లిఖిత్ కుమార్ కవితలు రెండు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఎం.ఏ తెలుగు మూడవ సంవత్సరం చదువుతున్నాను. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యం ఇష్టం. మార్మికత, తాత్వికతని ఎక్కువగా ఇష్టపడతాను సాహిత్యంలో. ఇంగ్లీష్ లో Cormac McCarthy చాలా ఇష్టమైన రచయిత. తెలుగులో కవిత్వం పరంగా శ్రీకాంత్ చాలా ఇష్టం.

కవిత్వాన్ని define చేయడం వారివారి మానసిక స్థితిని, దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. నా వరకు కవిత్వం Personal Emotion. నాది, నేను అన్నది ఉన్న ప్రతీదాని గురించి కవిత్వం రాయడానికి ప్రయత్నిస్తాను. మొదట నా అనేది కవిత్వం అనుకున్నప్పటికీ, లోకంలోకొచ్చి చూసినప్పుడు బలహీనుల వైపు నిలబడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. మతమౌఢ్య ప్రభుత్వాలని ధిక్కారించాలి అని కూడా. ఊహకి, కలకి, ఆశకి, జీవితానికి ముడిపెట్టడం చాలా ఇష్టం. నాతో లోకాన్ని, లోకంతో నన్ను బేరీజు వేసుకోవడం లాంటిది నాకు కవిత్వం అంటే.

1

పజ్జెందేళ్ళ పుట్టిన్రోజున

డాడీ నిద్ర లేచి
పొద్దును ఇంట్లోకి తెచ్చాడు
ఎప్పట్లాగే తలుపుతీసి

రాత్రి దాచుకున్న ప్రేమనీ మమకారాన్ని
సంవత్సరమంతా దాచుకున్న కారుణ్యాన్ని
కొన్ని ముద్దులలో –
‘చిన్నీ! Happy b’day to you
అప్పుడే పజ్జెందేళ్ళొచ్చాయా నీకు!’
అని
నా కుడిచెంపను తడిపాడు.

కళ్ళు తెరిచి
వెల్లికిలా ఒత్తిగిలి
కిటీకీలోంచి రాలుతున్న సూర్యరశ్మిని;
ఎదురుగా తెల్లగా చంద్రుడిలాగున్న నాన్నని చూసి
అప్పుడే పుట్టినట్టు
అప్పుడే జగత్తు జీవ స్వరాన్ని విన్నట్టు

ఒక నవ్వు నవ్వుతూ –
తెల్లపొడ కమ్మిన నాన్న చల్లని, తెల్లని అర్థ నగ్న
శరీరాన్ని హత్తుకుని
నేను

జీవితంలో ఏదో మహత్తర మహోజ్వలాన్ని  సాధించిన దృశ్యం కనబడింది: నాన్న కళ్ళల్లో.
చుక్కల్ని వెన్నెలని కలిపి చేసిన రంగును పూసుకున్నట్టు నాన్న అందమైన ముఖ ఛాయలు. పోలిస్తే అశ్వినీ నక్షత్రం లాంటి ఒక పసివాడు నవ్వినట్టు.


నాన్న కళ్ళల్లోకి చూస్తూ
‘పజ్జెందేళ్ళ కుర్రాణ్ణి ముద్దెట్టుకుంటారా ఏ నాన్నైనా?
మా డాడీ తప్ప ‘
కొత్త భాష్యంలో నేను.

గదిలో ప్రశాంతంగా వీస్తున్న గాలి
నా ఉదరంపై పడుకుని
గసతీర్చుకుంటూ జిమ్మీ
తెల్ల దూది పువ్వు లాగా.

ఎవరో Alarm మోగించినట్టు
అప్పుడే నేను పుట్టినప్పటి పురిటినొప్పులు అనుభవం గుర్తొచ్చినట్టు
రాత్రంతా కుట్టు మిషనుతో అలసిపోయిన అమ్మ
దిగ్గున లేచి వెండి పట్టీల రవళితో వొచ్చి
నన్ను ఎదకు హత్తుకుని
ముఖాన్ని ముద్దులతో తడిపేస్తూంది.
నాన్న ముద్దుల తడి పోవద్దని
చెంపను పట్టుకుని నేను

‘ఇక చాలాపమ్మా!’ అన్నేనన్నప్పుడు బదులుగా
~
‘పిల్లలకెంత వయసొచ్చినా
మీసాలూ గెడ్డాలూ మొలిచినా
మా ముందు చిన్నోళ్లేరా పండూ’
~
అమ్మ

అమ్మ ముద్దుల చప్పుడుకి
నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ తమ్ముడూ…

ఇప్పుడు
ఈ ఇరవయ్యవ పుట్టినరోజున
ఈ క్షణాన
అప్పటి పొద్దును తలుచుకుని
సూర్యుడు కిటికీల అద్దాలు దాటి కళ్ళపై పడ్డప్పుడు
దిగ్గున లేచి
రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుని ఏడుస్తున్నాను.
రాలిన కన్నీళ్లతో తడుస్తూ దృశ్యాలు –
‘నాన్న మరణం
అమ్మ ఏకాకి జీవనం
తమ్ముడు…’
ఈ వాక్యాలను ముగించలేను.

జీవితం పొడిబారిపోయింది నాది.

 

2

Hasta La Victoria

ఢిల్లీకి పయనించబోయే ముందు
కామ్రేడ్లంతా కలిసి దేశం గురించి పాడినప్పుడు
చీకటిలో కొన్ని కాంతులను చూశాను

అయినా వేళ్ళేది ఒక మార్పుకోసమే కదా
ఒక అడుగు వేసి
ఒక పిడికిలి ఆకాశం వైపెత్తి
రెండు కళ్ళని శూన్యంవైపు విసిరి
El pueblo unido jamás será vencido అని
పాడటం శిగమెత్తడమే
చదువులో కాషాయపు రంగుని పూద్దామనుకునే వ్యవస్థని
ఎర్రటి విప్లవంతో కడిగేయడమే

వెళ్ళే ముందు కొందరు
తమ మాటలతో ఆ ప్రాంతాన్ని ఊహకు తెస్తారు
దారిలో తీసుకోవాల్సిన వస్తువులని జ్ఞాపకాలలో రాస్తారు
లెక్కలేని సార్లు కౌగిలించుకుని వదిలేసి
దారి మధ్యలో ఎందుకు హత్తుకున్నారో గుర్తొస్తారు
నన్నే చూసి ఎన్నిసార్లు నవ్విందో తెలియని
నేను ప్రేమించే నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియని ఒక మళయాళీని
నిద్రలో జపిస్తాను

యుద్ధానికి వెళుతున్నట్లు
విప్లవాన్ని అమ్మముద్దుని ఒక్కసారే స్పర్శిస్తున్నట్టు
ఒక కామ్రేడ్ ఎడం బుగ్గపై ముద్దెడతాడు
విప్లవం మార్పుని మాత్రమే కాకుండా
ధైర్యాన్ని ప్రేమని ఇలాంటి ఒక ముద్దుని ఇస్తుందని తెలుసుకుని
వెళుతూ వెళుతూ ఉన్నాను
నాతో ఇంకెందరో వస్తూ రాజ్యంపై తిరగబడుతున్నారు.

***

 

లిఖిత్ కుమార్ గోదా

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • స్పష్టతతో సూటిదనంతో ఈ రెండు కవితలు గుండెను తడిమాయి.. లిఖిత్ అభినందనలు.

 • పజ్జెందేళ్ళ పుట్టినరోజున అమ్మానాన్నల ముద్దులతో తడిసిన నీ చెంపలను ఊహించినప్పుడు నా చెంపల్లో వెలుగొచ్చింది. ఇరవయ్యవ పుట్టినరోజున నాన్న లేడని కన్నీటితో తడిసిన నీ చెంపల మీద మళ్ళీ ‘ పజ్జెందేళ్ళ పుట్టినరోజును ‘ చూసినప్పుడు నా ముఖంలోనున్న వెలుగు వెళ్ళిపోయింది.❤️

 • అశ్వినీ నక్షత్రం లాంటి ఒక పసివాడు…

  పాడటం శిగమెత్తడమే
  చదువులో కాషాయపు రంగుని పూద్దామనుకునే వ్యవస్థని
  ఎర్రటి విప్లవంతో కడిగేయడమే…

  chaalaa baavundi LIKHIT

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు