మొదటి వాహన యోగం….

మే నెల, 1975 లో ఒకానొక ముహూర్తం నాడు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టాన్ ఫర్డ్ లో డాక్టరేట్ చేసి యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ప్రొఫెసర్ గా ఉన్న హుస్సేన్ గారి దగ్గర పోస్ట్ డాక్టరల్ ఫెలో గా అమెరికాలో నా మొట్టమొదటి ఇంజనీరింగ్ ఉద్యోగం కానీ ఉద్యోగం కానీ ఉద్యోగం, అలాగే అటు విద్యార్ధి కానీ విద్యార్ధీ లాంటి కొలువులో నెలకి 500 డాలర్లు జీతం మీద చేరాను. అది ఉపకార వేతనం కాకుండా జీతం కాబట్టి సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, ఆదాయం పన్ను, మెడికల్ ఇన్సూరెన్స్ వగైరా కోతలు అన్నీ పోగా నా చేతికి వచ్చేది నాలుగు వందల డాలర్ల లోపే అని తెలియడానికి మొదటి నెల చెక్కు అందగానే అర్ధం అయిపోయింది. ఆ రోజుల్లో నేను రెండు నెలలుగా ఒక “ఘెటో” అపార్ట్ మెంట్ లో ఉండేవాడిని. అది నెలకి 250 డాలర్లకి అద్దెకి తీసుకున్నప్పుడు చికాగో నగరం నుంచి నన్ను తీసుకొచ్చిన శాస్త్రీ, రఘూ రూమ్ మేట్స్ గా ఉండేవారు కాబట్టి నా వాటా అందులో మూడో వంతే..అదైనా కేవలం ఒక నెల మాత్రమే. ఇప్పుడు వాళ్లిద్దరూ పై ఊళ్ళలో ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం భారం అంతా నా మీదే పడింది. నాకు కారు లేదు కాబట్టి ఈ ఎపార్ట్ మెంట్ యూనివర్శిటీ కి దూరమే కాబట్టి రెండు బస్సులు మారి వెళ్ళాలి. పొద్దున్న ఆరింటికి బయలు దేరి ముందు డౌన్ టౌన్ వెళ్ళి, అక్కడ బస్సు మారి యూనివర్శిటీ కి వెళ్ళి అక్కడ మైలున్నర నడవాలి. సుమారు రెండు గంటల ప్రయాణం.

“నువ్వు రోజూ లాబ్ కి పొద్దున్న కనీసం 8:00 గంటలకి రావాలి. తిరిగి ఇంటికి వెళ్ళడానికి సమయం నియమం అంటూ లేదు కానీ నా లాగా రాత్రి 8:00 దాకా ఉండాలి. లంచ్, డిన్నర్ కూడా ఇంటినుంచి తెచ్చుకుంటే సమయం, డబ్బు కలిసి వస్తాయి. మన లాగా రీసెర్చ్ చేసే వాళ్ళకి శని, ఆదివారాలు అంటూ ఉండవు.  కానీ ఎప్పుడో ఒకప్పుడు వారానికి సరిపడా వంట చేసేసుకుని రిఫ్రిజిరేటర్ లో పెట్టేసుకో. వేడి చేసుకోడానికి ఇక్కడ స్టవ్ ఉంటుంది”….ఇలా మా ప్రొఫెసర్ మొదటి రోజే ఒక విధంగా తన విశ్వరూపంలో మొదటి అంశం చూపించాడు…ఆ రోజుల్లో మైక్రో వేవ్ అవెన్లు లేవు. బ్రెడ్ కాల్చుకోడానికి టోస్టర్, గిన్నెలో వేడి చేసుకోడానికి లంచ్ రూమ్ లో ఎలక్ట్రిక్ లేదా గేస్ కుంపటి. వీటితో పాటు డిపార్ట్మెంట్ లో అందరికీ కలిపి ఒకే ఒక రిఫ్రిజిరేటర్. ఇక పొద్దున్నే పరవా లేదు కానీ ఆ దిక్కుమాలిన బస్సు యూనివర్శిటీ నుంచి సాయంత్రం 6 గంటలకే ఆఖరి బస్సు. అది తప్పిపోతే అంతే సంగతులు. “అదంతా నాకు తెలీదు. పది, పదిహేను రోజుల్లో కారు కొనుక్కో…లేదా నడిఛేంత దూరంలో ఉన్న ఎపార్ట్ మెంట్ కి మారు.”..అన్నాడు హుస్సేన్ గారు కర్కశంగా…..అయితే నాకు పెద్ద ఆశ్చర్యం వెయ్యనే లేదు. ఎందుకంటే అప్పటికే అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చూస్తే చాలదా అన్నట్టు అంతకు ముందు వారమే ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా పులి నోట్లో తలదూర్చాను కదా!. ఈ పులి నోట్లో అప్పటికే నలుగురు డాక్టరేట్ విద్యార్ధులు ఉన్నారు. అందులో ముగ్గురు బంగ్లా దేశ్ వాళ్ళే. హేరీ అనే అమెరికన్ లాబ్ సూపర్ వైజర్ గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. జమాన్ అనే బంగ్లా కుర్రాడికి పెళ్ళి అయి, అతని భార్య మరొక డిపార్ట్ మెంట్ లో పి, హెచ్. డి. చేస్తోంది. మిగతా వాళ్ళ పేర్లు గుర్తు లేదు కానీ అందరూ కూడా నా వివరాలు తెలుసుకుని, ముఖ్యంగా బొంబాయి ఐఐటి లో లెక్చరర్ గా కూడా పని చేశాను అని తెలియగానే నన్ను చాలా గౌరవంగా చూసేవారు.

మొత్తానికి నేను రోజూ బస్సులో పొద్దున్నే వెళ్ళడం, సాయంత్రం బస్సు వేళ దాటిపోతే రైడ్ కోసం మా రైస్ యూనివర్శిటీ లో ఉన్న విద్యార్ధులలో ముఖ్యంగా మహంతి ని పిలిచీ  మొదటి నెల జీతం వచ్చే దాకా కాలం గడిపేశాను. జేబుల్లో ఫోన్లు లేని  ఆ రోజుల్లో ఇది ఇలా చెప్పినంత సులభం కాదు. ఫోన్ లో మనిషి దొరకడం ఒక విధంగా అదృష్టం కిందనే లెక్క. నేను మా లాబ్ నుంచి ఫోన్ చేసినప్పుడు మహంతి తన లాబ్ లో ఉంటేనే అతను దొరికేది. అంచేత వారం లో ప్రతీ రోజూ నేను ఏ టైం కి ఫోన్ చేస్తానో ఆ సమయం ముందే ‘ఫోన్ ఎపాయింట్ మెంట్’ నిర్ణయించుకునే వాళ్ళం.

ఇక్కడ ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాను. ఒకానొక శుక్రవారం సాయంత్రం మహంతి “ఇవాళ మన టెన్నిస్ రోజు కదా, నేను ఐదు గంటలకే మీ లాబ్ కి వస్తాను.” అన్నాడు. అంచేత నేను ఆ రోజు నా టెన్నిస్ రాకెట్ కూడా మా లాబ్ కి తీసుకెళ్ళాను. సాయంత్రం ఐదింటికి అందరిలాగానే నేనూ బయలు దేరబోతుంటే మా సైంధవుడు అడ్డుపడ్డాడు. “అప్పుడే ఎక్కడికి?” అంటూనే, నా చేతిలో టెన్నిస్ రాకెట్ చూసి ఇక రెచ్చి పోయాడు. “నీకు టెన్నిస్ ఆడుకుని కులాసా చెయ్యడానికి నేను జీతం ఇవ్వడం లేదు. కనీసం రాత్రి ఎనిమిది దాకా పని చెయ్యాలి అని ముందే చెప్పాను. వాటీజ్ దిస్ నాన్ సెన్స్”…అన్నాదు. ఇదంతా నన్ను పిక్ అప్ చేసుకోడానికి వచ్చిన మహంతి వింటూండగానే…అతను నిర్ఘాంత పోయాడు. పైగా మహంతి కూడా డాక్టరేట్ విద్యార్థి అని తెలియగానే అతని మీద కూడా మా ప్రొఫెసర్ గారు రెచ్చి పోయాడు. నేను మారు మాట్లాడ లేక వెనక్కి  లాబ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. పాపం మహంతి టెన్నిస్ మానేసి, అక్కడే ఎనిమిది దాకా నా కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. ఇలాంటి ప్రొఫెసర్లు అమెరికా లో అన్ని చోట్లా ఉంటారుట!. మొదటి నెలలోనే బానిసత్వం, వెట్టి చాకిరీ మొదలైన పదాలకి అర్ధం స్వీయ అనుభవంతో తెలుసుకున్నాను.  సాటి మానవులని ఎలా చూడ కూడదో కూడా స్పష్టంగా అర్ధం అయింది.

ఇక మొదటి నెల జీతం అందగానే…..కేవలం నాలుగు వందల డాలర్ల లో 250 ఎపార్ట్ మెంట్ అద్దెకి పోగా మిగిలిన 150 డాలర్లలో నెలంతా ఎలా గడపాలో తోచక చెమట్లు పట్టాయి. అన్నింటికన్నా ముందు కావలసినది ఒక కారు. రెండోది హుస్సేన్ గారి దగ్గర చాకిరీ తర్వాత అర్ధ రాత్రి దాకా మళ్ళీ ఆ చైనా రెస్టారెంట్ లో గిన్నెలు తోమడమో అలాంటిదే మరొక ఊడిగం వెతుక్కోవడం, మూడోది  గది అద్దె షేర్ చేసుకోడానికి ఒక రూమ్ మేట్ ని వెతుక్కోవడం…ఇవే నా తక్షణ కర్తవ్యాలు.  కొత్త కారు కొనే స్తోమత ఎలాగా లేదు కాబట్టి సెకండ్ హేండ్ కారు కోసం గ్రీన్ షీట్ లో నేనూ, మహంతీ వెతకడం మొదలుపెట్టాం. మన పరి భాషలో సెకండ్ హేండ్ అంటే అమెరికా పరిభాషలో యూజ్డ్ కార్ ….అంటే వాడిన కారు….యూజ్ లెస్ కాదు కానీ కొంచెమో, బాగానో వాడుకుని ఏదో ఒక కారణానికి అమ్మకానికి పెట్టిన బాపతు అనమాట. ఆ మాటకొస్తే బహుశా ఇప్పటికీ కూడా నా  బోటి బీద వాళ్ళు ఇలా కొన్నాళు, కొన్నేళ్ళు వాడిన కార్లు, సోఫాలు, కుర్చీలు, సైకిళ్ళూ, రేడియోలు, టీవీలు వగైరా సరంజామాల అమ్మకాల ప్రకటనలూ, ఇంట్లో కావలసిన రిపేర్లు చేసే వాళ్లూ, ఎపార్ట్ మెంట్స్ వెతికి పెట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ప్రకటనలూ….ఇలా సకల వస్తు సముదాయాల అమ్మకాలకీ, కొనుగోళ్లకీ ప్రకటనల వార పత్రిక ఈ గ్రీన్ షీట్ ఒక అద్భుతమైన, అత్యవసరమైన సామాజిక అవసరం. అది ప్రతీ వారం ఏ పేట కి ఆ పేట…అంటే హ్యూస్టన్ ఉత్తరం, దక్షిణం ఎడిషన్స్ వచ్చేవి. పైగా ఇది ప్రతీ వీధి మొగలోనూ ఉండే ప్రతీ దుకాణం లోనూ  ఉచితంగా పంపిణీ చెయ్య బడేది. ఇప్పుడూ అంతే. నా అమెరికా జీవితం లో మొదటి రెండేళ్ళూ ఇంచు మించు అన్నీ కొనుగోళ్లూ ఈ గ్రీన్ షీట్ లో చూసి సెకండ్ హేండ్ లో కొనుక్కున్నవే.  ఏ టీవీయో, టేప్ రికార్డరో,  సోఫాయో, వంటింట్లో కావలసిన గిన్నెలో, పడక గది లో కావలసిన దుప్పట్లో…ఆఖరికి కొన్ని బాత్ రూమ్ సరుకులైనా సరే గ్రీన్ షీట్ పరిధి దాటి సరి కొత్తవి కొనుక్కోగలిగారూ అంటే జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కినట్టే. ఆ మెట్టు ఎక్కడానికి నాకు రెండేళ్లు పట్టింది.

1975 మే నెల మొదటి జీతం అందుకున్న మొదటి వారాంతంలో గ్గ్రీన్ షీట్ లో “కార్ ఫర్ సేల్” “ ప్రకటనలు కాచి, వడపోసి….ఫోన్ల మీద ఫోన్లు చేసి, దొరికిన వాళ్ళతో మాట్లాడి నేనూ, మహంతీ వెళ్ళి చూడగలిగిన కార్లు డజను పైగా చూశాం. మొత్తానికి పాంటియాక్ కేటలినా అనే పెద్ద భూతం లాంటి కారుని బేరం ఆడి మూడు వందల డాలర్లకి అమెరికాలో నా స్వంత ఆదాయంతో స్వంత కారు కొనుక్కుని ‘కారు వాడు” ని అయ్యాను. అక్కడక్కడా తుప్పు పట్టిన  లేత నీలం రంగు, రెండే డోర్లు, ఎక్కడా ఆటోమేటిక్ గా లేకుండా స్టీరింగ్, డోర్లు, ట్రాన్స్ మిషన్   నుంచీ అన్నీ మాన్యువల్ గానే ఉండే ఆ కారులో రేడియో కూడా ఉంది. టేప్ రికార్డర్ కూడా ఉంటే బావుంటుంది, ఘంటసాల పాటలు వినొచ్చు కదా అంటే అది మనమే పెట్టుకుందాం అన్నాడు మహంతి. నిజానికి నా మొదటి నెల జీతం చెక్కు రాగానే దాన్ని నగదు రూపం లోకి ఎలా మార్చుకోవాలో తెలియనే లేదు. కేంపస్ లో బేంక్ కి వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదో ఒక ఐడెంటిఫికేషన్ అడిగారు. సోషల్ సెక్యూరిటీ కార్డ్ ఉంది కానీ అందులో ఫోటో ఉండదు. అప్పుడు నాకున్న ఏకైక ఐడి కార్డ్…నా గ్రీన్ కార్డ్ ఒకటే. బేంక్ లో అది చూపించగానే అదేమిటో వాళ్ళకి తెలియనే లేదు. ఆ రోజుల్లో ఒక సాధారణ అమెరికన్ కి ఈ వీసా, గ్రీన్ కార్డ్ లాంటి పారిభాషిక పదజాలం తెలియదు. పైగా నిజానికి అది బేంక్ కాదుట. దాన్ని టీచర్స్ క్రెడిట్ యూనియన్ అంటారుట. నా చేతిలో యూనివర్సిటీ వారు ఇచ్చిన చెక్కూ, నా గ్రీన్ కార్డూ చూసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని “ఈ చెక్కుకి నగదు ఇవ్వలేం కానీ, నువ్వు ఇక్కడ ఎకౌంట్ తెరిచి, అందులో ఈ చెక్కు డిపాజిట్ చేసి, ఆ తర్వాత నీకు కావలసిన కేష్ తీసుకోవచ్చును” అన్నారు ఆ క్రెడిత్ యూనియన్ వాళ్ళు. ఆ విధంగా, అనుకోని విధంగా అమెరికాలో నా మొదటి ఎకౌంట్ తెరిచాను అనే కంటే తెరవబడింది అనడం సరి అయిన మాట.  అలా తీసుకున్న నగదుతోటే ఈ కారు కొనడం జరిగింది.

ఇక నమ్మండి,, నమ్మక పొండి అప్పుడు  హ్యూస్టన్ లో గేస్…అంటే పెట్రోలు ఖరీదు గేలన్ కి 24.99 సెంట్లు….అవును….డాలర్ లో పావు వంతు. పైగా వీధిలో ఒక వేపు ఉన్న షెల్ కంపెనీ గేస్ స్టేషన్ లో గేలన్ కి 24.99 సెంట్లు ఉంటే….సరిగ్గా అవతలి వేపు ఉన్న ఎక్సాన్ కంపెనీ వారి గేస్ స్టేషన్ లో 22.99 లేక 28.99..ఇలా కొన్ని సెంట్లు ఎక్కువో, తక్కువో ఉండడం. అయినా కొంతమంది ఆ తక్కువ గేస్ కొనుక్కోకుండా ఎక్కువ ఖరీదుదే ఎందుకు కొంటారో నాకు ఇప్పటికీ అర్ధం అవని విషయం! నిజానికి మన సొంత కారు డ్రైవ్ చెయ్యడం మొదలెట్టాకే అసలు అమెరికా అంటే ఏమిటో తెలియడం మొదలు పెడుతుంది. 25 సెంట్లు అని రౌండ్ ఫిగర్ ఖరీదు పెట్టకుండా 0.2499 అని తిరకాసుగా ఎందుకు పెడతారో నాకు అర్ధం అవని మరొక విషయం. అమెరికాలో ఇప్పటికీ అదే ధోరణి చెలామణీ అవుతోంది. ఉదాహరణకి అదే పెట్రోలు ఖరీదు ఈ రోజుల్లో $2.499 … అని రాస్తారు. హాయిగా $2.50 అని రౌండ్ ఫిగర్ పెట్టుకోవచ్చుగా… ఈ చిదంబర రహస్యం ఏమిటో మరి? నేను కొన్న పాంటియాక్ కేటాలినా అనే భూతం లాంటి కారులో  24 గేలన్ల గేస్ టేంక్ నిండడానికి అప్పటి గేస్ స్టేషన్లలో అరగంట పైగానే పట్టేది. ఏకంగా ఐదు డాలర్లు అయేది. అప్పటికి క్రెడిట్ కార్డ్ వచ్చే స్తోమత మనకి లేదు. ఏం కొన్నా అంతా నగదు బేరమే!.

ఇక నా చేత కారు కొనిపించాక, డ్రైవింగ్ నేర్పే బాధ్యత కూడా మహంతి దే కదా!. పాపం. ఆ ఈతి బాధలు అన్నీ అతనే పడ్డాడు. నాకు లెర్నర్స్ పెర్మిట్ తెప్పించి, ఆ రైస్ విశ్వ విద్యాలయం పార్కింగ్ లాట్ లో  ఓపిగ్గా డ్రైవింగ్ నేర్పించి ఒక రోజు చెప్పా పెట్టకుండా నన్ను డౌన్ టౌన్ నుంచి స్మిత్ స్ట్రీట్ అనే రోడ్డు ఎక్కించాడు. ఆ దిక్కుమాలిన రోడ్డు మామూలు రోడ్  నుంచి  తిన్నగా ఫ్రీ వే లో కలిసి పోతుంది. అంటే నేను అనుకోకుండానే ఆ మామూలు రోడ్ మీద గంటకి 20 మైళ్ళ లో డ్రైవ్ చేస్తున్న వాడిని హఠాత్తుగా ఫ్రీ వే మీద మిగతా కార్ల లాగా 50 మైళ్ళ వేగానికి పెంచవలసి వచ్చింది. గోవిందా, గోవిందా అనీ, జై ఆంజనేయా అనీ గగ్గోలు పెడుతూ నా జన్మలో మొట్టమొదటి సారిగా అనుకోకుండా అమెరికాలో ఫ్రీ వే డ్రైవింగ్ చేసి పారేశాను. ఇప్పటికీ డౌన్ టౌన్ లో ఆ స్మిత్ స్ట్రీట్ కి వెళ్ళినప్పుడు మహంతి నే తల్చుకుంటాను.

కారు కొనుక్కోగానే రోజూ యూనివర్శిటీకి వెళ్ళడం, రావడం సులభం అయింది కానీ పొరపాటున ఎంతో సంతోషంగా ఆ సంగతి మా ‘గండర గండడి’ కి చెప్పగానే ఆయన నేను కారు కొనుక్కున్నందుకు కాదు కానీ మరో కారణానికి మహానంద పడ్డాడు. ఆయన మాటల్లోనే “ఆల్ రైట్…ఇక నువ్వు బస్సు తప్పిపోతానేమో అని ముందే చెక్కేసి టెన్నిస్ ఆడుకోడానికి పారిపోయే అవసరం లేదు.  రాత్రి తొమ్మిదీ, పది దాకా కూడా ఉండి లాబ్ లో ఎక్స్ పెరిమెంట్ పూర్తి చేసి వెళ్ళ వచ్చును.”….వెట్టి చాకిరీకి రోజులూ, నెలలూ లెక్కే కానీ గంటల లెక్క కాదుగా!

ఇక రెండో తక్షణ కర్తవ్యం పార్ట్ టైమ్ ఉద్యోగం వెతుక్కోవడం. యూనివర్శిటీలో ప్లేస్ మెంట్  వాళ్ళని అడిగితే నాది విద్యార్థి స్టేటస్ కాదు కాబట్టి కేంపస్ లో కేఫటేరియా లాంటి ఉద్యోగాలు, టీచింగ్ అసిస్టెంట్ లాంటివి నాకు ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఇక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే …..నేను ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం వచ్చాను అని వాళ్ళు మా ‘కీచకుడు” కి చెప్పారుట….ఆయన నన్ను పిలిచి ఆ విషయం అడగగానే ఇక ఇవాళ నాకు మళ్ళీ తలంటు తప్పదు, నా పని అయిపోయినట్టే, రాక రాక వచ్చిన, ఆయన ఇచ్చిన ఈ పోస్ట్ డాక్టరల్ ఫెలో కి ఉద్వాసన చెప్తాడు కాబోలు అని నేను అనుకుంటే …ఎంతో ఆశ్చర్యంగా ఆయన సాదరంగా మాట్లాడి నా ఆర్ధిక పరిస్థితి వివరంగా అడిగి తెలుసుకుని, నెలకి $400 తో నా జీవితం గడవడం కష్టం అని అర్ధం చేసుకున్నాడు. అలా అని జీతం పెంచుతాడేమో అనుకుంటే ఆ పప్పులేమీ ఉడకవు అని తెలిసింది కానీ “గత నెల్లాళ్ళగా నీ పని తీరు బావుంది. లాబ్ లో అందరూ కూడా నీ కలుపుగోలు తనం, అందరికీ సబ్జెక్ట్ లోనూ ఇతరత్రా సహాయం చెయ్యడం చూసి నువ్వంటే ఇష్టంగా ఉన్నారు. అంచేత నిన్ను వదులుకోడం ఇష్టం లేదు. నీకు ఆర్ధికంగా తప్పదు కాబట్టి ఎక్కడైనా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకోడానికి నా పర్మిషన్ ఇస్తాను. మన యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ కి పక్కనే నడిచి వెళ్ళేటంత దూరం లోనే టెక్సస్ సదర్న్ యూనివర్శిటీ ఉంది. అందులో ఫిజిక్స్, మేథమేటిక్స్  లాంటి సబ్జెక్ట్స్ లో పార్ట్ టైమ్ టీచింగ్ ఉద్యోగాలు ఉంటాయి అని విన్నాను. నీకు అలాంటివి సరిగ్గా సరిపోతాయి” అని ప్రొఫెసర్ హుస్సేన్ గారు స్వయంగా సలహా ఇచ్చారు. అదంతా వింటూ నన్ను నేనే నమ్మలేక పోయాను. ఆ సలహా అద్భుతంగా ఉంది. అప్పటి వరకూ ఆ విశ్వవిద్యాలయం పేరే నేను వినలేదు. అలాంటి అవకాశాలు ఉంటాయి అనీ తెలియదు.

ఆయనకి వెంటనే ధన్యవాదాలు చెప్పి, లాబ్ కి వెళ్ళి పోయి, “వైట్ పేజెస్” అనే ఫోన్ బుక్ లో టెక్సస్ సదర్న్ యూనివర్శిటీ లో ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేశాను.  ఆ ఫోన్ ఎత్తినాయన “హలో” అనగానే అది నాకు తెలుగు హలో లాగానే వినపడింది. వెంటనే నా పేరు, క్వాలిఫికేషన్స్, చేస్తున్న పోస్ట్ డాక్టరల్ పని గురించీ చెప్పి “ఏమైనా టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయా” అని అడిగాను. దానికి సమాధానంగా ఆయన “ఐ కెనాట్ ప్రామిస్. బట్, కెన్ యు మీట్ మీ టుమారో” అని సమయం, డిపార్ట్ మెంట్ లో ఆయన ఆఫీసు చిరునామా ఇచ్చారు. అదంతా కూడా నాకు తెలుగు ఇంగ్లీషులోనే వినపడింది.

ఆ మర్నాడు ఆయన ఆఫీసుకి  వెళ్ళగానే పైన బోర్డ్ మీద “ప్రొఫెసర్. డి. ఏ. ఏ. ఎస్. ఎన్. రావు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజిక్స్ “ అని ఉంది.

ఆయన పూర్తి పేరు దువ్వూరి అనంత అచ్యుత సత్యనారాయణ రావు…అమెరికా దేశంలో దక్షిణాది రాష్ట్రాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగు వారు. బహుశా మొట్టమొదటి భారతీయుడేనేమో కూడా!. 1975 లో అలా పరిచయం అయిన ఆయన గురించీ, ఆయనతో సుమారు మూడు దశాబ్దాల నా అనుబంధం గురించీ…..మరొక సారి…

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హుస్సేన్ లాంటివారు ఇప్పటికీ ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడే భాషలో తేడా ఉంది అంతే. నాకు ఇలాంటివారు కనీసం ముగ్గురు తగిలారు. మరో పోస్ట్ డాక్టరల్ కూడా.నోరు మూసుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అయితే నాకు సహాయం చేసిన మిగతా ఆచార్యులు వీళ్ళకంటే చాలా మంచివారవడం కలిసి వచ్చింది. పోతే గాస్ ఖరీదు సంగతి ఇక్కడ చూడండి. ఈ విషయం నేను ఇండియాలో నే ప్రొఫెసర్ దగ్గిర నేర్చుకున్నా. నా ప్రాజెక్ట్ కి ఖర్చు 2000 అని రాస్తే, వద్దు 1990 అని రాయి అని చెప్పి ఎందుకో వివరించారు.

    https://www.cnn.com/2022/06/14/energy/why-gas-prices-fraction-of-a-cent/index.html

    • 9/10 మీద మంచి సమాచారం ఇచ్చారు, మిత్రమా..ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు