వంగపూల రంగు లేసు గౌను పిల్ల 

క ఈ కాలం చివరి కోసపై కూర్చుని తీరికలేని  చిత్రకారిణి వలె

అరణ్యాలను వాటి నీరెండల పల్చటి పచ్చటి ఛాయలను

వర్షపు చినుకుల గాజు నీటి  కాంతి ప్రతిఫలనాల మెరుపులను

మంచుపర్వత శిఖర్రాగ్రాలను ముద్దుపెట్టుకునే ఇంద్రధనుస్సు వంపులను

వాటి విరిగి జారిపోయే చెరియల ప్రవాహ వేగాలను

ఎగసిపడే సముద్రపు అలల చిటారు నీటి కొమ్మలపై

వాలే తుమ్మెదల కోలాహలాన్ని

అనాదిగా నదులు నేలపై వేసిన దారుల గుండా

తుళ్ళిపడుతూ పారే  నీటి ధారల గలగల మువ్వల సవ్వడినీ

ఇంకా చిన్ని చిన్న పాదాలతో నడిచే పాపల తడబడే అడుగులని

వాళ్ళ చిగురు పెదవుల సుతిమెత్తని  నవ్వులని

నేను కప్పుకునే దుప్పటిపై రాగరంజిత చిత్రాలుగా గీస్తాను

 

అలసి విసిగి వేసారిన హృదయంతో చిత్రాల్ని గీసినప్పుడు అవి

పెదవి చివర తెగి  వేలాడే  విరిగిన  నవ్వులా

దుఃఖాన్ని పాడే తడి లేని కళ్లలా

ఇసుక ఎడారుల ధూళి సుడిగుండాల మృత్యు నాదాల్లా

కలవని రెండు రైలు పట్టాల మధ్య నలిగి మరణించిన వాంచ్ఛల్లా

తడి తడి చీకటి కురిసే గాఢాంధకార రాత్రుల్లా

ధ్వంసమైన మనిషి తాలూకు ఆత్మ నిస్సహాయ ఆక్రందనల్లా

దుప్పటిపై పరుచుకుంటాయి

అప్పుడు ఒకే ఒక్క  దిగులు ధూసర వర్ణం నా చిత్రాల  నిండా కమ్ముకుంటుంది

 

దినమంతా శ్రమించి అలసిన మనశ్శరీరాలు నిదురించే

నా విశ్రాంతి మందిరాన్ని  అలంకరిస్తాను రోజూ ఒక్కో తీరుగా

కలలురాని , నిదురలేని  అశాంతి రాత్రుల

గాఢ నీలాకాశ  తల్పం పై, పరుస్తాను  నీలి నక్షత్ర కాంతులను

ప్రతి రాత్రీ నా పై  ఒక్కో కలల దుప్పటి కప్పుకుని  విశ్రమిస్తాను

నిదరోయాక, ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు

ఒక కల బుజ్జి కుక్కపిల్లా వచ్చి నా  పక్కనే ముడుచుకుని పడుకుంటుంది

 

నేనో , నా పక్కనే ముడుచుకుని నిదురించిన  కలో

పీడకలల చలికి వణికి,  కలల దుప్పటిని

వెచ్చగా  కప్పుకోబోయి నిద్దట్లో  కిందికి   తోసివేసినప్పుడేనేమో

దాని నుండి జారిపడ్డ రంగురంగుల చిత్రాలన్నీ రాసులుగా

గది నిండా చెల్లాచెదరై పడిపోయాయి

 

ఇంకా వికసించనివి,రెక్కలు రాక నే ఎగరబోయి కూలిపోయినవి

పగిలి భళ్ళున బద్దలై రాలిపోయిన కలలన్నీ మాయమైనాక

మొఖంపై  తెల్లటి దుప్పటి పరిచి నిదురించిన ఒక చరమ రాత్రి

వంగపూల రంగు లేసుల గౌను వేసుకుని చేమంతి పూల తోటలో

తూనీగల వెంట గంతులేస్తూ పరుగెడుతున్న చిన్నపిల్ల

చాలా చిన్నపిల్ల

చిట్ట చివరగా నా  కలలోకి వచ్చింది

లోకం పట్టని ఆ పిల్ల గాలికి ఎగురుతున్న జుట్టుతో

చందమామకి  కలల దారాన్ని కట్టి

పచ్చటి మైదానాల్లో గమ్యం లేని  పరుగు పెడుతున్నది

గాలిపటాలు తెగిపోతాయని తెలియని ఆనందంతో

మర్మం ఎరుగని అమాయకపు  నవ్వు నవ్వుతున్నది

ఆ పిల్ల అచ్చం  చిన్నప్పటి నాలానే ఉంది

నిజంగా అది ఎంత గాఢమైన నిద్రో…

*

 

విమల

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కవిత చదివి అనిర్వచనీయమైన ఫీలింగ్ కు లోనయ్యాను. దాన్ని ఆనందం అనాలా, భావావేశం అనాలా, ఏమనాలో తెలియదు ఆ చేతనావస్తను. ఏమైనా “కవిత్వం ఒక ఆల్కెమి ” దాన్ని ఎట్లా తయారు చెయ్యాలో విమల కు తెలుసు.

  • ధ్వంసమైన మనిషి తాలూకు ఆత్మ నిస్సహాయ ఆక్రందన …
    ఒక చరమ రాత్రి కలలో కనిపించిన మర్మం ఎరుగని అమాయకపు నవ్వు నవ్వుతున్న పిల్ల…
    అంటూ ఆర్తిగా రాసిన కవయత్రి విమల గారికి నెనర్లు.

    ” విప్లవ కవులుగా ప్రసిద్ధులైన కవి పరంపరలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇష్టపడే ఇద్దరి కవిత్వ ప్రకటన రీతి ఒకరు శివసాగర్ ఐతే మరొకరు విమల “

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు