యామినీ కవితలు రెండు

1

మిణుగురు పురుగు

మనసు ప్రమేయం
ఏ మాత్రం లేని యాంత్రిక చర్యలు రంగులద్దుకుని
వాకిట ముందు చేరి నవ్వుతుంటాయ్.
వీధి చివర దీపపు వెలుగు మిణుగురు పురుగు లాంటి కాంతై
వాకిట ముందున్న ఆకారం మీద ప్రతిఫలించగానే..
ఎవరో తొడిగిన చెప్పులు గుమ్మానికెదురు నిలబడతాయ్..
ఆత్రం అంచున నిలబడి
అవకాశాల వేటలో మునిగిన పరాయితనం కాస్తా..
గుమ్మంలోంచీ పేగులు మెలిపెడుతున్న ఆకలిని నెట్టుకుంటూ..
గుండెల మీదకు దొర్లి
నరాల ఆకళ్ళు తీర్చమని పాలిండ్లపైకి దాడి చేస్తుంది.
అచ్చాధన తొలగించిన దేహాన్ని ఆక్రమించి
సంయోగాల దాహమే తప్ప..
మరేదీ కనపడని మెరటుతనం
శరీరాన్ని ముద్ద ముద్ద చేస్తుంది.
ఆక్రందనలన్నీ..
ఆంతర్యంలో తొక్కి పెట్టి
నొప్పుల వేదనలెన్నో ఓర్చుకుంటుంది.
దేహపు ఎత్తు పల్లాల్ని
పెట్టుబడిగా చేసాక
మనస్సుని నిస్సారం చేసుకుంటూ
అవకాశాల చేతుల్లో అంగడి బొమ్మగా మారుతుంది.
లోలోపల ఏకధారగా కురుస్తున్న అనంత దుఃఖం
మళ్లీ మళ్లీ తనని ముంచెత్తుతూనే ఉంటుంది.
మిణుగురు దేహానికి ఆకలి తీరలేదు గాని
బొడ్డుపేగు లోపల మరో పేగు బంధానికి బీజం పడుతుంది
చీకటి చిక్కబడే లోగా
మలినమంటుకున్న మరో చెప్పుల జత ఎదురౌతుంది.
వెలుతురు రేఖ విచ్చుకునే లోగా
నషాలానికెక్కిన మత్తులో
నిముషాల వ్యవధి దాటకుండానే
మిణుకుమిణుకుమంటున్న
మిణుగురు కాంతంతా దేహంలో అస్తమించేదాకా
మరొకటీ మరొకటీ చెప్పుల జతలు
గుమ్మానికెదురు నిలబడి వస్తూనే ఉంటుంటాయ్.
2

నాకు నేను లేని క్షణాలే…

ప్రతి సారీ అంతే
కొన్ని ఆనందాలు నిజమని
ఆస్వాదించే లోపే
ఏదో విషాద విస్ఫోటనం జరుగుతుంది.
అలక్ష్యపు ఆనవాళ్లు అంతటా కనిపిస్తాయ్
నెగడు రగిలించి అంతరంగం శోధిస్తా
అందులో అన్నీ.. నాకు నేను లేని క్షణాలే..
నిట్టూర్పుల వానలో తడవకుండా
రేపటి కాలాన్ని నిజంగా స్వప్నిస్తా
ఉన్న కాలం అన్యాపాత్రమై
జారిపోతుంటుంది
కొన్నిసార్లు
అక్షరం ఆదుకొని నన్ను తన ఒడిలోకి చేర్చుకుంటుంది.
గుండెల్నిండా పొంగిన లావానంతా
చల్లారానివ్వని ముళ్ళు
ప్రేమగా పదే పదే గుచ్చుకుంటాయి
పునరావృత మరణం సంభవించని రోజుల్లో
లోలోపల నాకు నేను మిగిలుండను.
నిశ్శబ్ద నిశీధిలో పేలవంగా
ఊరేగుతున్న
నా ఉత్సవమూర్తిని
కాలం ఈ క్షణంలో బ్రతకడం నేర్చుకోమంటుంది
నేనూ అంగీకరిస్తాను
చుట్టూ గుచ్చే ముళ్ళు పెరుగుతాయి
నేను గుండె నిండా నవ్వేస్తాను
హాయి రాగం కాసేపు ఓదారుస్తుంది.
పర్యవసానం
ఓ శిధిల స్వప్నం.
*
రైతు కుటుంబంలో పుట్టి పెరిగి.. రైతుకు భార్యగా ఉన్నాను. యామినీ దేవి.. యా “మినీస్” అనే పేర్లతో నేను అక్షర సేద్యం చేస్తూ ఉంటాను. ఏం చేస్తుంటారంటే మాత్రం అనంతం అని చెప్తాను. అందరి కోసం చెప్పాలంటే గృహిణి అనాలేమో..!! ప్రయివేటు కాలేజీలో కొద్ది కాలం ఆఫీస్ వర్క్ చేసాను. కథలు, నవలలు చదవడం ఇష్టం. మనసు స్పందించినప్పుడల్లా కవిత్వంలో ప్రయాణిస్తుంటాను. 

యామినీ కోడే

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు