకిట్లో బకాయిపడ్డ పనులన్నీ
నీదో చేయి నాదో చేయి అనుకొని
రెండు చేతులా చేసుకుపోతున్నా  !!

చంటోడు ‘నాన్నా’ అంటే పలుకుతున్నా
చంటిది ‘అమ్మా’ అన్నా పరిగెత్తుతున్నా
నీవాళ్ళో నావాళ్ళో విడివిడిగా లేరిక్కడ
కొందరు మనుషులు,
కొన్ని అవసరాలున్నాయి, అంతే!

రెండెద్దుల కాడి నా ఒక్క భుజం మీదనే ఇప్పుడు
నిన్ను తలచి ఏడ్చే వారే కానీ
నాణెం కింద నలిగే నేనెవరికి తెలుసు?

*
పెయింటింగ్: సత్యా బిరుదరాజు

రేఖా జ్యోతి

రేఖా జ్యోతి

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ” ఈ వాకిట్లో బకాయిపడ్డ పనులన్నీ
  నీదో చేయి నాదో చేయి అనుకొని
  రెండు చేతులా చేసుకుపోతున్నా “…
  చాలా విభిన్నమైన దృక్కోణం.
  దారి వెడల్పవడం బావుంది.. అభినందనలు !!

 • ఎన్ని వనవిహారాలకు వెళ్లి తుళ్లింతలాడుతో తిరిగొచ్చినా ఇంటి వసారా ముందు పిచ్లిగా పెరిగిన మన వచ్చిక పైన దొర్లాడే వేళ కలిగే ఆ పులకింతే వేరు ! బాధ్యతల బరువుకు బెదిరి ఒకరు పారిపోయినా పారిపోక పోవడంలోని బాధ్యత ఎంత బరువైనదో ఉిత్తర రామచరిత అంత మహత్తర కరుణరసంతో చిప్పిల్లేలా చెప్పిన రేఖాజ్యోతిగారి రెండు అద్భుతమైన పదవశ పద్యాలకి రెండు చేతులారా నిండు నమస్కారం!

  • నమస్తే సర్, మీ పేరు, మీ కథలు, అక్షరాల మీద మీకున్న ప్రేమ గురించి C.a. Prasad uncle చెప్పేవారు, (మీరు డి.సి.పల్లె లో ఉన్నప్పుటి సంగతులు, నేను పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు) అప్పుడప్పుడు మీ పోస్టులు, స్పందనలు కూడా పరిచయం. ఇవాళ ఇలా నా చిన్న ప్రయత్నం దగ్గర మీ పెద్ద స్పందన ఎంతో స్ఫూర్తినిచ్చింది, thank you a lot!! Tq

 • ఎన్ని వనవిహారాలకు వెళ్లి తుళ్లింతలాడుతో తిరిగొచ్చినా ఇంటి వసారా ముందు పిచ్లిగా పెరిగిన మన వచ్చిక పైన దొర్లాడే వేళ కలిగే ఆ పులకింతే వేరు ! బాధ్యతల బరువుకు బెదిరి ఒకరు పారిపోయినా పారిపోక పోవడంచిప్పిల్లిలేలోని బాధ్యత ఎంత బరువైనదో ఉిత్తర రామచరిత అంత మహత్తర కరుణరసంతో చిప్పిల్లేలా చెప్పిన రేఖాజ్యోతిగారి రెండు అద్భుతమైన పదవశ పద్యాలకి రెండు చేతులారా నిండు నమస్కారం!

  • ఒక నిట్టూర్పు, ఇలా ఉండమని, ఇలా ఉంటే శాంతి అని ఎదుటివారికి వివరించలేనప్పుడు! Thank you Udaya Garu!

 • క్షేత్రజీవి – మనసును పిండేసే కవిత. చిన్నపిల్లలా ఉన్నారు. నమస్కరించాలనిపించట్లేదు. మనసారా ఆశీస్సులు.

 • అనిపిస్తుంది , అర్ధంచేసుకోరు, అనుభూతి చెందరు… ఎలా చెప్పాలి మన మనుషులుకు! అని ఎప్పుడైనా అనిపిస్తే ఈ వాక్యాలు చదవండి ….

  “నీవాళ్ళో నావాళ్ళో విడివిడిగా లేరిక్కడ
  కొందరు మనుషులు,
  కొన్ని అవసరాలున్నాయి, అంతే!”

  చాలా అర్దవంతంగా రాసారు జ్యోతి గా

 • రెండు ముత్యలే..!ధన్యవాదాలు, రేఖ జి💐.నాణెం కింద, నలిగే నేను ఎవరకు తెలుసు?👌..ji.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు