మనసుకి తోచింది రాస్తే భలే “స్వేచ్ఛ”!

మొదటి కవిత స్కూల్ లో ఉన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు రాసుకున్నాను కానీ చిన్నప్పటి కవితలన్నీ రాసుకున్న డైరీ పోగొట్టుకున్నాను. కాబట్టి మొదటి కవిత గుర్తు లేదు. కానీ 8వ తరగతికి వచ్చిన తర్వాత మా క్లాస్లో ఉండే అమ్మాయి చదువు మానేసింది. వాళ్ళ అమ్మ స్కూల్ పక్కనే మార్కెట్ లో కూరగాయలు అమ్ముతుండే..వెళ్లి అడిగితే..తనకి పెళ్లి చేసినట్టు చెప్పింది. వాళ్ళ అక్కకి పిల్లలు పుట్టట్లేదని అక్క భర్తతో తనకు పెళ్లయింది. బాల్యవివాహమే.. బాధనిపించి అంతా కథ రాసి..అప్పట్లో “చూపు” పత్రికకు పంపితే ఇదేదో పెద్దవాళ్ళు రాసినట్టుంది అని పబ్లిష్ చేయలేదు..ఆ తరవాత 2008 ,మార్చ్ లో..మిణుగురు అనే కవిత రాసాను..

~~~
అమావాస్య చీకట్లో
మిణుకు మిణుకుమంటూ
ఆడుతూ పాడుతూ
నన్ను మించింది
ఈ ప్రపంచంలోనే లేదన్నంత పొగరుతో
మనం
గంపకింద కమ్మిన కోడిపిల్లలను
ఆడుకోడానికి రమ్మని
బయటికి పిలుస్తున్న
ప్రతి చుక్క ఉడుకుతనం, దుడుకుతనం
నీ రెప్పపాటుకి తెలుసుకదా…
~~~
ఈ కవిత రాసుకున్నప్పుడు మా పెద్ద మేనమామ వాళ్ళ ఊరు..తెలంగాణలో జగిత్యాల జిల్లా, మెట్ పల్లి దగ్గర రామలచ్చక్క పల్లె లో ఉన్నప్పుడు ..రాత్రిపూట ఇంటిబయట నులకమంచం మీద పడుకొని ఆకాశాన్ని చూస్తూన్న సందర్భం..అర్థరాత్రి కావస్తుంటే కూడా నా మంచం పక్కన కమ్మిన కోడిపిల్లలు లేచి గంపని కదుపుతున్నాయి.. అప్పుడనిపించింది రాసుకున్నా..

2.

నేను రాసిన కవితల్లో నాకు బాగా నచ్చిన కవిత “నేను”. ఇది నా కవితా సంకలనం “మట్టిపూల గాలి” లో మొదటి కవిత.
~~~
నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసినప్పుడు
మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే
పసిచివురును పొత్తిళ్లలో పొదుముకున్నంతలోనే వేరుతెగినప్పుడు
నేలలోకి కుంగి మళ్ళీ మొలకెత్తింది నేనే
ఇప్పుడు లోయా లేదు,తుఫానూ లేదు
అంతా మైదానమే..
భూమిపైన కనుచూపుమేరా..
మైదానపుకుదుళ్ల చివరా..
అంతా నేనే

ప్రతిరోజూ.. కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరీ ఎగిరీ
అలసిపోయినట్లై
ఒక్కసారి
ఏదైనా చెట్టుకింద సేదతీరాలనిపించింది.
నా పిచ్చిగానీ..
మళ్ళీ గుర్తొచ్చి నవ్వొచ్చింది.
ఆ చెట్టూ నేనే అని…

~~~
ఇది 2016 జూన్ లో సాహితీమిత్రులు – కవిత పత్రిక 37వ సంచిక లో పబ్లిష్ అయింది.ఎన్నిసార్లు చదువుకున్నా..చదివిన ప్రతిసారీ..నా మీద నాకు, జీవితం మీద నాకు ఒక భరోసా, నమ్మకం, ఆత్మతృప్తి ఇస్తుంది.ప్రతి  మనిషి individuality ని, ఆత్మగౌరవాన్ని మొదటి ప్రయారిటీ లో పెట్టుకోవాలని నమ్మే వ్యక్తిని నేను. మనకంటూ ఒక అస్తిత్వం ఉన్నప్పుడే..దాని వెంట మనిషి జీవితం కొనసాగుతుంది. అసలు ఆస్తిత్వమే లేనప్పుడు , వ్యక్తిత్వానికి గుర్తింపు లేనప్పుడు..అలాంటి చోట నిమిషం కూడా ఉండకూడదు. ఆ చోటు ఏదైనా కావొచ్చు..ఎవరి దగ్గరైనా కావొచ్చు..నీకు నువ్వుగా ఉండటమే జీవితం..అలా నాకు నేను మిగులుతూ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు నేను రాసుకున్న ఈ మాటలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్నిస్తాయి..అందుకే ఎన్ని కవితలు రాసినా ఇది నా ఆల్ టైం favourite poem.

3.

కవిత్వమే ఎందుకు రాయాలి అంటే చెప్పలేను. చిన్నప్పటి నుంచీ చదివింది కథలనే.. కుప్పలు కుప్పలుగా పుస్తకాలన్నీ చదివేసేదాన్ని..పిల్లల పత్రికలు, సోవియట్ పబ్లికేషన్స్ పుస్తకాలు, నవలలు..విపరీతంగా చదివాను..మాస్ కమ్యూనికేషన్ లో పీజీ చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత కెరీర్, కొత్త జీవితం.. ఇవన్నీ కొనసాగుతున్న క్రమంలో మనసుకి తోచింది వ్యక్తికరించడానికి కవిత్వం స్ట్రాంగ్ మీడియం లా అనిపించింది..రాసుకున్న నాలుగు పదాలో, వాక్యాలో.. మనసులోని భావనని మొత్తంగా నింపుకుంటే అంతకంటే ఇంకేం కావాలి.

*

స్వేచ్ఛ కొత్త కవితలు రెండు:

 

అడవి

అడవిలోకి
భలే తీసుకొచ్చావ్..నేనూ ఆటే
వెళ్దాం మనుకున్నా..కొద్దికొద్దిగా
ఇక దాక్కోలేని
చందమామ కోసం..ఎంత గారాబం
నీకు..సన్నటి నీటి ఊటలా
లాలిస్తావు..చల్లని గాలిలా
ప్రేమిస్తావు..

అడవి ఆకుల కింద
వెలుతురులా
ఆడిస్తావు..

వెన్నెల కింద
చిక్కటి పొగమంచులా
పరుచుకుంటావు..

చుక్కలన్నింటినీ
నాతోనే ఉంచేస్తానంటావు..

నీ
ఆకుపచ్చని ప్రేమ
బాగుంది..

చలిని మోసుకొచ్చిన
సాయంత్రం బాగుంది..

నన్నే ప్రేమించే
నా అడవి బాగుంది..

ఇక్కడే నన్ను
నీ ఊపిరి పీల్చుకోనీ..

2
నవ్వు
చుక్కలనన్నీ
మూట కట్టి
భుజానేసుకొని
తీసుకెళ్ళావ్..రాతిరి
ఖాళీ అయింది..దారిలా
కనిపించిన చోటల్లా
అడుగులేస్తూ ఉన్నాను..
ఉదయాన్నైనా
కలుద్దామని..ఒక్కసారి
నవ్వు..
ఆ మూటలోంచి
సూర్యుడు
జారిపడాలిగా..
*

స్వేచ్ఛ

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నన్ను ప్రేమించే నా అడవి బాగుంది …..

    స్వేచ్చా, నీ భావనలు పచ పచ్చగా కళ్ళముందు కదలాడతాయి…..

  • స్వేచ్ఛ గారి గురించి తెలియని విషయాలు కొన్ని తెలిశాయి. తన మొదటి కవితా సంకలనం పై నవ తెలంగాణ సాహిత్య పేజి దర్వాజలో సమీక్ష రాసినట్లు గుర్తు.నేను బాగా ఫీల్ ఐ రాసిన సమీక్షలలో ఇది ఒకటి.స్వేచ్ఛ గారి కవిత్వానికి నేను అభిమానిని.. ఆల్ ద బెస్ట్.

  • కవిత్వం లో అభివ్యక్తి చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని ఆశస్తూ…

    -గవిడి శ్రీనివాస్

  • బాగుంది నీ సాహిత్య ప్రయానం.
    కవిత్వం కూడా తాత్విక గాఢతను కలిగి ఉంది. మన జీవిత సంఘర్షణే మన సాహిత్య వస్తువు.
    – డా. పసునూరి రవీందర్

  • ఇక్కడ కోట్ చేసిన వాటికంటే మంచిపొయెమ్స్ ఉన్నట్టు గుర్తు…. మీ గురుంచి మరింత చదవాలి

  • ఆకుపచ్చ ప్రేమ…చుక్కల మూట…మీ ప్రయాణం..అన్నీ ..అద్భుతం…అక్షర సావాసం…

  • ఇలాంటి గొప్ప రచయితలని ఇంకా మనం అందరూ ప్రోత్సహించాలి ❤️

  • జీవన సంఘర్షణే కవితకు మూలం అయినప్పుడు వాటిలోని లోతు కూడా అంతే వాస్తవికంగా ఉంటుందనటానికి.. మీ కవితలు ఉదాహరణ…. అల్ ద బెస్ట్…
    ౼ రఘుపతి పోరెడ్డి

  • చలిని మోసుకొచ్చిన సాయంత్రం లాగే చిక్కని కవిత్వం చదివించిన ప్రభాతమూ బాగుంది…స్వేచ్ఛా మీ కవిత్వంలో గాఢత నాకు బాగా నచ్చుతుంది….

  • ఆకుపచ్చని ప్రేమ చాలా బాగుంటుంది.
    చలిని మోసుకొచ్చే ఆ సాయంత్రాలు ఇంకా బాగుంటాయ్!
    …….
    మదిని అలా మెల్లిగా తాకి మైమరిపింపజేసే వాక్యాలివి.
    ఎంత బాగున్నాయో! 💙💙💙
    నిజమే.. మనసుకి తోచింది రాస్తే భలే స్వేచ్ఛ.
    ఇంకా రాస్తూ ఉండండి మేడం💐

  • Avnu Manasuki Thochindi rasthe bale swetcha sissu 😍 nuv rasina Adavi (Forest) e Kavitha bagundi Kavitha lo lines bagunie depth undi Kavitha lo nd nigurinchi Telina Kotha vishyalu cheppav maku nd Title bagundi ఏరువాక.expecting more from uu.

  • Beautiful! జీవితం ఎంత మోసం చేసినా చివరకు నీకు నువ్వు మిగిలితేనే గాయాలు మానిపోగలవు. Lovely expressions ❤️

  • ప్రియ మిత్రుడు కవి కాశిరాజు గారి కోసం

    “ ఉండకుండా పోకు “ ~ స్వేచ్చ వొటార్కర్

    ఉండకుండా పోకు,
    ఉండకూడని చోటికి పోకు
    నువ్వు లేని చోట
    నీ ఉనికి కోసం చూడకు
    కాలం లోపలి కాలం
    గడిచేకొద్దీ మారుతుంటుంది

    ఎదురు చూస్తుంది
    ఎద బరువు మోస్తుంది
    అలసి పోతుంది
    అలిగి పోతుంది
    పగిలిపోయిన వేళ
    కనుమరుగై పోతుంది

    కాలాన్ని దాచిన కాలం
    శవమై పోతుంది

    అందుకే ఊపిరున్నంత సేపు
    ఉండకుండా పోకు
    ఉండకూడని చోటికి పోకు
    అసలే పోకు

    వెళ్లిపోయిన అలతో
    బయటి కాలం
    కరిగి పోయింది
    నువ్వు లేకుండా పోతే
    భళ్లున పరిగెత్తు కొచ్చి
    నీ అడుగులు చెరిపేసి
    నువ్వెరవో ఎవ్వరికీ
    ఎప్పటికీ తెలియనట్లు
    జీవన్మరణాలతో కలిపి
    అందుకోలేని తీరంలో
    బందీ చేస్తుంది

    పుట్టడమూ చావడమూ
    స్పృశించలేని వ్యధలో
    నిన్ను మరచిన నేను
    కాలం లోపలి కాలంలో
    నిదురిస్తూనే ఉంటాను
    నిన్నప్పటికే పూర్తిగా
    మరచివేయబడి ఉంటాను
    అంతకంటే ముందే
    నాకు నువ్వు
    ఉండకుండా పోకు

    ~ స్వేచ్చ వొటార్కర్

    Andhra Jyothi VIVIDHA 30th December, 2019

  • Entha manchi feel tho rasaro adhey feel as a reader i feel the same keep going on.Chala happy gaa anipincindhi manasuki

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు