రచయితనయ్యాను…

రచయితనయ్యాను…

ఏదో పెద్ద కల నెరవేరిన సంతృప్తి నాకు కలిగింది. మా అమ్మకేమీ అర్థం కాలేదు. పుస్తకం ఏమిటో, దాన్ని ఒకరికి అంకితమివ్వడం అంటే ఏమిటో ఆమెకేమీ తెలియదు.

అనువాదం: అరుణా పప్పు

న్యూఢిల్లీలోని సెక్రటేరియెట్ నార్త్ బ్లాక్ దగ్గర నిత్యం కనిపించేలా ఓ సూక్తి వాక్యం ఉంటుంది. ‘స్వేచ్ఛ అనేది ప్రజల కోసం తనంత తాను దిగిరాదు’ అని. అంటే ప్రజలే దాన్ని సంపాదించుకోవాలి. దాన్నక్కడ పెట్టింది బ్రిటిష్ వారే. అది వారి దృక్పథం కావచ్చు, లేదా నాటి స్వాతంత్ర్య సమరం మీద వారి వ్యాఖ్యానమూ కావచ్చు. తర్వాత మనకు స్వాతంత్య్రం వచ్చింది. అది మనం సంపాదించుకున్నదో, వాళ్లిచ్చారని అనుకుంటారో – అని ఆలోచించేవాణ్ని. స్వేచ్ఛతో పాటు ప్రజల ఆకాంక్షలకు తగినట్టు పరిపాలనావ్యవస్థ (అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్) మార్పులు రావాలి. ఒక స్పానిష్ తత్వవేత్త ఓర్టెడే గాసెట్ ‘ఉద్యమం లేదా మార్పు అంటే ఉన్న వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తడం మాత్రమే కాదు, సంప్రదాయ పద్ధతికి వ్యతిరేకంగా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడం’ అని చెప్పారు.

ఆ అవసరాన్ని ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాగానే గుర్తించారు. మిశ్రమ సంస్కృతి ఉన్న భారత్ కు తగినట్టుగా రాజ్యాంగం నిర్మాణమైంది. ఇండియా గణతంత్రం అయ్యింది. ప్రజల ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. వ్యవసాయరంగం, కార్మికరంగం కోసం పేజీల కొద్దీ చట్టాలు తయారయ్యాయి. ఒకనాటి ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా పేరు మార్చి గ్రామీణ ప్రాంతాల్లో రుణాల లభ్యతను పెంచే ప్రయత్నం చేశారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల నియంత్రణకు దాదాపు 400 ఆర్టికల్స్ తో చట్టాలున్నాయి. వీటన్నిటినీ అనుసరిస్తూ ఇంకొంత బలపరచడానికి కొత్త సంస్థలు, వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్, కంపెనీ లా అఫైర్స్ డిపార్ట్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్ మెంట్, నేషనల్ లాబరేటరీలు, నియంత్రణ సంస్థలు – వంటివి ఎన్నో కొత్తగా ఏర్పడ్డాయి. రక్షణ రంగం అంటే కేవలం సాయుధ శ్రేణుల నిర్వహణ, ఆయుధ కర్మాగారాల నిర్వహణకు పరిమితం కాకుండా డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మొదలైంది.

తక్కువ వ్యవధిలో ఎక్కువ మార్పులొచ్చిన కాలం అది. ఆ క్రమంలో ఇండియా అనేక ఆర్థికాభివృద్ధి అంశాల్లో ప్రయోగాలకు వేదికైంది. వాటిని విడిగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పటికింకా కలుషితం కాని ఢిల్లీ గాలిలో అవి అందరికీ తెలుస్తూనే ఉండేవి.

డొమినియన్ నుంచి రిపబ్లిక్ కు, వైస్రాయి ఇన్ కౌన్సిల్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అధికారం మారింది. కాని ఆర్థికపరమైన చట్టాల రూపకల్పన, నిర్వహణల్లో మార్పులు మాత్రం సున్నాకు దగ్గరగా ఆగిపోయాయి. చట్టాల రూపకల్పన అప్పటికీ ‘దర్బార్ శైలి’లో నడుస్తూ ఉండేది. ప్రభుత్వం అంటే ఒకటే కేంద్రం, ఒకటే సంకల్పం కాదు. అది కొన్ని రాజ్యాల సమాహారం, ప్రతిదానికీ ఓ మంత్రి, ఎవరికి నచ్చినట్టు వాళ్లు పాలిస్తారు. పెద్ద విషయాల మీద కేబినెట్ చర్చలున్నప్పటికీ, ప్రతిదీ ముందు కాంగ్రెస్ పార్టీలో చర్చకు రావాల్సిందే. అక్కడ తీసుకున్న నిర్ణయాలే అడ్మినిస్ట్రేటివ్ మార్గాల్లో ప్రభుత్వం ద్వారా చట్టబద్ధతను సంతరించుకునేవి.

ఆర్థిక వ్యవహారాలు ఏవైనా బ్రిటిష్ పద్ధతులను అచ్చు దింపెయ్యాలన్నట్టు ఆలోచించేవారు. ఏది తలపెట్టినా – ‘బ్రిటన్ లో అయితే ఏం చేస్తారు’ అన్న ఆలోచనతోనే సెక్రటేరియట్ మొదలుపెట్టేది. దేనికైనా పడమరకు తిరిగి దండం పెట్టడమే ఆచారం. (ఇది కొందరు సివిల్ సర్వెంట్లకు బాగా మేలుచేసేది. విదేశీ అసైన్మెంట్ల పేరుతో విహారం, డబ్బు సంపాదన రెండూ జరిగేవి) ఇప్పటికీ ఇది పూర్తిగా అంతరించిపోయిందని చెప్పలేం. ఏ కొత్త పని మొదలుపెట్టినా ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉంది అని వెతకడంతో మన ప్రాజెక్టులు మొదలవుతుంటాయి. స్థానిక పరిస్థితులు ఏమిటి, వీటికి సరిపోయే పథకాలు, పనులు, పరిష్కారాలేమిటి అన్న ఆలోచనతో మొదలయ్యేవి అతి తక్కువ. ఒక చట్టం రావాలంటే దానికి ముందు ఫైళ్లు అటూఇటూ, పైకీకిందకీ యుగాలపాటు తిరగాలి. అయినప్పటికీ మేథోమధనం జరుగుతుందని, చక్కటి పరిష్కారం వస్తుందని ఆశించడం అత్యాశే. అలసత్వం అనేది వ్యవస్థలో పాతుకుపోయిన ఒక అంశంగా మారిపోయింది.

ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ఆర్థికశాఖ పెత్తనం నుంచి తప్పించి సరళీకరించే ప్రయత్నాలు జరిగాయి. అయినా అది ఏక కేంద్రకంగానే ఉండేది. వలసవాద పాలన వారసత్వం ఏమంటే ప్రతిదానిలోనూ రంధ్రాన్వేషణ తప్ప, ఉన్న వనరులను చక్కగా కేటాయించడం, వాడటం చేసేది కాదు. బడ్జెట్ ప్రక్రియ ఏమాత్రం సమర్థవంతంగా ఉండేది కాదు. ఎస్టిమేట్లను పెంచెయ్యడం తరచూ జరిగేది. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాల్లో ఇది మరీ ఎక్కువ. రివ్యూ తక్కువగా జరిగేది. ఎంత ఎక్కువ పెంచేసేవారంటే, ఫైనాన్స్ మినిస్ట్రీ దానిలో కోత పెట్టినా పర్లేదన్నట్టుగా ఉండేది. మొత్తమ్మీద ఆ ఆటలో రెండు పక్షాలూ గెలిచేవి. పిసినారితనంతో మంత్రిత్వశాఖ గెలిచాననుకునేది. ఇటు తమకు కావలసిన నిధులు దొరికి, స్పెండింగ్ ఏజెన్సీలు నవ్వుకునేవి. ఇటువంటి ధోరణుల వల్ల ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ చాలా నెగెటివ్ వ్యవస్థగా ఏర్పడిపోయింది.

ఈ తరహా విలువల పతనం గురించి అందరికీ తెలుసు. కాని అందరూ అంతోఇంతో నిశ్శబ్దంగా ఆమోదించారనే అనుకోవాలసి ఉంటుంది. ఆ సమయంలోనే విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభం మొదలయింది. దానివల్ల రెండు అంచెల విధానం మొదలయింది. రుపీ మేనేజ్ మెంటును డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ చూస్తుంది. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ ఎక్స్ పెండిచర్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ చూస్తుంది. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ రెగ్యులేషన్ ఎంత భయంకరంగా ఉండేదంటే, విదేశాలకు వెళ్లే ప్రతివారినీ నేరస్తుడిలాగా చూసే వాతావరణం ఏర్పడిపోయింది. ఆ నెపాన ప్రభుత్వ వ్యతిరేకులను ఇంకా భయంకరమైన చర్యలకు గురిచేసేవారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ లాగా పనిచెయ్యాల్సిన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా భ్రష్టుపట్టిపోయింది. హోమ్ శాఖ నేతృత్వంలో పోలీసులతో జరిగే విచారణలు ప్రజలను అవస్థల పాల్జేసేవి. వీటన్నిటివల్లా విదేశీ మారక ద్రవ్యం కావాలంటే క్షణాల్లో దొడ్డిదారిన ఏర్పాటు చేసే ఓ దళారీవ్యవస్థ పాతుకుపోయింది.

నూతన ఆర్థిక విధానం, దిగుమతుల మీద ఆంక్షల వల్ల లైసెన్సింగ్ వ్యవస్థ ప్రబలింది. ఉద్దేశాలు ఏవైనప్పటికీ ఆచరణలో మాత్రం ఇది సివిల్ సర్వీసు అధికారుల్లో అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న దురాశ బహిర్గతం కావడానికి, పెరిగిపోవడానికి ఉపయోగపడింది. అవినీతి నిరోధక చట్టాలు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నీ ఉన్నా, అది తరగలేదు. ఇదంతా ప్రధానమంత్రికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. లైసెన్స్ రాజ్ లో వాళ్లు ఏ అవకాశాన్నీ వదలకుండా ఉపయోగించుకునేవారు.

దీనికో చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే 1960లో చిన్న కారు – ప్రజల కారు అన్న నినాదం వచ్చింది, కాని కాగితాల మీదే ఉంది. అప్పట్లో పాపులర్ కారేదంటే ప్రీమియర్ ఆటోమొబైల్ తయారుచేసిన ఫియట్ గురించే చెప్పుకోవాలి. అది వేగంగా వెళ్లేది, తక్కువ పెట్రోలు తాగేది, రిపేర్లు తక్కువ. దాంతో డిమాండ్ ఎక్కువ. కాని సప్లయి తక్కువ. దాంతో పాత కార్లకు మార్కెట్ పుట్టుకొచ్చింది. దీన్నుంచి లాభం పొందడానికి సివిల్ సర్వెంట్లు పన్నాగం పన్నారు. వారికి రెండేళ్లకో కారు కొనుక్కునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. దాంతో వాళ్లు కారు కొనుక్కోవడం, రెండేళ్ల తర్వాత కాస్త ఎక్కువ ధరకు అమ్మేసి, మరో కారు కొనుక్కోవడం చేసేవారు. డబ్బుకు డబ్బు వచ్చేది, కారూ ఉండేది. తెలివిగా రాసుకుని, అంతకన్న తెలివిగా అమలుచేసుకున్న నిబంధనల ఫలితంగా ఈ తరహా అవినీతి బట్టబయలు అయ్యేదే కాదు.

ప్రభుత్వ సర్వీస్ వ్యవస్థ ఎన్నో సర్వీసులు, క్లాసుల సమ్మేళనం అని చెప్పుకోవాలి. దీనిలో ప్రతిదానికీ తనదైన సిద్ధాంతాలు, పాలసీలూ ఉంటాయి. కొన్నిటిలో నిర్ణీత కాలం పూర్తి చేస్తే ప్రమోషన్లు వచ్చిపడతాయి, కొన్నిటికి ప్రతిభ అవసరం. ఈ క్లాస్ సిస్టమ్ ఒకనాడు మనువు నిర్దేశించిన వర్ణవ్యవస్థలాగే స్థిరపడి, ఉద్యోగాలను, ఉద్యోగులనూ కూడా ఉన్నత – మధ్యమ – అధమ వర్గాలుగా విభజించింది. వాటిమధ్య ఘర్షణనూ అలాగే ఉంచుతుంది.

ఈ వ్యవస్థలోని లోపాల్ని హాస్యస్ఫోరకంగా ఎత్తిచూపుతూ ఒక చతురుడైన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ‘పార్కిన్సన్స్ లా’ అనే పుస్తకాన్ని రాసి ప్రచురించాడు. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మంచి చదువరి, మేధావి. ఆయన ముందా పుస్తకాన్ని చదివి తన మంత్రివర్గ సహచరులకు సర్కులేట్ చేశారు. అందరూ అందులోని కథలను చదివి నవ్వుకున్నారు, కాని వాటిలోని అంతరార్థాన్ని గ్రహించలేదు. ఆ రచయితను ఢిల్లీకి ఆహ్వానించారు, ఆయన ప్రసంగాలకు హాజరయ్యారుగాని, ఆయన పుస్తకం ద్వారా మన వ్యవస్థలో ఎత్తిచూపిన తప్పుల్ని గ్రహించలేదు, వాటిని సరిదిద్దుకోలేదు.

విదేశీ మారక ద్రవ్యం మీద వల్లమాలిన ఆంక్షలు, మరోవైపు అయిందానికీ కానిదానికీ అవసరమయ్యే లైసెన్సులు – కలిసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఐరన్ ట్రయాంగిల్ అనే మాటను పుట్టించింది. రాజకీయ నాయకులు, సివిల్ సర్వీసు అధికారులు, వాణిజ్యవర్గాల వారు దీనికి మూడు వైపులా ఉండేవారు. పెద్ద వ్యాపార సంస్థలన్నీ ఢిల్లీలో లైజన్ కార్యకలాపాల కోసం కార్యాలయాలను ప్రారంభించాయి. తమ వ్యాపార వాణిజ్యాలకు అవసరమైన అనుమతులు సంపాదించడానికి అధికారులకు అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పించడం వాటి విధి. వాటిలో మద్యం, మత్స్యం, మాంసం, మగువ – ఇటువంటి ‘మ’కారానికి ప్రాశస్త్యం అని వేరే చెప్పనవసరం లేదు. ఈ కార్యాలయాలకు సైతం వారు సివిల్ సర్వెంట్ల ఇళ్లనే అద్దెకు తీసుకునేవారు, అద్దె ఎక్కువ చెల్లించేవారు, దాంతో వారి పనులకు చట్టబద్ధత లభించేది!

బ్రిటిష్ వారి వైట్- హాల్ సిస్టమ్ ను అనుసరించి మన దగ్గర రూపొందించిన పార్లమెంటులో ఉన్నత స్థాయి వక్తలు చాలామంది ఉండేవారు. కాని ప్రయోజనం శూన్యం. అక్కడ ఉన్నది ఒక్క పార్టీ పెత్తనమే. దాదాపు అందరూ కాంగ్రెస్ సభ్యులే. ప్రభుత్వ పద్ధతులు నచ్చకపోయినా విమర్శించేవారు తక్కువ. ఏదో చర్చల్లో పాల్గొన్నామని అనిపించుకోవడమేగాని ఏ చర్చా అర్థవంతంగా నడిచిన సందర్భాలు తక్కువ. ఒక్క బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడిగావేడిగా సాగేవి, ఐరన్ ట్రయాంగిల్ వర్గాల హడావుడి, ప్రభావం ఉండేవి కాదు.

అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో మార్పు కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసినా, అది మరింత దిగనాసి మార్పులకు దారితీసేవి. ప్రూస్ట్ అనే రచయిత రాసినట్టు ‘ఏదో పెద్ద మార్పు వస్తుందని అనుకున్న ప్రతిసారీ ఏమీ మారదు..’ అని . ఈ వ్యవస్థను అధ్యయనం చేస్తూ ఓ పుస్తకం రాయాలనేది అప్పట్లో నా సంకల్పం. అప్పటికి నాకు ఏదైనా రాసిన అనుభవం శూన్యం. కాని మూడేళ్ల ప్రభుత్వ సర్వీసు – పద్ధతిగా కదలకుండా ఓ దగ్గర కూర్చుని రోజంతా ఓ సబ్జెక్టును అధ్యయనం చేసి రాయగలిగే క్రమశిక్షణను నాకిచ్చింది. దాన్ని వినియోగించుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది.

*

మన దేశంలో ఉన్న పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను అధ్యయనం చేసి మార్పులూచేర్పులూ సూచించమని మన ప్రధానమంత్రి కోరిన మీదట అమెరికాలోని ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి పాల్ హెచ్. అపిల్ బీ అనే ప్రఖ్యాత ప్రొఫెసర్ ఇండియాకు వచ్చారు. ఆయన అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక మేరకు – అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 1954లో న్యూఢిల్లీలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఐ.ఐ.పి.ఎ) అనే సంస్థను నెలకొల్పారు. అది రింగ్ రోడ్డులో ఇంద్రప్రస్థ ఎస్టేట్ లో అది ఆడిటర్ జనరల్ ఆఫీసుకు, ఢిల్లీ ఎలెక్ట్రికల్ సప్లై అండర్ టేకింగ్ ప్లాంట్లకు కూతవేటు దూరంలో ఉండేది. ఐఐపిఎలో స్కూల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిప్లమా కోర్సు నడిపేది. దానికి అమెరికాలోని పిట్స్ బర్గ్, సైరక్యూస్ యూనివర్సిటీలతో ఒప్పందాలుండేవి. అక్కడి స్టాఫ్ వచ్చి బోధించడానికి ప్రభుత్వ ఆర్థిక సాయం చేసేది.

నేను రీసెర్చ్ ఫెలోగా చేరేనాటికి ఆ సంస్థ తాత్కాలిక భవనం నుంచి సొంత ప్రాంగణంలోని కొత్త భవనంలోకి మారింది. సెక్రటేరియట్ పూర్వం ఎప్పుడో కట్టినది, ఇది అప్పుడే నూతనంగా నిర్మించినది. అది అధికారం, బలానికి సూచికగా అనిపిస్తే, ఇది కొత్త ఆలోచనలను మోసుకొచ్చే పవనంలాగా ఉండేది.

ఐఐపిఎ వారి పబ్లికేషన్ ప్రోగ్రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా నడిచేది. మూడు నెలలకోసారి ఒక జర్నల్, నెలకో న్యూస్ లెటర్, కొన్ని పుస్తకాలు ప్రచురించేది. అక్కడి మొట్టమొదటి ప్రాజెక్టుగా అది కేంద్ర ప్రభుత్వం మీద తొలిసారి ఓ కాఫీ టేబుల్ బుక్ ప్రచురించింది. ఈ విభాగానికి అప్పటి హోమ్ సెక్రటరీ ఎల్.పి. సింగ్ ఎడిటర్ గా వ్యవహరించేవారు. ఆయనకు సంస్థ మేనేజ్ మెంటు మీద తిరుగులేని పట్టుండేది. దానికి ఆయన సొంత వ్యక్తిత్వం ఒక కారణం, నిధులు హోమ్ శాఖ నుంచే వస్తాయనేది మరో కారణం.

స్టాఫ్ విషయానికి వస్తే ఐఐపిఎకు ఒక డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్, కొందరు ప్రొఫెసర్లు, విదేశీ స్కాలర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేవారు. దానికి మొట్టమొదటి డైరెక్టర్ గా ఓ సీనియర్ సివిల్ సర్వెంట్ ఉండేవారు. నేను చేరిన సమయానికి ఆయన ఐక్యరాజ్యసమితి అసైన్ మెంట్ మీద వెళ్లిపోయారు. కొత్త డైరెక్టర్ గా వి.కె.కె. మీనన్ వచ్చారు. ఆయన ఉత్తరాదిన చాలా యూనివర్సిటీల్లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవజ్ఞుడు. అక్కడ రిటైరయ్యాక ఈ పదవిలోకి వచ్చారు. ఆయన భార్య స్త్రీవాది (ఫెమినిస్ట్), మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ లో డిప్యుటీ మినిస్టర్ గా ఉండేవారు.

ఐఐపిఎ పనితీరు నాకు క్రమంగా అర్థమైంది. అది రెండు ధోరణుల మధ్య అంతరాన్ని పట్టి ఇచ్చేది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేసి వచ్చిన ఉన్నతాధికారులు ఒక వర్గం. వీరు తమది ప్రాక్టికల్ పరిజ్ఞానమని భావించేవారు. పుస్తక పరిజ్ఞానం దండిగా ఉన్న అకడమిక్ స్టాఫ్ మరొక వర్గం. తమకు ప్రాక్టికల్ గా అనుభవం లేదన్న విషయాన్ని చాలా యుక్తితో, కపటంగా దాచిపెట్టేసేవారు. వాళ్ల జ్ఞానమంతా విదేశాల్లో ప్రచురితమైన పుస్తకాలకే పరిమితం. ఆ పుస్తకాలేమో అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితులకు తగినట్టు రాసినవి. ఇక మీనన్ గారు ఏ నిర్ణయమూ తీసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఆయన టేబుల్ మీద పారదర్శకమైన అద్దం కింద ఒక చిన్న కాగితం ఉండేది. ఆయన గదిలోకి వెళ్లే ఎవరైనా ముందు దాన్ని చదవాలి. అందులో ఏం రాసుండేదంటే మీనన్ గారికి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నాయిగనక వచ్చినవారెవరైనా స్వరం పెంచి మాట్లాడకూడదు, వాదనల్లోకి దిగకూడదు. ఆయన ప్రతి విషయాన్నీ హోమ్ శాఖతో సంప్రదించడానికి ఇష్టపడేవారు. అందువల్ల పాలనాసంబంధమైన నిర్ణయాలు ఆలస్యమయ్యేవి. ఆ క్రమంలో అసలు ఆ సంస్థను నడుపుతున్నది ఎవరో, నియంత్రిస్తున్నదెవరో అర్థమయ్యేది కాదు. అయితేగియితే ఆ నియంత్రణ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్ లో ఉన్నట్టే అనిపించేది.

స్టాఫ్ లో మిగిలినవాళ్లు కూడా సంస్థకు కొత్త. వారు మీనన్ లాగా కాదు. కాని బోధనలో బిజీగా ఉండేవారు. నేను చేరాక సంస్థ రెండో అంతస్తులోని ఓ గదిలో కుర్చీ, టేబుల్ కేటాయించారు. అప్పటికే అక్కడ మరో ఇద్దరు ఫుల్ బ్రైట్ స్కాలర్స్ అమెరికా నుంచి వచ్చినవారున్నారు. వారిలో ఒకరు లీ మార్క్స్. ఇతను తర్వాత కార్పొరేట్ ప్రాక్టీస్ లో అటార్నీగా స్థిరపడ్డాడు. మరొకరు డేవిడ్ పాటర్. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, పంచాయత్ రాజ్ వంటి వ్యవస్థల మీద పుస్తకాలు రాశాడు. ఆ పని మీద వ్యక్తులను కలవడానికి బయటికి వెళ్లిపోతూ ఉండేవాడు. మార్క్స్ కూడా కొంత సమయం అమెరికన్ ఎంబసీలో పని కోసం వెళ్లిపోయేవాడు. ఉన్నప్పుడు కూడా వాళ్లిద్దరూ నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకునేవారు. రెండో ఫ్లోరులో ఉన్నది మేం ముగ్గురమే. దాంతో నాకు చక్కటి, నిశ్శబ్దమైన పని ప్రదేశం దొరికినట్టయింది. గవర్నమెంటులో లాగా టేబుల్ మీద గుట్టలుగుట్టలు ఫైళ్లు లేకుండా, ఏ రకమైన తొందర లేకుండా ఉండేది. అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించడానికి అంతకన్న మంచి వాతావరణం దొరకదు.

ఒక ఏసీ ఆఫీసు ఉండేది. కాని దాన్ని వారాంతాల్లో మాత్రమే ఉపయోగించేవారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ సెక్రటరీ ఎస్. ఎస్. ఖేరాగారు, ఒక స్టాఫ్ అసిస్టెంట్ వచ్చేవారు. రోజంతా కూర్చుని రాసి, సాయంత్రానికి అసిస్టెంట్ కు టైపింగ్ కోసం కాగితాలిచ్చి వెళ్లిపోయేవారు. దూరం నుంచే అయినా, ఆయన వంటి స్కాలర్ పనిచేసే తీరును గమనించే అవకాశం నాకు స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఆలోచనకు, విశ్లేషణకు ఎంత సమయం తీసుకునేవారో తెలియదుగాని, కాగితం మీద ఆయన రాసేది ఫైనల్. ఇక అందులో కొట్టివేతలు, దిద్దుబాట్లు, తిరగరాయడాలు ఏమీ ఉండేవి కాదు. టైపింగ్ తర్వాత అక్షర దోషాలేమైనా ఉంటే సవరించేవాళ్లంతే. ‘గవర్నమెంట్ ఇన్ బిజినెస్’ అనేది ఆయన రాసిన పుస్తకం. ఆ సబ్జెక్టులో అది తొలి మార్గదర్శకం.

*

నేను చేరిన పది రోజుల తర్వాత నా అధ్యయన సారాంశం ఏమిటో రాసి ఇవ్వమన్నారు. అంత తక్కువ సమయంలో దాన్ని ఊహించడం కష్టం. మూడేళ్లుగా ప్రభుత్వంలో పనిచేస్తున్నందున కొంత తెలుసున్నమాట నిజమే అయినా, పరిశోధనకోణంలో అది సరిపోదు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ ఎలా రూపొందింది, దాని మూల స్తంభాలేమిటి, బ్రిటిష్ పాలనలో, స్వాతంత్య్రానంతరం పాటిస్తున్న పద్ధతులేవి, వాటిలో మార్పులకు కారణాలేమిటి, వచ్చిన మార్పులు మంచివా కాదా, ఇంకా ముందుకు ఏ దిశలో సాగాలి – ఇవన్నీ రావాలి నా రచనలో. అది చదివితే సామాన్య పాఠకులకు, ప్రభుత్వ వర్గాలకూ అసలు అక్కడ జరుగుతున్నదేమిటో విశదం కావాలి.

అయితే నేనేమీ విమర్శకారుణ్ణి కాదు, ప్రభుత్వ ఉద్యోగిగా నాకు కొన్ని పరిమితులున్నాయి. నా పరిశోధన రెండు భిన్న ప్రపంచాలకు చెందినది. ఒకటి ప్రభుత్వం. అక్కడ నుంచి రిపోర్టులు, వివిధ పత్రాలు సేకరించుకోవాలి. రెండోది అకడమిక్ ప్రపంచం. బ్రిటన్, అమెరికా వంటి దేశాల అనుభవాలు తెలుసుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. ఈ రెండు ప్రపంచాలనూ సమన్వయం చేస్తూనే, క్షేత్రస్థాయి వాస్తవాలు, అనుభవాలు, పద్ధతులకు అద్దం పడుతూ నా రచన సాగుతుందని సంకల్పించుకున్నాను. అదే సారాంశంగా రూపొందించి ఇచ్చాను.

ఓ పదిరోజుల తర్వాత నాకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. నా ఉద్దేశం మరీ ఎక్కువ ఏంబిషస్ గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఏడాదిలో చెయ్యగలిగినదానికన్నా ఎక్కువ పనిని తలకెత్తుకుంటున్నానని, దాన్ని తగ్గిస్తే మంచిదని సూచించారు. అయితే నేను ఇచ్చిన చాప్టర్ల గురించి, అవి చర్చించే అంశాల గురించి కామెంటేమీ రాలేదు. దాంతో నాక్కొంత ధైర్యం వచ్చింది. నేననుకున్న ప్రణాళిక ప్రకారం పనిచేస్తానని, పని పూర్తి కావడంలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే అప్పుడు దాన్ని తగ్గించుకుంటానని అకడమిక్ స్టాఫ్ తో చెప్పాను. వాళ్లు ఒప్పుకొన్నారు.

నేను నా పని ప్రారంభించాను. ఏడాదిలో మొదటి సగం మెటీరియల్ సంపాదించడానికి, అవసరమైతే కొన్ని రాష్ట్రాలు తిరగడానికి, తర్వాత ఆర్నెల్లు రాసుకోవడానికీ కేటాయించుకున్నాను. జానపద కథల్లో రాజకుమారిలాగా నాకున్నది తక్కువ సమయం. ఈ ఏడాదిలో ఏం చేస్తానన్నది నా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఈ విషయం అర్థమయ్యాక నాకు కొంచెం భయం వేసింది. కాని శ్రద్ధగా ముందుకు సాగడానికే నిర్ణయించుకున్నాను.

ఢిల్లీలో లైబ్రరీలకు కొదవ లేదు. టి.టి.కృష్ణమాచారిగారి వ్యక్తిగత పుస్తకాలు, పత్రాలను ఐఐపిఎకు అప్పుడే ఇచ్చేశారు. ఆయనది చాలా శ్రద్ధగా సేకరించిన కలెక్షన్. అరుదైన పుస్తకాలెన్నో ఉండేవి. ఐఐపిఎలో ఏమున్నాయో చూసుకున్నాక నేను ఆర్థికశాఖ లైబ్రరీకి వెళ్లాను. ఓ వరండాను లైబ్రరీగా మార్చారు అంతే. ఏ వసతులూ ఉండవు. కాని పరిశోధకులకు అది బంగారు గని. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత. లైబ్రేరియన్ నాకు పాత పరిచయస్తుడే. దాంతో నాపైన ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదు. దానితర్వాత పార్లమెంట్ హౌస్ లైబ్రరీకి వెళ్లాను. అక్కడకూడా అత్యద్భుతమైన పుస్తకాలు, పత్రాలు ఉండేవి. కోరినదల్లా దొరికేది. కాని దానిలోకి ఎవరు పడితే వారు వెళ్లలేరు. దాంతో నేను ప్రతి ఉదయం వెళ్లి నాకు కావలసిన పుస్తకాల జాబితా లైబ్రరీ అసిస్టెంట్లకు ఇచ్చేవాణ్ని. వారు వెతికి కొన్ని గంటల్లో నాకు కావలసినవి ఇచ్చేసేవారు. నేను అడిగినవాటిలో ఎక్కువ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ రిపోర్టులే. కొన్ని వెతకడానికి వాళ్లకు చాలా సమయం పట్టేది. అలాంటప్పుడు నేను వెళ్లి వెతుక్కోవడానికి వాళ్లు అనుమతించేవారు. నాకు కావలసినవి కొన్ని లైబ్రరీ రికార్డుల్లో సైతం లేవు. లోక్ సభ సందర్శకుల గ్యాలరీల దగ్గర కొన్ని ర్యాకుల్లో ఉండేవి. నా వరకు అది పెద్ద నిధి. దొరికినందుకు నాకు గొప్ప సంబరంగా అనిపించింది. 1937లో ఆ భవనం కట్టినప్పటి నుంచి అవి అక్కడే పడి ఉన్నాయేమో, విపరీతంగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. అయితేనేం, నా పనికి అత్యవసరమైన మెటీరియల్ నా దగ్గరకు చేరింది.

ఎ.జె.వి.దర్వెల్ అనే వ్యక్తి రాసిన పుస్తకం గురించి అన్వేషణ మొదలుపెట్టాను. ఆయన హౌస్ ఆఫ్ కామన్స్ లో క్లర్కు. ఆ పుస్తకాన్ని 1917లో ప్రచురించారు. ఆ తర్వాత వచ్చిన అన్ని గొప్ప పుస్తకాలు దాన్ని ప్రస్తావించాయి. దాంతో ఆ పుస్తకం పట్ల నాకు అంతులేని ఆసక్తి కలిగింది. కాని అది ఎక్కడా దొరకలేదు. ఎంతో ప్రయాసపడి అన్వేషించిన మీదట కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ లైబ్రరీలో ఉందని, అయితే దాన్ని ఓ సీనియర్ అధికారి శాశ్వతంగా తీసుకున్నారని తెలిసింది. ఆయన్ని తిరిగివ్వమని లైబ్రరీవాళ్లు అడగలేరు. నేనే నేరుగా సంప్రదించాను. తన పనిలో ప్రతిరోజూ దాని రిఫరెన్సు అవసరం పడుతుంటుంది గనక వారాంతంలో ఒక్కసారి ఆయన నాకివ్వడానికి అంగీకరించారు. నేను ఓపిక పట్టినందుకు మంచి ఫలితమే లభించింది. నేను దాన్ని తీసుకొచ్చి ఆ వారాంతం పూర్తిచేశాను. అది చదువుతున్నప్పుడు ‘ఆడిట్’ ఛాప్టరంతా అంతకుముందెక్కడో చదివినట్టు అనిపించింది. ఐఐపిఎ ప్రచురించిన ‘ఏస్పెక్ట్స్ ఆఫ్ ఆడిట్ కంట్రోల్’ అనే పుస్తకాన్ని పరిశీలిస్తే అందులో కనిపించింది. అది ఆనాటి ఆడిటర్ జనరల్ ప్రసంగాల సారాంశం.

నేను పుస్తకాన్ని తిరిగిచ్చేస్తూ సీనియర్ అధికారికి ఈ విషయం తెలియజేశాను. అతను ఆ రహస్యం నాకు తెలిసిపోయినందుకు ఆశ్చర్యపోయారు. తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అకస్మాత్తుగా చాలా మర్యాదగా, వినయంగా మాట్లాడటం మొదలుపెట్టారు. గ్రంధచౌర్యానికి పాల్పడినందుకు క్షమాపణలన్నట్టుగా వ్యవహరించసాగారు. ఆడిటర్ జనరల్ ప్రసంగాల డ్రాఫ్ట్ రూపొందించింది ఆయనే మరి. ఇదంతా బయట ఎక్కడా చెప్పొద్దని నన్ను వేడుకున్నారు. నేను చెబితే తన భావి జీవితం పాడయిపోతుందన్నారు. ఆయనకు హాని చెయ్యాలన్న తలంపు లేదుగనక నేనెవరికీ ఏమీ చెప్పలేదు.

గ్రంధాలయాలు తిరిగి నేను సంపాదించిన మెటీరియల్ అంతా ఒకెత్తు. పూర్వ ఆర్థికమంత్రులతో సంభాషణల వల్ల లభించిన జ్ఞానం ఒకెత్తు. ఆర్థిక వ్యవస్థకున్న రాజకీయ కోణాలు, దానిలో వారు పోషించే పాత్ర, తీరుతెన్నులు వారితో మాట్లాడితేనే అర్థమవుతాయి.

స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఆర్థికశాఖను ఆ రంగానికి సంబంధించిన నిపుణులు మంత్రులుగా నిర్వహిస్తూ వచ్చారు. సాధారణంగా వారికి రాజకీయ నేపథ్యం తక్కువగా ఉంటుంది. మన తొలి ఆర్థికమంత్రి ఆ పదవిలో ఎక్కువకాలం ఉండనే లేదు. బడ్జెట్ ప్రతిపాదనల లీకుల వల్ల రాజీనామా చెయ్యవలసి వచ్చింది. రెండో ఆర్థికమంత్రి ఎకనామిక్స్ ప్రొఫెసర్. కార్పొరేట్ సెక్టార్లో పనిచేసిన అనుభవమూ ఉంది. కేంద్రంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చెయ్యడంలో భేదాభిప్రాయాలతో మంత్రివర్గం నుంచి నిష్క్రమించారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు వల్ల ఆర్థికశాఖ పనితీరు కుంటుపడుతుందని ఆయన బలమైన నమ్మకం. మూడోవారు చింతామణి దేశ్ ముఖ్. ఆయన ఐ.సి.ఎస్. అధికారి. ఎన్నో స్థానాల్లో పనిచేశారు. ఒక ప్రావిన్సుకు ఫైనాన్స్ సెక్రటరీగా, స్వాతంత్ర్య సమర సమయంలో భారతీయ రిజర్వు బ్యాంకుకు గవర్నరుగా పనిచేశారు. ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టిన అనుభవజ్ఞుడైన అమాత్యుడు. ఆర్థికపరమైన ప్రణాళికల్లో ఒక కొత్త శకానికి నాందిపలికారు. అప్పటిదాకా ఎటూ తేలని ప్రణాళికా సంఘం అనే సమస్య ఆర్థికమంత్రిని కమిషన్ లో ఫైనాన్స్ మెంబర్ గా చెయ్యడంతో పరిష్కారమైపోయింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజన అనే అంశం తెరమీదకు వచ్చింది. ఆ సందర్భంలో ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఛైర్మన్ అయ్యారు. సి.డి.దేశ్ ముఖ్ గారిది గొప్ప వ్యక్తిత్వం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ – ఐ.ఎమ్.ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఆయనను వరించి వచ్చింది. కాని ప్రధానమంత్రి సలహా మేరకు ఆయన దాన్ని త్యజించి, మాతృదేశానికే తన జ్ఞానాన్ని వినియోగించాలనుకున్నారు. దానికన్నా ముందు, ప్రపంచబ్యాంకు, ఐ.ఎమ్.ఎఫ్. సంస్థల ఏర్పాటుకు బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్సులో బీజం పడింది. అటువంటి కీలకమైన సదస్సులో భారతబృందానికి నాయకత్వం వహించింది ఆయనే.

నా ప్రాజెక్టు పుస్తకం గురించి వివరిస్తూ, కలవడానికి అనుమతి (అపాయింట్ మెంట్) కావాలంటూ చింతామణి దేశ్ ముఖ్ గారికి ఒక ఉత్తరం రాశాను. సమయం, స్థలం తెలియజేస్తూ ప్రత్యుత్తరం వచ్చింది, వెంటనే. ఢిల్లీ ఔరంగజేబు రోడ్డులోని ఆయన ఇంటికి ఒక చలికాలం ఉదయం వెళ్లాను. ఇంటిబయట లాన్ లో రెండు కుర్చీలు, ఓ టీ టేబుల్ ఉన్నాయి. అక్కడ కూర్చున్నాం. ఎన్నో ప్రశ్నలు అడిగాను, అన్నిటికీ ఆయన క్లుప్తంగా సమాధానాలిచ్చారు. కొన్ని విషయాలు మర్చిపోయానన్నారు. కొన్నిటిని అప్పటి ఆర్థికశాఖ అధికారులను అడిగి తెలుసుకోమన్నారు. మొత్తమ్మీద నాకు అర్థమయినంతలో ఆయన సివిల్ సర్వీస్ సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటించే మనిషి. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం, ఎంత సుదీర్ఘ ప్రక్రియ అయినా అందులోని ప్రతిదశనూ బేరీజు వెయ్యడం, చివరకు మంచిదేదో అన్న నిర్ణయం తీసుకోవడం –ఇది వారి పద్ధతి. ఆర్థికమంత్రిగా కూడా ఆయన దాన్నే పాటించారు.

ఒక్క విషయంలో మాత్రం ఆయన కొద్దిగా ముందుకొచ్చి మాట్లాడారు. అది అప్పటికి దినపత్రికల్లో చాలా రచ్చ అవుతున్న ‘చందా’ అంశం. చందా ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ సర్వీస్ లో ఉన్నతాధికారి. ఆడిటర్ జనరల్గా నియమితులయ్యే అవకాశం వచ్చిందాయనకు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండో ఆడిటర్ జనరల్ ఆయనే. నియామకానికి ముందు సంప్రదాయం ప్రకారం ఆయనను ఆడిట్ డిపార్ట్ మెంట్ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆర్నెల్ల కాలావధికి నియమించారు. ఆ సమయంలో అక్కడి బాధ్యతలు, పద్ధతులు తెలుసుకుంటారనేది ఈ నియామకం ఉద్దేశం. ఆ సమయంలోనే చందాగారిని ప్రధానమంత్రి పిలిచారు. వారికి అంతకుముందే పరిచయం ఉంది. దాంతో ఆర్థికశాఖ నిర్వహించే ఫైనాన్సియల్ కంట్రోల్ సిస్టమ్స్ ను అధ్యయనం చేసి తనకు నివేదిక ఇవ్వమన్నారు. అది విలక్షణమైన అవకాశం. తనదైన ముద్రను చూపించాలనే ఆరాటంతో చందా చాలా ఉత్సాహంగా దాన్ని అధ్యయనం చేసి, తన రిపోర్టును ప్రధానికి సమర్పించారు. ప్రధానమంత్రి దాన్ని కేబినెట్ భేటీలో చర్చకు పెట్టారు. ఆ రిపోర్టులో ఏముందన్నది పత్రికలకు తెలియలేదుగాని, ఆర్థికమంత్రి దాన్ని వ్యతిరేకించారన్న వార్త మాత్రం బయటకు పొక్కింది. ఆర్థికమంత్రికి ఆ రిపోర్టు కలిగించిన ఇబ్బంది, అసౌకర్యాలను గమనించిన ప్రధానమంత్రి తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు, పార్లమెంటులో విస్తృతమైన చర్చ జరగలేదు. దాంతో ఆ రిపోర్టులో ఏముందోనంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఎంత వివాదమైనా, రిపోర్టు మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. (తర్వాత చందా తాను రాసిన ‘ఇండియన్ అడ్మినిస్ట్రేషన్’ పుస్తకంలో దాన్ని చేర్చారు. మరికొంత భాగాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదికలు ఒకదానిలో చేర్చేశారు. ఆయన ఆ నివేదికలో చేసిన సూచనలను నేను రాసిన ‘కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్ పెండిచర్ ఇన్ ఇండియా’ పుస్తకంలో చర్చించాను.)

చింతామణి దేశ్ ముఖ్ గారితో చందా రిపోర్టు గురించి ప్రస్తావించినప్పుడు – ‘అది మా మంత్రిత్వశాఖ తయారుచేసినది కాదు కనుక నేను చూడలేదు. చందా తన అసలు పని మానేసి ఈ పనిలో తన శక్తియుక్తులను ఎందుకు వృధాచేశారో నాకు తెలియదు’ అన్నారు.

ఇదొక్కటే కాదు, చాలా అంశాలమీద దేశ్ ముఖ్ గారి అభిప్రాయాలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి, అవగాహనకు పనికొచ్చాయి. వాటిలో చాలామట్టుకు సివిల్ సర్వీసులకు కొనసాగింపులాగా అనిపించాయిగాని, నాకు కావలసిన రాజకీయ కోణాలు తక్కువగా కనిపించాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన ఆపాదమస్తకమూ ఒక ‘సివిల్ సర్వెంట్’. వారికి ఒక సంస్థ నిలకడగా నడవటం ముఖ్యం. కొత్తదారుల్లో ప్రయాణాన్ని, రిస్కునూ అంతగా ఇష్టపడరు.

తర్వాత నేను మరో మాజీ ఆర్థికమంత్రి టి.టి. కృష్ణమాచారి(టి.టి.కె.)గారిని కలవాలని నిర్ణయించుకున్నాను.

1961 జనవరిలో నేను మద్రాసు వెళ్లాను. ఆ రాష్ట్రపు ఎక్స్ పెండిచర్ కంట్రోల్ సిస్టమ్ ను అధ్యయనం చెయ్యడం అనే మరో పని కూడా పెట్టుకున్నాను. నేను వెళ్లే సమయానికి టి.టి.కె. రాజకీయంగా ఒంటరిగా ఉన్నారు. ముంద్రా వ్యవహారంలో న్యాయవిచారణకు ఆదేశాలు రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. హెచ్.డి.ముంద్రాకు కొన్ని సంస్థలుండేవి. ఆయన ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సంస్థల షేర్లు ఎక్కువకు కొనేలా ఆర్థికశాఖ సహకరించిందని ఆరోపణ. టి.టి.కె. రాజకీయవేత్త అయినప్పటికీ ఆయనకు వ్యాపారాలుండేవి. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన దక్షత అసమానమైనది.

కృష్ణమాచారి తొలుత వాణిజ్యవ్యవహారాల శాఖ మంత్రిగా కొన్నాళ్లు చేశారు. దేశ్ ముఖ్ రాజీనామా తర్వాత కేంద్ర ఆర్థికమంత్రిగా పగ్గాలు చేపట్టారు. వారిద్దరూ రెండు విభిన్న సంప్రదాయాలకు ప్రతినిధులు. ఆయన సివిల్ సర్వెంటుగా ఒక్కో మెట్టే పైకి ఎక్కి వచ్చినవారు. ఈయన వ్యాపారవేత్తగా రాణించినవారు. ప్రావిన్సు మొదలుకొని కేంద్రం వరకూ రాజకీయం ఈయనకు కొట్టిన పిండి. వారు నిలకడ కోసం చూస్తారు, ఈయన రిస్కుకు వెనకాడరు. దేశ్ ముఖ్ గారికి సివిల్ సర్వీస్ ప్రాణవాయువు వంటిదైతే, కృష్ణమాచారిగారికి అదంటేనే అసహ్యం. అది సంప్రదాయాలకు బందీ అని, ఊహాశక్తి లేనిదని, పనికిమాలినదనే అభిప్రాయం ఆయనలో బలంగా ఉండేది. మొత్తమ్మీద వారిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలన్నది తేటతెల్లంగా ఉండేది.

నేను వెళ్లేసరికి టి.టి.కృష్ణమాచారి నగరానికి దూరంగా ఒక చిన్న బంగళాలో నివాసం ఉండేవారు. ఆయన భార్య అప్పటికే మరణించారు, నగరంలోని పెద్ద ఇంటిని కొడుకులకు ఇచ్చేసి ఆయన ఇక్కడ ఉండేవారు. దానికి వంద గజాల దూరంలోగాని మరో ఇల్లు లేదు. ఓ పడక గది, ఒక ఏసి లైబ్రరీ, ఓ భోజనాల గది, డచ్ వరండా – ఇంతే ఆయన ఇల్లు. ఇంటికన్న తోట పెద్దది. వరండాలో ఓ ఉయ్యాల బల్ల. ఆయన తరచూ అక్కడ ఊగుతూ నిద్రపోయేవారు. లైబ్రరీ చెప్పుకోదగినది. అందులో ఓ పెద్ద కుర్చీ ఆయనకు. పొద్దున చాలాసేపు, రాత్రి పడుకునేవరకూ కూడా ఆయన అక్కడే గడిపేవారు.

నేను ముందుగా ఉత్తరమేదీ రాయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయాను. ‘అయ్యగారు పడుకున్నారు, ఇక లేచే సమయం అయ్యింది. మీరు కూర్చోండి’ అని చెప్పాడు తోటమాలి. ఎండగా ఉంది, తాంబరం రైల్వేస్టేషన్ నుంచి నడిచి వచ్చానేమో, వరండాలో ఓ మూల కూర్చుని అలుపు తీర్చుకుంటున్నా, ఈలోగా టి.టి.కె. నిద్ర లేచి బయటకు వచ్చారు, వరండాలో అపరిచితుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. నేను నమస్కారాలు చెప్పాను, నా ప్రాజెక్టు గురించి చెప్పి, మాట్లాడటానికి ఆయనకెప్పుడు వీలవుతుందో కనుక్కోవడానికి వచ్చానని చెప్పాను.

‘ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మాట్లాడదాం. నేను రాజకీయాల్లో ఏక్టివ్ గా లేనుగనక నన్ను కలవడానికి ఎవరూ రారు. మ్యూజిక్ అకాడమీ నిర్మాణ పనుల పర్యవేక్షణకు తప్ప నేను సిటీలోకి పెద్దగా వెళ్లేదీ లేదు. అందువల్ల మీ ప్రశ్నలేమిటో అడగండి..’ అని ప్రోత్సహించారు. వంటాయనను పిలిచి మా ఇద్దరికీ కాఫీ తీసుకురమ్మన్నారు. తోటమాలి పని చేస్తున్నది తప్ప, అంతా నిశ్శబ్దమే. అటువంటి వాతావరణంలో ఆయన నన్ను తీక్షణంగా చూస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని నా రచన గురించి, అప్పటివరకూ చేసిన హోమ్ వర్కు గురించి వివరించాను. ఏయే అంశాల్లో ఆయన అభిప్రాయాలు కావాలో వివరించాను. మొదటి పావుగంట కనాకష్టంగా గడిచింది. ఆయన నుంచి ఆ, ఊ అంటూ అన్నీ ఏకాక్షర సమాధానాలే వచ్చాయి. చాలా అవసరమైన ప్రశ్నలకు సైతం ఆయన తీరైన సమాధానాలివ్వలేదు. నాతో మాట్లాడటం ఆయనకిష్టం లేదేమో అనుకున్నాను.

కాని వాస్తవానికి ఆయన ఆ పావుగంటలోనూ నాకెంత తెలుసో అంచనా వెయ్యడానికి ప్రయత్నించారు. ఆయనకు నామీద ఒక సదభిప్రాయం కలిగాక ఇక నయగారా జలపాతంలా మాట్లాడటం మొదలుపెట్టారు! దాదాపు ప్రతి అంశం మీదా ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. మాట్లాడుతూ ఉండగా రెండు గంటల సమయం గడిచిపోయిందని, సూర్యాస్తమయం కావొస్తోందనీ మాకు అర్థమైంది. నేను మరోసారి రావచ్చునా అని వారిని అడిగాను.

‘మీకు కావలసినన్నిసార్లు రండి’ అన్నారాయన. అంతేకాదు, తన స్టాండర్డ్ హెరాల్డ్ కారు తీసి తాంబరం రైల్వే స్టేషన్ వరకూ స్వయంగా దిగపెట్టారు. ఆ తర్వాత మరోసారి కూడా వెళ్లాను వారింటికి. బోలెడన్ని విషయాలు చర్చించాం. తన లైబ్రరీ అంతా తిప్పి చూపించారు నాకు. వారి ఆదరానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆయనతో మాట్లాడటం నిజంగా ఓ ఎడ్యుకేషన్.

ఢిల్లీకి తిరిగివచ్చాక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్తరం రాశాను ఆయనకు. తర్వాత మామధ్య నడిచిన ఎన్నో ఉత్తరప్రత్యుత్తరాలకు ఆ ఉత్తరం నాంది పలికింది. ఆయన స్వయంగా రాసిన ఇన్ లాండ్ లెటర్లెన్నో నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. వాటిలో ఆయన తన భవిష్యత్ ఆలోచనలు పంచుకునేవారు. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి, ఊటీ వంటి చలల్లని ప్రాంతాల్లో స్థిరపడి శేషజీవితాన్ని గడపాలా లేదంటే రాజకీయాల్లోకి వచ్చి దేశానికి ఉపయోగపడాలా అనే సందిగ్ధం ఆయనలో ఉండేది. రాజకీయాల్లో ఓనమాలు తెలియని నావంటివాడితో ఆయన ఇవ్వన్నీ ఎందుకు చర్చిస్తున్నారో అర్థమయ్యేది కాదు. కాని ఆయన ఆలోచనలు వినే శ్రోతను నేను. అంతే నాకు తెలిసింది. తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు, 1962లో చైనా యుద్ధం తర్వాత అత్యవసరమైన ఎకనామిక్ కోర్డినేషన్ మంత్రివర్యులుగా దేశానికి సేవ చేశారు.

ఆర్థిక మంత్రుల ఇంటర్వ్యూల తర్వాత నేను మద్రాసు ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అధ్యయనం ప్రారంభించాను. బ్రిటిష్ వారు ఒక ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి ప్రెసిడెన్సీ అది. చాలా ఘనమైన అడ్మినిస్ట్రేటివ్ సంప్రదాయాలకూ, నిపుణులైన అడ్మినిస్ట్రేటర్లకూ ఆలవాలమైనది. అప్పటికి ఫైనాన్స్ సెక్రటరీ వర్ఘీస్ ఉండేవారు. ఇద్దరు డిప్యుటీ సెక్రటరీలు వెంకిటరమణన్ (ఈయన తర్వాత ఆర్.బి.ఐ. గవర్నరయ్యారు) మరొకరు గుహన్ (తర్వాత మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ లో సీనియర్ ఫెలోగా పనిచేశారు) వారిద్దరూ నాకు చాలా సహకరించారు. నా అభిప్రాయాలు వారితో కలిసేవి కాదు, అయినా పనిలో సహకరించడానికి వాళ్లకది అడ్డంకి కాలేదు. రాష్ట్రస్థాయి వ్యవస్థల మీద అప్పటికే నా దగ్గర 500 పేజీల నోట్సు పోగయ్యింది. అందువల్ల ఈ అంశాన్ని నేను నా పుస్తకంలో చేర్చలేదు. పబ్లిషర్ పుస్తకం 500 పేజీలే ఉండాలని పట్టుపట్టడంతో చివర్లో మూడు చాప్టర్లు వదిలిపెట్టేశాను. వాటిని నా తర్వాత పుస్తకాలు, పేపర్లలో ప్రచురించాను.

*

గ్రంధాలయాల సందర్శన, పుస్తకాల సేకరణ, ఆర్థిక మంత్రుల ఇంటర్వ్యూలు – వీటన్నిటితో నా పుస్తక రచనకు అవసరమైన మెటీరియల్ సంపాదించడం పూర్తయింది. ఇక ఇప్పుడు పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టాలి. అది శ్రమ, ఒంటరి పని. కొన్నిసార్లు ఉత్సాహంగా ఉంటుంది, మరికొన్నిసార్లు కావలసిన పదాలు దొరక్క విసుగు. పుస్తకం రాయడం తొలిసారయితే ఈ తిప్పలు రెండింతలుగా భయపెడతాయి. అపారమైన మెటీరియల్ ఉన్నట్టయితే, మనకు తెలిసినదంతా పాఠకులకు తెలియజెయ్యాలన్న ఆత్రం తినేస్తూ ఉంటుంది. దేన్నీ వదిలిపెట్ట బుద్ధి కాదు. ఏది పుస్తకంలో చేర్చాలో, వేటిని వదిలెయ్యాలో విభజించడం పెద్ద పని.

నా పుస్తకం ప్రాథమికంగా చరిత్ర, విశ్లేషణ కలగలిసినది. అందువల్ల ప్రస్తుత చర్చలో భాగమైతే తప్ప, విమర్శలను వదిలెయ్యాలనుకున్నాను. నా వాదన ప్రవాహానికి అడ్డం పడే అభిప్రాయాలను ఫుట్ నోట్సుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మొత్తం కథ రెండు భాగాలుగా సాగుతుంది. ఒకటి కథనంలో, రెండోది ఫుట్ నోట్సులో. ఇలా ఆలోచించుకున్నాక రాత పని మొదలుపెట్టాను. ఉదయం పదింటికి కూర్చుని భోజన విరామం దాకా రాసేవాణ్ని. కొద్దిపాటి విశ్రాంతి తర్వాత మళ్లీ మూడింటి నుంచి ఆరు గంటల వరకూ రాసుకునేవాణ్ని. వారాంతాలు కుటుంబానికి సమయం కేటాయించేవాణ్ని. ఆరు నెలల కష్టం తర్వాత రాత ప్రతి సిద్ధమయింది. ఇక టైపింగుకు ఇవ్వాలి.

రాతప్రతి సిద్ధమవుతూ ఉన్నప్పుడే నేను ఐ.ఐ.పి.ఎ. డైరెక్టర్ మీనన్ గారిని కలిశాను. తర్వాతేం చెయ్యాలన్నదానిగురించి వారి అభిప్రాయం కనుక్కోవాలని నా ఉద్దేశం. ఆయన నా ప్రాజెక్టు అనుకున్నట్టుగా చక్కగా పూర్తయినందుకు సంతోషం తెలియజేశారు. ప్రచురణకు ముందే పుస్తకాన్ని ముగ్గురు రిటైర్డ్ ఉన్నతాధికారులకు పంపి వారి అభిప్రాయాలు తెలుసుకోమన్నారు. ఈ సబ్జెక్టులో నిపుణులు ఐ.ఐ.పి.ఎ. లో లేరు కనుక బయటవారికి పంపాలనుకున్నాం. ఈ పద్ధతి నాకు సబబుగా తోచి వెంటనే అంగీకరించాను. నా ఆలోచనా ధోరణి ఎలా ఉందో, పాఠకుల సమ్మతి ఎంత వరకు లభిస్తుందో తెలియడానికి ఇది మంచి మార్గం అనిపించింది. ఉల్లాసంగా నా ఆఫీసుకొచ్చి టైపింగ్ పని చేయించాలనుకున్నా.

కొద్దిరోజుల తర్వాత మీనన్ నన్ను తన ఆఫీసుకు పిలిచారు. ఆయన దగ్గర ఒక ఆలోచన ఉంది, దాన్ని నాతో చర్చించాలనుకున్నారు. అదేంటంటే – నేను ఐ.ఐ.పి.ఎ.లో మరో ఏడాది పనిచెయ్యాలి, సీనియర్ ఫెలోగా వచ్చేదానికి రెట్టింపు జీతం వస్తుంది, దానికోసం నేను కొత్త కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పేరు మీద ఓ పుస్తకం రాయాలి. ఈ ప్రతిపాదన గురించి సమయం తీసుకుని ఆలోచించుకుని చెప్పమన్నారు.

నా అభిప్రాయం చెప్పడానికి వ్యవధి ఎందుకు? మంచోచెడో నా కాళ్లమీద నేను నిల్చోవాలనుకున్నాను. ఇటువంటి అనామక రాతలు (ఘోస్ట్ రైటింగ్) రాయదలచుకోలేదు. అప్పటికే ఓ ప్రచురణకర్త గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పబ్లిక్ ఫైనాన్స్ మీద ఓ పుస్తకం రాయమని ప్రతిపాదించారు. అచ్చులో ఎన్ని పేజీలు వస్తే అంత పారితోషికం. రచయితగా అనుభవమున్న ఒక ప్రొఫెసర్ పేరు కనిపిస్తుంది. నా లోపలి రైతు బుద్ధి నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. రైతు ప్రతిరోజూ ప్రకృతితో పోరాడుతాడు. దాన్ని తనకు అనుకూలంగా మార్చే శక్తి లేకపినా, పంట వెయ్యడం మానడం. కావలసినప్పుడు వాన పడకపోవచ్చు, అక్కర్లేనప్పుడు ఎక్కువ పడొచ్చు, చీడపీడల బాధ ఉండొచ్చు. అయినా తాను చెయ్యగలిగినంతా చేసి అదృష్టాన్ని నమ్ముకుంటాడు. ప్రకృతి సహకరించకపోతే పరాజయం పాలవచ్చుగాని ఎప్పటికీ తరగని ఆశావహ దృక్పథంతో ఉంటాడు. సానుకూల దృక్పథం, నమ్మకం ఈ రెండూ రైతు జీవితాన్ని నడిపిస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిందీ అదే. కర్మ చెయ్యడం వరకే మన విధి. ఫలితాన్ని ఆశించడం కూడదు. దీన్ని భారతీయులంతా నమ్ముతారు, అందునా వ్యవసాయదారులకు ఇంకా బాగా పాటిస్తారు.

ఇది నా రక్తంలోనే ఉంది, అందుకే మీనన్ ప్రతిపాదనకు నేను వ్యతిరేకమని చెప్పేశాను. డబ్బు నా ఆలోచనను మార్చలేదని స్పష్టం చేశాను. నానుంచి ఈ తరహా ప్రతిస్పందనను ఆయన ఊహించలేదు.

‘మళ్లీ ఒకసారి ఆలోచిస్తారా’ అని అడిగారు.

‘అదేమీ అవసరం లేదు, నా ప్రస్తుత పుస్తకాన్ని ఎవరెవరికి పంపమంటారో చెప్పండి’ అని అభ్యర్థించాను.

‘చెప్తాను, మీరు కొద్దిరోజుల తర్వాత మా ఇంటికి రండి’ అన్నారు. నేను వెళ్లినా ఆయనేమీ చెప్పలేదు. మరోవైపు నా ఫెలోషిప్ కాలవ్యవధి పూర్తి కావొస్తోంది. ఇంకే ప్రత్యామ్నాయం లేనందున నేను ఆర్థికశాఖకు తిరిగి వెళ్లిపోయి భవిష్యత్తు కార్యాచరణ ఆలోచించుకోవాలనుకున్నాను.

అనుకున్నట్టే డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ కు తిరిగివెళ్లిపోయాను. కాని అక్కడ నన్ను చేర్చుకునేందుకు తగిన ఖాళీ లేదు. దాంతో నన్ను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లో – ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (ఎయిడ్) సెక్షన్ హెడ్డుగా వేశారు. ఇండియా పట్ల అమెరికా దృక్పథం మారుతున్న తరుణమది. అక్కడి పగ్గాలు రిపబ్లికన్స్ నుంచి డెమోక్రాట్లకు మారాయి. కెనెడీ అధ్యక్షుడు అయ్యారు. వాళ్లు విదేశాలకు చేసే సాయం ఎంతో, ఎవరికో పునరాలోచన చేస్తూ ఉన్నారు. దానికి ఇండియాలో అమెరికా రాయబారి గాల్ బ్రెయిత్ దృక్పథాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆయనకు భారత్ అపరిచిత దేశమేమీ కాదు. అంతకుముందు రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పన సమయంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడకు వచ్చి వెళ్లినవారే.

కెనెడీ అధికారంలోకి రాకముందు మూడు ఏజెన్సీలు మనకు సాయం అందించేవి. డెవలప్ మెంట్ లోన్ ఫండ్ (డి.ఎల్.ఎఫ్) వివిధ ప్రాజెక్టులకు రుణాలిచ్చేది. పి.ఎల్.480 సరుకులు (అందులో పొగాకు కూడా ఉండేది) అందించేది. టెక్నికల్ కోపరేషన్ మిషన్ (టి.సి.ఎమ్) సాంకేతిక అంశాల్లో సాయం చేసేది. తర్వాత ఇవి మూడూ కలిసిపోయి ‘ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్’ అనే పేరున ఒకే సంస్థగా రూపుదిద్దుకున్నాయి. ఇండియాలో ఈ సంస్థకు టైలర్ వుడ్ అధికారిగా ఉండేవాడు. వృత్తిపరంగా అతను ఇంగ్లండ్ అటార్నీ. మర్యాదస్తుడు, యు.ఎస్. ఎంబసీలో ఆర్థికమంత్రిగా పనిచేసేవాడు.

ఈ మార్పులకు అనుగుణంగా భారత్ కూడ తన ధోరణి మార్చుకుంది. ఆర్థిక వ్యవహారాలకు ప్రత్యేకంగా వాషింగ్టన్ లో కాన్సుల్ జనరల్ నియమించింది. వారికి రాయబారి హోదా ఉంటుంది. ఆయన ఎయిడ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తాడు. భారతీయ పరిస్థితి ప్రెస్ లో సరిగ్గా ప్రతిఫలించేలా చూడటం, కాంగ్రెస్, సెనేట్ సభ్యుల్లో, పాశ్చాత్య మేధావుల్లో భారత్ పట్ల సరైన అభిప్రాయాలు చలామణీ అయ్యేలా చూడటం వంటివి ఆయన విధులు. ఆయన ప్రయత్నాల వల్లనే జాక్సన్ సతీమణి బార్బరా వార్డ్ (ఆర్థికవేత్త) మన దేశాన్ని సందర్శించి ‘ఇండియా అండ్ ద వెస్ట్’ అనే పుస్తకాన్ని రాశారు. దాన్ని మన ప్రభుత్వ ప్రచురణల విభాగం ప్రచురించింది. వీటన్నిటి ఫలితంగా ఇక్కడి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కొన్ని మార్పులు వచ్చాయి. పైన చెప్పిన మూడు కార్యక్రమాలకు మూడు సెక్షన్లు కొనసాగినా, వాటి ఆఫీసు పార్లమెంటు స్ట్రీట్ లో ఉండేది కనుక నార్త్ బ్లాక్ లో ఉండే గందరగోళం లేకుండా ఉండేది.

నాకు కావలసింది నా పుస్తకం ప్రచురణ కావడం. మీనన్ ఇంటికి ఎన్నిసార్లు వెళ్లినా పని కాలేదు. ‘ఇంకా పరిశీలనలో ఉంది’ అన్నదే ఆయన సమాధానం. దాంతో ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాను. ఒక చాప్టర్ లోని కొన్ని అంశాలతో ఒక ఆర్టికల్ రూపొందించి ‘ద ఎకనామిక్ వీక్లీ’ పత్రికకు పంపాను. (తర్వాత ఆ పత్రికే ఎకనామిక్, పొలిటికల్ వీక్లీ అయింది) బొంబాయి నుంచి ప్రచురితం అయ్యే ఆ పత్రికకు ఢిల్లీ మేధావుల్లో మంచి పేరుండేది. నేను పంపిన ఆర్టికల్ చూసి ఆ పత్రికవారు ఏమంటారో అని ఆలోచించేలోపే- రెండు వారాల్లో అది ప్రచురితమైపోయింది, వారు నాకు పాతిక రూపాయల పారితోషికం పంపారు! రచన కోసం అందిన తొలి పారితోషికం అది. (ఆ తర్వాత నేను ఎప్పుడూ తీసుకోలేదు) అది నాలో ఉత్సాహాన్ని నింపింది. ధైర్యం చేసి అలైడ్ పబ్లిషర్స్ అనే సంస్థ దగ్గరకు వెళ్లి నా పుస్తక ప్రచురణ గురించి సంప్రదించాను. మొదట ఫోన్ చేసి, అపాయింట్మెంట్ నిర్ణయించుకుని బౌండ్ కాపీ పట్టుకుని వెళ్లాను.

జీవితంలో అనుకోనిది జరిగే క్షణాలు కొన్నే ఉంటాయి. అవి మన జీవితాలను మలుపు తిప్పే బంగారు క్షణాలు. అవి అరుదుగా సంభవిస్తాయి. అలైడ్ పబ్లిషర్స్ ఎడిటర్ అబ్బూరి వరద రాజేశ్వరరావు. సుప్రసిద్ధ తెలుగు కవి. అంతకు ముందు ఆయన పేరు విన్నానుగాని ఆయన రచనలేవీ చదవలేదు. వారు ఆంధ్రా యూనివర్సిటీలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు లైబ్రేరియన్ గా పనిచేసిన అబ్బూరి రామకృష్ణారావుగారి అబ్బాయి. రాజేశ్వర్రావుగారి భార్య ఛాయాదేవి అప్పటికి ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థలో లైబ్రేరియన్ గా పనిచేసేవారు. కథా రచయిత్రిగా మంచి పేరున్న మహిళ ఆమె. వాళ్లిద్దరూ కలిసి ‘కవితా’ అనే త్రైమాసిక పత్రికను తీసుకొచ్చేవారు.

మామధ్య పరిచయాలయ్యాక కొంత చర్చ జరిగింది. రాజేశ్వర్రావు నా పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రచురణ పద్ధతి ఏమిటో వివరించారు. తమ సంస్థ దాన్ని ప్రచురిస్తుందని చెప్పారు. విదేశీ ప్రచురణ హక్కుల కోసం అలెన్ అండ్ అన్విన్ అనే సంస్థతో మాట్లాడతానన్నారు. అది బ్రిటన్ లో ప్రముఖ సంస్థ, బెర్ట్రండ్ రసెల్, ఎస్. రాధాకృష్ణన్, ఆర్థికవేత్త జె.ఇ. మీడే వంటివారి పుస్తకాలను ప్రచురించింది. ఏదైనా ఫైనల్ కబురు కొద్ది వారాల్లో తెలిసిపోతుందన్నారు రాజేశ్వర్రావు. నా పుస్తకానికి మార్కెట్ ఉందని, అది ప్రచురణకు నోచుకోబోతోందని, వెలుగు చూడబోతోందని నాకు సంతోషంగా అనిపించింది. అనుకున్నట్లుగానే అలెన్ అండ్ అన్విన్ వారి సమాధానం ఓ నెలలోపు వచ్చేసింది. వారు బ్రిటన్ లో ప్రచురించేట్టు, ఇండియాలో పుస్తకాన్ని అలైడ్ పబ్లిషర్స్ ప్రచురించేట్టు ఒప్పందం కుదిరింది.

పుస్తక ప్రచురణలో తర్వాత అడుగులేమిటో ఆయన నాకు బోధపరిచారు. రాతప్రతిని చదివి ఇంగ్లిష్ సరిగా ఉందోలేదో ఒకరు చూస్తారు. సాధారణంగా టెక్నికల్ రైటర్స్ తాము రాసింది బాగుంది, అందరికీ అర్థమవుతుంది అనుకుంటారుగాని అది నిజం కాదు. దాన్ని మరొకరు శ్రద్ధగా చదివినప్పుడే లోపాలు బయటపడతాయి. ఆ విషయంలో ఎడిటర్లకు, రచయితలకు అనేక చర్చలు, వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. వారు వేసే ప్రశ్నలు రచయితలను చిరాకు పెడుతుంటాయి. వీళ్ల సమాధానాలు వాళ్లకు రుచించవు. ఈ ప్రహసనం నాకూ తప్పలేదు. అయినా ఎడిటర్ మన రచనకు మెరుగు పెడుతున్నారన్న భావనతో లొంగేను. ఇది తొలి అడుగు. తర్వాత కాపీ ఎడిటర్ కు పంపుతారు. వారు విరామచిహ్నాలు, శైలి వంటివి పరిశీలిస్తారు. వారి పని చాలా సాధారణమైనదని అనిపిస్తుందిగాని పుస్తకం ఒక పద్ధతిగా నాణ్యంగా రావడానికి అదే పునాది. రచయిత చాలా ఓర్పుగా ఉండాలని, ఎడిటర్ తో సహకరించాలని నాకీ అనుభవం నేర్పింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రాజేశ్వర్రావు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆ దంపతులు మాకు ఆప్తమిత్రులయ్యారు. మా కుటుంబాల మధ్య స్నేహం తర్వాత ఏడేళ్లకు మేం ఇండియా వదిలి వెళ్లేవరకు కొనసాగింది. తర్వాత వారు కూడా ఢిల్లీ వదిలి హైదరాబాదుకు చేరి దాన్నే తమ కార్యస్థానం చేసుకున్నారు. తెలుగు కవిత్వానికి తరగని సేవ చేశారు. అబ్బూరి రాజేశ్వర్రావు, ఛాయాదేవి దంపతులకు సంతానం లేరు. తమ సమీప బంధువులకు చాలా సాయం చేసేవారు. వారి పరిచయం నా జీవితంలో మరుపురాని అధ్యాయం.

కాపీ ఎడిటింగ్ పని సాగుతుండగా నాకో విషయం తెలిసింది. అదేమంటే – ప్రభుత్వ ఉద్యోగంలో, అందునా జూనియర్ ను కనుక నేను పుస్తక ప్రచురణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనేది. అలాగే నా రచనలో కోట్ చేసిన రచయితలు, పబ్లిషర్ల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవాలి. ఈ రెండో పని సులువుగానే అయిపోయింది. దాదాపు అందరూ అంగీకరించారు. ఒక ప్రచురణసంస్థ మూతపడింది, వారెక్కడుంటారో తెలియలేదు అయినా ఆ సంస్థ అటార్నీలు అంగీకారం ఇచ్చేశారు.

ప్రభుత్వ అనుమతి సంపాదించడం మామూలుగానైతే ఎంతో సరళంగా అయిపోవాల్సినదే. కాని నా పుస్తకం విషయంలో అది ఎంతో సంక్లిష్టమూ ఆందోళనకరం కూడా అయి కూచుంది. నేను రెండు రకాల అనుమతులు సంపాదించాలి. మొదటిది – నా పుస్తకంలో ప్రభుత్వ రహస్యాలేవీ బహిర్గతం కాలేదని మా మంత్రిత్వశాఖ నిర్ధారిస్తూ అనుమతినివ్వాలి. రెండోది ఒక నిబంధన ఉంది. అదేమంటే సాహిత్య రచనలు తప్ప, మరే ఇతర అంశాల మీదనైనా, ప్రభుత్వోద్యోగులు రాసిన పుస్తకాల మీద రాయల్టీ ప్రభుత్వానికి చెందుతుంది, ఏదైనా మినహాయింపు ఉంటే తప్ప. ప్రభుత్వ ఉద్యోగి అంటే అతని 24గంటలూ ప్రభుత్వానికే చెందుతాయి. అందువల్ల అతని పని మీద వారికే హక్కులుంటాయి. అలాగే మరణశిక్ష పడినవారు కూడ ఏదైనా పుస్తకం రాస్తే వారి మరణానంతరం ఆ పుస్తకం మీద రాయల్టీస్ ప్రభుత్వానికే చెందుతాయి. ఇంత కఠినమైన నిబంధనలు ఉండటమైతే ఉన్నాయిగాని, అవి ఎవరినీ ఆపిన దాఖలాల్లేవు.

నేను ఒక రాత ప్రతిని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పాలనాపరమైన అనుమతుల కోసం పంపాను. రెండువారాల తర్వాత అడిగితే అసలు ఫైలే సబ్మిట్ కాలేదన్నారు. దీనికి ముందు ఇట్లా జరిగిన దాఖలాలు ఉదాహరణలు లేవుగనక దీన్నేం చెయ్యాలో తెలియడం లేదన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఎవరైనా పుస్తకాలు రాశారేమోగాని, స్వాతంత్య్రం తర్వాత ఎవరూ రాయలేదన్నారు. ఎంతో ప్రయత్నిస్తే అప్పుడు ఆ ఫైలు నెమ్మదిగా పైకి కదిలింది. ముందు జాగ్రత్తగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజరుకు నివేదించాలనే రాశారు అధికారులందరూ. దాంతో ఆయన నిర్ణయం కీలకమైంది. ఆయనేమో ‘పుస్తకానికి అనుమతి ఇవ్వొచ్చుగాని, తాను బాధ్యత వహిస్తున్న ఎకనామిక్ డివిజన్ రాతప్రతిని సమీక్షించడం లేదు’ అంటూ కామెంట్ రాశారు. పుస్తకంలో విషయానికి రచయిత మాత్రమే బాధ్యుడని, అలా అయితేనే అనుమతి సాధ్యమని తేల్చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కు సంబంధించి అది తొలి విజయమని చెప్పుకోవచ్చు.

తర్వాత అంకం – రాయల్టీస్ రచయితకు చెందేట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ ను సంప్రదించాలి. అది మళ్లీ నత్తనడకలే నడిచింది.

ఈలోగా రాజేశ్వర్రావు నాకో సూచన చేశారు. నా పుస్తకానికి నాటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ ముందుమాట రాస్తే బాగుంటుందని సూచించారు. దానివల్ల పుస్తకానికి కొంత వన్నె వస్తుందని, అమ్మకాలు పెరగడానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయం. మొరార్జీ దేశాయ్ మినిస్ట్రీ ప్రొసీడింగ్స్, కేబినెట, కాంగ్రెస్ పార్టీ పత్రాలు తప్ప వేరే ఏదీ చదివే అలవాటున్న వ్యక్తి కాదని వినికిడి. వార్షిక బడ్జెట్ ప్రసంగాలు తప్ప ఆయన పేరుమీద ప్రచురితమైన రాతలూ తక్కువే. చాల క్రమశిక్షణ, దృఢమైన వ్యక్తిత్వమున్న వ్యక్తి అని, హాస్యానికి తావులేదని పేరు ఆయనకు. మిగిలిన అమాత్యులు మెయింటెయిన్ చేసే పబ్లిక్ రిలేషన్స్ ధోరణి ఆయనలో లేదు. కనీసం కరచాలనాలకు కూడా ఆయన విముఖులు.

‘పుస్తకంలో సత్తా ఉంటే అది నిలబడుతుంది, లేదంటే లేదు. మంత్రివర్యుల ముందుమాటల నుంచి కాదుకదా’ అని నాకు అనిపించేది. కాని నా అభిప్రాయాలను లోపలే దాచుకుని ఒక ప్రయత్నం చేసి చూడాలనుకున్నాను. అంతకుముందు నేను ఆయనను ఒకసారి కలిశాను.

అమెరికా ప్రభుత్వం ఇచ్చే రుణాల విషయంలో ఒప్పందపత్రాల మీద సంతకాలు తీసుకోవడం, వాటిని ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆర్థికశాఖలో ఒక పెద్ద వేడుకలాగా జరిగే తతంగం. దానికి ఇరు ప్రభుత్వాల ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు వస్తారు. సభలో ముందు అమెరికా దౌత్యాధికారి (అప్పటికి గాల్ బ్రెయిత్) మాట్లాడారు. తర్వాత మన ఎకనామిక్ సెక్రటరీ స్పందించారు. ఇదంతా ఆర్థికమంత్రి సమక్షంలో జరిగింది. నేను వెళ్లి ఆ ఒప్పంద పత్రాలను అటు దౌత్యాధికారికీ ఇటు ఎకనామిక్ సెక్రటరీకీ అందించాను. వాళ్లిద్దరూ సంతకాలు చేశారు, అక్కడితో ఆ వేడుక అయిపోయినట్టే. తర్వాత కొంచెం టీ, వేయించిన జీడిపప్పు ఇచ్చారు హాజరయినవారికి. ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ అవి తీసుకోరుగనక ఆయనకు నారింజరసం ఇచ్చారు. అదే తొలిసారి ఆయనను నేను కలవడం. కాని అటువంటి సందర్భాల్లో కలిస్తే ఆయన ఆలోచన, మనసు నాకేం అర్థమవుతాయి? కాని మినిస్ట్రీలోని ఎంతోమంది మధ్యస్థాయి అధికారుల కన్న, ఆయనను కలవడమే సులువని మాత్రం అర్థమయింది.

ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ గారిని కలుద్దామని సంకల్పించాను. మహా అయితే ఏమవుతుంది? నా విజ్ఞప్తిని తిరస్కరిస్తారు, అంతేకదా? ఆయన ఆఫీసును సంప్రదించేముందు నేనొక పెద్ద ఉత్తరం తయారుచేశాను. నేను ఆయనను ఎందుకు కలవాలనుకుంటున్నాను, ఏం పరిశోధన చేశాను, పుస్తకంలో ఏం రాశాను వంటివన్నీ అందులో విపులంగా రాశాను. తర్వాత ఆయన ప్రైవేటు సెక్రటరీ వై.వి.టోంపేకు అపాయింట్మెంట్ కావాలంటూ ఫోన్ చేశాను.

మినిస్టరుగారు బిజీగా ఉన్నారనో మరోటో చెబుతారని, ఒక ‘నో’ వినడానికి మనసు సిద్ధపడే ఉంది. కాని టోంపే జవాబు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

‘మీరు ఎప్పుడు కలవాలనుకుంటున్నారు?’ అని ఆయన అడిగారు.

‘వీలయినంత త్వరగా’ జవాబిచ్చాన్నేను.

‘అయితే ఇప్పుడే రండి. ఆయన ఫ్రీగా ఉన్నారు. ఓ అరగంట తర్వాత వెళ్లిపోతారు’ అన్నారు టోంపే.

నేను ఆయన ఆఫీసుకు పరుగెత్తాను. ‘పెద్దాయన్ని కలవాలనుకుంటున్నారా, మంచిదే. ఆయన మీకోసం వెయిట్ చేస్తున్నారు’ అన్నారు టోంపే నన్ను చూడగానే. నేను తలుపు తీసి ఆర్థికమంత్రి గదిలోకి ప్రవేశించాను. పెద్ద గదిలో ఒక మూలన బల్ల దగ్గర ఆయన కూర్చుని ఉన్నారు. ఇంకెవ్వరూ లేరు. ఎప్పుడూ పెట్టుకునే గాంధీ టోపీ పెట్టుకునే ఉన్నారు. తలుపుకు, ఆయన బల్లకూ పదిహేను అడుగుల దూరం ఉంటుంది. అంతసేపు ఆయన నావైపు ఎంత తీక్షణంగా చూశారంటే నేను డెస్క్ వరకూ వెళ్లకముందే స్పృహ తప్పి పడిపోతానేమో అనిపించింది. ఆయన కూర్చోమన్నారు. అప్పటికే నా గొంతు తడారిపోయి మాట పెగల్లేదు. అటువంటి స్థితి నుంచి ధైర్యం కూడదీసుకున్నాను.

సందేహిస్తూనే, నేనెందుకొచ్చానో తెలియజేశాను, అంతకు ముందే నేను తయారుచేసిన ఉత్తరం ఆయన చేతికి అందించాను. అది చదివితే అంతా చక్కగా విశదమవుతుందని విన్నవించాను. ఆయన చూపు ఎటువంటిదంటే అది ఎవరినైనా నోరు పెగలనియ్యకుండా చేసేస్తుంది. అంత తీక్షణమైన చూపు. అల్లరి పిల్లల మీదకు బెత్తం పుచ్చుకుని వచ్చే ఒక దృఢమైన హైస్కూలు టీచర్ పదును ఆ చూపులో ఉంటుంది.

కాని ఆయన చాలా మెత్తని మనసున్నవారు, నా ఉత్తరం సాంతం చదివారు, ఒక యువరచయితను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నా విజ్ఞప్తిని సంతోషంగా మన్నిస్తున్నానని చెప్పారు. కాని పుస్తకం పెద్దది, సాంతం చదివే వ్యవధి లేదు, ఎందుకంటే అప్పటికే ఎన్నికలు దగ్గరపడ్డాయి. అందువల్ల ప్రతి చాప్టరుకూ ఓ సారాంశం తయారుచేసి ఇంటికొచ్చి ఇవ్వమన్నారు.

మా సమావేశం మొత్తం సమయం పది నిమిషాలే. కాని దాని ఫలితంతో నాకు చాలా సంతోషం కలిగింది.

నా పుస్తకంలో మొత్తం పదిహేను చాప్టర్లున్నాయి. వాటి సారాంశాలు రాసి టైప్ చేయించడానికి నాకు రెండు వారాలు పట్టింది. అవి సిద్ధమయ్యాక నేను వారింటికి వెళ్లాను. సాధారణంగా రకరకాల ప్రయోజనాల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే మనుషులెవరూ నాకు అక్కడ కనిపించలేదు. డ్రాయింగ్ రూమ్ లో ఆయన ఒక్కరే ఉన్నారు. కొందరు అమాత్యుల ఇళ్లలాగా కాకుండా ఆయన ఇల్లు చాలా నిరాడంబరంగా ఉంది. నేనిచ్చిన కాగితాలు ఆయన తీసుకున్నారు. ఎన్నికల తర్వాత పుస్తకానికి ముందుమాట కోసం కలవమని చెప్పారు.

ఈలోగా నా పుస్తకం గురించి మరో ప్రహసనం సమాంతరంగా సాగుతోందని నాకూ తెలియదు, ఆయనకూ తెలియదు ఆ సమయానికి. అసలు ఈ ప్రయత్నానికి అనుమతి ఎలా ఇస్తారంటూ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ లో పెద్ద దుమారమే రేగిందట. ఇక రాయల్టీల సంగతి చెప్పనే అక్కర్లేదు. అప్పటికి ఆ శాఖలో దక్షిణాది హవా కొంత నడుస్తోంది. వింటే విచిత్రంగా అనిపించవచ్చుగాని, దక్షిణ భారతీయులు అందునా తమిళనాడులోని ఒక సామాజిక వర్గంవారికే ఆర్థిక అంశాలు అర్థమవుతాయని, వారి నైపుణ్యం ఈ శాఖ నిర్వహణకు కీలకమని నమ్మేవారు. అది వారికి లాభదాయకం కనుక, ఆ ప్రచారానికి వారూ అడ్డుచెప్పేవారు కాదు, కొనసాగనిచ్చేవారు. అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో వారిదే పైచెయ్యిగా ఉండేది. వారి దృష్టిని ఆకర్షించడానికి, లేదా వికర్షించడానికి – రెంటికీ అవకాశం రానంత జూనియర్ని నేను. ఆర్థిక అంశాల మీద పుస్తకం రాయదగినది వాళ్లొక్కరే. ‘పట్టుమని మూడేళ్ల అనుభవం లేని వీడెవడు పుస్తకం రాయడానికి’ అని దుమారం. ‘ఎవడు వాడు, ఎచటివాడు….’ అన్నట్టుగా డిపార్ట్ మెంటులో గోల మొదలయ్యింది. పుస్తకం ప్రచురణ అయి వస్తే ఓ శత్రు శిబిరం వాళ్లను ఢీకొట్టినట్టే.

ఫలితం – ఆ మంత్రిత్వశాఖ సెక్రటరీగా ఉన్న ఓ సీనియర్ ఐ.సి.ఎస్. అధికారి ఆర్థికమంత్రికి ఓ నాలుగు పేజీల అర్జీ సమర్పించారు. నా పుస్తక ప్రచురణకు అంతకుముందు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని దాని సారాంశం. సాధారణంగా ఆ స్థాయి ఉన్నతాధికారి స్వయంగా అంత పెద్ద అర్జీ రాస్తే అది వెంటనే అమాత్యుల ఆమోదం పొందుతుంది.

కాని మొరార్జీ దేశాయ్ నా పుస్తకానికి ముందుమాట రాస్తానన్న వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నారు. అందువల్ల ఆయన ఆ ఫైలు మీద ఏమీ రాయలేదు. ‘ప్లీజ్ డిస్కస్’ అనే తన మాటను సెక్రటరీకి చెప్పించారు.

నేను మినిస్ట్రీ ఉద్యోగిని కనుక ఆ పుస్తకంలోని అంశాలను ఎవరైనా అధికారిక అంశాలుగానే చూస్తారని, ప్రభుత్వ ప్రచురణగానే భావిస్తారని మొదటి అభ్యంతరం. ఇతరులకు లభ్యం కాని రహస్య సమాచారాన్ని వాడుకున్నాను అనేది రెండో అభ్యంతరం. ఈ రెండింటివల్లా అనుమతి ఉపసంహరించుకోవాలని వారి వాదన.

అప్పుడే జరిగిన మరో ఉదంతంతో నా విషయాన్ని ముడిపెట్టి ఇంకా పెద్ద రాద్ధాంతం చేశారు ఉన్నతాధికారులు. అదేంటంటే, ప్లానింగ్ కమిషన్ కుసుమ్ నాయర్ అనే మహిళా జర్నలిస్టు, రచయిత్రిని ఇండియాలో కమ్యూనిటీ డెవలప్మెంట్ మీద పుస్తకం రాయమని పురమాయించింది. ప్రభుత్వం ఏడాదిపాటు ఆమెకు ఖర్చులిచ్చింది, వెళ్లిన ప్రతిచోటా రాజమర్యాదలు జరిగాయి. అంతా అయ్యాక ఆమె తన పుస్తకాన్ని ప్లానింగ్ కమిషన్ కు సమర్పించింది. అందులో కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి నాలుగు మంచి ముక్కలు లేవు సరికదా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ఘాటుగా విమర్శిస్తూ సాగిందా రచన. దాంతో దాన్ని ప్రచురించాలనే ఆలోచన అటకెక్కిపోయింది. కాని రచయిత్రి పట్టు విడవలేదు. ఇండియా, యు.కె.ల్లో ప్రచురణకు, విడుదలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ప్లానింగ్ కమిషన్ పెద్దలు కొందరు ప్రయత్నాలు చేశారు. కాని ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం రచయిత్రి తన పుస్తకాన్ని సొంతంగా ప్రచురించుకోవచ్చు. ఆమె దానిప్రకారం ముందుకెళ్లారు. ‘బ్లోజమ్స్ ఇన్ ద డస్ట్’ ఆ పుస్తకం పేరు. దానికి మంచి పేరొచ్చింది, విజయవంతమైంది. కాని ఆ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వమే నిధులు సమకూర్చిందన్నది ప్రెస్ లో వచ్చేవరకూ ఎవరికీ తెలియలేదు. తాను చేసినట్టు ఎక్కడా చెప్పవద్దని ప్లానింగ్ కమిషన్ కుసుమ్ నాయర్ ను వేడుకుంది.

ఇటువంటిదే మరో ఉదంతమూ జరిగింది.

ప్రఖ్యాత చలన చిత్ర దర్శకుడు సత్యజిత్ రే అపు ట్రైలజీ (మూడు వరుస చిత్రాల సమాహారం) మొదటిదాన్ని తీస్తున్నారు. సినిమా సగంలో ఉండగానే పెట్టుబడి అయిపోతే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సాయం అడిగారు. వాళ్లు నిధులిచ్చారు, అయితే టైటిల్స్ లో ప్రభుత్వం నిర్వహించే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి నాలుగు మంచిమాటలు చెప్పమన్నారు. నాకు గుర్తున్నంతవరకూ ‘పథేర్ పాంచాలి’ టైటిల్స్ లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఉంటుంది తప్ప వాళ్లడిగినవేం ఉండవు.

ఈ వివాదమంతా రేగిన తర్వాత, నా విషయానికి వస్తే, అప్పటికే ఆర్థికమంత్రి ప్రచురణకు అంగీకారం ఇచ్చేశారుగనక, కనీసం ముందుమాట రాయకుండా ఉండొచ్చునని భావించారు. ఆ విషయాన్ని నాకు తెలియజెయ్యమని సెక్రటరీకి చెప్పారు. కాని ఆయనకు నన్ను చూడటం ఇష్టం లేక సీనియర్ జాయింట్ సెక్రటరీ ఒకాయనకు చెప్పారు.

మొత్తానికి నాకా విషయం తెలిశాక, నా పుస్తకంలో ప్రభుత్వ రహస్యాలేమీ బహిర్గత పరచలేదని నిరూపించడానికి నేను సిద్ధమయ్యాను. నేను వాడుకున్న మెటీరియల్లో చాలాభాగం ఆలిండియా కాంగ్రెస్ పార్టీ రూపొందించి ప్రచురించిన పత్రాల్లో ఉన్నదే. అవన్నీ బహిరంగంగా అందుబాటులో ఉన్నవే. మంత్రిత్వ శాఖవారికీ విషయం తెలియకపోవడమే ఆశ్చర్యం.

ఏదైతేనేం, పుస్తక ప్రచురణకు అనుమతి ఉంది, అంతే చాలు అనిపించింది. కాని ఇప్పుడు ఆలోచిస్తే,‘గోటితో పోయేదానికి గొడ్డలి దాకా’ వచ్చినట్టు, ఎంతో మామూలుగా, సాఫీగా సాగిపోవలసిన అనుమతి విషయం సంక్లిష్టమై, నలుగురి నోళ్లలో నాని మంత్రిగారి నిర్ణయం వరకూ వెళ్లవలసి వచ్చింది. దీనితో నాకు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, దానికంటూ ఓ సొంత ఎజెండా ఎలా ఉంటుంది, తనదైన సొంత ప్రపంచంలో అదెలా బతుకుతూ ఉంటుంది, తన అవసరాలను బట్టి సాయాలు చెయ్యడం లేదా ప్రతిబంధకాలు సృష్టించడం వంటి పనులు ఎలా చెయ్యగలదు – వంటి విషయాలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి. అటువంటి క్లిష్టసమయంలో నన్ను కాపాడినందుకు, నా పుస్తకం వెలుగు చూసేలా చేసినందుకు కృతజ్ఞుడిని. విచిత్రమేమిటంటే, ఏ వర్గమైతే నా పుస్తకాన్ని అడ్డుకోవాలని రగడ చేశారో, అదే వర్గంలోని ఇద్దరు ఉన్నతాధికారులు తర్వాత నా ఉద్యోగ ఉన్నతికి తోడ్పడ్డారు!

ఇదంతా ఒక కొలిక్కి వచ్చాక నేను చివరిసారిగా ఐ.ఐ.పి.ఎ. డైరెక్టర్ మీనన్ దగ్గరకు వెళ్లాను. ఆయన తానింకా ఆలోచిస్తూనే ఉన్నానని, ఏ నిర్ణయమూ చెప్పలేనన్నారు. ఐఐపిఎ ప్రచురించని పక్షంలో నేను ప్రైవేటు ప్రచురణకర్తల దగ్గరకు వెళతానని చెప్పాను. ఆయనకు చాలా కోపం వచ్చింది.

‘మీరలా చేస్తే నేను కోర్టులో కేసు వెయ్యవలసి వస్తుంది’ అన్నారు.

కేవలం నైతికపరమైన ఒప్పందంతో మాత్రమే నేను ఆయనను అడుగుతున్నానని, నా పుస్తకాన్ని ఐఐపిఎ మాత్రమే ప్రచురించాలనే చట్టపరమైన ఒప్పందమేదీ లేదని నేను ఆయనకు గౌరవంగానే నచ్చజెప్పాను. తర్వాత అక్కణ్నుంచి లేచి వచ్చేశాను. ముగ్గురు ప్రొఫెసర్లకు పంపాలన్న ఆయన సలహాను ఆయనే ఎందుకు పాటించలేదో నాకు తెలియదు.

రెండేళ్ల తర్వాత ఒక చలికాలపు ఉదయం ఢిల్లీ పాలమ్ ఎయిర్పోర్టులో మేం ఎదురుపడ్డాం. పుస్తక ప్రచురణ పూర్తయినందుకు, పుస్తకానికి ఇండియాలోనూ, విదేశాల్లోనూ మంచి రివ్యూలు వస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నేను కృతజ్ఞతలు తెలియజేశాను. తర్వాత మేం కలవలేదు.

*

1962లో చైనాతో యుద్ధం తర్వాత ఇండియాలో ఒక నీరస వాతావరణం అలముకుంది. వాళ్లు సంధి ప్రకటించడం వల్ల మనం రక్షింపబడ్డాం. దాంతో చాలా అవమానభారంతో ఉండేది దేశం. ఇటువంటి పెద్ద సంఘటనలు నావంటి చిరు మనుషుల మీద మామూలుగానైతే ప్రభావం చూపవు కాని దాని వెంటనే అత్యవసర పరిస్థితి వచ్చింది. ప్రభుత్వోద్యోగులు ప్రతిరోజూ అరగంట అధికంగా పనిచెయ్యవలసి వచ్చేది. దాంతో నా పుస్తకం పని వెనక్కు జరిగిందే అని నా బాధ.

పుస్తకం అచ్చు కావలసినది న్యూ ఏజ్ ప్రింటింగ్ ప్రెస్ లో. అది అధికారికంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వారిది. సోవియట్ యూనియన్ దయ వలన సమకూరిన చాలా మంచి యంత్ర సామగ్రి, సామర్థ్యం ఉన్న ప్రెస్ అది. పార్టీ సాహిత్యం అచ్చు వెయ్యడం వారి మౌలిక విధి. కాని అప్పుడప్పుడు బయట పనులు కూడా తీసుకునేది. ప్రచురణకర్తలతో స్నేహంగా ఉండేది, నిబంధనలు సరళంగా ఉండేవి, గ్యాలీ దశలో సైతం మార్పులకు అనుమతించేది. ఇప్పట్లాగా ప్రతిదీ కంప్యూటర్ తో అనుసంధానమై ఉండేది కాదు కనక అచ్చు పని చాలా మానవ శ్రమతో కూడుకున్నది.

అప్పట్లో ఆ ప్రెస్ ను డి.పి.సిన్హా అనే బెంగాలీ వ్యక్తి నిర్వహించేవారు. ఆయన చెయిన్ స్మోకర్. కాని ప్రెస్ లోఅందరికీ గౌరవనీయులు. నాకిది తొలి ప్రయత్నమని ఆయన తెలుసుకున్నారు. ప్రతి దశలోనూ తాను చెయ్యదగిన సాయమంతా చేస్తానని వాగ్దానం చేశారు. వారానికి రెండుసార్లు నేను ప్రెస్ కు వెళ్లి గంట, రెండు గంటలు కూర్చుని ప్రూఫ్ రీడింగ్ వంటివి చేసుకునేవాణ్ని. నాకు సాయపడేందుకు పబ్లిషర్ ఓ యువ అసిస్టెంటును ఇచ్చారు.

చైనా యుద్ధం సమయంలో ఢిల్లీలో కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. న్యూ ఏజ్ ప్రెస్ మొదటి అంతస్తులో కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ఉండేది. నిరసనల్లో భాగంగా ఆ భవనం మొత్తాన్ని తగలపెడతామని స్థానికులు బెదిరించేవారు. చైనాను సమర్థించడం ద్వారా భారత్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నడుచుకుంటోందని వారికి ఆగ్రహంగా ఉండేది. ఈ అంశం మీద అభిప్రాయభేదాల వల్లనే తర్వాత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. యుద్ధంలో చైనాను సమర్థించిన పక్షం మార్క్సిస్ట్ పార్టీ అయింది.

ప్రెస్సును దాడుల నుంచి రక్షించేందుకు పోలీసులు యూనిఫాములోనూ, మామూలు దుస్తుల్లో కూడా గస్తీ తిరిగేవారు. వారికి నేను అనుమానాస్పదంగా అనిపించి నా రాకపోకల మీద నిఘా పెట్టారు. నేనెవరు, ఎందుకొచ్చి పోతున్నాను వంటివి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగినని తెలిశాక ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెప్పారు. వాళ్లు మా డిప్యుటీ సెక్రటరీని సంప్రదించారు. నేను ప్రెస్ కు వెళ్లి వచ్చేందుకు అనుమతి పొందినది ఆయన నుంచే కనుక ఆ నిఘా విషయం ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ తో ఆగిపోయింది. ఆయన చాలా మంచివారు, సమస్యను మొగ్గలోనే తుంచేశారు. నా వ్యక్తిత్వం, రాకపోకల ఆంతర్యం అన్నీ వాళ్లకు వివరంగా చెప్పారట. లేకపోతే అది పెద్ద సమస్య అయి కూర్చునేది. ఇదంతా కూడా నాకు కొన్నాళ్ల తర్వాత తెలిసింది. టీ కప్పులో తుఫాను అంటారే, అటువంటిదే అది. అయితే అది రావడమూ పోవడమూ కూడా నాకు తెలియలేదు.

చైనా యుద్ధం ముగిశాక, యుద్ధం గురించిన రచనలు పుంఖానుపుంఖాలుగా రావడం మొదలైంది. పాత్రికేయులు, మిలిటరీ కమాండర్లు, చైనా చెరకు చిక్కి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దయవల్ల తిరిగివచ్చినవారు – ఇలాంటివారు కొందరు తమ అనుభవాలను అక్షరబద్ధం చేశారు.

వీటిలో తొలి పుస్తకం రాసినది జి.ఎస్.భార్గవ అనే పాత్రికేయ మిత్రుడు. తెలుగువాడు. రెండో పుస్తక రచయిత బి.ఎమ్.కౌల్. యుద్ధం మొదటి దశలో సైన్యాన్ని నడిపిన కమాండింగ్ ఆఫీసర్. అనారోగ్యం పాలై తర్వాత ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో చేరాడు. ఆర్మీ నుంచి రాజీనామా చేసి తన కాలాన్ని మూడు భాగాలుగా పుస్తకం రాయడానికి వెచ్చించాడు. యుద్ధ సమయంలో తన జ్ఞాపకాలను గ్రంధస్థం చేశాడు. దానికి అబ్బూరి రాజేశ్వర్రావు ‘ద అన్ టోల్డ్ స్టోరీ’ అని పేరు పెట్టాడు. నా పుస్తకం ప్రచురించిన సంస్థ కౌల్ పుస్తకాన్నీ ప్రచురించింది. ఆ పుస్తకాన్ని స్వీకరించడం, ప్రచురణ – అన్నీ అత్యంత రహస్యంగా, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో సాగాయి.

అది రాతప్రతి దశలో ఉండగానే ఆ మూడు పుస్తకాల సెట్టు నాకొకటి ఇచ్చారు. ప్రభుత్వ రహస్యాల చట్టం ప్రకారం ఆ రచనలో ప్రభుత్వం చర్య తీసుకునే అంశాలేమైనా ఉన్నయో లేదో పరిశీలించడం నా పని. అటువంటివి చాలానే ఉన్నాయని నాకు అనిపించింది. ఆ విషయాన్నే ప్రచురణకర్తలకు తెలియజేశాను. అప్పుడు వాళ్లు దాన్ని కుదించి మూడు భాగాల నుంచి ఒక్క భాగానికి తీసుకొచ్చారు. అయినా అందులో తీవ్రమైన విషయాలు ఉండనే ఉన్నాయి.

మొత్తానికి దాన్ని రహస్యంగా అచ్చువేసి ఒక ఆదివారంనాడు విడుదల చేశారు. మర్నాడు వచ్చే దినపత్రికలు పుస్తకంలోని సంచలనాత్మక భాగాలను ఉటంకిస్తూ వార్తలు రాశాయి. అది గొప్ప సంచలనమైంది. ఆర్థికంగానూ విజయవంతమైంది. ఒక్క ఏడాదిలో లక్ష రూపాయలు రాయల్టీగా అందుకున్న తొలి భారతీయ రచయితగా బి.ఎమ్.కౌల్ చరిత్రలో నిలిచిపోయాడు.

ఆయనకు వచ్చిన డబ్బు, పేరు సంగతి ఎలా ఉన్నా, ఆ పుస్తకం వల్ల భారత ప్రతిష్ట మసకబారిపోయింది. శాసన నిర్మాణం, దానితో ముడిపడి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు అది పెద్ద మచ్చ తెచ్చి పెట్టింది. కొంతకాలంపాటు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు.

యుద్ధ సమయంలో చైనా ఆక్రమించినది చవిటి పర్రలని, గడ్డి కూడా మొలవని భూభాగమని, దానిగురించి పట్టుదల ఎందుకని ఒక వర్గం వాదించేది. మరో వర్గం మాత్రం చివరి రక్తపు చుక్కను ధారపోసి అయినా ఆ ప్రాంతాలను కాపాడుకోవలసిందే అని వాదించేవారు. దీనిలో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. చైనా దళాలను తరిమికొట్టాలనే నిర్ణయానికి వచ్చినతర్వాత కూడా మనవాళ్లు మన సైన్యబలం పట్ల అపరిమితమైన నమ్మకాన్ని, ఎదుటివారి బలాన్ని అంచనా వెయ్యడంలో అలసత్వాన్ని ప్రదర్శించారు. నైతికంగా అధికులమనుకునే మన ధోరణి ఈ నింపాదితనానికి కారణమైంది.

దీన్ని ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కనెమన్ (ఆయనకు 2002లో నోబెల్ ప్రైజ్ వచ్చింది) సరిగ్గా విశ్లేషించాడు. ‘ఇన్వెస్ట్ మెంట్ బిహేవియర్’ అనేది ఆయన సబ్జెక్టు. మన గర్వం, మనకే అంతా తెలుసుననే అహంకారం – ఇవి సరైన సమయాల్లో, సరైన రంగాల్లో పెట్టుబడులు పెట్టకుండా చేస్తాయి. దీన్ని ఆయన ‘ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్’ అని అభివర్ణించాడు. భారతీయ వ్యూహకర్తలు ఈ తరహా ధోరణులకు అతీతులు కాదు. అందువల్లనే చైనాతో యుద్ధానికి సరిగ్గా సన్నద్ధం కాలేదు.

పోరాడేందుకు తగిన మౌలిక సదుపాయాల్లేవు. సరఫరా వ్యవస్థ లేదు. మంచులో నిలబడి పోరాడాల్సిన సైనికులకు కనీసం ఉన్ని సాక్సులు కూడ లేవు. సివిల్ సర్వెంట్లు, మిలిటరీ అధికారులు సైనిక చర్యల గురించిన క్షేత్ర స్థాయి వాస్తవాలను రాజకీయ నేతలకు తెలియజెయ్యలేదు. దాంతో నష్టం తీవ్రంగా జరిగింది.

బి.ఎమ్.కౌల్ తన పుస్తకంలో ఇలాంటి ఎన్నో విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు.

విచిత్రమేమంటే, ఆ పుస్తకం వారి దృష్టిని ఆకట్టుకోలేదు. సైనిక చర్యలంటే అల్లాటప్పా రాజకీయ వాక్చాతుర్య ప్రదర్శన కాదు. ప్రతి అడుగుకూ ఒక ప్రణాళిక ఉండాలి, వ్యూహరచన పక్కాగా ఉండాలి, అనిశ్చిత పరిస్థితుల్ని ఊహించి , అవి ఎదురైతే ఎదుర్కోగలిగే ఒక సంసిద్ధత ఉండాలి. కాని మన ప్రభుత్వం సులువైన మార్గాలు అనుసరించడానికి ప్రయత్నించింది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా సునిశితమైన ఆత్మవిమర్శకు పూనుకోలేదు. ఆ క్రమంలో ప్రభుత్వ విశ్వసనీయత ఘోరంగా దెబ్బతింది. ప్రధానమంత్రి దార్శనికత ఒక అపజయంలోకి దారితీసింది. అంతర్జాతీయంగా ఆయన ప్రతిష్ట ముక్కలైపోయింది. జవహర్ లాల్ నెహ్రూ అనారోగ్య సమస్యలకు అదే మొదటి మెట్టు. క్రమంగా దానికి లొంగిపోయారు. ఆయన మరణించడానికి ముందు ఒక సమావేశం సందర్భంగా ఆయనను కలిశాను. ఆ వివరాలు వచ్చే చాప్టర్లో చెప్తాను.

*

నా పుస్తకం ‘కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్ పెండిచర్ ఇన్ ఇండియా’ 1963 మార్చిలో విడుదలైంది.

దానివల్ల నా పరిస్థితిలో పెద్ద మార్పులొస్తాయని నేనేం ఆశపెట్టుకోలేదు. వాస్తవానికి అప్పటిదాకా పడిన కష్టానికి అక్కడితో తెరపడుతుందని ఊపిరిపీల్చుకున్నాను. న్యూ ఏజ్ ప్రింటింగ్ ప్రెస్ వారు, అబ్బూరి రాజేశ్వర్రావు, ఆయన భార్య ఛాయాదేవిల సహకారమే ఆ పుస్తకం వెలుగుచూడటానికి కీలకం. ఛాయాదేవిగారు ఎంతో శ్రమించి అందులోని వ్యక్తులు, సబ్జెక్టుల ఇండెక్స్ తయారుచేశారు. అది ఆ పుస్తకం విలువను పెంచింది. అంతకన్న ఎవరి నుంచీ కోరదగినదేమీ ఉండదు.

విడుదల తర్వాత ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో ప్రముఖ పుస్తక దుకాణాల్లో ఆ పుస్తకాన్ని పెట్టారు. నేను గొప్పగా ఫీలయ్యాను. భార్య, పిల్లలను తీసుకుని ఆ దుకాణాలకు వెళ్లాను, వారికి నా పుస్తకాలను అక్కడ షెల్ఫుల్లో చూపించి మురిసిపోయాను.

రెండు నెలల తర్వాత మా అమ్మను చూడటానికి వెళ్లాను. నా పుస్తకాన్ని ఆమెకు అంకితం ఇచ్చానుగనక, ఒక కొత్తచీర, కొంత డబ్బు, కొబ్బరికాయ, పండ్లు పెట్టి వాటిమధ్య పుస్తకాన్ని పెట్టి ఆమెకు అందించాను. ఏదో పెద్ద కల నెరవేరిన సంతృప్తి నాకు కలిగింది. మా అమ్మకేమీ అర్థం కాలేదు. పుస్తకం ఏమిటో, దాన్ని ఒకరికి అంకితమివ్వడం అంటే ఏమిటో ఆమెకేమీ తెలియదు. నేను చెప్పడానికి ప్రయత్నించినా ఆమెకేమీ అర్థం కాలేదు. నన్ను చూశానన్నదే ఆవిడ సంతోషానికి మూలం. అంతే.

నా పుస్తకం వ్యాపారపరంగానూ విజయవంతమైంది. మొదటి ఎడిషన్ నాలుగు నెలల్లో అమ్ముడుపోయింది. విదేశాల్లో మంచి అమ్మకాలు జరిగాయి. రెండో ఎడిషన్ కూడా వెంటనే వచ్చింది.

(పాల్ ఆపిల్ బీ 1961లో ఐ.ఐ.పి.ఎ.కు వచ్చినప్పుడు నేను కలిశాను.)

 

 

 

అరిగపూడి ప్రేమ్ చంద్

అరిగపూడి ప్రేమ్ చంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు