రమ సంగతి?

యిదు దాటింది. ఒకసారి ఒళ్ళు విరుచుకుని, చట్టాల్ని వదిలించుకుని ఆఫీస్ లోంచి బయట పడ్డాడు ప్రసాద రావు. స్కూటర్ తీసుకుని రోడ్డు మీదకి రాబోతు, ఆగి నుంచున్నాడు అతను. కొంచెం ఎడంగా వున్న కిళ్ళీ కొట్టు దగ్గర సిగరెట్టు కాల్చాలనిపించింది. సిగరెట్టు  కాల్చినంతసేపు ఇంటికి వెళ్ళక్కరలేదు. ఇంటికి కాక మరెక్కడికి వెళ్లగలడు అతను? అసలు ఎక్కడికీ వెళ్లాలని లేదు. జీవితం హఠాత్తుగా కుంచించుకు పోయింది. అయినా రమ జ్ఞాపకాలు బాగుంటున్నాయి— కాఫీ లో చిటికెన వేలుతో చిన్న ఎర్ర చీమను తీసేసినట్టు. నెల రోజులు దాటిపోయింది. కోపం కూడా వస్తోంది. అంతా బాగానే ఉండేది కదా. ప్చ్. అనవసరంగా గొడవ చేసింది. ఇద్దరికీ సుఖం లేకుండా చేసింది. స్కూటర్ ఎక్కి కదిలిస్తుండగా జేబులో సెల్ మోగింది, గల గల.

*

అరగ్లాసు మంచినీళ్లు తాగి ముఖం జాగ్రత్తగా తుడుచుకుని లిఫ్ట్ లో మూడో అంతస్తుకు ఎగిరి క్లాసులోకి వెళ్ళాడతను. చేతిలో పుస్తకం టేబుల్ మీద పెట్టి డయాస్ మీంచి అందరివైపు చూసాడు ప్రసాద రావు. నలభై ముఖాలు. నలభై జతల కళ్ళు. చిన్న పక్షుల్లా అతని మీద వాలాయి. అతనికి ముందు కుడివైపు రెండు వరుసల్లో పదిహేను మంది ఆడపిల్లలు నోటు పుస్తకాలు తెరిచి వేళ్ళ మధ్యలో పెన్నుతో సహా సిద్ధంగా ఉన్నారు.

” టాక్సు ఎలా ఎగ్గొడతారో చెప్పగలరా?”

అందరూ నిశ్శబ్దంగా నవ్వారు. అందరి వైపు చూసాడతను. ఒకమ్మాయి లేచి నిలబడి “చట్టంలో వున్న లోపాల వల్ల” అంది.

“okay కానీ perfect law ఎక్కడ ఉంటుంది? అనేక అన్వయాలకు చట్టంలోనే వెసులుబాటు ఉంటుంది. మనకి అనుకూలమైన పద్దతిలో చెప్పుకోవచ్చు”.

“ఆలా అయితే అందులో న్యాయం ఏముంది సార్?” అన్నాడు ఒక విద్యార్ధి.

“చట్టం వేరు, నీతి వేరు. నీతి నీ వ్యక్తిగతమైన దృక్పథం. అంటే న్యాయంలో నీతి లేదనికాదు. నీతిమంతుడై ఉండాలా లేదా అనేది నీ ఇష్టం. కానీ చట్ట  ప్రకారం ఉండాలా లేదా అనేది నీ ఇష్టం కాదు”. ప్రసాద్ రావు ముందు వరుసలో రమ వైపు చూసాడు. కన్నార్పకుండా అతన్నే చూస్తోందామె. కళ్ళతో పాఠం వింటుందామె, అనుకుంటుంటాడు ప్రసాద రావు.

“చట్టం దేని మీద ఆధారపడి ఉంటుంది?” అని అడుగుతూ బోర్డు మీద  Law of Taxation అని రాసాడు ప్రసాద రావు. మళ్ళీ ఆమె వైపు చూసాడతను. రమ లేచి అంది. “నీతి సార్. వ్యక్తి అయినా సమాజం అయినా చట్టాల్ని, నీతి నిజాయితీలే కాపాడాలి. వ్యక్తిగతంగా కూడా అంతే కదా సార్. మనస్సాక్షి”.

నాలుగో సంవత్సరం లా క్లాసుల్లో, ప్రశ్నలు, సమాధానాలు, చర్చలు, ఎక్కువగా రమ చుట్టూ తిరుగుతుంటాయి. క్లాస్ కి ఎన్నుకోని నాయకురాలు రమ. ఆమె సమాధానాల కంటే ఆమె మాటల్లో, అభిప్రాయాల్లో స్పష్టత, సూటితనం, వాడి, ప్రసాద రావు ని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. అతను నవ్వి అన్నాడు.

“okay, కానీ నీతికి మినహాయింపులుంటాయనుకుంటాను.”

తరువాత ప్రసాద రావు యాభయి నిముషాలు పాఠం చెప్పాడు. అతను  మాట్లాడుతుంటే సమర్ధుడైన నటుడు పాఠం చెప్తున్నట్టుంటుంది. ఏ  వాక్యం  ఎక్కడ ఎంతసేపు ఆపాలో — రాగానికి అనుగుణంగా తబలా వలె అతని చేతులు మాటలకి పూర్తి అర్థాన్ని సమకూరుస్తాయి. ప్రతి విద్యార్థికీ భుజం మీద చెయ్యివేసి మాట్లాడుతున్నట్టు పాఠం చెప్పగలడు ప్రసాద రావు. (“కోర్టులో మీరు వాదిస్తుంటే చూడాలనుంది సార్”) ఎలక్ట్రిక్ బిల్లు మృదువుగా మోగగానే పాఠం ముగించి ఒకసారి అందరివేపు చూసి వెళ్ళిపోయాడు ప్రసాద రావు. మరి కాసేపు స్టాఫ్ రూంలో కూచుని కింది అంతస్తులో మెట్లదగ్గర నుంచున్నాడతను. అయిదు అంతస్తుల నుంచి గూళ్ళకి చేరుకునే పిట్టల్లాగా కువకువ లాడుతూ రెక్కలూపుకుంటూ తనని చుట్టుముట్టి కిందకి వెళ్లిపోతున్నారు విద్యార్థులు. ఎడమవేపు నుంచి మొగపిల్లలు కుడివేపు నుంచి ఆడపిల్లలు మెట్లమీదనుంచి ప్రవహిస్తున్నారు.

“సార్”,  అతని పక్కనే నుంచుని పలకరించింది రమ. “మీరు వెయిట్ చేస్తున్నారా సార్?”

“లేదు. ఉత్తినే నుంచున్నాను. ప్రవాహం తగ్గాలి కదా”. నవ్విందామె.

“మీరు చాలా కాలం క్రితం మాట ఇచ్చి మర్చిపోయారు సార్”.

“ఏం మాట ఇచ్చాను? నీకా? క్లాసుకా?”

“నాకే సార్”.

“అయితే మర్చిపోను”.

“మర్చిపోయారు సార్. కోర్టుకి మీకేసున్నప్పుడు తీసుకెళ్తానన్నారు”.

“అదా? మర్చి పోలేదు. కుదరలేదు. కోర్టులో మామాటలు  క్లాసులోలా  ఉండవు “.

“పరవాలేదు”

“ఎల్లుండి మధ్యాహ్నం 3 .30 కి రా అయితే. కోర్టు నెం.3 మొదటి అంతస్తు. అదేదో చీటింగ్ కేసు”.

“వస్తాను సార్”.

నవ్వేడతను. రమ కి లామీద శ్రద్ధ వుంది. ఒకసారి క్లాసులో, లా పూర్తి చేసి ప్రాక్టీసు గానీ లేకపోతే “మీలాగే, పాఠాలు చెప్తాను”. అంది. “నువ్వు మంచి లాయరవుతావు”. రమ తరచుగా స్టాఫ్ రూం కి వెళ్తుంటుంది. మెరుస్తున్న కళ్ళతో సూటిగా మొహంలోకి చూస్తూ మాట్లాడుతుంది రమ. ఇద్దరూ మెట్లు దిగి కిందకు వెళ్లారు. “ఉంటాను సార్. గుడ్ నైట్”. ఇంకొంచెం సేపు మాట్లాడుతుందని ఆశించా డతను. ఒక్కోసారి కింద కలిసినప్పుడు కాసేపాగి మాట్లాడి వెళ్తుందామె. ఆమె విద్యార్థుల స్టాండ్ వేపు అతను స్టాఫ్ స్టాండ్ వేపు విడిపోయారు. కుంకుమ పువ్వులాంటి సాయంత్రం లోంచి వెళ్తోంది ప్రసాద రావు స్కూటర్. ఇంటికి వెళ్లి స్నానించి విశ్రాంతి తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోవాలి. ఏడున్నర వరకు పనుందివాళ. వారానికి మూడు రోజులు లా క్లాసులు చెప్తాడు ప్రసాద రావు. మూడు మధ్యాహ్నాలు పాఠాలు చెప్పడం అతని అవసరం. అనుకోకుండా దొరికింది సగం ఉద్యోగం. మొదటి రోజు మొదటి క్లాసు అనగానే తను పాఠాలు బాగా చెప్పగలడని అర్థం అయింది.  రమ కూడా అలాగే అనుకుంది. తరువాత ఆమె అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు అతనికి నచ్చేయి. ఆమె ఒక్కోసారి అడిగేటప్పుడు సమాధానాలు అతనిలోంచి కేవలం చూపు ద్వారా లాక్కుటుందని అనిపించేదతనికి.

బుధ, గురు, శుక్ర — మూడు రోజులు, మూడు క్లాసులు, రెండు క్లాసులు, ఒక క్లాసు గడ్డానికి మళ్ళీ మళ్ళీ మెరుగు పెట్టుకుని, జాగ్రత్తగా గడ్డం చేసుకుంటాడతను. బుధ, గురు, శుక్ర కొంచెం తెల్లగా శుభ్రంగా తయారవుతాడు ప్రసాద రావు. మూడ్రోజుల్లో ఒక సారయినా స్టాఫ్ రూం కి వస్తుంది రమ. తెల్లటి ఆమె చూపులతో, అతను నుంచుని ఉండగానే తెలుపు, నలుపు స్వెట్టరు   అల్లుతున్నట్టుంటుంది. అతని ఒంటికి అతుక్కుని వెచ్చగా, చల్లగా, మొత్తానికి బావుంటుంది. వారానికి ఆ మూడురోజులు మాత్రమే స్ప్రే వాడతాడతను. అపార్టుమెంటుకింద అతని తెల్లని దీర్ఘ చతురస్రం లో  స్కూటరాపి, లిఫ్ట్ వేపు వెళ్ళాడు ప్రసాద రావు. నాలుగంతస్తుల అపార్టుమెంటు వృక్షంలో రెండో అంతస్తు గూడులో వుంటాడతను. అంత పెద్ద ఆసక్తి లేకుండా గీసిన పెన్సిలు స్కెచ్ వంటి అపార్టుమెంటు భవనం. తలుపు తాళం తీసుకుని లోపలి వెళ్లాడతను. బట్టలు మార్చుకుని టీ కప్పు తో సహా ఫానుకింద కూచుని భార్యకి ఫోను చేశాడు ప్రసాద రావు. ఇద్దరి ఆరోగ్యం గురించి మాట్లాడ్డం అయిపోగానే ఆమె అంది.

“ఇంక నెల రోజులు కూడా లేదు. డాక్టరనడం ఇరవై రోజులు. పొట్ట బరువుగా ఉంది”.

“కవల పిల్లలేమో అడక్కపోయావా?”

తరువాత టీ తాగుతూ పేపరు చూసి బట్టలు మార్చుకుని ఆఫీసుకి వెళ్ళిపోయాడు ప్రసాద రావు. రెండున్నర గంటల పాటు కేసుల్లో కూరుకుపోయి, సీనియరు గారికోసం వివరంగా నోటురాసి ఒళ్ళు విరుచుకున్నాడు. ఆయనతో కాసేపు మాట్లాడి ఇంటికి బయలు దేరాడు.

సరిగ్గా డాక్టరమ్మగారు చెప్పిన మాట విని ప్రసాద రావు కొడుకు ఇరవై రోజులు దాటకుండా భూమి మీదకి జారాడు. తల్లీ పిల్లాడు క్షేమం అని మామగారు ఫోను చేశాడు. మర్నాడే విశాఖపట్నం వెళ్లి కొడుకుని చూసుకుని వచ్చాడతను. అటుపక్క గూటి వారూ ఇటు పక్క గూటి వారూ శుభ వార్త విని సంతోషించారు. నాలుగైదు గూళ్ళకి ఒకే పనిమనిషి, ఆమె కూడా సంతోషించింది. ప్రసాద రావు కి తరచుగా రెండు వేపులనుంచీ తినడానికి ఎదో ఒకటి వస్తూనే ఉంటుంది. నాలుగంతస్తుల నియమ నీతి నిబంధనల కనుగుణంగా ప్రసాద రావు నిత్య జీవితాన్ని చిన్నది పెద్దదీ కాని కాయితపు పడవలా తయారు చేసుకున్నాడు. రెండ్రోజులు లుంగీ మార్చకపోయినా పని మనిషి వల్ల   రెండో అంతస్తు అంతా ప్రసారం అవుతుంది.

*

బుధవారం క్లాసు అయి కిందకి రాగానే వెనకనే వచ్చింది రమ. ఆమె ఎందుకొచ్చిందో అతనికి తెలుసు. కోర్టులోకి అడుగు పెట్టగానే వెనకాల వరుసలో కూచుని కనిపించిందామె.

” సార్, కోర్టు బావుంది సార్. I liked your examination “.

“మొదటి సారి గదా. నీకు బాగానే ఉంటుంది. thanks “.

“మీరు cross examine చేసే పద్దతి బాగుంది సార్”.

కేవలం చీటింగ్ కేసు కాకుండా అది రాష్ట్రాన్ని కుదిపేసే హత్యా నేరం అయి ఉంటే బాగుండేది అనుకున్నాడతను. అతని వేపే చూస్తూ మళ్ళీ ఆమె స్వెట్టర్ అల్లుతోంది. అతని ఒంటికి తెలుస్తోంది. కాసేపు మాట్లాడి వెళ్లిపోయిందామె.

శని ఆదివారాలు వచ్చేట్టుగా చూసుకుని మరో రెండు సార్లు ప్రసాద రావు విశాఖపట్నం వెళ్లి వచ్చాడు. రెండు నెలల్లో ఇరవై నాలుగు బుధ గురు శుక్ర వారాలు అతనికి బాగున్నాయి. శ్యామల ఇంట్లో వున్నప్పటికంటే ఆ మూడు రోజులు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఒక రోజు స్టాఫ్ రూంలో కూచుని ఉండగా తటాలున నెత్తిమీద డస్టర్ పడ్డట్టు ఒక సందేహం తలెత్తింది. రమ కి తెలుసా? తనకి కొడుకు పుట్టాడని చాలా మందికి తెలుసు — కానీ వార్త క్లాసు వరకూ వెళ్లిందా? చాలా ఇబ్బంది గా అనిపించిందతనికి. తనకి చెప్పవలసిన అవసరం లేదు. పాఠం తప్ప తను ఏవీ చెప్పనవసరం లేదు. కానీ విద్యార్థులకి తెలియనివి ఏవుంటాయి? తనకి నచ్చినా నచ్చకపోయినా. రమ మొహం పరీక్షగా చూశాడు. తెలిసినట్టులేదు. సాయంత్రం ఇంటికి వెళ్తూ, అందరికీ తను పెళ్ళైనవాణ్ణని తెలిసినప్పుడు, ఇప్పుడు తండ్రి కూడా అయ్యానని తెలిస్తే నష్టం ఏముంటుంది అనుకున్నాడు. కాకపొతే రమ కి తెలీడం అనవసరం అని అనుకున్నాడు అతను. ఆమె ఎలాగూ అడగదు. అడిగితే? స్కూటర్ తాళం పెట్టి పైకి వెళ్ళిపోయాడు ప్రసాద రావు. సరిగ్గా టీ కప్పుతో కూచునేసరికి కాలింగ్ బెల్లు మోగింది. పక్కగూటి పిన్నిగారమ్మాయి. “అంకుల్, అమ్మ ఇచ్చి రమ్మంది”. ఒక పళ్లం  లో, తీసుకొచ్చిన ఆశ్చర్యాన్ని మరో పింగాణీ పళ్లం తో బోర్లించి ఉంది. పక్కనే పెట్టుకుని టీ చప్పరిస్తూ చూసాడతను– చిట్టి గారెలు.

మర్నాడు మధ్యాన్నం ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, స్నానించినంత పని చేసి, జాగ్రత్తగా స్ప్రే చల్లుకుని కాలేజీకి బయల్దేరాడతను. రోడ్లనీ, దుమ్మునీ  కార్పొరేషన్నీ బుధ గురు శుక్ర వారాలు కసిగా తిట్టుకుంటాడు ప్రసాదరావు. సాయంకాలం ఇంటికొచ్చి టీ చేసుకుని కూచుని పేపరు తెరిచాడు. ఉదయం దాచుకున్న భాగాన్ని చూస్తూ, చదవలేక పక్కన పడేసాడు. ఎందుకు రాలేదు? విపరీతమైన చిరాకు పడ్డాడు ప్రసాద రావు. ఏడాది నుంచి ఎన్నిసార్లు మానేసింది రమ? ఒక్కసారి కూడా మానలేదు. ఇవాళ ఒంట్లో బాగోలేదేమో . టీ తాగుతూ మరోసారి చిరాకు పడ్డాడు అతను. క్లాసంతా కళా విహీనంగా ఉంది. క్లాసంతా  ఖాళీగా ఉన్నట్లనిపించింది. సెల్లు గల గల మంది. “హలొ ”

“వినండి మీ కొడుకు ఎంత గట్టిగా ఏడుస్తున్నాడో”

సన్నటి గొంతు. పిల్లలందరూ ఒకేలా ఏడుస్తారా? వీడెందుకేడుస్తున్నాడు? ఆకలై ఉంటుంది. వాళ్ళమ్మ నవ్వుతూ ఓదారుస్తోంది. ఏడుపు అయినతరువాత ప్రసాద రావు ఆఫీసు కి వెళ్ళిపోయాడు. ఆదివారం మధ్యాన్నం మళ్ళీ ఆఫీసు కి వెళ్ళవలసి వచ్చింది. పనిమనిషి గదులు సరిగ్గా తుడవడం లేదని చిరాకు పడ్డాడు. పుస్తకాల బీరువా సగం శుభ్రం చేసి వదిలేసాడతను. ఇంట్లో ఏదీ సరిగ్గా ఉన్నట్టనిపించడం లేదు. మంచినీళ్ల బిందె శుభ్రంగా లేదు. పనిమనిషి నెత్తిమీద పడేద్దామనిపించింది.

బుధవారం క్లాసులోకి వెడుతూ చూశాడు ప్రసాద రావు – కుర్చీకి అప్పుడే పూసిన పొద్దుతిరుగుడు పువ్వులా కనిపించింది రమ . క్లాసులు అయిపోగానే స్టాఫ్ రూంకి వచ్చిందామె. “నువ్వు లేవు. ఏం తోచలేదు “ – అందామనుకుని వూరుకున్నాడతను. పది నిముషాలు మాట్లాడి చిరునవ్వుల గుట్టలో వదిలి వెళ్ళిపోయింది రమ. ఆమె వెళ్ళగానే ప్రసాద రావు ఇంటికి వెళ్ళిపోయాడు. కొంచెం సంతోషంగానే పేపర్ చదివాడు. రెండు రోజులు కరెంటు పోయింతరువాత సాయంత్రం దీపాలు వెలిగినట్లు బావుందతనికి. ఒంటరిగా అనిపించలేదు. రాత్రి పడుకోబోయే ముందు ఆల్బమ్  బయటికి తీసాడు ప్రసాదరావు. క్రితం సంవత్సరం, కొత్త సంవత్సరం పార్టీ తరువాత క్లాసందరు ఫోటో తీయించుకున్నారు. తన వెనుక నుంచుంది రమ. చాలాసేపు చూశాడతను. అప్పట్నుంచి ఇదే  చూడ్డం. ఇల్లు ఖాళీ అవగానే అద్దెకి వచ్చినట్లు రమ  తానే వచ్చింది. చిత్రమైన సహజీవనం. ఆమె లేకపోయినా కనిపిస్తూనే ఉంటుంది.

ఆదివారం ఇంట్లో కూచోవాలని అనిపించలేదు స్కూటర్ తీసుకుని ఊర్లోకి వెళ్లి పోయాడతను. సినిమాహాలు దాటుతూ వెనక్కి తిరిగి అప్రయత్నంగా లోపలి వెళ్ళాడు. స్కూటర్ పెట్టేసాక సినిమా పేరు చూ సి టిక్కట్టు తీసుకుని లోపలి వెళ్ళిపోయాడు. హిందీ సినిమా, జనం ఎక్కువ లేరు. అప్పుడే లైట్లు తీసారు. ఖాళీ గా వున్న వరుస చూసుకుని కూర్చున్నాడు. చల్లగా వుంది థియేటర్లో . సినిమా లో మునిగిపోయాడు అతను. ఇంటర్వెల్ లో లైట్లు వెలిగాయి, లోకం మారింది. కళ్ళు నులుముకుంటూ చూసాడతను.

“నమస్తే సార్, దరిదాపు కుర్చీలోంచి జారిపోయాడతను.. తనవెనుక ముందరికి కొంచెం వంగి నుంచుని వుంది రమ. “ ముందే చూసాను సార్” డిస్టర్బ్ చేయడం ఎందుకని పలకరించలేదు. చుట్టూ ఒకసారి చూసి నవ్వాడు ప్రసాద రావు. “నే నూ మా తమ్ము డూ వచ్చాం”. రెండు వరసల అవతల కూర్చున్న కుర్రాడిని చూసాడతను. వచ్చి పక్కన కూర్చుంది రమ. సినిమా మొదలైంది. ఆమె  అతన్ని వాటేసుకుంది. పాప్కార్న్ పొట్లం విప్పిందామె. ఇద్దరి మధ్య చేతిలో పెట్టుకుని ఆమె నవులుతూ అతని చేతిలో పెడుతోంది. మధ్యలో కొంచెం పక్కకు జరిగి ఏదో అడుగుతోంది ఆమె. బుజం మృదువుగా తగిలి కొద్దిగా ఆమె వైపు జరిగాడతను. అతనికి సినిమాకి సంబంధం తెగిపోయింది. ఒక పరిమళం వెచ్చటి మెత్తదనం మినహా ప్రసాదరావుకు థియేట రు ఖాళీగా నిశ్శబ్దంగా వుంది. పొట్లం ఖాళీ అయిపోయింది. కాసేపు కూర్చుని వెళ్ళిపోతూ అందామె. “మీరు వస్తారని  తెలిస్తే ఒక్కదాన్నే వచ్చేదాన్ని, కలిసి చూసేవాళ్ళం సార్”. ఆమె వెళ్ళగానే హఠాత్తుగా ఏదో హిందీ పాట పెద్ద శబ్దం తో అతని మీద పడింది.

ముగ్గురూ పక్కపక్కనే నడుస్తూ బయటకి వచ్చారు. Goodnight Sir అంటూ చెయ్యందించింది ఆమె. అతని చేతిని మృదువుగా నొక్కుతూ అందామె “మేము ఆటోలో వెళ్లిపోతాం”. మరోసారి అతని చెయ్యి నొక్కి వదిలిందామె . తనో రెండు మాటలు మాట్లాడివుంటే మరి కాసేపు చేతిలో చెయ్యి ఉండేది. ఆమె స్పర్శ పంపించిన  SMS వల్ల  అతనికి మాట రాలేదు.

సంతోషంగా భోజనం ముగించాడు ప్రసాదరావు. పదకొండు వరకు టీవీ ముందు కూర్చున్న తెరమీద ఏమి జరుగుతోందో అతనికి తెలియలేదు. రమ మాటలో, రాతలో,  చూపులో, చివరికి స్పర్శ లో కూడా స్పష్టత వుంది. తనకి ఎంత అనిపించినా చేయి చాపి గుడ్ నైట్ రమ  అనగలడా . అయినా  తానేమీ అడగలేదు కదా. వచ్చి పక్కన  కూర్చోమని  అడిగాడా తను ? పైన గోడ మూల చిన్న బూజు పువ్వు ఫాను గాలికి కదులుతోంది దాన్ని చూస్తూ నిద్ర పోయాడతను …..

*

ఒక శనివారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి చాలాసేపు ఫాను కింద కూర్చుండిపోయాడు ప్రసాద రావు. గడచిన బుధ గురు శుక్ర వారాల్లో రమ చిరునవ్వు  భుజం మీద వేసిన మెత్తటి ఆమె చే తి లా అనిపించింది. ఇవాళ ఆఫీస్ పని వత్తిడిలో కూడా ఆమె కనిపిస్తూనే వుంది. ఓపిక తెచ్చుకు ని లేచి చాలాసేపు చన్నీళ్ళ స్నానం చేసి నీలం గళ్ళ లుంగీ తెల్ల టీ షర్టు తగిలించుకుని ఫైల్ ముందు కూర్చు న్నా డు ప్రసాద రావు. కాసేపు ఫైల్లో తిరగ్గానే కాలింగ్  బెల్ మోగింది. పనిమనిషి కి బెల్ కొట్టే అలవాటు లేదు . ముందు కొద్దిగా తరువాత పూర్తిగా  తలుపు తోసుకు వస్తుంది. లుంగీ గూడ కట్టు కట్టుకుని లేచి తలుపు తీసాడతను.

“నమస్తే సార్”

ప్రసాదరావు కి మాట రాలేదు. చేతిలో చిన్న పాకెట్ తో భుజం మీంచి వేళ్ళాడే  బాగ్ తో నుంచుని వుంది రమ . అటూ ఇటూ చూసాడతను. బయట ఎవరూ లేరు. ఆమె లోపలి కి  వచ్చి తలుపు దగ్గరకు  వేసింది.

“మిమ్మల్ని surprise  చేయాలనీ చెప్పకుండా వచ్చాను”. కొన్ని క్షణాలపాటు సంతోషం తో నిండిపోయిన బుడగ లాగ తేలిపోయాడు ప్రసాద రావు. బుడగ తరువాత తేలి వెళ్ళిపోయింది. అతని ప్రమేయం లేకుండ అ న్నా డతను. “ its okay పరవాలేదు , కూర్చో” అతడు సోఫాలో కూర్చున్నాడు పక్కనే కూర్చుందామె. ఆమె స్ప్రే ఇద్దరికీ మెత్తటి సిల్క్ దుప్ప టీ కప్పుతోంది. గదంతా పరికించి చూసాడతను. బానే వుంది. తలుపు వైపు చూసాడతను. ప్రసాద రావు గుండె పాత స్కూటర్ లా కొట్టుకుంటోంది.. తలుపు దగ్గరగా లాగి వుంది. లేచి వెళ్లి గొళ్ళెం పెట్టాలా? సగం తీసి రావాలా? లేచి అతన్ని తీసుకువెళ్లే స్థితి లో కాళ్ళు లేవు. ఆమె వైపు చూసి అడిగాడు.

“బావున్నావా ?” “మీరే చెప్పాలి”. అని  అతని  వేపే  చూస్తోంది ఎందుకో అతనికి గాలి సరిపోవడం లేదనిపిస్తోంది. మళ్ళీ తలుపు వైపు చూసాడు. తలుపుకీ ద్వారబంధానికి మధ్య సన్నటి ఖాళీ. మొత్తం నాలుగిళ్ళలో పనిచేసి వస్తుంది అతనికి సంతోషం గా లేదు

“నేను ఎందుకు వచ్చానో చెప్పమంటారా ?”

“చెప్పు “

“ఇవాళ నా పుట్టినరోజు సార్. మీకు స్వీట్స్ ఇవ్వాలని వచ్చాను.”

తలుపు వైపు చూసి నవ్వుతూ అన్నాడు “ అరే  Many Many More Happy Returns, Happy Birth day “

“థాంక్  యు సార్”

అనుకోకుండా చేయి చా పా డతను. అతని వైపు చూస్తూ చేయి తీసుకుందామె. అతని చేయి ఆమె అరచేతికి అతుక్కు పోయింది.

“సార్ స్వీట్స్ తీసుకుంటారా “

ఆమె చేయి తీసుకుని పాకెట్ విప్పి జాగ్రత్తగా గుండ్రటి పాలకోవా బిళ్ళ  తీసింది . బొటన వేలుకి చూపుడు వేలుకి మధ్య పాలకోవా పట్టుకుని అతని వైపు చూసింది. మెల్లిగా చెయ్యె త్తి ఒక చేత్తో అతని చేతిని పట్టుకుని అతని నోటికి అందించింది రమ. చిన్న ముక్క కొరికాడు ప్రసాద రావు. తీయగా లేదు. అతని చేయి పట్టుకునే అతని వైపు చూస్తూ ఆమె అతను కొరికిన వైపే చిన్న ముక్క కొరికింది. ఫాను ఆగిపోయినట్లు అనిపించింది అతనికి పాలకోవా పక్కనే డబ్బా మీద పెట్టి అతన్ని చూస్తూ నవ్విందామె, అతనూ నవ్వడానికి ప్రయత్నించాడు. రమ  వచ్చి అప్పుడే మూడు రోజులు అయినట్టుంది . నిస్సహాయంగా నవ్వాడతను. పక్క గుమ్మం దగ్గర నుంచుని పిన్నిగా రు కూతుర్ని కేకేసింది. (“ప్రసాద్ గారు ఒకసారి ఇలా వస్తారా ?”) తలుపు సందు వైపు చూసాడతను.

“ఇంటికి ఫ్రెండ్స్ ని పిలిచావా ? “

“వచ్చి వెళ్లిపోయారు సార్. త్వరగా పంపిం చేసాను”.

“ఓ “

“సార్ మీ ఇల్లు చూపించరా ?”

“ఇల్లా ? ఏముంది ? “

“చిన్న ఇల్లు – జస్ట్ టూ బెడ్ రూమ్స్ “

ఆమె లేచింది, అతనూ లేచి “ అదో  గది  దానెదురుగా ఒకటి”

రమ  ఒక గదిలోకి వెళ్ళింది , అతనూ వెళ్లి ఫాను లైట్ వేసాడు . అతనికి నుంచోడం కష్టంగా వుంది. బెడ్ రూమ్ అంతా  కళ్ళు తిప్పి  “బాగుంది సార్ మీలాగే “ అందామె. అతను బయటకు నడవదానికి వెనక్కి తిరిగేలోగా చటుక్కున ఆమె అతన్ని దగ్గరకు తీసుకుంది. రమ  స్ప్రే అతని నరాల్ని విద్యుదీకరించాయి. అతని చేయి ఆమె వీపుకు అతుక్కు పోయింది. ఆమె మెత్తటి పెదాలు అతని బుగ్గ మీద వాలాయి. అతని చేయి బిగుసుకుని వీపు మీద జారిపోయింది. ఆ నిశ్శబ్దంలో అతనికి ముందు తలుపు శబ్దం విస్ఫోటనం లా వినిపించింది. అప్పటికే అల్లుకున్న రమ  శరీరం విడిపించుకుని అలాగే బయటకు చూస్తుండిపోయాడు ప్రసాద రావు . అతని గుండె జారి మోకాళ్ళలో పడింది. అతని భుజం మీద చెయ్యి వేసిందామె. ముందు గదిలో ఎదో అలికిడి. విసురుగా ఆమె చెయ్యి తో సేసాడతను. వళ్లంతా చమట పట్టింది. అరిచినట్టు అన్నాడు ప్రసాద రావు “what do you mean, I am a married man, get out “ రెండంగల్లో బయటకు వెళ్లి సోఫా లో కూలబడ్డాడతను. గదిలో ఎవరూ లేరు, తలుపు అలాగే వుంది. అతని వంట్లో రక్తం ఆవిరి అయి పోయినట్లనిపించింది. అది ఇంకా రాలేదన్నమాట.

రమ వచ్చి అతని ముందు నుంచుంది. ఆమె వీపు మీద అతని చేతి ముద్ర అలాగే వుంది. అతని అర చెయ్యి ఐదు నాలుకుల తో మాట్లాడింది. రమకి తెలుసు. అతని వైపు చూస్తూ  నుంచుంది ఆమె. ఆమె వైపు చూడ్డం అతని వల్ల కాలేదు. అతి కష్టం మీద తలెత్తి చూసాడతను. కళ్ళు మూసుకో లేక అలాగే వుండి పోయాడతను. ఆమె రెండు కళ్ళు అతన్ని దహిస్తున్నాయి. ఆమె కళ్ళలో కోపం ద్వేషం లేదు. ఆమె చూపులు అతని చర్మాన్ని తొలుచుకుంటూ లోపలకి వెళుతున్నాయి. ఆమె తనని చూసింది. అతని కనురెప్పలు వాటంతట అవే వాలిపోయాయి. ఆమె మాటలు స్పష్టంగా వినిపించాయి. “సార్, మీరు …” అతను  తలుపు వైపు చూస్తున్నాడు. ఆమె మళ్ళీ అంది – “సార్, మీరు —” కొన్ని క్షణాల తరువాత అతనికి తలుపు మెల్లిగా వేసిన శబ్దం వినిపించింది. ప్రసాద రావు కి ఏం  జరిగిందో సరిగా అర్థం కాలేదు. సోఫా లోంచి లేవలేక పోయాడు. ఒక అస్పష్టమైన భయం సూక్ష్మ క్రిమిలా అతని లో ప్రవేశించింది. రమ వెళ్ళిపోతూ తనలోoచి ఏదో తీసుకు వెళ్ళిపోయింది”

“ఆలీసం అయిపోయింది  అయ్యగారు”

తలుపు ఎప్పుడు తోసుకు వచ్చిందో తెలీదు అతనికి. విస్తు పోయి చూస్తూ వుండిపోయాడు. (“కాస్త ముందుగా చావ వలసింది”) స్విచ్ బోర్డు పైన నల్లటి బల్లి అతని వైపు చూస్తోంది.

సాయంత్రం ప్రసాద రావు బయటకు వెళ్ళలేదు. స్నానం చేసిన తరువాత కూడా  అతని బుగ్గ మీద మెత్తటి పెదాల ముద్ర అలాగే ఉండిపోయింది. రాత్రి ఎప్పటికో నిద్ర పట్టేముందు, రమ  మాటలు వినిపించాయి. “ సార్, మీరు — “. మళ్ళీ నిద్ర రాలేదతనికి.

*

గంట క్రితం వచ్చినప్పటికంటే ప్రసాద రావు సగానికి సగం అతనిలోకి కుచించుకుపోయాడు. ఆకుపచ్చ చల్లటి టేబులు గ్లాసు వేపు చూస్తూండిపోయాడు. అతని ముందు టేబులు వెనుక కూర్చున్న కళాశాల డైరెక్టరు గారు కాసేపు అతన్ని చూసి టీ కప్పు తీసుకుంటూ అన్నాడు. “టీ తీసుకోండి” టీ వాసనతో గోధుమరంగు దురదృష్టంలా రుచించిందతనికి. ఆయన వెనక గోడ గడియారం ఏడు గంటలు చూపిస్తోంది. గంట ముందు ప్రసాద రావు కి తెలిసిన ప్రపంచం అంతమైపోయింది. ఒక వేళ ఏదేన మిగిలి ఉన్నా తలుపు తీసుకుని తాను బయటకు వెళ్ళలేడు. భయం అతనిలోంచి ఆవిరిలా బయట పడుతోంది.

“ప్రసాదుగారూ, మీ మాట మీద నమ్మకం ఉంది. మీరు నిజం చెప్తున్నారని నమ్ముతున్నాను. నిజా నిజాలు ఆలా ఉంచి కాలేజీ పరువు పోయే పరిస్థితి ఏర్పడింది”.

“రిజైన్ చేసి వెళ్ళమంటే వెళ్ళిపోతాను”.

“అది సమస్య కాదు సార్. ఇది బయటకు పొక్కితే ఏమవుతుందో మీకు తెలుసు. ముళ్ళమీద గుడ్డలా జాగ్రత్తగా హేండిల్ చేయాలి”.

“కల్లో కూడా అనుకోలేదు సార్. ఆ అమ్మాయి మంచి లాయరు అవుతుందనుకున్నాను”. మళ్ళీ రెండోసారి జరిగిందంతా అతికష్టం మీద చెప్పుకున్నాడు ప్రసాద రావు. కాసేపు ఇద్దరూ తమని చూసుకుంటూ ఉండిపోయారు.

“ప్రసాద రావు గారు, మల్లి నేను ఫోన్ చేసేవరకూ కాలేజీ కి రాకండి. సెలవు పెట్టండి. మీరు వెళ్లి రండి”.

ప్రసాద రావు లేచి వెళ్ళిపోయాడు. అతని ప్రమేయం లేకుండా ఇల్లు చేరాడు.

ఆ సాయంకాలం డైరెక్టరు గారు ఫోన్ చేసారు. గదిలో రైలు కూతలా వినిపించిందతనికి. డైరెక్టరు గారి నెంబర్ చూసి ఫోను తెరిచాడు అతను. అంత హడావుడిగా కాలేజీకి ఎందుకు రమన్నాడో అర్థం కాలేదతనికి. కాలేజీ లో ఎవరూ లేరు. కింది అంతస్తు ఆఫీసులో ఒకరిద్దరు పని చేసుకుంటున్నారు. డైరెక్టరు గారి ఎదురుగా కూర్చున్నాడు ప్రసాద రావు. రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత అన్నాడాయన.

“సారీ, ప్రసాద రావు గారూ– రెండు ముక్కల్లో చెప్తాను. మీ స్టూడెంట్ మీమీద నేను కూడా నమ్మలేని కంప్లైంట్ చేసింది. మీరు నిజం చెప్పడం మంచిది. మాకు కాలేజీ పరువు మర్యాదలు ముఖ్యం. ఆమె ఏం చెప్పిందో చెప్పమంటారా?”.

తరవాత పదిహేను నిముషాలు రమ మాటల్లో తను ఆమె మీద చేయబోయిన అత్యాచారం గురించి వివరంగా విని, ప్రసాద రావు మూర్ఛ పోయి లేచిన తరువాత ఎడారిలో పీకల వరకూ కూరుకుపోయి నట్టనిపించింది. భయంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి.

లేచి చన్నీళ్లతో ముఖం కడుక్కుని కూచున్నాడు ప్రసాద రావు. ఇప్పుడు ప్రపంచంలో అతనొక్కడే వున్నాడు. రమ పోలీసు రిపోర్ట్ ఇస్తే ఈ పాటికి జైల్లో ఉండేవాడు తను. రమ వచ్చి వెళ్లిపోయిన తరువాత ఇల్లంతా కొత్తగా ఉంది. కొత్త సూన్యంగా ఉంది. తనేం చేశాడు? తనేం చెయ్యలేదు. రమ తనని దగ్గరకు లాక్కుంది. తరవాతే తను కొంచెం —- ఆమెని రమ్మని పిలవలేదు. వెళ్లి పొమ్మంటే తప్పేముంది? కొన్ని నెలలుగా ఆమె తన వేపు ఇష్టంగా చూస్తోంది. తను రమ ని అవమానించలేదు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ అతనా ప్రశ్న దగ్గిర ఆగిపోయాడు–. పై మెట్టు మీంచి కింది వరకు జారిపోయినట్టు. ఆమె ఏవీ అనలేదు.  తిట్టి వెళ్ళిపోతే బాగుండేది. తప్పు చేసింది ఆమె. కోపం ఆమెకి ఎందుకొచ్చినట్టు? రమ కళ్ళు శరీరంలో విడిపోయి అతన్ని వెంబడిస్తున్నాయి. నిశ్చలంగా ఆమె కళ్ళు లేజర్ కిరణాలతో తనని ఒక్కో పొరగా ఒలుస్తున్నాయి. హాల్లో నిలబడి తనవైపే చూసిందామె. అవమానం కంటే హేయమైన దేదో తనకి జరిగింది– రమ చేసి వెళ్ళిపోయింది. మాటలతో, చేతలతో, చెయ్య లేనిది ఏదో. ఉదయం గడ్డం గీసుకుంటున్నప్పుడు ఒక కొత్త ముఖం కనిపించింది. ముఖం వేపు చూడకుండానే తల కూడా దువ్వుకున్నాడు. ఎంత ఆలోచించినా రమ ఎందుకు నేరం మోపిందో అర్థం కాలేదతనికి. తప్పు చెయ్యడానికి కనీసం ప్రయత్నించలేదు తను.

ప్రసాద రావు బయటకి రావడం మానేశాడు. ఇల్లంతా కొత్తగా, తన ఇల్లులా లేదు. నిద్ర పట్టిన కాసేపు తనకి అర్థం కాని కలలు వస్తున్నాయి….. రమ నిశ్శబ్దంగా గదిలోకి వచ్చింది. అతని పక్కనే పడుకుని  తలని  గుండెకి  హత్తుకుందామె.  అతని చేతులకి ప్రాణం వచ్చింది.  దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళని ముద్దు పెట్టుకుంటూ తలుపు వేపు చూసాడతను. రమ నుంచుని తన వేపే చూస్తోంది. చిన్న లైటు వెలుగులో కూడా మెరుస్తున్న ఆమె కళ్ళు చూస్తుండిపోయాడు ప్రసాద రావు.

మరో నాలుగు రోజుల తరవాత అతను ఎదురు చూస్తున్న ఫోను మోగింది. అతని చేతులు వణికాయి. ” హలో సార్” “ఒక సారి రండి – ఆరు తరవాత”.

కాలేజీ అంత నిర్మానుష్యంగా వుంది. కింది అంతస్తు ఆఫీస్లో లైటు వెలుగుతోంది. అతనికి భయం వేసింది. రమ కూడా ఉంటుందా ? డైరెక్టరు గారి చల్ల్లటి గదిలో వెళ్ళగానే అతని గొంతు పట్టుకుంది భయం. ప్రసాదరావు కూచోగానే ఎవరో వచ్చి ఓ కప్పు వేడి విషం అతని ముందు పెట్టి వెళ్ళేడు.

” టీ తీసుకోండి”.

టీ తాగడానికి ప్రయత్నిస్తుండగా డైరెక్టరు గారు మాట్లాడ్డం మొదలు పెట్టారు.

“it  spread like bad smell . దుర్ఘంధంలా కాలేజీ అంతా వ్యాపించింది. అందరికీ తెలిసి పోయింది. ఇప్పుడింక కాలేజీ దాటకుండా చూసుకోవాలి. పేపర్లకి ఎక్కకుండా జాగర్త పడాలి మేం. కానీ మీ కోసం ఒక మాట చెప్ప దలుచుకున్నాను. మీ మాట ఇప్పటికీ నమ్ముతున్నాను. రెండు, ఈ సంవత్సరం ఇంక క్లాసులు తీసుకోకండి. వచ్చే ఏడాది వద్దురుగాని. ఆ అమ్మాయి ఎందుకో కావాలని చేస్తోందని నా నమ్మకం. మిమ్మల్ని ఎందుకో శిక్షించాలని ఉందనుకుంటాను. నేను ఫోన్ చేసి మాట్లాడేను. చాల శాంతంగా స్పష్టంగా చెప్తోంది. జరిగిన దానికి ఆమె ఏమీ బాధ పడ్డం లేదు. she  is trying to punish you  Mr Prasada Rao . సరే మీరు వెళ్లి రండి. i am sorry . మీకు తరవాత ఫోను చేస్తాను ………. మీరు వెళ్లి ఇంట్లో ఉరేసుకోండి లేదా మేడ మీంచి దూకినా పనవుతుంది.

“సార్?”

“మిమ్మల్ని వెళ్లి పొమ్మనడం నాకూ ఇష్టం లేదంటున్నాను”.

మెడ చుట్టూ రెండు మూడు మైలు రాళ్లతో బయటకి వచ్చాడు ప్రసాద రావు. స్కూటర్ అతన్ని ఇంటికి చేర్చింది. తిన్నగా స్నానాల గదిలోకి వెళ్లి కుళాయి కింద కూచుని కళ్ళు మూసుకున్నాడు. చల్లటి నీళ్ళకి గడ్డ కట్టి భయం పిండంలా కడుపులో ఇరుక్కు పోయింది. చుట్టు పక్కల ఇళ్ళకి కూడా వ్యాపిస్తుంది. అందరికీ తెలుస్తుంది. శ్యామల వచ్చిన తరవాత ఏమవుతుంది? రేపిస్టు భర్త. చలి చీకటి ఉరుముల, మెరుపుల భయం. రమ ఎంత దిగ జారిపోయింది! ఒళ్ళు తుడుచుకుని సోఫాలో వెనక్కి వాలి టీవీ చూస్తూ కూచున్నాడు ప్రసాద రావు. పున్నాగ పువ్వులాంటి రమ ఒంటి నిండా విషం. రంగు రంగు మనుషులు టీవీ లో కదులుతున్నారు. ఏం చేస్తున్నారో తెలియడం లేదతనికి. నిశ్శబ్దంగా తలుపు తోసుకుని లోపలకి వచ్చింది రమ. లేత ఆకుపచ్చ చూడీదార్ లో, తెల్లటి ముఖం తో పున్నాగ పువ్వులా ఉందామె. ప్రసాదరావు నోరు జారిపోయింది. అతని పక్కనే కూచుందామె. నీళ్లు ఊరుతున్న కళ్ళతో అతన్నే చూస్తోంది. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ప్రసాద రావు. ఒంగి ఆమె అతని పెదాలమీద ముద్దు పెట్టుకుంటూ అంది —

“అంకుల్, అమ్మ టిఫిను పంపించింది.” ఉలిక్కి పడ్డాడు ప్రసాద రావు.

*

రహస్య జీవితం గడుపుతున్నాడు ప్రసాదరావు. బయటకి వెళ్ళడానికి భయం. స్కూటర్ వెనకాల ఎప్పుడూ కూచుని ఉంటుంది భయం. ఆఫీసు, కోర్టు, ఇల్లు మధ్య కీ ఇచ్చినట్లు తిరిగాడతను. కాలేజీ లో ఏం జరుగుతోందో తెలీడం లేదు. ఆఫీస్, కోర్టు తప్ప అంతా చీకటిగా వుంది. ఎవరు పలకరించినా ఉలిక్కి పడుతున్నాడు ప్రసాద రావు. రాత్రిళ్ళు మాత్రం రమ వచ్చి దగ్గరకి తీసుకుని ఓదారుస్తుంటుంది. ఆమెని వదిలిపెట్టడం కష్టంగా వుంది. మరో వారం తరవాత డైరెక్టరుగారు ఫోన్ చేసారు. మాములుగా ఏడవుతుండగా ఆయన గదిలో ప్రవేశించాడతను. కూచోమని చెప్పి వెంటనే అన్నాడాయన.

” మీ మీద కంప్లైంట్ వెనక్కు తీసుకుంది. క్షమాపణలు చెప్పింది. Too late కాలేజీ మానేసింది. ప్రసాద రావు మల్లి మూర్ఛ పోయాడు. ఆయనే అన్నాడు. ” నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు. నిన్న తిన్నగా నా గదిలోకి వచ్చి క్షమాపణ చెప్పి, ఏవీ జరగనట్టు వెళ్ళిపోయింది.”

ప్రసాద రావు తేలిగ్గా నడుస్తూ బయటకి వెళ్ళిపోయాడు. గాలి పటంలా ఇంటికి వెళ్తూ దార్లో విస్కీ సీసా కొనుక్కుని బయల్దేరాడు. సగం సీసా ఖాళీ అయిన తరవాత అనుకున్నాడతను. తన పొరపాటు తెలుసుకుంది రమ. అర్థ రాత్రి ఎప్పుడో వచ్చిందామె. కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ చేతులు చాచాడతను. తీరిగ్గా బట్టలు ఒలుచుకుని అతని మీదకు వాలిపోయింది రమ.

మర్నాడు ఉదయం గడ్డం గీసుకుంటుండగా అద్దంలో అతని వేపు చూస్తూ అంది రమ —

“సార్ — మీరు —-” చెంప కింద తెగింది.

*

“హలో” అన్నాడతను. తెలిసిన నంబరు కాదు. క్షణం తరవాత నిట్టూరుస్తూ అక్షరాల్లా “హలో, నమస్తే సార్”, అంది రమ. ఆమె కంఠం వినగానే ప్రసాద రావు రక్తం ఎగసి విరిగింది.

“నువ్వా ?”

శాంతంగా స్పష్టంగా అంది. “మీతో వెంటనే మాట్లాడాలి సార్. నా మీద కోపంగా ఉన్నారని తెలుసు. అయినా మిమ్మల్ని కలవక తప్పదు”.

“చేసింది చాలు. ఇంకేం మాట్లాడాలి ?”

“ఫోన్లో చెప్పలేను. మిమ్మల్ని కలవాలి. తప్పదు నాకు”.

అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“సార్ మీరెక్కడ ఉన్నారు ?”

“మా ఆఫీసు బయట”.

“సార్, దయచేసి  మా ఇంటికి రండి. ఎవరూ లేరు. ఒక్కదాన్నే ఉన్నాను. రండి మాట్లాడాలి. మళ్ళీ నాకు కుదరదు”. రమ ఇంటి గుర్తులు చెప్పి ఫోను పెట్టేసింది.

ఒక్కతే ఉండడం ఏవిటి? మళ్ళీ అతని రక్తం జరజర పాకుతున్న ఎర్ర పాములా మెలికలు తిరిగింది. స్కూటర్ అద్దంలో ముఖం చూసుకుని, రుమాలు తో తుడుచుకుని బయల్దేరాడు అతను. ప్రసాద రావు కి దూరం తెలియలేదు. చెట్ల నీడలో, విశాలమైన పక్కా రోడ్లో అపార్టుమెంటు బిల్డింగు ముందు ఆగేడతను. లిఫ్ట్ లో మెత్తగా నాలుగో అంతస్తు నిలువుగా చేరుకున్నాడు ప్రసాద రావు. కాలింగ్ బెల్లు మీంచి వేలు తీసేలోగా తలుపు తీసింది రమ. ఖరీదైన శుభ్రం, పరిమళం, చల్లదనం మధ్య సోఫాలో కూచున్నాడతను. లేత పసుపు రంగు నూలు చీరలో ఉంది రమ. లోపలి వెళ్లి పొడవాటి పలకల గాజు గ్లాసు లో ద్రాక్ష రసం తెచ్చి టీపాయ్ మీద పెట్టిందామె. పక్కనే కూచున్న ఆమె పరిమళం సుడిగాలిలా తాకిందతన్ని. ప్రశాంతంగా మాములుగా, రోజూ సాయంత్రం కలుస్తున్నట్టుగా ఉందామె. “తీసుకోండి సార్”. చల్లటి రసం గుక్క తాగి ఆమెవేపు చూసాడతను. ఆమె తన వేపే చూస్తోంది. తల తిప్పుకున్నాడతను. ఆమె కళ్ళలో అతనాశించింది  ఏవీ కనిపించలేదు. ఒక్క క్షణం అతనికి వెళ్లి పోవాలనిపించింది.

“నా వల్ల పొరపాటు జరిగింది సార్. కోపంలో తొందర పడ్డాను. మీ ఉద్యోగం పోయింది. నన్ను క్షమించండి”. సగం గ్లాసు ఖాళీ అయింది. అతనికి ఉద్యోగం పోయిందన్న బెంగ పోయింది. మరికొంచెం రసం తాగేడతను. “మీ ఉద్యోగం తిరిగి మీకు ఇప్పించలేను. “I am very sorry sir “. రమ అతని మీదికి ఒరిగి అతని నడుం చుట్టూ చెయ్యి వేసి భుజం మీద తల వాల్చింది. ప్రసాద రావు పెదాల దాడి నుంచి తేరుకోడానికి అయిదు నిముషాలు పట్టింది. “లోపలికి రండి”.

తరవాత అరగంట సేపు రమ కళ్ళు తెరవలేదు. అంత సేపూ అతను తన పేరు మర్చి పోయాడు…. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. రమ జుట్టు చెదిరిపోయింది. అతనికి ఎదురుగా నుంచుందామె.

“మీ మీద కోపంతో, మీ ఉద్యోగం పోగొట్టేను. నన్ను క్షమించండి. కాని మీ గురించి నేను పొరబడ్డాను. రెండూ నా తప్పులే”.

“its okay అయిపోయిందిగా”

ప్రసాద రావు రెండడుగులు ముందుకు వేసి ఆమె భుజం మీద చేయి వేసి అన్నాడు. “కోపం ఎందుకు? నేనేం చేశాను? నిన్ను రమ్మన్నానా?” అంటూ ఆమె వేపు చూసాడు అతను. పూర్తిగా కళ్ళు విప్పి అతని వేపు చూసిందామె. తల దించుకున్నాడతను.

“మీకు తెలీదా?” ఆమె పెదాల చివర చిన్న అదోరకమైన చిర్నవ్వు.

“పోనీలే, అవన్నీ మర్చిపోదాం. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తావు”.

రమ అతని చెయ్యి మృదువుగా తొలిగించి సూటిగా అతన్ని చూస్తూ అంది.

“సార్, మీరు వెళ్ళండి. నేను మళ్ళీ ఫోన్ చెయ్యను. నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను. sorry again , bye sir “.

*

తల్లావజ్ఘల పతంజలి శాస్త్రి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక కవిత పరిమళంలా చుట్టుకున్నట్లుంది. కవిత అంటే రమ లాంటి చిరునవ్వు కాదు సుమా!!

  • మీ కథ చదవడం ఎప్పుడూ ఒక అద్భుత అనుభవమే. మాటలలో చెప్తే మామూలుగా అనిపించే విషయాలు, మీ కథలో పడితే కవిత్వాలవుతాయి. మీరు మరిన్ని కథలు రాయడం, మీ పుట్టిన రోజుకి మాకివ్వాల్సిన బహుమతి. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను 💐

  • బాబోయ్… వాక్య నిర్మాణం లో ఉన్న పరుసవేది విద్య ఏదో తెలుసుకుని కాపీ కొట్టేయాలని తహ తహ …ఊహూ…అంతు చిక్కదు. అద్భుతం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు