రాజు దాస్ ……  పాట

బర్మా కేంపు  కథలు 

“మీకు పాటలు నైట్అంతా పాడాలంటే ఒక మాట , ఖవ్వాలీ అయితే ఒక టీము, మనిషి ఎలిపోయే వరకు పాడాలంటే ఒక మాట. మా వోళ్లు వొయిజాగు లో మొత్తం  ఎనిమిది ట్రూపులున్నాయి, మీకు అడవి వరం జువ్వాలు కావాలా ? సాకేతపురం శంకరదాసు ఖవ్వాలీ కావాలా ?ధర్మానగర్ నీలపు ముత్యాలు ?లేదా ఇందిరానగర్ రెడ్డీ ? సీతంపేట శ్యామ్ ? నీలపు చిన్నా ? న్యూ కాలనీ శివా ? లేక పెద్దాడ నూకరాజా ?ఎవులిని తీసుకున్నా పర్లేదు  హార్మోనిస్టు మాత్రం సిద్దార్ధ నగర్ అప్పలరాజు ఉండాల “.

మెల్లిగా ప్రశాంతంగా గాలి ఉండీ ఉండీ వీచినట్లు మనిషికి హత్తుకునే టట్లు, పెద్ద గాభరా లేనట్లు మాట్లాడుతున్నాడు హైవే నెంబర్ 16 సర్వీస్ రోడ్డులో నలంద నగర్ రాజు దాస్.  అసలు పేరు  మాత్రం కోటపాటి నాగరాజు. రెల్లీ మనిషి. బక్కగా ఉంటాడు, పోర్టులో పనిచేసి పాటలపై ప్రేమతో వీ ఆర్ తీసుకొని వుద్యోగం వొదిలీసాడు.

“చావు పాటల మీద ప్రేమతో వుద్యోగం కూడా వొదిలీసాడు”  అని రెండో భార్య ప్రేమగా, గొప్పగా చెబుతుంది రాజు దాస్ గురుంచి.

వేపగుంట అవతల చింతలఅగ్రహారం నుంచి వొచ్చిన ఆ గవరోళ్లతో మాటలు, పైసలు కుదిరాక అందరికీ కబురంపి    జట్టు రెడీ చేసుకున్నాడు రాజుదాస్.

*   *  *

హార్మోనిస్టు , డోలక్, పాటగాళ్లతో ఆటో సర్రున హైవే లో దూసుకుపోతోంది.

రాత్రంతా శవం దగ్గర భజన పాటలు పాడాలి, పాట పాడాలి అంటే …. పడాలి.

గోపాల పట్నం లో మందు తీసుకొని వెళ్లేసరికి

పూలదండల నుంచి వొచ్చే చామంతుల, బంతుల, గులాభీల విషాద పూల వాసన, అగరొత్తుల వాసన, బంధువుల రోదన, ఇంట్లో వాళ్ళ వేదన, ఇవేమి పట్టకుండా

శవానికి ఒక దండం పెట్టుకొని …

” ఉండదు ఈ ప్రాణము యెల్ల కాలము ”

పల్లవి అందుకొని పాడాడంటే

 

వెలుగు చీకటన్నది

పుట్టక చావన్నది

ఎదిగి వొదిగి కడకు ఇదే మాయమైనది

ఆ ఎగిరె పటమిది

……..

ఉండదు ఈ ప్రాణము యెల్ల కాలము…

పట్టుదలతో సంసారం సదా ఈద గలిగినా

పట్టువిడని  భట్టి విక్రమార్కుడవైన

పట్టు విడబోడన్నా … ఆ పై వాడన్నా

పుట్టె డాశలన్నీ  కన్నీటి బుడగేనన్నా ..

ఉండదు ఈ ప్రాణము యెల్ల కాలము…

పాటలు అవుతున్నాయి, మందూ అయిపోతోంది ,

తెల్లగా తెల్ల వారిపోతోంది .

*  * *

కోటపాటి నాగరాజు ఎప్పటి మనిషి  1961 లో మొదటి ఓడలో బర్మా నుంచి పెద్దోళ్ళతో కలిసి పిల్లవాడిగా వున్నపుడు ఇండియా

వొచ్చేసాడు, అచ్యుతాపురం కాంపులో కొన్నాళ్ళు ఉన్నాక నడుచుకుంటూ బర్మా కేంప్ చేరుకున్నాడు.

కాందిశీకుడిగా షిప్యార్డ్ లో వుద్యోగం వొచ్చింది, వుద్యోగం కంటే భజనలకు వెళ్లడమే ఇష్టం.

ఆశ తో జీవించి కట్టె లా మిగిలిన మనిషి సుగుణాల మీద, జీవిత నర్మ గర్భత పైన పాటలు కట్టడం ఇష్టం, పాడటం

ఇష్టం, రాత్రంతా గొంతు తడుస్తూనే ఉంటుంది, పాట మోగుతూనే ఉంటుంది.

ఎన్ని ఊర్లు చూసాడు, ఎన్ని వేళ మనుషులను సాగనంపాడు, యెంత గౌరవాన్ని శవానికి కల్పించాడు.

“పాట ట్యూనింగ్, పల్లవి చరణాలు  నేనే రాస్తాను,, ఎతికిన ప్రాస లో రాస్తాను, పల్లవి,చరణం, అంకితం నా పాటలో ఉంటాయి, చనిపోయిన మనిషి గుణగణాల మీద కూడా అప్పటికప్పుడు పాట కూర్చేసి పాడేస్తాను, నేను పెద్దగా చదువుకోలేదు, మా పెద్దోళ్ళు పాటలు పాడేవోరు, బర్మా లోనే వాళ్లకి ఆ అలవాటు, నన్ను పాట పట్టుకుంది, మరి దాన్ని నేను ఇడిసి పెట్టలేదు ”

” భజన శవ జాగరణకే కాదు సారు , దిన కార్యానికి కూడా చేస్తాము, ట్రూపందరం డబ్బులు పంచుకుంటాం, అందరూ సమానంగా పంచుకోవడం ఉండదు, హార్మోనిస్టుకి, డోలక్ వాయించిన వాడికి ఎక్కువ ఇవ్వాలి ”

” ఎక్కడకి వెళ్లిన జీవన తరంగాల పాట మాత్రం తప్పని సరి, సారు, దాన్ని తలదన్నే పాట ఇప్పటివరకు మరి రాలేదు , అందుకోమంటారా ?”

*  *  *

బర్మా కేంపు  కిందన గంటల్లారీ ఆఫీసు ఎదురుగా శ్మశానం , ఎక్కడెక్కడ నుంచి వొస్తాయో శవాలు, రోజూ శవం చూడకుండా, ఎదురవకుండా కప్పరాడ బడికి వెళ్లలేని పరిస్థితి నాది.

శవాలు చూసి, చూసి, బడి నుంచి వొచ్చేటప్పుడు చావు భజనలు చూసి, ఆ పాటలు వినీ, వినీ నాకు తెలిసిన వాళ్ళెవరైనా చనిపోతే అని ఒకరకమైన భయం పట్టేసుకుంది.

పరిగెత్తుకుని నూకాలమ్మ గుడి కి వెళ్లి దండం పెట్టుకొని వరాలు కోరుకొని, బొట్టు పెట్టుకున్నాను కానీ భయం తగ్గలేదు.

పార్టీ వాళ్లేమో పూనకాలు లేవు, ఏమీ లేవు అంతా హిస్టీరియా  అనేవారు. నిప్పుల మీద ఎలా నడవొచ్చో, శూలం ఎలా గుచ్చుకోవొచ్చో చేసి చూపించారు. చివరకు విజ్ఞానం గెలిచింది. చావు భయం తగ్గింది.

కప్పరాడ  బడి నుంచి అన్ని పుడికింతాలు చేసుకొని వొస్తుండే నాకు… రాజు దాస్ పాటలు, డోలక్ శబ్దం, హార్మొనీ  ఏ శవం దగ్గర కనపడినా ఆగి విని వెళ్లే వాడిని.

పెద్దవాడా, పేదవాడా, కులం తక్కువోడా , పెద్ద కులమోడా ఇవేమి రాజు దాస్ కి పట్టవు,

అయినా పట్టణ  సామూహిక జన జీవనంలో వుండేవన్నీ బహుజన, దళిత కులాలేగా.

వాళ్ళు యెంత ఇచ్చి భజన పెట్టించే వారో తెలీదు గాని ప్రతి చావుకు భజన ఉండాల్సిందే,

పొద్దున్న కుటుంబ బంధు జనం అంతా బోరు బోరున ఏడవాల్సిందే. పసుపు నీళ్లతో స్నానం చేయించి,

రూపాయి బిళ్ళ నుదుటన పెట్టి శవానికి ఒక ఫోటో తీయాల్సిందే, అందరూ కలిసి శవంతో ఫోటో దిగాల్సిందే.

* * *

పువ్వులా వికసించి

వాడిరాలే దేహమిది

సవ్వడి జేయకను

రివ్వున ఎగిరేది

నవ్వులాట కాదోయి సత్యమే ఇది

ఎవ్వరిలను తోడున్నా

ఉండమన్న ఉండనిది.

 

భవబంధ నిలయం మానవాజన్మం

అవరోధన వేదనే

జీవితం ఈ జీవితం కాదు శాశ్వతం

అవని లోన ఇది ఏరా

నాటక భాగోతం

 

” గురువు గారు మా ఆవిడ చావు భజనలకు ఎళ్ళొద్దంటుందండి

పెళ్లిళ్లకు, వేరే ఫంక్షన్లకు అయితేనే వస్తానండి

తీన్మార్ పాటలు పాడుకుంటాను ” అన్నాడు కంచరపాలెం నుంచి కొత్తగా శిష్యరికంలో చేరిన

చిన్నా అని అందరూ పిలిచే కుర్రాడు.

” మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి వాళ్లకు నచ్చినట్లు వుండండి ఏం పర్లేదు ” అన్నారు రాజు దాస్, హార్మోనిస్టు అప్పలరాజు.

” అన్నియా మన  కుర్రోళ్లు మన పాటలు కూడా యూ టూబు లో పెడుతున్నారు మంచి జమ్స్ అన్నియా వీళ్ళు ”

ఈ ముప్పయ్యేఏళ్ల భజన జీవితంలో కనీసం పదివేల మందిని పాటలతో సాగనంపాను నేను అని గర్వన్గా చెప్పుకునే రాజు దాస్ ని మీరు అడిగి చూడండి ఏమయ్యా నీకు నీ కుటుంబానికి ఏమైనా కీడు జరుగుతాదని నీకు ఎప్పుడూ భయం వేయలేదా అని ?

” భయం ఎందుకు సారు, ఇది నా భుక్తి అండి. ఈ పని లేదనుకొండి అలా కొండ మీదకో, పాలిటెక్నీక్ కాలేజీ లోకో, ఐటీఐ లోకో వెళ్లి  ఎండు  కర్రలు  తెచ్చుకుంటాను. అన్నీ గ్యాస్ మీద వొండు కోలేక పోతున్నాము ” అంటాడు.

” నా మొదటి భార్య సచ్చిపోయిందండి , కొడుకుకి కొద్దిగా మతి స్థిమితం లేదు, పెద్దోడికి షో రూంలో పని, బండి ఫైనాన్స్ ప్రాబ్లమ్ లో కొద్దిగా యాతనగా వున్నాడు  ”

” మొదటావిడ పోయాక , పెళ్లిచేసుకోవడం అంటే ఒక అండర్స్టాన్డింగ్ తో కలిసుంటున్నామండి, భర్త చనిపోయే నాటికి  ఆవిడకు ఇద్దరు పిల్లలున్నారు,మా  ఇద్దరికి ఒక కొడుకు. ఆవిడ పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాయి, మనవలు, మానవరాళ్లతో హ్యాప్పీగా ఉంటున్నాం, ఆవిడ పిల్లలు నన్ను నాన్నా అనే అంటారు,” అని మనవడిని ఎత్తుకుని ఆడిస్తున్న  భార్యను చూస్తూ చెబుతున్నాడు  దాస్.

పిల్లి ఎదురొస్తే దుశ్శకునం, తాయెత్తులు, వ్రతాలు, అశుభాలు, కీడు నరనరాన ఇంకిన ఆధునిక విజ్ఞానపు మానవుడా, తన కుటుంబంలో జరిగిన విషాదం….  చావుపాటలు, భజనలు వల్ల ఇసు మాత్రం కాదని, అసలా తలంపే లేని రాజు దాస్ కవికి ఏమి చెబుతాము.

ఇంతమందిని సాగనంపిన పాట గాడికి ఏమైనా అయితే ఎవరు గౌరవంగా సాగనంపుతారు ?

అల్లరి చేస్తుంది

పొగరుగ తానుండి

కల్లకాదె చూడు

వల్లకాడే రుజువంది

చిల్లిగవ్వకైనను పనికిరానిది

చెల్లా చెదురు అవుతుంది

బ్రతుకుబాట నిజమంది

భవబంధ నిలయం

మానవా జనమం

*  *  *

ఉండదు ఈ ప్రాణము ఎల్లకాలము

కలము చేతబట్టినా

గళమెత్తి పాడినా

కళా పరిపూర్ణుడవై సదా జీవించినా

ఇలా మహా మహుడవై

సదా జీవించినా

ఇల సకల భోగ భాగ్యములతో

తలా తూగినా…

ఉండదు ఈ ప్రాణము ఎల్లకాలము

….పాట ఒకటి బయటకు వొచ్చి అమ్మవారి చప్టాపై పబ్జీ గేములు ఆడుకుంటున్న గుంటల్ని

దాటుకుని, హయివేలో ట్రాఫిక్ రొదలను దాటుకుని, కుమారసామి గుడిని దాటుకుని

బర్మా కేంపు స్మశానం దాటుకుని, మాధవధార అపార్టుమెంట్లు దాటుకుని

తూరుపు కనుమలలో సంపెంగి పూలను దాటుకొని,  మామిడిపూత దాటుకొని, జీడి చెట్ల ఆకుల

సవ్వడి దాటుకొని కొండల మీదగ అనంతాకాశంగా  వున్న గాలిలో కలిసిపోతోంది.

మీకు వినిపించిందా ?

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాజుదాస్.. పాట కధ చాలా బాగుంది.భజన పాటల్ని వృత్తి గా చేసుకొని జీవనం సాగిస్తున్న పాట గాళ్ల గురించి కధలో ఆసక్తి తెలియజేశారు.రచయిత హరివెంకటరమణ
    అభినందనీయులు.

  • అంతరించి పోతున్న వాటిని మరల గుర్తు చేశారు.కథతో పాటు పాటలు రాయడం బాగుంది.చనిపోయిన మనిషిని గౌరవంగా సాగనంపడం గురించి రాయడం బావుంది. కరోనా మహమ్మారి శవాన్ని చూడడానికి కూడా అవ్వ లేకపోవడం.ఇప్పుడు అందరిని ఆలోచించేలా ఉంది.

  • ఎవరూ ఎత్తుకోని ఒక అంశం, “శవ జాగరణ-తెల్లార్లూ పాటలు” పై చక్కని, చిక్కని కధ… కాదు వాస్తవాన్ని చాలా హృద్యంగా ఆవిష్కరించారు హరి వెంకట్. ఇంతవరకూ ఈ శీర్షికలో వచ్చిన కధల్లో ఇది తలమానికం. ఈ అంశంపై నేనొక ఒకకార్టూన్ కూడా గీసిపెట్టుకుని, ఎవరికీ రుచించదేమో అని పక్కన పడేసాను. శవజాగరణ సమయంలో పడే పాటలు ఏమిటన్నవి కూడా చక్కగా తెలియచేసారు. చాలా బాగుంది. అభినందనలు హరి వెంకట్ గారు.

  • Acchamaina vizagolla basha tho chusthunattlu rastharu Hari gsru. Inka manchi nativity vunna kadalu rayalani korukuntu. Deevanala tho.. Swarna

  • పాట వినిపించిందండి.
    కథను పాట కట్టి మా బాగా పాడారు. చావు పాటలు పాడేవానిపై కథ రాసి మీ సహృదయతను చాటుకున్నారు. బాగుంది కథ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు