పురావీర గాథ

ఈ కాలమ్ పాఠకుల కోసం ఈ సారి జిలుకర శ్రీనివాస్ నవల ప్రత్యేకం!

ధర్మ జ్ఞానం

దర్దేపల్లి పక్కనే కొండాపురం. అది దాటితే కొలన్‌పల్లి. యిప్పటికీ చాలాసార్లు ఆ రెండు వూళ్లకు సెంద్రెయ్య పోయిండు. ఎల్లమ్మ పండుగ చేసుకుంటం. మీరొచ్చి పండుగ చెయ్యాలే అని బొంబాయికి బతుకబోయిన కొండా సదెయ్య అడిగిండు. కొలన్‌పల్లిలోని మాదిగవాడ తెల్వని వాళ్లుండరు. పౌరుషానికి దర్వాజలా వుంటది ఆ వాడ.   ఎల్లమ్మ పండుగ చేస్తున్నా, నువ్వు తప్పకుండా దగ్గరుండి ఆ పండుగ చేయించాలని అడిగిండు సెంద్రెయ్యను. ముఖ్యంగా జాంబవ కథ కూడా చెప్పాలే అని సదెయ్య కోరిండు. సెంద్రెయ్యకు సంతోషం కలిగింది. తప్పకుండా చేద్దాం తమ్మీ అన్నడు. ఖర్చు యెంతయినా పర్లేదు. ఎంత మందినైనా సరే, బైండ్లోళ్లను పిలుపియ్యి నువ్వు అని నమ్మకంగా చెప్పిండు సదెయ్య. అట్టనే చేద్దాం పో అని మాటిచ్చిండు సెంద్రెయ్య.

అయిదుగురు బైండ్లోళ్లను తోలుకపోయిండు ఆ వూరికి. సదెయ్య భార్యపిల్లలు కొత్త బట్టల తొడుకున్నరు. సుట్టాలను, పక్కాలను పిలపిచ్చుకున్నరు. బొంబాయిలో బాగా కష్టపడి డబ్బులు బానే సంపాయించిండు. కొత్త యిల్లు కట్టుకున్నడు. మంచి డాబా. యింటి ముందట యాపచెట్టు. యెండాకాలం కొలన్‌పల్లి గుట్ట నిప్పుల సెగలు చిమ్ముతంది. అగో అలాంటి యాళ్ల సెంద్రెయ్య తన తమ్ముడు సోమయ్యను, పాలకుర్తి నుండి ఎల్మకంటి సోమయ్యను, తమ్మడపల్లి నుండి ఎల్మకంటి బక్కయ్యను, ఏనూతుల నుంచి ఎల్లయ్యను పిలిపిచ్చిండు.  వాళ్లు జమిడికెలు, కాళ్ల గజ్జెలు, పట్నం యేసే పలుకలు దీసుకొని వొచ్చిండ్లు. వాళ్లు తొలుత డప్పు సప్పుళ్లు చేపిచ్చిండ్లు. జమిడికెతో ఎల్లమ్మ కథ చెప్పిండ్లు. పసుపు, కుంకుమ, తెల్లపిండితో పట్నం యేసి యెల్లమ్మను కూకుండపెట్టిండ్లు. అంతకు ముందు పుట్టమన్ను దెచ్చిండ్లు. బోనం చేసి ఆ యింటి ఆడబిడ్డలతో పుట్టకాడికి తీసుకు పోయిండ్లు. రావెరావె ఎల్లమ్మ అని బ్రహ్మాండం బద్దలయ్యేలా కథ చెప్పిండ్లు. సెంద్రెయ్య వాళ్లకు కాసేపు వంత పాడిరడు. కాసేపు జమిడికేసిండు. కాసేపు తానే కథ చెప్పిండు. ఎల్లమ్మకు సెంద్రెయ్య ఆటపాటలు బాగా నచ్చినయి. ఆ మావురాలెల్లమ్మ సంతోషంతో అందరినీ ఆశీర్వదించింది నిండుగా.

ఎల్లమ్మ కథ పూర్తయ్యే సరికి రాత్రి కావొచ్చింది. పట్నం మీద కోసిన యాటను అప్పటికే వుడికిచ్చిండ్లు. బైండ్లోళ్లకు మంచి మాంసం పెట్టి మంచిగ చూసుకున్నడు సదెయ్య. అంతా కలిసి బువ్వ తిన్నంక, యింకో గంటకు జాంబపురాణం కథ మొదలు పెట్టిండ్లు.

సెంద్రెయ్యకు అలిసిపోయినట్టు అన్పిచ్చింది. ఆ యింటికి అవుతల వున్న ఒక యాపచెట్టు కింద మంచం యేసుకొని కూచున్నడు. బైండ్లోళ్లు చెప్తున్న  జాంబపురాణం కథను వింటూ నిద్రొచ్చినట్టు అనిపించింది. అట్లనే మంచంలోకి ఒరిగిండు.

కాసేపయినంక సెంద్రెయ్య సంకలో జమిడికె వుంది. దాని తంత్రిని మీటుతుండు. అసలైన కత అప్పుడే మొదలైంది. సెంద్రెయ్య వేళ్ల నాట్యంతో ఒక అద్భుతమైన నాదం వెలువడుతుంది.

అప్పుటికింకా మూలచుక్క పొడవలేదు.

ఆదిజాంబవుడు నిద్రలేచి, ఒళ్లు విరిచిండు.

దేహచర్యలనంతరం నదిలోకి తన కుడిపాదము మోపిండు. నీరు చీలమండలానికి తాకింది. ఆ తరువాత ఎడమ పాదమును మోపిండు. ఎడమ చీలమండలమూ పులకరించింది. తాను మరింత ముందుకేగి మోకాలి లోతున నిలబడ్డడు. మోకాలి కీళ్ల మధ్యన శక్తి జనించింది. ఇంకా ముందుకెళ్లి ఊరువులను తడిపిండు. శరీరంలోని శక్తి కేంద్రము కదిలి, జీవశక్తి పైకి ఎగబాకింది. అలాగే ముందుకు నడిచి, నడుము లోతులో నిలిచిండు. నాభిలోని సహస్ర రేకలు విచ్చుకొని దేహము వెలిగిపోయింది. ఎదలోతు నీళ్లలో నిలబడి, భుజాలను, కంఠాన్ని, నుదురును, శిరస్సును ఒకటొకటిగా నీటిలో ముంచిండు. దేహంలోని, శక్తి కేంద్రాలన్ని విప్పుకొన్నయి. తనలో ప్రవహించిన శక్తిని గుర్తించి, దానిని ‘ప్రాణశక్తి’ అన్నడు. అభ్యంగన స్నానం చేసి, ఆదిజాంబవుడు ఒడ్డు మీదకొచ్చిండు. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ సెంద్రెయ్య పరవశంతో జమిడికె వేయడమే మరిచిపోయిండు.

ఆదిజాంబవుడు పురా విద్యలను సాధన చేయ తన ఒంటినీ మనసునీ సిద్దం చేసిండు. ఆకాశాన్ని చేతులతో పట్టుకొన్నడు. శరీరాన్ని నీటిలా ప్రవహింపజేసిండు. గాలిని దేహములా మార్చిండు. అగ్నిని ఒంటిలో రగిలించి, నోరూ ముక్కు ద్వారా ఊదిండు. ఇది ‘చలనయోగము’ అని ప్రకటించిండు. పుడమిని తాకి అనేక భంగిమలేసిండు. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి, గాలిని ఖడ్గముగా చేసి సాము చేసిండు. భూమి, ఆకాశాలను జలదరింపచేసినట్లుగా విన్యాసములు చేసెసిండు. ‘‘ఇది యుద్ధవిద్య’’ అని ప్రకటించిండు. యుద్ధరావాలను సెంద్రెయ్య తన జమిడెకతో పలికిచిండు. జాంబవంతుడు చిర్నవ్వుతో సెంద్రెయ్యను ఆశీర్వదించిండు.

చీకటిని తొలుచుకొని వస్తున్న సూర్యుణ్ణి చూసి, రెండు చేతులెత్తి, కృతజ్ఞతాభివందనం ప్రకటించిండు సెంద్రెయ్య. ఆ దృశ్యాన్ని తన తనయుడు జాంబవముని చూసిండు.

పొడుస్తున్న సూర్యుణ్ణి చూపి ‘‘అతడు దేవుడా?’’ అని అడిగిండు జాంబవముని. సాక్షిలెక్క సెంద్రెయ్య జమిడికెను చిన్నగా  ఆడిస్తూనే   వింటుండు.

ఆదిజాంబవుడు ‘‘కాదు’’ అని బదులిచ్చిండు.

‘భూమి మీదగానీ, ఆకాశంలోగానీ, దేవుడన్న వాడెవ్వడూ లేడ’న్నాడు ఆదిజాంబవంతుడు. సందేహంతో సెంద్రెయ్య జమిడికెను గజిబిజిగా వాయించిండు.

‘‘మరి అది ఏమిటీ’’ అని సూర్యున్ని చూపిస్తూ అడిగిండు జాంబవముని.

‘‘వెలుగును, వెచ్చదనాన్ని పంచే నక్షత్రం’’ అని ఆదిజాంబవుడు ధృవీకరించిండు.

జాంబవముని తల ఆకాశానికెత్తి చూసి, ‘‘అది ఏమిటీ’’ అన్నడు.

‘‘అది ఖాళీ స్థలం’’ అని ఆదిజాంబవుడు జవాబిచ్చిండు.

‘‘మనము కాళ్ళను నేలకు ఆనించి నిలబడినట్టే, ఈ భూమి దేని మీద నిలబడ్డది’’ అని ప్రశ్నించిండు.

‘‘ఈ భూమి, కనిపించే ఆ నక్షత్రాలు, కనిపించని మరెన్నో అన్నీ శూన్యములోనే నిలబడి ఉన్నాయి’’ అన్నడు జాంబవంతుడు.

‘‘మూగజీవాలను మనం రక్షించినట్టుగా, మనల్ని రక్షించు శక్తి ఏద?’’ని తనయుడు అడిగిండు.

‘‘బిడ్డను తల్లి రక్షించునట్టుగా ఈ భూమి, ఈ ప్రకృతే, మనల్ని రక్షిస్తుంది. కనిపించని రక్షకుడంటూ ఎవడూ లేడు’’ అని బదులిచ్చిండు ఆదిజాంబవంతుడు. సెంద్రెయ్య అనుమానం తీరింది. జమిడికె నాదం హాయిగా మోగించిండు.

‘‘ఏది నీతి’’? అని సందేహం వెలిబుచ్చిండు జాంబవముని.

‘‘నువ్వు పుట్టిన నేలను, నీకు జన్మనిచ్చిన తల్లిని, నీ తోడపుట్టినవారిని, తోటి మనషులను ప్రేమించి, వారితో కలిసి జీవించుటే నీతి. తాగుట, అబద్ధమాడుట ఇతరులను గాయపరుచుట, హింసించుట, దోచుకొనుట, హీనంగా చూడుట, పరస్త్రీతో సంగమించుట, జ్ఞానము నేర్చుకొనుటకు నిరాకరించుట నీతికి విరుద్ధం’’ అన్నాడు జాంబవంతుడు.

‘‘ఏది పవిత్రం, ఏది అపవిత్రం’’ అని జాంబవముని తండ్రిని అడిగిండు.

‘‘జ్ఞానం పవిత్రం, అజ్ఞానం అపవిత్రము’’ అని ఆదిజాంబవుడు బదులిచ్చిండు.

‘‘ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం’’ అని తిరిగి ప్రశ్నించిండు.

‘‘నీ గురించి, నీవు జీవిస్తున్న సంఘం గురించి తెలుసుకోవటం జ్ఞానం. అది తెలుసుకోకపోవటమే అజ్ఞానం’’ అని బోధించిండు.

ఆదిజాంబవుడు బోధించిన జ్ఞానమే ఈ భూమి మీద మొదటి ధర్మమయ్యింది. సంబురంతో సెంద్రెయ్య జమిడికె మీద చిలుకల దరువు యేసి చిందేసిండు.

2

సెంద్రెయ్య అట్లా చూస్తా వున్నడు. ఒక ఎత్తయిన బండరాయి మీద తల మీద కూసొని చూస్తున్నడు. ఆది జాంబవుడు గణతంత్ర  నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ భూతలం మీద నాగరిక స్వర్గం నిర్మించిండు.

ఆదిజాంబవుడి గణము కోట్లాదిగా వర్థిల్లింది. తన రక్తము నుండి పుట్టిన కోట్లాది మంది స్త్రీలు, పురుషులు, సముద్రాలను సరిహద్దులుగా చేసుకొని వ్యాపించిండ్లు. ఇక హిమాలయ పర్వత సానువులను దాటి విస్తరించిండ్లు. ఎడారి తీరాలను నడిచి స్థిరపడ్డరు. వారందరికీ ధర్మాన్ని, సంపదని, సుఖాన్ని, రక్షణను ఆదిజాంబవుడే సమకూర్చిండు. గాంధార దేశము, కిరాత, సింహళ, తైవాన్‌, సువర్ణద్వీప, బామా, మలయా, చీనా, కాంబోజ, శంబలాది ప్రాంతాలన్నింటికి పాలకుడై కన్నబిడ్డల్లా కాపాడిరడు. ఈ భౌగోళిక సరిహద్దులను ‘జంబూద్వీపమ’ని పిలిచిండు. అవును యిది జంబూద్వీపమని సెంద్రెయ్య నోట మాట తియ్యగా వొచ్చింది.

 

3

శీతల ఆర్య మనువు

భూమి తనను సూర్యుడి వేడి నుంచి రక్షించుకొనుటకు మూడువంతుల నీటిని సృష్టించుకొన్నది. సూర్యుడి కిరణాలు ప్రసరించడానికి చాలా సమయం పట్టే భూధృవ ప్రాంతాల్లోని నీరు మంచుగడ్డలా మారింది. యూరపు, ఆసియా ఖండాలు కలిసే చోటు సల్లగా గడ్డకట్టి వుంది. నల్లసముద్రం చలికి బిగుసుకుపోయి  తెల్లని పర్వతంలా మారింది. అక్కడ అరుదైన వృక్షజాతికి చెందిన మొక్కలు ఏవో కొన్ని కనిపిస్తున్నయి. మంచు తుఫాను తరచుగా వస్తది. ఆ వాతావరణంలో జీవించు జంతువులు మాత్రమే అక్కడ కనపడుతయి. అలాంటి ఒక మంచుశిఖరం మీద నిలబడి వున్నాడు సెంద్రెయ్య యిప్పుడు.

అదిగో అలాంటి చోట  ఒక మానవుల  గుంపు సెంద్రెయ్యకు కనిపించింది. వాళ్లకి జంతు చర్మం తప్ప వస్త్రం తెలియదు. జంతువుల దంతాలు, ఎముకలు తప్ప లోహమేది తెలియదు. రాతి గుహలో తలదాచుకోవటం తప్ప, నాగరిక ఆవాసం తెలియదు. మంచుపొరల కింది చేపలు, ఇతర తినయోగ్యమైన జలచరాలే వారికి ఆహారము తప్ప పంట పండిరచటం తెలియదు.

నాగరికత అంటే ఏమో వాళ్లకి తెలియదు. వారి భాష క్లిష్టమైనది. ఉరుముల మెరుపుళన్నా, తుఫాను గాలులన్నా, నల్లని చీకటన్నా  వారికి భయం. భూమి కదలినా, ఆకాశంలో సూర్యుడు కనిపించకున్నా భయంతో వణికిపోయే ఆర్యులకు మనోధైర్యం యిచ్చే వాడే మనువు. మంచు ప్రదేశాన్నీ, ప్రకృతినీ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసిన ఆర్యుడు మనువు. ఆర్యుల ఆది గురువు తను. అతడే వారికి కర్తవ్య బోధకుడు. ఆకాశాన్ని చూపి దాని కావల ఒక లోకముందని అతడు చెప్పిండు. ఆ లోకం నుంచే మనం ఇక్కడికి వచ్చామని చెప్పేటోడు. ఆకాశం లోతు తెలియని అఖాతమని ఊహించిండు. అందులో పథ్నాలుగు లోకాలున్నాయని చెప్పి నమ్మించిండు. వాటికవతల స్వర్గమున్నదన్నడు. అక్కడ పరమాత్మ వుంటడని, అతడి సమక్షంలో జీవించటమే ఈ మానవ జన్మకు విముక్తి అని ప్రవచించిండు. తన మాట వినని వాడు ఆ పరమాత్మ కోపానికి గురై నరకానికి వెళ్తాడని శపించిండు. అక్కడ భయంకరమైన శిక్షలనుభవిస్తారని చెప్పిండు. ఆ మాటలు విని సెంద్రెయ్య భయపడ్డాడు. యిక యితర ఆర్యులు భయంతో వొణికి పోతండ్లు.

యింకా, మహాశక్తిమంతుడైన సృష్టికర్త ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిండు అన్నడు. దివారాత్రులు, చీకటి వెలుగులు, చావుపుట్టుకలు అతడి మహిమే అని ప్రకటించిండు. అతడిని ‘ఈశ్వరుడు’ అని పిలవాలని చెప్పిండు. మనల్ని రక్షించేవాడు అతడే అన్నడు. అతడికి కోపం రానీకుండా దొరికిన జంతువులను, ఇతర జాతుల మానవులను బలివ్వాలని ఆదేశించిండు. ఈ కన్పించే భూమికంతటికీ ఆ ఈశ్వరుడే  నిన్ను రాజును చేసిండని ఆర్యుల పెద్ద అయిన ఇంద్రునికి హితబోధ చేసిండు. అలా ధృవప్రాంత జీవితాన్ని కొనసాగిస్తూ మనువు చెప్పే దేవున్ని ఆరాదిస్తూ వాళ్ల బతుకుల్లో జరగబోయే అద్భుతాల కోసం నిరీక్షిస్తూండ్లు. వాళ్లను చూసి సెంద్రెయ్య జాలిపడ్డడు. పాపం, ఈ మంచుకొండల్లో బతికే బతుకు ఒక బతుకేనా అని వాళ్లను చూసి బాధ పడ్డడు. వాళ్లకెవరైనా సాయం చేస్తే బాగుండని కూడా అతను అనుకున్నడు.

ఎన్నో యేండ్ల ప్రయాస తర్వాత వారికి ఒక అద్భుతం ఎదురయ్యింది. ఎత్తైన పెద్ద ఓడను నడుపుతూ సముద్రాన్ని జయిస్తున్న నావికులు వాళ్లను చూసి ఆగిండ్లు. ఆ మంచు మానవులకు దళసరి వస్త్రాలను, వేడివేడి ఆహార పదార్థాలను దానం చేసిండ్లు. వేటకు ఉపయోగించటానికి  ఉక్కుతో తయారు చేసిన పదునైన ఖడ్గాలను, బల్లేలాలను వారికి బహుకరించిండ్లు. అవి చూసి మంచుమనుషులు సంభ్రమాశ్చర్యాలకు గురైండ్లు. ఆ అద్భుతాన్ని చూసిన మనువు విభ్రమ చెందిండు. చురుకైన వివేకం కలవాడైనందున రాజైన ఇంద్రున్ని వచ్చిన వారిని అనుసమరించమని ఆజ్ఞాపించిండు. కొత్తవారిని చూసిన ఆనందంలో ఆదిజాంబవుని మనుషులున్నారు. మనువు ఆజ్ఞను స్వీకరించి ఇంద్రుడు వారిని అనుసరించిండు. అతడు ఎన్నో కష్టాలకు ఓర్చి జంబూద్వీపం చేరి, ఆ వైభవము చూసి అసూయ పడ్డడు. ఆ అసూయను ఇంద్రుని కళ్లలో చూసి సెంద్రెయ్య భయపడ్డాడు. తన కాళ్లకింద మంచు అప్పుడే కరగడం మొదలైంది.

4

వర్ణభస్మం

అరప్పా పట్టణ వైభవం చూసిన ఆ మంచు మనిషి పేరు ఇంద్రుడు. పచ్చని అరణ్యాలు, పారే జీవనదుల కింద పంట పొలాలు, భూతల స్వర్గంగా విలసిల్లుతున్న పట్టణ శోభ. స్నేహం, వాత్సల్యం, కరుణ, సమత, మమతలతో తొణికసలాడుతున్న స్త్రీ, పురుషుల వ్యక్తిత్వం. ప్రకృతిలా వికసిస్తున్న పిల్లల బాల్యం అతనికి ఆనందం కలిగించాయి. అపరిచితుడని చూడకుండా ఆదరిస్తున్న వారి మంచితనం అతడికి అమాయకంగా కన్పించింది. ఇదే తనవారితో కలిసి జీవించదగ్గ  ద్వీపమని గ్రహించిండు.

ఒక నిశ్చిత ఆలోచనతో వెనుదిరిగి మంచుద్వీపమునకు వచ్చిండు. మనువుకు పరిస్థితి వివరించిండు. ఆ అద్భుత లోకానికి పయనం కమ్మని మనువు ఆర్యులకు కబురుపెట్టిండు. అలా ఇంద్రుడు, తన సోదరుడు ఉపేంద్రుల నాయకత్వంలో ఆర్యులు బయల్దేరారు.

అలా బయల్దేరిన ఆర్యులను మనువు మూడు తెగలుగా విభజించిండు. నక్షత్రాలను చూస్తూ, కన్పించే పర్వతాలను చూస్తూ, మారుతున్న వాతావారణాన్ని అంచనావేసి జరగబోయే సంగతులను చెప్పే ఒక వర్గాన్ని వేరు చేసి వారిని బ్రాహ్మణులన్నాడు మనువు. ఆర్యుల రక్షణార్థం శత్రువులతో తలపడే వాళ్లుండాలని నిర్ణయించి ఒక వర్గంగా కొంతమందిని వేరుచేసిండు. వారిని క్షత్రియులన్నాడు. ఆర్యుల పశువులను సంరక్షిస్తూ, ఆహార అవసరాలు తీరుస్తూ, ఇతర భౌతిక వసతులు కల్పించేందుకు కొంత మందిని వేరు చేసి వీరు వైశ్యులని పిలిచిండు. మనువు మనుషులను విడదీస్తున్నాడని సెంద్రెయ్యకు బాధయింది. ఒకే జాతిని యిలా వేరువేరుగా చీల్చడమేమిటి? ఆ పనులు ఎవరైనా చేయొచ్చు కదా అని సెంద్రెయ్యకు అనుమానం వొచ్చింది. కానీ ఈ మాయదారి మనువు ఏంచేస్తాడో తెలుసుకోవాలని  ఒక తెల్లని మేఘం మీదికి ఎక్కి కూచొని చూస్తున్నాడు సెంద్రెయ్య.

శరణార్ధి

తెల్లని మంచుకప్పుకొని ఉండే, నల్లసముద్రం అంచులను ఆనుకొని ఉన్న ఆ చల్లని ప్రదేశం నుండి, బయల్దేరిన ఆర్యులు, నదులు, అరణ్యాలు, లోయలు, పర్వతాలు దాటుతూ ఎన్నో యేండ్లు ప్రయాణించిండ్లు. మార్గమధ్యలో ఎదురుపడిన ఎన్నో రకాలైన జాతులతో, తెగలతో ఘర్షణపడ్డరు. ఆ క్రమములో వారు జయించిన పశువులను మేపుకుంటు, జంబూద్వీపం భూభాగంలోకి ప్రవేశించిండ్లు. వాళ్లు పశువులను తోలుకొని జంబూద్వీపంలోకి వచ్చిండ్లు. మేఘాల మీంచి ఆ ప్రయాణమంతా చూస్తున్న సెంద్రెయ్య వాళ్ల పట్టుదలను చూసి ఆశ్చర్య పోయిండు. వాళ్లు యితర జాతులతో నిర్దయగా ప్రవర్తించటం చూసి వాళ్లను బాగా అసహ్యించుకుండు. యిప్పుడు సెంద్రెయ్య హిమాలయ పర్వత శిఖరం మీద కూచొని జమిడికె పొర వొదులు కాకుండా సరి చేసుకుంటున్నడు.

సమ శీతోష్ణస్థితిని కలిగిన జంబూద్వీప వాతావరణం ఆర్యులకు ఎంతగానో నచ్చింది. పారే సెలయేళ్లు, పచ్చని పొలాలు, తీర్చిదిద్దినట్టున్న పట్టణాలు వారికి కనువిందు చేసినయి. జాంబవంతుడి పరాక్రమము, జ్ఞానము గురించి జంబుద్వీప వాసులు చెప్పుకొంటున్నరు. ఆ కథలను విని ఒకింత బెదిరిండ్లు. అనుమతి లేకుండా జంబుద్వీపములోకి ప్రవేశించినందుకు ఆయన ఆగ్రహించి, మమ్మల్ని తరిమేస్తాడేమో అని ఇంద్రుడు, ఉపేంద్రుడు చర్చించుకొన్నరు. అయినప్పటికీ, ప్రజలలో కనిపిస్తున్న సాధు స్వభావం, మంచితనం జాంబవంతుడిలో కూడా ఉండవచ్చునని ఊహించిండ్లు వాళ్లు. ఒకవేళ ఆ మహోన్నత పరాక్రమవంతుడు అనుమతించని యెడల యుద్ధానికి సిద్ధపడవలెనని నిశ్చయించుకొన్నరు. ఈ సుందర జంబూద్వీపాన్ని ఏలటమే మీ కర్తవ్యమని మనువు ఇంద్రుణ్ణి ఆదేశించిండు. అన్న మాట జవదాటకని ఉపేంద్రునికి మనువు ఆదేశించిండు. ఎన్నో యేళ్లపాటు ప్రయాణం చేస్తూ వచ్చిన ఆర్యులందరికీ విశ్రాంతి కావాలని అనుకున్నరు. ఇక్కడ స్థిరపడాలంటే ముందుగా జాంబవంతుడి అనుమతి పొందాలని మనువు సూచించిండు. ఇంద్రుడు ఇతర ఆర్యపెద్దలు కలిసి జాంబవంతుడిని శరణు వేడాలని తీర్మానించుకొన్నరు.

అరప్పా పట్టణం మధ్యలో ఎత్తైన, విశాలమైన సభా ప్రాంగణం

ఉంది. అందులోని పచ్చని జంబూవృక్ష నీడకింద ఏర్పాటు చేసిన ఉచితాసనము మీద జాంబవంతుడు ఆసినుడై ఉన్నడు. ఇంద్రుడు ఇతర ఆర్య పెద్దలను వెంట తీసుకొని భయంభయంగా జాంబవంతుని ఎదుట ముకుళిత హస్తాలతో నిలబడ్డడు. వింతగా, కొత్తగా కనిపిస్తున్న అపరిచితులను చూసి వాళ్లు జంబుద్వీప వాసులు కారని, ఆయన గ్రహించిండు. వాళ్ల మొహాల్లోని భయాన్ని, ఆందోళనను గమనించిన ఆదిజాంబవుడు చిన్నగా నవ్విండు. ఆ మందహాసం గమనించిన ఇంద్రాది ఆర్యులు భయాన్ని వీడి ఊపిరి పీల్చుకున్నరు.

‘‘మీకు వచ్చిన ఆపద ఏమీ’’ అని ఆదిజాంబవుడు ప్రశ్నించెను. ఆది జాంబవుడు కూచున్న బంగారు సింహాసనానికి కుడివైపున నిలబడి వున్నాడు సెంద్రెయ్య. వందలాది మంది జంబూద్వీపవాసులు పరాయి ప్రాంతం నుంచి వొచ్చిన ఆర్యులను ఆప్యాయంగా చూస్తున్నారు. కానీ సెంద్రెయ్య ఆర్యులను అనుమానంతో చూస్తున్నాడు. వాళ్ల ఉద్దేశ్యాలు విన్నాడు. వాటిని జాంబవంతుడికి చెప్పాలనుకున్నాడు. కానీ అవేవీ చెప్పలేడు తను. భయం నటిస్తూన్న ఆర్యుల తరఫున ఇంద్రుడు ఒక అడుగు ముందుకేసి నిలబడ్డాడు. అందరూ ఆ వ్యక్తిని ఆసక్తిగా చూసిండ్లు. వొంటి మీద దొడ్డుపాటి తోలు దుస్తులను ధరించి వున్నాడు. మెడలో సింహపుగోరు మొరటుగా వేలాడుతుంది. భీతిగొలిపేలా వున్న ఇంద్రుడుని జంబూద్వీప వాసులు జాలిగా చూస్తున్నరు. మా లాగా నాగరికంగా లేరే వీళ్లంతా అని వాళ్లు బాధపడుతున్నరు. వాళ్ల ఆలోచనలను పసిగట్టినట్టున్నాడు ఇంద్రుడు.

హీనస్వరముతో ఇంద్రుడు ఈ విధంగా వేడుకొన్నడు. ‘‘జంబూద్వీప కాంతులను మీ అపారమైన జ్ఞానపరాక్రమాలతో దేదీప్యమానం చేస్తున్న ఓ మహా ఆదిజాంబవా…మేము రాత్రి పగలూ లేక మంచుకురిసే ప్రాంతము నుండి బతుకు వెతుక్కుంటూ బయలుదేరాము. ఇంతకు ముందు మీరు పెద్ద ఓడల మీద పంపించిన ఆహారాన్ని, అంగవస్త్రాన్ని  మీ ద్వీపవాసులు మాకు దానమిచ్చారు. మా మంచు మనుషులకి నాగరికతను గురించి తెలిపారు. ఆ మంచు దిబ్బల కింద, అనుదినమూ చస్తూ బతికే కన్నా, ఆదిజాంబవుని ప్రసన్న దృక్కుల కింద చల్లగా బతక వచ్చని భావించి, ఇక్కడికి పయనమై వచ్చాము. మీ అనుమతి లేకనే మీ భూమి మీద అడుగు మోపాము. పశు పక్ష్యాదులను, చెట్టు చేమలను, పసి పిల్లలను ఆదరించి, అక్కున చేర్చుకునే ఆదిజాంబవుడు మా ఈ తప్పిదాన్ని మన్నించి, సమాదరిస్తారని భావించాము. అయ్యా! కరుణా హృదయులైన మీరు మీ సువిశాలమైన జంబూ ద్వీపములో బ్రతకడానికి మాకు అనుమతినివ్వాలని మా జాతి జనుల పక్షాన మిమ్ముల వేడుకుంటున్నాము’’ అన్నాడు.

ఇంద్రుని దీనమైన మాటలు విని,  జాంబవంతుడు ఈ విధముగా సమాధానమిచ్చెను. ‘‘ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, చాలా దూరమే మీరు ప్రయాణము చేసి వచ్చిండ్లు. ఈ భూమి మీద నివసించే ప్రతీ ప్రాణి, స్వేచ్ఛగా ఎక్కడైనా బ్రతకవచ్చనే జంబూద్వీప ధర్మాన్ని అనుసరించి, మీకు అనుమతిస్తున్నాము. మీరు మాలో ఒకరిగా కలిసిపోండి. ఆకలి దప్పులతో అల్లాడుతున్న ఇతర ద్వీప మానవాళిని, రక్షించడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకరించండి. ప్రేమ మూర్తులైన ఈ జంబూద్వీప ప్రజల, ఆదరాభిమానాలను చూరగొనండి’’ అని ఆదిజాంబవుడు ఆర్యులకి అనుమతి ఇచ్చిండు. ఆ అనుమతిని స్వాగతిస్తున్నట్టుగా యితర జంబూద్వీప నాగరికులు హర్షధ్వానాలు చేసిండ్లు. సెంద్రెయ్యకు మాత్రం ఆర్యుల అంతరంగం తెలుసు. జరుగబోయే విపత్తును ఊహిస్తూ దిగులుతో ఒక గోరింకలా మారిపోయి మర్రి చెట్టుమీద ఒక కొమ్మ మీదికి చేరిపోయిండు. కాసేపు అక్కడ కూసోని మళ్లీ గాల్లోకి ఎగిరిండు. మనువు ఒక జంబూ వృక్షం కింద నిద్రిస్తున్నడు. ఆ చెట్టు మీదికి చేరిండు. ఆర్యులు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆకుల మాటున దాక్కొని నిలబడ్డాడు.

ఆనందంతో ఆర్యుల నాయకుడు ఇంద్రుడు, ఉపేంద్రుడు వెనుతిరిగిండ్లు. మనువు ఒక మంచంలో చినిగిపోయిన శరీరంతో అలసి నిద్ర పోతున్నడు. ఆ పక్కనే కొంత మంది ఆడవాళ్లున్నరు. వాళ్లు బానిసలు. చావుకు సిద్ధంగా వున్న మనువుకు సేవలు చేయడానికి సిద్ధంగా వున్నరు. ఒక గుంపుతో సంతోషంగా వొచ్చిన ఇంద్రుడు ఆదిజాంబవుని అనుమతి గురించి తెలిపిండు.

అప్పుడు మనువు వాళ్లను ప్రేమగా చూస్తూ ఇలా అన్నాడు. ‘‘ఎన్నో యేండ్లపాటు మీ మంచి చెడ్డలను చూసుకున్నాను. నా శరీరం శుష్కించినది. ఇక నుంచి మీ మంచి చెడ్డలు మీరే చూసుకోవాలి. కానీ, మీరు గమనించ వలసినది ముఖ్యమైనది ఒకటుంది. మీరు చూస్తున్న ఈ శరీరం ఒక మాయ. నాకు శరీర మంటూ లేదు. నాకు ఆకారమంటూ లేనేలేదు. నేను ఒక ఆలోచనను మాత్రమే. నా తరవాత కూడా నేను బతికే వుంటాను. మీరు నేను చెప్పిన సూత్రాలను ధర్మంగా స్వీకరించండి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆర్యులే ఈ భూమండలాన్ని యేలు రాజులని భగవానుని అభిమతం. ఈ జంబూద్వీప వాసులకది అర్థం అయ్యేలా చేయండి. శత్రువుతో చర్చలు మీ పతనానికి దారి తీస్తాయి. కాబట్టి చర్చలు విడిచిపెట్టండి. ఇప్పటి వరకూ మనం బతికి వున్నామంటే శత్రువుపట్ల కఠినంగా వుండటమే కారణం. తనకు మించిన ధర్మం లేదు. ఆర్యుల సుఖమే ప్రపంచ సుఖం. ఆర్యుల విజయమే భగవంతుని విజయం. ఆర్యుల కులగురువులైన బ్రాహ్మణులను రక్షించుకోండి. మీ జీవితాల మీద వారిదే అధికారం. వారంతా నా ప్రత్యక్ష శిక్షణలో తయారైన వారు. వారిని మీరు పూజించటమే కాదు, ఈ జంబూద్వీప వాసులతో కూడా పూజింప చేయుటయే మీ కర్తవ్యం. ఇది నేను, అలాగే ఈ సృష్టికి కర్త అయిన భగవానుడు మీకిస్తున్న ధర్మ శాసనం. ఈ భూ మండాలాన్ని పాలించడానికి ఎన్ని కుట్రలైనా పన్నండి తప్పులేదు. అది పాపము కాదు. ఆర్యజాతి ఔన్నత్యాన్ని చాటడానికి ఏ మార్గములోనైనా పయనించండి, అది భగవానుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. నేను ధర్మం పేరుతో మిమ్మల్ని అంటి పెట్టుకొని వుంటాను. నా మార్గం తప్పిన వాడికి రౌరవాది నరకం సిద్ధిస్తుంది. ఇది నా శాపం’’ అని చివరి సారిగా మనువు తన వారిని ఉద్దేశించి మాట్లాడిరడు. ఆ తర్వాత తను దేహం చాలించిండు. ఆర్యులు మనువు మీద పడి వొలవొలా ఏడ్చిండ్లు. గుండెలు బాదుకున్నరు.

చిలుక రూపంలో వున్న సెంద్రెయ్యకు మాత్రం రాబోవు ప్రమాదం ఎరుకైంది. కుళ్లు, కుట్రలకు మారు రూపులుగా వున్న ఆర్యులను చూసి ఆ చిలుకకు కోపం వస్తుంది. మనువు చినిగిన ముడతల దేహాన్ని వాళ్లు మోసుకుపోతూంటే వాళ్ల తల మీద చిలుక ఎగురుతూ తన భాషలో తిడుతుంది. మీరు దుర్మార్గులు. మీరు మోసగాళ్లు. మంచి మనుషులైన మా వాళ్లను చంపడానికి వొచ్చార్రా మీరు? వీడే ఈ ముసలి నక్కే అన్ని పాపాలకు కారణమని ఆ చిలుక అరుస్తూ పాడెమీద వున్న మనువును చిలుక వేగంగా వచ్చి కాళ్లతో తన్నింది. గట్టిగా అరిచింది. చిలుక కోపాన్ని చూసిన ఆర్యుల నాయకుడు ఇంద్రుడు ఒక రాయి తీసుకొని విసిరిండు. చిలుక ఒడుపుగా తప్పించుకొని గాల్లోకి ఎగిరింది. పచ్చని జంబూ చెట్టు కొమ్మల్లో దూరి, ఆర్యులను ఆవేశంతో తిడుతూ అక్కడే తిరుగుతుంది. సింధూ నదీ ఒడ్డున అప్పటికే సిద్ధం చేసిన కాష్టంమీద పడుకోబెట్టి ఆ ముసలి పీనుగను కాల్చేసిండ్లు.

కానీ అతడికి మరణం లేదు. అతడే జంబూద్వీపం పాలిట అంధకారంమై పొంచివున్నాడు. మనువుకు ఎన్నో పేర్లున్నాయి. మరెన్నో రూపాలున్నాయి. లెక్కలేనన్ని గుణాలున్నాయి. వాటిలో కొన్ని: అగాథం, అంధకారం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, అధర్మం, విద్వేషం, నిర్దాక్షణ్యం, కసి, పగ, దు:ఖం, విచారం, లోభం, మేహం, కామం, హింస, పీడన, స్వార్ధం, విభజన, అసమానత, తేడా, పీడ, మూఢం, దురదృష్టం, మరణం, ముసలితనం, నపుంసకత్వం, బలహీనత, అధైర్యం, భయం, అందవికారం, అసహ్యం, శత్రుత్వం, వైమనష్యం. కాలాన్ని బట్టీ, ప్రకృతినిబట్టీ, ప్రదేశాన్నిబట్టీ మనువు పేర్లు, రూపం, గుణం గుర్తించాలి. ఈ మనువునే ఒక్కో కాలంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మనువే జరగబోయే అనర్థాలకు హేతువు.

సింధూనది వొడ్డు మీద దూరంగా కాలుతున్న పీనుగును చూస్తూ ఆందోళనతో ఏమి చెయ్యాలో తోచక అటూయిటూ తిరుగుతున్నడు సెంద్రెయ్య.

5

అధర్మ యుద్ధం

సింధూ నది తీరాన పశువులను పోషించుకుంటూ, జీవిస్తున్నరు  ఆర్యులు. జంబూద్వీప వాసుల ప్రేమ ఆప్యాయత అమాయకత్వం, అజ్ఞానం అనిపిస్తుంది వాళ్లకు. వాళ్ల స్నేహశీలత, దానగుణము పట్ల ఆర్యులకి చులకనభావం ఏర్పడ్డది. పరుష మాటలతో, అరప్పా పట్టణవాసులను గేళి చేస్తూనే వున్నారు. ఎన్నోసార్లు అకారణంగా ఘర్షణ పడ్డారు. మానవతా మూర్తులైనా జంబూద్వీప వాసులు, వారి తప్పులను మన్నించి వొదిలేస్తూనే వున్నారు. అరప్పా పట్టణంలో లభిస్తున్న ఇనుము, ఉక్కు, రాగి, వెండి వంటి లోహాలను తీసుకొని, ఆయుధ సామాగ్రిని ఇంద్రుడు ఆదేశాల మేరకు తయారు చేసుకొన్నరు. సెంద్రెయ్య రెక్కల ఏనుగులా మారి మేఘాలలో నిలబడి జరుగుతున్న సంగతులను చూస్తూ వుండు. తన మనస్సు కోపంతో రగిలిపోతున్నది. కానీ తన కాలం వేరు. తనేమీ చేయలేక పోతున్నడు.

యుద్ధ ప్రియులైన ఆర్యులు, శాంతి కాముకులైన అరప్పా వాసులను తుద ముట్టించాలని కుట్రచేసిండ్లు. ఒక రోజు ఇంద్రుడు తన కుట్రను అమలు చేయాలని నిర్ణయించుకున్నడు.  పంటలు చేతికొచ్చిన వేళ, ఇంద్రుడి ఆదేశాల మేరకు, కావాలనే పశువుల మందని పంట పొలాల మీదికి ఉపేంద్రుని నాయకత్వంలో ఉసి గొలిపిండ్లు. పొలాలకు కాపలా వున్న అరప్పా వాసులు, ఆర్యుల దుశ్చర్యలను అడ్డగించిండ్లు. ఆ పంట పొలాల మధ్య, నిరాయుధలైన అరప్పా వాసులను ఆర్యులు, నరికి చంపిండ్లు. ఇది మనువు యుద్ధ ధర్మమని ప్రకటించిండ్లు. అది విన్న నిశ్శరీరుడైన మనువు సంతోషంతో విరగబడి నవ్విండు.  ఆ నవ్వుకు మేఘాలలో ఎగురుతున్న రెక్కల ఏనుగు భయపడ్డది. అది లేడిలా మారి ఆదిజాంబవుడు సేద తీరుతున్న దుప్పుల వనంలో బెదురుతూ తిరుగుతుంది.

ఈ దుశ్చర్యను సహించలేని ఆదిజాంబవుడు యింద్రుణ్ని పిలవనంపిండు. గర్వమూ, అహంకారము, యుద్ధ పిపాస తొణికిస లాడుతున్న తోడేలు కండ్లతో ఇంద్రుడు తన సోదరునితో పాటు వొచ్చి  ఆదిజాంబవుడి ముందు నిలబడ్డడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపము కూడా ప్రకటించకపోగా, యుద్ధానికి సిద్ధమని ప్రకటించిండు.

ఆ అహంకారాన్ని చూసి, ‘‘బ్రతుకు దెరువుకోసం వచ్చాము అనుమతివ్వమని చేతులు జోడిరచి ప్రాధేయపడిన యింద్రుడేనా నా ఎదుట నిలబడి మాట్లాడుతున్నది? యుద్ధమే తప్పదనిన మేమూ అందుకు సిద్ధమే’’ అని ఆదిజాంబవుడు ఆగ్రహించిండు.

ఆ మాట వినగానే సెంద్రెయ్య చిరుతపులి రూపంలోకి మారిపోయిండు. ఆర్యుల నెత్తురు తాగాలనే ఆత్రం ఆ చిరుతకు అనునిమిషం పెరుగుతూనే వున్నది. ఎప్పుడు ఇంద్రుని మీద దునికి బొండికాయ కొరుకాలా అని ఉత్సాహంలో వుందది. ఉపేంద్రుని గుండెకాయ తినాలని ఉవ్విళ్లూరుతున్నది. అప్పుడు ఆదిజాంబవుడు యిలా అన్నాడు. ‘‘కానీ, ఇరువురమూ యుద్ధనీతిని పాటించాలి’’ అని షరతు విధించిండు.

యుద్ధ మనగా శత్రువును ఓడిరచడమేగానీ, సంహరించడం కాదన్నాడు. పసిపిల్లలను, వృద్ధులను, స్త్రీలను యుద్ధములో ఉపయోగించ కూడదు. వారికి ఎలాంటి హాని తలపెట్టరాదు. అసమ బలులతో తలపడ రాదు. నిరాయుధులైనవారి మీద ఆయుధము దూయరాదు. రాత్రివేళలో యుద్ధము నిషిద్ధము. ముఖాముఖి తప్ప, దొంగదెబ్బ తీయరాదు. ఇది ఆదిజాంబవుని యుద్ధ ధర్మమని ప్రకటించిండు.

ఇంద్రుడు మౌనము వహించిండు. యుద్ధభూమిలో కలుసు కుందా మన్నాడు. యింద్రుడి మౌనాన్ని చిరుతపులి సరిగ్గానే అర్థం చేసుకుంది.

ఆ తరువాత చల్లగా పారుతున్న సింధూనది ఆదిజాంబవుడి సేనల పరాక్రమంతో వేడెక్కి మసలుతుంది. ఆది జాంబవుని పుత్రుడు జాంబవముని సైన్యానికి నాయకత్వం వహించిండు. ఆ జాంబవముని వెనకే పెద్ద గడగొయ్యతో యుద్ధానికి సిద్ధమయ్యిండు సెంద్రెయ్య. జంబూ చెట్లలోని శక్తిఅంతా ఒంట్లో నింపుకొన్న ద్రవిడులు కదా. తమతో తలపడిన ఆర్యులను సునాయసంగా ఓడిరచిండ్లు. జాంబవమునికి అపాయం రాకుండా రక్షణగా శత్రువులతో సెంద్రెయ్య కలెబడుతనే వుండు. అలా ఆర్యుల శరీరంలోని శక్తినంతా కోల్పోయేలా చేసి నిస్సహాయులను చేసిండ్లు. కత్తి పట్టినోళ్లతో ఖడ్గంతో, కర్ర పట్టినోళ్లతో కర్రసాముతో, నిరాయుధులైనవారిని భుజబలముతో ఓడిరచిండ్లు. కానీ, ఆదిజాంబవుడు, జాంబవముని అతని సేన ఏ ఒక్క ఆర్యుడిని వధించ లేదు.  అవమాన భారంతో ఆర్యులు తలలు దించి వేయగా సూర్యుడు విజయ మందహాసంతో చీకటిలో కలిసిపోయిండు. అపార శక్తి సంపన్నులైన జాంబవుని సైన్యంతో ధర్మయుద్ధం చేయటం వీలుకాదని ఇంద్రుడు, ఉపేంద్రుడు గ్రహించిండ్లు.

ఈ విధంగా సుమారు నలభైయేళ్ల పాటు ఆదిజాంబవుడితో ఆర్యులు యుద్ధము చేసిండ్లు. ధర్మయుద్ధంలో విజయం సాధించటం అసాధ్యమని గ్రహించి, అధర్మ యుద్ధానికి కుట్ర పన్నిండ్లు.

యుద్ధనీతిని అనుసరించి, రాత్రివేళలో అరప్పా పట్టణం హాయిగా నిద్రపోతున్నది. యుద్ధ ఉల్లాసం సెంద్రెయ్యను హాయిగా నిద్రింప చేసింది. లేల్ల మైదానంలోని ఒక వెడల్పాటి, ఎత్తయిన బండరాయి మీద మేను మరిచి సెంద్రెయ్య నిద్ర పోతున్నాడు. జాంబవముని కూడా సేదతీరుతున్నాడు.  అదే అదునుగా భావించి, ఆర్యులు అర్థరాత్రి పదునైన కత్తులు, బరిసెలు, బల్లేలు, గండ్రగొడ్డళ్లు చేత బూనిండ్లు. అరప్పా పట్టణం మీద విరుచుక పడ్డరు. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఇండ్ల మీద పడి, దొరికిన వారిని దొరికినట్టే నరికిండ్లు. స్త్రీలను చెరిచిండ్లు. వృద్ధులను క్రూరంగా నరికివేసిండ్లు. పసిపిల్లలను కూడా వదలకుండా గొంతులుకోసిండ్లు. అరప్పా పట్టణాన్ని, నెత్తుటి ముద్దగా చేసిన ఇంద్రుని మొహంలో ఆనందంతో కూడిన క్రౌర్యం కనిపించింది. ఆదిజాంబవుడు మేల్కొని సిద్ధమయ్యేలోగా ఘోర రక్తపాతం జరిగింది. అరప్పా పట్టణం శవాల వాసనేస్తుంది. ఆదిజాంబవుడు ఆవేశంతో ఊగిపోయిండు. తన సైన్యంతో సింధూనది ఒడ్డుకు చేరిండు.

6

నెత్తుటి సింధు

పవిత్ర జాంబూద్వీపం తొలిసారి నెత్తురు మడుగుగా మారింది. ఎక్కడి నుంచో నక్కల ఊళ వినిపిస్తుంది. తోడేలు ఏదో వొచ్చి తన కాలును నోట కరిచిందనిపించింది సెంద్రెయ్యకు. సప్పున కళ్లు తెరిచి చూసిండు. ఎదుటేమీ లేదు. కానీ అయినవాళ్లను కోల్పోయిన ఆడవాళ్ల ఏడ్పులు ఒకవైపు, తెగిపడిన దేహాలతో గగ్గోలు పెడుతున్న మగాళ్ల గొంతులు మరోవైపు నుంచి సెంద్రెయ్యకు వినిపిస్తున్నాయి. ఏదో పాపపు పనికి ఆర్యుల రాజు ఇంద్రుడు ఒడిగట్టి ఉంటాడని సెంద్రెయ్యకు అనిపించింది. గద్దలా మారి గాల్లోకి అమాంతం ఎగిరిండు. అప్పుడే తెలవారుతున్న ఆకాశాన్ని తెల్ల మేఘాలు కప్పేశాయి. వాటికింద ఎగురుతున్న గద్దకు కాలి బూడదయిన పట్టణం, పారుతున్న రుధిరం కనిపించింది. ఒళ్లు గగుర్పొడుస్తుండగా ఆదిజాంబవుడు నిలబడ్డ తావుకు కొద్ది దూరంలో గరుడ పక్షి సెంద్రెయ్యలా మారి నిలబడ్డది.

తన జాతి ప్రజలను యుద్ధానికి సిద్ధం చేస్తూ ఆదిజాంబవుడు ఇలా పలికిండు.

‘‘మనం నిర్మించుకున్న భూతల స్వర్గాన్ని ఈ ఆర్యులు నెత్తుడి మడుగుగా మార్చేశారు. ఈ మట్టినీ, మనిషినీ, సమస్త జీవరాశులనీ చరచరా ప్రాణకోటిని ప్రేమించి, గౌరవించే ఈ జంబూద్వీపం మీద ఆర్యులు అధర్మ యుద్ధం చేస్తున్నారు. యుద్ధనీతికి కట్టుబడని వాడు వీరుడే కాదు. నలభై యేళ్ల పాటు మన చేతిలో పరాజయం పాలైన ఆర్యులు అధర్మ యుద్ధాన్ని అనుసరిస్తున్నారు. అయిననూ మన ధర్మం మనం తప్పరాదు. మనం పెట్టుకున్న యుద్ధనీతిని మనమే గౌరవించాలి. ఆ క్రమంలో మన ప్రాణాలు పోవచ్చు. మనం ఓడిపోవచ్చు. మన రాజ్యమే నాశనం కావచ్చు. మన పూర్వీకులు నడయాడిన ఈ నేల ఆ ఆర్యుల వశం కావచ్చు. అయినా సరే ధర్మం తప్పరాదు. ఈ ధర్మవర్తనే, కాలాంతరాలను దాటి కీర్తించబడుతది’’ అని ఆదిజాంబవుడు పలికిండు.

ఆదిజాంబవుడి ఆజ్ఞను అనుసరించి జాంబవులు  యుద్ధరంగంలోకి దునికిండ్లు. తమ పరాక్రమము చూపించిండ్లు. పట్టరాని ఆవేశంతో సెంద్రెయ్య కదనంలోకి ఉరికిండు. గండ్రగొడ్డలితో నరకబోయిన ఒక అనాగరిక ఆర్యున్ని ఎదురొమ్ములో తన్నిండు ఆదిజాంబవుడు. వాడెగిరి పడ్డడు. వాడి చేతిలోని ఆ గండ్రగొడ్డలిని గుంజుకొని ఒక్క వేటుతో వాని తలను వేరు చేసిండు. ఆది జాంబవుడు వీరత్వం ముందు నిలబడలేక విలవిల్లాడిరడ్లు. యింకా, ఆ వెనుకే రండిరా నా కొడకల్లారా అంటూ సెంద్రెయ్య చేస్తున్న పోరాటం చూసి జాంబవులంతా ఉత్సాహం పొందిండ్లు. కానీ, వాళ్లకు సెంద్రెయ్య ఒకడిని నరకడం నచ్చలేదు. చంపడం మన నీతి కాదురా పిలగా అని ఆదిజాంబవుడు సెంద్రెయ్యను మందలించిండు. తప్పు ఒప్పుకొని ఆదిజాంబవున్ని మన్నించమని అడిగిండు. ఆ మహాచక్రవర్తి ఆనతో ఆకాశం ఎర్రగా మారిపోయింది.

బెదిరిపోయిన ఇంద్రుడు, ఉపేంద్రుడి ఆలోచనలతో ఆడవాళ్లను పసిపిల్లలను అడ్డుపెట్టి ఆదిజాంబవుని సైన్యాన్ని సంపిండ్లు. అకస్మాత్తుగా ఒక శత్రువుల మూక ఉపేంద్రుని కను సైగతో జాంబవముని యింటి మీద దాడి చేసి భార్యా పిల్లలను హీనాతి హీనంగా నరికి చంపిండ్లు. నిరాయుధులైన వారి మీద ఆర్యులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపివేసిండ్లు. జాంబవమునిని వెనక నుండి పొడిచి చంపిండ్లు. ఆ అపురూపమైన అందగాని నెత్తుటి దేహం పక్కనే కూసోని సెంద్రెయ్య శోకం పెట్టిండు.

‘‘మారాజు జాంబవముని తానోతందానా

మరణించే యుద్ధంలో తానో తందానా

మారాజు మాకుంటే తానో తందానా

మాకెంత పండుగో తానో తందానా అక్కడ జరిగిన అధర్మయుద్ధంలో పారిన రక్తంతో సింధూ నది ఎరుపెక్కింది. కన్న కొడుకు అసువులు బాసినా కూడా ఆదిజాంబవుడు ధైర్యం వీడలే. తన సైన్యాన్ని కాపాడటానికి అన్ని రకాలుగా  ప్రయత్నించిండు. కానీ అధర్మ యుద్ధ పద్ధతుల ద్వారా ఆర్యులు పైచేయి సాధించిండ్లు.

ఎన్నో ఏళ్ల పాటు జరిగిన ఈ భీకరయుద్ధం నిజానికి నెమ్మదిగా ఏకపక్ష దాడిగా మారిపోయింది. చివరికి ఆదిజాంబవుడు మూల చుక్క పొడవక ముందే లేచి, సింధూ నదిలో స్నానమాచరించి, ధాన్య సాధన చేస్తున్న సమయంలో ఇంద్రుడి చేయి సైగతో ఆర్యులు చీకట్లో పొదల మాటు నుండి విల్లుతో కొట్టిండ్లు. రెప్పపాటు వ్యవధిలో అసంఖ్యాకంగా దిగిన బాణాలతో ఆదిజాంబవుడు నేలకొరుగుతూ ఇలా శపించిండు. ‘‘అధర్మ యుద్ధం చేసిన మీ ఆర్యజాతి, నా జాతి చేతిలో నాశనమగుగాకా!’’. నేలకొరిగిన ఆదిజాంబవుని ముందు మోకరిల్లి సెంద్రెయ్య ఎక్కిఎక్కి ఏడ్చిండు. ఏం చేయాలో తోచక దిక్కులు పగిలిపోయేలా ఆక్రోషించిండు. ఆదిజాంబవుడి శాపం అంతకన్న ఎక్కువగా ఆకాశమంతా ధ్వనిస్తూ సెంద్రెయ్యకు వినిపించింది.

ఆదిజాంబవుని మరణంతో జంబూద్వీపం ఆర్యుల చేత చిక్కింది. ఎంతో సుందరమైన అరప్పా పట్టణాన్ని ఆర్యులు నేలమట్టం చేసిండ్లు. ఎత్తైన భవనాలను కూల్చివేసిండ్లు. అద్భుతమైన చెక్కలతో నిర్మించిన విశ్రాంతి కుటీరాలను కాల్చివేసిండ్లు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన అరప్పా పట్టణం ఆర్యుల దమనకాండకు శవాల దిబ్బగా మారి పోయింది. పట్టణంలోని ధనం, ధాన్యం, వస్తు సామాగ్రిని ఆర్యులు దోచుకొన్నరు. ఆర్యుల కత్తులతో శరీరాలు తెగి, నెత్తురోడుతూ, బతుకుజీవుడా అంటూ ఆ పరాజితులు అడవుల్లోకి పారిపోయిండ్లు. కొంత మంది తూర్పు ప్రాంతానికి పారిపోయిండ్లు. యింకొంత మంది దక్షిణానికి పరిగెత్తిండ్లు. వింద్యా పర్వత గోడలను దాటి తమ పూర్వీకులు నివసిస్తున్న జన్మస్థలానికి వచ్చేశారు. మరికొంత మంది పశ్చిమ తీర ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా జాంబవుని బిడ్డలు అనేక సమూహాలుగా చెల్లాచెదురయ్యారు. గూడు చెదిరిన పచ్చులోలే దిక్కుకొకరయ్యిండ్లు.

అరప్పా పట్టణాన్ని రక్షించడానికీ ఆర్యులతో సింధూనదీ ఒడ్డున జరుగుతున్న భీకరమైన యుద్ధాన్ని తెలుసుకొని అనేక తెగలు బాధపడ్డయి. అరప్పా పట్టణం నుంచి పారిపోయి వచ్చిన వారికీ, గాయాల పాలైనవారికి సాటి జంబూద్వీప తెగలు సాయం చేసిండ్లు. వాళ్లకు రక్షణగా నిలిచిండ్లు. అలా రక్షణ నిచ్చిన తెగల మీద ఆర్యులు విరుచుకుపడ్డరు. ప్రతిఘటించిన తెగల మీద ఆర్యులు ఉన్మాదంతో కాలుదువ్విండ్లు. ఇలా అనేక సంవత్సరాలు ఆర్యులతో జంబూద్వీప వాసులు తలపడుతూనే వున్నరు. ఇంద్రుడు ధ్వంసం చేయగా ఆక్రమించిన పట్టణాలను అద్దెకివ్వటం ద్వారా ఆదాయం సమకూర్చుకొంటూ వుండు. శిధిల పట్టణాలను తిరిగి నిర్మించాలన్న తలంపు ఆర్యులకు లేకపోయింది. వొరిగిన పట్టణం మీద సెంద్రెయ్య కాకిలా తిరిగిండు. అందరినీ తలుచుకుంటూ కావుకావుమని ఏడ్చిండు.

ప్రాణాలకు వెరువక ప్రతిఘటించిన వాళ్లందరినీ ఆర్యులు నిర్దాక్షిణ్యంగా సంహరించిండ్లు. లొంగిన వారిని బంధీలుగా పట్టి బానిసలని ప్రకటించిండ్లు. అయితే ఏ కారణం వల్లనో గానీ వింద్యా పర్వతాలను దాటి ఆర్యులు రాలేకపోయిండ్లు. వాళ్లకు సప్త సింధూ నదుల మధ్య బతకడమే సుఖమనిపించినట్టుంది.

తమ అధికారం స్థిరపడినదని ఆర్యులు గ్రహించిండ్లు. ఇంద్రుడు  కొలువుదీరిన సభలో బానసలను సంహరించుటమా లేదా బతకనివ్వటమా అన్న చర్చ మొదలయ్యింది. చంపివేయటం వల్ల ఆర్యులకు వుపయోగం లేదని వసు అన్నడు. వసు, విసులు ఇంద్రుని సలహదార్లు. ఇంద్రునికి కర్తవ్యోపదేశం చేస్తూ, ఆర్యులకు సేవ చేయడం అతని వృత్తి. మనువుకు మారుపేరు వసు. యింకో పేరు విసు. అతడు బంధీలను శూద్రులుగా ప్రకటించి, ఇప్పటి వరకు వాళ్లు అనుభవించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం రద్దు చేస్తూ శాసనం చేయాలని సూచించించిండ్లు రాజ గురువులు. చాతుర్వర్ణ వ్యవస్థ ఆర్యుల హితం కోసమని ప్రకటించిండు వసు. ఆస్తి, ఆయుధం, చదువుకొనే హక్కు, పాలించే హక్కులను రద్ధు చేస్తూ సభలో యింద్రుడు శాసనం చేసిండు. ఇదే సనాతన ధర్మమని వసు పలికిండు. బానిసత్వానికి కారణం పూర్వజన్మలో చేసిన కర్మఫలితమని నమ్మబలికిండు. భగవంతుని ఆజ్ఞమేరకే ఆర్యులు మీకు యజమానులైరని తెలిపిండు విసు. అలా బానిసలుగా మారిపోయిన తన వాళ్లను చూస్తూ సెంద్రెయ్య కన్నీరు మున్నీరయి ఏడ్చిండు.

6

సుదాసుడు

జంబూద్వీపాన్ని అధర్మ యుద్ధం ద్వారా గెలుచుకున్న ఆర్యులు, తమలో తాము కలహించుకొని అనేక రాజ్యాలుగా విడిపోయారు. రాజులు వేరైనా రాజ్యధర్మం ఒక్కటే. అదే వర్ణధర్మం. ఈ దేశ భూమి పుత్రులని అణచి వేయడంలో వాళ్లని బానిసలుగా చేసి, దోపిడి చేయడంలో వాళ్ల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ఆ రాజులందరికీ వసు, విసులు రాజధర్మాన్ని పదేపదే గుర్తుచేసేటోల్లు.  ద్రవిడులైన జంబూద్వీప వారసులు తిరిగి  పాలకులు కాకుండా చూడడమే రాజు యొక్క ధర్మమని, బోధించేవాళ్ళు.

అనేక మన్వంతరాల కృషి వల్ల ఏర్పడిన చాతుర్వర్ణ ధర్మాన్ని అనుసరించి, శూద్రులు, బానిసలు, నిషాదులు, చండాలురు, రాజ్యస్థాపన చేయ వీలులేదని, అదే వర్ణ ధర్మమని ప్రవచించే వాడు యింద్రుడు. ఆ వర్ణ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇంద్రుని సామంత రాజులు నిరంతరం ప్రయత్నిస్తూనే వున్నారు. ఉపేంద్రుడు నిత్యం అన్న ఆదేశాల మేరకు సామంత రాజుల నుండి పన్నులు వసూలు చేస్తా, కొత్తగా ఆదివాసీ తెగలను సంహరిస్తూ రాజ్య విస్తరణ కార్యంలో మునిగిపోయాడు. వాడి క్రూరత్వం గురించి విని ప్రజలు వొణికిపోయేవాళ్లు. అన్నాదమ్ముల దాష్టికం నచ్చకపోయినా కూడా సామంత రాజులు వాళ్ల ఆదేశాల మేరకు నడుచుకొనే వాళ్లు.  అలా పనిచేసే రాజుల్లో కొంతమంది : అలినులు, అనులు, భృగులు, భలాన్యులు, ధృహ్యులు, మత్స్యులు, పార్శ్యులు, పురులు, పణులు. ఈ తొమ్మిది మంది రాజన్యులు  ఆదిజాంబవుని వారసులను తిరిగి రాజ్యం  స్థాపించాలనే ప్రయత్నాలు చేయనీకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకొన్నరు.  కానీ, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు జంబూద్వీప వారసులు వర్ణధర్మానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుండ్లు. తమ సార్వభౌమాధికారాన్ని, స్వతంత్ర పిపాసను,  సమతా ధర్మాన్ని ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రయత్నం చేస్తుండ్లు. అలా ప్రయత్నించిన జాంబవుడి వారసుడే సుదాసుడు.

రాజ్యం కోల్పోయినంత తేలిగ్గా ప్రజలు విలువల్ని కోల్పోరు. జంబూద్వీప వారసులు  తమ పూర్వీకులు స్థాపించిన విలువలనే ఆచరిస్తున్నారు యింకా. తమ పూర్వీకుల ఘనమైన చరిత్రను తెలుపుతూనే వున్నరు.

సెంద్రెయ్య కోకిలలా మారి ఆ పురాగాధను పాడుతూనే వున్నడు. చాలాసార్లు బైండ్లోడిగా మారిపోయి జమిడికె వాయిస్తూ ఉన్మాదిలా వూగిపోయే వాడు. సెంద్రెయ్య ఆ కథను తనకు తానే పాడుకొనే వాడు. అది నిజానికి కథ కాదు. అదొక పచ్చి నెత్తురు లాంటి నిజం. అది కాలంతో పాటే పారుతున్న పాటల నది.

అలా ఒక చీకటి రాత్రి. దక్షిణాన సముద్ర ఒడ్డుకు దూరంగా ఒక అడవిలో చిన్నా, పెద్దా అంతా కూచున్నారు. పెద్ద దుంగల్ని వెలిగించి మంటపెట్టిండ్లు. ఆ మంటలకు దూరంగా ఒక పెద్ద చెట్టుకింద ఎండిన కన్నీటి చెంపలతో సెంద్రెయ్య కూచున్నడు. తన ఒడిలో జమిడికె లేడిపిల్లలా మౌనంగా వుంది. ఒళ్లును కోస్తున్న చల్లని చలికి ఆ మంటే రక్షణగా వుంది. అడవిలోని మృగాలు మంటను చూసి దూరంగా చీకట్లోకి వెళ్లి పోతున్నయి. ఆ మంట చుట్టూ కూర్చున్న పిల్లలంతా నిద్ర పోవడానికి తల్లుల ఒడిలో ఒదిగి పోయిండ్లు. తాత నిద్రొస్తుంది. ఒక కథ చెప్పవా అని పిల్లలు అడుగుతున్నరు. సుదాసుకు యింకా పద్దెనిమి దేళ్లు దాటలేదు. తన తండ్రి ఏమైనా చెప్తే వింటూ నిద్రపోవాలని తనకూ వుంది. తండ్రి దివోదాసు గొంతు లోంచి నెమ్మదిగా శబ్దం వచ్చింది. ‘‘పిల్లలూ చూశారా. అదిగో ఆ ఆకాశంలో మెరుస్తున్న చందమామ పక్కన దూరంగా ఉత్తరం దిక్కు ఒక పేద్ద చుక్క వుంది చూశారా..? అక్కడే ఒక అద్భుతమైన నగరం వుండేది. అది అందరికీ తిండిపెట్టేది. రక్షణ నిచ్చేది. ఆ నగరం చివరే పేద్ద నది పారుతుంటుంది. అది ఈ భూమ్మీది స్వర్గం.’’ చూపులను ఆకాశం మీంచి దించి నేలను చూసిండు.

అతడి కళ్ళనిండా విషాదం. కారడానికి సిద్ధంగా వున్న కన్నీరు. అంతా నిశ్శబ్దం కధను ముందుకు నడిపించడానికా అన్నట్టు ఒక పిల్లవాడు ఆ నగరాన్ని ఎవరు కట్టారు అని అడిగిండు. ‘‘ఈ భూమండలం మీద అందరి చేత కీర్తించబడిన మన పూర్వీకుడు ఆదిజాంబవంతుడు ఆ నగరాన్ని నిర్మించాడు. ఇప్పుడు మనల్ని వెంటాడుతున్న ఆర్యుల చెరలో ఉన్న వందలాది పట్టణాలకి కూడా అతడే మూలపురుషుడు. ఆ పట్టణం లోనే నేను మీ అమ్మా నాన్నలు పుట్టి పెరిగాం. ఇప్పుడు మనం తలదాచుకుంటున్న ఈ సముద్ర తీరం వున్న ప్రాంతమే ఒకప్పుడు మన జన్మస్థలం. ఆది జాంబవుడు కూడా ఈ పవిత్ర మట్టిమీదే పుట్టాడు. యిక్కడే ఒక నవ నాగరిక రాజ్యం నిర్మించిండు. అయితే, ఎంతకీ ఎల్లలు తేలని ఈ సముద్రం పక్కనే వుంటే యితర మనుషులకు మనం సాయం చేసేదెట్లా అని ఆలోచించిన ఆ మహానుభావుడు అదిగో అనేక రోజులు మమ్మల్ని నడిపించి ఎత్తయిన ఆ వింధ్యా పర్వతాలను దాటించాడు. అక్కడ మనిషనే వాడే లేని నదులు చాలా వున్నాయి. అందులో సింధూ నది తనకు బాగా నచ్చింది. అది చల్లగా పారే నది మాత్రమే కాదు. ఆ నదికి ఆవల కొద్ది రోజులు ప్రయాణిస్తే కొన్ని దేశాలు కనిపిస్తాయి. యిసుక తుఫాన్లతో తల్లడిల్లే ఆ ప్రాంతమే చాలా ఖండాలకు దారి చూపుతుంది. ఆకాశాన్నంటే పర్వతాలను దాటితే జంతు చర్మాలను కప్పుకొని బతికే మంచు మనుషులుండే చోట్లు వున్నాయి. అలాంటి వాళ్లందరికీ సాయం చేయాలని ఆ సింధూ నది ఒడ్డున సుందరమైన పట్టణాన్ని కట్టాడు. మేమంతా యిష్టంగా ఆ పట్టణాన్ని కట్టుకున్నాము. మెడలో ధరించే హారంలా దాన్ని తీర్చిదిద్దాము. యిది నగలాగా వుంది కాబట్టి నగరం అని ఆ జ్ఞాని పిలచిండు. అక్కడ స్వేచ్ఛగా, సోదరుల్లా, సమానంగా న్యాయంగా బతకాలనే విలువలను ఆ మహనీయుడు బోధించాడు. ఆ ధర్మాన్ని మేమంతా ఆచరించాము. లోకమంతా మనుషులు సుఖంగా బతకాలని పడవల మీద, ఏనుగల మీద, యెడ్ల బండ్ల మీద అన్న వస్త్రాలను నలుదిక్కులకూ పంపించిండు. అందరూ మనకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ఈ ఆర్యులు మాత్రమే మనలను ఆక్రమించాలనే దురాశతో అరప్పా పట్టణానికి వొచ్చిండ్లు. కష్టపడకుండా తేరగా తిని బతుకుదామని, మన మీద పెత్తనం చేయొచ్చనే తలంపుతో యింద్రుడు వాళ్లను యిక్కడికి తీసుకొచ్చిండు. వాళ్లకు ఆ ముసలి నక్క మనువు చెప్పిన ధర్మం అవినీతిని బోధించింది. ఆ ధర్మంతో మతి చెడిన ఆర్యులు అధర్మయుద్ధం చేసి మన రాజ్యాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. మన మహా చక్రవర్తి అయిన ఆది జాంబవున్ని అధర్మ పద్ధతిలో అంతమొందించారు. ఆయన కొడుకునీ, ఆయన కుటుంబాన్నీ తుదముట్టించారు. వేలాది మందని మన వాళ్లను నరికి చంపిండ్లు.

ఆ ఆరాధనీయుడు  మిమ్మల్ని కాపాడమని నన్ను ఆదేశించిండు. ఆ దుర్మార్గుల కంట పడకుండా మిమ్మల్ని కాపాడ్డమే నా కర్తవ్యం. కానీ, ఎన్నటికైనా మనం మన రాజ్యాన్ని తిరిగి పొందాలి. మీరంతా పెద్ద వాళ్లయ్యాక ఆ పని చేసి తీరాలి’’ అన్నాడు. అలా అంటున్నప్పుడు ఆయన స్వరంలో ఏదో బలమైన ఆశ వ్యక్తమైంది. దూరంగా తండ్రి మాటలు విన్న సుదాసు మనసులో చెప్పలేనంత బాధ.

అలాంటి బాధను మహితో చాలా సార్లు తను పంచుకున్నాడు. మహి అంటే తనకు చాలా యిష్టం. ఆమె తండ్రి చార్వాక. తల్లి పద్మ. తెలివైన పిల్ల. వేటలో మగాళ్ల కన్న వేగంగా పరిగెత్తి గురిపెట్టి బరిసె విసరగలదు. పరిగెత్తిదంటే జింకపిల్లే. ఒకసారి సుదాసు, మహి యిద్దరూ కలిసి అడవిలోకి వేటకు వెళ్లారు. అక్కడ పెద్దపులి మహిని తినేయాలని ఆశపడ్డది. కానీ దానికి తెలియదు కదా. మహి అలాంటి పెద్దపులులకు చిక్కే జింకపిల్ల కాదని. మెరుపు తీగలాగా చెట్లూ చేమలూ రాళ్లు రప్పలూ పెద్దపెద్ద బండరాళ్లను ఒడుపుగా తప్పుకుంటూ వురుకుతుంది. అహం దెబ్బతిన్న పెద్దపులి అంతే వేగంగా తరుముతుంది. సుదాసు మహిని కాపాడ్డానికి అంతకన్న వేగంగా వురికి పెద్దపులి యెదుట నిలబడ్డడు. అకస్మాత్తుగా సుదాసు అడ్డుగా కనపబడటంతో అది బిత్తరపోయింది. వురికీ వురికీ విసిగిపోయునట్టుంది. వెర్రి కోపంతో అది సుదాసు మీదికి దునికింది. అప్పటికే సిద్ధంగా వున్న సుదాసు ఆ పెద్దపులి నోటికి చిక్కకుండా, దాని గుండెలోకి పదునైన బరిసెను దించేసిండు. దాని గుండెకాయకు ఆ బరిసె సూటిగా తాకింది. ఆ కాయ తెగిపోయింది. పెద్దపులి చిన్నపిల్లిలా మూలుగుతూ పచ్చటి రెల్లుగడ్డిలో కూలిపోయింది. అలా పడే సమయంలో సుదాసు మీద దాని శరీరం సగం పడిపోయింది. దాని కింది నుంచి బయటికి రావడానికి తండ్లాడుతున్నడు సుదాసు. ఒకింత భయంతో చూసింది మహి.

సుదాసు మీద దాని బరువైన శరీరం సగం వుంది. తను బతికే వున్నాడని తెలిసి ఆమె సంతోషించింది. అతని చేయి పట్టి బయటికి లాగింది. చిట్లిన చర్మాన్ని తుడుచుకుంటూ ఆమె కేసి చూసిండు. ‘‘ఏమో అనుకున్నా. నువ్వు మొసరాకుండా పరిగెత్తే లేడిపిల్లవి. నీలాంటి వాళ్లే మన జాతికి చాలా అవసరం’’ అని మెచ్చుకున్నడు. ఆ బరువైన పెద్దపులిని ముక్కలుగా చేసి, తమకు అవసరమైన భాగాలను తమ వాళ్ల కోసం మోసుకుపోయారిద్దరు. అలా వాళ్లద్దరికీ ఒకరిమీద ఒకరికి యిష్టం ఏర్పడ్డది. సుదాసు మిత్రులు మహి గురించి మాట్లాడుతూ ఆటపట్టించేవాళ్లు. మహి అందం గురించీ, ఆమె తెలివి గురించీ వాళ్లు చెప్తంటే వినే వాడే తప్పా తన మనుసులో ఏముందో చెప్పేవాడు కాదు.

ఒక రాత్రి చీకటి నల్లరేగడి మట్టిలా కరిగిపోయింది. అప్పుడే తెల్లవారింది. పక్షలు అరుపులు వినిపిస్తున్నాయి. అంతకన్న ఎక్కువగా జువ్వుమనే చప్పుడు వినిపిస్తుంది. దివోదాసు కర్రసాము చేస్తున్నాడు. ఆయన ఎప్పటి నించో వ్యాయామం చేస్తున్నట్టున్నాడు. యుద్ధవిద్యలు రోజూ అభ్యసించక పోతే వీరుడు నిర్వీర్యమవుతాడు. యుద్ధమున్నా లేకపోయినా నిరంతరం సాధన చేయాల్సిందే. తండ్రి కర్ర తిప్పుతుంటే ఒక యువకుడు చిన్నరాయిని గట్టిగా విసిరేశాడు. అది కర్రకు తాకి వేగంగా వెళ్లి ఒక చెట్టు కొమ్మకు తాకింది. ఆ దెబ్బ తీవ్రతకు కొమ్మ విరిగిపడిరది. సుదాసు అది చూసి ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా తండ్రి ముందు నిలబడి నాకూ ఆ విద్య నేర్పమని అడిగాడు. ఇప్పటి వరకు నీకు నేర్పిన విద్యను చేసి చూపించమన్నడు. వెంటనే సుదాసు శరీరాన్ని సిద్ధం చేసుకున్నడు. అంత వేగంగా అతడు సిద్ధ మవుతాడని తండ్రి కూడా ఊహించ లేదు. తనకు నేర్పిన విద్యను చేసి చూపించిండు.

కదలికలో వేగం, దెబ్బ విసరడంలో నేర్పు, కాళ్లను బలమైన ఆయుధాలుగా వాడటం, చేతుల్లోకి శక్తినంతా కేంద్రీకరించి ముష్టి ఘాతాలు విసురుతూనే ఒడుపుగా ప్రత్యర్ధి దెబ్బను తప్పించుకోవడం లాంటివి ఎన్నో అలవోకగా చేసి చూపించాడు. పెద్దాసు సంతృప్తి చెందాడు. కొడుకుకు కర్రసాము మొదటి అడుగులు నేర్పించాడు. అప్పటికే, తెగలోని యువకులు దూరంగా ఇసుకలాంటి మైదానంలో యుద్ధవిద్యలు సాధన చేస్తూనే వున్నారు. సుదాసు సాధనను గమనించి ఇక్కడికి పరిగెత్తుకొచ్చారు. సీతువ రూపంలో సెంద్రెయ్య ఆకాశయానం అనే విద్యను సాధన చేస్తున్నాడు. నిటారుగా గాల్లోకి ఎగిరి, అంతే నిటారుగా నేలమీదికి దూసుకొచ్చి శత్రువును దెబ్బతీసే వ్యూహాన్ని సాధన చేస్తున్నది సీతువ.

అక్కడి వాళ్లందిరిలో సుదాసు శారీరకంగా మానసికంగా బలవంతుడు. ఆ విషయం తండ్రికి కూడా తెలుసు. అందరినీ కూచోమని సైగ చేసిండు. వీరులంతా వజ్రాసనంలో ఆసీనులయ్యిండ్లు. సుదాసు మాత్రం బలమైన గుఱ్ఱం ఎలా కాళ్లు ఎడం చేసి నిలబడుతుందో అలా నిలబడ్డాడు. కాళ్లను దూరంగా జరిపి మోకాళ్ల మీద ఒక భంగిమలో కూర్చున్నాడు. భూమికి ఒక అడుగెత్తున అతని పీఠ భాగమున్నది. అలా ఎక్కువ సేపు కూర్చోవటం కష్టం. అయినా, సుదాసు అలాగే చేశాడు. తండ్రి చెప్పటం మొదలుపెట్టాడు. ‘‘ఈ విద్యలన్నీ మన పూర్వీకులు తయారు చేసినవి. ప్రకృతి నించీ, జంతువుల కదలికల నుంచీ సృష్టించినవి. వీటివల్లే మనం శత్రువును ఎలాంటి ఆయుధం లేకుండా ఎదుర్కోగలం. శత్రువును ఓడిరచగలం. కానీ, శత్రువును చంపరాదు. అది మన పూర్వీకుల యుద్ధనీతి’’.

సీతువకు ఆ మాటలు నచ్చలేదు. గాల్లోకి ఎగిరి పిచ్చిగా అల్లరి చేసింది. దివోదాసు మాటలు విని, సుదాసు ఆవేశంతో ఊగిపోయాడు. ‘‘కానీ వాళ్లు చంపుతారు. ఇప్పటికే మనవాళ్లను ఎంతో మందిని చంపేశారు. మనకు వాళ్లను చంపే అవకాశమున్నా చంపలేకపోతున్నాం. శత్రువును చంప కూడదన్న మన పూర్వీకుల నియమం మన ప్రాణాలను తీస్తుంది. ఈ ఆచారాన్ని మార్చుకోకపోతే, మన జాతిని కాపాడుకోలేమని నాకనిపిస్తుంది. అలాగే యుద్ధ విద్యలను ఆడవాళ్లకు నేర్పాలి. ఆత్మరక్షణ తెలియని స్త్రీలు ప్రాణాలు కోల్పోతారు. ఆర్యులు ఆడామగా అనే తేడా లేకుండా మన వాళ్లను చంపారు. వాళ్లు ఆయుధాలతో దాడి చేస్తుంటే, మన స్త్రీలు నిస్సహాయులుగా బలయ్యారు. అందుకే, మనం ఆడవాళ్లకు యుద్ధ విద్యలు నేర్పాలి. ప్రకృతిని ప్రేమించే మన జాతికి ఆడామగా అనే తేడా వుండకూడదు. కాబట్టి మన ఆడపిల్లలకు కూడా మీరు ఈ పురాతన విద్యలను నేర్పాలి’’ స్థిర నిశ్చయంతో అన్నాడు. ఆ మాటలు తండ్రి దివోదాసును కాస్తా యిబ్బంది పెట్టాయి. కానీ, కొడుకు చెప్తున్న దాంట్లో నిజముంది. ఆ మాటలకు అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొట్టి మద్ధతు తెలిపారు. వాళ్లను చూస్తూ సరే అన్నట్లు తలూపాడు. ఆ మర్నాటి మసక చీకట్లో సాధన చేసే మగాళ్లతో సమాన సంఖ్యలో ఆడపిల్లలు, ఆడవాళ్లు చేరారు. తమ శరీరాలను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. వాళ్లందరిలో మహి ముందు వరుసలో నిలబడ్డది. మగాళ్లతో ఆమె పోటీ పడుతుంది. అది సుదాసుకు చెప్పలేని సంతోషం కలిగిస్తుంది. బలమైన ఆడవాళ్లు లేని ఏ కుటుంబం బాగుండదు. ఏ జాతీ గెలువలేదు. గొప్ప సంఘాన్నీ నిర్మించలేదు అని మనసులో అనుకున్నాడు సుదాసు.

ఆ అందమైన ఉదయం సెంద్రెయ్య సింహంలా మారి ఒక కొండ మీద నుంచి లోకమంతా వినపడేలా గర్జించాడు. అది నిద్రపోతున్న సోమరులను భయపెట్టింది. ఎక్కడో ఆడవాళ్ల సంగీతాన్నీ నాట్యాన్నీ ఆస్వాదిస్తున్న యింద్రుడి చెవులకు ఆ అరుపు ఒక అశుభంలా వినిపించింది.

7

కదన పయనం

తెగలోని యువతీ యువకులంతా యుద్ధ విద్యల్లో ఆరితేరారు. సెంద్రెయ్య అనేక అవతారాలలో వాళ్లతో కలిసి తనకు తెలిసిన ఒడుపులు వాళ్లకు నేర్పిస్తూనే వున్నాడు. అరప్పా పట్టణంలో ఇనుము, ఉక్కుతో ఆయుధాలు తయారు చేసుకున్న జ్ఞానం యింకా వాళ్లు మరిచిపోలేదు. దివోదాసు ఆజ్ఞ మేరకు ఆయుధ తయారీలో నిష్ణాతులైన నిపుణులు కావాల్సినన్ని ఆయుధాలు తయారు చేసిండ్లు. ఇనుము కలిసి వున్న మట్టి ఆ పక్కనే విస్తారంగా వుంది. రాతి నేలలో కలిసిపోయినట్టే వుంటుంది ఉక్కు. దానిమీద పెద్ద మంటను ఏర్పాటు చేసికొద్ది రోజులు అదే తీవ్రతతో కాలిస్తే ఆ రాతినేల బలమైన ఉక్కులా మారిపోతుంది. దాన్ని మరింత వేడి చేసి కరిగించి ముందే తయారు చేసుకున్న నమూనాల్లో పోసుకుంటే ఆయుధం సిద్ధం. అంతేకాదు, బలమైన ఉక్కు కవచాన్ని కూడా తయారు చేసుకున్నారు. శరీరాన్ని నిండుగా కప్పివుంచే ఉక్కు కవచం, తలమీద శత్రువు ఆయుధం తాకినా గాయం కాకుండా కాపాడే ఉక్కు కవచం తయారు చేసుకున్నారు. కాళ్లను పూర్తిగా కప్పివుంచేలా మెత్తని ఇనుముతో తయారు చేసిన వస్త్రం కూడా సిద్ధం. సైన్యం శారీరకంగా బలంగా వుండగానే సరిపోదు. శత్రువు కన్న ఎక్కువ సామాగ్రి వుండాలి. అలా కొత్త యుద్ధ సామాగ్రి ఏ జాతి దగ్గర వుంటే దానిదే పైచేయి అవుతుంది.

రణరంగంలో శారీరక బలం ఎంత ముఖ్యమో, వివేకం, చురుకుదనం అంత ముఖ్యం. శత్రువు బలం మీద దెబ్బకొట్టడం ఒక ఎత్తుగడ. కానీ, శత్రువు బలహీనత చాలా వరకు సమయానుసారం నిర్ణయం తీసుకోలేక పోవటం. ఆ బలహీనతను సరిగా ఉపయోగించుకొంటే, విజయం తథ్యం. ఇలాంటి యుద్ధ రహస్యాలను తర్వాతి తరాలకు బోధించటం చాలా అవసరం. అవి యుద్ధ జ్ఞానంలో కీలకమైనవి.   దివోదాసు ఈ విషయ మెరిగిన వాడు కనకే యుద్ధ తంత్రాన్ని తన కొడుక్కీ, తన జాతి జనులకీ నేర్పించిండు.

చీకట్లో ఆకాశం మీద వెలిగే ఉత్తర దిక్కు చుక్కను చూస్తూ సుదాసు రాత్రంతా గడిపేవాడు. ఎప్పుడు నిద్రపోయేవాడో తనకే తెలిసేది కాదు. వీలైనంత తొందరగా దక్షిణ దిక్కు నుండి బయల్దేరి  సింధూ నదికి వెళ్ళిపోవాలని అతడికి ఆత్రుత. సప్తనదుల మధ్యనున్న ఆ ప్రాంతాన్ని తాకి, తన పూర్వీకుల ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పాలని అతడి ఆకాంక్ష. తన పూర్వీకులు నిర్మించిన అరప్పా పట్టణాన్నీ, ఇతర పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకొని జంబూద్వీప వైభవాన్ని పునర్‌ నిర్మించాలని అతడి ఆశయం.

ఆ ఆశయాన్ని తన తండ్రికి ఒక రోజు చెప్పనే చెప్పాడు. ఆయనెంతో సంతోషించాడు. ఆ మాటకు అందరికన్న ఎక్కువ సెంద్రెయ్య సంబురపడ్డాడు. అలా అనుకున్న రోజు రానే వొచ్చింది.

సుదాసు మనసు ఎప్పుడూ అరప్పా చుట్టూ తిరుగుతుందని మహికి తెలుసు. నీతో పాటు నేనూ యుద్ధంలో పాల్గొంటాను. నాకేదైనా బాధ్యత అప్పగించు అని మహి అడుగుతూనే వుంది. నేను యుద్ధానికి సిద్ధపడ్డ రోజు, నువ్వే మన సైన్యానికి నాయకత్వం వహిస్తావు అని హామీ యిచ్చిండు సుదాసు. అదే విషయం మహి తన కన్నవాళ్లకు చెప్పింది. వాళ్లెంతో ఆత్మగౌరవంతో మురిసి పోయారు.  వాళ్లిద్దరూ మహి ధైర్య సాహసాలను చూసి మురిసిపోయిండ్లు. తను ఆడపిల్ల అనే ఆలోచనే వాళ్లకు లేదు. ఆర్యులను ఎదుర్కోవడానికి తమ రక్తం సిద్ధమయ్యిందనే సంతోషం వాళ్లది.

అనుననట్టే తన సైన్యంతో బయల్దేరిండు సుదాసు. దక్షిణాన సముద్రానికి వీడ్కోలు పలికిండు. మచ్చిక చేసుకున్న ఏనుగులను, గుర్రాలను వెంట బెట్టుకొన్నడు. తయారు చేసుకున్న యుద్ధ సామాగ్రిని సైనికులు చేబూనిండ్లు.  సుశిక్షితులైన విలుకాండ్లను తన వెంట నడిపించిండు. అంత చేసినా ఆ సైన్యం పట్టుమని మూడొందల మంది లేరు. వాళ్లకు మహిని సేనానిగా ప్రకటించిండు అతడు. అంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు. ఆమెలాగే వీరత్వం చూపగలిగిన వాళ్లు వాళ్లలో చాలా మంది వున్నారు. అయితే, మహి వాళ్లకన్న మెరుగ్గా ఆలోచిస్తది. యుద్ధ సూత్రాలను ఒంటపట్టించుకోవడమే కాదు, వాటిని సమయస్ఫూర్తితో ఎలా అమలు చేయాలో బాగా తెలిసిన వీరవనిత తను. అందుకే, ఆమెకు ఆ నాయకత్వం అప్పగించాడు సుదాసు. ఆ నవయవ్వన వీరుడి ఆదేశాలతో అరప్పా పట్టణం దిశగా అడవిలో సైన్యం నడుస్తూనే ఉంది. కానీ వాళ్లు నడిచే చప్పుడు చీమలకు కూడా వినిపించటం లేదు. అంతా నిశ్శబ్దం.

మార్గమధ్యలో ఎదురుపడిన ఇతర తెగలను తనతోపాటు యుద్ధంలోకి రమ్మని ఉద్భోదించాడు. మన పూర్వీకుల గొప్పతనాన్నీ, ఈ భూమ్మీద స్వర్గాన్నీ నిలబెట్టాలని మీకుంటే, నాతో పాటే రమ్మని కోరిండు. సుదాసు మాటల్లోని నిజాయితీ, నాయకత్వ లక్షణం చాలామందిని ఆకర్షించిండు. దక్షిణ కడలి తీరం నుండి మొదలైన ఈ పయనం వింధ్యా పర్వత శ్రేణిని దాటి మధ్యభాగం మీదుగా సాగుతూనే వుంది. ఈలోగా తనతో కలిసి పోరు చేసే వేయిమంది సైన్యం పోగయ్యింది. విశ్రాంతి తీసుకున్న చోటే, కొత్తగా చేరిన వారికి దాడి ఎలా చేయాలో చెప్పిండు. తనకు నమ్మకమైన మిత్రులతో కొత్తవాళ్లకు యుద్ధ మెలుకువలు నేర్పించిండు. కొండలూ, నదులూ దాటుతూ ముందుకు సాగిండు. వాళ్ల వెనుకే సెంద్రెయ్య జమిడికె భుజానికేసుకొని ఆ సైన్యంతో పాటే నడుస్తూనే వున్నడు.

అలా సింధూ నదీ తీరానికి సుదాసు చేరుకున్నడు. అతని సైన్యం ఉధృతంగా పారుతున్న సింధూ నదిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ నదిని ఆనుకొని అరప్పా పట్టణం కన్పిస్తుంది. కూలిన గోడలతో మొండిగా వుంది. తలతెగిన దేహంలా వుంది. ఆర్యుల కత్తి కోతకి అరిచి పెడబొబ్బలు పెడుతున్న స్త్రీలు, పసిపిల్లల ఆర్తనాదాలు సుదాసు చెవిలో మారుమోగుతుంది. నిజానికి ఆ గోడలన్నీ దారుణ మారణ కాండకు మౌన సాక్షిగా నిలబడివున్నాయి. అక్కడెంత రక్తపాతం జరిగిందో ఊహించుకొంటేనే సుదాసు గుండె రగిలిపోతుంది. బతుకు దెరువు కోసమొచ్చిన ఆర్యులు ఆశ్రయమిచ్చిన వాళ్లనే చంపేయటం ద్రోహం కన్న నీచమైందని అతని ఆలోచన.

ఆ గోడలకు దూరంగా పాకల గుంపు కనిపించింది. అవి బలమైన దుంగలతో కట్టినవి. మట్టిగోడల మీద రెల్లుగడ్డి కప్పిండ్లు. కొన్నింటి మీద తాటికమ్మలు కప్పివుంచిండ్లు. యింకా, పాకల్లోనే ఆర్యులు జీవిస్తున్నరు. వాళ్లకు అరప్పా పట్టణం ఆవాస యోగ్యం కాదని జ్యోసం చెప్పాడు కుల గురువు. అందుకే, ఎవరూ అందులో జీవించటం లేదు. శత్రువులు తమవైపు కన్నెత్తి కూడా చూడలేరని వాళ్ల నమ్మకం. ఇంద్రుడు ఇప్పుడు అక్కడ లేడు. అతడే ఇప్పుడు ఆ నేలను చెరబట్టింది. అయితే తనక్కడ లేడిప్పుడు. తన సైన్యాన్ని తీసుకొని ఈశాన్యం వైపు వెళ్లిండు. అక్కడ తన అధికారాన్ని స్థాపించడానికి రాచ కార్యం మీద బయల్దేరిండు.

నిజానికి ఇంద్రునికి యింకా ఒక రాజధాని అంటూ లేదు. జంబూద్వీపంలోని పట్టణాలను ఆక్రమించుకొంటూ, వాటిని తన జాతిలోని కొంత మందికి అద్దెకివ్వటమో లేదా సామంతులుగా పెట్టుకోవటమో చేస్తున్నడు. బంధీలను బానిసలుగా చేసి వాళ్ళతో సేద్యం చేయించమనీ, వాళ్లకు ఎలాంటి  వసతులు కల్పించ రాదనీ సామంతులను ఆదేశించిండు. ఉపేంద్రున్ని,  వేలాది మంది సైన్యాన్ని వెంట తీసుకొని ఈశాన్య దిక్కుకు జైత్ర యాత్రకు వెళ్లిండు. తనకు గురువులైన వసును, విసులను కూడా వెంట తీసుకెళ్లుట ఆచారం. ఈ ఇద్దరి సలహాలను తీసుకొని, జంబూద్వీపాన్ని సొంతం చేసుకోవాలని అతని కల. సెంద్రెయ్య కల అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుంది. సుదాసులోని పట్టుదల, వీరత్వం, కార్యదీక్ష సెంద్రెయ్యకు బాగా నచ్చినయి. మొండిగోడలతో వెలవెలబోతున్న అరప్పా పట్టణం సెంద్రెయ్యకు దు:ఖాన్ని తెప్పిస్తుంది. సుదాసు పక్కనే నిలబడి ఆ పట్టణ శోభను ఊహిస్తున్నడు. తరతరాల వేదనకు బానిసత్వానికీ ముగింపు పలకాలని జమిడికె తంత్రిని ఒడితిప్పుతున్నడు సెంద్రెయ్య.

8

భీతావహ నీతి

ఇంద్రుడు అక్కడ లేకపోవడం కూడా సుదాసుకు ఉపకరించింది. ఈశాన్యం దిక్కుకు వెళ్ళిన యింద్రుడు తిరిగి రావడానికి చాలా రోజులు పడుతయి. నీచుడు, కుటిలుడైన ఉపేంద్రుడు అన్నకు తోడుగా వెళ్లిపోయాడు. ఇదే మంచి సమయం.  ఈలోగా అరప్పా పట్టణాన్ని వశపర్చుకోవాలి. అది పెద్ద కష్టం కాదు. తన దగ్గర కొత్త ఆయుధాలున్నాయి. యుద్ధ విద్యలు ఒంట పట్టించుకున్న వీరులు, వీరాంగణలున్నారు. అంతకుమించి, పగ ప్రతీకారం వాళ్లను ఎంతకైనా తెగించేలా చేస్తున్నది. ఈ రాత్రికే దాడికి దిగాలని సుదాసు నిశ్చయించుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, ఆ మహా నగరాన్ని తిరిగి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. సెంద్రెయ్యకు అంతా కలలా అనిపిస్తుంది. సుదాసును చూస్తూ మురిసిపోతున్నాడు. సేనాని మహి వెనుక నిలబడి వున్న  తన సైన్యాన్ని ఉద్దేశించి సుదాసు ఇలా అన్నాడు.

‘‘సోదరీ సోదరులారా! అదిగో చూడండి. అదే మన నగరం. మన రాజధాని. మన పూర్వీకులు కట్టిన స్వర్గం. ఆ పక్కనే చూడండి. ఆ పూరి గుడిసెల్లో కనిపిస్తున్నవాళ్లే మన శత్రువులు. వాళ్ళ వల్లే మనం అడవుల పాలయ్యాం. వాళ్లమీద పగతీర్చుకొనే సమయమిదే. నా మాటలు జాగ్రత్తగా వినండి. శత్రువును చంప కూడదన్న మన పూర్వీకుల నియమాన్ని నేను రద్దు చేస్తున్నాను. మీ నాయకుడిగా నాకా అధికారం వుంది. పూర్వీకుల ఆశయాన్ని నెరవేర్చాలంటే, సమయం, సందర్భం అనుసరించి మన యుద్ధ నీతిని రూపొందించు కోవాలి. శత్రువును దారుణంగా చంపేయాలి. ఆర్యులను ఆడామగా అని చూడొద్దు. ఎవరైనా ఒకటే. మన ఆడవాళ్లను ఆర్యుల ఆడవాళ్లు కిరాతకంగా చంపారు. యుద్ధంలో నీతులు, నియమాలు వర్తించవు. అవి రాజకీయాలకు మాత్రమే వర్తిస్తాయి. అందుకే ఎవరినీ వొదులొద్దు. దొరికినోళ్లను దొరికినట్టే నరికి పోగులు పెట్టండి.  పరిగెత్తే సింహాన్ని వేటలో ఎలా చంపుతామో, భయంతో పారిపోయే లేడిని తరిమి తరిమి ఎలా చంపుతామో అంతకన్న ఎక్కువ భయంకరంగా చంపాలి. మన చేతిలో చనిపోయే శత్రువుల శరీరాలను చూసి బతికున్న వాళ్ళకు భయం పుట్టాలి.

మన పూర్వీకుల పౌరుషం తగ్గలేదనీ, అది పచ్చిపచ్చిగా వేడివేడిగా పరుగులు పెడుతుందని ఆర్యులకు చూపించాలి. పగటి పూట దాడిచేసే పద్ధతికి బదులు ఈ రాత్రే మనం దాడి చేద్దాం. చీకట్లో మనం ఊహించిన దానికన్న వేగంగా దాడి చేయగలం. బాణాలు వేసే బలగం ఎత్తైన ప్రదేశాలను చూసుకోండి. ఆర్యుల ఇండ్లను మూడువైపుల చుట్టుముట్టండి. ఒక వైపు పారిపోయే వీలివ్వండి. వాళ్లు ప్రాణాలరచేతిలో పెట్టుకొని పారిపోవాలి. యిక్కడ జరిగిన దాన్ని వాళ్ళే ఈ ద్వీపమంతటికి చేరవేయాలి. అది మన రాజకీయ వ్యూహం. ఈ నగరాన్ని మనం ఆధీనంలోకి తీసుకుంటే చాలు. ఆ తర్వాత ఈ దేశమే మన చేతిలోకొస్తుంది. అది ఈ ద్వీప చరిత్రలో గొప్ప మార్పుకు కారణమవుతుంది. ఈ మహత్కార్యంలో మనం ప్రాణాలు కోల్పోయినా దిగుల్లేదు. విజయం మన వెంట నడుస్తుంది. మన పూర్వీకుల దీవెనలు మన వెంటున్నాయి. మనతో పాటే వాళ్ళు యిక్కడ అదృశ్యంగా నిలబడి వున్నారు. అవసరమైన సహాయం చేయడానికి వాళ్ళ ఊపిరి ఈ గాలిలోనే కదులుతుంది. అది నాకు తెలుస్తుంది’’. అలా అనగానే బలమైన గాలి వీచి, చెట్లన్నీ ఒక్కసారిగా కదిలాయి. సుదాసు కృతజ్ఞతగా చేతులెత్తి నమస్కరించాడు. జరిగిన అద్భుతాన్ని చూసి సైన్యం ఆశ్చర్య పోయింది.

సుదాసు మాటల మహిమను వాళ్ళు అర్థం చేసుకున్నారు. మహి కదనోత్సాహంతో వూగిపోతుంది. సెంద్రెయ్య ఆ అద్భుతాన్ని చూస్తూ జమిడికె వాయించాడు. అదదదా.. హాహాహా అని ఏదో శక్తి పూనినట్టు ఊగిపోతున్నాడు. జమిడికె దరువు విని సైన్యం మరింత ఉత్సాహాన్ని పొందింది. సుదాసు గంభీరమైన అతడి ప్రవర్తన అందరినీ శాసిస్తున్నది. చీకట్లో చిరుత కళ్ళలాగా అతడి కళ్ళు మెరుస్తున్నాయి. ‘‘విరుచుక పడండి, ఆ దుర్మార్గుల మీద’’ అని గట్టిగ అరుస్తూ ఆదేశించిండు.

ఆ మాట తర్వాత గాలికన్న వేగంగా మహి తన సైన్యాన్ని ముందుకు వురికించింది. విలుకాండ్లు బాణాల వర్షం కురిపించిండ్లు. యిలాంటి దాడి జరుగుతుందని ఊహించని ఆర్యుల సైన్యం అనూహ్యమైన పరిణామంతో బిత్తరపోయింది. తేరుకొనే లోపే సుదాసు దూసు కొచ్చిండు.ఎదురు పడిన ఆర్యుల సేనానిని నరికి పడేసిండు. బహుశా, జంబూద్వీపవాసులు ఆర్యులని నరకడం ఇదే మొదటిసారి. సుదాసు సైన్యం కత్తి విసురుడికీ, బాణాల వేగానికి ఆర్యుల సైన్యం నిలబడలేక పోయింది. మహి చిచ్చర పిడుగులా వీరంగం చేస్తున్నది. ఆమె విన్యాసాన్ని చూస్తూ సుదాసు మరింత చెలరేగిండు. వాళ్ల పక్కనే, వాళ్లను కనిపెట్టుకొని వుంటూ సెంద్రెయ్య గండ్రగొడ్డలితో శత్రువు మీద విరుచుకు పడ్డాడు. చాలామంది గొంతులు తెగిపోయినయి. తలలు మొండాలు వేరుపడ్డాయి. శత్రువుల దేహాలు రెండుగా చీలిపోయినయి. అరగంటలో శత్రువులు విగతజీవులయ్యిండ్లు. మిగిలినవాళ్లు పారిపోయిండ్లు.

సుదాసుడికి జయం జయమంటూ హర్ష ధ్వానాలు మిన్నంటాయి. మహి అతనికి తన కత్తికి అంటిన నెత్తురుతో వీరతిలకం దిద్దింది. అరప్పా ముఖ ద్వారాన్ని సూరీడి కిరణాలు తాకక ముందే సుదాసు పాదం తాకింది.

ఆదిజాంబవుడు నడిచిన చోట సుదాసు నడవటం మొదలు పెట్టాడు. ఆ మహిపాలుని పాదముద్రలను ఊహించి, వాటికి సుదాసు నమస్కరించిండు. ఆదిజాంబవుడు ఆసీనుడై కొలువదీరే ఎత్తైన   గద్దెకు వందనం చేసి, దానిపైకి ఎక్కి ఖడ్గం గాలిలోకి ఎత్తి తన సైనికులకు అభివాదం చేసిండు. మహి చిన్నపిల్లలా కేకలేసింది. ఆ దృశ్యం చూడాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆమె కళ్లు ఆనందంతో ముత్యాల వానను కురిపించాయి.

తన పూర్వీకుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు తనకు వెచ్చగా తాకుతున్న సంగతి సుదాసుకు తెలుస్తూనే వుంది. తన జాతి పూర్వీకులంతా ఆర్తితో ప్రేమతో విజయగర్వంతో తనను తాకి ఆశీర్వదిస్తున్న పులకరింత తనకు అనుభవమవుతూనే వుంది. ఆదిజాంబవుని ఎర్రని పెదవుల మీది కోరమీసం తన బుగ్గను గుచ్చుకుంటున్న ఎరుక అనుభూతమవుతూనే వుంది. తన వాళ్ళ అడుగుజాడలనూ ఆనంద పారవశ్యాలనూ శత్రువు చేత ఖండిరచబడిన వారి హాహాకారాలనూ భావన చేస్తూ, సుదాసు  ఆ పట్టణమంతా తన మిత్రులతో కలియ తిరుతుండు. సుదాసుని విజయం కొత్త అధ్యాయాన్ని లిఖించింది. కోరినదే జరిగిందని సంబురంతో సెంద్రెయ్య మద్దెల దరువు వాయిస్తూ జమిడికెకు దణ్ణం పెట్టిండు.

9

అసహన ఆర్యులు

సీతాకోక చిలుకలా మారి సెంద్రెయ్య ఇంద్రుడు కొలువదీరిన చోట ఒక చెట్టు మీద వాలిండు. యిప్పుడు యింద్రుడు ఏమి చేస్తాడో చూడాలని, అతని భయకంపిత స్వరం వినాలని ఆ సీతాకోక చిలుకకు ఆశగా వుంది. సుదాసు అరప్పా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి వేగుల ద్వారా ఇంద్రునికి తెలిసింది. కోపంతో ఊగిపోతున్నాడు. ఉపేంద్రుడి కండ్లు నిప్పుల కుంపటి కన్న దారుణంగా వున్నాయి. వసు, విసులు సింధూనది ఒడ్డున జరిగిన దాడిని కళ్ళు మూసుకొని ఊహిస్తున్నారు. సుదాసు బలాన్ని అంచనా వేయ ప్రయత్నిస్తున్నారు. అయితే, అంతకన్న ముఖ్యమైన సమస్య ఒకటుంది. దానిమీదే ఇంద్రుని మనసంతా వుంది. అది ఊహిస్తేనే ఒళ్ళు జల ధరిస్తుంది తనకు.

‘‘మహర్షులారా!’’ ఇంద్రుని పిలుపుతో ఆ ఇద్దరు కళ్ళు తెరిచారు. ఇంద్రుడు తన సందేహాన్నిలా వ్యక్తం చేస్తున్నాడు.

‘‘అరప్పా పట్టణంలో జరిగిన దాడిని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?’’

‘‘ఎవరో తెలివైన కుర్రకుంక చేసిన ఆకతాయి పని. మీ శక్తి వాడికి తెలిసినట్టు లేదు. వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మీ పరాక్రమం చెప్పే వాళ్ళు’’ అని ముసిముసి నవ్వులు నవ్వాడు వసు.

‘‘నిజమే కదా, ఆర్యదేవా! అపారమైన మీ శక్తి సామర్ధ్యాలే ఈ జంబూద్వీపాన్ని గెలవడానికి కారణం. ప్రపంచ చరిత్రలో మీకు గొప్ప స్థానం ఎప్పుడూ వుండును. ఆ బడుద్దాయిలను అణచివేయటం ఎంత పని మీకు?’’ అన్నాడు విసు.

ఇంద్రుడు చాలా అసహనంగా ఆ మాటలు విన్నాడు. కానీ, తన లోని భయం ఎక్కడ బయట పడుతుందోనని, అసహనాన్ని దాచుకున్నాడు.

‘‘మహర్షులారా! మీ మాటలు నాకు ఎలాంటి సంతోషం కలిగించటం లేదు. అక్కడ జరిగిన దాడిలో మీరొక సంగతిని గమనించటం లేదని తోస్తుంది. దాడి చేసిన వాళ్ళు మన వాళ్ళను చాలా దారుణంగా చంపేశారు. మన మీద ఎన్నోసార్లు ఈ మ్లేచ్చులు దాడి చేశారు. కానీ, వాళ్ళ నీతి ప్రకారం మనల్ని చంపలేదు. ఓడిరచాలని మాత్రమే చూసేవాళ్ళు. మనమే మన నీతి ప్రకారం వాళ్ళను చంపేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు చేసిన ఈ  దాడి కొత్తగా వుంది. వాళ్ళు మనవాళ్లను దారుణంగా చంపుతున్నారు. ఆడవాళ్లను, చిన్నపిల్లలను చంపకూడదనే నియమాన్ని సయితం వాళ్లు మార్చుకున్నారు. మన ఆడవాళ్లను, పిల్లలను కూడా వాళ్లు భీతిగొలిపేలా నరికి పోగులు పెట్టారు. శత్రువును చంపకూడదనే నీతిని వాళ్ళు మార్చుకున్నారు. నిజానికి, ఈ ద్రవిడ జాతి ముందు నుంచీ చాలా తెలివైనది. యుద్ధ రహస్యాలు బాగా ఎరిగినది. అలాంటి జాతి శత్రువును చంపాలని నిర్ణయించుకొంటే, మనం ప్రమాదంలో వున్నట్టే. ఈ మ్లేచ్చులు మనల్ని చంప కూడదన్న నియమం పాటించినంత వరకే వాళ్ళను మనం వధించ గలం.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ దాడికి నాయకత్వం వహించిన వాడు కుర్రకుంకే కావొచ్చు. కానీ, వాడు మనవాళ్ళను చంపిన తీరును బట్టి కసితో రగిలిపోతున్నాడని అర్థమవుతుంది. నన్నూ, నా రాజ్యాన్నీ కూల్చేసి, తన పూర్వీకుల వైభవాన్ని మళ్ళీ తేవాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే, మనం ఎంతో కాలం ఇక్కడ పాలించలేం’’అన్నాడు. ఆందోళన నిండిన అతని ఛాతి భాగం ఎగిసిపడుతున్నది స్పష్టంగా కనిపిస్తున్నది. సీతాకోక చిలుక గాల్లోకి ఎగిరి నాట్యం చేసింది. ఆ భయమే అతనిలో చూడాలని ఆ చిలుక యింతదూరం ఎగిరి వొచ్చింది.

ఆర్యుల రాజవంశీయులకు పెద్దదిక్కుగా ఉన్న ఇంద్రుడిలో ఒక భయం ఏదో మొదలైనట్టుగా వసు, విసులకు అర్థమైంది. కానీ, అతడిలో ఉన్న ఆవేశం, విచక్షణను అధిగమిస్తున్నదని గమనించారు.

‘‘ఓ యింద్రరాజా, యుద్ధంలో గెలుపోటములే ప్రధానం కాదు. అంతకు మించిన ఎత్తుగడలు, వ్యూహాలు కూడా పాలకులకు తెలిసి ఉండాలి’’ అన్నాడు విసు.

విసు మాటలకు యింద్రుడు ఆశ్చర్యపోయిండు. ‘‘మీరేమంటున్నారో నాకర్థం కావడం లేదు ఆర్యదేవా, వివరముగా తెలుప’’మన్నాడు.

‘‘అవును. మన స్థావరాల మీద దాడి చేసినవాడు జాంబవుని ముని మనుమని వంటివాడు. అలాంటి వాడి మీద స్వయంగా తమరే దండెత్తడం వల్ల మీరిరువురు సమఉజ్జీలవుతారు. ఆ కుర్ర కుంకకి మీతో  సమతూగే గౌరవాన్ని మీరే కల్పించినట్లవుతుంది’’ అన్నాడు వసు.

వసు, విసుల మాటలకు ఇంద్రుడు ఆవేశం వీడి, ఆలోచనలో పడ్డాడు.

‘‘నిజమే మీరు చెప్పేది. మరిప్పుడు నన్ను ఏం చేయమంటారో సెలవియ్యండని’’ వేడుకొన్నాడు.

కాసేపు ఆ నారచీరల భవనంలో మౌనం ఆవరించింది. ఆ తరువాత నిశ్శబ్దాన్ని బద్ధలు చేస్తూ తమ మనసుల్లో తట్టిన ఎత్తుగడను ఇంద్రునికి ఆ రుషి పుంగవులిద్దరూ వివరించిండ్లు. వాళ్ల కుత్సిత బుద్ధిని చూసి ఆ సీతాకోక చిలుక వాళ్ల మీద పిసరంత రెట్ట వేసింది. కానీ ఆ రెట్టపొడి వాళ్లకు కనిపించలేదు.

10

సామంత రాజన్‌

అది ఇంద్రునికి సామంతులుగా ఉన్న తొమ్మిదిమంది రాజుల సమావేశం. వేగుల ద్వారా అందిన ఇంద్రుడి ఆజ్ఞమేరకు, తొమ్మిదిమంది సామంతరాజులు  సమావేశానికి హాజరయ్యిండ్లు.

పాములా మారి చెట్టు కొమ్మను చుట్టుకొని వున్న సెంద్రెయ్య ఆ సమావేశానికి వచ్చిన సామంతులను చూస్తూ ఆక్రమణదారులంతా ఒకతావున చేరినారు అని బుసలు కొడుతున్నడు.

అందరినీ ఒకేసారి పిలిపించినందుకు మొదట వాళ్లు ఆశ్చర్యపోయిండ్లు. కానీ, అప్పటికే వాళ్లకు వేగుల ద్వారా సుదాసుని దండయాత్ర సంగతి తెలిసింది. ఆ విషయమే తమతో చర్చిస్తాడని తొమ్మిది మందిలో కొందరు గ్రహించిండ్లు.

సామంతరాజుల సమావేశ మందిరానికి ఇంద్రుడు విచ్చేసిండు. ఉపేంద్రుడు అన్నను అంటిపెట్టుకొనే వుంటున్నాడు.

సామంత రాజులంతా లేచి నిలబడి ఇంద్రునికి, వారికి గురువులైన వసు, విసులకు ప్రణామాలు చెల్లించిండ్లు.

ఇంద్రుని ముఖం పూర్తిగా కమిలిపోయి ఉన్నది.

కంటి మీద కునుకు లేక, ఎర్రటి సున్నపు రాళ్ళలా ఉన్నవి. ఏదో ఆందళోన తనను కుదురుగా ఉండనివ్వడం లేదన్న విషయాన్ని సామంత రాజులు పసిగట్టిండ్లు.

ఇంద్రుని తీరు చూసి వసు తన ఆసనం నుండి లేచి నిలబడి యిలా అనెను.

‘‘సామంత పాలకులారా! మనం నేడు అనుభవిస్తున్న ఈ రాజ్యాలను ఎలా మనం ఆక్రమించుకున్నామో మీకు తెలియనిది కాదు. మనం ఆక్రమించుకున్న రాజ్యాల్లో అప్పటికే ఉన్న జంబూద్వీప ధర్మాలను మనం సమాధి చేసి, మన ధర్మాన్ని ప్రతిష్టాపించితిమి. హాయిగా ఈ దేశమంతా మనమే విస్తరించ బోతున్నామనుకున్న సమయంలో మనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జంబూరాజు లెవ్వరైనా మనతో ఇక యుద్ధం చేయడానికే భయపడి పోతారని అరప్పా, సింధూ పట్టణాలను ధ్వంసం చేసి భావించాము. కానీ, మనం ఆదమరిచి ఉన్న సమయంలో ఆదిజాంబవుని వారసుడొకడు ‘సుదాసు’ని రూపంలో మళ్ళీ మనపై దండెత్తి వచ్చిండు. రావడమే కాదు, శత్రువును వధించరాదని వాళ్ల పూర్వీకులు పెట్టుకున్న యుద్ధ నీతిని సైతం మార్చువేసిండ్లు. అలా సింధూ నది ఒడ్డున పాకల్లో నిద్రిస్తోన్న మన వాళ్లకు సుదాసుడు ప్రళయాన్ని చూపించాడు.  భూకంపంలా విరుచుకుపడి మన వాళ్ళను మట్టుపెట్టాడు’’ అని భయకంపిత స్వరంతో విలవిల్లాడిరడు.

సామంతరాజులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నరు.

వారికి అతడి ఆందోళనకు కారణం అవగతమైంది.

మిగిలిన విషయాన్ని విసు కొనసాగించిండు.

‘‘అందువల్ల మన మహా పాలకులైన ఇంద్రరాజావారు ఈ విషయం తెలిసి అల్లాడి పోతున్నారు. తక్షణమే సుదాసున్ని సంహరించకుంటే మనందరి ఉనికి ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా మన ఆర్యజాతి యొక్క  ప్రతిష్ట గంగపాలవుతుంది. కాబట్టి ఇంతకాలం యింద్రుని పాలనకు విధేయులై మనుగడ సాగిస్తున్న మీరంతా, మీ విశ్వాసాన్ని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఆర్యధర్మం కోసం, ఆర్య పాలన కోసం నడుం బిగించాల్సిన తరుణం వచ్చింది. మీ మీ సైన్యాలతో ఈ రాత్రికే బయల్దేరండి. సుదాసుని అంతంకోసం అంకితమవ్వండి’’ అని సూచించిండు. ఆ సూచన విని సామంతులు లేచి నిలబడ్డారు. అక్కణ్ణించి బయల్దేరడానికి సిద్ధమయ్యారు. యుద్ధం తప్పదని, సుదాసున్ని ఎదుర్కోక తప్పదని వాళ్లకు అర్థమయ్యింది.

అప్పుడు యింద్రుడు లేచి నిలబడ్డాడు. ఆవేశంతో ఊగిపోతు ఉన్నాడు. ముఖమంతా చిరు చెమటలతో నిండి ఉంది. ‘‘అయితే ఒక్క మాట’’ అన్నాడు.

సామంత రాజులంతా యింద్రుని వైపు తలలు తిప్పి చూశారు. ఆ చెట్టుమీది నాగుపాము ఏమి చెప్తాడా అని చూస్తున్నది.

‘‘యుద్ధం ఈ సారి సింధూ నది ఒడ్డున కాదు. రావి నది ఒడ్డున’’ అన్నాడు.

సింధూనది ఒడ్డున అయితే రాలిపడ్డ ఆర్యుల తలలు చూస్తే, సామంత రాజులు యుద్ధంలో భయపడి వెనుతిరిగే ప్రమాదం వుందని భావించాడని వసు, విసులకు అర్థమయి ఓ చిరునవ్వు నవ్విండ్లు.

‘‘భళా మీ ఎత్తుగడ! రావి నది ఒడ్డున జాంబవంతుని వారసులను సంహరించి, వారి రక్తంతో రావి నదికి అభిషేకం చేస్తాం’’ అని సామంత రాజుల్లోని ఒక రాజు అన్నాడు.

మిగిలిన వాళ్ళు కూడా ‘‘అవును, అవును’’ అని ఉత్సాహంతో కేకలేసిండ్లు.

యింద్రుని ముఖంలో వొకింత విశ్వాసమేదో వచ్చి చేరింది. సామంత రాజులు తప్పక సుదాసున్ని సంహరిస్తారన్న విశ్వాసం ఆ ముఖంలో కనిపించింది.

వసు, విసులు సామంత రాజులకు ఆశీస్సులు అందజేసిండ్లు. వాళ్లకు ఉపేంద్రుడు సేనాధిపతి. అతడి నాయకత్వంలోనే వాళ్లు సుదాసున్ని ఎదుర్కోబోతున్నారు.

‘‘జయహో యింద్రాది దేవా, జయహో ఆర్యధర్మం’’ అంటూ సామంత రాజులంతా సమావేశ మందిరాన్ని వీడి, రావి నదికి పయనమైండ్లు.

11

రక్త రావీనది

మరోవైపు సుదాసుడు అరప్పా పట్టణంలోనే ఉన్నాడు.

చాలా రోజుల తర్వాత తన పూర్వీకుల పట్టణాన్ని తాదాత్మ్యంతో పరిశీలిస్తున్నాడు. తన సేనాని మహిని వెంటపెట్టుకొని ఆ పట్టణాన్ని కలియతిరుగుతున్నాడు.

ఎంతటి ముందు చూపు. ఎంత సుందరమైన కట్టడాలు. పురవీధులు. భవంతులు. ఒక్కొక్కటిగా చూస్తున్నాడు. వాటిని చూస్తున్నంత సేపు సుదాసునిలో బలమైన ఉద్వేగం తొణికిసలాడుతోంది. ఇంతటి ఘనమైన చరిత్ర తమది అనే ఆనందం ఒకవైపుంటే, ఆ చరిత్రను కూల్చిన ఆర్యుల ఆక్రమణ మిగిల్చిన విషాదం సుదాసుని మనస్సును కత్తితో పొడిచి మెలిపెడుతోంది.

పూర్వీకుల గౌరవాన్నీ, చరిత్రను తిరిగి నిలబెట్టాలని సుదాసుడు తన సైన్యానికి మరింత బలంగా బోధిస్తున్నడు. ఆ బోధ వింటూ సెంద్రెయ్య వీరగాధల పాడరా అంటూ జమిడికెను వాయిస్తున్నడు.  ఆ సమయంలో యింద్రుడు పంపిన యుద్ధసందేశం ఆర్యుల దూత ద్వారా అందింది. తనతో కాదు, తన సామంత రాజులతో గెలవమని సుదాసును రెచ్చగొట్టాడు యింద్రుడు ఆ సందేశంలో. సెంద్రెయ్య ఆ సామంతులకు రానున్న గతిని తలిచి నవ్వుకున్నాడు.

సింధూనది వొడ్డున వున్న ఆర్యులను అంతం చేసిన యుద్ధ శౌర్యం ముందు యింద్రుని మాటలేవి నిలవలేదు. ఎందుకంటే సుదాసుని సైన్యం విజయ గర్వంతో వుంది. మరో యుద్ధం మాకు లెక్క కాదనే ధీమాతో వుంది. ఎటు తిరిగి ఆర్యులకే సుదాసునితో యుద్ధమంటే ముచ్చెమటలు పడుతున్నాయి.

సుదాసునికి, యింద్రునికి మధ్యలో సామంతరాజులకు కష్టమొచ్చి పడ్డది. అతని కిచ్చిన మాట కోసం యుద్ధం గెలవాలి. సుదాసుడేమో వేటాడే బెబ్బులిలా గర్జిస్తున్నాడు. అయినా సరే ఆర్య ధర్మాన్ని రక్షించడం కోసమైనా యుద్ధం చేసి తీరాల్సిందేనని రావి నది ఒడ్డుకు చేరుకొన్నారు.

వాళ్ల కంటే ముందే అక్కడికి తన సైన్యంతో చేరుకున్నాడు సుదాసుడు. కొండల అడుగున తన సైన్యంతో మాటు వేయించిండు. ఎత్తయిన చెట్ల మీద విల్లంబులతో సిద్ధంగా వేలాది మంది వీరులు సుదాసు ఆదేశం కోసం ఎదురు చూస్తండ్లు. శత్రువు వూహకు కూడా అందని యుద్ధ రచన చేసిండు సుదాసు. ఏ యుద్ధం గెలవాలన్నా పక్కా ప్రణాళిక, వ్యూహం వుండాలని సుదాసు అంటడు. ఆ యుద్ధ నిపుణుడి ఆలోచనలను ఈసమెత్తు కూడా తప్పకుండా అమలు చేస్తున్నది సేనాని మహి.

తొమ్మిది మంది సామంత రాజుల సైన్యాలు ఒకవైపు.

సుదాసుడొక్కడే తన సైన్యంతో మరొక వైపు. సుదాసుని సైన్యం ముందు నిలబడి అతనికి తప్పక జయం కలుగుతుందని పాడుతూ ఆడుతున్నాడు సెంద్రెయ్య. పోతురాజులా మారి వీరంగం వేస్తున్నాడు.

అప్పటికే యుద్ధం చేసి ఉన్న సుదాసునికి సామంత రాజుల సైన్యాలు చీమల్లా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఉపేంద్రడు కనిపిస్తాడా, వాడి తలను వెయ్యి ముక్కలు చేయాలా అని సుదాసు ఉరకలేస్తున్నాడు.

సామంత రాజులకు సుదాసుడు జూలు విదిల్చి గర్జిస్తున్న సింహంలా కనిపిస్తున్నాడు.

అయినా ముప్పేట దాడి చేయడానికి సిద్ధమయ్యిండ్లు.

ముందుగా అశ్వ, గజ బలాలను ప్రయోగించిండ్లు.

సుదాసుడు వాటిని చాకచక్యంగా తిప్పికొట్టిండు.

ఆ తరువాత సామంతరాజులు ఆయుధ బలగాలను ప్రయోగించారు. కానీ, సుదాసుడు అతని సైన్యం తయారు చేసుకున్న ఉక్కు కవాచాల వల్ల అవి ఏ గాయం చేయలేక పోయాయి. సుదాసు సేనల ఆయుధాల ముందు ఆర్యుల ఆయుధాలు నిలువలేకపోయినవి.

సుదాసుని సైన్యం దూసుకొస్తున్న తీరుకు సామంత రాజుల సైన్యానికి యుద్ధం ఓడిపోతామనే ఒక అపనమ్మకం మెల్లగా కలిగింది.

అనుకున్నట్టుగానే రావి నది ఒక్కసారిగా ఉప్పొంగినదేమో అనుకునేలా, కడలి కెరటాలు తాడిచెట్టంత ఎగిసినవేమో అనుకునేంతగా  సుదాసుని సైన్యం సామంత రాజుల వెంట పడిరది. వెనుక నుండి అర్ధచంద్రాకారంలో మరొక సేనల సునామీ వాళ్లను చుట్టు ముట్టింది.

ఆ దెబ్బకు పరుగులు తీసినవారు కొందరైతే, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే అధికం. ఎవరెటు ఉరుకుతండ్లో తెలువనంత భయం వాళ్లను తరిమింది. ఉపేంద్రుడు ఎదురుపడగానే సుదాసు వాణ్ణి గాలిలో ఎత్తి విసిరేసిండు. వెన్నుముక విరిగి లేవలేక పోయిండు. ఉపేంద్రుని  గధను తీసుకొని వాడి తలను చితగ్గొట్టిండు. ఆ దృశ్యం చూసిన ఆర్యసేన గజగజ వొణికింది.

అలా యుద్ధం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సాగింది. సాయం కాలానికి రావి నది పరివాహక  ప్రాంతమంతా ఎరుపు మయమైంది. తెగిపడిన పీనుగులను పీక్కుతింటానికి రాబందుల గుంపు అక్కడ వాలింది. వాటికి బహుశా మనిషి కనుగుడ్లు అంటే చాలా ప్రీతి కావొచ్చు. వాటిని తినే పనిలో తీరిక లేకుండా వున్నాయవి.        ఆ భీతావహ పరిస్థితిని చూడ్డానికే జంకుతున్నారు ఆర్యులు. అలా యుద్ధంలో మరోసారి ఆర్యులు చావు దెబ్బ తిన్నరు.

తొమ్మిది మంది రాజులు సుదాసుడి పాదాల చెంత మోకరిల్లిండ్లు. ప్రాణ భిక్షపెట్టమని దీనంగా వేడుకొన్నారు. వారిలో కొంత మంది చేతులు తెగి పడి వున్నరు. కొంత మంది కాళ్ళు సగం తెగి గాలిలో వేళ్ళాడుతున్నాయి. యింకొంత మంది పేగులను బయటికి రాకుండా పొడవాటి గుడ్డతో గట్టిగా నడుముకు కట్టుకొని రోధిస్తున్నారు. ఇంద్రుడు బలవంతం చేయుట వల్ల ఈ యుద్ధంలో పాల్గొన్నామని, తమతో  మాకు ఎలాంటి వైరం లేదని కన్నీరు మున్నీరై ప్రాధేయపడ్డరు. దయామయులు, కరుణా హృదయులైన మీ పూర్వీకులు శత్రువులను చంపకుండా వదిలిపెట్టినట్టే, మహావీరులైన మీరు కూడా మమ్ము సంహరించకుండా వదిలి వేయవలెనని కడు హీనంగా దేబిరించిండ్లు.

సుదాసు ఆ మాటలు విని ఉగ్రుడయ్యిండు.

‘‘నోరు ముయ్యరా నీచుడా! అయ్యా అప్పాయని మా రాజ్యంలోకి వచ్చిన మీరు మా పూర్వీకులను ఊచకోత కోసి చంపిండ్లు. మనిషిని, సమస్త ప్రకృతిని ప్రేమించిన మా వాళ్ళను దారుణాతి దారుణంగా తెగ నరికిండ్లు. మా కళ్ళ ముందే మా వాళ్ళను నిర్దయగా హింసించి, హింసించి చంపిండ్లు. కాకులకూ గద్దలకూ  రాబందుల గుంపులకు వాళ్ళ శరీరాలను ఆహారంగా పెడితిరి కదరా. కనీసం మరణించిన వీరునికి అంతిమ సంస్కారాలు కూడా చేయక, మా జాతి పట్ల అమర్యాదగా అవమానకరంగా మీ ఆర్యులు ప్రవర్తించింది నిజం కాదా. నేనవన్నీ మరిచి పోయాననుకుంటిరా? మా తాత ఆదిజాంబవుని మీద ఆన. మిమ్మల్ని కత్తికో కండగా ఖండ ఖండాలుగా నరక్క వదలను. ప్రశాంత జంబూద్వీపాన్ని అశాంతికి ఆహుతి చేసి, మా జాతిని బానిసలుగా చేసి అవమానించి, చిత్రవధ చేసిన మీ గుంటనక్క యింద్రున్ని ఏ కలుగులో దాక్కున్నా సరే, బయటికి లాగి ముక్కలు ముక్కలుగా గండ్ర గొడ్డలితో మేము నరికి చంపుట తథ్యం. తోడేలుకు, నక్కకూ ప్రతిరూపాలైన వసు, విసులకు యింకా హీనాతి హీనమైన రీతిలో మరణ దండన విధించి తీరుతాం. ఇదే మా ద్రవిడ జాతి ప్రకటించు అత్యున్నత తీర్పు. ఇది మా నాగజాతి నన్యాయం. చూస్తారేం వీరులారా, వీరాంగణలారా, ఈ తొమ్మిది మందిని నరికి పోగులు పెట్టండి’’ అని సుదాసు గర్జించిండు. ఆ సింహ నాదం విన్న మహి, ఆమె కనుసైగలతో చెలరేగే వీరులు తమ కత్తులతో తొమ్మిది మంది తలలను తాటికాయలు కోసినట్టు కోసి విసిరేసిండ్లు. ఆ నెత్తుటి కేళిని చూసి సెంద్రెయ్య నాలుక చాపి పులిలా మారిపోయి దూప తీర్చుకున్నడు.

ఆత్మహత్యా వధ

ఎప్పటి కప్పుడు వేగుల ద్వారా రావి నది రక్త క్షేత్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్న యింద్రుడు కుంగి పోయిండు. తన తోడబుట్టిన తోడు ఉపేంద్రుడి హీనమైన చావు గురించి తెలుసుకొని తల్లడిల్లి పోయిండు. ఇప్పుడు తను ప్రాణభీతితో కుమిలిపోతున్నడు. మనువుకు యిచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోతున్నాననే వేదన యింద్రుణ్ని ముంచెత్తుంది. అంతేకాదు, వయసుడిగి జీవితం చివరి దశలో వున్న తను అరివీర భయంకరుడిలా, మృత్యు పర్వతంలా విరుచుకు పడుతున్న సుదాసునితో తలపడి గెలవడం అసాధ్యమని మధన పడుతున్నాడు. నిన్నటి దాకా తన గాలి కూడా సోకకుండా తప్పించుకు బతికిన ఒక బానిస చేతిలో ఘోరంగా చచ్చే కన్న, ఆత్మహత్య చేసుకొని చావటం మేలని తలచిండు. నల్లని విష సర్పం నుండి తీసి వుంచిన మహా భయంకరమైన పాషాణం తాగి నేల మీద పడి నెత్తురు కక్కిండు. చివరి ఊపిరి ఆగిపోతూ కళ్ళు మూస్తున్న యింద్రుని తలమీద అప్పుడే అక్కడికి వచ్చిన సుదాసు ఖడ్గం అమిత వేగంతో పడ్డది. నేల మీద పడి చితికిన పుప్పడి పండులా అతని శిరస్సు వ్రయ్యలయ్యింది. ఆ దృశ్యం చూసి సెంద్రెయ్య ఆకాశం పగిలిపోయేలా నవ్విండు. ‘‘హింసను నమ్మిన యింద్రుడు హింసకే బలయ్యిండు. ప్రేమలేని ఆర్యదేవుడు ప్రేమమూర్తి చేతిలో విముక్తుడయ్యిండు’’ అని జమిడికెను వాయిస్తూ పూలవానను సుదాసుని మీద కురిపించిండు. అప్పటి దాకా కమ్ముకున్న బూడిద రంగు మబ్బులు తొలిగిపోయి రవికిరణాలు ఆ మహానాయకుడి మీద వాలి పునీతమయ్యాయి.

నేల మాలిగల్లో ఎలుకల్లా దాక్కున్న వసు, విసులను సుదాసుని సేనాని మహి బయటికి లాక్కొచ్చింది. వణుకుతున్న దేహాలతో చేతులు జోడిరచి సుదాసునితో యిలా అన్నారు. రుషిని, మునిని, సన్యాసినీ, ద్విజున్నీ హతం చేయుట మా ధర్మంలో నిషిద్ధం. రాజులు రాజులూ యుద్ధం చేసి ఒకరినొకరు చంపుకొనుట ధర్మ సమ్మతమే గానీ, మా వంటి జ్ఞాన రుషులను చంపుట మహా పాతకమన్నారు వాళ్లిద్దరు.

‘‘యిది మా పుణ్యకార్యం. మా మాతా పితరులకు మేము సమర్పిస్తున్న నైవేధ్యం. యిది మా పవిత్ర ధర్మం. మీరు చేసిన హీనమైన తప్పిదాలకు విధిస్తున్న శిక్ష. మీరు ఆచరించిన హింసా ధర్మమే మేము అమలు చేయుచున్నది’’ అని ఎడమ చేయి లేపి సైగ చేసిండు. ఆవేశంతో పగతో రగిలిపోతున్న సుదాసుని సైనికులు వసు, విసుల శరీరాల ఆనవాళ్ళు లేకుండా చేసిండ్లు.

బైండ్లాయిన ఎల్లమ్మ పట్నం ఒకచోటికి నూకి కుండలోకి ఎత్తిపోసిండు. సెంద్రెయ్య ఆ కుండకు తెల్లగుడ్డతో మూతిని కప్పేసి  మామిడాకుతో చేసిన కంకణం కట్టిండు.

‘‘తాలేలెల్లియలో జంబు తానే లెల్లియలో

శత్రువు కంఠము కోసిన కత్తిది

తాలే లెల్లియలో జంబుతానే లెల్లియలో

ఆర్యుల నీతిని అంతము చేసెను

భారతదేశము బాగు కోసము

తాలే లెల్లియలో జంబు తాలే లెల్లియలో’’ అని కొంగవాలు కత్తికి ఎర్రచందనంతో బొట్టు పెట్టిండు సెంద్రెయ్య. నిమ్మకాయ ఆ కత్తి మొనకు గుచ్చి నుదుట కుంకుమ బొట్టు, పసుపు పూసుకుని గంతులేస్తూ పాడుతండు. ఎంతకీ అలసిపోని సెంద్రెయ్య కాలి అందెల వెనుక సూర్యుడు ఆ పూట విశ్రాంతి తీసుకొన్నడు.

గణతంత్రం

ఉదాత్త విలువలను, మానవనీతిని సుస్థాపితం చేస్తూ, సుదాసుడు రాజ్యం స్థాపించిండు.

వర్ణధర్మము ఆ రాజ్యములో నిషేధింపబడ్డది. ఆర్యులు మనుషులుగా బతకాలని సుదాసుడు ఆదేశించిండు. భూసురులు, సురులు, సర్వోన్నతులు లాంటి విశేషణాల స్వోత్కర్ష మానుకొనమని హితువు పలికిండు. బానిసత్వం, వర్ణధర్మం రెండూ మానవాళికి శత్రువులని వాటిని నిషేధించిండు. అతని జ్ఞాన సంపన్నత, దూరదృష్టి, పాలనా దక్షతా, యుద్ధతంత్రం ఎరిగిన ఆర్యులు సుదాసున్ని కీర్తించి, తమ విధేయత చాటుకొన్నారు. అతడి పరాక్రమాన్ని శ్లాఘిస్తూ వారి దేవభాషలో అనేక శ్లోకములు అల్లి ఆలాపించిండ్లు. అది సుదాసుని పట్ల గల భయం వల్ల చేసిన చర్య తప్ప వారి హృదిలో కలిగిన మార్పు వల్ల చేసిన చర్య కాదని లోకం చెప్పుకొని నవ్వుకొన్నది. సెంద్రెయ్య మిక్కిలి ఎక్కువ నవ్వుకున్నాడు. సింధూ జనుల ద్రవిడ నీతి నిలబెట్టి  మానవాళికి విముక్తి మార్గం చూపిండు. ఆకలిదప్పుల్లేని సంఘం నిర్మాణమయ్యింది.

సేనాని మహిని సుదాసుడు పెళ్లాడిరడు. ఆ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లిని వేదమంత్రాల సాక్షిగా మేము జరుపుతామని ఆర్యులలోని బ్రాహ్మణులు ముందుకొచ్చిండ్లు. సెంద్రెయ్య అడ్డం దిరిగిండు. ఆర్య బ్రాహ్మణులకు మా పెళ్లి చేసే హక్కులేదని గట్టిగా వాదించిండు. సుదాసు సెంద్రెయ్య వాదనకే బలమిచ్చిండు. ‘మావాళ్లను చంపిన మీరు మాకేం కళ్యాణం చేస్తారు? మీ కపట నాటకాలు చాలు పోండి.  మీ పెళ్లీలు మీరు చేసుకోండి చాలు. మాకేమీ అక్కర్లేద’ని సుదాసు ఆర్యులను పెళ్లి పందిరి పక్కకు పంపిండు. ఆ నిర్ణయాన్ని ద్రావిడ జనులు ఆనందంతో ఒప్పుకున్నరు.

అంబరానంటే సంబరంతో వాళ్లిద్దరి పెళ్లిని సెంద్రెయ్య జమిడికె వాయిస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ చేసిండు. అష్ట దిక్కులను కలుపుతూ పసుపు బియ్యంతో పోలు పోసిండు. నాలుగు మూలలకు నాలుగు సున్నం వేసి, పసుపు పూసిన ముంతలను పెట్టిండు. వాటి మీద మూతలు పెట్టిండు. ఆ నాలుగు ముంతలను కలుపుతూ పసుపు దారం చుట్టిండు. విశ్వాన్ని ఆ దారంతో ముడేసిన అని చెప్పిండు.  విశ్వానికి చిహ్నమైన అయిరేని కుండలను రెండు ఆ పోలు ముందు పెట్టించిండు. ఇగ అప్పుడు,  ఇది విశ్వం. ఇందులో మీరిద్దరు కూచోవాలె అని కూచుండబెట్టిండు. పిల్లా, పిలగాళ్లు  జిలుకర బెల్లం ఒకరి నెత్తిమీద మరొకరు పెట్టాలని చెప్పి పెట్టిచ్చిండు. మీరిద్దరు ఆడమగలుగా విడిపోయిన ఈ అనంత విశ్వంలోని రెండు భాగాలకు ప్రతీక. మీరిద్దరు కలిసి కాపురం చేసి, సంతానాన్ని కడం వల్ల విడిపోయిన అనంత విశ్వం ఒక్కటిగా మారిపోద్ది అన్నడు. ఈ విశ్వాన్ని నీ మెడలో ధరించాలె. నువ్వే శక్తి స్వరూపిణివి అని ఆ నాలుగు మూలలో పెట్టిన ముంతల మూతికి చుట్టిన పసుపు దారాన్ని మహి మెడలో వేయమని సుదాసుకు చెప్పిండు సెంద్రెయ్య. అలాగే చేసిండు తను. ఆమె యిప్పుడు విశ్వాన్ని ధరించింది. ఆమె కు, అతనికీ అందమైన పూలతో చేసిన దండ యిచ్చిండు. వాళ్లను వొకరి మెడలో మరొకరు వేయమని చెప్పిండు. వాళ్లు దండలు మార్చుకుంటుంటే ‘కళ్యాణమే దివ్య కళ్యాణము. కమనీయ రమణీయ కళ్యాణము. కళ్యాణమే రమ్య కళ్యాణము. కలకాలం వెలిగేటి కళ్యాణము’ అని జమిడెక వాయిస్తూ చిందులేసిండు. ఆ కళాత్మకమైన పెళ్లిని చూసిన ద్రావిడులంతా డప్పు దరువులేస్తూ చిందులేసిండ్లు. వాళ్లు కొట్టిన డప్పు దరువు సప్పుడు బలహీనమైన గుండెగల కొంత మంది ఆర్యులు చివరి శ్వాస విడిచిండ్లు. ఆ పెళ్లిలో కత్తులు, నాగళ్లు, కర్రు, పలుగు తయారు చేసే వాళ్లు వొచ్చి వాటిని చూబూని ఆడారు. ఎత్తయిన తాటి చెట్ల ముంజలను ఇంకొంత మంది కోసుకొచ్చి అందరికీ అనందంతో పంచి పెట్టారు. అన్ని రకాల పనులు చేసే వాళ్లు తమ తమ నైపుణ్యాన్ని నవ దంపతులకు చూపిస్తూ ఆడిపాడారు. వారిని సమతా దృక్కులతో సుదాసు, మహీ ఆలింగనం చేసుకున్నారు.  ఆ సుదాసు చక్రవర్తి పాలనలో ప్రజలు సుఖంగా బతుకుతున్నరు. ఆర్యులు కూడా మేకవన్నె పులుల లాగా బతుకుతున్నరు.

ఆ ఎల్లల్లేని ద్రవిడ రాజ్యం మీద రెక్కల పులిలా ఎగురుతున్నాడు సెంద్రెయ్య. ఆర్యులు ఓడిపోయారని పాటలు పాడుతూ సెంద్రెయ్య జమిడికె వాయిస్తూ నాట్యం చేస్తున్నాడు. బంగారు కిరీటం లాంటి సూర్యుని కిరణాలు భూమండలాన్ని ఆవరిస్తున్నాయి. వాటిని ఒంటిమీద పోసుకుంటూ సెంద్రెయ్య తడిసిపోతున్నాడు. ఆనందంతో ఆ వెలుగులో ముద్దవుతున్నాడు.

ఎండ పొడ మీద పడుతున్నా సెంద్రెన్న యింకా నిద్ర లేస్తలేడని మాణిక్యరావు మంచం కాడికి వొచ్చిండు. ‘‘ఓ సెంద్రెన్నా, నిద్రలే’’ అని గట్టిగా పిలుస్తూ చేత్తో కదిలించిండు.

సెంద్రెయ్య కళ్లు తెరిచిండు. ఎదురుగా సదెయ్య నిలబడి వున్నడు. తను హాయిగా నవ్వుతున్నాడు.

‘‘ఏమైంది తమ్మీ’’ అని అడిగిండు సెంద్రెయ్య.

‘‘అమ్మవారి కళ్యాణం కూడా చేసేసినాము. సరేగానీ మంచంలో హాయిగా ఎగురుతున్నవు, నిద్దట్లో. ఏం కలొచ్చిందే అన్నా’’ అన్నాడు సదెయ్య.

ఏమీ మాట్లాడలేదు కాసేపు. తను కలగన్నాడా? ఎంత అద్భుతమైన కల యిది అనుకున్నాడు మనసులో.

‘‘కల కాదురా. కత పడ్డది. వీరాధివీరుల కత తమ్మీ’’ అని మంచంలోంచి లేచిండు సెంద్రెయ్య.

*

జిలుకర శ్రీనివాస్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Thank you Afsar sir. You have given me a great space to my writings. This is a novel in small size but it has a great historical significance. I hope people will love this narrative a lot.

    I once again express my gratitude to you for giving me this wonderful space.

  • ఓల్గా సే గంగా వంటి అద్భుత కథనం జిలుకర శ్రీనివాస్ కలం నుంచి.
    సమాంతర పురాణం ప్రత్యామ్నాయ చరిత్రల మేలిమి మేళవింపు ఇది. కథలో ఎన్నో ప్రతీకలు వర్తమాన రాజకీయాలపై తీక్షణమైన వ్యాఖ్యానాలుగా గోచరిస్తాయి.
    అన్ని విధాలా బహుజన సాంస్కృతికోద్యమ కథ.
    అభినందనలు Jilukara Srinivas

  • ద్రవిడ ఆత్మగౌరవం కోసం పోరాడుతూ, ద్రవిడ భావజాలం విస్తృతంగా ప్రచారం చేస్తున్న జిలుకర సార్…అటు సాహిత్యం ద్వారా కూడా అదే పని చేయడం అభినందనీయం.
    సెంద్రయ్య కథలకు నేను చాలా అభిమానిని. ఇప్పటి వరకూ వచ్చిన సెంద్రయ్య కథలకంటే ఈ కథ ప్రత్యేకమైనది. సెంద్రయ్య పాత్ర రూపంలో పాఠకులను చరిత్రలోకి తీసుకెళ్ళారు. హరప్పా నాగరికత విధ్వంసాన్ని అద్భుతమైన కథగా మలిచారు. విస్తృతంగా ప్రచారం చేయాల్సిన కథ ఇది

  • బహుజనోద్యమ చరిత్ర పునర్ మూల్యాoకనంలో ఈ కథ (గాథ) ఒక ముందడుగు. ఆలోచనలైనా, కలలైనా ఎక్కడో చోట వాటికి భౌతిక పునాది ఉంటుంది. అనేక కుట్రలు , వక్రీకరణలు వల్ల మరుగునపడ్డ ఈ నేలతల్లి బిడ్డల పురా గాథలని తప్పక అక్షరీకరించాలి. ఆర్య సంస్కృతి vs ద్రవిడ సంస్కృతి ఘర్షణలో మనదైన ద్రవిడ సంస్కృతీ మూలాలు ఇప్పటికి కథగానే రావచ్చు. అయితే రేపటి చరిత్ర ఆవిష్కారానికి ఇదొక ఆలంబన. నవలని చెప్పినా ఇది నిజానికి పెద్ద కథ. వస్తువుకి తగ్గట్టే మారిన కథా శిల్పాన్ని ఇక్కడ చూడచ్చు. ” చరిత్ర అట్టడుగున పడి కన్పించని కథలెన్నో కావాలిప్పుడు ” అన్న శ్రీ శ్రీ మాటకు జిలుకర శ్రీనివాస్ సమాధానం- ‘పురావీరగాథ ‘.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు