రాకాసి బోధ

నిన్నటి దాక ‘ఇళ్ల మధ్య సారాదుకాణం ఉంది మొర్రో..’ అంటే ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడేమో అక్కడ ఉన్నట్టుండి గొడవ రేగుతోంది.  నాకేం అర్థం కాలేదు.

నేను ఆ పేటలో విలేకరిని కాబట్టి ఏ సమస్య అయినా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ సమస్యేది నా దృష్టికి రాలేదు. కరెక్టుగా ఆ టైంలోనే నేను సారా దుకాణానికి ఎదురుగా ఉన్న షాపులో టీ తాగుతున్నాను. వేడి కప్పు చప్పరిస్తూనే  ఒక దృష్టి అటు పెట్టాను.

వాళ్లంతా ఈ పేటలోని ముస్లిముల్లా ఉన్నారు. గుంపుగా చేరారు. ఒకరిద్దరు గట్టిగా అరుస్తున్నారు. దుకాణం యజమాని తెల్ల ఖద్దరులో మెరుస్తున్నాడు. ‘చివరికి సారా దుకాణం వాడు కూడా ఖద్దరు వేసుకున్నాడా.. ఓ మై గాంధీ‘ అనుకున్నాను.

ఖద్దరు వాడు మీదిమీదికొస్తున్న వారికి శాంతంగా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి అతను అంత శాంత స్వభావి ఏం కాదు.

మొన్నకు మొన్న ఆ బార్  పక్క సందులోనే ఉన్న పూజారి పదిమందిని వెంటేసుకుని ఆ యజమాని మీదికెళ్లాడు.

‘ఇక్కడ్నుంచి బార్ తీసెయ్యండి. ఇది సంసారులు ఉండే ఏరియా.. పోరంబోకులు ఉండే ఏరియా కాదు. రాత్రిళ్లు ఇక్కడ తిరగాలంటే మా ఆడవాళ్లు భయపడుతున్నారు’ అని అడిగాడు.

ఆ ఖద్దరతను లెక్క చేయలేదు.

‘వెళ్లవయ్యా వెళ్లు, వెళ్లి గవర్నమెంటుకు చెప్పుకోపో.. మా లైసెన్సు ఇక్కడే ఉంది.. ఇక్కడే పెట్టుకుంటాం..’ అంటూ గదమాయించాడు.

‘గవర్నమెంటైనా మీకు లైసెన్సు ఇళ్లమధ్య పెట్టుకోమని ఇచ్చిందా? అయినా మేము గవర్నమెంటు దగ్గరికి ఎందుకెళ్తాం? అవసరమైతే మీరే వెళ్లి గవర్నమెంటును తీసుకురండి..’ అంటూ పూజారి మొండిగా లేసుకున్నాడు.

ఎప్పుడొచ్చారో నలుగురు పోలీసులు అక్కడికి సైలెంటుగా వచ్చారు. ఏమీ కంగారు లేకుండా నింపాదిగా కర్రలు ఊపుతూ ముందుకొచ్చి నిలబడ్డారు.  వాళ్లను చూడగానే పూజారికి గొంతు తడబడింది.

‘ఏం వోయ్.. పంతులువి పంతులు పని చేసుకోక ఇక్కడేం పని నీకు? నీ అంతకు నువ్వు షాపు మీదికి గొడవకు వస్తే మేమేం గాడిదలు కాయాలా. వాళ్ల దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయంటున్నారుగా.. అవి తీసుకుని ఎక్సయిజ్ డిపార్టుమెంటుకు వెళ్లి అర్జీ పెట్టుకో, వాళ్లొచ్చి ఎంక్వయిరీ చేస్తారు. అంతేకానీ నువ్వు ఇక్కడ అల్లరి చేశావంటే ఒళ్లు పగుల్తుంది’ అంటూ అరిచారు.  కాసేపు లాఠీ అటూ ఇటూ తిప్పేసరికి పెద్దగా శ్రమ లేకుండానే వచ్చిన వారందరూ  వెనుదిరిగి వెళ్లిపోయారు.

పోలీసులు నవ్వుకుంటూ కాసేపు అక్కడే కాపలాగా ఉండి ఆ ఖద్దరు చొక్కావాడితో కబుర్లాడి వాడు తెప్పించిన కూల్ డ్రింకు ఏదో తాగి కులాసాగా వెళ్లిపోయారు.

తర్వాత పూజారి కానీ అతని మనుషులు కానీ ఎప్పుడూ అక్కడికి రాలేదు. ఆరోజు కూడా నేను ఇలాగే టీ తాగడానికి వచ్చిఈ తతంగమంతా చూశాను. అప్పుడే పోటో తీసి వార్త కూడా రాశాను. కానీ అది మా ఎడిటర్ చేతిలో పడి ముక్కలు ముక్కలై చివరి ముక్క మాత్రమే ప్రింటయ్యింది.

తెల్లారి పేపర్ చూసి బార్ షాపతను రెస్పాండ్ అవలేదు కానీ పూజారి మాత్రం నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు.

‘మీరు పట్టుమని పది మంది లేరండి. పేటలోని వారంతా వచ్చి అడిగితే ఫలితం ఉండేదేమో’ అన్నాను.

‘ఎవరొస్తారు చెప్పు బాబు. ఇక్కడున్న పదిళ్లు హిందువులవి. ముస్లిములు, ఇతర కులాల వాళ్లు రోడ్డుకు అవతల ఉంటారు. వాళ్లకేం ఇబ్బంది లేదుగా. వాళ్లు కలసి రారు’ అన్నాడు.

‘మీకు బారు పక్కనే ఉంది. వాళ్లకు కొంత దూరంలో ఉంది అంతే తేడా. అయినా అడిగితే కదా… వొస్తారో లేదో తెలిసేది’ అన్నాన్నేను.

అతను దాన్ని దాటవేస్తూ ‘అర్జీ పెట్టానండి.. గవర్నమెంటుకి, ఏం జరుగుతుందో చూద్దాం’ అన్నాడు. తర్వాత అతనే ‘బాగా ఆరా తీస్తే తెలిసిందండి.. ఈ బారు ఇక్కడ పెట్టుకోవడం వెనుక ఈ ఏరియా కార్పొరేటర్ సాంబశివ చేయి కూడా ఉందంట. అందరూ ఒక్కటే.. దొంగ ముండా కొడుకులు, ఆ పెట్టుకునేదేదో ఆ ఊరి బయట చావొచ్చుగా‘ అంటూ కాసేపు తిట్టుకున్నాడు. తర్వాత బయల్దేరి వెళ్లిపోయాడు.

అతను చెప్పింది నిజమే. వార్త రాసిన రోజు రాత్రి నేనూ పోలీస్ స్టేషన్ కెళ్లి ఆరా తీశాను.

అక్కడ అధికార పార్టీ ప్రతికా విలేకరితో పాటు చాలామంది ఉన్నారు. వాళ్లందరితో చర్చించాక అర్థమైంది ఏంటంటే -ఈ ఏరియా పోలీసులు, కార్పొరేటర్, ఎమ్మెల్యే, లోకల్ లాయరు.. అందరికీ తెలిసే అక్కడ బార్ షాపు వెలిసింది. వాళ్లకు వ్యతిరేకంగా పోరాడ్డం అంత సులువైన విషయం కాదు. పైగా బార్ షాపులవాళ్లంతా సిండికేట్ గా ఉన్నారు. ఒక్క చోట ఏదో ఒక కారణంతో షాపును కదిలిస్తే అలా ఉళ్లో ­ఇళ్ల మధ్య ఉన్న అనేక షాపులు కదిలించాల్సి వస్తుంది. అలా కదిలిస్తే వాళ్ల విలువ, వ్యాపారం దెబ్బతింటుంది. ఇది వాళ్ల పరువుకు సంబంధించిన వ్యవహారం. అందుకే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరూ కలసి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి సమస్యను తొక్కేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

నిజం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ పత్రికా విలేకరి అయిన ఒక్క నన్ను తప్ప వాళ్లు మిగతా విలేకర్లందరినీ పిలిచి మాట్లాడేశారు కూడా. దీంతో వాళ్లెవరూ వార్త రాయరు.

ఇదంతా చెబితే పూజారిలో పోరాట స్ఫూర్తి చచ్చిపోతుంది. అందుకే మందిని పోగెయ్యమని మాత్రమే సలహా ఇచ్చాను.

అంత బలవంతుడైన బార్ షాపతను ఇవ్వాళ ఇలా ఈ ముస్లిముల చేతులు పట్టుకుని బతిమాలుతున్నాడంటే ఏదో తిరకాసే జరిగింది. ఖాళీ అయిన టీ కప్పును అక్కడే టేబుల్ మీద పెట్టి ’అరే ఛోటే.. మీ బాస్ ను ఖాతాలో రాసుకోమను‘ అని అరిచి చెప్పి గబగబా రోడ్డు దాటి బార్ షాప్ దగ్గరికెళ్లాను.

అక్కడేదో మతానికి సంబంధించిన గొడవలా ఉంది. నా మనసు పెద్దగా ఆలోచన చేయకుండానే నాకు విషయం అర్థమైపోయింది.

బార్ షాపతను కౌంటర్లో గోడకు తగిలించిన దేవుళ్ల పటమే ఈ గొడవకు కారణం. ఆ పటం వైపు నిశితంగా చూసి నవ్వుకున్నాను.

పటంలో మొదట మక్కా మదీనా బొమ్మ ఉంది. మధ్యలో వినాయకుడు, చివర క్రీస్తు ఉన్నాడు. తన బార్ కు అన్ని మతాల వాళ్లు వస్తారు కాబట్టి సింబాలిగ్గా సర్వ మత సమానత్వం పాటిస్తూ అతను పటం పెట్టాడు.

ఆ పటంలో మక్కా మదీనా బొమ్మ ఉండటం ఈ పేటలోని ముస్లిములకు అభ్యంతరమైంది. కచ్చితంగా చెప్పాలంటే ఆ పటంలో ఉన్నందుకు అభ్యంతరం కాదు ఆ పటం ఉన్న స్థలం వారికి అభ్యంతరం. అంతే.

‘మా మతంలో మందు హరామ్. ఇలాంటి చోట మా దేవుని బొమ్మ పెడతావా జాన్వార్‌ ?’అని హూంకరించింది ఒక గడ్డం గొంతు.

నేను కలగ జేసుకున్నాను.

‘అయ్యా.. ఈ బార్ షాపు అతను పెద్దగా చదువుకోలేదు. అతనికి ఆలోచన లేదు. మీ కట్టుబాట్లు తెలియక పొరపాటు చేశాడు. ఆ పటం తీసేస్తాడు కానీ మీరు పదండి. మీతో మాట్లాడాలి.. ’ అన్నాను.

‘మా కళ్లముందు తీసేస్తేనే కానీ మేము కదలం..’ అన్నాడతను మళ్లీ.

ఖద్దరతను వెంటనే అలర్ట్ అయి ముందు పటానికి పెట్టిన పూల దండను తెంపి పక్కనే ఉన్న కుర్చీలో పెట్టాడు. తర్వాత పటం తీసి దాన్ని బోర్లేసి పట్టుకున్నాడు.

‘కబడ్దార్, ఇంకెప్పుడైనా ఇలా చేశావో’ అని వార్నింగ్ ఇచ్చి శాంతించాడు గడ్డం అతను.

మిగతా గుంపు కూడా శాంతించింది.

నేను గడ్డం అతన్ని పక్కకు తీసుకెళ్లి ‘భాయ్ సాబ్.. ఇక్కడ బార్ ఉండటం వల్ల పక్కనే ఉన్న కుటుంబాలకు ఇబ్బంది అవుతూ ఉంది. ఆ ఇళ్లల్లో ఉండే పూజారి ఒకతను ఈ బార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మీరూ కలిస్తే బావుంటుంది’ అన్నాను.

అతను కొరకొరా చూశాడు.

‘చూడండి సార్. ఈ భూమ్మీద ప్రతి జీవికీ బతికే హక్కు ఉంది. నూకల కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో పని చేస్తారు. అదేం పని చేయాలనేది వాళ్లిష్టం. అందులో దోషముంటే పైనున్న అల్లా చూసుకుంటాడు. మేము జోక్యం చేసుకుని వాళ్ల నోటి కాడి కూడు తియ్యం, ఇజాదత్ కాదు‘ అన్నాడతను.

నేను నిర్ఘాంతపోయాను.

‘ఇక్కడ బార్ ఉండటం వల్ల మీక్కూడా సమస్య కదా’ అన్నాను.

‘మాకెందుకు అవుతుంది సమస్య. బార్ షాపులో మా దేవుని బొమ్మ పెట్టడమే మాకు సమస్య, అది తీరిపోయింది ’ అనేసి గడ్డం నిమురుకుంటూ వెళ్లిపోయాడు. అతనితో పాటు అతని పరివారమంతా కదిలి వెళ్లిపోయింది.

నేను వెంటనే మళ్లీ బార్‌ షాప్‌ అతని దగ్గరికొచ్చి నా డౌటు సూటిగా అడిగాను.

‘అన్నా, వాళ్లకు సారాయి నిషేధం కదా. నిషేధం అంటే వాళ్లెవరూ ఇక్కడికి రారు కదా.  మరి నీ కౌంటర్లో వాళ్ల దేవుని బొమ్మ ఉందని వాళ్లకు చెప్పిందెవరు?’

‘వాళ్లు ఇక్కడికి రారు అని నీకు చెప్పిందెవరు? రోడ్డవతల పేటలో ఉన్నదంతా సాయిబూలు, పైగా లేబర్లు.  వారిలో సగం మంది దాక సాయంత్రమయ్యేసరికి మందు తాగేటోళ్లే. అదిగో అక్కడ ఆ అల్లా బకష్ గాడు ఉన్నాడు కదా. వాడికేం పనుంది గాడిద కొడుకు, తెల్లారితే షాపు ముందుంటాడు, కాసేపు క్రితం కూడా వచ్చి బాటిల్ కొనుక్కెళ్లాడు. ఆ నా కొడుకే చెప్పి ఉంటాడు’ అన్నాడు.

బార్ షాపతను వేలు చూపించిన వైపు చూశాను. ఎదురుగా టీ షాపు ముందు వాడు చింపిరి జుట్టుతో గాల్లో కట్టెపుల్లలా ఊగుతూ నడుస్తున్నాడు. నేను కూడా అతన్ని నిత్యం చూస్తూ ఉంటాను. పచ్చి తాగుబోతు. బార్‌కు దూరంగా పోతే ఎక్కడ ప్రాణం పోతుందో అని దాని చుట్టు పక్కలే ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటాడు.

నేను అప్రయత్నంగా అనేశాను.

‘వాడి మతంలో నిషేధమైన సారాయి వాడు తాగొచ్చు. కానీ సారాయి దుకాణంలో మాత్రం వాడి మతం బొమ్మ ఉండకూడదు, తాగుబోతోడైనా సరే వాడు నికార్సయిన భక్తుడు.’

ఖద్దరతను నవ్వాడు.

నేను ఇక అంతటితో ఆగినా బాగుండేది. ఆగలేదు.

‘మరి ఆ గడ్డమాయన ఏంటి ఇక్కడ బార్‌ ఉండటం తమ సమస్య కాదంటాడు?’ అని కూడా అనేశాను.

ఖద్దరతని ముఖంలో నవ్వు మాయమై అనుమానం మొదలైంది. నేనేదో వాడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నానని అర్థమైనట్టుంది. ఎందుకైనా మంచిదని నేను అక్కడి నుంచి జారుకుని మెల్లగా రోడ్డు మీదికొచ్చేశాను.

ఎక్కడున్నాడో పూజారి ‘విలేకరి బాబు బావున్నావా?‘ అంటూ నా ముందు వాలాడు.

‘ఆ.. ఆ.. మీకు వందేళ్లు ఉన్నాయి, ఇందాక మీ గురించే ఆ మసీదు మనుషులతో మాట్లాడాను’ అన్నాను.

‘నా గురించా.. ఆ ముస్లింలతో..! ఎందుకు ?’ – ఆశ్చర్యపోయాడు అతను.

‘చెబుతాను కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ?‘ అన్నాను.

‘ఇదిగో ఈ తురకల గొడవే దూరంగా నిల్చొని చూస్తున్నాను’ అన్నాడతను.

‘అవునా.. మరి మీరెందుకు రాలేదు ముందుకు’ అన్నాను.

‘అది వాళ్ల సమస్య.. పైగా మొరటు ముండా కొడుకులు.. నేనెందుకు రావాలి.. మధ్యలో పోతే మెడలు విరుగుతాయని సామెత’  అన్నాడు నవ్వుతూ.

నాకు కోపమొచ్చింది. ‘ఇది వాళ్లది, మీది కాదండి బాబూ.. మీ ఇద్దరి సమస్య.. అర్థం కావడం లేదా?’ అరిచినట్టుగానే అన్నాను.

పూజారికీ కోపమొచ్చింది.

‘అలా ఎలా అవుతుంది? ఇద్దరిది ఒకే సమస్య అవ్వడానికి వీల్లేదు. అవదు. అలా ఎన్నటికీ జరగదు. జరిగినా ఊరుకునేది లేదు’ అంటూ ఊగిపోతూ అక్కడ్నుంచి విసవిసా వెళ్లిపోయాడు.

నేను తలపట్టుకున్నాను.

ఎప్పుడొచ్చాడో మద్యం అమ్ముకునే ఖద్దరు శాల్తీ నా వెనకే వచ్చి నిలబడి ఉన్నాడు. మా ఇద్దరి సంభాషణ విన్నాడేమో నా భుజమ్మీద చేయ్యేసి అన్నాడు.

‘మీరు వీలేకర్లు సార్. ఇటూ ఉంటారు.. అటూ ఉంటారు. వాళ్లిద్దర్నీ మాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మీకు ఒక మాట చెప్పనా? మీరు చదువుకున్నారు.. నేనూ చదువుకున్నాను. ఈ దేశంలో వాళ్లెప్పటికీ కలవరు. కలవనివ్వం. ఒకవేళ కలసినా మా వంటి వ్యాపారుల ఎంటిక కూడా పీకలేరు. మీరు నోర్మూసుకుని మీ పని మీరు చేసుకుంటే ఒంటికి మంచిది’ – అతను రాకాసి నోరు తెరిచి వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇస్తే ఇచ్చాడు కానీ రాకాసి నోట సత్యం తీయగా అనిపించింది.

ఆ రాకాసి నోరు వెళ్తూ వెళ్తూ మళ్లీ అంది.

“సారూ.. వినండి ఒకమాట… ఈ సమస్య వాళ్లిద్దరిదీ కూడా కాదు. ఈ దేశానిది’’

*

చిత్రం: సృజన్ రాజ్ 

వేంపల్లె షరీఫ్

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • బావుంది ఒక సామాజికసమస్య విభిన్నకోణాల్లో ఎలా వుంటుందో చక్కగాచెప్పారు.

 • షరీఫ్ గారు బాగుంది కథ.. అవును ఈ దేశంలో వాళ్ళు ఎప్పటికీ కలవరు. కలవాలని కొందరు అనుకున్నా కలవనియ్యరు.. దేశం మనది అనే వివేకమే ప్రజల్లో పోయింది.. చక్కగా చెప్పారు. అభినందనలు

 • షరీఫ్! బాగుంది కథ. ‘వాళ్ళిద్దరూ’ కలవకుండా చూస్తుండడమే నేటి పెద్ద సమస్య! అల్లా బఖష్ అని పేరు పెట్టడం నచ్చింది.. హరాం పని చేసే ముస్లింలు కూడా మతం విషయంలో స్పందించే తీరు చెప్పిన విధానం చాలా బాగుంది.

 • కథ చాలా బాగా రాశారు. అయితే, లాస్ట్ డైలాగ్ లో మీ ఇద్దరి సమస్య ఒకటే అని విలేఖరి అనడం నాకు అర్ధం కాలేదు. అక్కడ నిజంగా ఇద్దరి సమస్య ఒకటి అని వాళ్ళు రేప్రేసేంట్ చెయ్యలేదు కదా అండి! ఒకరిది పబ్లిక్ న్యుసేన్స్ సమస్య, ఇంకొకరిది మత విశ్వాసాల సమస్య. రెండూ ఒకటి కాదు.

  • నిజమే, ఒకరికి ఒకరు అండగా నిలిచి ఆ దుకాణాన్ని అక్కడ్నుంచి తరలించాలి అన్నది ఒకటే సమస్యగా రచయిత భావించారు అనుకుంటున్నాను.

  • పేటలోని సగం మంది లేబర్ ముస్లిములు మందు తాగి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారని ఉంది కదా. ఇక అది వాళ్ల సమస్య కాకుండా ఎలా పోయింది? అది తమ సమస్య అని గుర్తించలేనంత అజ్ఞానంలో ముస్లిం సమాజం ఉందని రచయిత స్పష్టంగానే చెప్పాడు కదా.

 • షరీఫ్ అన్న, ఇప్పటి వరకు మీరు రాసిన టోపీ జబ్బర్, జుమ్మాలలో ఎక్కువగా ముస్లీం ఐడెంటిపై రాసినట్లుగా ఉంటే, ఈ కథ నాకు, మీరు మొదటి సారి హిందూ ముస్లింల ఘర్షణను నేరుగా స్పృశించినట్టు అనిపించింది. సారాయి కొట్టు, మతం రెండింటిని దగ్గరకు తీసుకొచ్చి ఒక కథను సృష్టించినప్పటికీ ఎంతో సహజంగా సంభవించినట్టుగా అనుభూతిని కలిగించింది. చాలా బాగుంది. అందుకే మీ కథ సాధారణంగా రెండవసారి చదవాల్సిన అవసరం లేకుండా పాఠకుని గుండెలో ఇంకిపోతుంటుంది.

 • ఇక్కడ స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

  • నమస్తే సర్ సామాజిక మరియు సహజ తత్వం గల కథలు మన చుట్టు ఉన్న అంటే తిరిగే కథ ను రాసినందుకు అభినందనలు సార్ కథ కు పేరు అత్యద్భుతం సార్

 • ఇప్పుడు సామాజికం కన్నా మతమే ప్రాధాన్యం. అలా మార్చారు వ్యవస్థ ను

 • నమస్తే సర్ సామాజిక మరియు సహజ తత్వం గల కథలు మన చుట్టు ఉన్న అంటే తిరిగే కథ ను రాసినందుకు అభినందనలు సార్ కథ కు పెట్టిన పేరు అత్యద్భుతం సార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు